అభయం - రావిపల్లి నారాయణరావు

    
బస్సుదిగి రోడ్డు మీద అడుగుపెట్టానో లేదో పట్టుకుంది వర్షం. ఎక్కడో వాయుగుండం ఏర్పడినట్టుంది. ఈ వర్షాన్నీ, ఈదురు గాలుల్నీ చూస్తుంటే ఆ రోజంతా ఇలాగే ఉంటుందేమో అనిపిస్తోంది. పేవ్‌మెంట్లే తమ స్థావరాలు అనుకునే నిరుపేదలు, చలికి తట్టుకోలేక తలదాచుకోటానికి అటూ ఇటూ పరిగెడుతున్నారు.

    బస్సు దిగి వెంటనే ఫోన్ చెస్తే నా ఫ్రెండ్ కృష్ణమూర్తి కారు పంపేవాడే. కానీ ఈ వర్షంలో వాడిని ఇబ్బంది పెట్టటానికి నా మనసంగీకరించలేదు. "అబ్బాయి, కోడలు బాంబే మీదుగా అమెరికా వెళ్తున్నారు. వాళ్ళతో వెళ్ళటానికి మనకంత ఓపికా లేదు. తీరిక అంతకన్నా లేదు. కనీసం ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి వాళ్ళకు వీడ్కోలు చెప్పటం మన ధర్మం అని నేననుకుంటున్నాను. సారథీ! నివ్విక్కడకు తప్పక రావాలి. రేపు ఉదయమే వాళ్ళ ప్రయాణం".

    నేను 'యస్' అని చెప్పే వరకూ నిన్న కృష్ణమూర్తి ఫోన్ విడిచిపెట్టలేదు. వాడి మాటను నేను ఎప్పుడూ కాదనలేదు. అందుకే నిన్న సాయంత్రం వైజాగ్‌లో బస్సు పట్టుకుని ఈరోజు ఎనిమిది కాకముందే హైదరాబాద్ చేరుకున్నాను.

    బాంబే ఫ్లయిట్ బయల్దేరటానికి గంటన్నర టైముంది. కానీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళే ముందు పద్మారావ్ నగర్‌లో ఉన్న కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళి రావటానికి టైం చాలదనిపించింది. అందుకే వర్షంలో అలా వెళ్ళి ఆటో ఎక్కి తిన్నగా విమానాశ్రయానికి తీసుకెళ్ళమన్నాను. నలభై నిముషాల్లో ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాను.

    వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల షెడ్యూలు టైముకు విమానాలు బయల్దేరటంలేదు. అందుకేనేమో విశ్రాంతి హాలు జనంతో కిటకిటలాడుతోంది. హాల్లో ఒక కార్నర్ సీట్ చూసుకుని కూర్చున్నాను. నూతన దంపతుల్ని వెంటబెట్టుకుని కృష్ణముర్తి ఇంకా వచ్చినట్టు లేదు. పది నిమిషాలు కూర్చుని ఆ తరువాత ఏమీ తోచక నేను బుక్‌స్టాల్ వైపు దారి తీశాను. అక్కడ రమాకాంత్ - అంటే కృష్ణమూర్తి కొడుకు, కోడలు వైష్ణవి కనిపించారు. కృష్ణమూర్తి ఇంకా రాలేదు. అతని కోసమే ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచదర్‌లా కనిపించారు. ఆ దంపతుల పెళ్ళి అంత తొందరగా జరుగుతుందని నేనూహించలేదు. ఆ పెళ్ళిని తలచుకున్న ప్రతీక్షణం నా మనసు తల్లడిల్లిపోతుంది. గుండెల్లో గుబులు చిందులు తొక్కుతుంది.

    పది రోజుల కిందట -

    నా పుట్టినరోజు  - నా జీవిత చరిత్రలో అరవై నాలుగు వసంతాలు దొర్లిపోయాయి. నిజం చెప్పాలంటే గడచిన మూడు సంవత్సరాలకు ముందు, పుట్టినరోజు విషయం నా తలపునకు వచ్చేది కాదు. హృదయ విదారకమైన ఓ సంఘటన మూడేళ్ళ కిందట నా జన్మదినంనాడే జరగటంతో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ దుర్ఘటన నాకు గుర్తుకు రావటం, అదేరోజు నా పుట్టిన రోజని నేను తలచుకోవటం యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి.

* * *

    ఆరోజు నేను మంచం మీది నుంచి లేచానో లేదో కార్డ్‌లెస్ ఫోన్ చేతికి అందించాడు నా మనవడు. హైదరాబాద్ నుంచి కృష్ణమూర్తి మాటాడుతూ బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పాడు. ప్రతి సంవత్సరం గ్రీటింగ్స్ తెలిపే అలవాటు మొదటి నుంచీ కృష్ణమూర్తికి లేదు. మరిప్పుడు ఫోనెందుకు చేసినట్టు?

