అభాగ్యులు - ఎం.వి.జె.భువనేశ్వరరావు

    
ఊళ్ళూ, చేళ్ళూ, అన్నింటిని దాటుకుంటూ వేగంగా దూసుకుపోతోంది రైలు. ఓ చిన్న సైజు మార్కెట్‌ను తలపైస్తోంది ఒక్కో రైలు బోగీ! కొందరు పుస్తకాలు, దినపత్రికలు చదువుతుంటే, చతుర్ముఖ పారాయణంతో మునిగారు మరి కొందరు... రైలులో కొన్నవి కొంతమంది, తమ వెంట తెచ్చుకున్నవి మరికొంతమంది - ఫ్రూట్స్, వేరుశనక్కాయలు, బిస్కట్లూ తింటున్నారు. టైంపాస్ కోసం ఇదో మార్గం కదా...! 

    టికెట్ కలెక్టరు చెకింగ్‌కి వచ్చాడు. నా టికెట్ చూపించాను. సరిచూసుకున్నాడు. నా ఎదురు సీటాయన తన టికెట్‌ను టి.సి.కి అందజేస్తూ..."సార్...ఏమిటి సార్...ఇదంతా...ప్రతీ ఐదు నిమిషాలకు ఒక అవిటివాడు వస్తుంటాడు. బోగీ క్లీన్ చేస్తుంటాడు. మమ్మల్ని డిస్టర్బ్ చేస్తాడు. డబ్బు అడుగుతుంటాడు...ఒక్కసారి చెప్పినా, లేదన్నా వినడు. దాదాపు డిమాండ్ చేస్తుంటాడు. లేదంటే సెంటిమెంట్‌తో విరిపోయిన చెయ్యో, కాలో చూపిస్తుంటాడు. బోగీలని శుభ్రం చేయటానికి వీళ్లని మీరు ఎపాయింట్ చేశారా? మరి కొంత సేపట్లోనే ఏవో పాటలు పాడుతా... మరికొంతమంది ఇబ్బంది పెడుతుంటారు. ఆడ, మగ కానివారొచ్చి...గిల్లికజ్జాలు పెట్టి మరీ డబ్బు గుంజుతుంటారు. ఏంటిదంతా, మీరు టి.సి.గా వుండి టికెట్స్ చూడటాన్కే పరిమితమా...అయితే వాళ్ళందర్కి టికెట్స్ చెక్ చేస్తున్నారా...లేదంటే విజయవాడ నుండి విశాఖపట్నం వరకు మంత్లీ పాస్‌లేమైనా వారు తీసుకుంటున్నారా? వాళ్లలో మంచి వాళ్ళెవరో దొంగలెవరో మాకెలా తెలుస్తుంది?" నిలదీశాడు.

