ఆహిరి -రావూరి భరద్వాజ

    
ఆపూట లలిత మనస్సు మనస్సులో లేదు. ఆలోచనలతో అలసిపోయింది. తర్క వితర్కాలతో, ఆమె మెదడంతా తుకతుకలాడిపోయింది! ఈ సంగతి భర్తతో చెప్పడమా, మానడమా, అని చాలాసేపు మధనపడింది! అయినా ఓ దారికి రాలేకపోయిందామె.

    దాదాపు అయిదారు నెల్లనుండి ఆ యింట్లో ఉంటున్నారు. బంధుత్వం లేదన్న మాటేగాని, శారదా తనూ ఓ తల్లి బిడ్డల్లాగే మసిలారు. చాలా ఉమ్మడి కొంపల్లో వచ్చే చిన్న చిన్న తగాదాల్లాంటివి గూడా తామెరుగరు. తామిద్దరూ పోట్లాడుకోవాలనీ, అలా పోట్లాడుకుంటున్నప్పుడు చూడాలని చాలామందికి ఉన్నదని తనకూ తెలుసు, శారదకూ తెలుసు! అయితే మట్టుకు - ఇంకొకరి సరదాకోసం, గిల్లి కజ్జా పెట్టుకోవడానికి, ఇవతలి వారు, అమాయికులూ, చిన్నపిల్లలూ కాదు.
    నిజానికి శారద ఎంత మంచిది! అస్తమానూ, 'వదినా! వదినా!' అంటూ వెంపర్లాడుతుంటుంది. ఆ కాస్త పనీ అయిపోగానే, తమ భాగంలోకే వచ్చేస్తుంది! పట్టుదలకోసమన్నా -ఓ సారు వారి భాగంలోకి ముందుగా వెడదామని, తను, అనేక సార్లు అనుకొన్నది! అదేం గ్రహచారమో గానీ, అది నెరవేరనే లేదు. ఎంత తొందరగా తెములుదామన్నా, ఈ పని తీరి చావదు. శారద తెములుకొని, బైట పడుతుంది మరి!

    ఏమాట కామాటే చెప్పుకోవాలి! శారద తనకంటే అందమైందే! ఆడవారు, ఆడవారి అందాన్ని ఒప్పుకోరంటారు గానీ, అది నిజం కాదు. శారద అందగత్తే అని, తను చూసిన మొదట్లోనే అనుకొన్నది! ఆలోచిస్తుంటే, ఆనాటి సంగతులన్నీ తనకిప్పుడు జ్ఞాపక మొస్తున్నాయి. మొట్టమొదటిసారి శారద, రాంమూర్తి ఇల్లు చూసుకొందుకు వచ్చినప్పుడు, ఆవిణ్ని చూస్తూనే, వారికి ఇల్లు కుదరనివ్వగూడదనుకొంది తను. ఇలాంటి సొగసులాడి, ప్రక్క భాగంలో ఉంటే...హయ్యో రాత... ఈయనగారింకా చేతికి చిక్కుతాడా అనుకుంది! అసలే అంతంత మాత్రంగా ఉన్న ఈ సంసారం, మరింత కుమ్ముదుమ్మవుతుందేమో భగవంతుడా అని భయపడింది!

    కానీ, తననుకొన్న వేమీ జరగలేదు; ఒకరకంగా చెప్పాలంటే, తన ప్రయత్నాలు కొనసాగకపోవడమే మంచిదనిపించింది. నిజంగా కొనసాగి ఉన్నట్లయితే - ఈ శారదకు బదులు, ఇంకెవరు ఈ భాగంలోకి వచ్చేవారో! వాళ్ళెటువంటి వాళ్ళో ఎవ్వరూ చెప్పలేరుగదా!
    శారద చాలా ఉత్తమురాలని తెలుసుకోవడానికి, తనకెక్కువ రోజులు పట్టలేదు. ఇంట్లో చేరిన గంటకల్లా 'ఏమండీ అక్కగారూ!' అంటూ శారద కేకేసింది. అప్పుడీ మనిషి ఇంట్లోనే ఉన్నాడు. దొడ్లో ఏదో పనున్నవాడిలాగా వెళ్ళి, శారదను చూసొచ్చి 'చాలా అందమైన చెల్లెల్ని సంపాయించావోయ్!' అన్నాడు సిగ్గు లేకుండా! అయినా మొగవాళ్ళకింత సిగ్గూ శరమూ ఉండదేం? అదో ఘనకార్యం అనుకుంటారో ఏమో మరి - పెళ్ళాం అక్కడున్నదే, ఆవిడేమయినా అనుకుంటుందేమో ననిగూడా ఆలోచించకుండా, నోటికి ఎంత మాటొస్తే అంత మాటా అనేస్తారు! అలాగే ఇవతల వారుగూడా ఉంటే, వారికెలా ఉంటుందీ? ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎట్లా?  