    "నువ్వు ఊరకే ఫోన్ చెయ్యవు. నువ్వు ఫోన్ చేశావంటే ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది" అన్నాను నేను కార్డ్‌లెస్ ఫోన్ దగ్గర పెట్టుకుని.

    "ఏడ్చావులే - రేపు ఉదయానికి నువ్వు మా ఊర్లో ఉండాలి" అన్నాడు కృష్ణమూర్తి.

    "అంటే నేను వైజాగ్ నుంచి రేపు తెల్లారేసరికి హైదరాబద్ చేరుకోవాలి. ఇది సాధ్యపడేదేనా?" అని అడిగాను.

    "సారథీ ఇప్పుడు టైమ్ ఇంకా ఏడు కాలేదు. సాయంత్రం ఐదు గంటలకు కదా గోదావరి ఎక్స్‌ప్రెస్ బయల్దేరేది. పది గంటల వ్యవధి చాలదా నువ్వు తయారు కావడానికి" అన్నాడు కృష్ణమూర్తి.

    "అది సరేలేరా - కానీ ఎందుకీ అర్జంటు ప్రయాణం"

    "అర్జెంటు కాబట్టే గదరా ఫోన్లో మాట్లాడుతున్నాను"

    "లేకపోతే కార్డుముక్క రాసి పోస్టులో పడేసేవాడివా?"

    "అంతేగా మరి... అది సరే, మా రమాకాంత్ లేడూ..."

    "ఎందుకు లేడు. ఈ మధ్య స్టేట్స్‌లో ఎమ్మెస్ పూర్తి చేశాడని చెప్పావ్. వాడి సంగతి నాకు కొత్తగా  చెబుతున్నావేంటి"

    "మరేం లేదు. వాడికి అమెరికాలో ఉద్యఒగం దొరకటం, ఇక్కడ ఒక మంచి సంబంధం చూడ్డం కాకతాళీయంగా జరిగాయి. అమ్మాయి తండ్రి మహేంద్రబాబు, రిటైర్డ్ పోలీస్ సుపరింటెండెంట్. రేపే పెళ్ళి చూపులు. రేపు సాయంత్రం అయిదు గంటలకు నిశ్చయతాంబూలం. అన్నీ అనుకూలిస్తే పెళ్ళి కూడా వారమ్రోజుల్లో జరిపించాలని నా ప్రయత్నం. ఎందుకంటే అబ్బాయి పది రోజుల్లో అమెరికా వెళ్ళిపోవాలి. మిగతా విషయాలు తరువాత చెబుతాను. నువ్వు రేపు వస్తున్నావ్.రమాకాంత్ సికింద్రాబాద్ స్టేషన్‌లో నిన్ను రిసీవ్ చేసుకుంటాడు. ఓ.కే. మరి నే ఉంటాను. బై" అన్నాడు కృష్ణమూర్తి.

    "బై" కార్డ్‌లెస్ మనవడి చేతిలో పెట్టి మంచం దిగాను.

    ఆ మర్నాడు రైట్ టైముకే సికింద్రాబాద్ చేరుకుంది గోదావరి ఎక్స్‌ప్రెస్.

    ఆడపిల్ల ఇంట్లోనే పెళ్ళిచూపుల కార్యక్రమం ఏర్పాటు చేయటం మన సంప్రదాయం. పెళ్ళికూతురు తండ్రి మహేంద్రబాబుకు నన్ను పరిచయం చేశాడు కృష్ణమూర్తి. కాబోయే వియ్యంకుడు చాలా పొడుగ్గా ఉన్నాడు. గుబురుగా పెంచిన మీసాలు అతని విగ్రహాన్నికి మరింత వన్నె తెచ్చాయి. ఇల్లు చక్కగా ఉంది. షోకేస్‌లో పొందికగా అమర్చిన కళాఖండాలు చూడముచ్చటగా ఉన్నాయి. వధువు తరఫు బంధువులు అధికసంఖ్యలో ఉన్నారు. హాలు అతిథులతో నిండిపోయింది. తెల్లజుబ్బా వేసుకున్న పెద్దమనిషి హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ అక్కడి ఏర్పాట్లు పర్యవేక్షితున్నాడు. కాఫీ, టిఫిన్ల కార్యక్రమం పూర్తయ్యాక అతను మహేంద్రబాబు దగ్గరకెళ్ళి "అయ్యా రాహుకాలం రాకముందే అమ్మాయిని రప్పించి పెళ్ళిచూపులు ఏర్పాటు చేయించడం మంచిది" అన్నాడు.

