ఆ రోజు... - కె.ఎ.మునిసురేష్ పిళ్లె

    
లీపు సంవత్సరాల కేసులో మినహా సంవత్సరానికి మూడువందల అరవయి ఐదురోజులే ఉంటాయి. ఈ లెక్కన గణించి చూస్తే మనం కొన్ని వేల రోజులే జీవిస్తాం! కానీ ఈ వేల రోజుల్లో మధురస్మృతులుగా మిగిలిపోయేవి కొన్ని మాత్రమే ఉంటాయి. వసంతంలో కోయిల ఆగి ఆగి పాడినట్లు ఆ స్మృతులు అపుడపుడూ హృదయాన్ని పలకరింపజేస్తూంటాయి. 

    ఆ రోజు

    అప్పుడు మేం పదో తరగతే

    ‘మేం’ అంటే నేనూ సరోజినీ అన్నమాట! ఆరోజు స్వాతంత్య్రదినోత్సవం! స్కూల్లో నా చొక్కామీద జాతీయపతాకాన్ని గుండుసూదితో గుచ్చుతూ అంది సరోజిని. 

    "కుక్కలూ జీవిస్తాయి. నక్కలూ జీవిస్తాయి...! కానీ దేశంకోసం దేశవసేవలో జీవించడం లోనే మన గొప్పదనం బయటపడేది!

    ఏం చేశారని గాంధీని నేతాజీని మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పూజిస్తూనే ఉన్నాం.

    ఏమీ చేయకున్నా, ఏం చేస్తారని మనం ఈనాడు సంఘంలో రాజకీయ నాయకుల్ని అంతో ఇంతో గౌరవిస్తున్నాం.

    ఏం చేయాలని దేశంలో ఇన్ని స్వచ్ఛంద సేవాసంఘాలు విరివిగా పుట్టుకొస్తున్నాయి...

    అదే...  ఆ దేశసేవనే మనమూ చేయాలి! స్వాతంత్య్రాన్ని పెద్దలు సంపాదించిన ధనంలా భద్రంగా దాచుకుని పూజలు చేస్తూ కూర్చోకూడదు. దాన్ని ఫలితాలు అందరికీ అందేలా ప్రయత్నించాలి." 

    ముందురోజు మా సోషల్‌ టీచరు చెప్పిన పాఠాన్ని నా దగ్గర గడగడా అప్పజెప్పేసి తుర్రున వెళ్లిపోయింది సరోజిని. 

    సరిగ్గా ఈ పాయింట్‌ దగ్గరే నాకూ సరోజినికీ ‘మంచి స్నేహం’ కుదిరింది!

    సాన్నిహిత్యం ఏర్పడడానికి సారూప్యత అవసరం కదా!

    నాకూ  సరోజినికీ ఉన్న భావసారూప్యత అదొక్కటే.  దేశాభిమానం... దేశసేవ చేయాలనే తపన!

    నిజానికి కూడా ఆ కాలం నాటి పిల్లల్లో దేశాభిమానం కొంచెం ఎక్కువగా ఉండేది. సరోజిని స్వాతంత్య్ర సమరయోధుల ఇంటి అమ్మాయి. వాళ్ల తాత  స్వాతంత్య్రోద్యమంలో పోలీసుల లాఠీ దెబ్బలకే మరణించాడట. (చచ్చే నాటికి ఆయన బాగా ముసలి వాడనీ...  ఉద్యమంలో పాల్గొనకున్నా మరో రెండు రోజుల్లో మరణించి ఉండేవాడని మా తాత చెప్పాడు) సరోజిని నాన్న మాత్రం నిజమైన స్వాతంత్య్ర సమరయోధుడు(ట!)

    మా కుటుంబం అలా కాదు. మాకు జమీందారీ ఉండేది. బ్రిటిష్‌ పాలనను వ్యతిరేకించి స్వాతంత్రోద్యమంలో భాగం పంచుకుందామంటే జమీందారీ పోతుందేమోనని భయం. అయినా చాటుమాటుగా అపుడపుడూ ఉద్యమ నాయకులకి ధన సహాయాన్ని అందిస్తూ ఉండేవాళ్లట. స్వతంత్రం రాగానే మా నాన్న నాకు గల ‘అదేదో.. వర్మ’ అన్న పేరు తీసేసి ‘ఆజాద్‌’ అన్న పేరు పెట్టాడు. దేశాభిమానం అన్నమాట! (ఈ విషయాలన్నింటినీ మా తాత ద్వారా తెలుసుకున్నాను`) ఆ విధంగా నాక్కూడా దేశభక్తి, దేశాభిమానమూ ఇవన్నీ జన్మతో ప్రారంభమై వయస్సుతోపాటూ పెరుగుతూ వచ్చాయి!

