ఆదర్శ కుటుంబం - మంథా భానుమతి

    
ప్రకృతి మాత ఒడిలో కొండల మధ్య నున్న ఒక గ్రామం. ఆ గ్రామంలో అన్ని సదుపాయాలతో నిర్మించిన గురుకుల పాఠశాల అది. అక్కడ చేరిన విద్యార్ధులంతా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆడుతూ పాడుతూ ఉంటారు.     చిటారు కొమ్మలు కంటికి కనిపించనంత ఎత్తుకు ఎదిగిన చెట్లమధ్య తీరుగా వేసిన సిమెంటు రోడ్లు..రోజుకి మూడుసార్లు పడేవాన శుభ్రంగా కడిగేసి, దుమ్ముధూళి దరిదాపులకి రాకుండా చేస్తుంది. కొండలమధ్య ప్రొద్దున్నా సాయంత్రం పలుకరించేసూర్యుడు అందరి యోగక్షేమాలు విచారిస్తుంటాడు.     చదువుతోపాటు కులమతాలకతీతమైన మానవసంబంధాలు, ఆధ్యాత్మిక దృక్పధం రంగరించి బోధించే ఆదర్శపాఠశాల అది. గురుశిష్యుల నిష్పత్తి పదికి మించి ఉండదు.     అటువంటి పాఠశాలలో గొంతెత్తి స్వరాలు పలికిస్తూ, సంగీతం నేర్పించే టీచర్ని నేను. విశ్వం, హిస్టరీలో పి.హెచ్.డీ చేసి వైస్‌ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టాక, నన్ను పెళ్ళిచేసుకుని అక్కడకు తీసుకెళ్ళారు. ఆ వాతావరణానికి బాగా అలవాటు పడిపోయిన మేము, పదవీవిరమణ వయసు వచ్చేవరకూ అక్కడే ఉండిపోయాము.     మా పాఠశాలలో వసతి గృహాలు విచిత్రంగా ఉంటాయి. మేముండే ఇంట్లో మాపిల్లలు ముగ్గురితో పాటుగా ఇంకో పదిహేనుమంది రకరకాల వయసులవాళ్ళు ఉండేవారు. అందరి బాగోగులూ మేమే చూడాలి. అదే విధంగా అందరు అధ్యాపకుల ఇండ్లలోనూ!     కన్నుమూసితెరిచేలోగా కాలం ముఫ్ఫయ్యయిదేళ్ళు ముందుకు పరుగెత్తి, మమ్మల్ని భాగ్యనగరం తీసుకొచ్చింది. వచ్చిన కొత్తల్లో నాకు ఊపిరాడనట్లుండేది ఇక్కడి జనాల్నీ, వాళ్ళ పరుగుల్నీ చూసి. మా అబ్బాయి వినయ్, వాడి తరువాతది రేఖ.. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. వినయ్ కంటే పెద్దది రాణి. రాణి, అల్లుడు సుమంత్ డాక్టర్లు..మా కాలనీ లోనే ఉంటారు.     చక్కగా చదువుకున్న నా పిల్లలని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మాఇద్దరికీ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు భగవంతుడు. ఏ లోటూలేదు..కానీ నాలో ఏదో అశాంతి, అలజడి. రాత్రిళ్ళు నిద్దర పట్టదు.     "అన్నీ చూసుకోవడానికి ఆ అతీతశక్తి ఉంది..మనం నిమిత్తమాత్రులమే" అని అన్ని సంవత్సరాలు మా పాఠశాలలో మా పిల్లలతో పాటు నేర్చుకున్న "నిజం", నా నిజజీవితంలో ఎందుకు అమలు చెయ్యలేకపోతున్నాను? ఏదో నిర్లిప్తత..ఎంత అధిగమిద్దామని చూసినా నా వల్లకావట్లేదు. నా అశాంతికి కారణం నేను ఎంతో గర్వపడే నా పిల్లలే!

