ఆ ఒక్క మాటే! -అల్లాడ స్నేహలత

    సుర్యుడు తన డ్యూటీ ముగించుకుని, ధరణి తల్లి ఒడిలో సేద తీరడానికి పశ్చిమాద్రికి మెల్ల మెల్లగా దిగుతున్న సమయం. చల్లని పిల్లగాలులు వీచే చిరుసవ్వడి రోడ్డుకిరువైపులా ఉన్న చెట్ల కొమ్మలకి, కమ్మని సంగీతంలా అనిపించిందేమో, పరవశించి తలలూపుతున్నట్టుగా ఉన్నాయి. ఆ ఆహ్లాద వాతావరణంలో రఘురాం మనసు అంతకన్న ఆహ్లాదంగా ఉంది. అందుకు కారణం అతని ఆప్త మిత్రుడు, ప్రియాతి ప్రియమైన మిత్రుడు అయిన జయరాంని కలుసుకునేందుకు వెళ్తున్నాడు. రఘురాం స్టేట్స్ నుండి కొన్నిరోజులుండడానికి తన ఊరువచ్చాడు. ఆవూరు పల్లెటూరూ కాదు పెద్ద పట్టణమూ కాదు.

    ఆప్తమిత్రుణ్ణి చాలారోజుల తర్వాత కలవబోతున్నానన్న ఆనందంతో హుషార్‌గా చిన్నగా ఈల వేస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు. సడన్‌గా అతని ఈల పాటా ఆగిపోయింది. డ్రైవింగూ ఆగిపోయింది. అందుకు కారణం రోడ్డు ప్రక్కగా ఒక బాలుడు పడిఉండడం అతని కంటపడింది. 'అయ్యో!పాపం!'అనుకుని కారు దిగి చూశాడు. పది పన్నెండు సంవత్సరాలుంటాయేమో ఆ బాలుడికి. స్పృహలేదు. షర్ట్ మీద రక్తం మరకలు. వీపుమీద షర్ట్ కొంచెం చిరిగి రక్తంతో బాగా తడిసినట్టుంది. యాక్సిడెంట్‌లా లేదు. ఫ్రెండ్‌ని కలుసుకుని, ఆరోజంతా హాపీగా అతనితో స్పెండ్ చేయాలని అనుకున్న అతని ఆనందం హరించుకుని పోయి కాస్త నిరుత్సాహం కలిగింది. వెంటనే వివేకంతో ఆలోచించి ఫ్రెండ్‌ని ఈ వేళ కాకపోతే రేపు కలవచ్చు. రేపే వాడితో హాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆప్త మిత్రుని కలవడం కన్న ఆ పరిస్థితిలో ఉన్న బాలుడి సంగతి చూడడం తన ధర్మం అనిపించింది రఘురాంకి.  

    కారులోంచి వాటర్‌బాటిల్ తెచ్చి మొహం మీద నీళ్ళు చల్లాడు. కొంత సేపటికి స్పృహవచ్చింది. నెమ్మదిగా లేవదీసి కారు దగ్గరకు నడిపించి సీటులో కూర్చోబెట్టాడు. 'భయపడకు' అని ధైర్యం చెప్పాడు. కారుని ముందుకు పోనిచ్చి ఒక క్లినిక్ దగ్గర ఆపి ఆ అబ్బాయికి చికిత్స చేయించాడు. వీపు మీద దెబ్బలు పడినట్టు ఆట్టు తేలి ఉన్నాయి. ఎవరిదో ఈ కిరాతక చర్య! ఇంత చిన్న పిల్లాడిని అంతగా హింసించే అవసరమేమిటి? ఎలా మనసొప్పిందో? నిదానంగా అడగాలి అనుకున్నాడు రఘురాం.

    డాక్టర్ ఆ దెబ్బలని క్లీన్ చేయించి, ఆయింట్‌మెంట్, కొన్ని టాబ్లెట్స్ వాడమని వ్రాసిచ్చాడు. అవి కొని ఒక కప్పుతో టీ తెచ్చి ఆ అబ్బాయిచే తాగించాడు. అప్పటికి కాస్త ఓపిక వచ్చిందేమో "నమస్కారం బాబుగారూ!" అని అనగలిగాడా అబ్బాయి.

    "ఫరవాలేదు. ఏం జరిగిందో చెప్పు. ఏమిటీ దెబ్బలు? ఎవరు బాబూ నిన్నితగా కొట్టింది?" ఓదార్పుగా అడిగాడు. 

    "నేను పని చేసే ఫాక్టరీ ఓనర్ భాస్కరరావుగారు తన మేనేజర్‌తో కొట్టించారు బాబూ!"

