అద్దెకిచ్చిన హృదయం - రావులపాటి సీతారాంరావు

    
    నేనూ, నా స్నేహితుడూ మీదు మిక్కిలి క్లాస్‌మేట్ అయిన రాంచందర్, ఎం.ఎలో సీటువచ్చిన తరువాత కొంచెం ఆలస్యంగా నాగపూర్ చేరడంతో యూనివర్సిటీలో హాస్టల్ గదులు దొరకలేదు. నాగపూర్‌లో బ్యాచ్‌లర్ స్టూడెంట్స్‌కు గదులు అద్దెకు దొరకడం చాలా కష్టం. అందులో తెలుగు విద్యార్థులు ఎక్కువగా వున్న తిలక్‌నగర్‌లో గది దొరకడం మహా కష్టం. అలాంటి తరుణంలో వెదకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్లుగా ఒక అవకాశం మాకు అనుకోకుండా "గభే" రూపంలో ప్రత్యక్షమైంది. పేరుకు తగ్గట్లుగానే గభే రూపం కూడా విచిత్రంగా వుంటుంది. ఐదు అడుగుల కంటే మించని ఆయన ఎటు చూసినా సరిసమానంగా నిండుగా వుంటాడు. గదుల వేటలో వున్న మాకు అదాటుగా వచ్చిన వర్షం అప్రయత్నంగా సహాయపడింది. మా ఎదురుగా నడుస్తున్న గుమ్మడికాయలాంటి ఆ వ్యక్తి వర్షపు ధాటికి తట్టుకోలేక గొడుగు తీయబోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో మేము ఇద్దరం సహాయం చేసి ఆయనను గొడుగు మధ్యలో వుంచాము. వర్షానికో లేక మా సహాయానికో ఆయన నీరుకారిపోయి "ఐ యాం గభే" అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ గొడుగులోనే మేము కూడా నమస్కారం లాంటివి చేసి ఆయన పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించాము. "ఏం చదువుతున్నారు" అడిగాడు. మా చదువు సంగతి చెప్పాము. "మా యిల్లు ఇదే" అని ఆ వీధిలోనే వున్న అతి సామాన్యమైన యింటిని మాకు చూపించారు. 

    గభే దగ్గర సెలవు తీసుకుందామనుకున్న సమయంలోనే గాలివాన మరొకసారి తన ప్రతాపాన్ని చూపించింది. గొడుగుతోపాటు గభే కూడా తల్లడిల్లిపోయాడు. గత్యంతరం లేక మేము యిద్దరం ఆయనకు తోడుగా ఆ యింట్లోకి ప్రవేశించాము. వర్షం వల్లనో, మేము చేసిన సహాయం వల్లనో గభే నిలువెల్లా వణికిపోతూ "థాంక్యూ. మాతాజీ మీకు టీ యిస్తుంది. లోపలికి రండి" అని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. 

    మాతాజీ మమ్మల్ని మరాఠీలో పలకరించింది. వచ్చీరాని హిందీలో జవాబిచ్చాము. ఆమె మరాఠీ భాషలోనే అయోమయంగా మాకు అనేక ప్రశ్నలు గుప్పించింది. గభే దవడలు చప్పరించుకుంటూ మమ్మల్ని ఆమెను మార్చి మార్చి చూస్తూ టీని ఆస్వాదించడంలో మునిగిపోయాడు.  మా మధ్య సంభాషణ అర్థవంతంగా ముగిసే అవకాశం లేకపోవడంతో గభే తనే మధ్యలో కల్పించుకుని మరాఠీ భాషలో ఆమెకు చెప్పాడు, వాళ్ళు మద్రాసీ వాలాలు... నీకు భాష అర్థం కాదులే అన్నట్టుగా.

    దక్షిణ దేశం నుంచి వచ్చిన అందరూ మధ్రాసీ వాలాలే అని రూఢీగా నమ్మే ఆ ప్రాంతం వారి సంగతి మాకు తెలుసు కాబట్టి మేము తెలుగువారము అని చెప్పే ప్రయత్నం చేయలేదు.

    "ఇంతకూ ఈ వీధిలో వర్షంలో ఎందుకు తిరుగుతున్నారు" అని గభే అడిగాడు. అద్దెగది అన్వేషణ గురించి నేను టూకీగా చెప్పి "అద్దెకు గది వుందా సార్" అని అడిగాను. గభే, మాతాజీ ఇద్దరూ మొహమొహాలు  చూసుకున్నారు. ఇద్దరూ మరాఠీ భాషలో మాట్లాడుకుని ఆ యింటి చివరి భాగంలో వున్న ఒక గదిని చూపించారు. "మీ యిద్దరూ మంచివాళ్ళు లాగా వున్నారు. ఎంత ఇచ్చినా ఫర్వాలేదు. అద్దెకాదు ముఖ్యం... మీ మంచితనం మాకు నచ్చింది"అని ఆ మారుమూల గదిని మాకు అద్దెకు యిచ్చారు. గభేకు పేర్లు జ్ఞాపకం వుంచుకోవడంలో యిబ్బంది వుందని తరువాత మాకు తెలిసింది. ఎందుకంటే మా యిద్దరి పేర్లు తారుమారు చేసి పిలిచేవాడు.

    "రామకృష్ణ ఈ గదిలో మన చదువు సాగుతుందా" అని రాంచందర్ గదిలో చేరిన మొదట్లోనే అడిగాడు. అదే ప్రస్తుతానికి శరణ్యం కనుక అద్దెకు ఆ గదిలోకి ప్రవేశించాము. గభే హృదయాన్ని అద్దెకిచ్చాడన్న సంగతి మాకు అప్పుడు తెలియదు.    