* * * * * *
    "త్వరగా రండి..మీకో తమాషా చూపిస్తా!" వినయ్ హడావుడికి, కావసినవి కంచాల్లో వడ్డించుకుని గబగబా హాల్లోకి వచ్చేశాం.     రేఖ, వినయ్.. టి.వీచూడ్డంలో ఏకాభిప్రాయానికి రావడం అరుదు. వంతు ప్రకారం ఒకరోజు రేఖకిష్టమైన ఫామిలీరాక్ కానీ డాన్స్ బేబీ డాన్స్ కానీ. ఇంకోరోజు వినయ్‌కి ఇష్టమైన టి.వీ నైన్, ఈటివీ లాంటి వార్తా ఛానల్స్.     ఇవేళ రాణీ, సుమంత్ కూడా ఉన్నారు. ఎప్పుడోకానీ ఇద్దరికీ ఒకేసారి తీరిక దొరకదు.     "నీ న్యూస్‌లో తమాషాలు కొత్తేముందిరా! ప్రేయసిని పొడిచేసిన వీర, ఘాటుప్రేమికుడు, న్యూస్‌పేపర్ రిపోర్టర్లని తన్ని, ఆఫీసు ధ్వంసంచేసిన ఫలానా పార్టీ కార్యకర్తలు.. ఇలాంటివేకదా!" రేఖ పెదవి విరిచింది.     "మరే! ఫామిలీరాక్‌లో రాకింగులకంటే నయమే." వినయ్ కవ్వించాడు.     "అసలు డాన్స్ మెచ్చుకోడానికి కళా హృదయంకావాలి."     "అబ్బో..అవో డాన్సులూ..అవి మెచ్చుకోడానికో హృదయం.." వినయ్‌కి కూచిపూడి లాంటి శాస్త్రీయ నృత్యాలు ఇష్టం.     "ఆపండిరా గోల. ఇంతకీ తమాషా ఏంటో చెప్పనేలేదు." రాణీ జరగబోయే యుధ్ధాన్ని ఆపింది.     అప్పుడే కాంగ్రెస్ పార్టీ పెట్టిన పబ్లిక్‌మీటింగ్ చూపిస్తున్నారు టి.వీ నైన్‌లో. గాలికూడా దూరడానికి సందులేక జనాల మొహాలమీదనుంచి పారిపోతోంది.     "అబ్బ! ఇంతమంది జనంరా! పనీపాటా లేనివాళ్ళు ఇంతమందున్నారా మనదేశంలో.." కళ్ళు పెద్దవిచేసి చూశాను.     "పనిలేదేమో కానీ పాట బాగానేఉంది.. డాన్స్ కూడా.." రేఖ ఉత్సాహంగా లేచింది. అప్పుడే పాటపాడుతూ డాన్స్ చేస్తున్న మధ్యవయసు మహిళలకేసి తిరిగింది కామెరా.     "అబ్బే! వాళ్ళుకాదు.. అటుచూడు.." కొంచెం వెనక్కి చూపించినప్పుడు సైగ చేశాడు వినయ్.     "ఏముంది.. అందరూ పులిహోర తింటున్నారు."     "పులిహోర గోల కాదే! అదే జనం క్రిందటివారం పెట్టిన తెలుగుదేశం మీటింగ్‌కీ, అంతకుముందు పెట్టిన ప్రజారాజ్యం మీటింగ్‌కీ వచ్చారు. ఇంతకీ వాళ్ళే పార్టీ అంటావూ?"     "ఎలా కనిపెట్టావురా? మాట్రిక్ సినిమాలోలా అందరూ ఒక్కలాగే కనిపిస్తున్నారు. అవున్లే.. ఇప్పటికి అన్ని ఛానెల్స్ లోనూ కలిపి ఒక్కోటీ పాతిక సార్లు చూసుంటావు. వాళ్ళ పేర్లు కూడా కంఠతా వచ్చేసి ఉంటాయి." రేఖ వంటింట్లోకి పారిపోయింది.. అన్నగారు విసరబోయిన రిమోట్ తప్పించుకుందుకు.     "ఒక్కసారి చూస్తే పట్టేస్తా. ఎన్నిసార్లు చూసినా నువ్వో స్టెప్పు వేయి చూద్దాం! అదిగో ఆమధ్యలో లేచి నుంచుని రెండుచేతులూ పైకెత్తి జిందాబాద్ కొడ్తున్నాడే.. వాడు, చుట్టూ ఉన్నవాళ్ళూ నిష్పక్షపాతంగా అన్నిపార్టీలకీ జై కొడ్తారు. సినిమాల్లో జీవా లాగున్నాడు. ఎందుకు గుర్తుపట్టలేం?"     రేఖ వంటింట్లోంచి వచ్చింది, పెద్ద పులుసుగరిట చేతిలో పట్టుకుని.     "అదేదో గదలాగుంది.. దాంతో కొడ్దామనే.." వినయ్ భయం నటించాడు.     "అబ్బబ్బ! రోజురోజుకీ చిన్నపిల్లలైపోతున్నార్రా.. ఇంతకీ వినయ్! మంచి సంబంధం వచ్చింది. వచ్చే ఆదివారం చూసొద్దామా?" ఆశగా అన్నాను వినయ్ కేసి చూస్తూ.     "చెప్పా కదమ్మా! నాకు ముక్కూ మొహం తెలీనివాళ్ళని చేసుకోడం ఇష్టం ఉండదని.."     "మరి నువ్వూ వెతుక్కోవు, ఇప్పటివరకూ ఒక్క అమ్మాయిని కూడా ఇంటికి తీసుకురాలేదు. ఎలారా? ఇంకా ఎన్నాళ్ళు నాకీ బాధ్యతలు?" నీరసంగా అన్నాను.     "యువకుల్లో ఇరవైశాతం మందికి బ్రెయిన్స్ ఉంటాయి. ఆమిగిలిన వాళ్ళకి గర్లుఫ్రండ్స్ ఉంటారు. నాకు ఉన్న బ్రెయిన్ పోగొట్టుకోవాలని లేదమ్మా!" వినయ్ లేచి రేఖ చేతిలో గరిట తీసుకున్నాడు పులుసు వడ్డించుకోడానికి. మా పిల్లలు చక్కగా కావలసినవి తింటారు కడుపునిండా! ఎంత తిన్నా, చిక్కటిపెరుగు వేసుకున్నా, వేపుళ్ళు తిన్నా, కొంచెంకూడా లావవరు. అదే దేముడిచ్చిన వరం అనిపిస్తుంది నాకు.     వినయ్ దగ్గుతూ వచ్చాడు..వెధవ జలుబు మళ్ళీ చేసినట్లుంది.     "నెట్‌లో వచ్చిన మెసేజ్. వాడి సొంతంలా పోజుకొడ్తున్నాడు. అయినా అమ్మా! ఆ జనం చూశావా? కొన్నాళ్ళుపోతే భూమి నిండి సముద్రంలోకి వెళ్ళిపోతారు. పెళ్ళిచేసుకుంటే వెంటనే పిల్లలు..భూభారం ఇంకా పెంచడం ఎందుకు చెప్పు? వాడి పెళ్ళాం వస్తే నీబాధ్యత తగ్గుతుందా? పదిరెట్లు పెరుగుతుంది. మా మీద దయుంచి ఇలాగే ఉండరా అన్నయ్యా!" బ్రతిమాలు తున్నట్లుగా చెయ్యి పైకెత్తింది రేఖ.     నాకు ఒళ్ళు మండిపోయింది.     "ప్రతీదానికీ ఎడ్డెం అంటే తెడ్డెం అనే మీరిద్దరు ఈ విషయంలో మాత్రం ఏకం. రెండుచేతులా సంపాదిస్తున్నారు. నీకేమో ముఫ్ఫయిరెండేళ్ళు. ఎన్ని సంబంధాలు చూసినా ఏదో వంక పెట్టి చెడగొడ్తున్నావు. వాడేమో ముఫ్ఫైయ్యైదు నిండుతున్నా ఏదీ చూడనే చూడడు. అందరూ మేమేదో మీసంపాదనకి ఆశపడి పెళ్ళిళ్ళు చెయ్యట్లేదని మమ్మల్ని ఆడిపోసు కుంటున్నారు.." బొంగురుపోయిన గొంతుతో ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాను.     విశ్వం నన్ను సముదాయించలేక, అటు పిల్లలకీ చెప్పలేక గబగబా తినేసి పేపర్ పట్టుక్కూర్చున్నారు. రేఖ, వినయ్ మౌనంగా పెరుగన్నం తినసాగారు. అసలే గులాబి రంగులో ఉండే వాళ్ళ మొహాలు ఎర్రగా అయిపోయాయి..శరీరంలో రక్తం అంతా అక్కడే చేరినట్లు.     మేమిద్దరం చామనచాయ అయినా మా పిల్లలు తెల్లగా ఉంటారు..మా పొడుగు కూడా రాలేదు. ముగ్గురూ పొట్టివాళ్ళకిందే లెక్క. అయితేనేం కోటేసినట్లున్న ముక్కుతో, చిన్న మూతితో చక్కగా ఉంటారు. రేఖవైతే తెనెరంగు కళ్ళు. ఏం లాభం?
* * * * * *
    "అమ్మా! అక్క అపోలో హాస్పిటల్‌లో అడ్మిట్ అయిందిట. నేను బయలుదేరుతున్నాను. నువ్వూ, నాన్నా వచ్చేయండి." రేఖ ఫోన్ చేసింది. నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. ఇద్దరం బయల్దేరాం.     "ఏమైంది రా? మళ్ళీ అబార్షనా?" గాభరాగా అడిగాను ఎదురుపడ్డ వినయ్‌ని.     "అదేం లేదమ్మా! లంగ్స్ ఇంఫెక్షన్, హై ఫీవర్." అంతేనా. దానికి చిన్నప్పట్నుంచీ అలవాటే. ఒక డోస్ యాంటీబయాటిక్ ఇస్తే తగ్గిపోతుంది.     "ఈమాత్రం దానికి అడ్మిట్ ఎందుకు చేశారే? అబద్ధం ఆడుతున్నారు..డాక్టర్! నిజం చెప్పండి.." రేఖతో, డాక్టర్‌తో ఒక్కసారే మాట్లాడుతున్నాను. సుమంత్ దగ్గరగా వచ్చాడు.     "ఏం లేదత్తయ్యా.. రాణి ఇక్కడే కదా పని చేసేది. అందుకే ఖాళీగా ఉన్న గదిలొ పడుక్కోబెట్టి ఇంజక్షన్ ఇచ్చారు. అబార్షన్ ఏం అవలేదు. అసలు ప్రెగ్నెంట్ అయితే కద.." ఏ.సీ ఉన్నా కారిపోతున్న చెమటని తుడుచుకుంటూ కుర్చీలో కూలబడ్డాను.     "ఎప్పుడు పంపిస్తారు?"     "నేనింటికొచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తానత్తయ్యా. మీరు రాణీని చూసి వెళ్ళిపొండి. జ్వరం తగ్గి పడుక్కునుంటుంది." సుమంత్ మందులు తీసుకుని రాణి ఉన్న గదికి బయల్దేరాడు.     "అయితే మా ఇంట్లో దింపేయ్. నేను టైం ప్రకారం మందులు, బలమైన ఆహారం ఇస్తాను..అంటే..నువ్వు ఇవ్వవనికాదు.." సందేహంగా అన్నాను. సుమంత్ చాల మంచివాడు. రాణీని బాగా చూసుకుంటాడు.