    ఆ మాటలు విని 'ఆ!' అంటూ షాక్ అయ్యాడు రఘురాం. "ఎందుకు కొట్టించారు? అంత తప్పు నువ్వేం చేశావు? అసలు నువ్వెవరు? నీ పేరేమిటి? వివరంగా చెప్పు" అడిగాడు రఘురాం.

    "నాపేరు విజయ్ అండి. ఈ మధ్యనే మేమీవూరు వచ్చాం. పేద వాళ్ళం. పొట్టగడవక ఆ ఫాక్టరీలో కూలిపనికి పెట్టారు మావాళ్ళు. నాకు కొంత వరకు చదువు వచ్చు. ఫాక్టరీలో ఖాళీసమయం దొరికినప్పుడు చదువుకుంటాను. నాకు చదువంటే చాలా యిష్టం. నేను చదువుకోవడం చూసి నాతోటి కూలీ పిల్లలు వాళ్ళకీ అక్షరాలు నేర్పమని అడిగితే నేర్పుతున్నాను. అది మా ఓనర్ చూశారీవేళ. 'కూలి వెధవ్వి! నీకు చదువేమిటి? నువ్వు చెడిందేకాక వీళ్ళనికూడా చెడగొడ్తున్నావా?' అని కేకలేశారండి.

    'చదువుకోవడం చెడిపోవడమా? కూలి వెధవనైతే చదువు కోగూడదా? అయినా ఖాళీగా ఉన్నప్పుడే గదా! మీ పని ఎగ్గొట్టి చుదువుతున్నానా?' అని అడిగానండి.

    'నన్నే ఎదిరిస్తావురా?' అని నా చెంప పగలగొట్టారండి.

    'ఈ సారి నీ చేతిలో పుస్తకం చూశానంటే చంపేస్తాను' అని అరిచారండి. అప్పుడు నేను 'చదువుకోవద్దు అనడానికి మీరెవరండీ! చదువు మీ గొప్పోళ్ళ సొంతమా?' అని అడిగానండి. అలా అడగడం తప్పాండీ!" 

    "కాదు ఎంతమాత్రం కాదు. గుడ్! బాగా అడిగావు. ఆ తర్వాత? చెప్పు" రఘురాం అడిగాడు.

    "ఏముందండి? నా ప్రశ్నకి సమాధానం దొరకలేదేమో మళ్ళీ చెంప పగలగొట్టారండి. 'ఎందుకండి కొడతారు. మీరు కొట్టినంత మాత్రాన చదువు మానతానని అనుకోకండి. మాకూ చదువుకోవాలని ఉండదా? మీ పని చేశాకనే గదా చదువుకునేది. చదువుల తల్లిని మీ గొప్పోళ్ళు కొనుక్కున్నారా? ఆ తల్లి మీ గొప్పోళ్ళ సొత్తా?' అని అడిగానండి."

    "వెరీగుడ్ భలేగా అడిగావు" సపోర్ట్ చేశాడు రఘురాం. 

    "వేలెడంత లేడు. నన్నే ఎదిరించి ఎలా మాట్లాడుతున్నాడో వెధవ! నాలుగు వడ్డిస్తేగాని పొగరు దిగదు అని తన మేనజర్‌తో ఇనప చువ్వతో కొట్టించారండి. మా అమ్మా నాన్న కూడా ఎప్పుడు ఒక దెబ్బ కూడా వెయ్యలేదండి. ఇంటికిరాబోతుంటే కళ్ళు తిరిగీఅయి. అప్పుడు పడిపోయానేమో!" ఏడుస్తూ చెప్పాడు విజయ్.

    "ఊరుకో బాబూ!" అని మాత్రం అనగలిగాడు రఘురాం.

    "నేను అన్న మాటలు సబబుగా లేవా బాబూ! తప్పుగా అన్నానంటారా బాబూ!" విజయ్ రఘురాంని అడిగాడు.

    "లేదు. చాలా సబబుగా ఉన్నాయి నీ మాటలు. చిన్నవాడివైనా చక్కగా ఆలోచించావు. అన్యాయాన్ని ఖండించగల నీ ధైర్యానికి నాకు చాలా ఆనందంగా ఉంది. పద వెళ్దాం."

    "నేను వెళ్ళగలను లే బాబూ! చాలా మంచివారులా ఉన్నారు మీరు. ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరినట్టున్నారు. నా వల్ల మీకాలస్యం అయింది. మీరెళ్ళండి బాబూ!" 

    చిన్నవాడైనా చక్కగా ఆలోచించి వినయంగా మాట్లాడుతున్న విజయ్‌ని చూసి ముచ్చట పడ్డాడు రఘురాం.

    "ఫరవాలేదు" అని కారు రివర్స్ చేశాడు. కొంత దూరం వెళ్ళాక విజయ్ అన్నాడు "ఇక్కడ ఆపండి బాబూ! మా గుడిసె లోపలకుంది."

