డైవోర్సు - జె.బి.వి.లక్ష్మి

    "ఏమండోయ్ వదినగారూ, ఏం చేస్తున్నారు ? ఎప్పుడొచ్చారు పెళ్లి నుండి ?ఈ మధ్య బొత్తిగా కనిపించటమే లేదు ." అంటూ పక్కింటావిడ పలకరించింది. .
 
    వారికి,మాకు మధ్యనున్న తూర్పు ప్రహారి గోడ మీద నుండి జరిగే ఈ పలకరింపులు  మాకు  మామూలే . తూర్పు ద్వారంకి ఉన్న మెష్ డోర్ ఎప్పుడూ మూసి ఉంచడం వల్ల, నాపనిలో నేను బిజిగా ఉండడం వల్ల  ప్రతి రోజు పలకరించు కోవడం కుదరదు మాకు. 
 
    "పెళ్లి హడావుడికి జ్వర పడ్డానండి . రెండు, మూడు రోజులయింది జ్వరం తగ్గి ." అని జవాబు చెప్పే లోగానే
 
    "నిన్నో, మొన్నో పదహారు రోజుల పండగట కదండీ మావదిన చెప్పింది  వాళ్ళ పుట్టిల్లు, మీ వాళ్ళ వూరు ఒకటేనట ." గంట కొట్టినట్లు మాట్లాడటం ఆవిడకి అలవాటు ..
 
    "ఆహా !" అనడం మినహా ఏం చెప్పాలో తెలియలేదు. 
 
    "ఇది మీ కుటుంబ విషయం .., నాకెందుకు కాని , నిజమా కాదా   అని అడుగుతున్నాను. ఏమీ అనుకోకండి." అంటూ విషయం బయట పెట్టకుండానే  అభయం అడిగి లోక్యంలో పట్టా వుందని చూపించు కొన్నారు.
 
    "ఏ విషయం  చెప్పండి " నేనే లైన్ క్లియర్ చేసాను. 
 
    "అదే, మొన్న పెళ్లి విషయం ."
 
    "దాన్లో ఏముంది ?కట్న కానుకలు వగైరాలే కదా. అవి ఏమీ వద్దనుకున్నారు, మాపిన్ని, బాబాయి. పిల్ల మంచియితే చాలనుకున్నారు." ఆవిడ ప్రశ్నకి జవాబు యిచ్చాననే  అనుకున్నాను.
 
    "దాని గురించి కాదు లెండి. నేనేదో విన్నాను......"అంటూ నసిగింది.
 
    "ఏం విన్నారేమిటి, విందులూ , అవి బాగున్నాయనా? బాగులేవానా? " అంతకన్నా ఏముంటాయి మాట్లాడుకోడానికి  అనుకున్నా.
 
    "మీది మరీ విడ్డూరం లెండి. తెలియదా? తెలిసినా తెలియనట్లున్నారా?"
 
    "అసలు విషయం నాన్చకుండా చెప్పండి. "ఈ సారి నాకు చిర్రెత్తుకొచ్చింది

    "అయితే ఈ విషయం మీ దాక వచ్చినట్లు లేదు. నా నోటితో నేను పాడు మాటలు చెప్ప లేను, పోనీయండి." దాట వేయ ప్రయత్నించింది. అడిగించు కొని చెప్పాలనే కోరికను దాచుకొంటూ.
 
    "నాలో  కుతూహలాన్ని రేపి, వెళ్లి పోతే ఎలాగండీ?  పరవాలేదు, చెప్పండి " విషయమేమిటో  తెలిసికోవాలనుకున్నాను. 
 
    "కొడుకు, కోడలు కలిసి కాపురం చేయటం లేదట. నెలకాకుండానే  డైవోర్సు  వరకు పోయిందట.  మీ పిన్ని, బాబాయి బాధ పడు  తున్నారట." మనసు భారం దించుకొని  అవును, కాదు అనే జవాబు కోసం ఎదురు చూస్తోంది. 
 
    "ఎవరు చెప్పారు,మీకు ?"అనుకోని ఈ ప్రశ్నకు  తికమక పడి 
 
     "ఆ, ఎవరైతే ఏముంది లెండి.  మీరెక్కడా అనకండి " అని తన వాళ్ళ గురించి జాగ్రత్త పడింది.
 