    అసలు ఈ పెళ్ళిచూపుల ప్రోగ్రాం ఫార్మాలిటీ కోసం ఏర్పాటు చేసిందని ఉదయం స్టేషన్ నుంచి కార్లో వాళ్ళింటికి తీసుకువెళ్తూ రమాకాంత్ నాకు చెప్పాడు. జిల్లా జడ్జిగా కృష్ణమూర్తి డీఎస్పీగా మహేంద్రబాబు రెండు సంవత్సరాలు విజయనగరంలో పనిచేశారు. ఆ ఊర్లో ఉన్నప్పుడు రమాకాంత్ మనసు వైష్ణవి మీద పడింది. వైష్ణవి తప్ప ఇంకో అమ్మాయిని పెళ్ళిచేసుకోకూడదన్న అభిప్రాయం ఆనాడే అతని మనసులో గాఢంగా నాటుకుపోయింది. ఈ మధ్యనే అమెరికా చదువు పూర్తిచేసి వచ్చిన రమాకాంత్ తన మనసులోని కోరిక బయటపెట్టడంతో అమ్మాయిని చూసి సంబంధం స్థిరపరచాలని తలచాడు కృష్ణమూర్తి.

    పెళ్ళికూతురు వైష్ణవిని రమాకాంత్ ఎదుట ఉన్న సోఫాలో కూర్చోబెట్టారు. అమ్మాయి కుడివైపున మహేంద్రబాబు దంపతులు, మరోపక్కనున్న సోఫాలో నేను, కృష్ణమూర్తి కూర్చున్నాం. సోఫాలో కూర్చున్నపటి నుంచీ దించిన తల పైకెత్తకపోవటం వల్ల వైష్ణవి మొహం నాకు సరిగ్గా కనపడలేదు.

    "చూడండీ! వధువుని చూడాలాని ఎంతో ఆసక్తితో మగపెళ్ళివారు వచ్చి కూర్చున్నారు. కాస్త తల పైకెత్తమని అమ్మాయికి చెప్పండి" అన్నాడు తెల్ల జుబ్బా వేసుకున్న పెద్దమనిషి.

    అతని మాట విన్నవెంటనే సోఫాలో సర్దుకుని కూర్చుని సిగ్గుపడుతూ తల పైకెత్తింది వైష్ణవి. సూటిగా ఆమె మొహంలోకి చూసిన నేను స్థాణువులా ఉండిపోయాను కొన్ని క్షణాలు. వసపిట్టలా నా చెవిలో వాగుతున్నాడు కృష్ణమూర్తి. వాడు చెప్పిన మాటలు అర్థం చేసుకోటాణికి నా మనసు మనసులో లేదు. మనసులో చోటు చేసుకున్న కలవరం కృష్ణమూర్తి పసిగట్టక ముందే మొహాన్ని కర్చీఫ్‌తో తుడుచుకున్నాను. కృత్రిమ నవ్వును పెదాల మధ్యకు తెచ్చుకుని రెప్పవేయకుండా వైష్ణవిని మరోసారి చూశాను. హాల్లో ఆ చివర నుంచి ఈ చివర వరకు ఉన్నారు అతిథులు. అందర్నీ వరుసగా పరిశీలిస్తూ వస్తున్న వైష్ణవి కళ్ళు నన్ను చూడగానే భయపడి మూసుకున్నాయి. ఆమె శరీరం కంపించినట్టయింది. మొహంలో రంగులు మారాయి. వెంటనే నా స్మృతిపథం మూడు సంవత్సరాల వెనక్కి పరుగెత్తింది.

    ఆ రోజు నా బర్త్‌డే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని విజయనగరంలో ఘనంగా నన్ను సన్మానించారు. అక్కడ జరిగిన ఒక పార్టీకి హాజరైన నేను, ఒంటరిగా విశాఖపట్నం వెళ్తున్నాను. టైమ్ తొమ్మిది దాటింది. ప్రకృతి, చీకటి ఒడిలో తలదాచుకున్నట్టుంది. విజయనగరం విడిచి ఇరవై నిముషాలు కూడా కాలేదు. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. వాహనాల రద్దీ తగ్గిపోయింది. ఆ రోజు డ్రైవర్ సెలవు తీసుకున్నాడు. నేనే స్టీరింగ్ ముందు కూర్చుని, కారు డ్రైవ్ చేయాల్సి వచ్చింది. తొందరగా వైజాగ్ చేరుకోవాలన్న ఉద్దేశంతో స్పీడు ఎక్కువ చేశాను. అలా వెళ్తుంటే రోడ్డు పక్కన పొదల దగ్గర కదల కుండా ఉన్న ఒక నల్లకారుపై నా దృష్టి పడింది. మరికొన్ని గజాలు ముందుకు పోగానే వెనుక నుంచి ఒక స్త్రీ ఆర్తనాదం ఈ శబ్దాన్ని దాటుకుని వచ్చి నన్ను కలవరపరిచింది. వెంటనే బ్రేక్ వేసి కారు దిగాను. హెడ్‌లైట్స్ ఆన్‌లోనే ఉన్నాయి. ఆక్రందన విని ఆ స్త్రీకి నేనేమైనా సహాయ పడగలనేమో అన్న ఉద్దేశంతో నాలుగడుగులు నడిచి నల్లకారు వెనక్కి వెళ్ళాను. అక్కడ పచ్చిక బయలు మీద ఒక అమ్మాయి బోయవాని వలలో చిక్కుకున్న విహంగంలా, అకృత్యానికి పాల్పడ్డ ఆగంతకుని బారి నుంచి బయటపడటానికి పెనుగులాడుతోంది. ఆమె శీలాన్ని దోచుకున్న ఆ దుర్మార్గుడు, నా రాకను పసిగట్టి చీకట్లలో అదృశ్యమైపోయాడు.