* * * * * *
ఒకరోజు..     "ఏం మాత్రే అదీ? రోజూ వేసుకుంటున్నావూ?" అనుమానంగా అడిగాను. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా బాయ్‌ఫ్రండ్స్ అంటూ తిరగడం మామూలేట ఈ కాలంలో.     "మల్టీ విటమిన్. నువ్వేం భయపడకమ్మా! నాకంత సీన్‌లేదు. ఆఫీస్ పనికే ఇరవైనాలుగ్గంటలు సరిపోవట్లేదు. ఇదిగో.. సీసా చూడు." పకపకా నవ్వుతూ అంది రేఖ.     సీసా తీసుకుని పరిశీలనగా చూశాను. నిజమే..ఏ టు జడ్ అని స్పష్టంగా రాసుంది.     "ఇంత చిన్నమాత్రలా..అన్ని విటమిన్‌లూ కలిపి.." నమ్మలేనట్లు మొహం పెట్టాను.     "అబ్బబ్బ.. నీతో అన్నీ చిక్కులే. అన్ని గిగాబైట్లు ఇంత చిన్న చిప్‌లో పట్టగాలేంది పదికూడాలేని విటమిన్లు ఈ మాత్రలో పట్టవా?"     "కంటిక్కనిపించని బైట్లు, ఇదీ ఒక్కటే? మేం వేసుకునేవి దీనికి మూడురెట్లున్నాయి."     రేఖ నిస్సహాయంగా చూసింది. డిగ్రీ పాసయిన నన్ను నమ్మించడం కష్టమే.     "అవి అరవైనిండిన వాళ్ళకి. చిన్నవాళ్ళకి చిన్న డోసన్నమాట. కావాలంటే చూడు.. అన్నయ్యకూడా వేసుకుంటున్నాడు." వినయ్ గదిలోకి లాక్కేళ్ళి చూపించింది. నాకు నమ్మక తప్పలేదు. అయినా.. ఇద్దరూ ఇప్పట్నుంచే.. ఎందుకూ? సీసా చూస్తూ నిల్చుండిపోయాను.
* * * * * *
    "ముగ్గురుపిల్లలున్నారు. ఒక్క మనవడుకానీ మనవరాలుకానీ లేదు. మా ఫ్రండ్స్ అందరూ, "మామనవరాలిలాగ.. మాగ్రాండ్‌సన్ ఈ అల్లరిచేశాడు" అని చెప్తుంటే నేను వెర్రిమొహం వేసుకుని చూడాల్సివస్తోంది. పుణ్యంకొద్దీబిడ్డలు అంటారుకానీ ఏంచేస్తే మనవలో చెప్పలేదు ఎవరూ! ఆపెద్దది ఒకసారి అబార్షన్ అయితే ఇంక వద్దనుకుందేమో.. వీళ్ళిద్దరూ పెళ్ళిమాటెత్తుతే నన్నో ఆట ఆడించి మాట మార్చేస్తారు." ఒక ఆదివారం పొద్దున్నే విశ్వంతో గట్టిగా అంటున్నాను. అక్కడే కూర్చుని ఇడ్లీలు తింటున్న రేఖ, వినయ్ నన్ను ఊరడించే ప్రయత్నాలేమీ చెయ్యలేదు.     "మన కుటుంబం, వంశం మనతోనే అంతం. ముద్దుమాటలతో, చిలిపి చేష్టలతో ఇంట్లో తిరిగే చిన్ని పాపలు లేకపోతే అదేం ఫామిలీ.."     "అమ్మా! మనం ఒక చోటికి వెళ్దాం. నువ్వూ, నాన్న ఒక గంటలో తయారవండి.. లంచ్ అక్కడే." వినయ్ న్యూస్ పేపర్ పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. రేఖ రిమోట్ పట్టుకుని టి.వీ ఛానల్స్ మార్చసాగింది. మేమిద్దరం అయోమయంగా చూస్తుండిపోయాం.
