అద్వైతం - అనిల్ ప్రసాద్ లింగం

    "ఒరేయ్ నానీ, నేనొక మంచి మొబైల్ కొనుక్కోవాలిరా. బజారుకు వెళదాం వస్తావా?'' అడిగాడు తాతయ్య. "సరే తాతయ్యా, నీ మొబైల్‌కు ఏమైంది? బాగానే పని చేస్తోందిగా ... నాకు కొనిపెట్టొచ్చుగా'' ఆశగా అడిగాను. "నా తరువాత నువ్వే వాడుకో. ముందు పదా'' అంటూ బయల్దేరదీశాడు.

    సిటీలో పేరున్న షాపుకు పోయాం. నేను సింపుల్‌గా ఉండే ఫోన్ చూపించమన్నాను. కానీ తాతయ్య లేటెస్ట్ 3జి ఫోన్ చూపించమన్నాడు.

    "నువ్వు దాన్ని వాడలేవు తాతయ్యా... నీకు వేస్టు'' అన్నాను.

    "నేర్చుకుంటాలేవోయ్ ... నీకు వచ్చుగా'' అన్నాడు తాతయ్య.

    నేను సెలెక్ట్ చేసినవి, షాప్ అబ్బాయి చూపించినవి కాకుండా తనకు నచ్చిన పీసు కొత్త సిమ్ కార్డుతో తీసుకున్నాడు. ఖర్చు బాగానే అయింది. ఇంటికి రాగానే దాన్ని నాకు ఇచ్చేస్తూ "దీన్ని ఉపయోగించడం నాకు నేర్పించరా నానీ, కొంచెం పనుంది'' అన్నాడు తాతయ్య.

    "అలాగే తాతయ్యా ముందు నేను అన్ని సాఫ్ట్‌వేర్‌లు లోడ్ చేయించి వాడటం తెలుసుకొని నీకు నేర్పుతాను'' అన్నాను ఉత్సాహంగా. అన్నానే గానీ పదిహేను రోజుల వరకు నా మోజు తీరలేదు ఆ ఫోనుతో. తాతయ్యకు ఫోన్ ఇవ్వలేదు, దానిని ఉపయోగించడం నేర్పించనూ లేదు. ఆయన అప్పుడపుడు నన్ను అడుగుతూనే ఉన్నాడు. నేను ఏదో చెప్పి తప్పించుకొనేవాడిని. ఒకరోజు సాయంత్రం కాలనీ బస్సు స్టాప్ దగ్గర నా కోసం వేచి ఉన్నాడు తాతయ్య. ఫ్రెండ్స్‌తో బాటు కాలేజీ బస్సు దిగిన నేను "ఏంటి తాతయ్యా?'' అంటూ దగ్గరకు వెళ్లాను.

    "అదే ఫోన్ వాడటం నేర్పిస్తానన్నావు కదా. మళ్లీ ఇంటికి వెళితే నీ చదువులో పడి మర్చిపోతావేమో అని ...'' అర్ధోక్తిలో ఆగాడు. నాకు వొళ్లు మండింది. బస్సు దిగేక కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవటం, అందరం కలిసి ఒకే సిగరెట్టు తాగడం మాకు అలవాటు. అలాంటిది ఈయన ఇక్కడికి వచ్చి నన్ను విసిగించడం నచ్చలేదు. "తీసుకో నీ బోడి ఫోను. నేనేం నేర్పించను పో'' అంటూ ఫోన్ ఆయన చేతిలో పెట్టేసి ఫ్రెండ్స్‌తో వెళ్లిపోయాను.

    రెండో రోజు నేను కాలేజీకి బయలుదేరే సమయానికి ఫోన్ నా రూమ్‌లో టేబుల్ పైన పెట్టి ఉంది. దాన్ని తీసుకొని సంతోషంగా వెళ్లిపోయాను. కానీ తాతయ్య నాతో మాట్లాడటం తగ్గించేశాడు. నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజులకు ఆయన ఆరోగ్యం బాగులేక హాస్పిటల్లో చేరాడు. అమ్మానాన్న హాస్పిటల్లో ఉండి చూసుకొంటున్నారు. నేను మామూలుగా కాలేజీకి పోతున్నా. ఒకరోజు నేనే జ్యూసు తీసుకొని హాస్పిటల్‌కు వెళ్లాను. రూంలో ఎవరూ లేరు. తాతయ్య ఒక్కడే నిద్ర పోతున్నాడు. జ్యూసు బాటిల్ టేబుల్‌పైన పెట్టిన అలికిడికి కళ్లు తెరిచి నన్ను చూసిన తాతయ్య చిన్నగా నవ్వి దగ్గరకు పిలిచి "నాకు ఫోను వాడటం నేర్పరా నానీ'' అన్నాడు.

    నా మనసు చివుక్కుమంది. మా కుటుంబంలో మొదటి మనవడినని చిన్నప్పటి నుంచి తాతయ్యకు నేనంటే చాలా ప్రేమ. నానమ్మ పోయాక ఆయన వచ్చి మా దగ్గర ఉండటం మొదలుపెట్టాక మా అనుబంధం మరింత బలపడింది. నాకు కావలసిన పాకెట్ మనీ ఇవ్వడం, ఫేవరెట్ హీరో సినిమాలు చూపించడం మొదలు ... మార్కులు తక్కువ వచ్చినప్పుడు, కాలనీ పిల్లలతో గొడవ పడినప్పుడు నాన్న నుంచి నన్ను కాపాడటం వరకు నాకు అన్ని విధాలుగా సాయపడేవాడు. అలాంటి తాతయ్య నన్ను చిన్న ఫోన్ వాడడం నేర్పమంటే నేను పట్టించుకోలేదన్న సంగతి నాకు అంత మంచిగా అనిపించలేదు. ఆయన పని ఏదో గేమ్ ఆడడమో, మెసేజ్ పంపటమో, మహా అయితే ఒక మెయిల్ పంపించడమో అయివుంటుంది. దానికి కూడా నేను సాయపడలేకపోయానన్న సంగతి నాకు చాలా బాధగా అనిపించింది.

    "తప్పకుండా తాతయ్యా. నువ్వు ఇంటికి రాగానే నేర్పిస్తాను'' అన్నాను కళ్లమ్మట నీళ్లు తిరుగుతుండగా. ఆయన మొహం వికసించింది.