    "మనం వెళ్ళేది మా యింటికి."

    "ఎందుకు బాబూ!"

    "చెప్తాగా! తర్వాత మీ యింటికి జాగ్రత్తగా పంపిస్తాను. సరేనా! మీ అమ్మ చేత ఆయింట్‌మెంట్ రెండుపూటలా రాయించుకో. మాత్రలు రెండుపూటలా వేసుకో. తగ్గిపోతుందట. డాక్టర్‌గారు చెప్పారు" రఘురాం విజయ్‌కి చెప్పి టాబ్లెట్స్, ఆయింట్‌మెంట్ విజయ్ చేతికిచ్చాడు.

    రఘురాం వాళ్ళ ఇల్లు చేరింది కారు. అంత వరకూ కూల్‌గా మాట్లాడుతున్న అతను సడన్‌గా సీరియస్ అయిపోయాడు. 

    "నువ్విక్కడే ఉండు విజయ్!" అని చెప్పి లోపలైకి అడుగుపెడ్తూనే "ఆ మేనేజర్‌గాడేడీ" అని అరిచాడు తండ్రిని చూసి. కొడుకు ఉగ్ర రూపం చూసి భాస్కరరావుగారు ఆశ్చర్యపోయారు.

    "ఫ్రండ్‌ని కలవడానికి సిటీకి వెళ్తానని బయలు దేరావుగా! వచ్చేశావేం?" అని అడిగారు.

    "దారిలో ఒక ఘోరమీన దృస్యం చూసి వెనక్కి వచ్చేశాను."

    "యాక్సిడెంట్ ఏదైనా అయిందా?"

    "కాదు. అంతకన్నా ఘోరమే! ముందు మన మేనేజర్‌ని పిలిపించండి"

    "ఆయనెందుకిప్పుడు?"

    "కావాలి" గట్టిగా అరిచాడు రఘురాం. అతనికి ఆవేశం ఆగడం లేదు. విజయ్‌ని కొట్టించింది తన తండ్రేనని విజయ్ చెప్పినప్పుడే అర్థమయింది. అతి కష్టం మీద తన ఆవేశాన్ని ఇంతవరకూ ఆపుకున్నాడు. ఇంక ఆపుకోవడం అతని వల్ల కాలేదు. అసలే ఉడుకురక్తం ఉరకలేస్తున్న పాతికేళ్ళ యువకుడు. పైగా ఆవేశపరుడు. అతనిలో ఆవేశమే కాదు. అంతకు మించిన మంచితనమూ ఉంది.

    భాస్కరరావుగారు కోట్ల ఆస్తికి అధిపతి. ఆ కోట్ల ఆస్తీ అన్యాయంగా సంపాదించిందే. ఆయనకి డబ్బంటే ప్రాణం. పైసా ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినంత పని ఆయనకి. రఘురాం ఆయన ఏకైఅక పుత్రుడు. అతనిలో తెలివి, ధైర్యం, వాటితో పాటు ఆవేశమూ ఉంది. 'అంత ఆవేశం పనికి రాదు నీకు' అంటూ భాస్కరరావుగారు అప్పుడప్పుడూ మందలిస్తుంటారు.

    "నా ఆవేశం అనర్థాలకి దారితీసేది కాదులే! అన్యాయాన్ని ఎదిరించేదేకాని."అని ఖరాఖండీగా చెప్తాడు. ఈనాడు తండ్రి చేసిన చర్యకి అతని మనసు రగిలిపోతూంది.

    మేనేజర్ వచ్చాడు. "ఏంటి రఘుబాబూ! రమ్మన్నారట! నాతో మీకేం పని?" వస్తూనే అడిగాడు.

    "మీతో చెమ్మ చెక్కలాడదామని."

    "ఊరుకోండి బాబూ! మీ జోకులూ మీరూ!" అని నవ్వుకున్నాడు మేనేజర్.

    "నవ్వుకున్నది చాలుగాని, ఆ కారులో ఉన్న కుఱ్ఱాడిని తీసుకురండి" ఆర్డర్ వేశాడు రఘురాం.

    ఏదో అడగబోయిన  మేనేజర్‌ని వారించి "ముందు చెప్పిన పని చెయ్యండి" అని కసిరాడు.

    భాస్కరరావుకిదంతా అర్థం కాక ఆశ్చర్యంతో మౌనంగా చూస్తూండిపోయారు. కొడుకు కోపానికి కారణం ఆయనకి అంతుబట్టలేదు.

    'ఈయనగారికి ముక్కుమీదే ఉంటుంది కోపం. ఆ కోపం నా మీద చూపిస్తున్నాడంటే ఏదో కొంప మునిగిన విషయమే!' అనుకుంటూ  కారుదగ్గరకు వెళ్ళి, డోర్ ఓపెన్ చేసి, విజయ్‌ని చూసి తుళ్ళి పడ్డాడు మేనేజరు. విషయం సగం అర్థమైపోయింది. ఇంక తన పని గోవిందా!