    నేను ఆమెను సమీపించాను. నేనెవరో తెలియకపోయినా నన్ను చూసి ఆమె గొల్లుమంది. గట్టుతెగిన ఏరులా జలజలరాలిన కన్నీటి బిందువులు ధారలై ఆమె చెక్కిళ్ళపై ప్రవహించాయి. దుఃఖాన్ని అదుపులో పెట్టుకోలేక పోయింది.

    ఆమె వయసు ఇరవై సంవత్సరాలకు మించి ఉండదు. పక్క ఊర్లో ఉన్న తన స్నేహితురాలింటికి వెళ్ళి వస్తున్నట్టు చెప్పింది. తండ్రికి చెప్పకుండా కార్లో బయల్దేరానని తిరిగి వస్తున్నప్పుడు రోడ్డుకు అడ్డంపడి ఉన్న ఒక మనిషిని చూసి కారు ఆపాననీ ఇదంతా పారిపోయిన ఆ  దుర్మార్గుడు ఆడిన నాటకం అని ఆమె చెప్పింది. అత్యాచారం జరిగినందుకు బాధపడవద్దని అది ఒక కల అనుకుని మరచిపోవాలనీ ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉందనీ నేను ఆంకు సలహా ఇచ్చాను. తన ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాననీ, నా కార్లో కూర్చోమనీ చెప్పాను. అందుకు ఆమె అంగీకరించలేదు. తమ కారుని ఆ ప్రదేశంలో విడిచి, మరొకరి కార్లో ఇంటికి వెళ్తే పరిస్థితి మరింత జటిలం అవుతుందని ఆ అమ్మాయి చెప్పింది. ముఖ్యంగా తన తండ్రికి భయపడి అలా చెబుతున్నాననీ, అందుకు క్షమించమనీ ఆమె కోరింది. తన దగ్గరకు వచ్చి తండ్రిలా ఓదార్చినందుకు నాకు కృతజ్ఞత తెలుపుతూ ఆమె నా సహాయాన్ని అర్థించింది.తను మానభంగానికి గురైన సంగతి బయటపడితే తన తల్లిదండ్రులు తట్టుకోలేరనీ, అందుకే ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియపర్చనని మాటివ్వమనీ వేడుకుంది. మనసులో ఆమె పడే ఆవేదాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడ జరిగిన నేరంలో ఆమె తప్పులేదు. ఆమె కోరికను నెరవేర్చటం నా ధర్మం నేను తలచాను. 'నువ్వు భయపడకు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పను' అని నేను ఆనాడు ఆమెకు అభయమిచ్చాను.

    "ఏరా సారథీ! మాట్లాడవేంటి... జవాబుకోసం మహేంద్రబాబుగారు మనవేపే చూస్తున్నారు. నువ్వు నోరు విప్పితే కదా నేను ఏమైనా చెప్పగలను" అన్నాడు కృష్ణమూర్తి.

    "పెళ్ళి చేసుకుంటే వైష్ణవినే చేసుకుంటాను. అంతే కానీ మరో అమ్మాయిని చేసుకోను". సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పద్మారావ్‌నగర్ కార్లో తీసుకెళ్తున్నప్పుడు రమాకాంత్ చెప్పిన సంగతి జ్ఞప్తికి వచ్చింది. మూడేళ్ళ కిందట అత్యాచారానికి గురైన వష్ణవిని రమాకాంత్‌కిచ్చి పెళ్ళి జరిపించడం న్యాయమా?... ఈ విషయం ఈ రోజు కాకపోయినా కొంతకాలం తరువాత కృష్ణమూర్తి నాలెడ్జ్‌కి రాకపోతుందా?... అప్పుడు కృష్ణమూర్తి నన్ను దగ్గరకు చేరనిస్తాడా? ఒకవేళ దగ్గరకు రానిచ్చినా 'ఒరేయ్ ఇలాంటి అమ్మాయితో నా కొడుకు పెళ్ళి జరుగుతుంటే నువ్వు కళ్ళు మూసుకుని ఎలా కూర్చున్నావ్?' అని దుమ్ము దులపడూ. 'నీ కళ్ళెదుట జరిగిన విషయాన్ని నాకు తెలియపర్చకుండా ఎందుకు దాచావు?' అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటాడు.