     "ఏమోనండీ, నాదాకా ఏమీ రాలేదు. అయినా ఎవరు దేన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారో తెలియదు కదా! ఇతరుల విషయాలు నిర్ణయించడానికి  మనమెవరం? " కొంచం ఘాటుగా అనే సరికి
 
    "పొయ్యి మీద పాలు వాసన వేస్తున్నట్లు న్నాయి. మళ్లీ కలుస్తాను ." అంటూ సంభాషణ తుంచేసి తుర్రుమని లోనికి పారిపోయింది .
 
    ఏ పని చేస్తున్నా  పక్కింటావిడ చెప్పిన విషయం చెవిలో గింగురు మంటోంది . ఏమైంది, ఒక నెలలోనే విడాకుల వరకు వచ్చి ఉంటుందా ? చిన్నదాన్ని పెద్దదిగా చేసి మాట్లాడటం మనుషులకు అలవాటు. ఇది కూడా అంతే కావచ్చునా? ఏం చేయను? పిన్నికి ఫోన్ చేసి మాట్లాడనా?  ఇది అతి సున్నితమైన విషయం. ఎవరో చెప్పినది పట్టుకొని పిన్నితో మాట్లాడితే ఆమె నొచ్చుకోదూ? ఇలా ఆలోచనలలో కొట్టుకొని పోయాను. 
 
 
    పెళ్లి కూతురు అందంగా వుంది ; మంచి చదువు  వుంది., కుటుంబం మంచిదని తెలిసింది. అందుకని మావాళ్ళు కట్నకానుకలు లేకున్నా పరవాలేదనుకున్నారు. కాని యిప్పుడేమిటి ఇలా జరిగింది? ఏం చేయాలో తెలియని సందిగ్ధత లో వున్న నా  మనసు తెలిసిన మరెందరి చుట్టో తిరగ సాగింది. 
 
 
    నా స్నేహితు రాలు, వనజకి ఒక్కడే కొడుకు. ఎన్నో ఆశలతో, ఆశయాలతో  పెంచింది. కోడలిని ఇలా  చూడాలి; కోడలికి అలా చేయాలి అని ఎప్పుడూ చెపుతూ ఉండేది. కొడుకు వసంత్ పెళ్ళికి చిన్ననాటి స్నేహితులందరినీ  సంబరంగా  ఆహ్వానాలు  పంపింది.  అందరం చిన్ననాటి ముచ్చట్లు నెమరు వేసుకోవాలని పనులెన్ని వున్నా పెళ్ళికి వెళ్ళాము. మా మాటలకు, నవ్వులకు, కేరింతలకు  హాలు దద్దరిల్లిపోయింది . పెళ్లి భోజనాలయాక వో  రెండు గంటలు గడిపి ' అప్పుడే  వెళ్లిపోవాలా ' అన్న బాధతో విడిపోయాము. వచ్చే ముందు వనజని  కలిసి 'పెళ్లి కూతురు చక్కగా వుంది; ముచ్చటైన జంట ' అని మరీ, మరీ ప్రతి ఒక్కరం చెప్పి వచ్చాము. 
 
 
    మూడ్నిద్దర్లకు వచ్చినప్పటి నుండి మొదలైందట రభస. అది చాలా రోజులకు నాకు తెలిసింది. వనజ కోడలు రాఘవి.  వాళ్ళది  పెద్ద కుటుంబం. అందరూ కలుపుగోరు తనంతో, స్నేహపూరితంగా ఉంటారుట. 
 
    ఆ వాతావరణంలో చాటు అన్నది లేకుండా అన్ని విషయాలు మాట్లాడుకుంటారట. ఈ పద్ధతిలో రాఘవికి అర్ధమైన దేమిటంటే --
 
    మొదటి మూడు రాత్రులు స్వర్గమయం చేసికొంటే, జీవితం పండు వెన్నలేనని; లేకుంటే కారుమబ్బులు క్రమ్మిన కటిక చీకటి రాత్రులేనని.
 
 
    ఈ అభిప్రాయాలకి సినిమాలు, పుస్తకాలు మెరుగులు దిద్ది  ఉండవచ్చని  నా అభిప్రాయం. భర్త తనపై చేయి వేయగానే పులకరించి పోవాలట. వేయి జన్మల సంబంధ మనిపించాలాట.  తానాశించిన విధంగా జరగలేదనిపించి మూడు నిద్దర్లలోనే  యింటి నిండా బంధువులు ఉండగానే , రోడ్డెక్కి హక్కుల గురించి పోట్లాడిందట. దానికి ఆమె తరఫు వాళ్ళు వత్తాసు పలికి రాఘవిని తీసుకొని వెళ్లి పోయారుట. 
 
