అగ్ని తుఫాను - జాతశ్రీ

    
"లేగవేటీ... ఏట కెళ్లవేటీ?" తాటి కమ్మల పూరింటిలో పడుకొన్న భర్త - ఊరగల్లును కదుపుతూ అంది నల్లమ్మ.     ఊరగల్లు కునుకేం తీయడం లేదు గాని, కన్ను తెరవలేకపోతున్నాడు. కదిపే నల్లమ్మ చేతిని నెట్టేస్తూ, "ఎళత గానీ... కూసింత కునుకేయనియరాదేటీ?...ఒళ్లంత సేపముల్లు దిగినట్టు ఒహటే సులుకూ, పోటూ..." అన్నాడు.     "ఉండదేటీ... పడ్డ కష్టవంత సరివిసెట్లల్ల గంగానమ్మ 'గుడంబా'కి తగలేత్తే గట్నే ఉండదేటీ?" బాధతో కాదు, వ్యంగ్యం కలగలిసిన నవ్వుతో అని, వాకిలి ఊడ్చేందుకు మూలనున్న చీపురందుకొంది నల్లమ్మ. బాధల్నే బతుకనుకునేంతగా -'ఓపికను' సొంతం చేసుకొన్న జీవితానుభవం - ఆమెది! తన కష్టాలను, కన్నీళ్లను కప్పెట్టుకోగల గుప్పిట మనిషి.     నల్లమ్మ బయటకెళ్లడం గమనించి, దిగ్గున లేచాడు ఊరగల్లు. ఓ నిముషం - పక్కనే బొంతలో ముడుచుకపడుకొన్న కొడుకు లిద్దరినీ మురిపెంగా చూసుకొన్నాడు. ఇద్దరు పిల్లలూ పక్క ఊరిలో గల ఎ.జి.యం. వారి ఆశ్రమ పాఠశాలలో చదువుకొంటున్నారు. సెలవులివ్వగా మూడు రోజుల క్రితమే ఇంటి కొచ్చారు. వారి కోసం తను చేసిందేదీ లేకున్నా వారికి తనపై గల ప్రేమకు ప్రతిగా అవసరమైతే నిర్మోహంగా కన్నీళ్లు కార్చగలడు. భార్యపై కూడా అతనికి అపరిమితమైన ప్రేమ. అయితే ఆ ప్రేమల్ని మింగేయగల 'బలహీనతకు' అతను బానిస!     "రే... తెల్లారిందేటీ?" అనుకుంటూ బయటికొచ్చి, తూర్పున కనిపించే సముద్రంకేసి తిరిగి, "తల్లా... గంగమ్మ తల్లా... నా ఇద్దరు బిచ్చాల్ని సల్లంగ సూడు తల్లా..." అంతూ రెండు చేతులెత్తి నమస్కరించాడు
    భూమ్యాకాశాలపై పరచుకొంటున్న కిరణాల తాకిడికి చీకటి చాటుమాటుల్లోకి జారుకొంటున్న వేళ!... సముద్ర అలల అనురాగానికి పులకిస్తూన్న గాలి తెమ్మెర ఆహ్లాదంగా కదలాడుతూ... అన్ని రాగాల్నీ తనలో లీనం చేసుకొన్న ఓ భీభత్స భావోద్రేకభరిత రాగంలా - ధ్వనిస్తూంది.     తీరాన్ని చుంబించేందుకు ఉవ్వెత్తున ఎగిసి, విరిగి పడుతున్న కెరటాలు - వదిలిన నురగను ముద్దాడుతూ తనలో విలీనం చేసుకొంటున్న యిసుక దిబ్బలు, ఆ దిబ్బలపై చిందరవందరగా పడి ఉన్న పోనంగి కర్రలు... ఎంతో కాలంగా అలల దెబ్బలకు అలసిపోయినట్టుగా ఉన్నాయి. కొంచెం దూరంలో సరివి చెట్ట్లకు ఈవల - గత సునామీకి సముద్రంలోంచి విసిరి వేయబడి ముక్కలు చెక్కలై పనికిరాకుండా పడివున్న చిన్న ఫైబర్‌బోట్లు, ఆవల - ఇంకారాని గుడంబా గంగమ్మ కోసం ఎదురుచూస్తున్న గుడంబా రాయుళ్ళు ఐదారుగురు... వారికి దూరంగా కుడివేపునున్న యిసుక దిబ్బలపై అప్పటికే జతయిన ఆట వయసుల కేరింతల కేళీ!     