    పెళ్ళి చూపుల కార్యక్రమం దాదాపు అయిపోయినట్టే. నేనేం చెప్తానో అని ఎదురు చూస్తున్నాడు రమాకాంత్. నేను చెప్పిన మాటే అక్కడ చెల్లుతుందన్న విషయం రమాకాంత్‌కి బాగా తెలుసు.

    భయం నుంచి వైష్ణవి ఇంకా కోలుకున్నట్టు లేదు. నాకూ, కృష్ణమూర్తికీ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ఆమె ఈపాటికి తెలుసుకుని ఉండొచ్చు. తనకిచ్చిన అభయాన్ని పక్కనపెట్టి ఈ సంబంధం క్యాన్సిల్ చేయమని కృష్ణమూర్తికి సలహా ఇస్తానని ఆమె ఊహిస్తూ ఉండొచ్చు.

    "సారథీ! నువ్వు బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావేంటి? చెప్పరా, ఏం చేయాలో..." అన్నాడు కృష్ణమూర్తి నావైపు తిరిగి.

    "కృష్ణమూర్తీ ఈ విషయంలో నేనేం మాట్లాడేది?... ఇది పెళ్ళిచూపులు కార్యక్రమం. అంటే వరుడు వధువుని, వధువు వరుణ్ణి చూసుకుంటారు. ఒకరినొకరు ఇష్టపడితే డాబామీదకెళ్తారు మాట్లాడుకోటానికి" అన్నాను నేను, అందరికీ వినబడేలా. రెప్పపాటులో కాబోయే వధూవరులు కూర్చున్న సోఫా ఖాళీ అయిపోయింది.

    "చూడు సారథీ, నువ్వలా చెప్పావో లేదో రమాకాంత్ వైష్ణవిని తీసుకుని, ఎంత తొందరగా డాబా మీదకు పరుగెత్తాడో" అన్నాడు కృష్ణమూర్తి అక్కడినుంచి బయటకెళ్ళి మెట్లెక్కుతున్న కొడుకునీ కాబోయే కోడల్ని చూసి.

    అతిథులంతా సంతోషంగా లేచి కృష్ణమూర్తిని, మహేంద్రబాబు దంపతుల్ని అభినందించారు. 

* * *

    వర్షం ఇంకా తగ్గు ముఖం పట్టలేదు. 

    బాంబే వెళ్ళాల్సిన ఫ్లయిట్ ఒక గంట లేటుగా బయల్దేరుతుందని ఎంక్వయిరీలో చెప్పారు. 

    "ఈ విషయం నాన్నగారికి తెలిసి ఉండొచ్చు. అందుకే ఇంకా రాలేదు" అన్నాడు రమాకాంత్.

    వైష్ణవిని విశ్రాంతి హాల్లో కూర్చో బెట్టి నేను, రమాకాంత్ టాయ్‌లెట్ వైపు వెళ్ళాం. తిరిగి వస్తున్నప్పుడు కాఫీకార్నర్ వద్ద నిలబడ్డాం. రమాకాంత్ రెండు కప్పుల కాఫీ తెచ్చి నా చేతిలో ఒకటి పెట్టాడు.

    "రమాకాంత్! వైష్ణవిని కూడా తీసుకు వచ్చి ఉంటే బాగుండేది" అన్నాను. 

    "ఫర్వాలేదు అంకుల్. వైష్ణవి కాఫీ తీసుకోదు" అన్నాడు రమాకాంత్.

    నేను కాఫీ తాగుతూ ఆలోచనలో పడ్డాను. వైష్ణవికి మేలు తలపెట్టి రమాకాంత్‌కి అన్యాయం చేశానా? నిజాన్ని గుట్టుగా ఉంచటం కూడా ఒక రకంగా నేరమే.

    "అంకుల్ పెళ్ళిచూపులు ఏర్పాటు చేసిన రోజు నుంచీ కనిపెడుతూనే ఉన్నాను. మీరు ఏదో టెన్షన్ ఫీలవుతున్నారు. అదేరోజు సాయంత్రం తాంబూలాలు పుచ్చుకున్నప్పుడు, ఆ తరువాత వారం రోజులకు సింహాచలంలో నా పెళ్ళి వైష్ణవితో జరిగినప్పుడు ఇదే వరస. మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించలేక పోయారు. కిందటిసారి అంటే నేను స్టేట్స్‌కు వెళ్ళక ముందు ఒకసారి మా ఇంటికి వచ్చి రెండురోజులున్నారు. అప్పుడు నన్ను విడిచిపెట్టలేదు. ఎన్నో కబుర్లు చెప్పారు. తమాషాగా నవ్వించారు. మీ మనసులో రగిలే వ్యథకు కారణం మీరు చెబుతారా లేక నన్నే చెప్పమంటారా?" అడిగాడు రమాకాంత్, ఖాళీ కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి.

    కాఫీ తాగటం అయిన తరువాత నేను, రమాకాంత్ మెల్లగా నడుచుకుంటూ పోర్టికో దగ్గరికెళ్ళి నిలబడ్డాం.