    శారద అటువంటి మనిషని కాదు గానీ, ఎందుకైనా మంచిదని, తనే 'వదిన' వరసకి మార్చింది. ఆ, తెగించిన వారికీ వరసా వాయీ అడ్డా ఏమిటి? ఆ శాస్తుర్లుగారి కూతుర్ను, 'అక్కాయ్, అక్కాయ్' అంటూనే, వారాల కుర్రాడు లేపుకెళ్ళలేదూ? అప్పుడేవరసలు అడ్డొచ్చాయి గనక? కాదుగానీ, మన జాగర్తలో మనముండటం మంచిదే! ఆపైన, అన్నిటికీ, ఆ నారాయణమూర్తే ఉన్నాడు.
    తనింత పకడ్బందీగానూ ఉన్నది. రాంమూర్తిని 'అన్నగారూ!'అని నిండుగా, నోరారా పిలిచేది. ఆయనగూడా 'ఏమిటమ్మాయ్?' అని ఆప్యాయంగా పలికేవాడు. అటువంటి వాడికే, ఈ వెధవాలోచన ఉన్నదంటే తనేమనుకోవాలి?     ఈ మొగాళ్ళకున్న అహంకారానికి - పెళ్ళాలే గనక లేకపోతే, లోకం భగ్గున మండి పోదూ? శారద ఊళ్ళో ఉన్నంత కాలమూ, కుక్కిన పేనులాగా పడున్నాడు రాంమూర్తి. కన్నెత్తి తనకేసి చూడనన్నా చూసేవాడు కాదు. తను నాలుగైదు సార్లు ఈ మాటే శారదతోగూడా అన్నది. 'ఆయనంతే వదినా! ఆడాళ్ళంటే పరమ సిగ్గు' అన్నది శారద. ఇదంతా నాటకమనే సంగతి, తనకిప్పుడుగానీ అర్థం కాలేదు. ఈ మొగాళ్లు, ఎంచక్కా నటిస్తారనీ!

    శారదకు గూడా తన మొగుడి బుద్ధి బాగా తెలుసు లాగుంది; లేకపోతే 'హోటల్లో భోంచేస్తార్లే వదినా! నీ కెందుకొచ్చిన శ్రమ!' అంటుందా? పిచ్చిముండ! తనే తెలుసుకోలేక పోయింది. ఆవిడ వద్దన్నకొందికీ, తనే బలవంతం చేసింది. 'మా అన్నగారికి మేం తక్కువ పెట్టుకోం లేవోయ్' అంది. 'ఇవన్నీ అనకపోతే, మా యింట్లో తినడం ఇష్టంలేదనరాదూ? తీరిపోతుందిగా!' అని తను యాష్టపడ్డది! 'ఇరుగూ పొరుగూ అన్న తరవాత, ఇబ్బందుల్లో సబ్బందుల్లో ఆదుకోకపోతే ఎందుకూ?' అన్నది. ఇన్నన్న తరువాత గానీ 'నీ ఇష్టం!' అనలేదు శారద. అంటే ఏమిటన్నమాటా? తన మొగుడు బుద్ధిని తనే నమ్మలేదన్న మాట! ఆవిణ్ననడం కాదు గానీ, ఈ మనిషిని, తనీనాటికి నమ్మగలదా?