    కొంతసేపు టి.సి.మౌనంగా ఉండిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ విషయంలో టి.సి.కి వ్యతిరేకంగా ఏదో ఆశక్తితో ఏం చెప్తారో చూద్దామనే ఎదురుచూస్తున్నారు. చివరికి నోరు విప్పాడు టి.సి. "చూడండి సార్, మీరు నెలలో ఒక్కసారో రెండుసార్లో రైలు ప్రయాణం చేస్తారు. నా పరిస్థితి అలా కాదు. ప్రతిరోజూ రైలు బండిలోనే ఉంటాను. కొన్ని వేలమందిని చూస్తూ ఉంటాను. వాళ్ళందరూ కూడా ఇటువంటి అభాగ్యుల పట్ల దయతో, జాలితో ఎంతో కొంత ధర్మం చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వారికి సహాయపడే అవకాశం లభించిందని సంతోషిస్తూ ఉంటారు. వీరిని రైల్లో తిరక్కుండా ఆపడం పెద్ద పనేం కాదు. కానీ వాళ్ళు డబ్బులేక పస్తులతో ప్రాణాలు పోగొట్టు కోవచ్చు. వీరిలో చాలామంది ఏ పనీ చేయలేరు. వీర్ని కూర్చోబెట్టి పోషించే స్థాయికి మన ప్రభుత్వాలింకా ఎదగలెదు. ఆకలితో అలమటించటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి వారిది. ఇకపోతే మనం వందల, వేల రూపాయలు ఆడంబరాలకు, సౌకర్యాలకు ఖర్చు చేస్తాం. దానిలో ఒక్క రూపాయో, అర్థ రూపాయో మనం మీరికోసం వెచ్చిస్తాం. దాంతోనే వారు కడుపు నింపుకోవలి. అది మనకే మాత్రం భారం కాదు. మరొక్కరి ఆర్తనాదాలు, ఆకలి కేకలు మనకి విసుగు పుట్టిస్తాయనటం భావ్యం కాదేమో...! ట్రైన్లలో తిరిగి, ఊరికే డబ్బు తీస్కోవటానికి సిగ్గుపడో...మనసు రాకో బోగీని శుభ్రం చేస్తుంటారు. తప్పితే మరేం కాదు. వాళ్ళు దొంగతనం ఎన్నటికీ చేయరు. చేస్తే వాళ్ళ జీవన భృతి ఆగిపోతుంది. వాళ్ళలా చేసినట్లు ఒక్క ఫిర్యాదు ఉన్నా...మేం వాళ్ళనలా తిరగనిచ్చే వాళ్ళమే కాదు...అభాగ్యులకు సహాయపడే వేదికగా ఈ రైలుబండిని మీరు పరిగణించండి...మీకు అద్భుతమైన స్వాంతన లభిస్తుంది. మీ గుండె జాలితో నిండిపోతుంది. దయతో ఉప్పొంగి పోతుంది. వాళ్ళ రాకకోసం మీ హృదయం ఎదురు చూస్తుంటుంది. సాయమందించాలని మీ మనసు పరితపిస్తుంటుంది. వారికి సహాయ పడటనికి సన్నద్ధులై మీరు నిరీక్షిస్తుంటారు" 

    ఒక్కక్షణం అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది...దూరం నుండి వింటున్న ఓ స్త్రీ కళ్ళ నుండయితే నీళ్ళు జలజలరాలాయి. ఆ టి.సి.ధరించిన నల్లకోటు పాకెట్ వైపు చూశాను. "ఇంద్రజిత్ వర్మ". అతని వైపు గౌరవభావంతో అభినందన పూర్వకంగా చూశాను. ఒక్కనిముషం నిశ్చేష్టులై అక్కడ ఉన్నవారంతా చప్పట్లు కొట్టారు. ఇనుమడించిన ఉత్సాహంతో టి.సి ముందుకు కదిలాడు. మానవీయ దృక్పథం, మానవత్వకోణం...ఇలాంటివన్నీ కలిగియున్న వ్యక్తిగా... ఆ టి.సి. నా మనోఫలకంపై ముద్రవేసుకున్నాడు.

    జన్మభూమి ఎక్సుప్రెస్‌లో విజయవాడ చేరిన నేను, శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న మా అబ్బాయిని కలిశాక, మరికొన్ని చిన్నా చితకా పనులు కూడా సాయంత్రం నాలుగు గంటలకే పూర్తయిపోయాయి. మరలా రాత్రి 9గంటలకే నేను తిరిగి వెళ్ళాల్సిన ట్రైన్! అంత దాకా వేచి ఉండటం కష్టమనిపించి...మరేదైనా ట్రైన్ లేటయి ఉంటే దాన్లో వెళ్ళిపోవచ్చని స్టేషన్ కొచ్చాను. అప్పటికే రైళ్ళన్నీ వెళ్ళిపోయాయి...విశాఖపట్నం వెళ్ళేందుకు రాత్రి తొమ్మిది గంటల పాసెంజర్ తప్ప ఇంకేమీ లేవు. 