ఎంత కేరింతలయినా, ఆ లేతమొగ్గల చూపులన్నీ సముద్రం మీదే ఉంటాయి. వేటకెళ్లిన తమ తండ్రులూ, అన్నయ్యలు యింకా రానందుకు వారి మొహాల్లో తగు మోతాదులో నిర్వేదం కూడా తొంగి చూస్తుంది. వారికే కాదు - తీరంలో నిలుచొని ఎదురుచూస్తున్న అందరికీ అలానే ఉంటుంది. అయితే కర్రలతెప్ప తీరానికి రాగానే వారి మొహాల్లోని నిర్వేదం మటుమాయమై, తీయని ఊర్పుల సందడితో ఆ వాతావరణం పులకింతలకు లోనవుతుంది.     సముద్రంలో వేటే జీవితంగా, ఆ చావుబతుకుల కూటి కోసం - తీరాన్ని వదలి రెండొందల మైళ్ల దాకా సముద్రంలోకి వెళ్లి సాగే జీవితం కళాసీలది(సముద్రంలో చేపలను వేటాడే కార్మికులు)!     ఓ నాడో, ఓసారో కాదు, ఎప్పుడూ అంతే! వరుసగా నాలుగైదు రోజులు నీటి మీదే జీవితం! బోటే ప్రపంచం! ఆ ప్రపంచం పైనుండి రకరకాల వలలు విసురుతూ, వేటాడిన చేపను మంచుముక్కల్లో చూర్చి, తీరానికి చేరేదాకా ఏ కళాసి మనసునా నెమ్మది ఉండదు. మొహాన నవ్వూ అంతంత మాత్రమే! ఏ క్షణాన, ఏ రీతిన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు గనుక, అభద్రతా భావం అణువణువునా ఆక్రమించి ఉంటుంది. నిశ్చింతగల నిద్రా ఉండదు.     వారందరి జీవితాలను ప్రభావితం చేసేది, శాసించేది - సముద్రమే!     సముద్రంలో కళాసీలు ప్రాణాలను ఫణంగా పెట్టి, ఎంత కష్టపడినా వారి సష్టానికి ఏ ప్రాధాన్యతా ఉండదు. వేటకు బోటుతో పాటు కావలసిన వలలు మొదలు ప్రతిదీ - దినవెచ్చాలతో సహా బోట్ ఓనర్ సమకూరుస్తాడు కాబట్టి, తీరానికి సరుకు (చేపలు) వచ్చాక, అతని మాటే చెల్లుతుంది. పైగా సరుకులో సింహభాగం అతనికే దక్కుతుంది.     సరుకు తీరానికి చేరాక, ఓ రాశిగా పోసి, రకాలుగా విడగొట్టి, కంపినీ (చేపలను వేలంలో పాడి, కమీషన్ మీద దూరప్రాంతాలకు పంపే సంస్థలు) వాళ్ల సమక్షంలో బోట్ ఓనరే వేలం పాటను నిర్వహిస్తాడు. పాత ద్వారా సరుకు సొంతం చేసుకున్న కంపినీ వాళ్లు బరువును (లోతైన బేసిన్ నిండా ఉంచిన చేపను 'బరువు' అంటారు. తీరం నుండి కంపినీ కార్యాలయం దాకా ఆ బరువుని తీసికెళ్లితే, ఒక్కో బరువుకు రూ.5/- యిస్తారు.) మోసే స్త్రీల ద్వారా కంపినీ దగ్గరకు చేర్పిస్తారు. పగలంతా తీరంలో పడిగాపులు పడుతూ, సరుకు రాగానే బరువుల కోసం ఆరాటపడుతూ, నోరు పారేసుకుంటూ, తగువులాడుతూ... ఇంకా అనేక రీతుల అవమానుభవాల మధ్య సముద్ర తీరపు స్త్రీలు - అభ్యాగతులై జీవిస్తుంటారు.     అందుకే - సముద్రం బలితీసుకున్నవారి, తాగుబోతులైనవారి, ఏ ఆసరాలేనివారి - భార్యలో,బంధువులో తప్ప, ఇతరత్రా కాస్త ఆసరా ఉన్న స్త్రీలెవరూ ఆ బరువులు మోసే కూలిని యిష్టపడరు.     నల్లమ్మ బరువులు మోయక తప్పదు. భర్తకున్న బలహీనతను బట్టి, అతను కళాసిగా కష్టపడుతున్నా, బరువులు మోస్తే తప్ప, ఆమెకు భుక్తి గడవదు. బంగారం లాంటి యిద్దరు కొడుకులుండీ, భర్త ఉండీ, తనకే నచ్చని యీ బరువుల బతుకేమిటా అని తనలో తనే నవ్వుకుంటుందామె!     ఏడుస్తూనే నవ్వగల గుండె దిటువు మనిషి - నల్లమ్మ!