    "దిగిరా! చిన్నబాబుగారు పిలుస్తున్నారు" గదమాయించాడు.

    "నేను రాను. మళ్ళీ కొట్టడానికా?" బెదిరిపోయాడు విజయ్.

    "కొట్టడానికి కాదులే! చిన్నబాబుగారెందుకు కొడతారు?"

    చిన్నబాబు అంటే తనని తీసుకుని వచ్చినాయన అయి ఉంటారు అనుకున్నాడు విజయ్.

    "నిజమే! ఆయన చాలా మంచి వారు" అంటూ కారు దిగి మేనేజర్ వెంట లోపలికి వచ్చాడు.

    విజయ్‌ని చూడగానే భాస్కరరావుగారు తృళ్ళిపడ్డారు. ఆ తృళ్ళిపాటుని బయటకి కనిపించనీయకుండా "వీడిక్కడికెలా వచ్చాడు?" అని అడిగారు.

    "నేనే తీసుకుని వచ్చాను నాన్నా! దారిలో ఘోరమైన దృశ్యం చూశానన్నానుగదా! అదే ఈ విజయ్, నేను వెళ్ళే దారిలో రోడ్డు ప్రక్కగా స్పృహలేకుండా పడి ఉండడం చూశాను. జాలి కలిగింది. దగ్గరకు వెళ్ళి నీళ్ళు చల్లి స్పృహ వచ్చాక క్లినిక్‌కి తీసికెళ్ళి, తనకి తగిలిన దెబ్బలకి చికిత్స చేయించి, టీ త్రాగించి..."

    అతన్ని పూర్తిగా చెప్పనివ్వకుండానే భాస్కరరావుగారు మండిపడ్డారు.

    "వాడి మీద అంత జాలెందుకు? అంత మర్యాద ఎందుకో? నీకేం ఖర్మ అదంతా చెయ్యడానికి?"

    "మీ కొడుకునై పుట్టినా  కొంత మానవత్వం ఏడ్చింది. అందుకు తెలిసిందా?" కోపంగా జవాబిచ్చాడు రఘురాం.

    "మానవత్వమా? గాడిద గుడ్డా? మన హోదా ఏమిటి? నీ చదువేమిటి?"

    "హోదాలూ, పెద్ద చదువులూ ఉన్నంత మాత్రాన ఆపదలో ఉన్న వాళ్ళకి సాయపడగూడదా? నాకవేం గుర్తు రాలేదాటైమ్‌లో. చాతనయినంత సహాయం చేయడం ధర్మం, తక్షణ కర్తవ్యం అనిపించింది. అందుకే ఫ్రండ్‌ని కలవడం రేపటికి వాయిదా వేసుకున్నాను."

    "చాల్లేరా! గొప్ప ఘనకార్యం చేశావ్! విదేశాల్లో నిన్ను గొప్పగా చదివించింది ఇలాంటి వెధవలకి చాకిరీ చెయ్యడానికా?"

    "మరీ టూమచ్‌గా మాట్లాడుతున్నారు నాన్నా! ఆపదలో ఉన్నవాడికి ఆ మాత్రం హెల్ప్‌చేయడం చాకిరీ అవుతుందా? అది సరేకానీ విజయ్ వీపుమీద దెబ్బలు చూశారా?"

    కొడుకు క్రాస్ఎగ్జామినేషన్ మొదలు పెట్టాడని అర్థమయింది. గుటకలు మింగారాయన. 

    "మేనేజర్ గారూ! మా నాన్నకి మీరు మంత్రిలాంటి వారు కదూ! ఆ దెబ్బలు ఎలా తగిలాయో మీకు తెలుసా? మన ఫాక్టరీలో పని చేసే కుఱ్ఱాడేనటగా!"

    తెలిసే అడుగుతున్నాడో, తెలియక అడుగుతున్నాడో ఇద్దరికీ అర్థం కాలేదు. భాస్కరరావుగారు , మేనేజరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

    "నేను చెప్పనా మీరు చేసిన ఘనకార్యం" ఎకెసెక్కెంగా అన్నాడు రఘురాం. "విజయ్‌కి స్పృహ వచ్చాక నేను జరిగినదంతా అడిగి తెలుసుకున్నాను. మీకెలా చేతులు వచ్చాయండీ ఇంత చిన్నవాడిని అంతగా కొట్టడానికి?"

    "అది కాదు బాబూ! నాన్నగారు..."

    "షటప్! నాన్నగారు గడ్డి తినమంటే తింటారా? మీరు మనుష్యులా? రాక్షసులా?

