ఏకాకి -వింజమూరి అచ్యుతరామయ్య,

 
       బదిలీపై నగరానికొచ్చిన రామనాథానికి అద్దె యింటి ప్రయత్నంలో చెప్పుల్ని అరగదీసుకోకుండానూ, విలువైన సమయాన్ని పాడు చేసుకోకుండానే టు-లెట్ బోర్డు ఆహ్వానం పలికింది ఓ వీధిలో.

* * *

        ఇంటావిడ ఇల్లు చూపిస్తూ, నన్ను పరీక్షిస్తూనే, తనగురించీ చెప్పుకుంటూ వచ్చి, కొనసాగింపుగా "డాక్టర్లు విశ్రాంతిగా వుండమన్నారు. ఎప్పుడయినా అవసరం పడితే డాక్టరు దగ్గరకు వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాను. నాకు నేనుగా వెళ్ళడం కష్టంగా వుండి ఇంట్లో అద్దెకుండే వారిపై ఆధార పడుతూ వస్తున్నాను. ఇంతకు ముందు కాలేజ్ కుర్రాళ్ళు అద్దెకుండేవారు. వాళ్ళు చదువులు ఏం వెలగబెట్టేవారో,తెలియదు కానీ, ఇంట్లో శుభ్రంగా సిగరెట్లు వెలగబెట్టి నాకు విపరీతమైన దగ్గు తెప్పించేవారు. ఏ అపరాత్రో వచ్చి పడుకునేముందు కబుర్లాడుతూ నా నిద్రను పాడు చేసేవారు. ఏరా అబ్బాయిలూ, ఇలా అయితే ఎలా ప్రయోజకులవుతారురా? అంటే, అదికాదు బామ్మగారూ కంబైండు స్టడీస్, కంప్యూటరు క్లాసులూ అంటూ మాట దాట వేసేవారు. ఏ కంటి డాక్టరో, పంటి డాక్టరో అవసరం పడితే, నలుగురిలో ఏ ఒక్కరూ నాకు సహకరించిన దాఖలాలు లేవు. అయినా వాళ్ళ చదువులు వారివి. చదువులు పూర్తయి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళి పోయారు." "అదీ నాయనా ఖాళీ చేసి వెళ్ళిన వారి కథ. వారికి భిన్నంగా నాకు చేదోడు వాదోడుగా వుండే వారికి యిద్దామని వుంది. వయస్సుని వంటినిండా కప్పుకున్న దాన్ని కదా? నాయనా" అంటూ రామనాథాన్ని వాలుకుర్చీలో కూర్చోబెట్టింది.

* * *  

        ఇల్లంతా కలియ తిరిగాకా రామనాథ్‌కి ఆ యింటిమీద ఓ అభిప్రాయానికి వచ్చి, యింటిలోకి దిగడానికే నిశ్చయించి, "చూడండి జానకమ్మగారూ, నేనూ మా ఆవిడే ఇంట్లో వుండేది. మాకా పిల్లలు లేరు. బంధువులనందరినీ విడిచి దూరంగా వచ్చాం. మీలాంటి పెద్ద వారి దగ్గర మసలడం మాకూ మంచిదే. మా ఆవిడా, మీరు ఒకరికొకరు తోడుగా వుండొచ్చు. డాక్టరు దగ్గరకంటారా? మిమ్మల్ని కానీ ఎత్తుకుని తీసుకెళ్ళాలా, ఏ ఆటోనో తీసుకొచ్చి చూపిస్తాము. మనుషులమైన తరువాత ఒకరినొకరు చూసుకోలేక పోతే ఎలాగండి బామ్మగారు" అంటూ రామనాథ్ యింట్లో రావడానికి సుముఖత చూపి, జానకమ్మ చేతికి అడ్వాన్సు అద్దె యిచ్చి ఆమె చేత ఓ.కే. అనిపించుకున్నాడు.

