అడుగుజాడలు - కె.ఎల్.వి.ప్రసాద్

 
   
శ్యామల వీధి వరండాలో అటు - ఇటు అసహనంగా పచార్లు చేస్తోంది. ఎవరైన ఆమెను చూస్తే వ్యాయామం కోసం వాకింగ్ చేస్తూందేమో అనుకుంటారు. కానీ, ఆ సమయంలో శ్యామల అంత తీరిగ్గా వాకింగ్ చేసే అవకాశమే లేదు! నిజానికి గృహిణిగా, ఆమె సేద తీర్చుకునే అమూల్యమైన సమయం అది! కానీ, దానికి భిన్నంగా ఒక కొలిక్కిరాని ఆలోచనలతో, బుర్ర వేడెక్కిపోయి ఇష్టం వచ్చినట్లు పచార్లు చేస్తుందామె.

    అప్పటికే సమయం రాత్రి తొమ్మిది గంటలు దాటిపోయింది. జగన్ ఆఫీసు నుంచి ఇంకా ఇంటికి రాలేదు. జగన్ శ్యామల భర్త. అతను వేసే ప్రతి అడుగును అతి జాగ్రత్తగా అంచనా వేయగల దిట్ట ఆమె! అందుకే భర్త ఇంటికి రావడం ఆలస్యం అయ్యేసరికి, ఆమెలో ఏవేవో అర్థం లేని ఆందోళనలు, అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి.

    సాధారణంగా సాయంత్రం అయిదున్నర గంటలకే జగన్ టంచనుగా ఆఫీసు నుండి బయటపడతాడు. అత్యవసరం అయితే తప్ప ఆరు గంటలలోపే ఇంటికి వచ్చి వాలే అలవాటు అతనిది. ఒకవేళ బయట ఎలాంటి పనులున్నా రాత్రి తొమ్మిది గంటలలోపే ఇంటిముఖం పడ్తాడు జగన్. ఇప్పటివరకు క్రమం తప్పకుండా అతను అనుసరిస్తున్న ఖచ్చితమైన విధానం అది. కానీ విచిత్రంగా ఈరోజు తొమ్మిది గంటలు దాటిపోయినా జగన్ జాడ కానరాలేదు. భర్త రాకకోసం అదేపనిగా ఎదురుచూసి శ్యామల కాస్త నీరసానికి గురి అయింది. నిరీక్షణలోని బాధ  ఎలా ఉంటుందో ఆమె మొదటిసారి స్వయంగా అనుభవించింది. మరి, ఇక నిలబడలేని స్థితిలో హాలులో ఒక మూల కూలబడ్డది శ్యామల.

    తల్లి పరిస్థితిని గమనించిన ఆమె పుత్రరత్నం భోజనం చెయ్యమని తల్లిని బ్రతిమాలాడు. ఆపైన బలవంత పెట్టాను. ఆ బాధ భరించలేక ఎదో కాస్త తిన్నాననిపించి, చేయి కడుక్కుంది శ్యామల.

    భర్త ఎప్పుడు వచ్చినా, తినడానికి సౌకర్యంగా ఉండే విధంగా, అన్నం - కూరలు, హాట్-పాక్‌లో సర్దిపెట్టింది. అతనికి ఇష్టమైన చారు - పెరుగు తాజాగా ఉంచింది. భర్త రాగానే ఎలాంటి ఇబ్బది లేకుండా స్వయంగా వడ్డించుకుతినే ఏర్పాటు చేసింది శ్యామల.

* * *

    ఉదయం నిద్రలేచిన దగ్గరనుండి, రాత్రి శయన మందిరం చేరేవరకు శ్యామలకు ఏదో ఒక పని ఉంటుంది. పని భారంతో అలసిపోయిన ఆమె శరీరం, అప్పుడు కాస్త విశ్రాంతిని కోరుకుంటుంది. అందుకే త్వరత్వరగా పనూల్న్నీ ముగించుకుని, భర్తతో కలసి భోజనం చేసి సాధ్యమయినంత త్వరగా పక్కమీదికి చేరే అలవాటు ఆమెది.

    కానీ ఈ స్థితిలో ఈవేళ ఎంత కోరుకున్నా ఆమెకు నిద్రరావడం లేదు. కళ్ళు మూస్సుకుందామంటే, కనురెప్పలు ససేమిరా అంటున్నాయి. భర్తను గురించిన ఆలోచనలే ఆమె వెన్నులో చలిని పుట్టిస్తున్నాయి. ఏదో కీడును శంకిస్తున్నాయి. క్షణక్షణం ఆమెలో ఆలోచనలు అధికం అవుతున్నాయి. ఆమె పదేపదే టెన్షన్‌కు గురి అయి నోరు ఎండిపోతోంది. 