    అసలు మేం చిన్న పిల్లలప్పుడు ఆడుకునే ఆటలు కూడా మామూలుగా ఉండేవి కాదు. కొంతమంది గ్రూప్‌గా ఏర్పడి బ్రిటిష్‌ వాళ్లుగా, మరికొంతమంది స్వతంత్య్ర పోరాట వీరులుగా ఊహించుకుని పోట్లాడి ఆనందించుకునేవాళ్లం. తమాషా ఏంటంటే.. నేను బ్రిటిష్‌ వాడిలాగా ఎన్నడూ నటించి ఆడుకోలేదు! బ్రిటిష్‌ వాడి వేషం వెయ్యడం నాకు నచ్చేది కాదు! ఏదో ఒక కారణం చెప్పి ఆ రోజులలో ఆడడానికి వెళ్లేవాడిని కాదు. 

    పెద్దయ్యాక కూడా దేశానికి సేవ చెయ్యాలనే ఆశ ఆశయాలు మాలో చాలా మందికి ఉండేవి. (కోతినుంచి ఉద్భవించిన మానవుడి పరిణామ క్రమంలో రానురానూ తోక చిన్నదయిపోయి` చివరికి మనదశ వచ్చేసరికి మాయమైపోయినట్లు` రానురానూ మా ఫ్రెండ్స్‌లో కూడా ఆ ఆశలూ ఆశయాలూ క్రమంగా అంతరించిపోయి ఈ నాటికి ఎవరి బ్రతుకు తెరువులలో వారు లీనమైపోయారు. ఒక్క నేను మినహా)

    అలా ఆ స్వాతంత్య్రదినోత్సవం రోజు సరోజిని ఇంటికి వెళ్లిపోయిన తరువాత... నేను మళ్లీ సరోజినిని చూళ్లేదు.

    వయసుకు సంబంధించిన ఉపద్రవమేదో ముంచుకు వచ్చిందని సరోజినిని వాళ్ల ఇంట్లో స్కూలు మాన్పించేశారు. బయట కనిపించడం కూడా గగనమే అయిపోయింది. 

    నేను రోజూ స్కూలుకి గుర్రపు బగ్గీలో వెళ్లి వచ్చేవాడిని కాబట్టి సరోజినిని చూడడానికి కూడా అస్సలు సాధ్యపడలేదు. కానీ సరోజిని జ్ఞాపకమొచ్చినప్పుడంతా మనసులో ఏదో మూల పీకుతున్నట్లుగా ఉండేది. 

    ఆ రోజు

    జీవితమంతా పంచుకోవాలనుకున్న సరోజినిని దాదాపు చివరిసారిగా చూసిన ఆ స్వాతంత్య్ర దినోత్సవ రోజుని ఎలా మరచిపోగలను.

    కొన్ని సంవత్సరాలపాటూ సరోజినిని చూడకుండా ఉండిపోగలిగానంటే` ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడు ఈనాటికి కూడా నాకు ఆశ్చర్యమేస్తుంది. 
కొన్నాళ్లకి సరోజిని వాళ్ల నాన్నకి వేరేవూరు బదిలీ అయి సకుటుంబ సమేతంగా వెళ్లిపోయారని నాకు తెలిసింది. శరీరం ‘లోపల’ పిడికెడంతటి సున్నితమైన భాగానికి తీవ్రమైన శరాఘాతమేదో తగిలినట్లనిపించింది.

* * * 

    పెద్దవాళ్లం అయిపోయాం.

    మీసాలు, పరికిణీలు, చీరలు మొదలైతే పెద్దవాళ్లయిపోయినట్లే కదా!

    నాకూ సరోజినికీ మధ్య అపుడపుడూ ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తుండేవి. తను పదో తరగతి కూడా పూర్తి చేయకుండానే మానేసింది గానీ.. లోకజ్ఞానాన్ని మాత్రం బాగా పెంపొందించుకుంటున్నట్లు లెటర్స్‌ చూస్తుంటే తెలుస్తూండేది. 