    విజయవాడ ప్లాట్‌ఫారంలన్నింటినీ పరిశీలిద్దామని చుట్టూ కలియ తిరిగి, చివరి ప్లాట్‌ఫారం వద్ద బెంచ్‌మీద కూర్చొన్నాను. రిలాక్సుడ్‌గా అటూఇటూ చూస్తున్న నా వద్దకి ఓ అబ్బాయి వచ్చాడు. కాళ్ళకి పోలియో ఉంది. నోటినుండి లాలాజలం కారుతూ...అమాయకంగా చూస్తున్నాడు. మాటకూడా సరిగ్గా రావటం లేదు. అసంపూర్తిగా మాట్లాడుతున్నాడు. నోరు పూర్తిగా మూసుకుపోవటం లేదు. చేతిలో ఓ చిన్న సజ్జ...దాన్నిండా వేయించిన వేరుశనక్కాయలు ఉన్నాయి. దాంట్లో ఓ చిన్న గిద్దె లాంటి కొలతగ్లాసు...అతని రూపం చూసి...కొంచెం చిరాకు కలిగింది. వెను వెంటనే రైల్లో టి.సి.గుర్తొచ్చాడు. ప్రేమగా దగ్గరకు పిలిచాను. ఐదు రూపాయలు ఇచ్చాను. సంతోషంగా తీసుకొని ఓ కట్ చేసిన పేపరు ముక్క చేతిలో పెట్టాడు... ఆ తర్వాత తన దగ్గరున్న కొలత గ్లాసుతో వేయించిన వేరు శనక్కాయలు కొలిచి...నాకు ముందిచ్చిన పేపరు ముక్కలో వేశాడు.
    అతనికి నేను సహాయ పడినందుకు గర్వంగా ఫీలయ్యాను. చుట్టూ ఉన్న వారందరూ నన్ను హీరోలా చూస్తున్నారనే భావన కల్గింది. నేనలా సహాయ పడినందుకు నన్ను నేనే అభినందించుకున్నాను.

    నానుండి కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ...ప్రక్క బెంచీ కెళ్ళాడు. వాళ్ళేం చేస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నాను... నేను! ఓ నడివయసు స్త్రీ...ఆమె ప్రక్కగా మరో పాతికేళ్ళ వయసున్న అమ్మాయి ఉన్నారు. బహుశా ఇద్దరూ తల్లీ కూతుళ్ళేమో? ఆ అమ్మాయికి, ఎదురుగా నిలుచున్నాడు...ఆమె ఆ అబ్బాయితో ఏదో మాట్లాడుతోంది. ఏం మాట్లాడూతుందాయని పరిశీలనగా చూశాను. "నీ దగ్గరున్న వేరు శనక్కాయలన్నీ తీసుకుంటాను. ఎంతవుతుందో చెప్పు...ఇవన్నీ అమ్ముడయితే ...మరలా స్టేషన్‌కు రాకుండా ఉంటావా? ఏం చేస్తావు?" అడిగిందామె. అతడి ముఖంలో వేయి వోల్టుల విద్యుత్తుతో వెలువడే కాంతి మెరుపు కనిపిస్తోంది. ఎంతో ఆనందంగా ఉన్నాడు. డాన్స్ చేస్తున్నట్లుగా హాయిగా కేరింతలు కొడుతున్నట్లుగా అటూ యిటూ కదులుతున్నాడు.
    "నీ దగ్గర కారియర్ బ్యాగ్ వుందా?"
    లేదని అడ్డంగా తలూపాడు. 