    మధ్యవర్తులు సర్ది చెప్పినా, తలవంపులుగా భావించిన వనజ కొడుకు ఆమెతో సర్దుకోలేక పోయాడని విన్నాను. వనజ, ఆమె భర్త కూడా సిగ్గుతో తల ఎత్తుకోలేక   ట్రాన్స్ ఫర్  చేయించు కొని వేరే వూరు వెళ్లి పోయారని కూడా విన్నాను.   ఇప్పుడు  ఎక్కడ వుందో తెలియదు.   
 
 
    పక్కింటి పిన్నిగారమ్మాయి, అత్తగారింట్లో పది గంటలవరకు  నిద్రపోయి, అందరూ వెళ్ళాక అత్తగారిపని మూడువంతులు అయిపోయాక  గదిలో నుండి బయటికి వస్తుందట.  ఒక రోజు అత్తగారు మందలించారుట అందుకని ససేమిరా అత్తింటికి వెళ్లనని, తన అలవాట్లు మార్చుకోవలసిన అవసరం లేదని, భర్తకి  గుడ్ బై చెప్పేసి గత ఆర్నెల్లుగా పుట్టింట్లోనే  వుంది. అమ్మ, నాన్నలకు ఆమెది తప్పని తెలిసినా ఏమీ అనలేని పరిస్థితి. 
 
 
    ఆనందరావు గారి అమ్మాయేమైనా తక్కువ తిందా!  ఆయన పోయి పాతికేళ్ళు  దాటింది.  భార్య గతించి కూడా నాలుగేళ్ళు అయింది.   పెద్ద అన్న చదువు, సంధ్య చెప్పించి పెళ్లి ఘనంగా జరిపించాడు.  
 
    ఆ పిల్ల మనసులో ఏముందో స్పష్టంగా ఎవరికీ తెలియదు. పెళ్లి అయిన వో నెలకి భర్త చూసేట్లుగా డ్రస్సింగ్ టేబుల్ మీద తన క్లాసు మేట్ రాసిన ప్రేమ లేఖ పెట్టిందట. అది చూసి భర్త అడిగితే 'నాకు తగిన వాడవు కావు' అందిట. ఖంగు తిన్న భర్త ఆ నెల రోజులు అతి సహజంగా, అతి మామూలుగా గడిపిన ఆమె ప్రవర్తన అర్ధం చేసికోలేక, పెద్దలను, కోర్టును ఆశ్రయించి తిరుగు తున్నాడు.
 
    రాఘవి అవగాహనలో పొరపాటు లేదా? తనకి మార్గ దర్సకంగా నిలిచినా పెద్దల అనుభవం  సంపూర్ణమా? పక్కింటి పిన్నిగారి అమ్మాయి ఆలోచనలో లోపం కనిపించలేదా? ఆనందరావు గారి అమ్మాయి పెళ్ళికి ముందు ఎందుకు ప్రతిఘటించ లేదు?
 
     ................ఇవన్నీ  వ్యక్తిగత కారణాలతో    డైవోర్సుకి పోయిన కేసులు. 
 
 
    మరో రకం వున్నాయి. తల్లి దండ్రులు, స్నేహితులు  అమ్మాయి సంసారంలో వేలు పెట్టినందు వల్ల  విడిపోయిన జంటలు.
 
 
   ''నీహారికా, ఇప్పుడు ఇంటికి వెళ్లి వంట చేయాలా? మీఅత్తగారు  అయిదింటికే వస్తుంది కదా. ఆమె చేసెయ్యొచ్చు కదే.''
 
    ఇంటి విషయాలు పూర్తిగా తెలియని మనిషి చేసిన కామెంట్ తో ఆఫీస్‌లో అలిసిపోయిన నీహారికకు నిజమేనని పించింది. తెల్లారగట్లే లేచి అందరికి కాఫీ, టిఫిన్లు తయారు చేసి , మధ్యాహ్నానికి ఇంట్లో ఉండే వారికి  వంటకాలు టేబుల్  మీద వుంచి, వెళ్ళే వారికి   బాక్స్‌లు సర్ది, తానూ తయారయి ఆఫీసుకి వెళ్ళే అత్తగారి సంగతి గాని, పనిమనిషిని,  ఇంటిని ,వచ్చే పోయే వారిని సముదాయించుకోనే సంగతి గాని ,ఆమెకి  గుర్తు రాలేదు. 
 