    ఆ మధ్య ఓ ఉత్తరంలో రాసింది.

    "డియర్‌ జాదూ! (నన్ను సరోజిని అలా సంబోధిస్తుండేది)

    నేనీ మధ్య ఒక దళిత మహాసభకు వెళ్లాను! ఫలానా రాజకీయ పార్టీకి చెందిన ఫలానా దళిత నాయకుడు వీరావేశంతో ప్రసంగించాడు. లక్షల మంది సభికుల చేత ‘చప్పట్లు’ కొట్టించుకుని సెభాషనిపించుకున్నాడు` ఇన్ని రాష్ట్రాలలో ఇన్ని కోట్ల మంది దళితులు నిరక్షరాస్యులనీ.. యే మాత్రం ప్రగతికి నోచుకోలేకుండా ఉన్నారనీ` ఈ సమస్య పరిష్కారం కోసం లక్షలాది మంది తమ పార్టీ కార్యకర్తలతో తాము ఉద్యమాలు చేయనున్నామనీ అన్నాడు. ఆయనన్ను విడిగా కల్సి నేను "ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించే బదులు మీ కార్యకర్తలతో మీరే కృషించి వారిని అక్షరాస్యులు చేయచ్చుకదా!" అని అడిగాను!

    "మీరు విలేకరా?" అని అడిగాడాయన టీ అందిస్తూ...

    "కాదు. ఊరకే తెలుసుకుందామని అడిగాను" అన్నాన్నేను. టీ వద్దన్నట్లు తలాడిస్తూ. 

    ‘ఇక దయచేయి’ అన్నట్లు ఆయన లేచి నిలబడ్డాడు. టీకప్పును తన సర్వెంట్‌ చేతికిచ్చేసి "నా టైం వేస్ట్‌ చేస్తున్నారు" అంటూ మరో మాట మాట్లాడకుండా లోనికెళ్లిపోయాడు..!!
 
    ఈ ఉదంతం చాలనుకుంటాను. 

    ఇలాంటి నాయకులతో ఈ దేశం మరో శతాబ్దానికయినా బాగుపడుతుందన్న నమ్మకం నాకు లేదు. బాగు చెయ్యాలన్న కోరిక చావడం లేదు. మనమంతా కలుద్దాం! ప్రయత్నలోపం లేకుండా కృషి చేద్దాం!!

నీ     
సరోజిని"   

    సరోజిని రాసే లెటర్లన్నీ దాదాపు ఇలాగే ఉండేవి. ఎప్పుడూ దేశసేవ గురించే రాసేది! నేనెక్కడ మరచిపోతానో అన్నట్లు ప్రతి లెటర్‌లోనూ ‘నీ సరోజిని’ అని వ్రాసేది!

    సరోజిని నాకు రాసే లెటర్లతో తృప్తిపడేది కాదు. పత్రికలకు కూడా తరచుగా రాస్తూండేది...

    దేశంలో దారిద్య్రం తొలగిపోవాలంటే ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి! స్వచ్ఛంద సేవా సంస్థలు ఎలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలి అనే విషయాలే అందులో ప్రధానంగా ఉండేవి!

    ఇల్లు దాటి బయటికి రాలేకపోయినప్పటికీ (క్రమశిక్షణ కారణంగా!!?) తను చేయగలిగిన సేవనంతటినీ చేసింది` గాంధీజీ, నేతాజీ లాంటి నాయకులందరూ కల్సి స్వాతంత్య్రాన్ని తీసుకువచ్చి తన భుజాల మీదే పెట్టినట్లుగా భావించుకునేది!

    ఆ ‘నా సరోజిని’ వాళ్ల బంధువుల పెళ్లికి గానూ  మరో వారం రోజులలో మా ఊరికి రానున్నదని ఒక ఉత్తరరాజం ఆనంద వీచికలను మోసుకొచ్చింది!

* * * 

    పారిజాతం పువ్వులాగా ఉంది సరోజిని!

    పారిజాతం కాదు. దాన్ని దివినుండి భువికి తెప్పించిన సత్యభామ గొప్పది. ఛఛ.. దానికన్నా భువికి తీసుకువచ్చిన శ్రీకృష్ణుని ప్రేమ గొప్పది.. అలా.. ఆ ప్రేమ లాగా ఉంది సరోజిని. 

