'కృతే కార్యే కిం ముహూర్త ప్రశ్నేన?' - పారుపూడి వెంకట సత్యనారాయణ

    రెండు నెలల తర్వాత అనుకోకుండా స్కూలుకి సెలవు పెట్టేసి వచ్చేసిన తనను చూసి ఆఫీసునుంచి ఇంటికొచ్చిన భర్త సుచీంద్ర థ్రిల్లయిపోయేలా చేద్దామనుకుంటూ నట్టింట్లోకి అడుగు పెట్టిన మృదులకి, అత్తగారు సుభద్రమ్మ - కొడుకు స్నేహితులతో కలిసి అనుకోకుండా ఆరోజు పొద్దుటే భీమిలిలో ఉన్న స్నేహితుడి చెల్లెలి పెళ్లికి వెళ్లాడని - చెప్పగానే షాకు కొట్టినట్టయింది. చేతిలోని సూట్‌కేసు అక్కడే పడేసి నీరసమొచ్చినట్టుగా సోఫాలో కూలబడి పోయింది.

    రైల్లో ప్రయాణం చేస్తున్నంతసేపూ - తనను అకస్మాత్తుగా చూసిన సుచీందర్ కళ్లలో ఆశ్చర్యం ఆనందం ఆత్రం ముప్పిరిగొంటూంటే గదిలోకి లాక్కుపోయి తనని పైకి ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తాడనీ - ముద్దులతో ముంచేస్తాడనీ - మధురమైన ఆ దృశ్యాన్ని మళ్లీ తను సెలవులకి ఈ ఊరు వచ్చేవరకు తనివితీరా గుండెల్లో పదిలంగా దాచుకోవాలని ఎంతగా ఎదురుచూసింది? ఎన్ని డైలాగుల్ని రిహార్సల్ వేసుకుంది? అన్నీ పేకమేడల్లా కూలిపోయేసరికి దుఃఖం ముంచుకొచ్చింది. అయినా అత్తగారి ఎదుట బయటపడితే ఆవిడ కూడా బాధ పడుతుందని ఎలాగో నిగ్రహించుకుంది.

    'రాత్రి పెళ్లి అవగానే పొద్దుటికల్లా మీ ఆయన ఉరుకులు పరుగుల మీద వచ్చేస్తాడు లేమ్మా మృదులా! నిన్న ఎప్పుడనగా తిన్నావో పదమ్మా. స్నానం చేసి వేడివేడిగా టిఫిన్ తిందువుగాని'

    టిఫిన్ తింటూ కూడా అన్యమనస్యంగానే ఉన్న మృదులను చూసి జాలిగా నిట్టూర్చింది సుభద్రమ్మ.

    తెలుగు లెక్చరర్‌గా చేసి రిటైరయి నాలుగేళ్లవుతున్నా ఆవిడకి ఇప్పటికీ తీరిక వేళ ప్రాచీన కావ్యాలు చదివే అలవాటుందో ఏమో 'నాట్య సంగీతాలలో ఎలా విలీనం కావాలో వివరిస్తూ భరతముని "యతో హస్తస్తతో దృష్టిః - యతో దృష్టింతతో మనః - యతో మనస్తతో భావం - యతో భావంతతో రసః - అనలేదూ - నాట్యమైనా సంగీతమయినా సంసారమయినా అన్నింటికీ ఇది వర్తిస్తుంది.  దృష్టి, మనసు, భావం ఒక చోట కేంద్రీకరిస్తేనే సంగీత నాట్యాలలో ఎలా రసోత్పత్తి అవుతుందో దంపతులమధ్య సంసార మాధుర్యం చక్కగా పండాలన్నా అంతే మరి. ఏంటో ఈ కాలం పిల్లలు కలో గంజో ఒకచోట తాగి సుఖపడడం కంటే స్వంత వ్యక్తిత్వాలంటూ దాంపత్య మధురిమలకంటే ఉద్యోగాలే గొప్పనుకుంటున్నారు. తనువొకచోట మనసొకచోట ఆ భగవంతుడే వీళ్లకి దారి చూపించాలి'

    మృదుల ఆలోచన వేరుగా ఉంది.

