ఐ లవ్ ఇండియా - నామని సుజనాదేవి

    
"నాన్నా నాన్నా... గుడ్ న్యూస్... నాకు వీసా వచ్చింది నాన్నా... ఇన్ని రోజులు వస్తుందో రాదోనని భయపడ్డాం కదా... కానీ వచ్చింది నాన్న... ఆ దేవుడు దయతలచాడు, ఇక మన కష్టాలన్నీ తీరతాయి నాన్న..." సంతోషంగా చెబుతున్నాడు శివ.

    "వచ్చిందా... సంతోషం..." అన్నాడు ముఖం పై నవ్వు పులుముకుని రాఘవయ్య.
   
    అప్పుడే హాల్లోకి అడుగుపెట్టిన చెల్లి సుస్మితా చేయి పట్టుకుని, గిరా గిరా తిప్పుతూ వూపేశాడు శివ 'నాకు వీసా వచ్చిందోచ్' అంటూ.
    
    "అన్నయ్య... అయితే మరిక నువ్వు, మనవూళ్ళో మురళి వెళ్ళి రెండు సంవత్సరాలైనా ఇంకా రానట్లు వెళ్లిపోతావా అన్నయ్యా..." అమాయకంగా అడిగింది సుస్మిత.

    "అవున్రా.... అయినా వెళ్లిపోతే ఏం... నీకు బోలెడు బొమ్మలు... అమ్మానాన్నలకు బోలెడు డబ్బులు పంపిస్తాగా... ఎంచక్కా మీరు ఈ పల్లెటూర్లో, ఈ పొలం, పాడి అమ్మేసి దర్జాగా కాలుపై కాలు వేసుకుని బస్తిలో ఉండొచ్చు..."
    
    "నాకవేం వద్దు..." చేయి విడిపించుకుని లోని కెళ్లింది సుస్మిత.
    
    "అమ్మా.... నీ పూజలు ఫలించాయమ్మా... నాకు వీసా వచ్చింది..." లోనికెళ్ళి వంట గదిలో ఉన్న తల్లితో చెబితే, "అలాగా నాన్న... నీకిపుడు సంతోషమేనా..." అంది మందహాసంతో .      

     "హాపి... అమ్మా.... నేను ఫ్రెండ్స్ ని కలిసి వస్తానమ్మా" అంటూ వెళ్లిపోయాడు శివ. 
     
    ఫ్రెండ్స్ అందరూ శివ ను తెగ పొగిడారు. తమ పల్లెకే అతను వన్నె తెచ్చాడన్నారు. అందరూ అతని అదృష్టానికి అసూయపడ్డారు. తమకలాంటి అదృష్టం లేనందుకు బాధపడ్డారు. కనీసం తమ సర్కిల్ లో ఒక్కడైనా అమెరికా వెళ్తున్నందుకు సంతోషపడ్డారు. వాళ్ళతో కాసేపు గడిపి కోవెలకెళ్ళాడు శివ. 
  