    దోవనపొయ్యే తద్దినాన్ని కొని తెచ్చుకున్నట్లయింది. అప్పుడన్ని విధాలుగా శారదను బలవంత పెట్టకుండా ఉండాలిసింది. మొఖమోటానికి ఏదో ఒకసారీ అరసారీ అని మెదలకుండా ఊరుకోవలసింది! పోనీలే - పొరుగున ఉంటున్నారు గదా, అవసరాలనేవి అందరికీ వుంటాయిగదా, ఓ పది రోజులపాటు ఉడకేసి పెడితే, పోయిందేమిట్లెస్తూ అనుకొన్నది గాని, ఈ ముర్తి గాడిలా తయారవుతాడని తను ఊహించలేకపోయింది!
    అయినప్పటికి తను 'అన్నగారూ! అన్నగారూ!' అంటూనే ఉంది. ఆ వెధవగూడా 'అమ్మాయ్, అమ్మాయ్!' అనే వాడు. అలాంటివాడికి ఈ అపరబుద్ధి ఎందుకు పుట్టినట్టూ? అందుగ్గాదూ, లోకం ఇలా పాడైపోయింది!
    
    అంతక్రితం తలెత్తిగూడా చూడనివాడు, శారద వెళ్ళినప్పట్నుంచీ, చూసి నవ్వడంగూడా సాగించాడు. ఎందుకోగదా అనుకొంది తను. అలా ఊరుకోవడమే తన కొంపతీసింది! నవ్వినప్పుడే, పెట్టవలసిన నాలుగూ పెట్టవల్సింది! 'అన్నాయ్' అంటున్నాంగదా, వీడికిమాత్రం ఆ పోకదల గుణం పుట్టబోతుందా అని - తను తాత్సారం చెసింది. ఇది, ఆ వెధవకు, మంచి ప్రోత్సాహమిచ్చింది. మూడో రోజునుండీ పూలు పట్టుకు రావడం మొదలెట్టాడు. అప్పుడుగూడా తను, అనుమానించి చావలేదు. పెళ్ళాం వున్న రోజుల్లో తెచ్చే అలవాటు ప్రకారం తెచ్చాడని సరిపెట్టుకొంది. అదేం ఇదేమని - నిన్న సాయంత్రం చెయ్యి పట్టుకున్నాడు. ఆ నారాయణమూర్తి దయవల్ల - ఎవ్వరూ చూడకపోబట్టి సరిపోయింది. తన ఖర్మంగాలి, ఎవరికంటనన్నా పడితే కాపరానికి నీళ్ళోదులు కోవడమేనా, ఇంకేమయినా ఉందా!
            
    పోనీ, ఈ మనిషన్నా కాస్త మంచివాడైతే అనుకోవచ్చు. అప్పుడెప్పుడో, ఆ రాజారావు ఫోటో పెట్టిలో ఉన్నదని, ఇప్పటికీ సాధిస్తుంటాడుగదా! అట్లాంటి అనుమానం మనసులో ఉన్నవాడికి, ఈ మాత్రం సందు దొరికితే, తన కాపరం ఇంకా నిలవనా? తన్ని తగిలేసి, ఇంకెవత్తెనో పెట్టుకు ఊరేగడూ? ఇప్పుడు సరిగ్గా ఉంటున్నాడని మాత్రం ఏమిటిగానీ, అప్పుడీ అడ్డంకిగూడా లేకుండాపోతుంది.
    అయినా ఈ రాంమూర్తిగాడికిదేం లేకి బుద్ధీ? తన చక్కదనం చూసి భ్రమసిపోతారనుకొన్నాడా? తన డబ్బుకు లొంగి పోతారనుకొన్నాడా? వీడి బాబాయిల్లాంటివాళ్ళను తను చూసింది! వీడి లెక్కప్రకారం, వాళ్ళందరికీ తను లొంగిపోవలసిందేనా? హయ్యో రాత! వీడింత తెలివితక్కువ వెధవేమిటీ? వీడనుకొన్నదే నిజమయితే, తనెప్పుడో వీడికి లొంగి పోవాలిసింది! మాటొచ్చిందని కాదు గానీ, రాంమూర్తి అందగాడే! అలాంటి అందమంటే తనకు ఇష్టం గూడానూ! ఈ మనిషి రాంమూర్తిలాగా ఉంటే ఎంత బాగుండును! ఈ రాంమూర్తిలాంటివాడు తనకు భర్తగా దొరికితే ఎంత సంతోషిద్దును... ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు తనకు కలిగిన మాటగూడా నిజమే! భగవంతుని ముఖం చూసి చెప్పాలంటే - తనకట్లా అనిపించింది మరి! అనిపించింది గదా అని, తనేమన్నా తూలిందా? లేదే!