    'తనొచ్చే సమయానికే ఈయన ఫ్రెండ్స్‌తో పెళ్లికెళ్లాలా? ఇప్పుడెలా? ఈసారి ఎలాగయినా సుచీందర్‌ని ఒప్పించి హైద్రాబాద్‌కి అతని చేత ట్రాన్స్‌ఫర్ అర్జీ రాయించి స్వయంగా తీసుకొస్తానని తన ఫ్రెండ్స్‌తో చేసిన ప్రతిజ్ఞ సంగతేం కాను? అయినా పెళ్లయి ఆరునెలలు కూడా కాకుండానే ఇదే టాఫిక్‌మీద చీటికీ మాటికీ తమ మధ్య ఏంటీ గొడవలు. వాదోపవాదాలతో ఒకసారి తనకి కోపమొస్తే ఇంకోసారి ఆయనకి తిక్కరేగుతుంది. ప్రతిసారీ ఎడమొహం పెడమొహంతో రైలెక్కుతున్నారిద్దరూను. ఇలా అయితే నూరేళ్ల సంసారం ఎలా సాగుతుంది? అయినా ట్రాన్స్‌ఫరు  విషయంలో ఆయనకెందుకింత పట్టుదలో అర్థం కాదు? ఆయనే తనుండే చోటికి అదే హైద్రాబాదుకే బదిలీ చేయించుకుంటే ఎంచక్కా హాయిగా ఇద్దరం కలిసి ఒకచోట ఉండొచ్చుకదా. వారానికో స్పాట్‌కి జంటగా విహరించొచ్చుకదా. ఊహూ... నేనే ఇక్కడికి ట్రాన్స్‌ఫరు చేయించుకోవాలని ఈయన పంతం. నిజానికి తను చేయించుకోవడం ఈజీనే... కానీ పెళ్లయ్యాక ఆడపిల్లే అత్తారింటికి ఎందుకు వెళ్లాలి? తనే ఎందుకు ట్రాన్స్‌ఫరు చేయించుకోవాలిట. తనకి మాత్రం అది పాతికేళ్లుగా అలవాటయిన ఊరు కాదా -  చదువు, ఉద్యోగం ఒకే ఊళ్లో ద్రోకడం పూర్వజన్మ సుకృతమని తన ఇంట్లోవాళ్లు చుట్టుపక్కల వాళ్లూ ఎంత సంబరపడ్డారు. తన స్నేహితురాళ్లు రేఖ, సరిత ఆ ఊళ్లోనే మంచి సంబంధాలు దొరికి వెళ్లిళ్లయి కాపరాలు చేసుకుంటున్నారు. వాళ్లని వదలడానికి తనకి అస్సలు ప్రాణమొప్పడం లేదు. ఈయన కూడా అక్కడికి వచ్చేస్తే తన స్నేహితురాళ్ల కుటుంబాలతో కలిసి ఎంచక్కా చక్కని పిక్నిక్‌లు వేసుకుంటూ జీవితాన్ని ఎంతబాగా ఎంజాయ్ చెయ్యొచ్చు' 
 
    'అమ్మగోరూ... మంచినీల్లండీ...' వీధిలో ఎవరిదో సన్నని గొంతు వినిపించింది.
 
    'మృదులా పూజగదిలో ఉన్నాను.బయట గేటుదగ్గర వెంకటలక్ష్మిలా ఉంది చూడమ్మా' పూజగదిలోంచి అత్తయ్య గొంతు వినిపించి బయటికి వచ్చిన మృదులకు అక్కడ నించున్న ఆ పిల్లను చూసి నవ్వొచ్చింది.
చేతిలో సిల్వరు బిందె పట్టుకుని వీధిగేటును ఆనుకుని వేలాడుతున్నట్టు నించుంది. చెవులకి గిల్టు జుంకాలు, మెళ్లో పచ్చని పసుపుతాడు నల్లపూసలు ముక్కుకి బులాకీ తమాషాగా ఊగుతోంది. నిండా పద్దెనిమిదేళ్లుంటాయేమో. చామనచాయగా ఉన్న మొహంమీద పట్టిన చెమటికి నుదుటిమీద ఉన్న కుంకుమ ముక్కుమీదకి జారుతోంది. దానిని కొంగుతో తుడుచుకుంటూ 'ఈ బిందెతో మంచినీల్లు పట్టుకుంటానమ్మాయిగారూ. అక్కడ బోరింగు నీళ్లు తాగితే దాహం తీరడం లేదు. అసలే వేసంకాలం  వచ్చేతోంది' అంది మృదులని చూసి సంజాయిషీ ఇస్తున్నట్లుగా.
 
    'వెళ్లి పట్టుకో' అంది మృదుల నవ్వుతూనే.

     నీళ్లు పట్టుకుంటూ తనకేసి పరిశీలనగా చూస్తున్న మృదులను అడిగింది 'మీరు కొత్త కోడలుగారు కదమ్మా'.

     'నీకెలా తెలుసు?' అంతే...  భుజానికెత్తుకున్న సిల్వరు బందెను దింపేసింది ఆ పిల్ల.

     'మామావ నేనూ ఇంకా మా ఊరోల్లు సింతపల్లినుంచి వచ్చి మేం అదిగో మీ ఎదర కొత్త బిల్డింగు సూసారా అక్కడ పని చేత్తన్నామమ్మా. మీ పని మడిసికి పెల్లయిపోయి మానేసిందట కదా మీ అత్తయ్యగారికి సందటేల రోజూ గిన్నెలు తోమి పెడతా ఉంటాను. మీ అత్తగారు చెప్పారమ్మా  మా కొత్తకోడలు బంగారం అని మీరు అచ్చం ఆయమ్మ చెప్పినట్టే అబ్బాయిగారికి సరిజోడీలా బంగారుబొమ్మలా ఉన్నారు.' మృదుల కాస్త సిగ్గుపడింది అంత చిన్న పిల్ల తనను పొగుడుతోంటే.