* * * * * *
 
    "మీకసలు చెప్పకుండా ఉందామనుకున్నాం. కానీ మీరు అదే ధ్యాసలో ఉండి మీ ఆరోగ్యం కూడా చూసుకోవట్లేదని చెప్పాల్సి వస్తోంది. ఇది మిమ్మల్ని బాధించే విషయమే! కానీ తప్పదు. మేం కూడా నటించి నటించీ అలసిపోతున్నాం. అది మామీద చాలా ప్రభావాన్ని చూపిస్తోంది. మనం పరిస్థితులకి తలవగ్గి, ఆనందంగా జీవితాలు గడపాలంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి."
    వినయ్ చెప్తున్నది వింటూ "అలంకృత" రిసార్ట్సులో ఒక కాటేజ్ ముందు లాన్‌లో కూర్చున్నాం అందరం. రాణీ, సుమంత్ కూడా వచ్చారు.     చల్లనిగాలి అందరికీ స్వాంతన కలిగిస్తోంది. ఒక ప్రక్క వృత్తి ఉద్యోగాలలో ఎంతో పైకి వచ్చిన పిల్లల్ని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. మరో ప్రక్క ఒక్కరికీ చక్కని కుటుంబం లేదనే అసంతృప్తి..ఎందుకిలా?     వెయిటర్ పొగలుకక్కే, కమ్మటి వాసన వేస్తున్న కాఫీ తీసుకొచ్చాడు.     "అమ్మా! మీది మేనరికం కదూ!" కాఫీ త్రాగుతూ అడిగాడు వినయ్.     ఇదేంటీ..ఇలా అడుగుతున్నాడు..వినయ్‌కి తెలీదా? అశ్చర్యంగా చూస్తూ తలూపాను.     "అక్క ప్రెగ్నెన్సీలో తెలిసింది మాకందరికీ.. అప్పటివరకూ స్కానింగ్‌లూ, అల్ట్రాసౌండ్‌లూ, యక్సురేలు మనం ఎవరూ చేయించుకోలేదు. అక్కకి తరచూ లంగ్ ఇంఫెక్షన్ వస్తుందని, యక్సురే తీశారు. అందులో డాక్టర్‌కి అనుమానంవేసి డి.యన్.ఏ పరీక్షకూడా చేశారు. తర్వాత, వరుసగా స్వెట్, బ్లడ్ అన్ని రకాల పరీక్షలూ చేశారు..అక్కతో పాటు మాక్కూడా! అప్పుడే తెలిసింది." వినయ్ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టవగా ఆగాడు. మేమిద్దరం ముందుకువంగి కూర్చున్నాము. నాకు అరచేతుల్లోంచీ, కాళ్ళలోంచి ఎవరో శక్తి లాగేస్తున్నట్లుగా అనిపిస్తోంది.     "నీ ప్రెగ్నెన్సీల్లో ఏమీ సమస్యలు రాలేదు.. పైగా అప్పుడట్లాంటి పరీక్షలూ లేవు. మనందరికీ కూడా జన్యుపరంగా వచ్చే వ్యాధి ఉంది. దానిపేరు 'సిస్టిక్ ఫైబ్రోసిశ్(సి.యఫ్). మీరిద్దరూ అ జీన్‌కి కారియర్స్.. అంటే మీకు లేదు కానీ మీద్వారా సంతానానికి వస్తుందన్నమాట." వినయ్ మాటలు విన్నాకకూడా నాగుండె ఎందుకు కొట్టుకుంటోందో అర్ధం కాలేదు. మొహంలో రక్తం కళ్ళలోంచి బైటికి వచ్చేసినట్లయి, కళ్ళు ఎర్రగా, మొహం తెల్లగా అయిపోయాయి. విశ్వం మూగవారిలా కూర్చున్నారు.     "ఒక రకంగా మనం గురుకులంలో ఉండడం వల్ల మేము ఇంతకాలం ఆరోగ్యంగా ఉండగలిగాం అని చెప్పచ్చు. అక్కడ పొల్యూషన్ లేకపోడం, తేలికగా అరిగే ఆహారం తయారుచెయ్యడం..ఆటలూ, యోగా..ఆయిల్ బాత్‌లూ.. ఇవన్నీ అంతుబట్టని ఈ సి.యఫ్ వ్యాధికి వైద్యాలన్నమాట. అయినా ఊపిరితిత్తుల వ్యాధులూ, జీర్ణకోశ సమస్యలూ వస్తూనే ఉండేవి కదా! మేము ఎంత తిన్నా లావుగా అవం..అదో దేముడిచ్చిన వరం అంటుంటావు కదూ! కానీ..అది ఈ వ్యాధి లక్షణం. మాకు హైకాలరీ, హైఫాట్ డయట్ కావాలి. విటమిన్స్, పాంక్రియాటిక్ ఎంజైమ్స్ వేసుకుంటుండాలి. అయినా టైంబాంబ్ మా శరీరంలో ఉన్నట్లే అనుకోవచ్చు." నా పెదవులూ, చేతులూ వణకసాగాయి. ఇంకోక్షణంలో కింద పడేట్లున్నాను.     "సాధారణంగా పుట్టిన ఏడాదిలోగానే తెలుస్తాయి లక్షణాలు..కానీ..చెప్పాకదా..మేం పెరిగిన వాతావరణం.." ఒక్కసారిగా క్రింద పడిపోయాను.     వినయ్, రేఖ, రాణీ లేచి నన్ను లేపి కూర్చోపెట్టి, నాప్రక్కనే కింద నేలమీద కూర్చున్నారు. వినయ్ నాచెయ్యి తన రెండుచేతుల్లోకీ తీసుకుని అన్నాడు.     "ఆమాటకొస్తే ఎవరికి ఎప్పుడు ఏంజరుగుతుందో ఈప్రపంచంలో తెలుస్తుందామ్మా? కుటుంబాలు, కుటుంబాలు సునామీలో కొట్టుకుపోలేదూ? టిఫిన్ తిందామనీ, పార్కులు చూద్దామనీ సరదాగా వెళ్ళిన చిన్నపిల్లలు ఉగ్రవాదులు ఉన్మాదానికి బలైపోలేదూ?" మమ్మల్ని ఎందుకు కన్నావమ్మా! అని అడుగకుండా నాకొడుకు ఓదారుస్తున్నాడు. నాకు కళ్ళు పొడారిపోయాయి. మావారుకూడా నాప్రక్కకి వచ్చి కూర్చుని తల నాభుజంమీద పెట్టారు. సుమంత్, రాణీ దగ్గరికి వచ్చి రెండుభుజాలూ పట్టుకుని దగ్గరగా తీసుకున్నాడు.     ఆసమయంలో మాకుటుంబం అంతా ఒక్కటై దేముడు కనిపిస్తే యుద్ధం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం.     "అసలు మీకు చెప్పకుండా లైట్‌గా సరదాగా గడిపేద్దామనే అనుకున్నాం. కానీ తప్పలేదు. ఈజీన్స్ మాసంతానం ద్వారా వ్యాపించకుండా మాతరంతోనే ఆపేద్దామని అనుకున్నాం. అక్కకి మంచి భర్త దొరికాడు. పిల్లలు లేకపోయినా అక్కనే పసిపాపలా చూసుకుంటాడు. నేనూ, రేఖా వేరే వాళ్ళని బాధపెట్టద్దని నిర్ణయించుకున్నాం. అందుకే పెళ్ళివద్దనుకుని నిన్ను.."     నా కళ్ళలో ఊరుతున్న నీళ్ళని వెనక్కి పంపే ప్రయత్నం చెయ్యసాగాను.     "కాకపోతే మాకు ఒక్కటే సందేహం. ఈ వ్యాధి ఇండియాలో చాలా చాలా అరుదు.. యూరోపియన్స్ లో బాగా కనిపిస్తుంది. మాకు ఈజీన్స్ ఎలా వచ్చాయాఅని.. పైగా మారంగు, ఫీచర్స్‌కూడా కొంచెం.." రాణీ ఆపేసింది..నేనేమైనా అనుకుంటానేమో అని.     నేనూ, విశ్వం ఒకర్నొకరు చూసుకున్నాం. విశ్వం తలూపారు.     "మాతాతమ్మ జర్మన్ లేడీ..మా ముత్తాతగారు మెడ్రాస్ పోర్టులో పనిచేస్తుండగా ఆవిడ్ని పెళ్ళిచేసుకుని ఇంటికి తీసుకొచ్చారుట. ఇంట్లో కొంత గొడవయినా..ఒక్కడే కొడుకవడంతో సర్దుకున్నారుట. ఆవిడ మాతాతగారు పుట్టిన వెంటనే చనిపోయారుట. అప్పుడు చుట్టాల్లోనే ఒకమ్మాయిని చేసుకుని స్థిరపడ్డారుట. కానీ మాతాతగారికీ, తరువాత తరానికీ ఆవిడ పోలికలేమీ రాలేదు. మరి..మీకు.." ఇంక నానోరు పెగల్లేదు.     రాణి గాఢంగా నిట్టూర్చింది..అనుమానం తీరగా.
* * * * * *
    అలంకృత రెస్టారెంట్‌లో భోంచేసి ఇంటికి బయలుదేరాం అందరం.     "అమ్మా! మా కుటుంబాన్ని చూస్తావా?" వెనుక సీట్లో మాట్లాడకుండా కూర్చున్న నాతో అన్నాడు వినయ్.     సుమంత్, రాణీ వాళ్ళకార్లో మా వెనుకే వస్తున్నారు.     మెదక్ హైవే మీద ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి తీసుకెళ్ళాడు వినయ్. చక్కని వీధులూ, ఇరుప్రక్కలా చెట్లూ, మధ్యలో పార్కులు..మా గురుకులం జ్ఞాపకం వచ్చింది నాకు. ఒక ఇంటిముందు ఆపాడు కారు. లాన్లు, పూలచెట్లు..వీళ్ళు లోపలికి వెళ్తుండగానే ఆరుగురు పిల్లలు, ముగ్గురమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు..రెండునించీ ఆరేళ్ళ వయసువాళ్ళు పరుగెత్తుకుని వచ్చి, మా పిల్లల కాళ్ళు పట్టేసుకున్నారు. ముత్యాల్లా ఉన్నారు. వెనుకే నడివయసులోనున్న భార్యాభర్తలు.     "రండిబాబూ! నిన్న రాలేదేంటా అనుకున్నాం." అందరం కూర్చున్నాక మంచినీళ్ళిచ్చారు.     పిల్లలు చేతులు తిప్పుతూ ఏవో కబుర్లు చెప్తున్నారు.     "మూడేళ్ళక్రితం ముగ్గురం కలిసి ఈ ఇల్లు కొన్నామమ్మా! నాన్నగారూ! వీళ్ళే మాపిల్లలు.. అందం, ఆరోగ్యం, తెలివీ వీరి సొంతం . ఎవరువీరు, ఎచటివారు అని అడగద్దు. ఒక ట్రస్ట్ తెరిచాం వీళ్ళకోసమని." పిల్లలతో సమంగా ఆడుతూ అన్నాడు వినయ్.     "రేపు ఏదైనా ట్రక్ మాట్లాడండి. నేనూ నాన్నా ఇక్కడే ఉంటాం..ఇది మనందరి కుటుంబం." ధీరోదాత్తులైన నా పిల్లల్ని గర్వంగా చూస్తూ అన్నాను.
Comments