* * *
    వేటకు వేళయిందంటూ బోట్ ఓనర్ - హన్మంతు తొందర పడుతున్నా కళాసీలెవరూ ఉలుకూ, పలుకూ లేకుండా, నాలుగయిదు రోజుల దాకా కనిపించని తమ వాళ్ళకు చేయాల్సిన పనులో, జాగ్రత్తలో చెపుతూ కొందరు, వేటకు అవసరమైన వాటిని కర్రల తెప్పపై చేరుస్తూ కొందరు, సొంతానికి అవసరమైన వాటికోసం కొందరు... నిర్వేదంతో కూడిన హడావుడిలో ఆ వాతారణం గంభీరంగా ఉంది.      హన్మంతు వారి నిర్వేదాన్ని ఏ కోణంలోను పరిగణనలోకి తీసుకోడు. అతని మనసెప్పుడూ బెంగుళూరు, హైదరాబాద్ చేపల మార్కెట్‌లపై ఉంటుంది.కళాసీలను తొందర చేస్తూనే, అతను మూడురోజుల క్రితం బెంగుళూరుకు పంపిన సరుకు గురించి సెల్‌లో ఆరా తీస్తున్నాడు.     దూరాన్నుంచి ఊరగల్లు ఊరికి రావడం గమనించి, సెల్ మాటలాపి, దాపుగా వచ్చిన అతనితో, "ఏ... దొరా, తెల్లారిందేటీ?" అన్నాడు వ్యంగ్యంగా.     "ఆలిశెవయింది సేటూ..." పేద మొహంతో చూస్తూ, తలగోక్కొంటూ దీనంగా అని, మరో మాటకు అవకాశం యివ్వకుండా మంచుముక్కల్ని దర్మకోల పెట్టెల్లో సర్దుతున్న వాళ్లతో చేరిపోయాడు.     డీజిల్ డబాను కర్రల తెప్ప పైకి అందుకొని, "సప్పనీళ్ల క్యానేది, తేలేదేటీ" అన్నాడు బోటు సరంగు.     "ఉంది గాదేటీ?" అంటూ మంచినీళ్ల క్యాన్‌ని సరంగు కందించాడో కళాసి. చుక్కాని దగ్గర కూచొని, మనసులోనే గంగమ్మ తల్లిని తల్చుకొని, తెప్పను నెట్టమని కేకేశాడు సరంగు.     "జై... గంగమ్మ తల్లా... జై జై... తల్లా..." అంటూ కళాసీలు తెప్పను ఒక్క బిగువున సముద్రంలోకి నెట్టి, ఎగిరి దానిపైకి చేరారందరూ.     సముద్రపు పోటు మరీ ఎక్కువగా ఉంది. తెప్ప పల్టీ కొడుతుందనిపించేంత ఎత్తులో కెరటాలు కదులుతున్నాయి. కెరటాల తాకిడికి తెప్ప వెనక్కి తప్ప, ముందుకు కదిలేలా లేదు. అయినా సరంగు బెదరక, తెప్ప తన ఆధీనంలో ఉండేలా చుక్కానిని గట్టిగా పట్టుకున్నాడు. కళాసీలకు అనుభవమే - సముద్రంలో జారిపడకుండా ఒకర్నొకరు పట్టుక నిలుచున్నారు. తీరం నుంచి ఓ యాభై గజాలు సాగేదాకా అలల ఉధృతి అధికంగా ఉంటుంది. తెప్ప సాఫీగా ముందుకు సాగదు. ఆపై సముద్ర పయనమంత హాయి మరొకటుండదు. అలల ఉధృతి తగ్గాక, తెరచాప ఎత్తమని కళాసీలను పురమాయించి - దూరాన లంగరేసి ఉన్న పెద్ద బోట్ కేసి, చుక్కానిని మళ్లించి, బీడీ ముట్టించాడు సరంగు.     పెద్దబోట్‌పై చేరాక, కళాసీలు రకరకాల పనులు చేపడతారు. వలల బాగుచేస్తూ కొందరు, వంటావార్పులు చూస్తూ కొందరు, చేప దొరికే ప్రాంతానికి వెళ్ళేదాకా... అనగా - నూటాయాభై, రెండొందల మైళ్లు లోనికి వెళ్లనిదే చేప దొరకదు. కొన్నిసార్లు హద్దులు తెలీక పొరుగు దేశపు సముద్ర జలాల్లోకి వెళ్లడం కూడా జరుగుతుంది.     