    చిరపరిచితం అయిన పూజారికి శుభవార్త చెప్పి, కొబ్బరికాయ కొట్టి, కోదండ రాముణ్ణి ముకుళిత హస్తాలతో ప్రార్థించి కోనేటి గట్టు దగ్గర కూర్చున్నాడు. లోపల్నుండి వినిపిస్తున్న వేద మంత్రాలు ఏదో పవిత్రతను ఆ వాతావరణానికి ఆపాదిస్తున్నాయి. అస్తమిస్తున్న సూర్యుని ఎర్రని కిరణాలు నీటిపై పడి మెరుస్తుంటే చూస్తూ కూర్చున్నాడు శివ. ఈ కోవెలతో తనకున్న అనుబంధం ఎంత పెద్దది. చిన్నప్పటినుండి ఇంటికి దగ్గరగా ఉండటంతో  కనీసం రోజుకొకసారైనా వచ్చేవాడు. అమ్మ, చెల్లితో కలిసిగాని, ఫ్రెండ్స్‌తో కలిసిగాని వచ్చేవాడు. అమ్మవాళ్లతో హనుమాన్ దండకం, చాలీసా, విష్ణు సహస్ర నామాలు చదువుతూ ఎక్కేవాడు.  చెల్లెతో మెట్లు ఎవరు ముందు ఎక్కుతారోనని పోటీ పెట్టుకుని స్పీడ్ గా ఎక్కేవాడు. ఉక్రోషం వచ్చిన చెల్లిని మురిపించడానికి చివరి మెట్ల దగ్గర ఆయాసంతో కూర్చున్నట్లు చేసి,  చెల్లి ముందు వెళ్ళేలా చేసేవాడు. ఫ్రెండ్స్ తో కలిసి ఎన్ని మెట్లున్నాయో లెక్కబెట్టేవాడు. తన కంఠం బాగా ఉంటుందని పూజారి అడిగి మరీ 'అచ్యుతమ్ , కేశవమ్ రామనారాయణం...' భజన, 'ఓం నమోభాగవతే వాసుదేవాయ...' భజన చెప్పించేవాడు. తనకి కూడా తను చెప్పేదానిని అందరూ అంటుంటే, స్కూల్లో  టీచర్ చెబితే తాము అనేది  గుర్తొచ్చి పెద్దవాడైనట్లు ఫీల్ అయ్యేవాడు. అందరూ 'నీ కొడుకు బంగారం చిన్నపుడే చూడండి ఎన్నికలో' అంటుంటే నాన్న తనను దగ్గరకు తీసుకుని మురిసిపోయేవారు. ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలు... కొన్ని రోజులయితే మళ్ళీ ఈ కోవెలను ఎన్ని సంవత్సరాలకు చూస్తానో... పుట్టి పెరిగిన వూరు ఒక్క కోవెలేమిటి, చదివిన బడి, తిరిగిన చేలు, పిల్లకాలువలు, మోటబావిలో ఈతలు... అల్లరి చేసి మాస్టర్ల చేతిలో దెబ్బ తిన్న వైనాలు, ఆడపిల్లలను ఏడిపించిన అల్లర్లు, నాన్న కొప్పడితే బామ్మ చాటుకు చేరి గారాలు పోయిన సంఘటనలు, ఎన్నెన్ని విశేషాలు. ఇంతవరకు అమ్మా నాన్నలను దిలి ఏదో చదువుకొరకు, ఉద్యోగం కొరకు బస్తికి రోజు వెళ్ళి రావమే కానీ, విడిచి ఉన్నరోజులే లేవు. అమ్మమ్మ వాళ్ళింటికి చుట్టాలింటికి వెళ్ళినా ఏదో ఒకటి రెండు రోజులే .ఇక ఇపుడు సంవత్సరాల తరబడి... ఇరవై మూడు సంవత్సరాల అనుబంధాన్ని వదిలి వెళ్లాలంటే  మనసులో ఏదో తీయని భాధ, కానీ ఆ భాధను అమెరికా వెళ్ళి డబ్బు సంపాదించొచ్చు అన్న కొరిక అధిగమిస్తోంది. ఆ క్షణంలో క్లోజ్ ఫ్రెండ్ భార్గవ గుర్తొచ్చాడు. చిన్నప్పటినుండి కలిసి చదువుకున్నారు. ఏ విషయంలోనైనా ఇద్దరిదీ ఒకే మాటగా ఉండేది. కలిసి ఆడుకునేవారు, కలిసి తిరిగేవారు. అందుకే ఫ్రెండ్స్ అందరూ తమని ఫెవికాల్ అని ఏడిపించేవారు. భార్గవ వూరు తమ వూరినుండి పది కిలోమీటర్లు లోనికెళ్లాలి. తమ వూరినుండి బస్తీ కేవలం అయిదు కిలోమీటర్లు మాత్రమే. భార్గవ చదవడానికి బస్తీ వెళ్లాలంటే తప్పనిసరిగా తమ వూరిపైనే వెళ్ళాలి. రోజు కాలేజ్ టైమింగ్స్ లో వాడు ఎక్కిన బస్ నే, ఇక్కడ తను ఎక్కేవాడు. రోజు కలిసి వెళ్ళేవారు., కలిసి వచ్చేవారు. ఇద్దరూకలిసి అమెరికా వెళ్లాలని ఎన్నో కలు కన్నారు. ఫోన్లో కాంటాక్ట్ లో ఉన్నా కనీసం రెండు నెలలవుతోంది కలవక. తనతో పాటు వీసా అప్లై చేయమంటే చేయలేదు. ఎందుకు అప్లై చేయలేదో తనకిప్పటికీ అర్ధం కానీ విషయమే. హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చినా వదులుకున్నాడు. తనకు వీసా వచ్చిన సంగతి ఫ్రెండ్స్ ద్వారా తెలిసి ఇంతకుముందు తన సెల్ కి కాల్ చేసి మాట్లాడాడు. మళ్ళీ అమెరికా వెళితే కుదరదు, ఒక్కసారి వెళ్ళి కలిసి తనివితీరా మాట్లాడి రావాలి . ఈలోగా అక్కడికి తీసుకెళ్ళాల్సిన వస్తువుల లిస్ట్ రాయాలి. ఒక్కొక్కటి సమకూర్చుకోవాలి. అమ్మో... బోలెడు పనులు... ఆలోచనల్లో ఉండగానే చీకటి పడి లైట్లు వెలగటంతో లేచి ఇంటికి బయల్దేరాడు శివ. 
   