* * *

    వారం తరువాత తాతయ్య ఇంటికి వచ్చేశాడు. నన్ను చూసినప్పుడల్లా ఆయన కళ్లలో ఏదో ఆశ కనబడేది. కాని నన్ను ఆయన ఫోన్ గురించి మళ్లీ అడగలేదు. కొన్ని రోజుల తరువాత నేనే "తాతయ్యా, భోంచేశాక రండి, మీకు ఫోన్ వాడడం నేర్పుతాను'' అని టీవీ సీరియల్ చూస్తున్న ఆయనకు చెప్పి, నా రూంకి వెళ్లిపోయాను. ఆయన నా వెనుకే వచ్చేశాడు. ఆ మొహంలో ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది కానీ, నాకు అర్థం కానిది ఏమంటే ఆయన ఇప్పటికే ఒక ఫోన్ ఉపయోగిస్తున్నాడు. దానితో డయల్ చేయడం, కాల్ రిసీవ్ చేసుకోవ డం వంటి పనులు చేయగలడు. మరి కొత్త గా ఇప్పుడు ఏమి నేర్చుకోవాలని అనుకుంటున్నాడో, ఎందుకో అర్థం కాలేదు.

    "ఏం కావాలి మీకు? సినిమాలు, గేమ్స్, చాటింగ్, ఈ మెయిల్, వీడియో కాలింగ్‌లో ఏది కావాలి? అసలు మీకు ఇప్పుడు 3జి టెక్నాలజీతో ఏమవసరం వచ్చింది?'' అంటూ నా పరిజ్ఞానాన్ని తాతయ్యకు చూపెడదామని మొదలుపెట్టాను. "అదీ ... నేను ఇలాంటి ఫోన్ వాడడం నేర్చుకుందామనీ ... అనుకుంటున్నాను'' భయపడలేదు తాతయ్య. "అదే తాతయ్యా. ఇలాంటి ఫోన్‌లో ఏమి వాడడం నేర్చుకుంటావు? టీవీ చూస్తావా? బాబాయ్ వాళ్లతో వీడియోకాల్ మాట్లాడతావా? కొత్త హీరోయిన్ ఫోటోలు డౌన్‌లోడ్ చేసుకుంటావా? నీ అవసరం ఏంటో చెబితే అది నేర్పిస్తాను.''

    "దీన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ చెప్పు'' చిన్న పిల్లాడిలా అన్నారు.

    బేసిక్ ఆపరేషన్స్ కొన్ని నేర్పి పంపించేశాను. రెండో రోజు మళ్లీ నా గదికి వచ్చాడు. మెసేజ్, ఫోటోలు పంపడం, రిసీవ్ చేసుకున్నవి చదవటం ఫార్వర్డ్ చేయడం నేర్పించాను. ఇలా ఒక వారం పాటు 3జి ఫోన్ మౌలిక వాడకం నేర్పాను. నేను ఇంటికి రాగానే ఫోన్ తీసుకొని ఏదో నొక్కుతుండేవాడు. నా సెట్టింగ్స్ అన్నీ పోగొట్టేవాడు. నేను మళ్లీ పెట్టుకోవలసి వచ్చేది. నాకు ఫ్రెండ్స్ పంపే మెసేజులు ఓపెన్ చేసేవాడు. ఇవన్నీ నేను ఒక పదిహేను రోజులు భరించాను. తరువాత సహనం నశించి అరిచేశాను "నీకు ఈ వయసులో ఇలాంటి ఫోన్లతో అవసరం ఏంటి'' అని. పెద్దాయన ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు. కొన్ని రోజులు నన్ను కదపలేదు. నేనూ అదే మంచిదని అంటీ ముట్టనట్లుగా ఉన్నాను.

    ఒకరోజు కాలనీ బస్సుస్టాప్ దగ్గరకు మళ్లీ వచ్చాడు. నాకు కోపం నషాళానికి ఎక్కింది. వేగంగా ఆయన దగ్గరకు వెళ్లాను. నేను మాట అనే లోపే ఆయన తన చేతులు రెండూ జోడించి "నానీ, ఒక చిన్న పనిచేసి పెట్టరా నీకు రుణపడి ఉంటాను'' అన్నాడు. తాతయ్య అలా దీనంగా మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు. అదీకాక అంత పెద్దాయన బతిమలాడటంతో ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. ఆయన చేతులు పట్టుకుని "ఏంటి తాతయ్యా?'' అన్నాను.
దగ్గరలోని పార్కుకు దారి తీశాడు. నేను నా ఫ్రెండ్స్‌కు బై చెప్పి ఆయన్ను వెంబడించాను. ఇద్దరం ఒక సిమెంట్ బల్ల మీద కూర్చు న్నాం. తాతయ్య నేలను చూస్తున్నాడు. నేను ఆయన్ను చూస్తున్నాను. పది నిమిషాల తర్వా త నేనే అడిగాను "చెప్పు తాతయ్యా'' అని.

    "నానీ, మొన్న మనం కొన్న ఫోన్ .. ఆ మోడలే ఎందుకు కొన్నానో తెలుసా?''

    "ఏముంది ... నీకు నచ్చింది కాబట్టి.''

    "కాదురా, ఆ మోడల్ ఒక అడ్వర్‌టైజ్‌మెంట్లో కనబడింది. ఆ యాడ్ నన్ను ఆకర్షించింది. అందుకే కొన్నా'' నా రియాక్షన్ కొరకు ఆగాడు.

    "ఓకే! ఏంటా యాడ్?'' ఫోన్‌ను పరిశీలిస్తూ అడిగాను.

    "అదేరా ఒక తాత మనవడు వాళ్లు అంతకు ముందు ఉండే ప్రదేశానికి వెళ్తారు. తాత మనవడితో ఇక్కడే వొకప్పుడు కాంతిలాల్ అనే వాడు ఉండేవాడు. వాడు పెళ్లికి ముందు మీ నానమ్మని ముద్దు పెట్టుకున్నాడు. కానీ అప్పుడు నేను వాడి పళ్లు ఊడగొట్టలేకపోయాను అంటాడు. మనవడు ఫోనులో ఆ కాంతిలాల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలుసా అని అడుగుతాడు. ఎవరో కాంతిలాల్ దొరికాడు అంటారు. తాతా మనవళ్లు వెళ్లి కాంతిలాల్ భార్యకి ముద్దుపెట్టి వస్తారు చూడు ఆ యాడ్.''

