అక్షింతలు - ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి

    
"రాగిణీ బియ్యం తీసుకురా, అక్షింతలు కలపాలి" పిలిచింది అన్నపూర్ణమ్మ. దేముడి ముందర  అన్నీ అమర్చుకుంది. అక్షింతలు కొద్దిగా ఉన్నాయి. అన్నపూర్ణమ్మకి అన్నీ చేతినిండుగా ఉండాలి పూజలకి. పువ్వులు, పసుపు, కుంకుమ,అక్షింతలు, పళ్లు అన్నీ. అందరిలా చిటికిడేసి వాడదు. స్టోర్ రూమ్‌లోంచి పావుగ్లాసులో బియ్యం తెచ్చిచ్చింది పదకొండేళ్ల రాగిణి. "ఎలుకలు తినేస్తున్నాయో ఏమో. నిన్ననేగా గ్లాసుడు బియ్యం కలిపింది" అంది అన్నపూర్ణమ్మ.

    తలూపింది రాగిణి. బియ్యం వంకే చూస్తోంది. 

    "ఏమిటీ అలాగే నిలబడ్డావు. వెళ్లి పని చూసుకో. అక్షింతలు నేను కలుపుకుంటాలే" అంది పసుపు దండిగా వేస్తూ అన్నపూర్ణమ్మ.

    రాగిణి కదిలింది.

    గ్లాసులోని బియ్యం కళ్లముందర నిలిచాయి.

    రెండు గ్లాసుల నూకలు. మూడు గ్లాసుల పిండి అవుతాయి.

    ఒకరోజు గ్రాసం. "బన్నం" అంటూ నీరసంగా పడుకుని తల్లిని పీడించే తమ్ముడు కళ్ళముందర నిలిచాడు.

    ఆ నూకలతో గంజి కాస్తే! బియ్యం పిండి ఉడికించి పెడితే ఫారెక్స్ లా తింటాడేమో నిటూర్చింది రాగిణి.  

    తండ్రి లేడు. బతికున్నప్పుడు అతని తాగుడికి ఇల్లు, దెబ్బలకి తల్లి వళ్లూ నాశనమయ్యాయి. సగం రోజులు మంచంలోనే ఉంటుంది అనారోగ్యం వల్ల. కూలి పనిలాంటి మోటు పనులు చెయ్యలేదు. ఈ పాచిపనే ఆధారం. అందులోనూ ఈ ఒక్కిల్లే పనివాళ్లని పెట్టుకునేది ఈ కాలనీలో, మిగతా అందరూ అంతంత మాత్రం వాళ్లు. తామే చేసుకుంటారు.

    అందుకే తాను రాలేనప్పుడు తల్లి తనని పంపుతుంది. ఈ ఆధారం కూడా పోకుండ. తల్లికి రెండు రోజుల నుంచీ జ్వరం. మందులిప్పించటం మాట అటుంచి, గంజి తాగటానికి నూకలైనా లేవు. తేవటానికి డబ్బులూ లేవు.

    "రాగిణీ" అమ్మగారి పూజ అయినట్లుంది. బయటకి వచ్చింది పూజగదిలోంచి.

    "ఇంకా పని కాలే" అంది.

    "అవుతోందమ్మా" అంది ఇల్లు తుడుస్తూ, అప్పు అడగాలి అని మనసులో కోర్కె కానీ భయం. ఎందుకంటే అన్నపూర్ణమ్మ ఖచ్చితమైన మనిషి అడగక్కరలేకుండా ఒకటవ తారీఖునే జీతం ఇస్తుంది. కానీ మధ్యలో అప్పులూ అవీ ఇవ్వదు. అప్పులు ఆమెకి గిట్టవు. ఎంత ఉంటే అంతలోనే సరిపెట్టుకోవాలని ఆమె ఉద్దేశం.

    ముఖ్యంగా బీదవాళ్లు వ్యసనాలకు తగలేస్తారనీ, తిండి లేకున్నా తాగుడికీ, జూదానికి ఖర్చు పెడతారనీ నమ్మకం. దానికి తగ్గట్లే రాగిణి తండ్రి కల్తీమద్యం తాగి మరణించటం, అతని గతం ఒక కారణం. ఆడవాళ్లకి కూడా కొంతమందికి తమ వాళ్లల్లో తాగుడు అలవాటుండటం మరో కారణం (తన తల్లికి లేకపోయినా). కోరిక ఆపుకుంది రాగిణి. ఉపయోగం లేని చోట వెలితిపడటం ఎందుకు?

    లోపలి నుంచి అన్నపూర్ణమ్మ మళ్లీ వచ్చింది.

    చేతిలో పళ్లెం ఉంది. మరో చేతిలో పూలబుట్ట ఉంది. చెట్లకి నీళ్లు పోస్తోంది రాగిణి.

    "నీ పని అయ్యాక వెళ్లిపో. నేను గుడికి వెళ్లివస్తాను" అంది అన్నపూర్ణమ్మ.

    తలూపింది రాగిణి.