    వారం ,పది రోజులు వెళ్లడానికి కావలసినవి కొనడం, ముఖ్యమైన ఫ్రెండ్స్ ను, బంధువులను కలవడం, ఇప్పుడు చేస్తున్న జాబ్ లో పెండింగ్ పనులు పూర్తి చేయడంతో బిజీగా గడిచిపోయాయి.
    
    వెళ్ళేరోజు దగ్గర పడుతుండటంతో, ఆ రోజు ఎలాగైనా భార్గవ ని కలవాలని, మళ్ళీ రాత్రి వరకొచ్చేస్తానని ఇంట్లో చెప్పి బయల్దేరాడు. ముందే ఫోన్ చేసి చెప్పడంతో ఇంట్లోనే ఉన్నాడు భార్గవ. వెళ్ళగానే కౌగిలించుకుని ఆప్యాయంగా పలకరించాడు. అతని అమ్మ, నాన్న కూడా ప్రేమగా పలకరించారు.
     
    "చూడు శివ....భార్గవని కూడా నీలా అమెరికా వెళ్లమన్నా... పిచ్చి వెధవ ... ఈ వూరిని వదలనంటాడు..." అన్నారు నవ్వుతూ .
    
    ఆ తర్వాత ఆ స్నేహితులిద్దరూ కబుర్ల మధ్య సమయాన్ని మర్చిపోయారు. 
  
    "నువ్వు అప్లై చేస్తే ఇద్దరం కలిసే అమెరికా వెళ్ళేవాళ్లం కదరా" అన్నాడు శివ.

    నవ్వి వూరుకున్నాడు భార్గవ. ఇంతలో చీకటిపడటంతో వెళ్లడానికి లేచాడు శివ. కానీ భోజనం చేసేంతవరకు వెళ్ళేది లేదని అంతా బలవంతం చేయడంతో, వారి అభిమానాన్ని కాదనలేక పోయాడు.  వంటయ్యాక ముచ్చట్ల మధ్య భోంచేసి బయల్దేరబోతుంటే వర్షం రావటంతో ఆగిపోయాడు. ఆ రాత్రి అక్కడే ఉండమని బలవంతం చేయడంతో, ఆ వాతావరణంలో వెళ్లలేక, ఇంటికి ఫోన్ చేసి అక్కడే ఉండిపోయాడు శివ. ఆ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు మిత్రులిద్దరూ.
      
    మధ్య రాత్రి ఎందుకో సన్నగా ఏడుపు మాటలు వినిపించడంతో నిద్రలేచాడు శివ. ప్రక్కకు పడుకున్న భార్గవ లేదు. ఇంట్లో లైట్లు వేసి ఉన్నాయి. రూమ్ తలుపులు పూర్తిగా తెరిచి బయటకు  వచ్చాడు. హాల్లో మంచంలో మెలికెలు తిరుగుతున్నారు భార్గవ నాన్నఅయోధ్యరామయ్య. ప్రక్కన వాళ్ళమ్మ ఏడుస్తోంది. భార్గవ, తండ్రి గుండెను రాస్తూ, "ఇపుడే డాక్టర్ ని తీసుకొస్తాను నాన్న... అమ్మా జాగ్రత్త..." అంటూ బయటకు పరుగెడుతుంటే, శివ కూడా వచ్చి , "ఏమయ్యిందిరా" అంటూ పరిస్థితి అర్ధం చేసుకుని వెహికిల్ తీసుకొచ్చాడు. ఇద్దరూ దగ్గర్లోని డాక్టర్ దగ్గర కెళ్ళి డాక్టర్ ను తీసుకొచ్చారు. మధ్య రాత్రి కావడంతో, ఆయనిల్లు నాలుగు కిలోమీటర్ల దూరం ఉండటంతో రావడానికి కాస్త సమయం పట్టింది.  వచ్చి పరీక్ష చేసి ప్రమ చికిత్స చేసి ఒక టాబ్లెట్ ఇచ్చి అర్జెంట్ గా బస్తీ కి తీసుకెళ్లి హాస్పిటల్ లో జాయిన్ చేయకపోతే ప్రమామన్నారు డాక్టర్.
     