    గభే టీచర్‌గా చేరి హెడ్‌మాష్టరుగా రిటైరు అయ్యాడు. వచ్చిన ప్రావిడెండ్‌ఫండ్ - తను దాచుకొన్నది కలిపి యింటిని కట్టించాడు. ఉన్న ఇద్దరు కొడుకులూ చక్కగా మంచి ఉద్యోగాలలో వున్నారు. తల్లికీ - తండ్రికీ పుష్కలంగా సరిపోయేంత డబ్బు ప్రతినెలా పంపుతున్నారు. గభేకి రిటైరయిం తరువాత ఎన్నడూ డబ్బు ఇబ్బంది రాకాపోవటంవల్ల - ఇంటిలోని ఒక భాగాన్ని అద్దెకిద్దామన్న ఆలోచన మేము వెళ్లి అడిగేదాకా రాలేదు.  యన కున్నవి రెండే రెండు బాధలు. ఒకటి - ఒంటరితనం. రెండు - సెరబ్రల్ థొరొంబ్సిస్. ఆ జబ్బు రెండేళ్ల క్రిందట వచ్చి ఆయనను అటో యిటో తేల్చటానికి ప్రయత్నించిందనీ - కానీ ఆయన మొండిగా లొంగక పోవటం వల్ల ఆయన్ను క్షీణింపజేసి వదిలి పెట్టిందనీ - ఆయనే ఓ రోజు మాటల సందర్భంలో చెప్పాడు.

    ఆయన పెద్ద కొడుకు ఢిల్లీలో  ఏదో పత్రికలో పని చేస్తున్నాడు. చిన్న కొడుకు బొంబాయిలో బ్యాంకులో వున్నాడు. ఆ రెండు వుద్యోగాలకూ సెలవులు దొరికే అవకాశం లేదు కాబట్టి కొడుకులు చాలా తక్కువగా వస్తుంటారనీ గభే చెప్పాడు. అందుకే ఆయననూ, ఆయన భార్యనూ వంటరితనం - మేము ఆ గదిలో అడుగుపెట్టేంతవరకూ వేధించి - బ్రతుకంటే ఒక నిర్లిప్తతను పెంచింది.

    మేము ఆ గదిలో ప్రవేశించగానే - అప్పటివరకూ యాంత్రికంగా నడుస్తున్న ఆ దంపతుల జీవితంలో కొన్ని మార్పులు అనుకోకుండానే వచ్చేశాయి

    ఉదయం ఏడు కాగానే గభే మా గది తలుపును క్రమం తప్పకుండా తట్టడం అలవాటు చేసుకున్నాడు. లోపలికి వచ్చి కాసేపు మాతో పిచ్చాపాటి వేసుకోవటం ఆయన కార్యక్రమంలో విధిగా చేరిపోయింది. మాకు మొదట్లో విసుగ్గా వుండేది. కమ్మని నిద్రను - క్రూరంగా - ఏడుగంటలకే వదిలి పెట్టాల్నంటే ప్రాణం మీదికి వచ్చేది. కొద్ది రోజుల తర్వాత మాతో వచ్చి ఏడు గంటలకు మాట్లాడటం ఆయన దినచర్యలో కల్సిపోయిందన్న సంగతిని పసిగట్టి - మేము గూడా సున్నితంగా ఆ సమస్యను పరిష్కరించటానికి పూనుకొన్నాం. వంతు చొప్పున ఆయనతో మాట్లాడటానికి నిర్ణయించుకున్నాం. అంటే, ఈ రోజు రాంచందర్ నిద్ర పోతుంటే - నేను ఆయనను ఎంగేజి చేయాలన్న మాట! రేపు రాంచందర్ మాట్లాడుతుంటే నేను నిద్ర పోవచ్చు - ఇద్దరం కల్సికట్టుగా ఆయనతో సంభాషణలో భాగం పంచుకోక పోవటానికి ఒక చక్కని కారణం కనిపెట్టాం - రాత్రి పొద్దుపోయిందాకా చదవటం అలవాటు చేసుకుంటున్నామని - ప్రతిరోజూ ప్రొద్దు పోయిందాక చదివితే ఆరోగ్యం పాడవుతుందని - దినం విడిచి దినం - ఆలస్యంగా మేల్కొని వుండటానికి నిర్ణయించుకున్నామని - పుస్తకాలు యిద్దరికీ సంబంధించినవి వొక్కటే సెట్టు మాదగ్గర వుండటం చేత ఒక రోజు ఒకరు ప్రొద్దుపోయిందాకా చదివితే - యింకోరోజు యింకొకరు చదువుతారనీ!

    ఆయన రాగానే మా టైంటేబిల్ ప్రకారం మా యిద్దరిలో వొకరు లేచి ఆయనతో మాట్లాడుతుండేవాడు. టైంటేబిల్‌లో నిద్రవరించిన వ్యక్తి - ఆయన రాగానే మందహాసం భారంగా వేసి అటు తిరిగి పండుకునేవాడు. ఇహ గభే దీర్ఘ సంభాషణకు వుపక్రమించి ఆయన అనుభవాల సారాన్ని అంతా రంగరించి మెళకువగా వున్న వ్యక్తిని అమాయకంగా ఉతికి ఆరేసేవాడు. టైంటేబిల్ ప్రకారం నేను వొకరోజు ఆయన సంభాషణ క్రమాన్ని ఆస్వాదించే వోపికలేక నాకు దగ్గు పడిశం పట్టిందని పొరబాటున అబద్ధం ఆడాను. అంతే ఆయన నా పడిశం -  గ్గూ తగ్గించే కార్యక్రమంలో పడటంతో నా పని విషమించింది.