    "సర్లే, నేను తెప్పిస్తాను కూర్చో..." అని తన ప్రక్కన సీటిచ్చింది. అతడు ఆమె ప్రక్కనుంటే తెల్లపావురం నోట కుళ్ళిన జాంపండులా ఉన్నాడు. ఆమెను చూస్తుంటే నాకు అసూయ వేసింది. నాకంటే మిన్నగా ఎన్నో రెట్లు ఉన్నతంగా ఆమె మానవతా మూర్తిలా కన్పించింది. మరి కొద్ది సేపట్లో కేరియర్ బ్యాగ్ తెచ్చిచ్చారు మరెవరో...ఆమె బంధువులాగున్నాడు. ఆ అబ్బాయి లేచి వేరు శెనక్కాయలు కొలిచి, బ్యాగ్‌లో వేశాడు... ఏభై రూపాయలిచ్చిందామె.
    తన జేబులో జాగ్రత్తగా దాచుకొన్న రూపాయి కాసులు, అర్ధరూపాయి నాణాలు, పావలాలు, నలిగిన నోట్లు కలిపి ముప్పై రూపాయలదాకా ఉంటే, బయటకు తీసి, జాగ్రత్తగా లెక్కపెట్టి - ఆమెకు పద్దెనిమిది రూపాయలిచ్చేశాడు. ఒక కొలత గ్లాసు రెండు రూపాయలతో పదహారు గ్లాసులు. ముప్పై రెండు రూపాయలు. ఇంకా అరగ్లాసు మిగిలుంటే కొసరుగా ఆమెకే ఇచ్చేశాడు.
    "తన కివ్వొద్దు..." అని ఆమె వారిస్తున్నా బలవంతంగా యిచ్చేశాడు. తను తెచ్చిన శనక్కాయలు తొందరగా అమ్మేశాననే విజయగర్వంతో, పరుగులు తీస్తూ ప్రక్కనుండి నిష్క్రమించాడు. ఆ వెళ్ళేముందు ఆప్యాయత నిండిన కళ్ళతో, అభిమానంగా అతడు ఆమె వైపు చూసిన దృశ్యం పదేపదే నా కళ్ళల్లో కదలాడుతోంది. 

    ఆమె చేసిన పనికి ఆమెను అభినందిచాలని ఉంది. అభినందించడానికి కూడా నాకు సిగ్గుగానే అన్పించింది. మనసులోనే ఆమెకు జోహార్లర్పించాను. అంతకన్నా గొప్పగా మరెవరైనా అభాగ్యుడ్ని - సంతోష పరచాలి. నిజంగా అదే నా గమ్యమనిపించింది.