    ఆఘమేఘాలపై శివ భార్గవ వెళ్ళి ఆటో మాట్లాడుకుని తెచ్చారు. ఆటోలో తల్లి ఒడిలో తండ్రిని పడుకోబెట్టి, వెనకాల బండి మీద ఇద్దరూ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్ వెంటనే జాయిన్ చేసుకుని ప్రమాదం కాస్తలో తప్పిందని, లేకుంటే ప్రాణానికే ముప్పు వాటిల్లేదని అన్నారు. హార్ట్ లో రెండు నాళాలు మూసుకు పోయాయని, ఇంకొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుందని, వాటికి ఎంత ఖర్చవుతుందో చెప్పి, ప్రస్తుతానికి ప్రమాదం లేదని అన్నారు డాక్టర్. అప్పటికే డాక్టర్ రాసిచ్చిన మందులు కొని ఇచ్చి, తెల్లవారటంతో ఇంటికెళ్ళి డబ్బు తీసుకుని, ఫ్రెషప్ అయి వస్తామని’ చెప్పి ఇంటికొచ్చారు మిత్రులిద్దరు.
    
    "ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగిందా భార్గవ్... అమ్మో నిన్ను నేను మా ఇంటికి రమ్మన్నాను. ఒకవేళ మనం లేకపోతే... అమ్మో..." అంతకుముందు భార్గవ్ తో సెల్ లో మాట్లాడుతూ, అతన్నే తన ఇంటికి రమ్మంటే అతను తననే రమ్మన్నది గుర్తొచ్చి  అన్నాడు శివ.

    "ఇంతకు ముందొకసారి హార్ట్ అటాక్ వచ్చింది. అయితే అపుడు లక్కీగా నాన్న హాస్పిటల్ లో ఎవరినో చూడడానికి వెళ్ళి, అక్కడే రావడంతో వారు అదే హాస్పిటల్ లో జాయిన్ చేసి, నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు చెప్పు.. ఇలాంటి అమ్మ, నాన్నలను వదిలి నన్ను అమెరికా రమ్మంటావా... నిన్న రాత్రి నేను గనక లేకపోతే అమ్మ ఒక్కర్తీ ఇంట్లో నాన్న నొక్కణ్నీ వదిలేసి, అలా అంతా దూరం లో ఉన్న డాక్టర్ దగ్గరకు పరుగెత్తగలిగేదా... ఒకవేళ ఫోన్ చేసి రమ్మన్నా , డాక్టర్ అంతా తొందరగా మనకోసం ఆ రాత్రివేళ వచ్చేవారా... ఒకవేళ వచ్చినా ఇక్కడ హాస్పిటల్ లో ఉన్నట్లు అన్నీ పరికరాలు ఉండవు కదా... పట్నం వెళ్లాలంటే చూశావుకదా...  ఇక్కడ ఆటోలు దొరకావు. అయిదు కిలోమీటర్ల దూరం వెళ్ళి మనము తీసుకొచ్చాము. అమ్మ తీసుకురాగలదా... ఒకవేళ బాగా సంపాదించి కారు కొని, డ్రైవరుని పెట్టినా అర్ధరాత్రనకా అపరాత్రనకా వాళ్ళను కనిపెట్టి ఉండాల్సిన అవసరం వాళ్ళకెక్కడిదిరా. రక్తం పంచుకు పుట్టిన నాకు లేని ప్రేమ, మమకారం వాళ్లకేలా వస్తాయి. నేను అమెరికా వెళ్ళి కోట్లు సంపాదించినా, ఈ వయసులో వీళ్ళను వదిలి వెళితే మళ్ళీ వీళ్ళ ఋణం తీర్చుకోగలిగే అవకాశం నాకు వస్తుందా... ఈ వయసులో వీరికి కావాల్సింది కోట్ల కాసులు సంపాదించే కొడుకు కాదు, అభిమానంగా, ఆప్యాయతను పంచి, ఆవేదనను పంచుకుని చేయూత నిచ్చే ఆత్మీయుడు  మాత్రమే. ఇది కేవలం ఒక చిన్న సంఘటన మాత్రమే. ఇంకా వారానికి ఒకసారి చెకప్ వెళ్లాలన్నా, బజారునుండి వస్తువులు తెచ్చుకోవాలన్నా మందులు కొనుక్కోవాలన్నా, పరీక్షలకు వెళ్లాలన్నా... ఒక్కోసారి బాత్రూమ్ కి వెళ్లాలన్నా నా అవసరం కావాల్సి వస్తుంది. ఈ వయసులో వారిని కష్ట పెట్టడం నాకిష్టం లేదురా... అందుకే నిజంగానే చిన్నగా ఉన్నపుడు అమెరికా మోజులో ఎన్నో కలలు కన్నాను కానీ ఇపుడు వాస్తవం గ్రహించాక నాకు అమెరికా వెళ్లాలని లేదు. ఇప్పటివరకు అక్కలందరి పెళ్లిళ్లు చేసి నన్ను చదివించి ఎన్నో కష్టాలనుభవించిన వారిని ఈ చరమ దశలోనైనా సుఖపెట్టాలని నా కోరిక. అందుకే ఇలా వీళ్లతో ఉండడమే నాకిష్టం. అమ్మా నాన్న కనీసం బస్తీలోనైనా నాతో కలిసి ఉండడానికి ఇష్టపడటం లేదు. ఇక్కడ పొలం అవి ఉన్నాయని, ఈ వూరిని వదిలి వెళ్లలేమని అంటున్నారు. అందుకే నేను పట్నం లో జాబ్ వచ్చినా వదులుకున్నాను. అదే ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ వ్యవసాయం చేస్తున్నా కానీ సిటీ లో వచ్చిన జాబ్ మేనేజర్ ఎందుకో నన్ను ఎలాగైనా చేర్చుకోవాలనుకుంటున్నాడు.  అతని మరో బ్రాంచి, ఇపుడు మనం హాస్పిటల్ కి తీసుకెళ్లిన దారిలోనే ఉంది. అదయితే మా వూరికి దగ్గర కాబట్టి రోజు షటిల్ చేయవచ్చని అందులో ఇస్తానంటున్నాడు. అమ్మా వాళ్లకిష్టమైతే అందులో చేరుతాను. అందుకే నేను వీసా అప్లై చేయలేదు" అన్నాడు భార్గవ్.
       