    భార్యకు ఏదో కషాయం తయారు చేయమని చెప్పాడు. అర్జంటుగా లేచి మొహం కడుక్కోమని నన్ను పురమాయించాడు. "ఎబ్బే ఊరికనే తగ్గిపోతుంది. నాకిది అలవాటే"నని ఎంత చెప్పినప్పటికిని విన్పించుకోలేదు. కషాయం తయారు చేసుకొని వచ్చి మాతాజీ ఆముదం త్రాగటానికి మారాం చేసే పిల్లవాడిని తల్లి ఎంత కరుణతో చూస్తుందో అంత కరుణతో నన్ను చూడసాగింది.

    గభేకు అకస్మాత్తుగా వెనుక తను టీచరు ఎంత కఠినంగా వుంది జ్ఞాపకం వచ్చింది కాబోలు - నా పట్ల కఠినంగా మారిపోయి ఆ మందు త్రాగక పోతే జబ్బు ఎంతగా విషమించేది బెదిరిస్తూ చెప్పి బెత్తం ఆడిస్తున్నట్లుగా పేపరు ఆడించసాగాడు.

    రాంచందర్ గోడవతల నిల్చొని పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వుతున్నాడు.

    నాకు గత్యంతరం లేదు. గుటుక్కు గుటుక్కున కషాయాన్ని మ్రింగాను. కషాయంలోని ఖారానికి కళ్లవెంబడి నీళ్లు రాసాగాయి. గభే శరీరంలో కూడుకున్న జలుబు ఆ విధంగా బయటికొస్తుందని అది మంచి సూచనని తన కషాయాన్ని మెచ్చుకోసాగాడు. ఆయన చెప్పిన కారణం వినగానే - మరింత ధారతో నాకండ్లు వర్షించసాగాయి. కషాయం నా వంటికి పడకపోవటం వల్లనో ఆరోజు గొంతంతా  ఖారంగా వుండటంచేత తిండి తినకపోవటం వల్లనో నేను నీరసించిపోయి నిజం జ్వరం వచ్చిన వాడిలా పాలిపోయాను. రాంచందర్ నాకు సంభవించిన అవస్థకు నిజంగా జాలిపడి సానుభూతి ప్రకటిద్దామని ప్రయత్నించాడు. కానీ నా మంచం వద్దకు రాగానే అప్రయత్నంగా ఆ సంఘటన జ్ఞాపకం వచ్చి తెరలుతెరలుగా వస్తున్న నవ్వును ఆపుకోలేక "ఛీ...ఛీ... కుక్క పాడుగాను" అంటూ బయటకువెళ్లి తనివితీరా నవ్వుతుండేవాడు. నాకు వళ్లుమండి దుప్పటి బిగించి ఆ రోజుకు యిహ లేవలేదు.

    రాంచందర్‌కు యింగ్లీషులో వ్యాసాలు వ్రాసి పత్రికలవాళ్లకు పంపే అలవాటు వుండేది. గభేకి వ్యాసాలు వ్రాసేవాళ్లన్నా కథలు వ్రాసేవాళ్లన్నా అంతగా సద్భావం లేనట్లు మాటల్లో ఒకసారి బయట పెట్టాడు. మామీద ఏర్పడిన మంచి అభిప్రాయం మరింత యినుమడింప జేసుకుందామని కాబోలు ఒకరోజు రాంచందర్ నన్ను గురించి - 'ఈయన కథలు అవీ వ్రాస్తాడని'చెప్పాడు. గభే ఆముదం త్రాగినట్లుగా మొహం పెట్టి కండ్లు చిట్లించి నన్ను చూసాడు. అప్పటినుంచీ రవ్వంత నామీద చెడ్డభిప్రాయం కల్గిందని నా ఊహ. అప్పుడప్పుడూ 'కథలు వ్రాయటం అంత మంచిపని కాద'ని టైమును వృథా చేయవద్దని నన్ను హెచ్చరించాడు కూడా.

    ఒకరోజు రాత్రివేళ రాంచందర్ తను వ్రాసిన యింగ్లీషు వ్యాసాన్ని ఫెయిర్  చేస్తున్న తరుణంలో గభే తలకు నిండుగా మఫ్లర్ చుట్టుకొని మా గదిలోకి ప్రవేశించాడు. నవల చదువుతున్న నేను ఠక్కున మూసేసి ఆయన గమనించకముందే పెద్ద సైజు పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఆయన్ను పలుకరించాను.

    నన్నూ - నా చేతిలోని పెద్ద సైజు పుస్తకాన్నీ తృప్తిగా చూస్తూ 'చదువుతున్నారన్నమాట' అన్నాడు.

    తలూపాను. రాంచందర్ యిబ్బందిగా పెన్ను మూయబోయాడు. గాభేకి రాత్రివేళ రాతపని చేసేవాళ్లన్నా కోపమే. ఏదో అత్యవసర సమయాల్లో తప్ప రాత్రిపూట వ్రాయగూడదంటాడు.

    రాంచందర్‌ను చూసి కండ్లు చిట్లిస్తూ 'ఏదో వ్రాస్తున్నట్లుందీ?' అన్నాడు.

    రాంచందర్ యిబ్బందిగా నావైపు చూసాడు.

    నేనీ అవకాశాన్ని జారవిడువదల్చుకోలేదు... 'ఏం లేదండీ రాంచందర్ అంటే ప్రొఫెసర్‌కు మంచి అభిప్రాయం వుంది. ఏదో ట్యుటోరియల్ అర్జంటుగా తయారు చేసుకొని రమ్మంటే వ్రాస్తున్నాడు' అన్నాను.