    ఎందుకో, హఠాత్తుగా, తనకు అనిపించింది, ఈ రాంమూర్తి, ఒంటరిగా ఉన్నప్పుడూ ఏదన్నా అఘాయిత్యం చేస్తే ఏమిటి చెయ్యడమా అని! అలా ఎందుకనిపించిందో తనకు తెలీదు. మనసులోని ఆలోచనలు గ్రహించిన వాడిలా, ఈ త్రాపి అంతపని చేశాడు. నిన్న చెయ్యి పట్టుకొన్న వాడు, ఇవ్వాళ ఇంకేమైనా చేస్తాడు. అసలు నిన్ననె, ఆయనకీ సంగతి చెప్పాలిసింది; చెప్పలేక పోయింది. ఉరుమురిమి, మంగలం మీద పడుతుందేమోనని తన భయం! చెప్పకుండా ఉంటే ఈ మూర్తిగాడు ఇంకెంతదాకా పాకుతాడోనని, అదో భయం! అయ్యో శ్రీరామచంద్రా!
    లలితకు హటాత్తుగా ఓ ఆలోచన వచ్చింది. అలాంటి ఆలోచన సమయానికి వచ్చినందుకు, ఆమె చాలా సంతోషించింది. ఈ గిజాటు నుండి తప్పుకోవడానికి తన కదొక్కటే మార్గం! తనుకూడా పుట్టింటికెడుతుంది. దానితో అన్ని చిక్కులూ ఇట్టే విడిపోతాయి. తనకిక మూర్తిగాడి బెడద ఉండదు. వీణ్ని గురించి తను మల్లగుల్లాలు పడనవసరం లేదు. ఇక్కడ ఉండడం, అన్ని విధాలా అనర్థకమని తేలిపోయింది. ఉన్నప్పణ్నించీ ఈ మూర్తిగాడు ఏదో చేస్తూనే ఉంటాడు. ఇలా ఇలా చేస్తున్నాడని, ఈ మనిషికి చెప్పడానిగ్గూడా లేదు. మొదట్లో, ఆయనగారి కంతగా ఇష్టం లేకపోయినప్పటికీ - ఈ తిండి ఏర్పాట్లు చేసింది తనే; ఇప్పుడు వద్దంటున్నదీ తనే!

    అదీగాక వీడు తనను 'అమ్మాయ్' అంటున్నాడు. తను వీణ్ని 'అన్నగారూ!' అంటున్నది. అటువంటివాడు ఈ పని చేశాడంటే ఎవ్వరూ నమ్మరు. పైగా తనే రద్దీపడాల్సొస్తుంది. ఇక్కడుండి, ఈ జాతర నెత్తికి చుట్టుకోడంకన్నా, తను హాయిగా తప్పుకెళ్ళడమే మంచిది! నాన్నగూడా మొన్ననే రాశాడు. ఆయన రాశాడనికాదు గానీ, తనకుగూడా తనవాళ్ళను చూడాలనిపిస్తున్నది... అన్నిటికన్నా ముఖ్యం ఈ గండకత్తెర తప్పిపోతుంది.

    శంకరం భార్య చెప్పింది విన్నాడు. ఓ నిమిషం ఆలోచించాడు. ఆ తెల్లవారే అతను భార్యను ప్రయాణంచేసి బండిదాకా పంపించాడు.
    నాలుగైదు రోజులపాటు చాలా కులాసాగా గడచిపోయింది. లలిత తన స్నేహితులందర్నీ పలకరించి వచ్చింది. ఆపైన ఏం చెయ్యవలసిందీ లలితకు తెలియలేదు. ఇంట్లో ఉన్న కాసిని పుస్తకాలూ, పనిబట్టి రెండురోజుల్లో పూర్తిచేసింది. ఈ ఊళ్ళో సినిమాలు, పార్కులు లేవు. రేడియోగూడా లేదు.

    ఆమెకు పిచ్చెక్కినట్లయింది. ఓ నెలరోజులపాటు కులాసాగా గడుపుదామనుకొంది. వారానికే మొఖం మొత్తింది. తిరిగి వెళ్ళిపోదామా అని గూడా అనుకొంది. మరో రెండు రోజులు రాజారావు రాకపోతే, అనుకొన్నంత పనీ చేసేది లలిత.