చీకటి రోజుల్లో చేప సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి అమావాస్య రోజుల్లోనే కళాసీలు సముద్రపు వేటకు ప్రాధాన్యత యిస్తారు. బోట్ ఓనర్లు కూడా తమ దగ్గర పనిజేసే కళాసీలు ఆ దినాల్లో వేటకు 'నాగా' పెట్టకుండా, మరో ఓనర్ దగ్గరకు పోకుండా ఉండేందుకు ముందు ముందుగా పెట్టుబడి పెట్టి, దాన్ని సరుకు రూపేణా రాబట్టుకోవడం రివాజు!     ఆ విధంగా హన్మంతు దగ్గర అధిక మొత్తంలో డబ్బు తీసుకున్న వాళ్లలో ముందుగా చెప్పుకోవలసిన కళాసీ - ఊరగల్లు!     సాధారణంగా వేటకు వెళ్ళే కళాసీలు 'గుడంబా' తాగకుండా ఉండలేరు. చుట్టూ కనుచూపు మేర కనిపించే నీటికి గుండె చెదరకుండా ఉండేందుకు ఓ మోతాదులో గుడంబా పుచ్చుకుంటారు. అది బలహీనతగా కాకుండా బలంగా భావిస్తారు. అయితే తనువునే మరిచేంత మత్తుకు లోనయ్యేలా తాగే ఊరగల్లును చూస్తూ కొందరు నవ్వుకుంటారు గాని, ఎక్కువ మంది కళాసీలకు అతనంటే జాలి!     అతని బలహీనతేదైనా వాస్తవానికి ఊరగల్లుది ఉప్పుగల్లు లాటి మనస్తత్వం. తన మాడుపగులుతున్నా తియ్యని నీళ్లిచ్చే కొబ్బరికాయలాంటి గుండె కలవాడు. ఆ పూరిళ్ల గూడెంలో ఎవరికి ఆపద కలిగినా, అవసరం పడినా... ఊరగల్లు తర్వాతనే ఎవరైనా!     అయితే అదంతా గత చరిత్ర! అతని తండ్రి బతికున్నప్పటి తీయని రోజులు!!     గత సునామీకి - ఓ సంవత్సరం ముందు - అతని తండ్రి ఉప్పలయ్య కాలం చేసే నాటికి ఊరగల్లు 'కళాసీ'గా కాక కులాసాగా బతికినవాడు. వేటకు వెళ్లిన తండ్రి సముద్రంలోనే సమాధి కావడం - అతని గుండెల్ని పిండేసిన సంఘటన. బోట్ మీద వంట చేస్తున్న ఉప్పలయ్య అదే బోటు కింద సేద దీరుతున్న 'పెద్ద సొరచేపను' పసిగట్టలేదు. వెలుగును చూస్తే సొరచేపకు వెర్రి ఆవేశం వస్తుంది. స్టౌ వెలుగూ, వేడికి సొరచేప కోపంతో తన తోకను బలంగా ఝాడించే సరికి, అంత పెద్ద బోట్ రెండు పల్టీలు కొట్టింది. బోట్‌లో ఉన్న కళాసీలు సముద్రంలో పడి చెల్లాచెదురయ్యారు. దాపులో నున్న మరో బోట్ వాళ్లు చాలా మందిని రక్షించగలిగారు. కాని, తన తండ్రిని, బోటు సరంగునీ సముద్రం బలి తీసుకొంది. కనీసం శవాలైనా దొరకలేదు.     ఆనాటి వరకూ జీవితాన్ని కులాసాగా అనుభవించిన ఊర్గల్లు తండ్రి స్థానాన్ని ఆక్రమించి, కుటుంబ భారాన్ని తలకెత్తుకునేందుకు 'కళాసీ'గా రూపెత్తక తప్పలేదు. అయితే ఆ సంవత్సరమైనా గడవక ముందే - కనీసం తన తండ్రీ సంవస్తరీకమైనా జరపక ముందే వచ్చిన 'సునామీ'కి తన గుడిసెతోపాటు తన తల్లినీ, చెల్లినీ, తమ్ముడ్నీ - గంగమ్మ తల్లి తనలో కలుపుకుంది.     