     'ఇంకా ఏం చెప్పారు మా అత్తయ్యగారు?' అంది నవ్వుతూ సరదాగా. ఆ పిల్లతో మాట్లాడుతుంటే మనసు తేలికగా ఉంది ఆమెకు. మీకు ఆర్నెల్ల కితమే పెల్లయిందంట గదా... మీరు పంతులమ్మ ఉద్దోగం చేస్తున్నారంటకదా... పాపం మీకు ఇక్కడికి బదిలీ అయ్యేదాకా అబ్బాయిగారికి...' చనువుగా అంటూ వెంకటలక్ష్మి కిలకిలా నవ్వుతూంటే ముక్కు బులాకీ చిత్రంగా ఊగింది.

    ఈ పల్లెటూరి పిల్లలు ఎంతలో మాటలు కలిపేసుకుని సన్నిహితం అయిపోతుంటారు.

    'అంటే' ఏమీ తెలియనట్టే అంది మృదుల.

    'పొండమ్మా సదువుకున్నోరు ఏం తెలవనట్టు ఈ పిచ్చిదాన్ని అడుగుతున్నారు.' మృదులకి ఆ పిల్లని చూస్తే ఎందుకో ముచ్చటేసింది.

    'అది సరేగాని మరి మీరు ఎక్కడ వండుకుంటారు వెంకటలక్ష్మీ?'

    'ఆ బిల్డింగు ఓనరు శానా మంచోడమ్మాయిగోరూ... పొరుగూరి నుంచి ఈ పనులకోసం పదేసుమందిమి వచ్చాంగందా. పగలంతా ఇక్కడే కూలిపనులు సేసుకుంటాం. రేత్రిళ్లు బిల్డింగు సెల్లారు కింద కాళీ జాగా ఉందికదమ్మా. అక్కడే వండుకుని అక్కడే పండుకుంటాం. మల్లీ పొద్దుటే పని... నెల్లాళ్లుగా ఇక్కడే ఉన్నాం. పెద్దపండక్కి మాత్తరం మా ఊరెల్లి వచ్చాం.'

    'ఇంకా ఇక్కడ ఎన్నాళ్లుండాలేంటి?'

    'ఏమో సరింగా తెలవదుగాని ఇంకో నాలుగునెల్లుండాలంటన్నాడు మా మావ.' మావ అంటున్నప్పుడు ఆ పిల్ల బుగ్గల్లోకి గులాబీరంగు పొంగుకురావడం మృదుల దృష్టిని దాటిపోలేదు.

    'మీ మావ పేరేంటి?'

    'కిట్టప్పండి' మెలికలు తిరిగిపోయింది.

    'నీకూ కొత్తగా పెళ్లయింది కదూ?' 

    'బలే కనిపెట్టేసారే. ఎంతయినా సదుంకున్నోల్లుగందా. ఇక్కడికి వచ్చేముందే అయిందండి. ఆడు మామావయ్యేనండి. మా యమ్మకి తమ్ముడండి. వత్తానమ్మాయిగారూ' బిందె తీసుకుని చెంగున పారిపోతున్న వెంకటలక్ష్మిని అలాగే చూస్తుండిపోయింది మృదుల.

* * *

    సుచీంద్ర ఫోన్ చేసాడు.

    'నువ్వు ఇంత సడెన్‌గా సెలవు పెట్టి వస్తున్నట్టు నాకు తెలియదు కదా మృదులా. లేకపోతే ఫ్రెండ్స్‌తో ఏదో సాకు చెప్పేసేవాడిని. ఒక్కడినీ బోరుకొట్టేస్తోంటే ఒప్పుకున్నాను. ఏం చెయ్యను. ఇప్పుడయితే నాక్కూడా ఎంత త్వరగా వచ్చి దేవిగారి ఒళ్లో వలిపోతానా అని ఉంది. కాని రేపు రాత్రికిగాని రాలేను. వచ్చాక మాత్రం నీ పని పట్టడం ఖాయం.' హుషారు తొంగి చూసింది సుచీంద్ర మాటల్లో.

    సుభద్రమ్మగారు బాధపడింది.

    'అయ్యో వచ్చేముందు ఒక్క ఫోన్ అయినా చేసావు కాదే తల్లీ. అయినా కొత్తగా పెళ్లయినవాళ్లు చిలకాగోరింకల్లా చక్కగా ఒకచోట కాపరం చేసుకోకుండా ఏంటో ఈ మాయదారి ఉద్యోగాలు. మొగుడూ పెళ్లాలని విడదీయడం పాపమై తెలియదా ఆ అధికారులకి!'