    రాజారావును చూడగానే లలితకు పాత సంగతులెన్నో జ్ఞాపకం వచ్చాయి. ఆవిడగారు కథానయిక కాదుగానీ, అయినట్లయితే, తప్పకుండా కళ్ళంట నీళ్ళుపెట్టుకునేది. ఆ రోజుల్లో, తెలిసీ తెలియని వయస్సులో, తామేమో అనుకొన్నారు. పెళ్లికూడా చేసుకుందామనుకొన్నారు. ఈ భూప్రపంచం తల్లక్రిందులైనా, సూర్య చంద్రులు గతులు తప్పినా, సప్తసముద్రాలు ఇంకినా, తమ వివాహం జరిగి తీరాల్సిందేనని ప్రమాణాలు చేసుకొన్నారు. చివరికి జరిగిందేమొటంటే ఏమీ లేదు. మొదట్లో ఏదో కాస్త గినుకులాడినా తను శంకరాన్ని చేసుకుంది. రాజారావు ఇంకెవర్నో పెండ్లాడి ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంతవరకూ తన పెళ్ళి విషయం, ఆట్టే పట్టించుకోని నాన్న, ఈ సంగతి తెలియగానే ఆదరా బాదరా కానిచ్చేశాడు. అమ్మ ఒప్పుకోలేదు గానీ, ఒప్పుకొంటే తన పెళ్ళి రాజారావుతోనే అయ్యేది...

    లలిత ఆశించినంతా జరిగింది. రాజారావు ఆమె కాలక్షేపానికి చక్కగా అక్కరకొచ్చాడు. దివాణంలాంటి కొంప, నాన్న ప్రొద్దుటనంగా వెళ్ళి రాత్రిగ్గానీ తిరిగి రాడు. తమ్ముడు, ఆ వీధి బడితో సతమతమవుతుంటాడు. ఆ రెండూ మెతుకులూ ఉడకేసి, అమ్మ ఓ మూల నడుం వాల్చేస్తుంది...
    రాజారావుగ్గూడా, ఆనాటి సంఘటనలన్నీ మనస్సులో మెదిలి ఉండాలి; లేకపోతే, అలా మాట్లాడి ఉండడు మరి.

    'ఆ పోనిద్దూ! అప్పుడేదో జరిగిపోయింది. దాన్ని గురించి ఇప్పుడెంత అనుకొంటే మాత్రం ఏం లాభం?' అన్నది లలిత.     'నేనంత తేలిగ్గా మాట్లాడలేను. నువ్వు మరచిపోయావేమోగాని, నేనింకా మరచిపోలేదూ అన్నాడు.     లలిత కళ్ళు తళతళలాడాయి.     'ఈ గదిలోనే మనం కలుసుకొంటుండేవాళ్ళం. మొదటిసారి నిన్నిక్కడే నేను ముద్దెట్టుకొన్నాను...'     లలిత అతని ముఖంలోకి చూసింది. ఆమె పెదాలు కొద్దిగా వణికాయి. ఏదో చెప్పబోయి చెప్పలేక ఆగిపోయింది. రాజారావుకేదో ప్రోత్సాహం లభించినట్లయింది. ఎవరో చెప్పినట్లుగా, అతను ముందుకు వెళ్ళాడు. అతని చేతుల్లో లలిత శరీరం, ఓ క్షణం పెనుగులాడి, మానేసింది...

    తాను చేసిన ఈ పని మంచిదా, చెడ్డదా అన్న విచికిత్స జరిగినప్పుడు, మంచిదేనని లలిత సమాధానం చెప్పుకొంది. తనూ, రాజారావూ ఒకప్పుడు పెళ్ళికూడా చేసుకొందామనుకొన్నారు. చేసుకోవడానికి తమకు అభ్యంతరమేమీ లేదు. చేసుకోవటమే జరిగినట్లయితే, తను శాశ్వతంగా, రాజారావు మనిషి అయివుండేది. అలా కాకపోవడానికి కారణం, తనుగానీ, అతనుగానీ కాదు; అమ్మ! ఆమే పట్టుదలవలనే తాము విడిపోవలసి వచ్చింది. అమ్మ పట్టుబట్టనట్లయితే, తామిద్దరూ భార్యాభర్తలయ్యేవారు. హాయిగా సుఖించేవారు. ఇప్పుడు కాలేదు - అయినంత మాత్రాన సుఖపడకూడదనే దేముంది? నిజం చెప్పాలంటే తను వ్యభిచరించింది శంకరంతోనేగాని రాజారావుతో కాదు!

