పరి'పాల'న - వేంపల్లి రెడ్డి నాగరాజు

    
అనగనగా ఓ న్యాయాధికారి. ప్రతిరోజూ ఉదయం నిద్ర లేస్తూనే ఆ రోజు దినపత్రికలోని తాజాదనాన్ని వేడి వేడి పొగలు, సెగలు చిమ్మే కాఫీతో కలిపి ఆస్వాదించడం ఆయన అలవాటు. ఇంకా బాగా చెప్పుకోవాలంటే బెడ్ కాఫీతో గొంతు తడవనిదే పొద్దు పొడవలేదని భావించి మంచం దిగడానికి కూడా ఇష్టపడని వ్యక్తి.

    గత ముప్ఫై ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న జడ్జిగారి ఈ కాఫీ అలవాటుకు ఒక రోజు సడెన్‌గా బ్రేక్ పడింది. అది డిశంబర్ రెండవ వారం. అసలే చలి పులి గజగజా వణికించేస్తున్న కాలం. రోడ్లన్నీ మంచు దుప్పట్లు కప్పుకున్న కాలం.

    రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, ఇరుపక్షాల వాదోపవాదాల గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా సరిగ్గా పట్టక పక్కమీద దొర్లి ఉదయం నాలుగింటికే లేచి కూర్చున్నారాయన. లేచి గంట గడిచినా, ఐదు గంటలు దాటుతున్నా అలవాటు ప్రకారం కాఫీ ఘుమఘుమలు ముక్కుపుటాల్ని సోకలేదు.

    మరో అరగంట వేచి చూశారు.

    పూర్తిగా పీల్చి పిప్పి చేసి పక్కన పడేసిన పేపర్‌నే అందుకుని మరోసారి తిరగేసి గిరాటేశారు.

    అయినా కాఫీ వస్తున్న ఛాయలు కనిపించలేదు.

    ఆలోచనలతో అలసివున్న మనసుకు చిరాకేసింది. అంతే ఒక్కసారిగా ఇల్లంతా దద్దరిల్లిపోయేలా 'కాఫీ' అంటూ కేక పెట్టారు.

    అయ్యగారి కేక విని పూజగదిలో నుండి అమ్మగారు, వంటింట్లో నుండి పనిమనిషి పరుగు పరుగున పడక గదికి చేరుకున్నారు. 

    ఆరుగంటలు కావస్తున్నా ఇంకా కాఫీ ఎందుకు రాలేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు జడ్జిగారు.

    అష్టోత్తర స్మరణలో ఉన్న అమ్మగారు పనిమనిషి వైపు చూశారు.

    కాఫీ ఇవ్వకపోవడంలో తన తప్పేమీ లేదంది పనిమనిషి.

    మరెందుకు ఆలస్యమైందన్నట్టుగా చూశారు జడ్జిగారు.

    పాలవాడు ఇంకా రాకపోవడమే కారణమని చెప్పింది గడగడా వణుకుతూ పాలవాడు చేసినతప్పుగా. 

    తప్పుకు తప్పనిసరిగా శిక్ష ఉండాలని భావించే వ్యక్తి ఆయన. అయితే విచారించిగాని శిక్ష వేయకూడదన్న వివేకం గలవారు. అందుకే అత్యవసరంగా పాలవాడిని హాజరు పరచమన్నారు. ఆదేశాలు అమలయ్యాయి. విచారణ మొదలయ్యింది.

    "రోజూ నాలుగింటికే పాలు తెచ్చేవాడివి. ఈరోజు ఇంకా ఎందుకు తీసుకురాలేదు?" ఆగ్రహంతో ఊగిపోతూ అరిచారు జడ్జిగారు.

    "పాలు పితికేందుకు ఆవు పొదుగు దగ్గరకు పోతే తంతోంది దొరా. ఎన్ని సార్లు వెళ్లినా ఇదే తంతు" వాచి ఉన్న మొహాన్ని తడుముకుంటూ చెప్పాడు పాలవాడు.

    అయితే ఆవును కూడా ప్రవేశపెట్టమన్నారు దొరవారు.

    మాట అయ్యగారి నోట్లో ఉండగానే నౌకరు, చాకర్లు పరుగు పరుగున వెళ్లి ఆవును, దానితో పాటు దూడను తీసుకుని వచ్చారు.

    ముప్పై ఏళ్ల ఉద్యోగానుభవంలో ఎందరో పశువుల్లాంటి మనుషులను విచారించి ఉండడం వల్ల జడ్జి గారికి పశుభాష కూడా బాగానే వచ్చు. అందుకే ఆవుతో దాని భాషలోనే మాట్లాడడం మొదలు పెట్టారు.

    "ఎందుకు పాలివ్వలేదు?"

    గత రాత్రి తమ పశుజాతి సమిష్టిగా తీసుకున్న నిర్ణయమే దానికి కారణమంది ఆవు తాపీగా.