    రాంచందర్ బిత్తరపోయాడు. గభే తలూపి, ప్రొఫెసర్‌ను గురించి వాకబు చేసాడు. అన్ని వివరాలు చెప్పిం తరువాత - ప్రొఫెసర్ మా వీధిలోనే వున్న సంగతి జ్ఞప్తికి వచ్చింది.

    గభే నేను చెప్పిందంతా తలూపుతూ విని - తాపీగా 'మర్చిపోయాను యిన్నాళ్లనుంచీ. మీ ప్రొఫెసర్ నాకు తెల్సు. నేను మీ విషయం కనుక్కుంటానులేండి. ఏదైనా సహాయం కావాల్నంటే చెప్పండి - ఆయనతో మాట్లాడుతాను' అన్నాడు.

    మా యిద్దరికీ దిగులు పట్టుకుంది కొంపదీసి ప్రొఫెసర్‌ను కల్సుకొని మమ్మల్ని గురించి వాకబు చేస్తాడేమోనని!

    రెండోరోజు ఆ ట్యుటోరియల్ సంగతే మేమిద్దరం మర్చిపోయి వుండగా - 'ఆ ట్యుటోరియల్ మీ ప్రొఫెసర్ కిచ్చారా?' అని అడిగాడు.

    రాంచందర్ తలూపాడు. ఇచ్చినట్లుగా ఆయన అర్థం చేసుకున్నాడు. మా యిద్దరికీ భయం పట్టుకుంది. ఏ క్షణంలో ఆయన ప్రొఫెసర్‌తో మాట్లాడి మా అసలు సంగతి తెల్సుకుంటాడో అని.

    రెండు రోజుల తరువాత గభే మా గదిలోకి వచ్చి - మీ ప్రొఫెసర్‌ను కలుసుకున్నాను' అన్నాడు.

    మా ప్రక్కనే బాంబు ప్రేలినట్లుగా యిద్దరం ఉలిక్కిపడ్డాం. రాంచందర్‌కు మాట తడబడింది. నాకు వళ్లు తిరగసాగింది. 

    అతి కష్టంమీద 'ఏమన్నాడు?' అన్నాను.

    గభే పరిహాసానికి అంటున్నాడేమోనని ఆయన్ను పరీక్షించి చూసాం కానీ - అదేం లేదు. ఆయన సీరియస్‌గా చెప్పుకొని పోతున్నాడు.

    'నేనా కాగితాల సంగతి అడిగి - మీకిచ్చారా అంటే- చాలా బాగుంది యిచ్చారు - అన్నాడు. కానీ మీ పేర్లే సరిగ్గా ఆయనకు జ్ఞాపకం లేవు' - గభే చివరిమాటవిని ప్రాణం పోసుకొని మేమిద్దరం సర్దుకొని కూర్చున్నాం.

    రెండోరోజు సాయంత్రం ఆ వీధిలోంచి వస్తుండగా గభే మరొకరి యింటిముందు ఎవరితోనో మాట్లాడుతూ నిల్చొని వున్నాడు.

    మమ్మల్నిద్దర్నీ చూడగానే ఆనందంతో కేకేసి - ఆయనకు వీళ్లేనన్నట్లుగా చూపించాడు.

    మొదట ఆయన మమ్మల్ని అపరిచితుల్ని చూసినట్లుగా చూసి - తరువాత తల త్రిప్పుకొని - 'వో - వీళ్లెందుకు తెలీయదు - బాగా తెల్సు - మంచికుర్రాళ్లు' అని యింగ్లీషులో చెప్పసాగాడు.

    మా యిద్దరికీ అర్థంగాక వొకరి మొఖాలు వొకరు చూసుకున్నాం. గభే - మమ్మల్ని గురించి అర్థగంట చెప్పాడు - రాత్రి పూట మేమెంత శ్రద్ధగా చదివేది - ఎంత శ్రద్ధగా ట్యుటోరియల్స్ వ్రాసేది అన్నీ చెప్పి -  చివరకు - మాకు అన్నివిధాలా సహాయం చేయవల్సిందిగా ఆయనకు మరీ మరీ చెప్పి - ఇంటివైపు నడక సాగించాడు.

    ఆయన - 'భయపడకండి ఆయన తరహాయే అంత! ఆ జబ్బు వచ్చిందగ్గర్నుంచీ ఆయనకు జ్ఞాపకశక్తి తక్కువయిందనుకుంటాను. ఆ మధ్య నెప్పుడోవచ్చి - మిమ్మల్ని గురించే అనుకుటా - ఏదో చాలా సేపు చెప్పాడు. నేను అన్నిటికి తలూపాను. ఇటువంటివాళ్ల దగ్గర ఎదురుచెప్పకుండా వుండడమే - ఏమంటారు?' ఆయన నా భుజంతట్టి తనఇంట్లోకి దారితీసాడు -

    అక్కడ వ్రేలాడుతున్న బోర్డును అప్పుడు చూసాం -

    ఆయన పేరుతోబాటు - 'ప్రొఫెసర్ ఇన్ సైకాలజీ' అని వుంది. మా సబ్జక్ట్ 'పొలిటికల్ సైన్సు'!