తీరాన్ని గాలించి, ట్రక్కుల్లో తెచ్చిన వేలాది శవాల్ని ప్రొక్లెయినర్‌తో తీసిన పెద్ద గోతిలో సామూహిక సమాధి చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ అతను చాలా రోజులు కుమిలి కుమిలి ఏడ్చాడు.     ఆ సమయంలో ఆ తలపుల నుండి విముక్తి పేరుతో అతని స్నేహితులు కొందరు అతన్ని మత్తుపానీయాలకేసి నడిపించారు. ఆ మత్తులో ఏ మజా దొరికిందో గానీ, అసలు తాగడమే తెలీని ఊరగల్లు - తాగి, వీధుల్లో వీరాంగాలు వేసేంతగా, తన వొంటినే మర్చిపోయేంతగా తాగుడుకు అలవాటు పడ్డాడు.     ఊరగల్లు పరిస్థితిని గమనించిన గ్రామ పెద్దలు - ఊరగల్లును ఓ యింటివాన్ని చేస్తేనైనా మామూలు మనిషవుతాడనే నమ్మకంతో నల్లమ్మను కట్టబెట్టడం జరిగింది.     నల్లమ్మ కూడా ఓ సునామీ బాధితే! తన వాళందర్నీ పోగొట్టుకొని, అరబిందో సంస్థ వారు నిర్వహించిన సహాయ శిబిరంలో శరణార్థిగా ఉన్న ఆమె తన ఇష్టపూర్తిగా ఊరగల్లును పెళ్లాడింది.     నల్లమ్మ తన నవ్వు మొహంతో, మంచితనంతో ఊరగల్లును పూర్తిగా లోబరచుకోగలగింది. తనూ, తన కుటుంబం తప్ప, యితర వ్యాపకాలన్నీ తాగుడుతో సహా అన్నీ వదిలేలా... ఊరగల్లులో ఎవరూ ఊహించని మార్పును తేగలిగింది.     కొన్ని సంవత్సరాలు గడిచాయి!     ఊరగల్లు ఇద్దరు బిడ్డల తండ్రిగా నిలబడ్డాడు.     నల్లమ్మ పూరిళ్ల గూడేనికి - ఆడబడుచుగా అందరి అభిమానాన్ని పొందగలిగింది. రోజులు ఆనందంగా గడుస్తున్నాయి.     అదే సమయంలో పిల్లలిద్దరూ వాంతులు, విరేచనాల బారిన పడడంతో... గంగమ్మ తల్లి ఆగ్రహించిందనీ, ఆమెకు శాంతి చేస్తే కీడుతొలుగుతుందనీ ఒకరిద్దరు అనడంతో, ఊరి పూజారి సలహా సంప్రదింపులతో మూడు దినాలు వరసగా మూడుపూటలా ... పదిన్నొక్క కొబ్బరికాయల చొప్పున ఆ తల్లికి కొట్టి, ఆ కొబ్బరి నీళ్లు మంత్రించి, పిల్లలిద్దరికీ తాపించడం, చివరి దినాన పూజారితో పాటు మరో ఇద్దరు పెద్దలకి తాపించి, తినిపించడం - వారితో పాటు ఊరగల్లూ తాగి, తిని ఊగిపోయాడు.     పిల్లల వాంతులూ, విరోచనాలయితే తగ్గిపోయాయి గాని, ఆ రోజు నుంచి, మళ్లీ తాగడం మొదలేసి, తనమీద తనకు అదుపులేదని, మరోసారి ఋజువు చేసుకున్నాడు ఊరగల్లు.     అతనిప్పుడు వేళాపాళా వదిలేసి, మంచీచెడు విడిచేసి, తాగుడే జీవితాశయంగా, తాగడానికే బతుకుతున్నట్టుగా మారిపోయాడు. నల్లమ్మ పూరిళ్ల గూడేనికి - ఆడబడుచుగా అందరి అభిమానాన్ని పొందగలిగింది. రోజులు ఆనందంగా గడుస్తున్నాయి.     