    "పాలివ్వకూడదని మీ సంఘం ఎందుకు నిర్ణయించుకుంది?" మళ్లీ ప్రశ్నించారు జడ్జిగారు.

    "పాలించే పేరుతో నాయకులుగా అవతారమెత్తిన మీ మానవజాతి వైఖరి నచ్చక" బదులిచ్చింది ఆవు నెమరేస్తూ.

    "నాయకుల వల్ల మీకొచ్చిన నష్టమేంటి?" కళ్లద్దాల్లోంచి సూటిగా చూస్తూ మరో ప్రశ్న సంధించారు జడ్జిగారు.

    "మా మనుగడకే ప్రమాదం ముంచుకొస్తోంది కాబట్టి" తోకను వీపుపై రాపాడిస్తూ.

    "అంటే?" సందేహంగా చూశారు జడ్జిగారు.

    మౌనం దాల్చిన ఆవు చెప్పడం ఇష్టం లేనట్లుగా మొహం పెట్టింది.

    "మీరిలా పాలివ్వకుంటే మాలాంటి కాఫీ రాయుళ్ల పరిస్థితి ఏంటి? పాలు తాగే పసిపిల్ల సంగతేంటి? దేవుళ్లకు క్షీరాభిషేకాలు, పంచామృత నైవేద్యాల మాటేమిటి? విందు భోజనాల్లో కమ్మని పెరుగు, ఘుమఘుమలాడే నెయ్యి వాసనలు, పాలకోవాలు, పూతరేకులు లేకుండా ఎలా? శోభనం పెళ్లి కూతుళ్ల చేతుల్లో పాలగ్లాసులు లేకపోతే ఆ తంతంతా బోసిపోదా?" నిగ్గదీసి అడిగారు జడ్జిగారు.

    ఇక తప్పదన్నట్టుగా నోరు విప్పింది ఆవు.

    "మీ మానవ జాతిలో పరస్పర విద్వేషాలు రగిలినప్పుడు ప్రత్యర్థి వర్గాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మల్ని తగులబెట్టే దుష్ట సంప్రదాయం వున్నందున మా పశుజాతి యావత్తూ సహాయ నిరాకరణ చేస్తున్నాయి" చెప్పింది.

    అర్థం కాక అయోమయంగా చూశారు జడ్జిగారు.

    "దిష్టి బొమ్మల తయారీకి మా ఆహారమైన ఎండుగడ్డిని వాడుతున్నారు. ఒక్కో బొమ్మను తయారు చేసేందుకు కనీసం నాలుగు పశువుల మేతను ఉపయోగిస్తున్నారు. దాన్నంతటినీ క్షణాల్లో కాలబెట్టి బూడిద చేసేస్తున్నారు" అంది ఆవేదనగా ఆవు.

    జడ్జిగారు ఆశ్చర్యంగా చూస్తూ ఇంకా చెప్పమన్నట్టు చూశారు.

    "గత ఎన్నో ఏళ్లుగా దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో కొన్ని లక్షల దిష్టిబొమ్మల్ని తగుల బెట్టారు. ఇప్పటికీ మీ వ్యాపారం కోసం పచ్చని అడవుల్ని నిలువునా నరికి రియల్ ఎస్టేట్లుగా మార్చి వర్షాలు రాకుండా చేస్తున్నారు. ఫలితంగా పచ్చగడ్డి దొరక్క కరువుతో అల్లాడుతున్నాం. పొలాల్ని సాగుచేయక, చేసినా గడ్డి ఇచ్చే పంటల్ని పండించని మనుషులకు - దిష్టి బొమ్మల రూపంలో మా ఆహారాన్ని బూడిద చేసే హక్కు, అధికారం ఎవరిచ్చారు?"

    జడ్జిగారు మిడిగుడ్లు వేసుకుని ఆవు చెప్పేదంతా వింటున్నారు.

    "పైపెచ్చు కోట్లు విలువచేసే గడ్డిని తిన్న ఓ పెద్దమనిషికి న్యాయస్థానం ఏ శిక్ష విధించింది?" చివర ప్రశ్న తనమీదకే సంధించిందనిపించింది జడ్జిగారికి.

    ఇంతలో వీధిలో ఏదో కలకలం వినిపించింది.

    ఎవరో నిరసనకారులు తమ ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన ఓ నేత దిష్టిబొమ్మకు నిప్పుపెట్టి బిగ్గరగా అరుస్తున్నారు.

    గడ్డితో చేసిన దిష్టిబొమ్మనుండి నాల్కలు చాచుతూ ఎగసిపడుతున్న మంటల్లాగే న్యాయాధికారి మెదడులో ఆవు వేసిన ప్రశ్నలు రగులుకొని మండుతున్నాయి.

(ఆదివారం ఆంధ్రజ్యోతి 17 జనవరి 2010 సంచికలో ప్రచురితం)
Comments