    అక్కడ నుండి వెళ్ళిన ఆ అబ్బాయి - ఎక్కడికి వెళ్ళాడో...తాను తొందరగా అమ్మేశానన్న ఆత్మ సంతృప్తితో, విజయ గర్వంతో తన తల్లి దగ్గరో, ఇంట్లోనో ఎలా ప్రవర్తిస్తాడొ కళ్ళారా చూడాలని మనసు తహతహ లాడుతోంది... ఆగలేక పోయాను. ఆ అబ్బాయిని వెతుక్కుంటూ... ఆ వెనకే బయలుదేరాను. అతి కష్టం మీద, చాలా శ్రమపడి, ఆ అబ్బాయి ఇల్లు కనిపెట్టగలిగాను.
    స్టేషన్‌కి సమీపంలోనే ఓ రైల్వే క్రాసింగ్ ఉంది. ఆ రైల్వే క్రాసింగ్‌కి దిగువనే చుట్టూ తాటాకులతో కంచెలా ఏర్పాటు చేసి ఉంది. లోనికి వెళ్ళాను. చినిగిన తాటాకులతో వేసిన ఓ పందిరి ఉంది. చుట్టూ పనికిరాని చెట్లూ, మొక్కలూ ఉన్నాయి. పందిరి క్రింద...రాళ్ళపై అమర్చిన పొయ్యిపై ఓ కాళ్ళు లేని అవిటివాడు...శెనక్కాయలు వేగిస్తున్నాడు. మరో ఓ చెయ్యిలేని వికలాంగుడు... వేగినవి సజ్జలో కెత్తుతున్నాడు. ప్రక్కనే స్టేషన్‌లో నేను చూసిన అబ్బాయి... వేగిన శనక్కాయలకోసం ఎదురు చూస్తున్నాడు. దగ్గర్లోనే పూరి గుడిశెల వైపు నా దృష్టిని నిలిపాను. ఆ వెనకగా కళ్ళులేని ఓ అంధురాలికి మరో స్త్రీ స్నానం చేయిస్తోంది. ఆసక్తిగా ఓ పూరి పాకలోకి తొంగి చూశాను. కాళ్ళులేని ఓ వృద్ధుడు మంచంపై పడున్నాడు. మరో పూరిగుడిసెలోకి వెళ్ళాను. బూట్ పాలిష్‌లు రెడీ చేస్తూ...రాబోయే ట్రైన్ కోసం మరో యువకుడు సమాయత్త మవుతున్నాడు. అభాగ్యుల, అనాథల స్వర్గధామంలా వుంది ఆ ప్రదేశం! ఒక్కో గుడిసెకు ఓ కన్నీటి గాధ ఉంది. నన్ను ఎవరో తట్టినట్లనిపిస్తే...తలెత్తి చూశాను. ఎదురుగా ఓ స్త్రీమూర్తి. కాస్త చదువుకున్నామెలా అగుపిస్తోంది. నడివయసు దాటి, వృద్ధాప్యంలోకి జారుతున్నట్లుగా ఉందామె. తల అక్కడక్కడ వెండి తీగల్లా మెరుస్తోంది.
    "ఎవరు మీరు?" ప్రశ్నించింది. అపార్థం చేసుకొనే అవకాశమివ్వకూడదని నేనెందుకొచ్చానో ఆమెకి వివరించాను. ఆమె నన్ను మరో గుడిసెలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. "చూడండి బాబూ. ఇలా మాగురించి ఆలోచించి, ఆర్ద్రత నిండిన హృదయంతో తొలిసారిగా వచ్చింది మీరొక్కరే. నేనూ ఓ అభాగ్యురాల్నే. రైలు ప్రమాదంలో మావాళ్ళంతా మరణిస్తే...మిగిలినది నేనొక్కదాన్నే...అప్పుడు నావయసు నాలుగేళ్ళట. అప్పుడు వీళ్ళు నన్ను తీసుకొచ్చి ఆదరించారు. అప్పట్నించీ అందరం తలో పని చేస్తూ బ్రతుకుతున్నాం. మా జీవితమంతా ఈ రైలుబండిలోనే! ఇక్కడేం చేసినా సొంత ఇంట్లో ఉన్నట్లుగా ఉంటుంది. ఈ సందర్భంలోనే పని ధ్యాసలో ఓరైలు నుండు మరో రైలుకు మారినప్పుడూ మజ్జిగ పాకెట్లు పట్టుకునో, టీ కంటైనర్ పట్టుకునో ప్రమాద వశాత్తు పడిపోయిన వారే వీరంతా. అంగవికలులయ్యారని వార్ని చంపేయటమో, వదిలేయటమో చేయలేం కదా...వాళ్ళు చేయగలిగిన పని వాళ్ళతో చేయిస్తాం. ఇందులో ఏ ఒక్కరూ ఖాళీగా ఉండరు. ఏదో పని చేస్తూనే ఉంటారు. ఎంతో కొంత సంపాదిస్తూనే ఉంటారు. వీరందరికి పెద్ద దిక్కు నేనని భావిస్తుంటారు వీళ్ళంతా. ఎందుకంటే ఏ లోపంలేకుండా ఆరోగ్యంగా ఉన్నది నేనే కదా! నిజానికి నేను వీరందర్కి సహాయకారిగా మాత్రమే ఉంటాను. వీళ్ళలో చాలామంది అనాథలుగా ఇక్కడికి చేరినవారే..."
    ఆమె చెప్పిన వ్యక్తులంతా మనకు రైళ్ళలో నిత్యం తారసపడేవారే! నా కళ్ళు చెమర్చాయి. చేసింది గోరంతయినా చెప్పుకొనేది కొండంతైన ఈ రోజుల్లో నిజమైన మాతృదేవత...అమ్మల్ని తలదన్నే అమ్మ ఈమేననిపించింది. ఎన్నో కోట్లు సంపాదించి కూడా సాటి పేదవార్కి ఏమాత్ర సాయపడలేని నికృష్టులున్న ఈ సమయంలో స్వార్థ ప్రయోజనాల కోసం, ఫోటోలు తీసుకోవటం కోసమే దాన ధర్మాలు, పబ్లిసిటీ కోసమే సేవానిరతుల్లా ఫోజులు కొట్టే వారున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ మాతృమూర్తి స్థాన మెక్కడ? చేతులెత్తి నమస్కరించాను.

