అభినందన - గురజాడ శోభాపేరిందేవి

    
    బగారా బైగన్ చాలా రుచిగా అనిపించడంతో మరింత వడ్డించుకుని గబగబా తినసాగాడు విమల్. 

    "కూర వేసుకున్నారా?" వంటింట్లోంచి అడిగింది అతని భార్య విహ్వల.

    "వేసుకున్నాను"

    "ఎలా ఉంది?"

    "కూర సంగతి అలా ఉంచి నా కర్చీప్, సాక్స్ తీసిపెట్టు టైమ్ ఐపోతోంది" అన్నాడు విమల్.

    చెయ్యి కడుక్కుని గబగబా బూట్లు తొడుక్కుని బైక్ స్టార్ట్ చేసాడు.

    ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని వేళ్ళకీ, కళ్ళకీ పని పెట్టాడు.

    లంచవర్లో బాస్ స్టాఫ్‌ని తన కేబిన్‌కి పిల్చాడు.

    "ఇవాళ మా ఆవిడ మీ అందరి కోసం ఒక స్పెషల్ చెసి పంపిందోయ్" అన్నాడు బాస్.

    "అదేంటి సార్?" కుతూహలంగా అడిగాడు ఒకతను.

    "బగారా బైగన్ చేసింది. రుచి చూసి ఎలా ఉందో చెప్పండి" అన్నాడు బాస్.

    అందరూ ఇలా నోట్లో పెట్టుకుని అలా "వహ్వా", "యమ్మా" అంటూ బాస్‌ని పిగడ్తలతో ముంచెత్తారు.

    ఉప్పు, కారం సమపాళ్ళల్లో పడక, ముక్కలు సరిగ్గా ఉడకక పరమచెత్తగా ఉన్న ఆ కూరని గురించి అందరూ ఎంతోసేపు పొగిడారు.

    విమల్ మరో అడుగు ముందుకేసాడు.

    "మేడమ్‌కి కంగ్రాట్స్ చెప్తాను. ఫోన్ నెంబర్ చెప్పండి సర్" అని అడిగి ఆవిడ సెల్‌కి డయల్ చేసాడు.

    "ఫైవ్ స్టార్ హోటల్ వాళ్ళు కూడా చెయ్యనంత రుచిగా చేసారు మేడమ్ మీరు. మా అభినందనలు అందుకోండి" అన్నాడు.

    బాస్ ముఖం చేటంతైంది.

    విమల్‌కి కావలసినది అదే! మస్కా కొడ్తే తప్ప ఏకార్యమూ కాదు. అందుకే ఏ చిన్న అవకాశం దొరికినా వినియోగించుకుని తీరాలి. ప్రమోషన్లకోసం ఇలాంటి పాట్లు తప్పవు.

    లంచవర్ తర్వాత సీట్లో కూర్చున్న విమల్‌కి తనమీద తనకే కోపం వచ్చింది.

    చాలా రుచిగా ఉన్నా ప్రొద్దున తను భార్య అభినంచలేదు. 'ఎలా ఉంది?' అని ఆమె అడిగినా మాట దాటేసాడు.    

    ఆఫీసర్ భార్య చేసిన చెత్తాతి చెత్తకూర సూపర్‌గా ఉందని పనికట్టుకుని ఆమెకి ఫోన్ చేసి మరీ చెప్పాడు. 

    అవసరమైతే వసుదేవుడంతటివాడు కూడా గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. నిజమే!

    కా...నీ భార్యని ఇంట్లో తను ఎందుకు అభినందిచ లేకపోయాడు?

    పెదవి చివరనుండి పొగడ్తలు కురిపించగలుగుతున్న తను అంతరంగం అడుగునుండి అభినందని ఎందుకు అందించ లేకపోయాడు?

    తనకి అడ్డొచ్చినదేమిటి ఇగోనా?

    లేక భార్య కాబట్టి అభినందించనక్కర లేదనే భావన తనకి కలిగిందా?

    అన్యమనస్కంగానే ఆలోచిస్తూ ఉండిపోయాడు.

    రాత్రి ఇంటికి చేరి కాలింగ్‌బెల్ నొక్కాడు.

    విహ్వల తలుపు తీసింది.

    విమల్ లోపలికి వచ్చాడు.

    ఆమెతో ప్రొద్దుటి కూరబాగుందని చెప్పాలని ఉన్నా ఎందుకో చెప్పలేకపోయాడు.

    "పిల్లాడు పడుకున్నాడా?"