    మృదుల నవ్వసింది. 'పోనీండత్తయ్యా రేపు రాత్రికే వచ్చేస్తానంటున్నారుగా. హైదరాబాద్‌లో ఈ మధ్య రోజూ బంద్‌లు, ధర్నాలు. ఏలాగూ స్కూలు జరగడం లేదు. విసుగొచ్చి వారం రోజులు సెలవు పెట్టేశాను.' తను వచ్చిన కారణం అత్తగారితో చెప్పడానికి మొహమాటపడింది మృదుల.

    'పోనీ... మంచిపని చేసావులే. ఇంట్లో ఉన్నంతసేపూ నేను ఒంటరిపక్షిలా ఏమీ తోచక అల్లల్లాడుంటే నాకే జాలేస్తుంది. అయినా ఇద్దర్లో ఎవరో ఒకరికి బదిలీ అయిపోతే ఇంక ఈ తిప్పలుండవు.' తనకి బదిలీ అనేది తన చేతుల్లోనే ఉందని దానికి తన పట్టుదలే అడ్డం వస్తోందని భర్త అత్తగారికి చెప్పనందుకు సుచీంద్రను మనసులోనే మెచ్చుకుంది మృదుల.

    మధ్యాహ్నం ఏమీ తోచక ఇల్లంతా సర్దింది. కిటికీలకి కర్టెన్లు, బెడ్ షీట్‌లు మార్చింది. అయినా కాలం గడవలేదు. ఇంక విసుగొచ్చి ఎదర కొత్తగా కడుతున్న బిల్డింగు కేసి చూస్తూ కూర్చుంది. రెండో శ్లాబ్‌వేస్తున్నట్టున్నారు. కూలీలంతా ఒకటే హడావుడి. కొందరు మగాళ్లు సిమెంటు ఇసుక పిక్క కలిపిన కాంక్రీటు తయారు చేస్తుంటే ఆడకూలీలు గమేళాలతో గబగబా మెట్లమీంచి పైకి మోసుకెళ్తున్నారు. నిర్విరామంగా అక్కడ పని జరుగుతున్నంతసేపూ మేస్త్రీ అందరినీ అదిలిస్తూనే ఉన్నాడు. అలా రెండు గంటలపాటు సాగింది. రెండయ్యేసరికి కొందరు కూలీలు చేతులు కడుక్కుని యజమాని తెప్పించిన బిర్యానీ పాకెట్టు విప్పుకుని తిన్నారు.

    ఆడకూలీలను చూస్తుంటే మహా ముచ్చటేసింది మృదులకి. అసలు వీళ్లి ఎప్పుడైనా ఒళ్లు వస్తుందా అనేంత సన్నగా తీర్చి దిద్దినట్టు కనిపిస్తున్నారు. కాయకష్టం వల్ల లాభం అదే. కాస్త డబ్బు చేరితే ఏముంది. ఆడవాళ్లు పిజ్జాలు బర్గర్లు తెప్పించుకోవడం, టీవీ చూస్తూ తినడం, ఒళ్లు పెంచుకోవడం, ఆనక బరువు తగ్గడానికి నానా అవస్థా పడుతూ బ్యూటీ పార్లర్ల చుట్టూ పరిగెడుతూ వ్యాయామాలు పరుగులు నడకలు... అన్నీ పైతరగతులవాళ్లకే. 

    ఆ శ్రమైక జీవులను చూస్తున్న మృదుల కంట ఓ దృశ్యం పడి నవ్వు తెప్పించింది.

    ఎర్రచారల చొక్కా వేసుకున్న ఆ కూలీ వయసులో ఉన్న కుర్రాడే. అంతపనిలో కూడా ఎవరూ చూడకుండా ఆ సందట్లోనే పెళ్లాం బుగ్గ గిల్లడం, కావాలని ఒళ్లు తగిలించడం చేస్తున్నాడు. పాపం వాళ్లూ కొత్త దంపతులు కాబోలు. అయినా శ్రమజీవుల సరసానికి ప్రత్యేకమైన చోటు అక్కర్లేదు కాబోలు... అక్కడే తిండి, నిద్ర, పడక.

    తర్వాత వాళ్లని గమనిస్తూంటే ఆమెకే సిగ్గేసింది. మేస్త్రీ అదిలిస్తున్నా ఆ కుర్రాడు ఏదోవంకతో ఆపిల్ల చుట్టూనే తిరుగుతూ గిల్లడం చేస్తున్నాడు. బొద్దుగా ఉన్న ఆపిల్ల ఒక వంక సిగ్గుపడుతూనే బెదురుగా ఎవరైనా చూసున్నారేమోనని దొంగ చూపులు చూస్తోంది. అక్కడ పని చేస్తున్న వాళ్లలోనే చంటిబిడ్డల తల్లులూ ఉన్నారు. వాళ్లు పిల్లలను అక్కడే గుడ్డలేసి పడుకోబెట్టి పనులు చేసుకుంటున్నారు. మధ్యలో వెంకటలక్ష్మి కూడా కనిపించింది. కానీ ఆ ముఖంలో కోపం విసురు. పాపం బహుశా ఏదో పనిమీద మేస్త్రీ మొగుడిని బయటికి పంపించి ఉండాలి. లేకపోతే కొత్త పెళ్ళికూతురు మొగుడితో ఆ జంటలాగే సరసాలతో శ్రమ మరిచిపోయేది.