    చేతిలో నిర్మాల్యం (దేముడి దగ్గర శుభ్రం చేసిన పసుపు, కుంకుమ, అక్షింతలు మొదలైనవి) చెట్లలో వంపింది అన్నపూర్ణమ్మ.

    నిర్మాల్యం చెత్తబుట్టలో వెయ్యదు. మర్నాడు అవి మళ్లీ మునిసిపాలిటీ చెత్త బండికే వెళ్లినా సరే.

    "ఈ పళ్లెం కడిగి లోపలెట్టు" అంటూ పూలబుట్టతో కారెక్కింది.  కారు మలుపు తిరిగాకా పరుగున చెట్టు దగ్గరికి వచ్చింది రాగిణి. పూలతో బాటు ఎన్నో అక్షింతలు. కనీసం అరగ్లాసుడైనా ఉంటాయి. మట్టిలో పడిపోయాయి, చెల్లాచెదురుగా. నయం, అటువైపు చెట్లకి ఇంకా నీళ్లుపోయలేదు. నేల పొడిగానే ఉంది.

    పళ్లెం చేతిలోకి తీసుకుంది. గొంతు కూర్చుని పూలన్నీ ఏరింది. పక్కకి పెట్టింది. మట్టిలో పడిన అక్షింతలన్నీ ఒక్కొక్క గింజా ఏరి పళ్లెంలో వేసింది. పనిలో నిమగ్నమైన రాగిణికి టైము తెలియలేదు. అరపావు గ్లాసుడయ్యాయి చివరికి.

    "అమ్మయ్య. ఇవి శుభ్రంగా కడిగి గంజి కాస్తే ఈ రోజు కనీసం ఒక పూటైనా గడుస్తుంది" అనుకుంటూ ఇంటికి బయలుదేరింది.

    అదృష్టం అమ్మగారింకా రాలేదు. అయినా ఆమెకి గుడికెళ్తే ఒళ్లు తెలియదు. ఒక పట్టాన ఇల్లు చేరదు. అందులో అయ్యగారు కూడా ఊర్లో లేరు.

    ఇంటికెళ్లింది. ఎప్పటిలాగే తల్లి నీరసంగా మూలుగుతోంది. తమ్ముడు ఆకలికి ఏడుస్తున్నాడు.

    గబగబా అక్షింతలు మట్టి, పసుపు లేకుండా శుభ్రం చేసి గంజికాచి, ఉప్పవేసి ఇద్దరికీ ఇచ్చింది. అతి కొద్దిగా మిగిలితే తను తాగింది.

    "అమ్మా ఇవిగో" అంటూ పూజకి పూలు, గ్లాసులో బియ్యం దగ్గర పెట్టింది రాగిణి మర్నాడు.

    గ్లాసులోని బియ్యం ఒక చెంచాడన్ని తీసుకుని మిగతావి కవరులో పోసింది అన్నపూర్ణమ్మ.

    "ఇంద తీసికెళ్లు" అంది రాగిణికిస్తూ. "ఎక్కడికమ్మా" అంది ఆశ్చర్యంగా, భయంగా రాగిణి.

    "ఇంటికి" అంది అన్నపూర్ణమ్మ.

    కొయ్యలా అయ్యింది రాగిణి. తను చేసిన పని ఆమెకి తెలిసిందా? ఎవరైనా చెప్పారా? అయినా ఆమె పారవేసినవే కదా తను తీసుకుంది.    "సెమించండమ్మా మీరు వంపినవే కదా అని..." భయంగా అంది. కళ్లల్లో నీళ్లు నిండబోయాయి. ఈ ఇల్లు కూడా పోతే తమ గతి.

    "పిచ్చిపిల్లా, నేనేం కోపంగా అనడం లేదు. నిజంగానే చెబుతున్నాను. దేముడు తనపై చల్లే కంటే నీకిస్తేనే ఎక్కువ ఆనందిస్తాడు అనిపిస్తోంది" అంది గంభీరంగా.

    నిన్న అగరబత్తీలు పెట్టుకోవటం మరచిపోయి మళ్లీ వెనక్కొచ్చిన అన్నపూర్ణమ్మకి మట్టిలో బియ్యం ఏరుతున్న రాగిణి కనిపించింది.

     డ్రైవర్‌ని ఆమె పరిస్థితి అడిగి తెలుసుకుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది.

     రాగిణిని ఇంటికెళ్లమని పూజ ప్రారంభించింది. చిటికెడున్న అక్షింతల పళ్లెం చూసి నవ్వుకుంది. 'తనని నాస్తికురాలు అనుకుంటారా? లేదా దండిగా జరిగే పూజ జరగనందుకు దేముడికి కోపం వస్తుందా? భక్తితో కొంచెం వేసినా చాలంటారుగా' అని ఆలోచిస్తూ దేముడి వంక చూసింది.

    దీపాల వెలుగులో నామాల వెనుక నుంచి వెంకటేశ్వరస్వామి ప్రసన్నంగా కనిపించాడు.

(విపుల మాసపత్రిక జనవరి, 2008సంచికలో ప్రచురితం) 

Comments