    నాకు నవ్వు ఆగలేదు. తాతయ్య కూడా నవ్వాడు.

    "అయ్యో తాతయ్యా అది ఫోన్ యాడ్ కాదు. ఆ సిమ్ కార్డు కంపెనీ వాళ్లు తాము సోషల్ నెట్వర్క్ కింద సర్వీసు అందిస్తామని ఇచ్చిన యాడ్. నీ పాత సిమ్‌తో కూడా నువ్వు ఆ సర్వీసు పొందొచ్చు. అనవసరంగా కొత్త ఫోను, సిమ్ కార్డూ కొన్నావు'' అన్నాను. తాతయ్య నావైపు అయోమయంగా చూశాడు.

    "సరే అదంతా వదిలేయ్. నీకు కావలసిన వాడి పేరూ, ఊరూ చెప్పు. నేను కనుక్కుంటా వాడిప్పుడు ఎక్కడున్నాడో'' తాతయ్య భుజం మీద చేయి వేసి చెప్పాను.

    "అదేరా నానీ, నాకు కావలసింది. ఈ ఒక్క సాయం చేసి పెట్టు. నీకు ఏం కావాలన్నా కొనిపెడతాను'' తాతయ్య చాలా ఉద్విగ్నంగా అన్నాడు.

    "సరేలే తాతయ్యా, నువ్వేమీ ఫీల్ అవకు. నేను కనుక్కుంటాను ... పేరు చెప్పు'' అంటూ ఫోను తీశాను. "ఈ విషయం మన ఇద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలీకూడదురా నానీ. చాలా సీక్రెట్‌గా ఉంచాలి.''

    "ప్రామిస్ తాతయ్యా నేను ఎవ్వరికీ చెప్పను.''

    "పేరు ... రేబాల రమణ. సొంత ఊరు ... గుడివాడ. మచిలీపట్నం యల్.ఐ.సి. రీజనల్ ఆఫీసులో కాషియర్‌గా పని చేసేవాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో?''

    నేను వెంటనే నాకు ఎకౌంటు ఉన్న 3 సోషల్ నెట్వర్క్ సైట్లలో వివరాలు పెట్టాను.

    "తాతయ్యా, రేపటికల్లా వాడు దొరికిపోతాడు నువ్వు హ్యాపీగా ఉండు. అప్పుడు మనిద్దరం వెళ్లి వాడి పని పడదాం. ఇంతకూ వాడేం చేశాడు? నానమ్మను ఏడిపించాడా?'' నా మనసు ఉండబట్టలేక అడిగాను.

    "లేదు లేరా. ఒక రుణం తీర్చుకోవాలి. నువ్వు ముందు కనిపెట్టు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో?'' అంటూ ఇంటికి దారి తీశాడు. రెండో రోజు తాతయ్య బస్సు స్టాప్ దగ్గరకు ఇంకా ఏమీ రెస్పాన్స్ రాలేదా అని వస్తే తనకు ఇంట్లోనే చెబుతానని పంపించేశా. నాలుగు రోజులకి రెండు రిప్లయ్‌లు వచ్చాయి.

    ఒకటి ఆర్. రమణ అనే ఆవిడ మచిలీపట్నం యల్.ఐ.సి. ఆఫీసులో పనిచేస్తుందని ఐతే ఆవిడ ఇంటి పేరు రాపాక అని, ఆవిడ ప్రస్తుతం క్లర్క్ అని అదే ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ తెలిపాడు. తాతయ్య ఎవరైనా అమ్మాయిని వెదుకుతున్నాడా? అని అనుమానం కలిగింది. కానీ తాను మగవాడినే వెదుకుతున్నానని, ఆ మనిషి ఇప్పటికి రిటైర్ అయిపోయి ఉంటాడని చెప్పాడు తాతయ్య. ఇక రెండోది గుడివాడ పట్టణ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం సెక్రటరీ నుంచి వచ్చింది. మరిన్ని వివరాలు అందిస్తే తాము సాయపడగలమని రాశారు. కానీ తాతయ్య తను వెదికే మనిషి మచిలీపట్నంలో స్థిరపడ్డాడని చెప్పాడు. సో వచ్చిన రెండు సమాధానాలు మాకు ఉపయోగపడలేదు.

    ఒకవారం రోజులు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూశాను కాని సరైన సమాచారం ఏదీ రాలేదు. సాయంత్రం కాలేజి నుంచి నా రాక కోసం ఉత్సాహంగా ఎదురుచూసే తాతయ్య నా సమాధానాలతో నీరసపడిపోయేవాడు. కొన్ని రోజుల తరువాత ఆయన నన్ను అడగటం మానేశాడు. కానీ ఒక రోజు నా వాల్ మీద ఓ చిన్న పోస్టు కనబడింది. అందులోని విషయం తాతయ్యకు చెప్పాలంటే నాకు భయం వేసింది, ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని. ఆయన పక్కన కూర్చుని "మనం వెదికే వాడికి పెద్ద వయసు వచ్చేసుంటుంది తాతయ్యా'' అసలు విషయం చెప్పేముందు కొంచెం ప్రిపేర్ చేస్తూ అన్నాను. "వాళ్ల వాళ్లు ఎవరైనా నెట్‌లో చూసి చెబితేగాని అతనికి మనం వెదుకుతున్న విషయం తెలీదు. అసలు ఇంకా ఉన్నాడో పోయాడో మహానుభావుడు'' జాగ్రత్తగా తాతయ్యను గమనిస్తూ మాట్లాడుతున్నాను. సాలోచనగా తల ఊపుతూ వింటున్నాడు తాతయ్య.

    "ఒకవేళ అతగాడు ఇప్పటికే పోయివుంటే...'' అర్దోక్తిలో ఆగాను తాతయ్య రియాక్షన్ కోసం.

    "వాళ్ల వాళ్లు ఎవ్వరైనా చూస్తే బాగుండు'' తల ఊపుతూ అన్నాడు తాతయ్య.

    "చూశారు తాతయ్యా. అతను చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడట'' సాధ్యమైనంత మెల్లగా చెప్పాను.

    తల పైకెత్తి నావైపు తీక్షణంగా చూశాడు తాతయ్య. "అవును తాతయ్యా అతను బందరులో పని చేసేప్పుడే ఆక్సిడెంట్లో పోయాడట. అతని కూతురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా అమెరికాలో పనిచేస్తోందట. ఆవిడ కొడుకు మన మెసేజ్ చూసి వాళ్ల అమ్మకు చెప్పాడట. ఎప్పుడో పోయిన మనిషిని ఇప్పుడు వెదికేది ఎవ్వరో, ఎందుకో కనుక్కోమని ఆవిడ అందట'' తాతయ్యకు నేను చెప్పే మాటలు అర్థం కావాలని ఆగాను.