    "రమాకాంత్! నా టెన్షన్‌కు కారణం నువ్వు చెబుతావా?" ఆశ్చర్యంగా అతని మొహం చూశాను.

    "ఏం చెప్పకూడదా?" అన్నాడు రమాకాంత్.

    "అది కాదు. నా ఆందోళనకు కారణం..."

    "నాకు తెలుసు అంకుల్. మీరు వర్రీ కావద్దు. వైష్ణవి చెప్పింది - జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పవద్దని మిమ్మల్ని కోరినట్టు. అలా కోరి ఉండకపోతే విషయం పోలీసుల వరకూ వెళ్ళటం, పేపర్లలో రావటం, కేసులు, సాక్ష్యాలూ - పరిస్థితి మా పెళ్ళికి అనుకూలంగా ఉండకపోను. అత్యాచారానికి బలైన స్త్రీ సంఘంలో తలెత్తుకోకుండా చేయటం చాలా అన్యాయం. రేప్ కూడా ఒకరకంగా యాక్సిడెంటే అని అంతా తలచిన రోజు స్త్రీ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా తలెత్తి జీవించగలుగుతుంది. ఆ రోజుకు మనమంతా ఎదురు చూడాలి అంకుల్" అన్నాడు రమాకాంత్ ఆవేశంగా.

    "చూడు రమాకాంత్ నీ అభిప్రాయంతో పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను. నిన్ను అభినందిస్తున్నాను.వైష్ణవిని నువ్వు సహృదయంతో అర్థాంగిగా స్వీకరించినందుకు నీకు చేతులెత్తి దండం పెట్టాలి. కానీ నువ్వు నా కొడుకు లాంటివాడివి. ఆ పని నేను చేయకూడదు. ఆల్ ది బెస్ట్" అన్నాను నేను.

    "థ్యాంక్స్ అంకుల్... ఒక సంగతి మీకు చెప్పాలి. జరిగిన అకృత్యం గురించి నేను నాన్నగారికి చెప్పలేదు. ఆఫ్‌కోర్స్ అలా చెప్పకపోవడంలో నా స్వార్థముంది. మెజిస్ట్రేటుగా పని చేసినప్పుడుగాని, జడ్జిగా పనిచేసినప్పుడుగాని ఇటువంటి కేసుల్లో నాన్నగారు సరైన తీర్పునే ఇచ్చేవారు. ఆ సంగతి నాకు తెలుసు. కానీ రేప్‌కు బలైన ఒక అమ్మాయిని ఆయన తన కోడలిగా స్వీకరిస్తారా అన్న సందేహం నాకు కలిగింది. నిజం బయటపెడితే ఈ సంబంధం మనకొద్దు అని నాన్నగారు అంటారేమోనన్న భయంతో జరిగిన విషయం నేను చెప్పలేదు" అన్నాడు రమాకాంత్.

    "సరేలే బాబూ! నువ్వు దాని గురించి ఆలోచించకు. అంతా మన మంచికే అనుకోవాలి... అదీగో మీ డాడీ కారు దిగుతున్నాడు. నే వెళ్ళి కలుసుకుంటాను. నువ్వెళ్ళి వైష్ణవి దగ్గర ఉండు" అన్నాను నేను కారు పార్కింగ్ దగ్గరకెళ్తూ.

    వర్షం తగ్గింది కానీ మెల్లమెల్లగా పడుతున్న తుంపరకు వేసుకున్న బట్టలు తడుస్తున్నాయి.

   "సారథీ! ఎంతసేపైంది నువ్వొచ్చి? వర్షంలో చిక్కడి పోయావేమోనని గాభరా పడి ఇమ్లిబన్ బస్‌స్టాండ్ వరకూ వెళ్ళి వస్తున్నా..." గ్రౌండ్ దాటి నావైపు వస్తున్న కృష్ణమూర్తి అన్నాడు.

    "నేను చాలా ఎర్లీగా వచ్చాను" అన్నాను.

    ఇద్దరం లాంజ్‌లో కూర్చున్న నూతన దంపతుల దగ్గరకెళ్ళాం. లేటు ఇంకో అరగంట పెరిగిందని చెప్పాడు  రమాకాంత్.

    "ఇట్సాల్ రైట్ - వీళ్ళ దగ్గర మనమెందుకు? పద అలా వెళ్ళి కాఫీ తాగి వద్దాం" అన్నాడు కృష్ణమూర్తి.

    "ఇప్పుడే రమాకాంత్, నేను వెళ్ళి కాఫీ తాగి వచ్చాం" అన్నాను.

    "ఫర్వాలేదు మరో కప్పు కాఫీ తీసుకుంటే నీ ఆరోగ్యం చెడిపోదులే. ఈ వాతావరణంలో ఎన్నిసార్లు కాఫీ సేవించినా ప్రమాదం ఏమీ ఉండదు."