    ఈ పంపిణీమీద, తనను తాను సమర్థించుకొందుకు చాలా కారణాలు కనిపించాయి లలితకు. ఆ మూర్తిగాడలా చేయడం కూడా, ఒకందుకు మంచిదే ననిపించిందామెకు. లేకపోతే, ఇంతలో తను పుట్టింటికి వచ్చీ వుండదు, ఈ రాజారావు కనుపించనుకూడా కనిపించడు. అంచేతే, ఇతని సెలవు అయిపోయిందాకా తనిక్కడే ఉండటనికి నిశ్చయించుకొంది. మరో పదిహేను రోజులదాకా, రావడనికి పడదని, శంకరానికి ఉత్తరం కూడా రాసింది.

    అయితే ఆ గడువుదాకా లలిత ఉండలేదు. అలా ఉత్తరం రాసిన మూడోరోజునే ఆమె ప్రయాణంకట్టింది. ఇంత హఠాత్తుగా లలిత ఎందుకు ప్రయాణమౌతున్నదో ఎవ్వరికీ తెలియలేదు. చివరకు రాజారావు కూడా తెలుసుకోలేకపోయాడు.
    'నువ్వింకా ఉంటావనుకొన్నాను లలితా! ఇలా వెడతావంకోలేదు. కనీసం ఎందుకెడుతున్నావో కూడా నాకు తెలియకుండా వుంది' అన్నాడు రాజారావు.     'తెలియ వలసిన అవసరం లేదు' అన్నది లలిత.     ఆమె మనస్సు పరిపరివిధాల పోయింది. ఈ మొగవాళ్ళంతా ఇంతే అనుకొంది. ఎంతో ప్రేమించాడనుకొన్న ఈ రాజారావు కూడా తనను మోసగించాడనుకొంది. ఆనాడు - పెళ్ళికాక పూర్వం - పెళ్ళి చేసుకొంటాననే, తనను అనుభవించాడు. ఇప్పుడు - భార్య పుట్టింటికి వెళ్ళిన కారణంగానే వెనుకటి పరిచయాన్ని పురస్కరించుకొని, తనను మరొకసారి 'పతిత'ను చేశాడు. ఈ రెండవ తప్పు జరగడానికి కారణం తను కాదు; రాజారావు భార్య.
    ఆలోచించి చూడగా లలితకెన్నో అనుమానాలుదయించాయి. ఈ ఆలోచన, అక్కడ ఉండగానే వచ్చినట్లయితే తను పుట్టింటికి రానేరాదు. ఓ అపాయం నుండి, తప్పుకొందుకు తనిక్కడ కొచ్చింది; అంతకన్నా బలీయమైన అపాయానికి గురికాబడ్డది. ఈ రాజారావు ధర్మమా అంటూ తనకు తెలిసివచ్చింది. రాంమూర్తి తనవెంట పడటానికి, రాజారావు తన దరిజేరటానికి గల కారణమేదో తనకు తెలిసిపోయింది! బహుశా ఈ కారణం చేతే తన భర్త, తను పుట్టింటికి వెళ్ళడానికి, చప్పున అంగీకరించి వుంటాడు.

    తను త్వరగా వెళ్ళాలి. తన భర్త మరో స్త్రీ వలలో పడకముందే. ఆయన్ను రక్షించుకోవాలి. ఇష్టాయిష్టాలనేవి ఎట్లా ఉన్నా, తను చేసే కాపరాన్ని కాలదన్నుకోలేదు...
    ఆదరా బాదరా రైలు దిగి ఇంటికొచ్చింది. రాంమూర్తిగారి భాగంలో దీపంకూడా లేదు. తమ యింట్లో నుండి గాజుల చప్పుడు వినిపించింది. అడుగులో అడుగువేసుకొంటూ వచ్చి తలుపుసందుగుండా లోపలికి చూసిందామె. లలిత అనుమానించిందంతా జరిగింది. శంకరం వెల్లకిలా పడుకొనివున్నాడు. అతని మంచం మీద కూచున్నామెను శారదగా గుర్తుపట్టడానికి, లలితకు ఎంతో సేపు పట్టలేదు.

    
    
Comments