    "అవునా? థాంక్ గాడ్. బందరులో మేము కలిసి పనిచేశామని చెప్పు. రమణ వాళ్ల ఆవిడ ఎక్కడ ఉందో కనుక్కో'' చాలా ఎక్సైటింగ్‌గా అన్నాడు తాతయ్య. ఆయన మొహంలో ఏదో తెలీని ఉద్వేగం కనబడుతోంది.

    తను వెదకమన్న వాడు మరణించాడని తెలిస్తే పగ తీర్చుకొనే అవకాశం లేదని తాతయ్య బాధపడతాడు అనుకొన్న నాకు ఆయన మాటలు అర్థం కాలేదు. ఆయన అసలు ఆ విషయం పట్టించుకున్నట్లుగా కూడా నాకు అనిపించలేదు. పైపెచ్చు ఆ మనిషి భార్యను గురించి తెలుసుకోమనటం నాలో అనుమానం రేకెత్తించింది. నాకు ఏమి మాట్లాడాలో అర్థంగాక "సరే'' అనేసి నా గదికి వెళ్లిపోయాను. తరువాత రోజు పొద్దునే తాతయ్య నా గదికి వచ్చి "ఏరా నానీ, నేను చెప్పమంది చెప్పావా? ఆవిడ వివరాలు కనుక్కొన్నావా?'' అన్నాడు.

    రాత్రి నా గదికి వచ్చాక ఆ విషయం గురించి కొంచెంసేపు ఆలోచించాను. తాతయ్య చెప్పిన యాడ్‌లో ముసలాయన కాంతిలాల్ వాళ్ల ఆవిడకు ముద్దు పెట్టి - చెల్లుకు చెల్లు అని పరుగు తీస్తాడు. కొంపదీసి తాతయ్య కూడా ఇప్పుడు ఆ రమణ అనే ఆయన భార్యను ఏడిపించి ప్రతీకారం తీర్చుకోవాలను కుంటున్నాడా? అనిపించింది. అదీగాక రమణ మరణ వార్త విని తాతయ్య రియాక్ట్ అయిన విధం కూడా నాకు అనుమానం కలిగించింది. అందుకే నేను ఆ పోస్ట్‌కు ఏ సమాధానమూ ఇవ్వలేదు. కాని తాతయ్యకు మాత్రం మెసేజ్ పెట్టాను అని చెప్పాను. రోజూ రెండు పూటలా తాతయ్య నన్ను విసిగిస్తూనే ఉండేవాడు కాని నేను ఆ సంగతి పట్టించుకోవడం మానేశాను.

* * *

    ఒకరోజు ఆయన నా గదికి వచ్చి "నువ్వు నా పని పట్టించుకోవడం లేదు'' అన్నాడు నిష్టూరంగా.

    "ఆయన పోయాడు కద తాతయ్యా ఇంకా ఏంటి?'' చిరాగ్గా అన్నాను.

    "రమణ పోయాడని నాకు తెలుసురా. నువ్వు చెప్పిన ఆ నెట్వర్క్ ఎంతవరకు సరైనదో చూద్దామని, నీకు ముందు చెప్పలేదు'' తాపీగా చెప్పాడు తాతయ్య.

    "అవునా'' నమ్మ బుద్ధికాక అన్నాను నేను.

    "అవునురా. అతను పోయాడని నాకూ తెలుసు. వాళ్ల కుటుంబ సభ్యులే ఆ విషయం చెప్పగలరని నేను ఊహించాను.అలాగే నువ్వూ అతని కుటుంబం ద్వారానే తెలుసుకున్నావు. ఇప్పుడు వాళ్ల ఆవిడ ఎక్కడ ఉందో కనుక్కోరా ప్లీజ్'' నా గడ్డం పట్టుకుని బతిమాలాడు.

    "ఎందుకు? ఆవిడ మీద ప్రతీకారం తీర్చుకుంటావా?'' ఆయన చేతిని పక్కకు నెట్టేస్తూ అన్నాను.

    "ఒక్కసారి ఆమెను కలవాలిరా. పనుంది. కొంచెం వెదికి పెట్టరా'' మళ్లీ బతిమలాడాడు. నా మనసు అప్పటికి కొంచెం కరిగింది. వెంటనే రమణ మనమడికి మెసేజ్ పెట్టాను. ఆయనతో కలిసి పనిచేసిన మా తాతయ్య వాళ్ల అమ్మమ్మను కలవాలనుకుంటున్నాడని. ఆమె ఇండియాలో ఉం దా, ఉంటే ఎక్కడ ఉందని? (నా ఉద్దేశం ఆమె బతికి ఉందా అని కనుక్కోవడం) అవతలి వాళ్లకు ఈ వ్యవహారం ఇంట్రెస్ట్ కలిగించినట్టుంది. వెంటనే రిప్లయ్ వ చ్చింది. ఆమె బతికే ఉందని, ఇండియాలోనే ఉంటుందని, తాతయ్య వివరాలు తెలిపితే ఆమెను కనుక్కొని అడ్రస్సే ఇస్తామని రాశారు.

    ఈ విషయం చెప్పగానే తాతయ్య చాలా సంబరపడ్డాడు. తన పేరు, బందరు ఆఫీసులో పని చేసినప్పుడు తన హోదా, రమణతో తనకు గల స్నేహం, అతని ఇంటికి వెళ్లడం, ఆఫీసులో అందరూ కుటుంబాలతో మంగినపూడి బీచ్‌కు వెళ్లడం వంటి వివరాలు చెబితే పంపించాను. నాలుగు రోజులవరకు అటునుంచి సమాధానం లేదు. తాతయ్య అసహనం చూసి నాకు అనుమానం పెరుగుతోంది. అసలు ఈయన నాతో వెదికించింది రమణనా లేక వాళ్లావిడనా? ఇన్నేళ్ల తరువాత ఎందుకు వెదుకుతున్నాడు? రమణ కుటుంబం వారికీ ఇదే సందేహం కలిగిందని నాలుగు రోజుల తర్వాత వచ్చిన మెసేజ్ వల్ల అర్థమైంది. రమణ భార్యకు పెద్ద వయసు వచ్చేసిందని, ఆరోగ్యం దెబ్బతిందని, సరిగా చూడలేక పోతోందని, మాట్లాడలేక పోతోందని, ప్రయాణం చేయలేదని ఈ పరిస్థితుల్లో ఆమెతో పని ఏంటో చెప్పాలని, అప్పుడు ఆమె ఇష్టపడితే ఆమె చిరునామా ఇస్తామని తెలిపారు.