* * *

    మేము సెకండ్‌టర్మ్ సెలవులకు యింటికి పోయిన తరువాత - కొద్ది రోజులకే - నాకో చిన్నఉత్తరం ఇంగ్లీషులో వచ్చింది. 'రామకృష్ణా - క్షేమంగా చేరావనుకుంటాను. యిక్కడ మీరెళ్లిన తరువాత మాకేం తోచటంలేదు. ఏదో పోగొట్టుకున్నట్లుగా వుంది. మాతాజీ మిమ్మల్ని గురించే ఎప్పుడూ అనుకుంటుంది. రాంచందర్‌కు గూడా ఉత్తరం వ్రాస్తున్నాను. శెలవులు అయిపోగానే త్వరగా బయలుదేరి వచ్చేసెయ్యండి - లేకపోతే చదువు పాడవుతుంది - మీ వాళ్లకు నా అభినందనలు'

    ఆ ఉత్తరం చూడగానే - ఆయన ఆకారం జ్ఞాపకానికి వచ్చి నవ్వు వచ్చింది కానీ - ఎందుకనో వెనువెంటనే జాలికూడా వేసింది. మమ్మల్నిద్దర్నీ ఎంతగా ఆభిమానిస్తున్నదీ అర్థమయింది - హాస్యం కోసం - ఏదో సరదాకని మేము ఆయనతో చెప్పిన అబద్ధాలు - ఆడిన నాటకాలు జ్ఞాపకం వచ్చి కొంచెం సిగ్గేసింది కూడా.

    శలవులయిపోగానే రాంచందర్ నేనూ సిటీ కొచ్చేసాం. మమ్మల్నిద్దర్నీ గభే దంపతులు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. గభేకు కండ్లలో నీళ్లు నిండుకున్నాయి. దవడలను చప్పరించుకుంటూ - ఆయనకంటే ఎంతో ఎత్తుగా వున్న మా యిద్దరి చేతులూ పట్టుకొని మధ్యలో నిల్చున్నాడు.

    నా వైపు తిరిగి 'రాంచందర్ మీరు లేకపోతే నాకేం తోచలేదు' అన్నాడు. అప్పుడర్థమయింది నాకు ఉత్తరంలో నా పేరు సక్రమంగా వ్రాయటానికి కారణం మేమిచ్చిన అడ్రసులని!

    మాకోసం మాతాజీ బాయిలర్‌లో వేడినీళ్లుంచింది. స్నానాలయిన తరువాత చిక్కని టీ తీసుకొనివచ్చి యిచ్చింది.

    ఆ యింట్లో మళ్లీ మేమిద్దరం తిరుగాడుతుంటే గభే అర్థనిమీలిత నేత్రుడై వాలు కుర్చీలో హాయిగ పడుకున్నాడు. మాతాజీ కండ్లలో కాంతి నింపుకొని ఆ రాతి మమ్మల్నిద్దర్నీ భోజనం అక్కడే చేయమని సంజ్ఞలద్వారా చెప్పసాగింది. మేమిద్దరం ఆ యింట్లోని సభ్యులుగా మారిపోయాం. ఏ అడ్డంకూ లేకుండా కాలం గడిచిపోతున్నది. కానీ మా చదువే కుంటుబడసాగింది.

    పరీక్షలు యింకా రెండునెలలున్నాయనగా మాకు చదువును గురించిన భయం పట్టుకోసాగింది. దీక్షగా చదవటానికి రెండుమూడుసార్లు  ప్రయత్నించాం. కానీ ఆ గదిలోని వాతావరణం చదువుకు అనుకూలంగా లేనట్లు ఎందుకనో మా యిద్దరికీ అన్పించసాగింది. పుస్తకం పట్టుకోగానే ఎంత వద్దనుకున్నా యిద్దరికీ నిద్రవచ్చేసేది. ఆ వీధిలో ఎవరూ మిత్రులు లేకపోవటంవల్ల రాత్రిళ్లు ఉత్సాహంగా చదువుకోడానికి తగిన వాతావరణం లేనట్లుగా ఏదో కొరతగా వున్నట్లుగా మాలో బలమైన అభిప్రాయం ఏర్పడసాగింది.రాత్రిళ్లు బయటకువెళ్లి టీ త్రాగి వద్దామన్నా గభే దంపతులు ఆరోగ్యం పాడవుతుందని నిషేధించేవారు. వాళ్లమాట అంతగా పట్టించుకోవాలని లేకపోయినా ఎందుకనో వాళ్లిద్దర్నీ నొప్పించకుండా వుండడానికి మేము అలవాటు పడ్డాం. 

    అనుకోకుండా రెండుమూడు వీధులవతలున్న మా స్నేహితొడొకడు  ఒకరోజు ఆదరాబాదరా వచ్చి మమ్మల్నిద్దర్నీ ఏదో మంచి గది ఖాళీ అయిందనీ ప్రక్కగదుల్లో అందరూ విద్యార్థులే ఉండడంవల్ల చదువు సక్రమంగా సాగుతుందనీ హాస్టలు ఆ గదికి చాలా దగ్గరనీ అన్నివిధాలా అనువుగా వుంటుందనీ అనేక విధాలుగా మమ్మలిద్దర్నీ ఊరించి గదిని చూడటానికి తీసుకెళ్లాడు.

    ఆ గది నిజంగా చాలా బాగుంది. ముఖ్యంగా గదిలోకి గాలి ధారాళంగా వస్తుంది. ఎండాకాలం ప్రవేశించింది కాబట్టి బయట కూర్చొని చదువుకోటానికి బాల్కనీ వుంది. ఆ మేడ మీద అన్ని గదుల్లోనూ విద్యార్థులే వుండటంచేత చిన్న హాస్టల్‌లా వుంది. చదువు సక్రమంగా ఆగదిలో సాగుతుందని ఆ పరిసరాలను చుస్తే ధైర్యం వ్చ్చింది. అద్దెకూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువేంకాదు. మేడమీద ఆ గదిని చూడగానే మేము వుంటున్న గభే యింటిలోని గది ఎంత తీసికట్టో అర్థమయింది. గభే దంపతుల ఆదరణ మినహాయించి చాలా అసౌకర్యాలు ఆ గదిలో వున్నట్లుగా మా స్నేహితులు నూరిపోయసాగారు. గభే యింటిలోని వెనుక భాగంలోవుంది కాబట్టి యింటిచుట్టూ తిరిగిపోవాలనీ గదిలో ఒక ప్రక్కగా గోడ పగిలిందనీ స్నేహితులకు చాలా దూరంగా వుండటంచేత పరీక్ష ముందురోజు రాత్రి వెలువడే 'గెస్ పేపర్లు' మాకు అందించటం కష్టమనీ యిలా అప్పటిదాకా మా దృష్టికిరాని చాలా లోపాలు లెక్కించసాగారు. మాకు గూడా నిజమేననిపించింది. ఈ గదిముందు గభే యింటిలోని గదిని పోల్చి చూస్తే అసలు యిన్నిరోజులు ఆ గదిలో ఎట్లా నివసించామో అర్థంగాలేదు.