    నిజానికి, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏమి చేయాలన్నా అది మంచయినా, చెడయినా, భర్త తనకు చెప్పకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడన్నది ఆమె గట్టి నమ్మకం. ఇప్పటివర్కు అలానే జరుగుతూ వచ్చింది మరి. 

    ఈ నేపథ్యంలో కనీసం ఫోన్ కూడా చేయకుండా తన మొబైల్‌ఫోన్ స్విచ్ ఆఫ్‌చేసి ఉంచడం కాస్త విడ్డూరంగా అనిపించినా, ప్రస్తుత పరిస్థితి ఆమెలో చెప్పలేని భయాన్ని కలిగించి, వింత - వింత అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది.

* * *

     జగన్, ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. డాక్టర్లు, నర్సులు, మినిస్టీరియల్ సిబ్బంది, నాల్గవ తరగతి సిబ్బందికి సంబంధించిన జీతాలు వగైరా ఇతని ద్వారానే బట్వాడా చేయబడతాయి. పేరుకు మాత్రమే డ్రాయింగ్ ఆఫిసర్ సంతకాలు పెడ్తాడు. కానీ మిగతా పని అంతా ఇతనిది!అంటే అంతా అకౌంట్స్‌తో, డబ్బుతో నిత్యం సంబంధాలు కలిగి ఉండే సీటు జగన్‌ది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం అంతా అతనే చూస్తాడన్నమాట! అందుకే ఆసుపత్రిలో పనిచేసే ప్రతివారితోను అతనికి సంబంధాలు, పరిచయాలు ఉంటాయి. అందుకేనేమో, ఆఫీసులో ఎప్పుడూ జగన్ హడావిడిగా కనిపిస్తాడు. ఆఫిసు పనిలోను, సమయ పాలనలోను ఎప్పుడూ అతనిదే ప్రథమస్థానం.

    ఆసుపత్రి అధికారులకు అతను చెప్పిందే వేదం. అందుకే కళ్ళు మూసుకుని ప్రతి బిల్లు మీద గుడ్డిగా సంతకాలు పెట్టేస్తుంటారు. పరిపాలనకు, అకూంట్లకు సంబంధించిన అన్ని పరీక్షలు సకాలంలో పాస్ కాగలిగిన జగన్, ఎలాంటి క్లిష్ట సమస్యకయినా పరిష్కారం చూపించగలడన్న గట్టి నమ్మకం అధికారుల్లో బలంగా ముద్రపడిపోయింది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసిన సంఘటనలు ఇంతవరకు అతని ఉద్యోగ జీవితంలో ఎదురు కాలేదు.

    సంసార పక్షంగా, అతని అభిరుచులకు, అభిప్రాయాలకు, అత్యంత ప్రాధాన్యతను, విలువను ఇచ్చే ఉత్తమ ఇల్లాలు, జగన్ భార్య శ్యామల. ఇంటా - బయటా అతని సూచనల మేరకు మాత్రమే పని చేయడంతో ఎట్టి పరిస్థితిలోను భర్త సంతోషానికి భంగం కలగకుండా తను జాగ్రత్తలు తీసుకుని తన ప్రవర్తనను, జీవనశైలిని, భర్తకు అనుగుణంగా మార్చుకుంది. తనలో శారీరకంగా, మానసికంగా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సాధ్యమైనంతవరకు వాటిని భర్త దృష్టికి పోకుండా, తనకు తాను పరిష్కరించుకునే మనోధైర్యాన్ని స్వతహాగా ఆమె కలిగి ఉండటం వల్ల భార్య అంటే అమితమైన ప్రేమ జగన్‌కి. 

    తనపై భర్త కురిపించే ఆత్మీయత, అనురాగం, ప్రేమ, అభిమానం ఆమెను ప్రతి క్షణం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. తద్వారా కించిత్ గర్వపడుతుంది కూడా!

    జగన్ - శ్యామలల అనురాగానికి ప్రేమ పంటగా, ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు వాళ్ళిద్దరి జీవితంలో ప్రవేశించారు. దీనితో వీరి ఆనందము - ప్రేమ బంధము మరింతగా పెనవేసుకుపోయాయి. ముగ్గురి సంతానంలోను పెద్దవాళ్ళిద్దరూ ఆడపిల్లలు. విశాల అందరికంటే పెద్దది. రెండవది సింధూర.