    "అదీ...అదీ...బాబూ...ఆ కుఱ్ఱాడు..." నీళ్ళు నమిలాడు మేనేజర్.

    "ఏం చెప్పక్కర్లేదు. నాకు తెలుసు. ఏదో కొంత చదువుకున్నాడు. తనకి వచ్చింది తన తోటి పిల్లల్కి మంచి మనసుతో నేర్పుతున్నాడు. అదీ ఖాళీ సమయంలోనే! అది చావబాదేటంత నేరమా?"

    "అబ్బే! చావబాద లేదు బాబూ! భయభక్తులతో ఉండాలని నాలుగు దెబ్బలే..."

    "అది చాలదా ఆ చిన్న ప్రాణానికి? పైగా నాలుగు దెబ్బలేనట!"

    "అదీ... నాన్నగారిని ఎదిరించి మాట్లాడాడని..."

    "అది నాన్నగారిని ఎదిరించడమా? కాదు. ధైర్యంగా అన్యాయాన్ని ఖండించడం."

    'ఓహో! అంతా వివరంగా చెప్పాడన్నమాట ఈ కుఱ్ఱవెధవ!' అనుకున్నాడు మేనేజర్.

    "వెళ్ళండి. విజయ్‌ని మన కారులో వాళ్ళింటి దగ్గర దింపిరండి"

    రఘురాం కోపానికి హడలి చచ్చి, కిక్కురు మనకుండా "అలాగే" అంటూ కదిలాడు మేనేజరు.

    "హెల్ప్ చేసిన వాడివి మళ్ళీ వాడిని మనింటికెందుకు తీసుకొచ్చావ్?" భాస్కరరావు అడిగారు కోపంగా.

    "ఎందుకా? మీరు విజయ్‌ని చావబాది వదిలేశారు. తర్వాత మీకేమీ పట్టలేదు. మీరు చేసిన పని ఎంత అనర్థమైనదో మీకు తెలియచెప్పాలని తీసుకుని వచ్చాను. ప్రాణం పోతే ఏమయ్యేది?"

    "పీడ వదిలేది" ఆయన కసిగా అన్నారు.

    "కాదు మీరు హంతకులయ్యేవారు!" ధైర్యంగా అనేశాడు రఘురాం.

    "నాన్నని అన్న గౌరవం ఏడ్చిందా నీకు? వాడెవడో దిక్కుమాలిన వెధవ నీకు దగ్గర చుట్టమైనట్టు వెనకేసుకుని వచ్చి ఇలా మాట్లాడ్తున్నావు. నా కడుపున చెడపుట్టావురా!"

    "మీ కడుపున కాదు. అమ్మ కడుపున బిడ్డగా పుట్టి పెరిగాను. అందుకే అమ్మ మంచితనం నాకు వచ్చింది. మీ పాడు బుద్ధులు  రాలేదు." 

    "మాటకి మాట అనడం తెలుసు" రుసరుసలాడుతూ వెళ్ళారు భాస్కరరావు గారు. నాలుగు రోజుల తర్వాత భాస్కరరావుగారి గుండెలో బాంబు పేల్చాడు రఘురాం.

    "నాన్నా! నాకు రెండు కోట్ల రూపాయలు కావాలి" కొడుకు మాట విని షాక్ అయ్యారు. వందో, రెండొందలో అడిగిననత తేలిగ్గా అడుగుతున్నాడు. 'రెండు కోట్ల రూపాయలే! అమ్మో!' ఆయన గుండెమీద చెయ్యి వేసుకున్నారు. "ఎందుకు అంత డబ్బు?"

    "కావాలి. ఒక సత్కార్యం తలపెట్టాను. దానికి అవసరం."

    "నేను చచ్చినా ఇవ్వను. సత్కార్యమట! నిన్ను ఫారిన్ పంపించి చదివించింది బాగా డబ్బు సంపాదిస్తావని, లక్షల కట్నం తెస్తావనిగాని ఉన్నది తగలెయ్యడానికి కాదు."

    "అదంతా నాకనవసరం. నాకు ఇచ్చితీరాలి."

    "అంతెందుకు నాన్నా! ఎంత కష్టపడి సంపాదిస్తే ఇంత ఆస్తి కూడబెట్టానో తెలుసా? ఆస్తిని వృద్ధి చేసుకోవాలిగాని తరగనివ్వగూడదు నాన్నా!" కొడుకు మొండిపట్టుదల తెలిసిన భాస్కరరావు బ్రతిమాలి తప్పించుకోవాలని చూశారు.

    "మీరెంత బ్రతిమాలినా నేనూరుకోను."

    "ఊర్కోక ఏం చేస్తావేం?"

    "చిన్నపిల్లలతో అంటే పద్నాలుగు సంవత్సరాల లోపున వయసున్న పిల్లలతో పనిచేయించుకోవడం నేరం తెలుసా?"