* * *

    పగలంతా అంతసేపు తట్టలు మోసే పని చేసికూడా సాయంత్రం ఆరుగంటలకు గేటు తీసుకుని వచ్చిన వెంకటలక్ష్మి ముఖంలో అమాయకపు నవ్వే తప్ప అలసట కనిపించలేదు. చకచకా అంట్లు తోమేసి కాళ్లూ చేతులు మొహమూ కడుక్కుంది. 

    'అమ్మాయిగోరూ... మీకు సన్నజాజులు కోసి పెట్టనా? అబ్బాయిగారు ఊర్లో లేదు అనకండమ్మాయి గారూ'అంది ఆరిందాలా కన్నుగీటుతూ.

    'అననులే కానీ నాకు మాల కట్టడం రాదే! ఎలా మరి?'

    'నేను కట్టిపెడతాను లెండి. మా ఊళ్లో అయితే బోలెడు పూలు' అంటూ పెరట్లోని కనకాంబరాలు కూడా జాజులతో కలిపి అద్భుతంగా మాల కట్టి ఇచ్చింది వెంకటలక్ష్మి.

    'ఇంత పెద్దదండ నేనేం చేసుకుంటాను. ఇదిగో నువ్వూ తీసుకో' అంటూ మూరెడు మాల తనకి ఇచ్చేసరికి వెంకటలక్ష్మి ముఖం చాటంతయింది.

    'ఇప్పుడు ఇది పెట్టుకుని మీ మావకి చూపించు. వెళ్లు' అంది ఓరగా చూస్తూ మృదుల.

    'ఆడిపేరెత్తకండి అమ్మాయిగారూ నాకు ఒల్లు సివసివాలాడిపోతోంది.'

    'అదేంటి పోట్లాడుకున్నారా ఏంటి. అవునూ మధ్యాహ్నమంతా మీ ఆయన ఎక్కడా కనిపించలేదేమిటి వెంకటలక్ష్మీ?'

    'ఆడు అక్కడే ఉన్నాడు కదండీ. ఎర్రచొక్కా మీద నల్ల సారలు. చెవులకి పోగులు. అయి మా అమ్మ సేయించినవేనండి.'

    విస్తుపోయింది మృదుల. కాని ఆ ఎర్రచొక్కా కుర్రాడు బొద్దుగా ఉన్న పిల్లతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటు...?

    'ఆడి దొంగ నవ్వులే ఎపుడో నా కొంప ముంచేత్తాయండి. ఆ ముత్యాలుని చూసారా. ఆడికేసి మింగేసేలా ఒకటే ఇదిగా చూస్తుంది.'

    'ముత్యాలెవరు...?' కొత్త పాత్ర గురించి కుతూహలంగా అడిగింది మృదుల.

    'మామావతో ఇక ఇక లాడుతూ దిబ్బలా నల్లగా ఉంది చూసారూ అదే. మా ఊరుది కాదులెండి. ఇంకో మేస్త్రీ పనికి మరో పదిమంది కూలీలని ఈ ఊరునుంచే అట్టుకొచ్చాడు అందులో ఇదొకతె. నేను కాస్త తప్పుకుంటే చాలు. ఆడితో ఒకటే ఇకఇకలు పకపకలూను.'వెంకటలక్ష్మి మాటల్లో కోపం.

    'నీకు మీ మావంటే ప్రాణమనుకుంటాను.'

    'ఎంత పేణమయినా తప్పుచేస్తే మాత్రం ఆడి పని పట్టేత్తానమ్మాయిగారూ. వారం రోజుల బట్టి ఆళ్లిద్దరినీ చూత్తానే  ఉన్నాను. ఇందాక సూడండి. సినీమాకి నన్నూ తీసికెల్లొచ్చుగా. నేను మడిసిని కానా. నన్నొగ్గేసి ఒక్కడూ సినిమాకెల్లి పోయాడు.'

    'ఇవాళ ఇంత శ్లాబు పని చేసి రెస్టు తీసుకోకుండా సినిమా కెళ్లాడా?' విస్తుపోయిన మృదులతో 'మీకు తెలవదమ్మాయిగోరూ. ఒల్లు పులిసిపోయిందని రేతిరికి కల్లు తాగేసి వత్తాడు. వచ్చి నాతో తగువెట్టుకుంటాడు. అసలు నా అనుమానం ఆ దిబ్బదాంతోగాని సినీమాకి ఎల్లాడేమోనని. అదేగనక నిజమైతే రాగానే సూడండి నాసామిరంగా...'