    "ఓ.కే. నీ మాట నేనెప్పుడు కాదన్నాను?"

    ఇద్దరం కాఫీ కార్నర్ వైపు నడిచాం. చెరో కప్పు కాఫీ తీసుకుని ఆ పక్కనే ఉన్న కుర్చీలో చతికిలబడ్డాం.

    "ఒరే సారథీ! నిన్ను ఇక్కడికి తీసుకు రావటానికి కారణం ముఖ్యంగా నీకు కాఫీ ఆఫర్ చేయటానికి కాదు."

    కృష్ణమూర్తి మాట చెవిన పడగానే నా గుండె జలదరించింది.

    "రెండు మూడు రోజుల నుంచీ అనుకుంటున్నా - నీకో విషయం చెప్పాలని. కాని ఆ సంగతి ఫోన్‌లో చెప్పేది కాదు. ముఖస్తంగా చెప్పటానికి నువ్వు వైజాగ్ లోనూ, నేను హైదరాబాద్‌లోనూ కూర్చున్నాం.ఇద్దరం కాసేపు ముచ్చటించుకోటానికి ఇప్పుడే టైం దొరికింది."

    "ఈ ఉపోద్ఘాతం ఎందుకుగాని అసలు విషయానికి రా" అన్నాను.

    బేరర్ వచ్చి మా పక్కనున్న కాఫీ కప్పులు తీసుకెళ్ళాడు.

    కృష్ణమూర్తి చెప్పటం మొదలెట్టాడు.

    "సారథీ నువ్వు నన్ను క్షమించాలి. నీకు ఒక విషయం చెప్పలేదురా - అందుకే క్షమించమని కోరుతున్నాను. నీకు చెప్పకుండా విషయాన్ని రహస్యంగా ఉంచానంటే నీకు ద్రోహం చేసినట్టే కదా! ఆ సంగతి నీకు చెబితే వైష్ణవి సంబంధం మనకొద్దని చెబుతావని నేను భయపడ్డాను. నువ్వు నో అన్నాక నేను యస్ అనలేను. అనను. ఫలితంగా రమాకాంత్ పెళ్ళి ఆగిపోతుంది. వాడి మనసు బాధపడుతుంది. వాడు బాధపడితే నేను తట్టుకోలేను. అందుకేరా చెప్పలేదు. అయితే ఇప్పుడు నీకు చెప్పలేదన్న బాధ నన్ను బతకనీయటం లేదు. తాంబూలాలు పుచ్చుకున్న మర్నాడు రాత్రి పదిగంటలకు మహేంద్రబాబు మా ఇంటికి వచ్చార్డు. అతని మొహం నిస్తేజంగా ఉంది. బాధపడుతూ అతను చెప్పాడు - బావగారూ, నాకు ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. 'నీ కూతురు వైష్ణవిని నేనే రేప్ చేశాను. ఎందుకో తెలుసా? నువ్వు నా మీద కేస్ పెట్టించి రెడేళ్ళ జైలు శిక్ష అనుభవించేటట్టు చేశావ్. ఈ కేసు అయిదేళ్ళ కిందట జరిగింది. నువ్వు మరిచిపోయినా నేను మరచిపోలేదు. ఆ పగతోనే మూడేళ్ళ కిందట నీ కూతురిని రేప్ చేశాను. ఇప్పుడు తాంబూలాలు పుచ్చుకున్నావు. కానీ నీ కూతురు పెళ్ళి జరగదు. ఆకాశరామన్న...'తన చేతిలో ఉన్న ఉత్తరం నాకు చూపించాడు మహేంద్రబాబు. "ఇప్పుడు నన్నేం చేయమంటారు బావగారూ! ఆకాశరామన్న ఉత్తరం సంగతి వైష్ణవికి చెప్పలేదు. మీరు ఎలా చెబితే అలా చేస్తాను" అంటూ మహేంద్రబాబు నా చేతులు పట్టుకున్నాడు కంట తడిపెడుతూ. రిటైర్డు పోలిస్ ఆఫీసర్ మహేంద్రబాబు నిజాయతీకి నేనెంతో గర్వపడ్డాను. ఆయనకు నేను ధైర్యం చెప్పాను. 'పెళ్ళి తప్పిపోతుందన్న భయం మీకుఒద్దు. ఎందుకంటే ఇందులో వైష్ణవి తప్పు నాకు కనబడ్లేదు. అందువల్ల అటువంటి అమాయకురాల్ని శిక్షించే హక్కు మీకు లేదు. నాకు అంతకన్నా లేదు. ఆకాశరామన్న ఉత్తరాన్ని మనం పరిగణనలోకి తీసుకోవద్దు. మేరేజ్ వెన్యూ ఛేంజ్ చేద్దాం. అయితే ఈ విషయం రహస్యంగా ఉంచాలి. పెళ్ళి జరిగిన తరువాత రమాకాంత్ వెంట వైష్ణవి అమెరికా వెళ్ళిపోతుంది. కాబట్టి వైష్ణవికొచ్చే ప్రమాదం ఏమీ ఉండదు' అని మహేంద్రబాబుకు చెప్పాను. నా మాట విన్న తరువాత అతనికి కొండంత ధైర్యం వచ్చింది... మరో విషయం, మహేంద్రబాబుకు  వచ్చిన ఆకాశరామన్న ఉత్తరం గురించి రమాకాంత్‌కు నేను తెలియపర్చలేదు. ఎందుకు చెప్పలేదని నువ్వడగొద్దు. ఆ విషయం అనవసరం అనిపించింది" కృష్ణమూర్తి అన్నాడు.