    ఒక్క క్షణం స్వంత తల్లిదండ్రులను భరించలేని నిర్వీర్యులున్న చోట...ఏ రక్త సంబంధమూ, బంధుత్వమూ లేకపోయినా, కన్నతల్లిలా సాకుతున్న ఈ మరో మదర్‌థెరెసా ఎంత గొప్ప వ్యక్తో కదా! ఏ సహాయ మడిగినా, ఏ ప్రయోజనాన్ని కోరినా కులమో, మతమో చూసి సాయం చేసే పెద్దలున్న దేశంలో కులమతాల కతీతంగా... ఐక్యంగా...అన్నదమ్ములకన్న మిన్నగా, రక్త సంబంధీకుల కన్నా గొప్పగా, జీవిస్తున్న వారిముందు మనకు నిలబడే స్థానముందా?
    హృదయం ద్రవించి పోయింది... ఏదేని సాయం చేయాలని తపిస్తోంది నా మనసు. మానవ మృగాల మధ్య కృత్రిమ జీవనం సాగిస్తున్న నాకు...వీళ్ళకు జీవితాంతం చేదోడువాదోడుగా ఉండాలనిపిస్తోంది. నిజంగా నేనా పని చేయగలనా? నాకు నేను ప్రశ్నించుకున్నాను.
    నామీద నాకే నమ్మకం లేదు...ఆమెనే అడిగి...నా నుండే సహాయం ఆశిస్తున్నారో... అడిగేద్దా మనుకొన్నాను. "ఏయ్... లక్ష్మమ్మా...లక్ష్మమ్మా..." బయట నుండి కేక వినిపించింది. "ఒక్క నిమిషం బాబూ కూర్చోండి" అన్చెప్పి వడివడిగా బయటకు నడిచింది. 'ఏంటి ఈనెల మామూళ్ళందలేదు' గట్టిగా అరిచాడు అవతలి వ్యక్తి. "ఏం లేదు సారూ...సగం మంది మంచాన పడ్డారు. వర్షాలతో అనారోగ్యం బారిన పడ్డంతో సంపాదనేం లేదు! తినడానికి, మందుల ఖర్చుకే డబ్బులేకుండా పోయింది. ఈసారి ఇచ్చుకుంటాను బాబూ" బ్రతిమాలింది.

    "డబ్బులు పంపకుంటే నేను డ్యూటీలో ఉండగా ఎవరైనా బండిలోకొస్తే... బయటకు తోసేస్తాను. లేకుంటే ఆర్.పి.ఎఫ్ వాళ్ళతో కొట్టిస్తాను జాగ్రత్త!" కోపంతో ఊగిపోయాడు. "రైలు బండిలో వస్తేనే కదా నాల్గు రూపాయలొచ్చేది. తమరు రానివ్వొద్దంటే ఎలా బాబూ...అయినా...తమరికి ఈ డబ్బుతో లెక్కేంటి బాబూ!" నెమ్మదిగా చెప్పింది లక్ష్మమ్మ. "ఎక్కువగా మాట్లాడకు..." ఆగ్రహంతో చెయ్యెత్తాడు. అంతలోనే తనని తాను సంబాళించుకొని, మరలా ఎత్తిన చెయ్యి దించేశాడు... ఎందుకీ గొడవ జరుగుతోంది? ఆ డబ్బేదో నేను ఇచ్చి సాయపడదామని, గుడిసెలోంచి బయటకు వచ్చాను. నల్లకోటు ధరించిన ఆ వ్యక్తి మరెవరో కాదు. "ఇంద్రజిత్ వర్మ" టికెట్ కలెక్టర్. ఒక్కసారిగా నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. "సార్ మీరా?" అని దగ్గరగా అతనికి సమీపంగా వచ్చాను. నన్ను గుర్తించలేనట్లుగా ఉన్నాడు. లక్ష్మమ్మపై రుసరుసలాడుతూ...వేగంగా ముందుకు నడిచి, మోటార్ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. చాలా నిరాశపడ్డాను అతన్ని పట్టుకోలేక పోయినందుకు... "ఏంటి లక్ష్మమ్మా...ఆయన చాలా మంచి వ్యక్తి కదా...ఆయనతో గొడవ పెట్టుకున్నావేంటి?" ఆతృతగా అడిగాను. లక్ష్మమ్మ తేలిగ్గా నవ్వింది. ఆ నవ్వులో ఏదో గూడార్థం గోచరిస్తోంది... "అదేంటి లక్ష్మమ్మా! ఆయనంటే అంత చులకన భావమా నీకు" మరలా చిన్నపాటి కోపంతో అడిగాను.