    "ఇవాళ వాడెంత సంతోషంగా ఉన్నాడో తెల్సా అండీ? టెడ్డీ బేర్ టెడ్డీ బేర్ టర్న్ అరౌండ్ రైమ్ బాగా చెప్పాడని వాళ్ళ టీచర్ మెచ్చుకుందిట. ఆ సంతోషంలో మిగతా రెండు రైమ్‌లూ నేర్చుకుని ఇప్పుడిప్పుడే ఇంత లేట్‌గా పడుకున్నాడు" అంది విహ్వల.

    విమల్ నిద్రపోతున్న కొడుకు దగ్గరికి నడిచాడు.    

    పసివాడి పెదవులు నిద్రలో కూడా నవ్వుతున్నాయి.

    అభినందన వాడికి ఆత్మవిశ్వాసం ఇచ్చినట్టుంది అనుకున్నాడు.

    విహ్వల వడ్డించిన పదార్థాలు ఆలోచిస్తూనే తిన్నాను అనిపించాడు. 

    ఏదోగా ఉంది! అదోలాంటి గిల్టీ!!

    మంచం మీద వాలినా నిద్ర రాలేదు.

    సెల్‌ఫోన్ మ్రోగింది.

    "ఈవేళప్పుడు ఎవరు చేసారో ఏమో" అని విసుక్కుంటూ "హలో" అన్నాడు విమల్.

    "విమల్ కంగ్రాట్స్‌రా" అరిచినట్లుగా అన్నాడు అతని మేనమామ.

    "దేనికి మామయ్యా?"

    "నీ కథ పత్రికలో చదివాను. చాలా బాగుంది."

    "అదా థాంక్స్ మామయ్యా"

    "ఆ పత్రిక మా ఊరికి లేట్‌గా వస్తుందిగా! అందుకే బావ ఆఫీస్‌నుండి ఇవాళ సాయంత్రమే తెచ్చాడు. చదవగానే నీకు అభినందనలు అందించాలి అనిపించింది. కానీ నువ్వు ఏ ట్రాఫిక్‌లో ఉంటావో, బాస్ కేబిన్లో ఉంటావో అని భయపడి జాప్యం చేసాను."

    "అలాగా!"

    "త్వరగా పడుకోండి. మరీ రాత్రైతే మీకు నిద్రపట్టదని మీ అత్తయ్య ఒకటే గోల. కేన్సర్‌తో నెట్టుకొస్తున్నవాడిని కదా! ఏ అర్థరాత్రో నిద్రలోనో నెప్పితోనో ప్రాణాలు వదిలేసాననుకో నీకు చెప్పాలనుకున్న మాట నాతోనే మిగిలిపోతుంది కదా!"

    "ఛ ఛ అవేం మాటలు మామయ్యా"

    "నిజంరా విమల్! మరో సంగతి చెప్పనా? ఓ మనిషిని తిట్టాలి అనుకున్నామనుకో చచ్చినా ఆ విషయం మర్చిపోము. కానీ ఓ వ్యక్తిని మనసారా మెచ్చుకోవాలి అని అనుకున్నా ఆ క్షణం అది కుదరకపొతే వెంటనే మర్చిపోతాము. అది మానవ నైజం. అందువల్ల కంటికింపుగా మనసుకి నచ్చినదిగా ఏది అనిపించినా అమాంతం చెప్పేయాలి. ఆ మాట మనం చెప్తే వినేవారికి వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. కొండంత ఆత్మ విశ్వాసం కలుగుతుంది. అంతే కాదురా వాళ్ళ ముఖాల్లో వెలుగు చూసిన మన మనసూ మనని అభినందిస్తుంది. ఉంటాన్రా. ఆయాసం వస్తోంది" అని ఫోన్ పెట్టేసాడు మామయ్య. 

    విమల్‌కి మామయ్య మాటలు చాలా చాలా నచ్చింది.

     "ఎలా ఉన్నారండీ బాబాయిగారు?" అడిగింది విహ్వల.

    "బాగానే ఉన్నాడు. అది సరే కానీ విహ్వలా బగారా బైగన్ చాలా బాగుంది" అన్నాడు విమల్.

    'ప్రొద్దున్న చేసిన కూరని గురించి అసందర్భంగా ఇప్పుడు చెప్తున్నాడేంటితను?' అన్నట్లు చూసింది విహ్వల.

    "ప్రొద్దున్నే చెప్దామనుకున్నాను. కానీ ఆఫీసు హడావిడిలో మర్చిపోయాను. అందుకే ఇప్పుడు చెప్పాను" అన్నాడు.

    అభినందన ఆలస్యంగా చెప్పినా అభినందనే!

    అది అందుకున్న వ్యక్తికే కాదు ఆమాట అందజేసిన వ్యక్తికీ ఎంత ఆనందం కలుగుతుందో ఆ క్షణంలోనే అర్థమైంది విమల్‌కి. 
Comments