ఆ రచయితను నేనే - పొత్తూరి సుబ్బారావు

    
ఘాట్‌ రోడ్‌ పైకెళ్తూ జీపును డ్రైవర్‌ ఒక పక్కకు ఆపాడు. ఓ కొబ్బరికాయ తీసుకెళ్లి కొండల మధ్యలో వున్న ఒక దేవత శిలావిగ్రహం ముందు కొట్టాడు. ఆ తర్వాత వచ్చి కారు స్టార్ట్‌ చేశాడు. జీపులో ఉన్న రచయిత మధుకర్‌ ప్రశ్నించాడు డ్రైవర్‌ని.

    ''ఏమిటి అక్కడ వున్నది? అందరూ కార్లను ఆపి మరీ కొబ్బరికాయ కొట్టి ముందుకు సాగుతారు'' అని.

    ''అవును సార్‌. అక్కడవున్న విగ్రహం ముందు కొబ్బరికాయ కొట్టి ముందుకు సాగితే ఈ ఘాట్‌రోడ్‌లో మనకే ప్రమాదం జరగదు'' అన్న డ్రైవర్‌ జవాబుకు ఆశ్చర్యంగా మళ్లీ అడిగాడు మధుకర్‌.''అవును ఇక్కడ ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాలన్నీ కొబ్బరికాయ కొట్టకపోతేనే జరిగివుంటాయంటావా?''

    ''ఏమో సార్‌ నాకు తెలియదు. మాకందరికీ అదో నమ్మకం'' అన్న డ్రైవర్‌ సమాధానానికి మళ్లీ మాట్లాడలేదు మధుకర్‌......... 

    మధుకర్‌ తాను చేరాల్సిన ఏజన్సీకి చేరగానే అక్కడ పని చేస్తున్న ప్రాజెక్టు ఆఫీసర్‌ తన చిరకాల మిత్రుడు రవిశంకర్‌తో అనేక విషయాలు చర్చిస్తూ ఆ దేవతా విగ్రహం ప్రసక్తిని తీసుకొచ్చాడు.

    ''అవున్రా! ఇక్కడ వున్న గిరిజనులు అక్కడ అమ్మవారు వెలిసిందంటూ ఎప్పుడూ మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఆ దృశ్యాలను సిటీ నుండి ఘాట్‌రోడ్‌లో ప్రయాణించే డ్రైవర్లు చూసి అక్కడ కొబ్బరికాయలు కొట్టడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అదే ఒక ఆచారం అయిపోయింది. ఒక వేళ డ్రైవర్లు మరిచిపోయినా కార్లలో కూర్చున్న ప్రయాణికులు ఎంత చదువుకున్న వారైనా దేవతా విగ్రహం జ్ఞాపకం చేయటం కూడా ఆనవాయితీ అయిందన్న రవిశంకర్‌ మాటలకు మధుకర్‌ నివ్వెరపోయాడు.''అయినా గిరిజనులకే అనుకుంటే అంతకన్నా మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయి ఈ చదువుకున్నవాళ్లకి'' అని మనసులోనే అనుకుంటూ నిద్రలోకి జారిపోయాడు మధుకర్‌.

    తెల్లవారగానే ప్రాజెక్టు ఆఫీసర్‌ రవిశంకర్‌ ఏర్పాటు చేసిన మీటింగులో ఎందరో జర్నలిస్టులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఆ మీటింగులో గిరిజనుల సమస్యలతో పాటు ఘాట్‌రోడ్‌ దారిలో జరిగే అమ్మవారి పూజలు కూడా చర్చకు వచ్చాయి. చర్చలో భాగం పంచుకుంటూ ఆ ప్రాంతానికి చెందిన ఎం.ఎల్‌.ఎ కేశవనాయక్‌ మాట్లాడుతూ ''ఎట్లాగైనా అక్కడున్న అమ్మవారికి గుడి కట్టించాలి. గుడి కట్టించాలంటే నిధులు కావాలి. నిధులు సమకూర్చుకోవాలంటే అక్కడి స్థల మహత్యాన్ని ప్రజలకు తెలియజేయాలి. అందుకు ఈ విషయం మీద పరిశోధన చేసి 'స్థల పురాణం' రాయగలిగే సమర్థవంతమైన రచయిత అవసరం'' అనగానే ప్రాజెక్టు ఆఫీసర్‌ రవిశంకర్‌ సమాధానం చెపుతూ ''దేవాదాయశాఖనుండి కొన్ని నిధులు సమకూర్చగలిగితే మంచి రచయితను చూసి స్థల పురాణం నేను రాయించగలను'' అన్నాడు. అందుకు ఎం.ఎల్‌.ఏ 'నిధుల విషయం హైదరాబాదుకు వెళ్లి నేను మంజూరు చేయించగలుగుతాను. మీరు స్థల పురాణం రాయించడం మొదలు పెట్టండని 'ప్రాజెక్టు ఆఫీసరుకు ఆదేశాలిస్తూ సభాస్థలి నుండి వెళ్లిపోయాడు.