* * * 

        పది రోజుల కాల వ్యవధిలో రామనాథ్ భార్యను తీసుకుని జానకమ్మ యింటి వాటాలోకి రావడంతో అరమరికలు లేకుండా కాలక్షేపం చేస్తున్నాడు. రామనాథ్ యింటినుండి ఆఫీసుకి వెళ్ళాక,జానకమ్మ సుశీల (రామనాథ్ భార్య)పైనే ఆధారపడేది వైద్యపరంగా. భర్త చెప్పాడని కాకుండా వృద్ధాప్యంలో ఓ మనిషి అవస్థలు పడుతోంది అంటే చూస్తూ చూస్తూ ఎల కిమ్మనకుండా వుండగలదు. చదువు సంస్కారం తెలిసి వున్న సుశీలకి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు కొత్తలో జానకమ్మ.

* * * 

        రామనాథ్ పూర్తిగా ఉద్యోగంలో మునిగిపోయి పనికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. గవర్నమెంటు ఉద్యోగుల్లో చాలామంది ఈగల్ని తోలుకుంటూ వుంటారు. చాలా తక్కువమందే ఏనుగుల్ని మేపుకునే స్థాయి వుద్యోగులుగా వుంటూ వుంటారు. అటువంటి ఏనుగుల్ని మేపుకునే స్థాయి వుద్యోగంలో పడ్డాడు రామనాథ్.మనిషి మనుగడ మీద ఎప్పుడైతే అక్రమసంపాదన అజమాయిషీ చేస్తుందో, సరిగ్గా అప్పుడే కొన్ని బలహీనతలకు లోనవుతాడు కాబోలు. తక్కెడలో డబ్బు మొగ్గు చూపించే కొద్దీ రెండో వైపు సంస్కారాన్ని గుల్ల చెసుకుని చేతులు దులుపుకున్నాడు రామనాథ్.


* * * 

        ఇంటికి వేళకు చేరడం, భార్య బాగోగులు చూడడమే కరువైన రామనాథ్‌కి, ఇక జానకమ్మ అనే ప్రాణి ఉందని ఎలా గ్రహించగలడు. సుశీల మాత్రం పూర్తిగా మంచం పట్టిన జానకమ్మకు కుడి భుజం అయిపోయింది. 

* * *

        రోజులు గడుస్తున్నాయి కాని జానకమ్మ ఆరోగ్యంలో కానీ, రామనాథ్ వ్యవహారంలోకానీ మార్పు అంటూ ఏమీ లేదు. జానకమ్మకు సేవలు చేసి చేసి మందులూ, మాకులూ అంటూ తిరిగి తిరిగి సుశీల కూడా విసుగు చెందింది. ఇది సహజం కూడా. ఇంటి పని నిండా మునిగి అలసిన ఆడదానికి, భర్త వేళకు గడపతొక్కి కష్టసుఖాల్లో పాలుపంచు కున్నప్పుడే కదా పండగ. సుశీలకు మాత్రం అటువంటి పండగ వాతావరణం జానకమ్మ ఇంట్లో కలుగలేదు. 

* * *

        రామనాథ్ ఎప్పటిలాగే బయటికి పోతూవుండగా, "మీకు ఎంతసేపు మీ వుద్యోగం, ఆ బాపతు దొడ్డిదారి సంపాదన, అడ్డమైన స్నేహితులు, వంకర తాగుళ్ళు తప్ప భార్య, దాని మంచి చెడ్డలు,తల్లిదండ్రుల యోగక్షేమాలు, మన సంస్కారం మొత్తం కట్ట కట్టుకుని మీ కుసంస్కారంలో కొట్టుకు పోయినట్లున్నాయి. మీ ప్రవర్తన ఇలాగే కొనసాగితే మూలనున్న జానకమ్మ కంటే ముందుగా బెంగపెట్టుకుని నేను చావడం ఖాయం" అంటూ కొంచెం కోపం పాలుని ఎక్కువ 
కలిపి కాఫీ గ్లాసుని చేతికివ్వబోయి, టీపాయ్ మీద ఠపీల్‌మని పెట్టింది సుశీల.