    ఆ మాటే సరోజినితో అంటే

    "ఆ ఊబిలో పడ్డావన్నమాట" అంది. ఆ తర్వాత ఆ విషయం నేనేం మాటాళ్లేదు. 

    ప్రజలకు సేవ చేయడానికి తను వేసుకున్న ప్రణాళికలు అని నాకు ఏంటేంటో వివరించింది! సేవ చెయ్యడానికి అన్నిటికన్నా ముఖ్యంగా అంకిత హృదయం కావాలంది! డబ్బు ఆ తర్వాతేనంది! హృదయమున్న పదిమంది ఉంటేచాలు మరో పదివేలమందిలో ఈ భావనను ‘రగిల్చ’గలరంది! ఆకలేసే వాడికి అన్నం పెట్టాలి.. అజ్ఞానికి అక్షరం నేర్పించాలంది.  ఇలా ఎన్నెన్నో విషయాలు చెప్పింది. 

    సరోజిని మాటల వలన నేనుఎంత మాత్రం స్ఫూర్తి పొందానో తెలియదు గానీ.. సరోజిని మాటలలోని ఆత్మవిశ్వాసం చూస్తూంటే నాకు ముచ్చటేసింది. 
చివరికి తను రైలెక్కేముందు మేమిద్దరం ఒక కృతనిశ్చయానికి వచ్చాం! ఆశయసాధన కోసం కలిసి ఉండడానికి` వచ్చే భద్రాద్రి రాముని కల్యాణ ముహూర్తానికి ‘పెళ్లిచేసుకోవాలని’

* * * 

    మాది జమీందారీ వంశమే అయినా వాళ్లది మా కంటే తక్కువ కులమే అయినా` సరోజినితో పెళ్లికి మా ఇంట్లో వెంటనే ఒప్పుకున్నారు.
కానీ అక్కడ వ్యవహారం బెడిసికొట్టింది. వాళ్ల నాన్న కాళ్లకి జోళ్లేసుకుని ‘‘దేశాంతరం వెళ్లిపోతా’’ నన్నాడట! వాళ్ల అమ్మ కత్తిపీట మెడమీదుంచుకుని ‘‘ఆత్మహత్య చేసుకుంటా’’ నందిట! (లెటరొచ్చింది)

    భవబంధాలక్కడ బందీని చేసేశాయి...

    భద్రాద్రి రాముడికీ... 

    సరోజినికీ కూడా పెళ్లయిపోయింది...

    ‘నేను మిగిలిపోయాను’

 * * * 

    నాకు సరోజిని స్మృతులు మిగిలిపోయాయి.

    ఆ స్మృతుల నిండా ‘దేశసేవ’ మిగిలిపోయింది!

    తరాలనాటి కోట్ల ఆస్తి మిగిలిపోయింది.

    దేశసేవ ప్రారంభించాను. నాలాంటి కొంతమంది యువకుల్ని కూడేసుకుని చిన్న సేవా సంఘం లాంటిది ప్రారంభించాను! ప్రభుత్వం నిధులందిస్తుందన్న ఎదురుచూపు ఏ మాత్రం లేకుండా ఉన్న డబ్బునంతా ప్రజలకోసం ఖర్చు చెయ్యడం ప్రారంభించాను...

    అనుకున్నంత సులభంగా ‘మనస్సు’ని అణచివేయగలిగితే మనిషి దుర్బలుడెందు కవుతాడు?... ఉండబట్టలేక అప్పుడప్పుడూ సరోజిని గురించీ, సరోజిని కుటుంబం గురించీ వివరాలు తెలుసుకుంటూ ఉండేవాడిని...

    మొదటిసారి అతను (సరోజిని భర్త) ఒక బ్రాందీ షాపు ఓనరని తెలిసినప్పుడు నాకు చాలా బాధేసింది. సరోజిని ఆశయాలు పాపం.. అనిపించింది.
ఆరోజు, పదో తరగతినుంచి సరోజిని నాకు దేశ సేవ చేయమని చెబుతోంది! ఈనాటి సరోజిని జీవితం కూడా అదే చెబుతోంది!