అదే సమయంలో పిల్లలిద్దరూ వాంతులు, విరేచనాల బారిన పడడంతో... గంగమ్మ తల్లి ఆగ్రహించిందనీ, ఆమెకు శాంతి చేస్తే కీడుతొలుగుతుందనీ ఒకరిద్దరు అనడంతో, ఊరి పూజారి సలహా సంప్రదింపులతో మూడు దినాలు వరసగా మూడుపూటలా ... పదిన్నొక్క కొబ్బరికాయల చొప్పున ఆ తల్లికి కొట్టి, ఆ కొబ్బరి నీళ్లు మంత్రించి, పిల్లలిద్దరికీ తాపించడం, చివరి దినాన పూజారితో పాటు మరో ఇద్దరు పెద్దలకి తాపించి, తినిపించడం - వారితో పాటు ఊరగల్లూ తాగి, తిని ఊగిపోయాడు.     పిల్లల వాంతులూ, విరోచనాలయితే తగ్గిపోయాయి గాని, ఆ రోజు నుంచి, మళ్లీ తాగడం మొదలేసి, తనమీద తనకు అదుపులేదని, మరోసారి ఋజువు చేసుకున్నాడు ఊరగల్లు.     అతనిప్పుడు వేళాపాళా వదిలేసి, మంచీచెడు విడిచేసి, తాగుడే జీవితాశయంగా, తాగడానికే బతుకుతున్నట్టుగా మారిపోయాడు.     ఎంత తాగినా, అతను ఊరివాళ్లతోనో గొడవపతాడే తప్ప, నల్లమ్మనేమీ అనడు. కనీసం ఆమె కంటికైనా కనిపించడు. ఆమెను చూస్తూనే అతనిలో ఓ విధమైన న్యూనతతో కూడిన భయం, బాధ, పొడసూపుతుంది. తాను తప్పు చేశాననే భావనతో దూరంగా వెళ్లి, గుండెలవిసేలా, గొంతు పూడుకు పోయేలా ఏడుస్తాడు. మళ్లీ కాసేపటికే - ఆ పశ్చాత్తాపాన్ని అక్కడే వదిలేసి, గంగానమ్మ గుడంబా దుకాణంకేసి నడుస్తాడు. అలా నడవకపోతే అతని నరాలు కొంకర్లు పోతాయి. తల పోటుతో తల్లడిల్లుతుంది.     ఊరగల్లు - తన బలహీనతను గుర్తించినా, దానిని జయించలేని బలహీనుడని నల్లమ్మకు తెలుసు. తాగొద్దని తనో మాట చెపితే అతను తాగడు కూడా. అయినా నల్లమ్మ నోరు విప్పదు. ఆ మాట చెప్పదు. తన మాటకూ - అతని బలహీనతకూ మధ్యన నలిగి ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని ఆమె భయం! అందర్నీ పోగొట్టుకొని బతికే తను, భర్తను కూడా పోగొట్టుకుంటాననే భావనతో, భర్త నేమీ అనలేక, లోలోనే కుమిలిపోతూ...     ఊరగల్లు ఎంత తాగుబోతయినా అతని గతం తెలిసిన వాళ్లు సానుభూతిగానే చూస్తారు. నల్లమ్మ మంచితనం రుచిచూసిన ఊరంతా ఆమెను ఆత్మీయంగానే పలకరిస్తారు. బరువుల దగ్గర ఎవరెలా, ఎన్ని పేచీలు పెట్టినా, నల్లమ్మను మాత్రం ఎవరూ కాదనరు! ఆమె బతుకుకు బరువులే ఆసరా... అని అందరికీ తెలుసు!     నల్లమ్మ - తాను కోరుకున్న బతుకది కాకపోయినా, తాను అనుభవించే బతుకున ఎదురౌతున్న చీకటినీ, చికాకుల్నీ... బతుకనుకుంటూ - రాజీపడి బతుకుతుంది.