    "ఆనాటి మనిషి ఇప్పుడు ఎలా ఉందో చూసి ఆ కాలం జ్ఞాపకాలు నెమరువేసుకుందామని'' డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చాడు తాతయ్య. వాళ్లకు ఆయన సమాధానం అంత నచ్చినట్టు లేదు వారం దాక సమాధానం పంపలేదు. కనీసం ఫోన్ నెంబర్ ఇమ్మని తాతయ్యే మళ్లా మెసేజ్ పెట్టించాడు నాతో. వాళ్ల మనసు కొంచెం కరిగినట్టుంది. ఆమె పెద్ద కొడుకు దగ్గర గుడివాడలో ఉంటుందని అడ్రస్సు, ఫోన్ నెంబర్లు ఇచ్చారు. తాతయ్య సంతోషానికి అంతులేదు. వెంటనే వాళ్లతో మాట్లాడి తాను త్వరలో వచ్చి కలుస్తానని చెప్పాడు. "చాలా థాంక్స్ రా'' రెండు చేతులతో నా భుజాలను తడుతూ మెచ్చుకున్నాడు తాతయ్య. ఆయన మొహంలో సంతోషం స్పష్టంగా కనబడింది. నాకు ఎన్నో ప్రశ్నలు అడగాలని వుంది కాని సభ్యత కాదని ఆగాను.

    ఎవరో చుట్టాలింటికి వెళ్లి వస్తానని నాన్నతో చెప్పి ప్రయాణం సన్నాహాలు మొదలుపెట్టాడు తాతయ్య. నాకూ ఆయనతో వెళ్లాలనిపించింది. ముందు ఒప్పుకోలేదు కానీ నేను పట్టుబడితే సరేనన్నాడు. అప్పుడప్పుడు పిల్లలకు ఆటవిడుపు ఉండాలి అని నాన్నతో మాట్లాడి తాతయ్యే రెండు రోజుల్లో వచ్చేస్తామని చెప్పి నాకూ పర్మిషన్ తీసుకున్నాడు. పెద్ద లగేజ్ ఏమీ లేకుండా చెరో రెండు జతల బట్టలు ఒక బ్యాగులో పెట్టుకుని బయలుదేరాం. తాతయ్య చాలా ఉత్సాహంగా ఉన్నాడు. నా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. ఆ రమణ భార్యతో మా తాతయ్యకు పని ఏంటా అని. వయసులోని అంతరం, సభ్యతా సంస్కారాలు అడ్డు వచ్చి అడగలేకపోతున్నానే గాని నాకు తోచిన సమాధానాలన్నీ కూడా ఆయన మీది గౌరవాన్ని తగ్గించేవే.

    గుడివాడలో దిగి ఓ హోటల్లో రూం తీసుకున్నాము. అల్ఫాహారం కానిచ్చి రమణ కొడుకు ఇచ్చిన అడ్రస్ వెదుక్కుంటూ బయలుదేరాం. ఇల్లు త్వరగానే దొరికింది. ముందుగా తెలీపర్చడం వలన రమణ పెద్ద కొడుకు మా కోసం ఎదరుచూస్తూ ఇంట్లోనే ఉన్నాడు. నవ్వుతూనే పలకరించినా ఆయనా, వాళ్ల ఇంట్లో వారి మొహాల్లో ఏదో అనుమానం తొంగి చూస్తూనే ఉంది. "చిన్న వయసులోనే పోయాడు పాపం'' హాల్లోని రమణ ఫోటో చూస్తూ నిట్టూర్చాడు తాతయ్య.

    ఫోటోలో మనిషి మొహం చూస్తే మంచివాడిగానే ఉన్నాడు. మరి ఏమి చేసి తాతయ్యకు ఇంతకాలం గుర్తుండిపోయాడో అనుకున్నా. అదీగాక ఇప్పుడు తాతయ్య ఆ యాడ్‌లోలా ఏదైనా చిలిపి పని చేస్తే ఎలా తప్పించుకోవాలా అని మనసులో మధనపడుతున్నా. ఇంతలో తనంత తానే నడుచుకుంటూ వచ్చింది మేము ఎదురుచూస్తున్న ఆమె. నెట్లో మనవడు చెప్పినంత ముసలిగా గానీ, అనారోగ్యంగా గానీ ఆమె కనపడలేదు. ఎందుకో ఆమెను చూడగానే నాకు మన ప్రెసిడెంట్ ప్రతిభాపాటిల్ గుర్తుకువచ్చారు. నేను గమనించలేదు కాని తాతయ్య ఆమెను చూడగానే లేచి నిలబడ్డాడు. కాస్త దగ్గరకు వెళ్లి మొహం ఆనవాలు పట్టే ప్రయత్నం చేస్తోందామె.

    "చాలా కాలమైంది చూసి... బాగున్నారా?'' అన్నాడు తాతయ్య ఉత్సాహంగా.

    ఆమె ఇంకా సరిగా పోల్చుకున్నట్టు లేదు. కళ్లజోడు సరిచేసుకుంటూ యథాలాపంగా సమాధానం చెబుతోంది.

    "బాగానే ఉన్నామండి. పిల్లలు చెప్పారు. మావారితో కలిసి పనిచేశారని. గుర్తుపట్టలేకపోతున్నా. క్షమించండి'' అంది ఆవిడ.

    అప్పటి విషయాలు ఏవో చెప్పి ఆమెకు జ్ఞప్తికి తెచ్చే ప్రయత్నం చేశాడు తాతయ్య. నాకు ఇదంతా బోరింగ్‌గా ఉంది కాని ఏమి జరగనుందో అనే ఉత్సుకత నన్ను అక్కడినుండి కదలనీయడం లేదు. మొత్తానికి పావుగంట కష్టపడి ఎరిగిన వాళ్లేనని ఆమెతో అంగీకరింపచేశాడు తాతయ్య. కాఫీలు తాగాక రమణ కొడుకు "నాన్నగారి గురించి ఇన్నేళ్ల తరువాత అడుగుతున్నారంటే ఎవ్వరో ఎందుకో అని భయపడ్డాము''. సంగతేంటి అనే కుతూహలం వారిలోనూ ఉందని అర్థమైంది.