* * *

        భార్య అన్న మాటల్లో వాస్తవం గ్రహించిన రామనాథ్ సుశీలను సుముదాయించే ప్రయత్నం చేయలేదు. ఇద్దరి మధ్యన నిశ్శబ్దం పరచుకుంది.రామనాథ్ ఆలోచనలో పడ్డాడు.
        "భర్త విషయంలో భార్య ఏనాడూ విసుగు చెందకూడదు. అటువంటిది విసుగు చెంది వెల్లడించిందీ అంటే లోపం పరస్పరం కావచ్చు. ఏక పక్షం కావచ్చు. ప్రస్తుత సమస్య అంతా నాదే. దీంట్లో సుశీల తప్పేమీ లేదు. నా ప్రవర్తనలో వచ్చిన మార్పుకు తోడు జానకమ్మ వయో పరిచర్యలు తోడై మానసిక వత్తిడి ప్రభావం తనపై పడింది. వయస్సుని గౌరవిస్తూ జానకమ్మపై కోపాన్ని నాపై ప్రదర్శించింది. దీనికంతటికి విరుగుడుగా తక్షణం వేరే ఇంటిలోకి మారడమే. దానితో సమస్య కొంతవరకు చల్లబడుతుంది" అని తనలో తాను అనుకుంటూ ఆఫీసుకు పోయేడు రామనాథ్.
* * * 

        మరో పది రోజులు గడిచాయి. జానకమ్మని పలకరిస్తూ మాటల మధ్యలో "బామ్మగారూ ఇన్నాళ్ళూ ఏదో సర్దుకు పోయేం. వచ్చే నెలలో వేరే యిల్లు చూసుకుని మారదామని అనుకుంటున్నాం. ఖాళీ చేసి వెళ్ళినా అప్పుడప్పుడు వచ్చి చూసి వెడుతుంటాము లెండి" అంటూ తన మనసులోని మాట భార్య సమక్షంలో తెలియ పరచాడు రామనాథ్ అద్దె యిస్తూ.

* * *


        వయసు రీత్య పట్టి పీడిస్తున్న వ్యాధులకంటే, రామనాథ్ సుశీల దంపతులు యిల్లు ఖాళీ చేస్తారన్న మాటలు జానకమ్మ గుండె నిబ్బరాన్ని దెబ్బతీసాయి. "ఇల్లు ఖాళీచేసి మీరు వెళ్ళిపోతామంటే నేను భూగోళాన్నే ఖాళీ చేసి వెళ్ళి పోవాల్సి వుంటుంది నాయనా. గత రెండు మాసాలుగా నా ఆరోగ్యం మరీ క్షీణించింది. ఎప్పటికప్పుడు సుశీల మందులు, మాకులూ అంటూ మింగిస్తూ వేళకు చూడబట్టి మనిషిగా మిగిల గలిగేను. మీరు వేరే ఇల్లు చూసుకుంటారంటే నాకు చావు దగ్గర పడిందన్న మాట. దయచేసి ఖాళీ చేయకండి. నాకంటూ ఇంక ఎవ్వరూ లేరు. ఒక్కగానొక్క కొడుకు జులాయిగా తిరిగి ఎక్కడికి పోయాడో తెలియదు. ఏనాటికైనా రాకపోతాడా? అని ఇన్నాళ్ళు ఎదురుచూశాను. ఇక వస్తాడన్న ఆశా నశించింది. మీరిరువురు నాకంటె వయసులో చిన్నవారు. మీకు నమస్కరించి ..." అంటూ కళ్ళు చమర్చింది జానకమ్మ.

* * *

        రామనాథ్ నెలాఖరుకి యిల్లు ఖాళీ చేసి వెళ్ళి పోతాడనగా, జానకమ్మ పిలిచి "నాయనా రామనాథ్ నీకు తెలిసున్న లాయరు నెవరినైనా తీసుకునిరా బాబు యింటి విషయంలో మాట్లాడే పని వుంది"అంది. జానకమ్మ రామనాథ్‌కి చెప్పక చెప్పిన పని కావడంచేత, ఎంత తొందరగా యిల్లు విడచి పోదామని ఉత్సుకతతో వుండటం చేత మరుసటి ఆదివారం ఓ లాయర్‌ని వెంట తీసుకుని జానకమ్మ దగ్గర కూచోబెట్టేడు రామనాథ్. 
 
        లాయరుగారు జానకమ్మ కుశల ప్రశ్నలలోనే ఇరువురిమధ్య వెనుకటి రోజుల్ని గుర్తు చేసుకోవడంతో యిల్లు విడిచిపోయిన కొడుకు తిరిగి రాలేదా? అంటూ పరామర్శించడం జానకమ్మకు కొంచెం ఊరటను కలిగించింది.   
 