    'ఛ ఊరుకో. మీ ఆయన అలాంటివాడు అయి ఉండడులే' వెంకటలక్ష్మిని ఓదార్చడానికి అందికాని మధ్యాన్నం కిట్టప్పనీ ఆ పిల్లనీ గమనించిన మృదులకే నమ్మకం లేదు.

    'మీకు తెలవదమ్మాయిగోరూ. అసలు ఈ మగాల్లని నమ్మడానికి లేదు. మనం కాత్త వెర్రిమొగాలమయితే సరాసరి ఇంట్లోనే దుకాణమెట్టేస్తారు.' ఉలిక్కిపడింది మృదుల.

    ఈ పిల్ల చాలా గడుసైందే. అప్పుడే మొగుడిని కట్టడి చెయ్యాలని చూస్తోంది.

    'మీరేమీ అనుకోకపోతే ఓమాట సెప్తాను. మీరు కూడా తొరగా బదిలీ చేయించుకుని ఈడకి వచ్చెయ్యండి. లేపోతే ఈమగాల్లు... అసలే వయసులో ఉన్నోల్లు... ఉప్పుకారం తింటన్నారుకదా... ఒల్లు ఊరుకోదు. అసలు నాకు ఇలా పెల్లయిన ఎంటనే  ఈ కూలి పనికి రావడానికి ఇట్టం లేదమ్మాయిగోరూ. కాని మా యమ్మమ్మ చెప్పింది. 'ఎర్రిదానా పెల్లయిన కొత్తలో నువ్విలా ఆడికి దూరంగా ఉంటే ఆడు పొరుగూల్లో ఏరేదానిని చూసుకుంటే నీకే కట్టం' అంది. ఇట్టా అన్నానని ఏమీ అనుకోబాకండి. మీరు కూడా... జాగ్రత్త పడండి. వత్తానమ్మాయిగోరూ. ఇదిగొ ఈ పువ్వులదండ పట్టికెల్తన్నా.'

    దండని పదిలంగా గుండెలకి హత్తుకుని తీసికెళ్తున్న వెంకటలక్ష్మి గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిలా అనిపించింది మృదులకి.

    నిజమే తను ఆ యాంగిల్‌లో ఎప్పుడూ ఆలోచించలేదు. పెళ్లయి సంసార జీవితం రుచి మరిగిన మగాడు ఉప్పుకారం తింటున్నవాడి మనసు చలించకుండా ఉంటుందా? అసలు సుచీంద్ర నిజంగా ఫ్రెండ్స్‌తో పెళ్లికే వెళ్లాడా? లేక...

    అన్నం తిని వెళ్లి మంచం మీద పడుకుందేగాని ఆలోచిస్తుంటే ఎంతకీ నిద్ర పట్టలేదు ఆమెకి. టైం చుసింది. తొమ్మిదవుతోంది. బయట ఏదో పోట్లాట. లేచి కిటికీలోంచి చూసింది. వెంకటలక్ష్మి అరుస్తోంది. కిట్టప్ప తాగి ఉన్నట్టున్నాడు. మాట ముద్దగా వినిపిస్తోంది.

    'నామాట నమ్మే లచ్చిమీ. నేను ఒక్కణ్ణే సినిమాకే ఎల్లానే.' కిట్టప్ప దణ్ణాలెడుతున్నాడు. ఎంతకీ వినకపోయేసరికి కాసేపటికి నాలుగు తగిలించాడు. వెంకటలక్ష్మి దెబ్బతిన్న తాచులా లేచింది. తర్వాత తిట్టడం మొదలెట్టింది.

    కూలీల్లో కాస్త పెద్దవాడు ఎవడో గద్దించాడు. 'రోజూ మీ ఎదవ గోలేంటెహె. పోయి పడుకోండి.'

    దాంతో ఇద్దరూ నోరు మూసేసారు.

    మృదుల మనసు పాడయింది. పాపం వెంకట లక్ష్మికి కిట్టప్పంటే ఎంతో ప్రాణమని ఆ పిల్ల మాటల్లో చూపుల్లో తను కనిపెట్టింది. కాని కిట్టప్ప ఇలా ద్రోహం చేసి ఆ పిల్లని ఏడిపించడం అన్యాయం.