    గదిని చూడటానికి వెళ్లిన మేము - అడ్వాన్సుగూడా యిచ్చేటట్లు చేసారు - మా మిత్రులు.

    తిరిగి గభే యింటికి వచ్చాం. ఆయన యింటిముందు వాలుకుర్చీలో కూర్చొని ఎటో చూస్తూ వున్నాడు. మమ్మల్ని చూస్తూనే ఆదుర్దాగా లేచి - 'ఎక్కడికి వెళ్లారు - యింత పొద్దునే?' అన్నాడు.

    మాకు ఆయన అవసరం లేకపోవచ్చు. ఆయనకు మా అవసరం ఎంతగా వుందో అర్థమయింది. గిల్టీగా ఫీలవుతూ యిద్దరం ఆయన - ఎదురుగా కూర్చొని - ఏదో కుంటిసాకు చెప్పి - యితర విషయాలమీదికి ఆయన దృష్టిని మళ్లించాము.

    గభేదంపతుల ఆదరణను తప్పించుకొని - ఎలా యీ గదివదిలి వెళ్లాల్నో మాకు అర్థమవలేదు.

    'మా స్నేహితులు వుండే యింట్లో ఏదో గది ఖాళీ అయిందట. మమ్మల్ని అక్కడకు రమ్మన్నారు' అన్నాను నేను చిన్నగా అసలు విషయాన్ని బయట పెట్టటానికి ఉపక్రమిస్తూ.

    ఆయన ఉలిక్కిపడ్డాడు 'రాంచందర్! అదేమిటి. ఇక్కడ ఏమైనా అసౌకర్యంగా వుందా? అద్దె ఎక్కువనిపిస్తే - మీ యిష్టమొచ్చినంతె యివ్వండి. నా పిల్లల్లాటివాళ్లు మీరు' - అన్నాడు. మేము ఆయన్ను వదిలి వెళ్తామనే భావనే - ఆయనకు సరిపోనట్లుంది. మొఖం అంతా అదోమాదిరిగా మారిపోయింది. కండ్లు చిట్లించి నుదురు బాదుకోసాగాడు.

    మా యిద్దరికీ మాటలు కరువయ్యాయి. ఈ గది వదిలి యింకోగదికి వెళ్తామంటే - ఆయనకు మరింత బాధాకరంగా మారుతుందని ఊహించి - నేను సంభాషణను త్రుంచివేస్తూ 'అదేం లేదు - బాబాజీ - మిత్రులెవరో సరదాగా అంటే మాత్రం మేము మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తామా?' అన్నాను.

    ఆయన ముఖంలోని మబ్బులు తొలిగి పోయాయి - చిన్నపిల్లాడిలా హుషారుగా మాతాజీ దగ్గరకువెళ్లి ఏదోచెప్పి - బోసిగా నవ్వసాగాడు.

    ఆమెగూడా ఏదో పెద్దగా అంటూ మా దగ్గరకు వచ్చి - అనేకరకాలుగా ఆమె భావాలను వ్యక్తపరిచింది. భాష - భావాలను వ్యకత్పర్చటానికి ఎంత అవసరమో అప్పుడు మాకు అర్థమయింది. 'యిక్కడేమైనా అసౌకర్యాలు వుంటే చెప్పమని - అద్దె ఎంతయిచ్చినా ఫర్వాలేదనీ - మేము యిద్దరం ఆమె బిడ్డల్లాంటి వాళ్లమని' ఆమె చెప్పదల్చుకున్న విషయాలు.

    వాళ్లిద్దరి ప్రేమపాశాన్ని విదిలించుకొని గది వదలటానికి మనసొప్పలేదు.

    అలాగే రెండు మూడు రోజులు కృతనిశ్చయంతో అక్కడ్నేవుండి చదువుకుందామని ప్రయత్నించాము. రాత్రి కాగానే - గాలి ఆడక యిబ్బందిగా వుండేది - దోమలు విపరీతంగా దండెత్తేవి.

    కుర్చీలు బయట వేసుకోటానికి స్థలముండేది కాదు. నిద్ర అపరిమితంగా ముంచుకొచ్చేది. మేము అద్దెకు మాట్లాడి వుంచిన గది పదే పదే జ్ఞాపకం వచ్చి చదువుసాగేది కాదు. స్నేహితులు అప్పుడప్పుడూ కనబడి మమ్మల్ని తెలివితక్కువ వెధవల క్రింద జమకట్టి మాట్లాడుతుండేవారు. రాత్రి టీ త్రాగటానికి సెంటరుకు వెళ్లినప్పుడు ఎంతమంది స్నేహితులు కనపడతారో ఎన్ని ముఖ్యమైన ప్రశ్నలను గురించి మాట్లాడుకున్నారో రాత్రిళ్లు ఎంతసేపటిదాకా మేలుకొని చదువుకున్నారో చెప్పుతుంటే మా పరిస్థితి మరింత దిగజారేది.