    "లేకుంటే ఏంటి బాబూ...పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు.తృప్తి చెందక పూర్తిగా అవయవాలు లేని, అన్నం కోసం అలమటించే - ఇటువంటి అభాగ్య్ల రక్తం పీల్చే ఆ జలగని చూసి నవ్వొద్దంటావ్. ఎందుకు బాబూ...! వాడికి జీతం. మామూళ్ళు చాలక మామీద పడ్డాడు. ఇవ్వకుంటే వీళ్ళని ట్రైన్‌లో బిక్షమెత్తుకోనివ్వడంట. షూపాలిష్ చేసుకోనివ్వడంట...వేరుశెనక్కాయలు అమ్ముకోనివ్వడంట...తిరిగి ఆర్.పి.ఎఫ్ వాళ్ళతో కొట్టిస్తాడంట...దేవుడా...ఇలాంటి దుర్మార్గుల్ని ఎందుకు శిక్షించవు?" లక్ష్మమ్మ ఏడుపాగలేదు. బిగ్గరగా ఏడ్చేసింది. కన్నీళ్ళు వరదలా ఉప్పొంగి, జలజల రాలాయి. నిర్ఘాంత పోయాను నేను! ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు! సముదాయించాను లక్ష్మమ్మను.
    'ఎవర్ని నమ్మాలి? ఎవరు విశ్వసనీయులు?' అయోమయంలో పడిపోయాను. లక్ష్మమ్మ వైపే చూస్తూ క్రిందికి ఒరిగి పోయాను. అభాగ్యులెవరు...డబ్బు లేనివారా? దురదృష్టవంతులను ఆదుకొనే మంచితనం లేనివారా? నాలో నేనే నవ్వుకున్నాను. ఏదో చెయ్యాలి. ఈ చేదు అనుభవాన్ని వీళ్ళంతా మరిచిపోవాలి. మెదడులో తళుక్కున మెరిసిందో ఆలోచన. అదే ఊపున అక్కడి నుండి బయలుదేరాను. లక్ష్మమ్మ పిలుపు లీలగా వినిపిస్తోంది. అయినా నేనాగలేదు. మరో అరగంటలో బిరియానీ, స్వీట్స్, కూల్ డ్రింక్స్ అన్నిటినీ తీసుకొని తిరిగి వచ్చాను. నన్ను చూడగానే లక్ష్మమ్మ కళ్ళల్లో ఏదో మెరుపు!
    అందరం కూర్చొన్నాం. కలిసి భోజనం చేశాం. లేదు లేదు పార్టీ చేసుకున్నాం. నాకెంతో తృప్తిగా ఉందిప్పుడు. కనీసం ఒక్కపూట వాళ్ళందరికీ నా వాటాగా సంతోషాన్ని, సంతృప్తినీ అందించగలిగినందుకు!

(సహస్రార మాసపత్రిక మార్చి 2008 సంచికలో ప్రచురితం)
Comments