    "కంగ్రాట్స్ కృష్ణమూర్తీ"

    "ఎందుకు?" ఆశ్చర్యంగా నా కళ్ళల్లోకి చూశాడు కృష్ణమూర్తి.

    "ఎందుకంటావేమిటి - నువ్వు తీసుకున్న నిర్ణయానికి... నువ్వు, నేను చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. కానీ నీలో ఇటువంటి ఆదర్శభావాలు ఉన్నాయన్న సంగతి నేనింతవరకూ తెలుసుకోలేక పోయాను. అయామ్ రియల్లీ ప్రౌడాఫ్‌యూ మూర్తీ" అన్నాను అతన్ని గట్టిగా వాటేసుకుని.

    "సారథీ నా మనసు గాలిలో తేలిపోయినట్టుందిరా. నీతో అన్నీ చెప్పాను. ఇప్పుడు నా మనసు తేలిక పడింది" చెప్పాడు కృష్ణమూర్తి.

    "సరేలేరా, మన కోసం రమాకాంత్, వైష్ణవి చూస్తుంటారు. ఈపాటికి మహేంద్రబాబు దంపతులు కూడా వచ్చి ఉండొచ్చు... పద" అన్నాను.

    కృష్ణమూర్తి హడావిడిగా లేచాడు. ఇద్దరం విశ్రాంతి హాలు వైపు ఆదరాబాదరాగా దౌడు తీశాం.

    బాంబే ఫ్లయిట్ బయల్దేరే టైం దగ్గర పడింది. అమెరికాలో వైష్ణవిని చాలా జాగ్రత్తగా చూసుకుని జీవితం సాగించాలని రమాకాంత్‌కి సలహాలిస్తున్నాడు కృష్ణమూర్తి. అంతవరకూ మహేంద్రబాబుతో మాట్లాడుతున్న వైష్ణవి నా దగ్గరకొచ్చి నిలబడింది.

    "అంకుల్ మిమ్మల్ని బాబాయని పిలవొచ్చా?" అడిగింది వైష్ణవి.

    "నేను నీ బాబాయినే... ఎందుకంటే మీ మామగారు, నేను దూరపు బంధువులం. వరుసకి బావా బావమరదులం. బంధుత్వం కన్నా స్నేహానికే ఎక్కువ విలువనిచ్చే వాళ్ళం. అందువల్ల మా బంధుత్వం గురించి ఈ ఊళ్ళో చాలామందికి తెలియదు. ఆ విధంగా నీకు నేను బాబాయినే అవుతాను" అన్నాను నవ్వుతూ.

    "బాబాయి మీ మేలు నేను జన్మజన్మలకూ మర్చిపోలేను. నాకిచ్చిన మాట..."

    "ష్... అలా చెప్పొద్దు వైష్ణవీ... ఇందులో నేను చేసిందేమీ లేదు. అంతా పైవాడేనమ్మా చేశాడు. చేసేది వాడే. చేయించేది వాడే... మనం నిమిత్తమాత్రులం. ఆ విషయం అర్థం చేసుకుని జీవితం సాగించిన నాడు మనకెటువంటి ఆపదా రాదు తల్లీ... వెళ్ళిరా వైష్ణవి టైమయినట్టుంది. ఆల్ ది బెస్ట్. మళ్ళీ వచ్చినప్పుడు ఈ బాబాయికి మనవణ్ణి చూపించాలి" అన్నాను నవ్వుతూ.

    రెండు చేతులూ జోడించి వైష్ణవి నమస్కరించింది. ఆమె కళ్ళలో వెలుగు, మొహంలో సంతోషం చూశాను. ఆమె కళ్ళ్ల్లో పేరుకున్న అశ్రుబిందువులు ఆమె చెక్కిళ్ళపై దొర్లాయి. మూడు సంవత్సరాల కిందట ఆమె కన్నీటి దారలను చూసి నా ఆత్మ క్షోభించింది. ఇప్పుడు ఆమె లేత బుగ్గలపై జారిన ఆనందభాష్పాలను చూశాక నా హృదయం ఆనందంతో పరవశించిపోయింది.

(ఈనాడు ఆదివారం 29-7-2001 సంచికలో ప్రచురితం)      
                 
Comments