* * *

    నాలుగు రోజులు 'ఆకులేని అడవి'లాటి సముద్రంలో వేటాడి, పెద్ద బోట్ నుంచి కళాసీలు సరుకుతో సహా కర్రతెప్పలపై తీరాన్ని చేరేసరికి, బోట్ ఓనర్ - హన్మంతుతో పాటు బరువులు మోసే స్త్రీలూ, కళాసీల పిల్లలూ, తల్లులూ తీరాన నిలబడి తృప్తిగా చూస్తుండిపోయారు. వారితోపాటు నల్లమ్మ చంకలో బేసిన్ ఉంచుకొని, నిలుచుంది. ఆమె కొంగు పట్టుక నిల్చున్న పిల్లలిద్దరూ అలల్ని గమనిస్తున్నారు.     "ముందగాల... సరుకు,సరుకు..." తెప్పపై నుండి ఒడ్డుకు దూకే కళాసీలను చూస్తూ అన్నాడు హన్మంతు. అతని చూపు కళాసీల మీద ఉండదు. వారి యోగక్షేమాల మీద ఉండదు. పెట్టెల్లో మంచు ముక్కల మధ్య కూర్చిన చేపల మీద ఉంటుంది. వలల్లో మూటలు గట్టిన పెద్ద పెద్ద చేపలపై ఉంటుంది.     "సరుకు దించరేటీ?" అరచినట్టుగా అన్నాడు హన్మంతు.     నడుముల మీద మోచేతుల బిగులో బేసిన్లు ఉంచుకొని, ఒక్క బరువైనా దొరకాలని, గంగమ్మ తల్లిని తల్చుకొంటూ నిలుచున్న స్త్రీలతో పాటు కంపినీల వాళ్లు - కళాసీలు రాసిపోసిన సరుకు చుట్టూ చేరారు.     చుట్టూ ఎందరున్నా... బోట్ ఓనర్ చెప్పిన వాళ్లే సరుకు మీద చేయి వేయాలి. రాశి నుంచి ఒక్కోరకాన్ని విడగొట్టాక, బోట్ ఓనర్ వేలంపాట నిర్వహిస్తాడు. ఆ విడగొట్టేపని, నల్లమ్మతో సహా మరో ఐదుగురికప్పజెప్పాడు.     పూరిళ్లగూడెంలో పదిపైగానే చేపల కంపినీలున్నాయి. వారంతా చేపల్ని వేలంలో పాడి, మంచు పెట్టెల్లో చేపల్ని ఉంచి, పెద్ద నగరాలకు ట్రక్కులపై, లారీలపై ఎగుమతి చేస్తుంటారు. క్ళాసీలకంటే, ఓనర్లకంటే కంపినీల వాళ్లే ఎక్కువ లాభపడతారని అనుకొంటారు గాని, నిజానిజాలు బయటకు రానీయరు.     ముందుగా తెట్టు, కాకరగ, పొరవ, కిలుం, కణకర్త మొదలగు చిన్న చేపల రాసుల పాట నిర్వహించాక వాటిని బేసిన్లకెత్తించి, పెద్ద చేపల కేసి నడిచాడు హన్మంతు.      ఐదారడుగుల పొడవుతో నాలుగైదు కిలోల బరువు మొదలు, పాతిక కిలోల బరువున్న వంజరం, సందవ, పారలు, గోరకలు, టేకి... వగైరా రకరకాల చేపలు!      ఒక్కో చేపను విడివిడిగా, దూరంగా యిసుకపై ఉంచి, పాటందుకొన్నాడు హన్మంతు. వేలల్లోకి దూకింది పాట!      ఒక్కో కళాసీకి, సరంగుతో సహా అందరికీ - నాలుగు రోజుల ఖర్చులు పోను, ఆరొందలపైగా రాబడి వచ్చినట్లు హన్మంతు లెక్కేసి చెప్పాడు. కళాసీల మొహాలు వికసించాయి!     ఒక్క ఊరగల్లు మొహంలోనే ఏ విధమైన కళ లేదు. సంతోషానికీ, బాధకూ అతీతంగా అటు హన్మంతునూ, ఇటు తన యిద్దరు పిల్లల్నీ మార్చిమార్చి చూడసాగాడు. నల్లమ్మనూ చూస్తున్నాడుగాని, ఆమె తన పనిలో తానుండిపోయింది. అతని కళ్లల్లో చిన్న సముద్రాలు కదులుతున్నట్టుగా ఉంది.      బరువులు మోసే స్త్రీలను గమనిస్తూ, పక్కనున్న కంపినీ వాళ్లతొ అ గత రాత్రి నుంచి జరుగుతున్న లారీల సమ్మె గురించి వివరాలను విచారిస్తున్నాడు - హన్మంతు.      దాపున నిలుచున్న తన పిల్లలిద్దరూ బేల చూపులతో తనకేసి చూస్తుంటే ఊరగల్లుకు కడుపులో తెమిలినట్లయింది. "న్నీ..