    కొడుకు బెదిరింపుకి దిగుతున్నాడని ఆయన గ్రహించారు. మనసులో కొంచెం బెరుకు పుట్టినా పైకి బింకంగా అన్నారు. 

    "నేనేం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి 'రండి బాబూ' అని పిలిచి చాకిరీ చేయించుకున్నానా? తిండికి గతిలేక వాళ్ళ పిల్లలని కూలికి పెట్టారు. నా తప్పేం ఉంది ఇందులో?"

    "అయినా సరే! చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం అది నేరమే! ఒక్క కంప్లెయింట్ ఇస్తే చాలు. కేస్ బుక్ చేస్తారు. ఫాక్టరీ మూత పడిపోయినా పడిపోవచ్చు!"

    "బెదిరింపా? నామీదే కంప్లెయింట్ ఇస్తావా?"

    "అంతదాకా ఎందుకు? మీరు నేను అడిగినంత యిస్తే ఏ గొడవా ఉండదుగదా!"

    "నువ్వేం చేసినా నేనివ్వను. నీకు అన్నీ సమకూర్చాను. ఇంక నీకు డబ్బు అవసరమేమిటి?"

    "చెప్పానుగా ఒక మంచి పని తలపెట్టానని."

    "నువ్వేం తలపెడితే నాకెందుకుగాని, నేను చచ్చినా డబ్బివ్వను. డబ్బు నా ప్రాణం."

    "ఆ ప్రాణం పోయినప్పుడు డబ్బంతా మూట గట్టుకుని పట్టుకెళ్తారా? ఎందుకు నాన్నా డబ్బు మీద అంత వ్యామోహం. ఒక మంచి పనికి ఉపయోగపడితే మీ డబ్బుకి సార్థకతా ఉంటుంది. మీకూ మంచితనం మిగులుతుంది" తండ్రిని ఒప్పించాలని అన్నాడు రఘురాం ఆఖరి ప్రయత్నంగా.

    "నాకు నీతులు చెప్పకు. నాకే మంచితనమూ అక్కర్లేదు" ఆయన గయ్యిమన్నారు.

    "అయితే నా నిర్ణయం చెప్తాను. మీరు నాకు రెండుకోట్ల రూపాయలు ఇవ్వనంటే, నేను నిరాహారదీక్ష చేస్తాను." రఘురాం మాటలు విని ఆయన ఉలిక్కి పడ్డారు. 'అమ్మ వెధవ! ఎంత ఎత్తువేశాడు' అనుకున్నారు.

    "నా ప్రాణం పోయినా ఫరవాలేదు అనుకుంటే సరే! మీరు అంగీకరించే వరకూ పచ్చి మంచినీళ్ళయినా ముట్టను. మన గేటు ముందే చేస్తాను. ఆ తర్వాత మీకు కొడుకూ ఉండడు. పరువూ ఉండదు. ఆలోచించుకోండి." ఇంకా హడలి పోయారాయన. తలపట్టుకుని కూర్చున్నారు.

    "రెండురోజులలో ఆలోచించుకోండి డబ్బు ముఖ్యమో! నేను ముఖ్యమో!" అనేసి విసురుగా వెళ్ళిపోయాడు రఘురాం.

    'మొండి వెధవ! వీడిలా సాధించుకుంటున్నాడు. నా డబ్బుకి చిల్లు పడడం ఖాయం. అన్నంతా చేసే రకమే వెధవ!' ఆయన సణుక్కుంటూ లోపలికి వస్తుంటే భార్య అడిగింది 'ఏమయిందండీ' అని.

    "నీ కొడుక్కి రెండు కోట్లు కావాలట!" కోపంగా చెప్పారాయన.

    "పోనీ ఇవ్వరాదూ! బీరువా నిండా దాచుకున్నారుగా!" అందావిడ.

    "తొడుక్కొనే కోట్లు కాదే పిచ్చి మొహమా! రెండు కోట్ల రూపాయలు. మంచి పని ఒకటి వెలగబెడ్తాడట."

    "మంచి పనికా? మరింకేం? ఇవ్వచ్చుగా! పోయేటప్పుడు పట్టుకుపోతామా? మనం చస్తే కట్టెలతో దహనం చేస్తారుగాని, నోట్ల కట్టలతో కాదుగదా!"

    "నోర్ముయ్!" భార్యని కసిరారాయన. "కన్నావు గొప్ప ప్రభుద్ధుణ్ణి!"

    "అలా అంటారేం? వాడికేం చాకులాంటి వాడు. మంచి భావాలు కల వాడు. అళాంటి వాడు కుటుంబానికి ఒక్కడున్నా చాలు దేశం సగం బాగుపడినట్టే!"  