    ఈ ఆడపిల్లలిద్దరు తల్లిదండ్రుల పెంపకంలో, వారి ఆశయాలకు అనుగుణంగా తాము అభిమానించిన విద్యలో సఫలీకృతులయినారు. తద్వారా ఉన్నతష్తాయి పదవులు మాత్రమే కాక, ఉత్తమస్థాయి సంబంధాలు కుదిరి, పెళ్ళిళ్ళు చేసుకుని హాఇగా విదేశాల్లో సెటిల్ అయిపోయారు.

    ఆఖరివాడు పుత్రరత్నం. వంశోద్ధారకుడు కదా! పైగా ఆఖరువాడు, మగపిల్లవాడు కావడంతో తల్లిదండ్రుల దగ్గర కాస్త గారాబం ఎక్కువస్థాయిలోనే అనుభవిస్తున్నాడు. పేరు విక్రం.

    విక్రమ్ - తన అక్కల్లా చదువులో చెప్పుకోదగ్గ చురుకైన వాడుకాదు. కష్టపడడం పెద్దగా ఇష్టపడనివాడు. గ్రహణశక్తి తెలివితేటలు కాస్త తక్కూవ ఉన్నవాడు. అవసరమయిన చోట, మెదడును పాదరసంలా పరిగెత్తించగలిగే దమ్ము ఉన్నవాడు. అతి కష్టంమీద అప్పుడే కొత్తగా ప్రారంభించిన ఒక కాలేజీలో డిగ్రీ కోసం సీటు సంపాదించి 'చదువుతున్నాడు' అనిపించుకుంటున్నాడు.

* * *

    సమయం రాత్రి పన్నెండు దాటిపోయింది. రోడ్డుమీద ట్రాఫిక్ చప్పుళ్ళు క్రమంగా చప్పబడిపోతున్నాయ్. తల్లి శ్యామల నిద్రపోకుండా కళ్ళు మూసుకుని మాత్రమే ఉందని విక్రం గ్రహించాడు. తల్లి పరిస్థితిని గమనించిన విక్రం తను కూడా వెళ్ళి తల్లికి జతగా కూర్చున్నాడు. ఇద్దరు నిశ్శబ్ద్దాన్ని భయం భయంగా అనుభవిస్తున్నారు. మౌనంగా ఆ ఇద్దరు మూగబోయిన పక్షుల్లా కూర్చుని ఉన్నారు.

    తల్లి - కొడుకుల మధ్య నిశ్శబ్ద్దాని భగ్నం చేస్తూ, వాళ్ళ ఇంటిబయట గేటు ముందు కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. కొద్ది నిముషాల్లోనే అది తిరిగి వెళ్ళిపోతున్న శబ్దం కూడా వినిపించింది. కిటికీలో నుంచి, భర్త ఇంటికి వచ్చిన విషయం గమనించింది శ్యామల. 

    అతను - బరువుగా అడుగులు వేస్తూ, తూలుతూ, అస్పష్టంగా ఏదేదో గొణుగుతూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. తండ్రి - అప్పటి పరిస్థితి ఏమిటో విక్రంకి బాగా అర్థం అయింది. విషయం తల్లి గ్రహించిందన్న సంగతి ఆమె ముఖకవళికవళికలను బట్టి అతను తెలుసుకోగలిగాడు. అందుకే మౌనంగా కూర్చున్నాడు, అక్కడి నుండి కదలకుండా.   

     హాల్లోకి ప్రవేశించిన జగన్, భార్యనుగాని, కొడుకునుగాని పలకరించే స్థితిలో లేడు. అతను అసలు ఆ పరిసరాలనే పట్టించుకునే పరిస్థితిలో లేడు. సరాసరి, మొదటి అంతస్థులోని తన పడకగదిలోకి వెళ్ళిపోయాడు. భర్త పరిస్థితి చూసి విస్తుపోయింది శ్యామల. మనసులోని బాధను బయటపడనీయకుండా కుళ్ళికుళ్ళి ఏడ్చింది శ్యామల. తను కూరుచున్న సోఫాలోనే వెనక్కు వాలిపోయి కళ్ళు మూసుకుంది. 

    తల్లి కూర్చున్న హాల్లో లైటు ఆర్పి తన పడకగదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు విర్కం. జగన్, డ్రస్సు మార్చుకోకుండానే, కాలి బూట్లతో సైతం, మంచానికి అడ్డంగా వాలిపోయి, కొద్ది క్షణాల్లోనే గాడ నిద్రలోకి జారిపోయాడు. అతని పరిస్థితిని నిరూపిస్తూ, బయటకి అతని లయబద్ధమైన గురక వినిపిస్తోంది. 