    "రమణ పోవడానికి వారం ముందు'' పెద్దావిడకు చెపుతున్నాడు తాతయ్య. కానీ అందరం చెవులు రిక్కించి వింటున్నాము. "నేను అతని దగ్గర కొంత మొత్తం అవసరమై తీసుకున్నా. బహుశా అతను మీకు చెప్పి ఉండడు. నా దగ్గర సొమ్ము సమకూరాక మీ గురించి విచారిస్తే మీరు బందరు నుంచి వెళ్లిపోయారని తెలిసింది. అప్పటి నుంచి రమణ ఋణం తీర్చుకుందామని మీకోసం వెదుకుతూనే ఉన్నా. ఇదిగో ఇప్పటికి నా మనవడి వలన మీ ఆచూకీ కనుక్కోగలిగాను'' చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేసి, జేబులోంచి ఓ కవరు తీసి ఆమె చేతిలో పెట్టి నమస్కరించాడు తాతయ్య.

    రమణవాళ్ల ఆవిడతో సహా ఎవ్వరూ ఒక నిమిషం పాటు మాట్లాడలేదు. వచ్చిన పని అయిపోయిందన్నట్లు లేచాడు. భోజనం చేసి వెళ్లమని వాళ్లు ఎంత బతిమలాడినా ఒప్పుకోక రమణ ఫోటోకు నమస్కరించి వచ్చేశాడు తాతయ్య. రమణ కొడుకు రోడ్డు వరకు వచ్చి మమ్మల్ని ఆటో ఎక్కించాడు. జరిగింది జీర్ణించుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. తాతయ్య మాత్రం చాలా ప్రసన్నంగా ఉన్నాడు. మధ్యాహ్నం భోజనం చేశాక రూంలో మంచం మీద పడుకొని అన్నాను "సో ... నీ బాధ తీరిపోయింది.'' "అవున్రా నానీ, నీ ఋణం కూడా ఉంచుకోనులే. నేను చచ్చేలోపు తీర్చేసుకుంటాను'' తిరుగుతున్న సీలింగ్ ఫ్యాను చూస్తూ అన్నాడు.

    "ఛా! అదేం మాట తాతయ్యా? అలా అనకు'' నేను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాను. "అసలు నువ్వు ఆ యాడ్‌లో ముసలివాడిలా ఇంకా ఏదన్నా చేస్తావేమో అనుకొని భయపడి చచ్చాను'' వాతావరణం ఆహ్లాదపరచడానికి అన్నాను. ఇద్దరం ఒక్కసారి నవ్వుకున్నాం. ఇంతలో డోర్ చప్పుడయింది. నేను వెళ్లి తలుపు తీశా. ఎదురుగా రమణగారి అబ్బాయి. "మీరు కవర్లో సొమ్ము, పొరబాటున చాలా ఎక్కువ పెట్టారు. ఒకసారి సరి చూసుకోండి'' ఇందాక ఇచ్చిన కవర్ మళ్లీ తాతయ్యకు తిరిగి ఇవ్వబోయాడు.

    "లేదు బాబు, కరెక్టుగానే పెట్టాను. నాకు తెలుసు'' తాతయ్య తీసుకోలేదు.

    "అది కాదండి. ఆ టైములో నాన్నగారి దగ్గర అంత మొత్తం ఉండే వీలు లేదని అమ్మ చెప్పింది. మీరు పొరబడ్డారేమో కనుక్కోమంది'' మరోసారి కవర్ తాతయ్యకివ్వబోయాడు అతడు.

    "చూడు బాబూ ఆ రోజు మీ నాన్న నాకు ఇచ్చిన రొక్కం విలువ మీకు తెలీదు. ఈ రోజు నేను మీకు తిరిగి ఇస్తుంది చాలా తక్కువ. అదీగాక ఇన్నేళ్లకు సొమ్ము రెట్టింపు అవదా ఏంటి?'' కవర్ తీసి అతని జేబులో పెట్టి డోర్ వద్దకు అతన్ని నడిపించాడు. "కానీ లక్ష రూపాయలు మరీ ఎక్కువండి'' రమణగారి అబ్బాయి అంటున్నాడు. అది నాకు వినపడకూడదన్నట్లు తాతయ్య తన స్వరం పెంచి "కాదు లేవయ్యా... రమణ మనవళ్లు, మనవరాళ్లకు తలా కొంచెం వాళ్ల తాతయ్య పేరుమీద పంచు'' ఇక నువ్వు వెళ్లు అన్నట్లు అతన్ని భుజం పట్టి తోస్తున్నాడు తాతయ్య. అతను ఏదో చెబుతూనే ఉన్నాడు కానీ తాతయ్య లిఫ్ట్ వరకూ తీసుకెళ్లి అతన్ని పంపించేశాడు.

    "వచ్చిన పని అయిపోయింది. విజయవాడ వెళ్లి దుర్గమ్మను దర్శించుకుని ఇంటికి వెళ్లిపోదాం'' అంటూ అప్పటికప్పుడు బయలుదేరతీశాడు తాతయ్య. అక్కడే ఉంటే రమణగారి కొడుకు మళ్లీ వస్తాడేమో అనే ఆందోళన ఆయన మాటల్లో నాకు స్పష్టంగా కనిపించింది.

* * *

    ఇన్నేళ్ళ తర్వాత గుర్తుపెట్టుకు వెళ్లి తాతయ్య అప్పు తీర్చడం నాకు గొప్పగా ఉంది కానీ, ఆయన తిరిగిచ్చిన మొత్తం విన్నదగ్గర్నుంచీ మనసు కొంచెం మధనపడటం మొదలుపెట్టింది. అప్పు తీసుకున్నపుడు తాతయ్య పరిస్థితి ఏంటో నాకు తెలీదు కానీ లక్ష రూపాయలు అంటే ఇప్పటికీ మా కుటుంబానికి పెద్ద మొత్తమే అని మాత్రం తెలుసు. విజయవాడలో దేవి హుండీలో తాతయ్య నూట పదహార్లు వేశాడు. నాతోనూ అంత వేయించాడు. అది నాకు చాలా తక్కువ అనిపించింది. రూం తీసుకొని రాత్రి భోజనాల కోసం రిసెప్షన్‌కు ఫోన్ చేశాము. రెస్టారెంట్ కింద ఉందని అక్కడకు వెళితే రేట్ తక్కువ పడుతుందని, రూంకు పంపిస్తే ఎక్కువ అవుతుందని చెప్పారు.