    తను అలా ఆలోచిస్తూ ఎంతసేపు అక్కడే నించుందో. కాళ్లు లాగుతుంటే పడుకునేందుకు మంచం దగ్గరకి నడవబోతుంటే ఆ రాత్రివేళ ఆ నిశ్శబ్దం చీల్చుకుని కిలకిల నవ్వులు వినిపించాయి. మళ్లీ కిటికీలోంచి చూసింది. ఎదరి బిల్డింగు మొదటి శ్లాబు కింద వెన్నెల్లో రెండు నీడలు... ఒకళ్లనొకళ్లు గాఢంగా పెనవేసుకున్నారు. మృదులకి ఆశ్చర్యం కలగలేదు. శ్రమజీవుల జీవితాలలాగే ఉంటాయి. తిండి నిద్రలతో బాటు ఎలాగో అవకాశం చూసుకుని...??? ఏకాంతం దొరికించుకునేందుకు పైకి వచ్చారన్నమాట. వాళ్లగురించే ఆలోచిస్తూంటే ఎప్పటికో నిద్రపట్టింది మృదులకి.

* * *

    ఆ రాత్రి మెత్తగా తనకు తగులుతున్న చల్లగాలికి కంపించిపోతోంది ఆమె.

    ఆ గాలి తనలో మరింత వేడినిపెంచుతున్నట్టు అనిపిస్తోంది.

    మేఘాలపై కదులుతున్న చంద్రుడు కూడా తనలాగే అసహనంగా కనిపిస్తున్నాడు ఆమెకి. పరిమళాలు వెదజల్లుతున్న పూలు నిట్టూర్పులు విడుస్తున్నట్టు అనిపిస్తున్నాయి. విరిపూల తీయతేనెలాస్వాదిస్తున్న గండు తుమ్మెదలు చేస్తున్న ధ్వనులు ఆమెలో అలజడులు సృష్టిస్తున్నాయి. గున్నమామిడి గుబురులలో కొంగ్రొత్త చివుళ్లను తిని మత్తెక్కిన కోకిలలు చేస్తున్న కుహూరావాలు ఆమెకు మైకం కలిగిస్తున్నాయి.

    కళ్ల కాటుక తనని చూసి నవ్వుతున్నట్టనిపించింది. నాసిక క్రింద ఎర్రని పెదాలు కంపిస్తున్నాయి. శంఖంలాంటి కంఠం నుంచి చెమటబిందువులు ధారగా లోయలోకి ప్రవహిస్తున్నాయి. ఆమె విరహవేదనలో దహించుకుపోతోంది.

    ఎప్పుడు ఎక్కడనుండి వచ్చాడో సుచీంద్ర మృదులను రాత్రంతా కవ్విస్తూనే ఉన్నాడు. ప్రణయానందాన్ని జుర్రుకునే మధుర తరుణంలో మరో నీడ. ఇద్దరి మధ్య చేరి రసభంగమయింది. ఎవరిది ఆ నీడ?

    కోపంతో అసహనంతో చిరుచెమటలుపోసి ఆ ఉక్కబోతకి మెలకువ వచ్చేసింది మృదులకి.

    ఆ నీడ ఎవరోగాని అసలు ఆమె కోసమే ఈ ఊరు వదలననడంలేదుకదా. నిజానికి భర్తలు బయట ఎన్ని రాచకార్యాలు  చేసినా ఇంటికి తిరిగి రావడానికి కారణం ప్రత్యేక ఆకర్షణ భార్యయే కదా. అటువంటి భార్య ఇంటికొచ్చేసరికి కనిపించకపోతే ఏమగాడు మాత్రం ఎన్నాళ్లు ఓర్చుకుంటాడు? భర్తకూడా...???

    ఆ ఆలోచన బుర్రను వేడెక్కించేస్తుంటే మరింక ఆలోచించకుండా రాత్రికి రాత్రే లేచి కూర్చుని ఈ ఊరికి తన బదిలీ అర్జీ రాసి తెల్లారగానే స్వయంగా వీధి చివరి పోస్ట్‌బాక్సులో దానిని తన అన్నయ్యకి పోస్టు చేసేదాకా మృదుల మనసు కుదుట పడలేదు.

* * *

    మర్నాడు పొద్దుటే సిల్వరు బిందెతో నీళ్లు పట్టుకోవడానికి వచ్చే వెంకటలక్ష్మి కోసం మృదుల ఎంతగానో ఎదురుచూసిందిగాని ఆ పిల్ల రాలేదు. మధ్యాహ్నం పనిచేస్తున్న కూలీలలో కూడా కనిపించలేదు. కొంపదీసి అలిగి పుట్టింటికి పోలేదు కదా.

    ఏమీ తోచక నవల చదువుకుంటున్న మృదులకి మధ్యాన్నం అన్నంలో నంచుకునేందుకు ఆవకాయ బద్ద పెట్టమంటూ వచ్చిన కిట్టప్ప కంఠం వినిపించింది.

    ఎందుకో లేచి వాడిని చూడాలనిపించలేదు. కొత్తగా పెళ్లయిన పెళ్లాం దగ్గరుండగా వేరే పిల్లతో సరసాలాడిన వాడిమీద మృదులకి పీకదాకా కోపం వచ్చింది. వాడిని కడిగేయాలని లేద్దామనుకుంటుంటే అత్తగారు సుభద్రమ్మ కంఠం కోపంగా మందలిస్తున్నట్టు వినిపించింది.