    మరుసటిరోజు ఈ విషయం రచయిత మధుకర్‌తో చిర్చంచాడు రవిశంకర్‌...

    ''నేను అభ్యుదయ భావాలు గల వాడనని నీకు తెలుసు. నన్నే స్థల పురాణం రాయమని అనడంలో అర్థం లేదు'' అన్న మధుకర్‌ మాటలకు నవ్వుతూ రవిశంకర్‌ ''నీ నమ్మకాలతో ఇక్కడ పనిలేదు. మహాకవి శ్రీశ్రీ వంటివారే సాయిబాబా మీద భక్తి గీతాలు రాశారు. అయినా ప్రభుత్వం తరుపు నుండి పదివేల దాకా నీకు పారితోషకం మంజూరు చేయిస్తాను. నీకు దైవభక్తి లేకపోయినా కొత్త విషయాన్ని క్రియేట్‌ చేయగల సృజనాత్మక శక్తి నీలో వుంది. కాదనకు. చక్కని సౌందర్యాన్ని సంతరించుకున్న ఈ అటవీ ప్రాంతంలో ఒక దేవాలయం కడితే అది కేవలం దైవభక్తులకే కాదు, ఒక గొప్ప టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. అక్కడి నుండి వచ్చే ఆదాయాన్ని గిరిజనుల సంక్షేమానికి వినియోగించుకోవచ్చు. నీ పేరేమీ ఆ పుస్తకం మీద వేయం. నీకేమీ అపకీర్తి రాదు. దేవాదాయశాఖ పేరుతోనే బుక్‌లెట్‌లు ప్రచురిస్తాము'' అనగానే మధుకర్‌ కొంత చల్లబడి రచనకు ఉపక్రమించాడు.

    ప్రతి ఏటా నెల రోజులపాటు ఆ ఏజెన్సీ ప్రాంతంలోని అమ్మవారి గుడికి దేశమంతటి నుండి విశేషంగా జనం రావడం మొదలయింది. దానితో ఘాట్‌రోడ్‌లో వాహన రద్దీ పెరిగిపోయింది. వాహనాల రాక పోకల కోసం రోడ్లను బాగా వెడల్పు చేశారు. సర్వవిధాలా ఆ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతున్నది. 'స్థల పురాణం'లో చెప్పిన విధంగా నెల రోజులు భక్తులంతా దీక్షను స్వీకరించి ఆ తరువాత అక్కడ దీక్షను విరమించడం మొదలు పెట్టారు. దీక్ష వల్ల తమకు కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విపరీతంగా కానుకలు సమర్పించడంతో ఆ దేవాలయానికి ఆదాయం లెక్కకు మించి పెరిగిపోయింది. ఒకప్పుడు గిరిజనులంతా అక్కడ తాము పూజించే విగ్రహం మటుమాయమైపోయింది. ఆ స్థానంలో బంగారు విగ్రహం వెలిసింది. వి.ఐ.పిల రద్దీ ఎక్కువ కావడంతో స్థానిక గిరిజనులను ఆ ఆలయానికి క్రమేణా దూరంగా వుంచడం మొదలుపెట్టారు. వాళ్లు కేవలం అక్కడ అటవీ ఉత్పత్తులను అమ్ముకుని డబ్బు తీసుకోవడానికి పరిమితమైనారు.

    మధుకర్‌ ఆలోచనలో పడ్డాడు. తాను చేసిన పని ఈ విధంగా దారి తీస్తుందని కలలోకూడా అనుకోలేదు. గిరిజనులు, దారినపోయే వాహనదారులు, అమాయకంగా కొలిచే ఆ దేవతావిగ్రహం రూపు రేఖలు మారిపోవడానికి తన రచనే కారణం కదా! అని పశ్చాత్తాప పడసాగాడు మధుకర్‌. 'రవిశంకర్‌ చెప్పిన మాటలతో డబ్బుకు ఆశపడి ఎంత పనిచేశాను. అయినా ఈ విషయం ప్రజలకు చెప్పాలి' అనుకుంటూ దేవాలయ ప్రాంగణానికి వచ్చిన మధుకర్‌ గట్టిగా అరవసాగాడు ''ఆ స్థల పురాణం అంతా అబద్ధం, మోసం, దాన్ని నేనే రాశాను. ఆ రచయితను నేనే" అనగానే భక్తులంతా చుట్టూ మూగారు. 

    ''నీవు స్థలపురాణం రాయడమేమిటి? ఈ స్థల పురాణం ఎప్పుడో మన పురాణాల్లో రాసి వుంది. పోవయ్యా పో! ఇక్కడున్నావంటే జనం నిన్ను చితకబాదుతారు" అని దేవాలయ కార్యనిర్వహణాధికారి అనగానే మధుకర్‌ పిచ్చిపట్టిన వాడిలాగా "ఆ రచయితను నేనే...నేనే...'' అంటూ పరిగెత్త సాగాడు.

(ప్రజాశక్తి ఆదివారం అనుబంధం 3 జనవరి 2010 సంచికలో ప్రచురితం)
Comments