    "ఛ! నోర్ముయ్! డబ్బు నష్టమని నేనేడుస్తుంటే నువ్వేమిటి? నీ చచ్చు అభిప్రాయాలు నా దగ్గర వెలిబుచ్చకు. పో అవతలకి." కసిరి కొట్టారాయన. 

    కొడుకు నిర్ణయానికి భయపడి ఒప్పుకోక తప్పలేదాయనకి. కొడుకు మొండిపట్టుదల, పుత్ర ప్రేమ అతి కష్టంమీద ఆయనను ఒప్పుకునేటట్టు చేశాయి.

    కొద్దిరోజులకి తెలిసిన వాళ్ళు తనని "భాస్కరరావుగారూ! పేదపిల్లలకి స్కూల్ కట్టిస్తున్నారటగా!" అని అడిగినప్పుడు ఆయనకి అర్థమయింది కొడుకు తలపెట్టిన మంచి పనేమిటో! బయటకు వెళ్తే తనని తెగ పొగిడేస్తున్నారు. ఏ నోటవిన్నా తన ఉదారత గురించే! తనది జాలిగుండె అనీ, దయామయుడనీ, అంత ఖర్చుపెట్టి అంత మంచిపని చేయడమంటే ఎంత విశాల హృదయం కావాలి? మీ ఆశయం చాలా గొప్పది అని పొగుడ్తుంటే, ఆ పొగడ్తలు చాలా ఆనందాన్నిస్తున్నయి కాని, రెండుకోట్ల రూపాయలు పరోపకారానికి తగలేయాల్సి వచ్చిందే అన్న బాధకూడా ఉంది.

    రఘురాం తన ఫ్రండ్స్ అందరినీ చేర్చి అందరికీ తలా ఒక పని అప్పచెప్పి, పాఠశాల నిర్మాణానికి స్థలం కొనడం, అందుకు కావలసిన సామాగ్రిని కొనడం వగైరా పనులన్నీ చకచకా చేశాడు. కొన్ని నెలలకే స్కూల్ తయారయింది. 

    'భాస్కర బాల విద్యాలయం' అని పేరు పెట్టాడు. రఘురాం ఆ విషయం విన్న భాస్కరరావుగారికి, తనకి తరతరాలా మిగిలిపోయే పేరు ప్రఖ్యాతులు కొడుకు తెచ్చిపెట్టాడన్న సంతోషం కలిగింది.

    ఒక మంచి రోజు చూసి ప్రారంభోత్సవం ఏర్పాటు చేశాడు రఘురాం. తల్లినీ, తండ్రినీ తీసికెళ్ళి, తల్లిచేత సరస్వతీ దేవి పటం ముందు జ్యోతిని వెలిగింపచేశాడు. పెద్దలూ, పిల్లలూ చాలామంది హాజరయ్యారు. వాళ్ళలో విజయ్ కూడా ఉన్నాడు.  రఘురాం మేనేజర్‌ని పంపించి విజయ్‌ని రప్పించాడు. పెద్ద్లందరూ పేదబాలలకు స్కూల్‌ని నిర్మించినందుకు హర్షం వ్యక్తం చేశారు. కొందరు పెద్దలు భాస్కరరావుగారిని ఆకాశానికెత్తేస్తూ ఆయన కరుణాహృదయాన్ని మెచ్చుకుంటూ మాట్లాడారు. అదంతా ఆయనకి కొంచెం ఇబ్బందిగానే ఉంది. తన ఘనత ఏమీ లేదు మిందులో. అంతా కొడుకు గొప్పతనమే! ఒకాయన వచ్చి భాస్కరరావుగారి మెడలో పూలదండవేయబోయారు. 'ఒక్క నిమిషం!' అని ఆయన ఆ పూలదండని అందుకుని 'ఈ స్తకారానికి నేను అర్హుడనుకాను. నిజానికి ఈ సత్కార్యం తలపెట్టింది నా కొడుకే! వాడికి సహకరించకపోగా ముందు వ్యతిరేకించినందుకు ఇప్పుడు నాకు చాలా సిగ్గుగా ఉంది" అంటూ ఆ దండని రఘురాం మెడలో వేయబోయారు. అతను ఆ దండను అందుకుని ప్రక్కన పెట్టాడు. సభికులందరినీ నమస్కరించి మాట్లాడడం మొదలు పెట్టాడు.