    గభే గదిలో వుంటే యీ యేడు క్లాసు రాకుండా పోవటం ఖాయమని వాళ్లు హామీ యివ్వసాగారు. మానసికంగా ఆగదిలో వుండి చదువుకోవటానికి మేము వ్యతిరేకులుగా మారిపోయాం. ఏదో విధంగా ఆ గది ఖాళీ చేసి క్రొత్తగా చూసిన గదిలోకి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాం! 

    కానీ గభే దంపతులకు కష్టపెట్టకుండా బయటకు వెళ్లాలని తాపత్రయం! పాపం ఆ ముసలాయన మేమున్న యీ కొద్దికాలంలోనే గాఢమైన అనుబంధాన్ని పెంచుకొన్నాడు. దాన్ని త్రెంచివేయటానికి మాకు చేతులు రాలేదు.

    వాళ్ల మనసు నొప్పించకుండా బయటికి వెళ్లటానికి యిద్దరం కలిసి ఒక పథకం వేసాం.

    ఒక రోజు గభేని పిల్చి 'బాబాజీ మమ్మల్ని ఆశీర్వదించండి. ఇదంతా మీ చలవే' అన్నాం యిద్దరమూ.

    ఆయన ఆశ్చర్యపోతూ 'ఏమిటీ?' అటూ కండ్లు మూసుకొని ఏదో గొణిగాడు ఆశీర్వాదానికి సూచనగా.

    నేను చెప్పాను.

    'బాబాజీ - మొదటి సంవత్సరం వచ్చిన మార్కులనుబట్టి మా యిద్దరికీ స్కాలర్‌షిప్ యిచ్చారు.' 

    ఆయన గబగబా వెళ్లి మాతాజీని పిల్చుకొని వచ్చాడు. తేపతేపకు దవడలను చప్పరించసాగాడు. దవడల చప్పరింత ఆయన ఆనందానికి సూచన.

    'అంతేగాదు బాబాజీ - ర్యాంక్ విద్యార్థులము కాబట్టి స్కాలర్‌షిప్ యివ్వడమే గాకుండా ఈ రెండు నెలలూ - హాస్టల్‌లో మాకు ఉచిత భోజనం వసతి ఏర్పాటు చేసారు' రాంచందర్ అందుకున్నాడు.

    ఆయన మొఖం కళ తప్పింది - 

    'అంటే మీరు యిక్కడే వుండటానికి వీలు లేదన్నమాట' అన్నాడు. 

    'వేరేచోట వుంటే స్కాలర్‌షిప్ ఇవ్వరు బాబాజీ. ఈ స్కాలర్‌షిప్ దొరకటం చాలా కష్టం. బహుశా ప్రొఫెసర్‌ను మాకు సహాయం చేయమని మీరు కోరారు కాబట్టి - ఇది గ్రాంటు అయిందనుకుంటాం.'

    'అయినా ఏం ఫర్వాలేదు. ప్రతిరోజూ మేమువచ్చి మీ యిద్దర్నీ చూసిపోతుంటాం. మిమ్మల్ని చూడకుండా - మేము మాత్రం ఉండగలమా?' అన్నాము యిద్దరూ.

    గభే దంపతులకు మమ్మల్ని వదిలిపెట్టటం  కష్టమయింది. కానీ మేము చెప్పిన కారణం చాలా బలమైంది కావటం వల్ల - మమ్మల్నిద్దర్నీ అక్కడ్నే వుండమని బలవంతం చేయటానికి అవకాశం లేక పోయింది.

    గభే ఆ పూటల్లా కాలుగాలిన పిల్లిలా తిరగసాగాడు. మాతాజీ కండ్లలో కాంతి తరిగింది. ఆ సాయంత్రం మేము బయలుదేరుతుంటే గభే మా యిద్దరి చేతులూ పట్టుకొని మధ్యలో నిలబడి 'మిమ్మల్ని వదిలి ఎలా వుండగలము?' అన్నాడు.

    యన  పరిస్థితి చూడగానే - చదువు సాగకపోయినా ఫర్వాలేదు అక్కడ్నే వుండిపోదామా అని అన్పించింది.

    చివరకు అతి కష్టంమీద మమ్మల్ని వదిలారు గభే దంపతులు. ప్రతిరోజూ వాళ్లింటికి తప్పక రావాలనీ - మరీ మరీ చెప్పారు. మాతాజీ తినుబండారాలన్నీ టిఫిన్‌లో పెట్టి మమ్మల్ని హాస్టల్‌లో తినమని యిచ్చింది. గభే వీధి చివరివరకూ వచ్చి సాగనంపాడు. ఆయన పూర్తిగా కదిలిపోయాడు. బలహీనమైన ఆయన చేయిని అటూయిటూ వూపుతూ - కండ్లు తుడుచుకుంటూ - మా రిక్షా కనుమరుగయ్యేంత వరకూ అలాగే నిలబడి పోయాడు.

    కొత్తగదిలో చేరింతరువాత - పరీక్షల భయం వల్లనో - ప్రక్క విద్యార్థుల శ్రమను చూసి కించపడటం వల్లనో - మొత్తానికి మా చదువు బాగానే సాగుతుండేది. ప్రతిరోజూ సాయంత్రం గభే దంపతులను చూడటానికి వెళ్లి వస్తుండేవాళ్లం. మమ్మల్ని చూడగానే ఆయన కండ్లు మిలమిలా మెరుస్తుండేవి. మాతాజీ టీతో ఆప్యాయతనూ రంగరించి యిచ్చేది. గభే ప్రొఫెసర్‌ని మళ్లీ కల్సుకున్న వైనం మమ్మల్ని గురించి మెచ్చుకున్న సంగతీ అన్నీ చెప్తుండేవాడు.