    శివకి వెంటనే అతని అమ్మ,నాన్న, చెల్లీ గుర్తొచ్చారు. తనికి అప్పుడర్ధమయింది, తాను అమెరికా ప్రయాణం గురించి చెప్పగానే ఎందుకు వారి పెదాలపై కేవలం అతికించుకున్న ప్లాస్టిక్ నవ్వులు ఉన్నాయో, అప్పుడు తనకర్ధం కాలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడర్థమవుతోంది. తాను సంతోషంగా చెల్లికి బహుమతులు తెస్తానంటే, చేయి వదిలించుకుని ఎందుకు వెళ్ళి పోయిందో......ఇంత పెద్ద చదువులు చదివిన తాను చిన్నప్పటినుండి రెండు దశాబ్దాల పైగా పెంచిన తల్లితండ్రుల మనస్సులను అర్ధం చేసుకునే చదువు చదవలేదు. ఎంత పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడొచ్చే జీతంతో తమ అప్పులు వెంటనే తీరకపోయినా మహా అంటే మరో నాలుగు సంవత్సరాలు ఎక్కువ అవుతుంది. అంతేగా... కానీ ఉన్న ఒక్కగానొక్క కొడుకుని తాను అలా అమ్మానాన్నలనొదిలిపోతే... అసలే నాన్నకు షుగర్, ఎప్పటికీ మెడికల్ చెకప్ లో ఉండాలి. అమ్మకు కిడ్నీ ప్రాబ్లం... తానెందుకివన్నీ ఆలోచించలేదు.  .. .. తను వెంటనే ఈ ప్రయాణం కాన్సెల్ చేసుకుంటున్న సంగతి అమ్మ నాన్నలకు చెప్పాలి... ఆలోచనల్నుండి బయటపడి, "ఆరే.. భార్గవ..నా కళ్ళు తెరిపించావురా..నేను అమెరికా వెళ్ళడం లేదు..." అన్నాడు.   
    
    "సారీరా..నిన్ను గురించి నేననలేదు, కేవలం మా ఇంటి గురించి చెప్పానంతే ...నీ ప్రయాణం మానుకోకురా..."
  
    "అంటే నువ్వేమో అమ్మానాన్నలసేవ చేసి పుణ్యం కట్టుకోవాలి నేనేమో స్వార్ధపరుణ్ణి కావాలనా..అదేం కుదరదు..." జోక్ గా అంటున్న శివతో చేయికలిపి వీడ్కోలిచ్చాడు.
     
    "అమ్మ...నేను వెళ్ళడం లేదు" అన్న శివని ఆర్తిగా కౌగిలించుకున్నాడు రాఘవయ్య.
  
    అమ్మ, చెల్లి కళ్ళల్లో ఆనంద భాష్పాలు, మాటలకందని భావం కనబడింది. "మాతృ దేశం పెట్టిన ఖర్చుతో చదివి, విదేశాలకు దాని ఫలాలను అందించలేని దేశభక్తుడే వాడు" గర్వంగా తండ్రి అంటుంటే గుడిలోని జేగంటలు శుభప్రదంగా మ్రోగాయి. 

Comments