    "మనదేశంలో చాలా మంది నిరుపేద బాలలు తిండికి లేక చదువు లేక గత్యంతర పరిస్థితిలో బాలకార్మికులుగా బ్రతకాల్సి వస్తుంది. చదువుకోవాలని అభిలాష, ఆశ వున్నా వాటిని చంపుకుని నిరక్షరాస్యులై, నిర్భాగ్యులుగా మిగిలిపోతున్నారు. మనదేశంలోని అందరి పిల్లలనీ ఎలాగూ ఉద్ధరించలేం. మన వూరి పేదపిల్లలకైనా చదువుకునే అవకాశం కల్పించి, ఉచితంగా విద్యాబోధన చేయించి వాళ్ళని విద్యావంతులుగా చేయగలిగితే మన ఊరికి ఉపకారం చేసినట్టే గదా! అందుకే పేద బాలలకై ఈ విద్యాలయాన్ని నిర్మించడం అయింది. నా చదువు పూర్తి అయ్యాక, నేను సంపాదనాపరుడిని అయ్యాక నా సంపాదనలో కొంత ఈ స్కూల్ అభివృద్ధి నిమిత్తం ఉపయోగిస్తాను. ఇది నా ధృఢసంకల్పం. మీలో ఎవరైనా ధర్మాత్ములుంటే ఇవ్వగలిగి, ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఉంటే, మీకు తోచిన ధనసహాయం చేయవచ్చు. మీ సహాయం ఈ స్కూల్‌ని ఇంకా అభివృద్ధి చేయడానికి దోహద పడ్తుందని నా అభిప్రాయం.

    సభలో హర్షాతిరేకంతో కరతాళధ్వనులు మారుమ్రోగాయి రఘురాం ప్రతిపాదనికి ఆమోద సూచకంగా. రఘురాం తన మాటలని కొనసాగించాడు.

    "ఈ స్కూల్‌ని నిర్మించాలన్న ఆలోచన కలిగించింది ఒక చిన్న బాలుడు" అని విజయ్‌ని డయాస్ మీదకి రమ్మని పిలిచి, "ఈ విజయ్‌ని కలవడం వల్ల నాకు ఈ మంచి ఆలోచన తట్టింది. చదువుకోనివ్వని తన యజమానిని 'చదువు మీ గొప్పోళ్ళ సొంతమా? చదువుల తల్లిని మీ ధనవంతులు కొనుక్కొన్నారా? ఆ తల్లి మీ సొత్తా?' అని ధైర్యంగా అడిగాడు. 'చదువు మీగొప్పోళ్ళ సొంతమా?' అని విజయ్ అడిగిన ప్రశ్నకి మీలో ఎవరిదగ్గరైనా సమాధానం ఉందా?" రఘురాం ప్రశ్నకి అందరూ ఆశ్చర్యంతో ఖిన్నులై మౌనంగా ఉండిపోయారు.

    "ఉండదు. నాకు తెలుసు. ఆ ఒక్క మాటే నా మనసుని తాకి మంచి ఆలోచన కలిగించింది. ఆ ఒక్క మాటే ఈ పాఠశాలని నిర్మించాలన్న ధృఢసంకల్పానికి కారణమయింది. ఆ ఒక్క మాటే ఈ పాఠశాల నిర్మాణానికి మొదటి పునాది రాయి అనుకోవచ్చు. చిన్నవాడైనా చక్కగా ఆలోచించి ధైర్యంగా అనగలిగాడు. అందుకే విజయ్‌కే ఈ సత్కారం సమంజసం" అంటూ పూలదండ విజయ్ మెడలో వేశాడు రఘురాం.

    చిన్న పెద్ద అందరూ ఆనందోత్సాహాలతో క్లాప్స్ కొట్టారు.

    ఆ అవ్యక్తమైన సంతోషాన్ని చూసి భాస్కరరావుగారికి కొడుకు చేసిన ఈ మంచి పని ఎంతమందికి సంతోషం కలిగించిందో! అనిపించింది. ఒక మంచి పని చేయడంలో ఇంత సంతోషముంటుందని ఆయనకి అప్పుడే అర్థమయింది. నా సిరిసంపదలు నా ఒక్కడినే సంతోష పెట్టాయి. నా కొడుకు చేసిన ఈ సత్కార్యం ఇంతమందికి సంతోషాన్ని కలగజేసింది. ఇంక ముందు నా పంథాని మార్చుకోవాలి అనుకున్నారాయన మనస్ఫూర్తిగా. 

    'పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కలుగదు. జనులా పుత్రుని కనుగొని పొగడగ ...' అన్న పద్యం గుర్తు వచ్చిందాయనకి. ఆయన హృదయం పుత్రప్రేమతో పొంగిపోయింది.

    'నేను గర్వించదగిన కొడుకువి నాన్నా!' అని హృదయపూర్వకంగా అనుకున్నారు.

    'భాస్కర బాల విద్యాలయం వర్ధిల్లాలి' అనే నినాదంతో ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనించింది.

    'వర్ధిల్లడానికి నా వంతు కృషి నేనూ చేయాలి. చేసి తీరతాను' అని మౌన ప్రతిజ్ఞ చేసుకున్నారు భాస్కరరావుగారు.

         

   
Comments