    ఇంటికి పోయి  భర్తతో సరదాగా గడపాలనే ఆలోచనలలో అత్తింటి భాద్యత గాని, వారు తనను చూసుకుంటున్న తీరు తెన్నులు గాని మనసులోకి రాలేదు. దానితో ఘర్షణ పడి విడిపోయి వచ్చేసింది ఆర్నెల్ల క్రిందట. 
 
    ''విశాలా, నువ్వే పళ్ళాలు పెట్టాలేమిటే?  పళ్ళాలు పెట్ట లేనంత  చిన్నవాళ్ళేమిటే   మీ ఆడపడుచు, మరిది? వాళ్ళ కు  కూడా పని అప్ప చెప్పు'' అని ఇంటి  వాతావరణాన్ని కాలుష్యం చేసిన వారెందరో !
 
    ''మీ బావ గార్లు, ఆడపడుచులు అమెరికాలో బాగానే సంపాదిస్తున్నారుగా! మీ ఆయనకి  చిన్న వుద్యోగం కదా  మరి మీకు అంతాయిచ్చ్చేసినా, వాళ్ళకేమీ తక్కువ పడదు కదే, అమ్మాయ్ ''అంటూ వో విష  బీజం  నా  టబడిన మరో కుటుంబ కధ ఎలాంటి మలుపులు తిరిగి వుంటుందో ఊహించ లేనిది కాదు. 
 
    ఇలా తన వారు అని నమ్మిన మనుషుల ఆలోచనల ప్రభావంతో ,  తనవారు తనకు ఎప్పుడు మంచే చేస్తారనే  అభిప్రాయంతో ,తదను గుణంగా ప్రవర్తించి జీవితాలను చిన్నాభిన్నం చేసుకొనే వారెందరో !
 
    ఇలా వరుసగా డైవోర్సు తీసుకొన్న వారందరూ సినీమా రీలు లాగ మనసులో తిరగ సాగారు. ఇందులో ఏరకమో మా పిన్ని కోడలుది ! 
 
    డైవోర్సు సమస్యకి పరిష్కారమా అన్నది  ముందు తేల్చుకోవలసిన ప్రశ్న.
 
    అత్తగారి పెత్తనం, ఆడపడుచుల ఆరళ్ళు భర్త అధికారం - వీటి మధ్య నలిగి పోయిన కధలు నిన్నటివి. . నిన్నటి అనుభవాలలో నుండి వచ్చిన   స్పందనలను, నేడు వచ్చిన మార్పులు తెలిసి  కోకుండా    యదాతధంగా కాపీ చేసికోవడం  ఈ తరం భాద్యతా రహిత ప్రవర్తనను సూచించటం లేదా?
 
    విడిపోవాలనే ఆలోచన కలిగేంత అవసరం కాని అనుభవం కానీ లేదే నెలైనా కాకుండానే  వొకరినొకరు ఏమి తెలుసుకున్నారని !
 
    ఈ అసంపూర్ణ అనుభవాలకు, అనాలోచనలకు డైవోర్సు సమాధానం యిస్తుందా?
 
    ఒకరితో కుదరకపోతే వేరొకరితో బాగుండ వచ్చని అనుకోవడం  కొంత భ్రమ కాదా? తమలోని తప్పొప్పులు తెలిసి కొని దిద్దుకోవడం, ఎదుటివారి తప్పులను సరిదిద్దుకొనే వోర్పు, నేర్పు అలవరచు కోనిదే, ఎవరైనా, ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్కటే కదా !
 
    మన జీవితాలను ఆర్ధిక, రాజకీయ, సామాజిక, మానసిక  స్థితిగతులు  ప్రభావితం చేసే విషయాలను కూడా పరిగణలోకి తీసుకో నవసరం లేదా?
 
    కలిసి జీవించాలా, వద్దా అనే నిర్ణయంలో  డైవోర్సు ఆఖరి అంశం కావాలే కాని మొదటి మాట కాకూడదు.   పిన్ని, బాబాయ్‌కి, అవినాష్‌కి ఈ విషయం స్పష్టంగా చెప్పాలి.  వారేమీ తెలివి లేని వారు కాదు. కాని మనసు కలత చెందినపుడు ఓ మాట  సహాయం అంతే.   అనుకుంటుండ గానే కాలింగ్ బెల్ మోగింది .
 
    అప్పుడే ఐదు అయిపోయిందా. ఆయన ఆఫీసు నుండి వచ్చేసినట్లున్నారు అనుకొంటూ తలుపు తీయడానికి లేచాను. 
Comments