    పంపించమని నేను చెప్పే లోపే వద్దు కిందకు వెళదాము అన్నాడు తాతయ్య. రెండో రోజు ప్రయాణానికి హోటల్లోనే ఉన్న ట్రావెల్ ఏజెంటును అడిగితే టికెట్టుకు నూట యాభై ఎక్కువవుతుందన్నాడు. తాతయ్య అందుకు ఒప్పుకోక బస్సుస్టాండుకు తీసుకుపోయి రిజర్వేషన్ చేయించాడు. అంతకుముందు ఏమో కాని నాకు లక్ష విషయం తెలిసిన దగ్గర నుంచి ఆయన ఖర్చు చేసే ప్రతి రూపాయీ జాగ్రత్తగా ఆలోచించి చేస్తున్నట్లుగా అనిపించింది. అది నిజమో లేక నాకు అలా అనిపిస్తున్నదో అర్థం కాలేదు.

    రాత్రి నిద్ర పోయేముందు తన పర్సులో డబ్బు సర్దుకుంటున్నాడు తాతయ్య. "అంతా ఊడ్చేశావా? ఇంకా ఏమైనా మిగిల్చావా?'' తెలీని ఉక్రోషంతో అన్నాను.

    "ఏమి కావాలిరా నీకు, చెప్పు కొనిపెడతాను'' తల ఎత్తకుండానే అన్నాడు తాతయ్య.

    "మాకు తెలీకుండా లక్షలు లక్షలు ఎక్కడ దాచావు తాతయ్యా?'' నా గొంతులో నిష్ఠూరం నాకే తెలుస్తోంది. నాకు ఊహ తెలిశాకే తాతయ్య తన ఆస్తి మొత్తం నాన్న, బాబాయిలకు పంచేశాడు. నెలనెలా వచ్చే పెన్షన్ తప్ప నాకు తెలిసి ఆయనకు వేరే స్థిర చరాస్తులు లేవు.

    తల ఎత్తి తీక్షణంగా నా వైపు చూశాడు తాతయ్య. నాకు భయం వేసింది ఆయనకు కోపం వచ్చిందేమో అని. కొంతసేపు మౌనమే మా మధ్య భాషించింది. నేను టీవీ ఆన్ చేసి కూర్చున్నాను.

    "నాకు మాట ఇచ్చావు ఈ విషయం ఎవ్వరికీ చెప్పను అని. మరిచిపోయావా?'' కిటికీ తెరలు తొలగించి నా మంచం వద్దకొస్తూ అన్నాడు.

    "చెప్పనులే తాతయ్యా. కానీ లక్ష రూపాయలంటే ఎక్కువే కదా. ఇవ్వకపోతే మాత్రం నిన్ను ఎవరు అడిగేవారు? ఆ సొమ్ము మనకు ఉపయోగపడేది కదా'' మనసులో మాట బయటపెట్టాను.

    "నా అంతరాత్మ నన్ను గద్దించేదిరా ...'' గొంతులో జీర, కంటిలో కన్నీరు. భావావేశంతో రెండు చేతులతో నా మొహాన్ని తీసుకుని నుదిటిపై ముద్దు పెట్టాడు తాతయ్య.

    "నేను చేసిన పాపానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, ఆ పాప ఫలితాలేవీ నా కుటుంబం మీద పడకూడదని, మీరంతా సంతోషంగా ఉండాలని ఈ ఋణం తీర్చేశానురా'' ఆయన అంత ఎమోషనల్ అవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. ఎలా ఆయన్ను సముదాయించాలో నాకు అర్థం కాలేదు.

    "సర్లే తాతయ్యా నేను ఊరికినే అన్నా. నువ్వు చేసిన పనికి నేను చాలా గర్వపడుతున్నా. ఆ రమణ వాళ్ల పిల్లలు కూడా నిన్ను జీవితాంతం మర్చిపోరు'' ఆయన్ను స్థిమితపరచాలని నేను అనేకొద్దీ ఆయన ఇంకా ఉద్వేగానికి లోనవుతున్నాడు. 'లేదు లేదురా. వాళ్లు నన్నూ నా పాపాన్నీ అసలు గుర్తు చేసుకోకూడదు'' చేతులు గాల్లో ఊపుతూ లేచి నిలుచున్నాడు తాతయ్య. "నేనిప్పుడు చేసిన పని నువ్వు గర్వపడేంత గొప్పది కాదురా. నేను చేసింది పాప పరిహారం మాత్రమే'' మరింత ఆవేశపడిపోతున్నాడు తాతయ్య. నాకు భయం వేస్తోంది ఆయనకు బీపీ ఎక్కువ అవుతుందేమోనని.

    "ఓకే తాతయ్యా ... నువ్వు నీ అప్పు తీర్చేశావు. ఇక ఆ విషయం మర్చిపో. ప్రశాంతంగా నిద్రపో'' ఆయన్ని మంచం మీద కూర్చోపెడుతూ అన్నాను.

    "అది అప్పు కాదురా నేను చేసిన తప్పు. ఇప్పుడు నా మనస్సు శాంతించింది ఆ తప్పు దిద్దుకున్నందుకే ... అసలు విషయం తెలిస్తే బహుశా నువ్వు కూడా నన్ను క్షమించలేవు'' చెప్పుకుపోతున్నాడు తాతయ్య. నాకు వినాలని లేకున్నా వారించలేదు. "నేనూ రమణా బందర్లో కలిసి పనిచేసే రోజుల్లో గుడ్లవల్లేరు అనే ఊరులోని ఓ వ్యాపారి అతని స్వార్థం కోసం తన రైస్ మిల్లులో ఊక బస్తాలు తగుల బెట్టించేశాడు. మిల్లు తాలూకూ బీమా క్లయిం మా ఆఫీసుకు వచ్చింది. 