    ఆ సైకాలజీ ప్రొఫెసర్ - అనుకోకుండా మాకు అన్నివిధాల సహాయం చేస్తున్నందుకు మనసులోనే కృతజ్ఞత లర్పించుకున్నాం.

    ఇలా కొన్ని రోజులయింతరువాత చదువు గొడవలో  మేము పూర్తిగా పడిపోయి గభే యింటికి పదిరోజులయినా వెళ్లలేక పోయాం.

    ఒకరోజు సాయంత్రం మా కొత్తగది బాల్కనీలో కూర్చొని - మేము యిద్దరం చదువుకుంటుండగా - మా హాస్టల్ స్నేహితుడు మోహన్ గబగబా మా దగ్గరకు వచ్చి 'ఒరే మీ గభే వచ్చాడ్రా!' అన్నాడు.

    ఉలిక్కిపడి లేచి నిల్చున్నాం - 'ఏడీ ఏడీ?' అంటూ.

    'ఇక్కడకు కాదు హాస్టల్‌కు! సరాసరి వార్డెన్ దగ్గరకు వెళ్లి మిమ్మల్ని గురించి చెప్పి మీ గదినెంబరు చెప్పమన్నాడు. ఆయన ఆ పేరుగల వ్యక్తులెవరూ లేరు పొమ్మన్నా ఎంతకూ వినలేదు. మీకేదో స్కాలర్‌షిప్ వచ్చిందనీ ప్రత్యేకంగా హాస్టలులో మిమ్మల్ని యూనివర్శిటీ ఉంచిందని - ఏమిటేమిటో చెప్తూ చాలాసేపు ఆయనతో వాదం వేసుకున్నాడు. చివరకు వార్డెను మీ క్లాసుమేటు కృష్ణమూర్తిని పిలిచి అడిగితే - 'మిమ్మల్ని మోసం చేసారు. మీ గదిని వదిలిపెట్టటానికి వాళ్లీ ప్లాను వేసారు. దర్జాగా ఓ మేడమీద గదిలో వుంటున్నారు. చూపిస్తారాండి' అని తీసుకొని వస్తున్నాడు. నాకీ సంగతంతా తెలుసు కాబట్టి - ముందుగా మీకు చెబ్దామని సైకిలేసుకొని వచ్చాను' అని మోహన్ ముగించాడు.

    మా కిద్దరికీ కాళ్లు ఆడలేదు. గభేకి ఎలా ముఖం చూపించాల్నో అర్థంగాలేదు. నేరం చేసినవారిలా - కంగారు పడసాగాం. గభేనుంచి తప్పించుకోవటానికి - ఆ గదిని వదిలి బయటకు వెళ్దామని సిద్ధపడుతుండగానే - కృష్ణమూర్తితో సహా - గభే మా మేడపైకి వచ్చేసాడు. 

    మేమిద్దరమూ తలలు వంచుకొని నిలబడ్డాం.

    మా యిద్దరి మధ్యకూవచ్చి - చెతులు పట్టుకొని - 'మీ రెందుకిలా మీ బాబాజీకి అబద్ధం చెప్పారు' అన్నాడు.

    మా కండ్లలో నీళ్లు తిరిగాయి. ఆయనముఖం చూడటానికి మా యిద్దరికీ ధైర్యం చాలలేదు.

    'ఎంతమంచి పిల్లలను కున్నాను. ఎంతగా మోసం చేసారు' ఆయన గొంతు బొంగురుపోయింది.

    మాకేం చెప్పాల్నో అర్థంకాలెదు. నిశ్శబ్ద దేవత ఆగదిలో భయంకరంగా నాట్యమాడింది. 

    కాసేపాగిన తరువాత - నెమ్మదిగా ఆయన మా చేతులను వదిలిపెట్టి బరువుగా మేడ మెట్లు దిగాడు.

    ఇద్దరం ఆయన వెనకాలే నడిచాము. కానీ ఆయన మళ్లీ మావైపు తిరిగికూడా చూడలేదు. 

    రెండురోజుల తర్వాత - మాతాజీ సహాయంతో గభేకు అన్ని విషయాలూ సవివరంగా చెప్పి - నచ్చచెప్పే ప్రయత్నంలో ఆయన యింటివైపు వెళ్లాం.

    ఆయన యింటిముందు ఇద్దరు ముగ్గురు కొత్తవ్యక్తులు కనపడ్డారు.

    ఎవరో బ్యాగుతో - ఇంటిలోపలినుండి వచ్చి రిక్షా ఎక్కి మా ముందునుంచే వెళ్లిపోయాడు.

    మాకు ఇంట్లోకి వెళ్లటానికి ధైర్యం చాలలేదు.

    బయట నిల్చొని తచ్చాడుతుండగా లోపలినుంచి సైకాలజీ ప్రొఫెసర్ బయటకు వచ్చాడు.

    ఆత్రంగా ఆయన వద్దకువెళ్లి - 'ఏమయింది?' అని యిద్దరం ఏకకంఠంతో ప్రశ్నించాం.

    'గభేకి మళ్లీ ఆ పాపిష్టి జబ్బు తిరగబెట్టింది' అంటూ చరచరా వెళ్లిపోయాడు.

    పాలిపోయిన మొఖాలతో యిద్దరం - వకరినొకరు చూసుకున్నాం.

    తలలు వంచుకొని తప్పుచేసిన వాళ్లలా ఇద్దరం వెనక్కు తిరిగాం!

(ఆంధ్ర సచిత్ర వార పత్రిక 29-08-1969 సంచికలో ప్రచురితం)        
Comments