    'ఎందుకురా కిట్టప్పా నీ పెళ్లాన్ని అలా ఏడిపిస్తావు?' ముందురోజు సాయంత్రం తనకోడలి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ వెంకటలక్ష్మి చెప్పిన పలుకులు గుర్తొచ్చాయి కాబోలు ఆవిడకి.

    'అయబాబో మీరు కూడా అట్టాగంటే నేనేటయిపోను అమ్మగోరూ. ఆడోల్ల సంగతి మీకు తెలవనిదేముంది? మా ఎంకటలచ్మికి ముక్కుమీదేకోపం. కోపంతో దాని ముక్కు బులాకీ ఊగుతుంటే దాని ముకం ఎంత ముద్దొత్తుందని పైగా అది మా అక్కకూతురు అమ్మగోరూ కావాలని ఇట్టపడి దానిని మనువాడాను. సరదాకి దానికి కోపం తెప్పించాలనే ముత్తేలుతో పగలు రోజూ అట్టా నాటకమాడతుంటాను. మీకు చెప్పకపోవడమెందుకుగాని ఆ  ముత్తెలుకి ఇద్దరు పిల్లలు. పైగా వరసకి నాకు ఏలు ఇడిచిన అత్తవుతాది.'

    'ఓరి నీయిల్లు బంగారం కానూ. అందుకే ముక్కు తిమ్మనగారు తన పారిజాతాపహరణంలో సత్యభామచేత తన చెలికత్తెకి అననే అనిపించారురా.

    "ధనమిచ్చి పుచ్చుకున్నను, మనమున నోర్వంగ వచ్చు, మగడింతులకున్ జనవిచ్చి పుచ్చుకున్నను, మనవచ్చునె యింక నేటి మాటలు చెలియా" అని అంటే ఏంటో తెలుసా? ఇతరులపట్ల మొగుడు చనువుగా ప్రేమగా ఉంటే సహించకపోవడం అనేది అన్ని యుగాలకు వర్థించే సత్యమేరా కిట్టప్పా! అయినా మరీ ఏడిపించావంటే వెంకటలక్ష్మి ఊరుకుంటుందనుకునేవు. చీపురు తిరిగేస్తుందిరోయ్ జాగ్రత్త. అయినా ఇంతకీ అది ఇవాళ పొద్దుటే నీళ్లు పట్టుకునేందుకు రాలేదు ఏమయిందిరా?'

    'దానికి రేతిరి నడ్డి పట్టేసిందమ్మగోరూ' అంటూ బుర్రగోక్కుంటూ సిగ్గుపడుతున్న కిట్టప్పను చూసి సుభద్రమ్మగారు 'పోరా పో' అంటూ గబగబా వంటింట్లోంచి పరిగెడుతుంటే మృదుల నవ్వలేక పొట్ట పట్టుకుంది.

    అయితే రాత్రి ఎదరింటి మొదటి అంతస్తు మూల రాచక్రీడలు జరిపింది ఈ జంటేనన్నమాట. మళ్లీ ముసిముసిగా నవ్వుకుంది తప్ప తన బదిలీపై తను తీసుకున్న నిర్ణయం విషయంలో వెనుదిరుగలేదు మృదుల.

    ఎందుకంటే తన స్కూల్లో సంస్కృతం మాస్టారు వెంకటాచార్యులుగారు స్టాఫ్‌రూంలో అందరినీ ఆహ్లాదంగా ఉంచడానికి  అప్పుడప్పుడు ఎన్నో సూక్తులు చెబుతుంటారు.

    ఆయన తరచుగా ఉపయోగించే పదాలు గుర్తొచ్చాయి మృదులకి.

    'కృతే కార్యే కిం ముహూర్తప్రశ్నేన?' అంటే పని ముగిసిన తరువాత ముహూర్తమడగడం, జరగకూడనిది జరిగిపోయాక పరిహారాలు పాటించడం వలన ఏంటి ప్రయోజనం అని అర్థమట. అందుకే భవిష్యత్ ముందే తెలిస్తే ముప్పునుంచి తప్పించుకోవడం లేదా తగ్గించుకోవడం సాధ్యమే అంటుంటారు. ఆయనక చెప్పేదికూడా నిజమే. ఒక్కమాటలో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వ్యర్థం.

    అయితే ఆమెకి తెలియని సత్యం ఒకటుంది. స్నేహితుడి చెల్లెలి పెళ్లిలో వధూవరుల ముసిముసినవ్వులు దొంగచూపులు గమనించిన సుచీంద్ర కూడా ఇంక తను మృదుల వేరే ఉండడం భావ్యం కాదని నిశ్చయించుకుని వచ్చిన వెంటనే ఆ తియ్యని కబురు భార్యకి చెప్పి ఆమె ముఖంలో ఆనందాన్ని తనివితీరా ఆస్వాదించాలనుకున్నాడని...???

 
Comments