    మరి, నిద్రపట్టని శ్యామల, మండుతున్న కళ్ళతో, కాల్వలయి పారుతున్న కన్నీటి ధారలను క్షణక్షణం తుడుచుకుంటూ, అసహనంగా సోఫాలో అటు ఇటు కదులుతోంది. 

* * *

    బయట తెల్లగా తెల్లవారడం గాని, మార్నింగ్ వాక్ కోసం కొడుకు విక్రం బయటకి వెళ్ళడం గాని శ్యామల గమనించలేదు. 

    బాలభానుడి లేలేత - నులివెచ్చని కిరణాల - తాకిడికి చురుక్కుమనిపించి, పక్కమీది నుంచి ఒక్కసారిగా తారాజువ్వలా పైకిలేచాడు జగన్. అప్పటికే తను నిత్యం నిద్రలేచే సమయం దాటి చాలాసేపయింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ, కళ్ళు తుడుచుకుంటూ, గతరాత్రి అనుభూతిని, అనుభవాన్ని తలుచుకుంటూ ఎదురుగా ఉన్న నిలువెత్తు అద్దంలో తన ముఖబింబాన్ని ఓమారు చూసుకోబోయాడు జగన్.

    అద్దంలో అతని ముఖానికి బదులు కిటికీ గుండా బయటి దృశ్యం కనిపించింది. అది అతని దృష్టిని అమితంగా ఆకర్షించింది. క్షణం విస్మయానికి గురయ్యాడు జగన్. అతను చూస్తున్న దృశ్యం ఓ పట్టాన నమ్మలేక, నమ్మకం కుదరక, వెనక్కు తిరిగి కిటికీలో నుంచి పరిశీలనగా చూశాడు జగన్. 

    జగన్ అద్దంలో చూసిన దృశ్యంలో ఎలాంటి తేడా కనిపించలేదు. మార్నింగ్ వాక్ కోసం ప్రొద్దున్నే బయటికి వెళ్ళిన తన పుత్రరత్నం - విక్రం తూలుకుంటూ వస్తున్నాడు. 

    విషయం ఓ పట్టాన అర్థం కాలేదు జగన్‌కి. ఇక ఉండబట్టలేక, ఆశ్చర్యంలో  నుంచి తేరుకోలేక, చమటతో తడిసిపోతున్న శరీరాన్ని లెక్కచేయక, పరుగుపరుగున మెట్లుదిగి, బయటకు చేరుకుని, కొడుకును పొదిలిపట్టుకుని, ఒళ్ళంతా ఆప్యాయంగా తడిమాడు.

    "ఏంటి నాన్నా, ఏమయింది. అలా కుంటుతూ నడుస్తున్నావ్; ఏదైనా దెబ్బతగిలిందా! ఎవరితోనైనా ఘర్షణ పడ్డావా? ఎవరైనా బండితో డాష్ ఇచ్చారా?" అంటూ ఆతృతగా ప్రశ్నల వర్షం కురిపించాడు జగన్. 

    "అలాంటివి ఏమీ జరగలేదు డాడి!" అన్నాడు చాలా కూల్‌గా విక్రం.

    "మరి... ఆ... నీ... నడక...!!" అన్నాడు ఆశ్చర్యపోతూ.

    "ఓ... అదా!!.. మరేమీ వర్రీకాకండి, మీ అడుగుజాడల్లో నడుద్దమని, రాత్రి మీరు నడిచి వచ్చిన అడుగుల్లో అడుగువేసి, ప్రాక్టీసు చేస్తున్నాను" అన్నాడు తండ్రి ముఖంలోకి సూటిగా చూస్తూ. మాటలు రాని మూగవాడిలా, స్థాణువయి నిలబడి కొడుకు వంక వెర్రిచూపులు చూడడం మొదలుపెట్టాడు జగన్.

    ఊహించని విధంగా కొడుకు నోటినుంచి వెలువడ్డ మాటలకి ఒక్కసారిగా షాక్‌కు గురైన జగన్, కొడుకు తనను చెంపమీద ఛెళ్ళుమని వాయించనంతగా ఫీల్ అయ్యాడు.

    కొడుకు ఎదురుగా, మరి దోషిగా నిలబడే సాహసం చేయలేక, మరోమాట మాట్లాడే ధైర్యం చాలక మూగజీవిలా తలవంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు జగన్.

(ఆదివారం విశాలాంధ్ర 21 ఆగష్టు 2011 సంచికలో ప్రచురితం)      
  
Comments