    ఇలాటి వ్యవహారాల్లో కొంత సొమ్ము తీసుకుని ఆ క్లయిం సెటిల్ చేయడం, ఆ సొమ్ము ఆఫీసులో అందరం పంచుకోవడం రివాజుగా ఉండేది. వ్యాపారి తన ఖాతాలో బీమా సొమ్ము జమ అయిన తరువాత కబురు పెట్టాడు. మేనేజర్ నన్నూ రమణను ఆ ఊరు పంపించాడు డబ్బు తేవడానికి. మేము ఆఫీసులో పని ముగించుకొని సాయంత్రం వ్యాపారి ఇంటికి వెళ్లి డబ్బు తీసుకొన్నాము. వ్యాపారి మాకు అతని ఇంట్లో మర్యాద చేసి మందు ఇప్పించి, పలావు పెట్టించాడు. మేము తిరిగి బందరు చేరేటప్పటికి చాలా పొద్దుపోయింది'' కళ్లమ్మట నీరు కారుతూనే ఉన్నాయి తాతయ్యకు.

    నా చేతులు తన చేతిలోకి తీసుకొని నా వైపు చూస్తూ చెపుతున్నాడు. "రమణ ఇల్లు బస్టాండుకు దూరం. నేను ఉండే ఇల్లు దగ్గర. అప్పటికే బాగా పొద్దుపోయింది. ఒంటరిగా సైకిల్‌పై వెళ్లాలి. అందుకే రమణ ఆలోచించి డబ్బులున్న బ్యాగు నాకిచ్చి రెండో రోజు ఆఫీసుకు తీసుకురమ్మని వెళ్లిపోయాడు. రెండో రోజు ఉదయం బ్యాగు తీసుకొని నేను ఆఫీసుకు వెళ్లాక రమణ మరణవార్త తెలిసింది. నా సొరుగులో బ్యాగు పెట్టి చివరిచూపుల కొరకు వెళ్లాను. అప్పటికి నాకు ఏ దురాలోచనా లేదు. కాసేపటికి మా మేనేజర్ వచ్చాడు. వ్యాపారి డబ్బు ఇచ్చాడా? రమణ దగ్గరే ఉంచావా? అని నన్ను అడిగాడు. ఆ క్షణం నన్ను స్వార్థం ఆవహించి నోటికి బదులు తలతో సమాధానం చెప్పించింది'' ఎక్కిళ్లు పెట్టి ఏడ్చాడు తాతయ్య. కొంచెం మంచినీళ్లు ఇచ్చాను. తాగాడు.

    "ఆ తర్వాత నేను ఎంత ప్రయత్నం చేసినా ఈ విషయం మీద నోరు తెరవలేకపోయాను. ఆఫీసు సొమ్ము కొంత రమణ వద్ద ఉండాలి వెదకమన్నాడు మేనేజర్. రాత్రి చీకటిలో ఏ లారీ వాడో గుద్దేసి పోయాడని, ఇంట్లో వారికి తెల్లవారేకే సమాచారం అందిందని, వాళ్లు వెళ్లేప్పటికే అతని చేతి వాచీ, ఉంగరాలు మాయం అయిపోయాయని, ఇక వేరే సొమ్ములు ఏమీ అతని వద్ద దొరకలేదని వాళ్లు చెప్పారు.

    ప్రాప్తం లేదని అందరూ వదిలేస్తారు అనుకుని నేను నోరెత్తలేదు. నా సొరుగులోని బ్యాగును ఎవ్వరికీ తెలీకుండా ఇంటికి చేర్చాను. కొన్ని రోజులు పోయాక ఆఫీసులో ఈ డబ్బు చర్చకు వచ్చింది. అప్పనంగా వచ్చే సొమ్ము వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. అప్పుడు నోరు విప్పితే అందరిముందూ దోషిగా నిలబడాల్సి వస్తుందని భయపడ్డాను.

    అందరు కలిసి రమణ భార్యకు ఇచ్చే సొమ్ములో వ్యాపారి పైకం మినహాయించి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రమణ ఆఫీసులో లోన్ తీసుకున్నాడని చెప్పి అతని భార్యకు వచ్చిన డబ్బులో ఆ మొత్తం తగ్గించి ఇచ్చాము. ఎప్పటిలాగే మేనేజర్ ఆఫీసులో అందరికీ సీటు ప్రకారం వాటాలు పంచాడు. వద్దంటే అనుమానం వస్తుందని నోరు మూసుకొని అందరితోబాటు ...'' ఇంక మాట పెగల్లేదు తాతయ్యకు.

    "ఆ సొమ్ము త్వరలోనే ఖర్చు అయిపోయింది. కానీ నా గుండెల్లో ఆరని మంట మిగిలిపోయింది. అది రోజురోజుకీ రాజుకుని నా మనసుని దహించడం మొదలుపెట్టింది. నేను నా పిల్లలకు రూపాయి ఖర్చు పెట్టినప్పుడల్లా రమణ పిల్లలు ఎలా బ్రతుకున్నారో, ఏ స్థితిలో ఉన్నారో అనే ప్రశ్నలు నా మనస్సును తొలిచేసేవి. వయసు పెరిగే కొద్దీ ఈ పాపభీతి నాలో ఎక్కువ కాసాగింది. నేను రిటైర్ అయ్యాక ఈ పాప విముక్తి కొరకు కొంత ప్రయత్నం చేశాను. కాని ఫలితం లేకపోయింది. మనఃశాంతి కరువయ్యింది. ఎవ్వరికీ చెప్పుకోలేక, ఆ పాప భారం మోయలేక, కట్టె కాలితేనన్నా నాకు విముక్తి లభిస్తుందని ఎదురుచూసేవాడిని. ఇంతలో ఆ యాడ్ నాలో ఆశ చిగురింపచేసింది'' కళ్ల నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు తాతయ్య.

    "నాతో పాతికేళ్లు సహజీవనం చేసిన నా భార్యకు కూడా తెలీని నిష్టుర సత్యం నీకు చెప్పాను. ఎందుకో తెలుసా? నేను రుణ విముక్తుడిని కావడానికి సహాయపడ్డావని'' నన్ను తృప్తిగా గుండెలకు హత్తుకున్నాడు తాతయ్య.

    మౌనంగా ఉండిపోయాను నేను. బాగా పొద్దుపోవడం చేత ఇద్దరమూ నిద్రకు ఉపక్రమించాము. తాతయ్య త్వరగానే గురక పెట్టాడు. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అనుకున్నా. కానీ ఆయన శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నాడని నాకు ఆ క్షణం తెలీదు.

(ఆదివారం ఆంధ్రజ్యోతి 4-12-2011 సంచికలో ప్రచురితం)

Comments