        "లాయరు బాబు, యీ ఏకాకి గురించి అన్నీ మీకు బాగా తెలిసున్నవే. నాకొడుకు సరిహద్దులు దాటిపోయాడో, చనిపోయాడో తెలియదు. చిన్నప్పుడే నా హద్దులు దాటి చెడు అలవాట్లకు వశమైపోయాడు. అలా ఇల్లు విడిచిపోయినవాడు ఈరోజు వరకు రాలేదు. ఎవరెవరో ఎక్కడెక్కడో ఉన్నామని చూశామని చెబుతారు. వాడి జాడ అయితే ఇంత వరకు లేదు. ఇక వస్తాడని చిగురాశ కూడా లేదు.నేను ఈవేళా,రేపా అన్నట్టు మరణం అంచున ప్రయాణిస్తున్నా ను. నాది ఒక్కటే కోరిక. నా అనంతరం యీ యిల్లు 'అనాథ' కాకూడదు. నాకంటూ వీరిరువురూ తప్ప యింక ఎవ్వరూ లేరు. చట్ట ప్రకారం నా యింటిమీద సర్వ హక్కులూ సుశీలకు చెందేలా కాగితాలు తయారు చేయండి. కాగల ఖర్చును తీసుకోండి. అందుకు కావలసిన సంతకాలు పెడతాను" అంటూ మాటల్లో ఎంతో బాధని వ్యక్తపరిచింది సుశీల చేసిన సేవకు ౠణం తీసుకోదలచి.  
 
        నిజమే. బాల్యంలో బాల్య మిత్రులుంటారు. అమ్మా నాన్నలు బాల్యంలోకి ప్రవేశించి పిల్లలతో సమానంగా పిల్లలైపోతారు. కౌమారమూ, యవ్వనమూ దశలు రెండు మనకు తెలియకుండానే యిట్టే ఆ వయస్సు స్నేహితులతో చెట్టాపట్టాలెసుకుంటూ వెళ్ళిపోతా యి. వృద్ధాప్యం వచ్చేసరికి అది ఓ శాపంలా మిగిలి పోతుంది. వృద్ధుడికి మరో వృద్ధుడు తోడున్నా బాధల్ని పంచుకోవాలే తప్ప వాళ్ళకి సుఖాలేముంటాయి. కనీసం ఆ దశలో నా అంటూ చూసే కొడుకో, కూతురో, మముమడో, మనుమరాలో వెంట వున్నారు అంటే నిజంగా అదృష్టమో, వరమో అయివుండాలి అనుకుంటూ జానకమ్మ చేత సంతకాలు తీసుకుని లాయర్ నిట్టూర్చాడు.
 
* * *
 
        కాలవ్యవధిలో కాగితాలు ప్రాణం పోసుకున్నాయి. రామనాథ్ సంతోషానికి అవధులు లేవు. కలలోకూడా ఊహించని నిజాన్ని జానకమ్మ మంచినీళ్ళ ప్రాయంగా ధారాదత్తం చేసిన యింటిని చూసి ఉబ్బితబ్బిబ్బయి పోయేడు.  
 
* * *
 
        రామనాథ్ ప్రవర్తనలో మార్పు రాలేదు సరికదా తన యిష్టారాజ్యమై తొక్కవలసిన అడ్డదార్లన్నీ తొక్కి యింటిపట్టాన వుండేవాడు కాదు. భర్త ప్రవర్తనకు విసుగు చెంది పిల్లలు లేకుండానే సుశీల బ్రతుకు అన్యాయమైపోయింది. అందరికీ దూరమై అందినంత డబ్బుని సంపాదించుకుని రిటైరయిపోయిన రామనాథం ఇప్పుడు జానకమ్మ మంచం మీద సుశీలను తలుచుకుని వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. జానకమ్మ,జానకమ్మ యిల్లు అనాథ కాకపోవచ్చు. ఇప్పుడు రామనాథం అనాథే. రామనాథం ఇల్లూ అనాథే. 
 
(నేటినిజం దినపత్రిక ఆగష్టు 15,2001 సంచికలో ప్రచురితం)  
Comments