యవ్వ, సావు బతుకుల మజ్జెన నాల్దినాలు ఏటాడి వస్తి, నా పిల్లగాల్లకీ సందువ సేపనన్న కాల్సి పెడత..." అంటూ వంగి, ఓ సందువను అందుకొన్నాడు ఊరగల్లు!     అంతే!...     ఊరగల్లు చెంప 'ఛెళ్'మంది!     దిమ్మదిరిగి పోయేంత దెబ్బ!!     "నీ యిస్టమేనేటీ... నన్నడగొద్దేటీ?" అంటూ హన్మంతు ఊరగల్లును కాల్చేసేలా చూస్తూ అన్నాడు.     ఊరగల్లు నోట మాట రావడం లేదు. తెల్లబోయి, దేబిరిమొహంతో చూస్తూండిపోయాడు.     చుట్టూ ఉన్న జనం దిగ్భ్రమకు లోనయ్యారు. హన్మంతలా చేయడం నచ్చని కొందరు లోలో గొణుక్కోసాగారు.     ఊరగల్లు జనాలకేసి కన్నెత్తలేక పోయాడు. చేతిలోని సందువను కింద పడేసి, మండుతున్న చెంపను రుద్దుకుంటూ కూలబడిపోయాడు. పిల్లలిద్దరూ ఏడుపు కళ్లతో తండ్రిని చూస్తూ తల్లి దగ్గరగా చేరారు. వారి మొహాల్లో భయం... చూసేవారినీ బాధకు గురిచేసింది.     జరిగిన సంఘటనకు నల్లమ్మ మ్రాన్పడిపోయింది. తేరుకోలేక పోతూంది. పిల్లలిద్దరూ దాపుకొచ్చి, ఏడ్పందుకునే సరికి ఆమె ఉలిక్కిపడింది. తన గుండెల మీద 'ఛెళ్'మన్నట్టుగా ఉందామె పరిస్థితి. హన్మంతుకేసి, కోపంగా - కాదు, కాదు... అసహ్యంగా చూసి, గుండెల్లో పొంగుకొస్తున్న ఆవేశంతో... తలొంచుక, మోకాళ్లపై కూచొన్న ఊరగల్లు జుట్టు పిడికిట బట్టి, "సూడ్రాదేటీ... బిక్క మొహాలతో ఏడుస్తున్న బిడ్డల్ని సూసి, ఏం సెపుతవో సెప్పు!" అంటూ ఊపృసింది.     అయినా ఊరగల్లు తలెత్తలేదు. పిల్లలకేసీ చూడలేదు.     ఊరగల్లు ఎన్ని రీతుల కుటుంబాన్ని చిందర వందర చేసినా, నల్లమ్మ ఏనాడూ అతన్నో మాటయినా అన్నది కాదు. ప్రేమాభిమానాలతో అతన్ని మంచి తండ్రిగా, భర్తగా నిలపాలనుకొంది. తన ఆశలు తలక్రిందులై పట్టుదల పరిహాసాలపాలైపోగా, తట్టుకోలేక ఆమె - ప్రేమాభిమానాలకూ... ఆవేశమొస్తుందని, అనుభవాలకూ... ఆగ్రహమొస్తుందని అతనికి తొలిసారి తెలిసేలా - అతని గుండెలని కుదిపే స్వరంతో "నీకేగాని, సీవూ,నెత్తురుందనుకుంటే ఆ గంగమ్మ తల్లికి దండంపెట్టి సత్తెపెమానంగా యిగ గుడంబా జోలికెళ్లనని నీ బిడ్డల మీద ఒట్టేసి సెప్పరాదేటీ?... నీ కస్టాన్ని నీగ్గాకుండా, నీ బతుకుని బుగ్గిపాలు సేసేది - ఆ గంగానమ్మ గుడంబా కాదేటీ?... నీకే గన్క సిగ్గూ,సెరవూ ఉంటే యిగ ఆ వంకల్ల ఎల్లబాక... ఎల్తివా... నా సెవాన్ని సూత్తవు. మయ్య, మమ్మ కల్సినట్టు నేనూ గంగల కలుత్త, నా బిడ్డల్నీ కలిపేత్త". అపరిమిత ఆవేశంతో అంది నల్లమ్మ.     నల్లమ్మ అన్న చివరి మాటలకు ఊరగల్లు ఉలిక్కి పడ్డాడు. దీనంగా, ఆమెకేసి చూశాడు. ఆమె కళ్లలో కళ్లు పెట్టి ఏదో చెప్పుకోవాలని చూశాడు.     ఆమె కళ్లు - కళ్లలా లేవు... నిప్పు కణికల్లా ఉన్నాయి.     కన్నీరు బదులు - రక్త సముద్రాలేవో పోటెత్తుతున్నట్టుగా ఉంది.     ఊరగల్లు అంతరాంతరాల్లో ఓ విధమైన వణుకు, ఆత్మన్యూనతాభావం.     నల్లమ్మ నిప్పుల చూపు... అతని బలహీనతను కాల్చేసేలా ఉంది.     ఊరగల్లు తలదించుకున్నాడు! అతనికీ, అతని బలహీనతలకూ మధ్య - పోరాటం మొదలైంది.
Comments