* * * 

     రోజు

    సరోజిని వాళ్ల ఊర్నించి నా ఫ్రెండొకడు వచ్చాడు. కాఫీ తెప్పించాను. కుశల ప్రశ్నలన్నీ పూర్తయ్యేవరకూ కూడా ముభావంగానే ఉన్నాడు. ఆ తరువాత తలవంచుకుని చిన్నగా అన్నాడు.

    " స రో జి ని చ ని పో యిం  ది "

    వాడు విషయం చెప్పిన వెంటనే నాకు మెదడంతా బ్లాంక్‌గా అయిపోయినట్లనిపించింది. 

    "ఏమిటీ" అన్నాను విసురుగా వాడి చొక్కా కాలర్‌ పట్టుకుని.

    వాడు భయపడ్డాడు. చొక్కా విడిపించుకునే ప్రయత్నం కూడా చేయకుండా అన్నాడు` ‘‘నిజంగా! సరోజిని భర్త కిరాతకుడు. కట్నమొక్కటే కాదు ప్రాబ్లం... వాడికి ‘అనుమానం’ కూడా.. పాపం సరోజిని.. ’’ చొక్కా వదిలేశాను` వాడి కళ్లలో కూడా నీళ్లు సుడులు తిరుగుతూండడం చూసి! ఏడుపును కంట్రోల్‌ చేసుకుంటున్నట్లుగా` ఒక్క నిమిషం ఆగి చెప్పాడు`

    "పాపం సరోజిని, చాలా మంచిది. వాడే హింసించి హింసించి.. విస్కీపోసి తగలబెట్టేశాడు.." గొంతు రుద్ధమైపోయింది. "పోలీసు కేసు గూడా లేదు! ఆత్మహత్య అని రాసేసుకున్నారు"

    నేనేం మాటాళ్లేదు. 

    "ఈ విషయం చెప్పడానికే వచ్చా"నని వాడెళ్లిపోయాడు. 

    ఒక నిర్ణయానికి వచ్చి, నా సేవాసంఘం కార్యకర్తలలో పదిమందిని సరోజిని వాళ్ల ఊరికి పంపించాను. వారితో చెప్పాను.. "మహాత్మా బ్రాందీ షాపు. అతని పేరు శేఖరం!"

* * * 

    ఇటీవల ప్రభుత్వం ఇక్కడొక అణురియాక్టరును నిర్మించింది. దాని కోసం కొన్ని వందల కుటుంబాల పేదలు తమ తమ నివాసాలు కోల్పోయి వీధినపడ్డారు. వీరిలో కొందరికి ప్రభుత్వమే పునరావాసం కల్పించింది!

    ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో నేను కూడా నా డబ్బుతో యాభై పక్కా గృహాలు నిర్మించాను. ఆ కాలనీ ప్రారంభోత్సవం ఈరోజే. 
మాననీయ ముఖ్యమంత్రి గారొచ్చారు. కాలనీని ప్రారంభించారు. బహిరంగ సభ ప్రారంభం అయింది.

    ఎటుచూసినా అభినందనల పరంపరే! ప్రశంసల జల్లులే! పనిచేయరుగానీ.. చేసినవారిని అభినందించడానికి ఎక్కువ మందే ఉన్నారని అనిపించింది నాకు!

    "మన ఆజాద్‌ గారి దాతృత్వం సేవాతత్పరత..." ముఖ్యమంత్రిగారు ఏంటేంటో పొగుడుతున్నారు.

    "దేశసేవ.. దేశసేవ.." అంటూ నన్ను నిరంతరం ప్రోత్సహించే సరోజిని గుర్తొచ్చింది నాకు. 

    ఇంతలో మా సేవా సంఘం కార్యకర్త ఒకతను వేదిక మీదకి చిన్న ‘స్లిప్‌’ తెచ్చి అందించాడు.

    నేను కూడా దానికోసమే ఎదురుచూస్తున్నాను.

    అది సరోజిని వాళ్ల ఊర్నించి మెసేజి

    "పని అయిపోయింది"

    ఆ రోజు చిన్నతనంలోనే ‘దేశసేవకు అంకితమయి పోవాలి జాదూ’ అంటుండే సరోజిని మాటలు గుర్తొస్తున్నాయి.

    జీవితంలో నాకు మొదటిసారిగా తెలిసివచ్చింది "దేశసేవ ఇలా కూడా చేయవచ్చని"

(ఆదర్శిని వారపత్రిక 12-08-1992 స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక అనుబంధంలో ప్రచురితం) 

Comments