అల్లుడి విపరీత రాజయోగం - పాలగుమ్మి పద్మావిజయ్

    
    పిల్ల మా అందరికీ నచ్చిందంటూ, ఓ రకంగా చెప్పాలంటే బలవంతాన సుమతిని సుబ్బారావుకిచ్చి పెళ్ళి చేశారు. 

    "అయినా వంక పెట్టేందుకేమీ లేదుగానీ, నన్నసలు నోరు తెరచి అభిప్రాయం చెప్పనివ్వనేలేదు" ఉక్రోషంగా బుంగమూతి పెట్టి స్నేహితులతో చెప్పుకున్నాడు సుబ్బారావు. 

    మూడు నిద్దర్లకెళ్ళాలంటూ మళ్ళా సుమతి పుట్టింటికి తరిమారు సుబ్బారావుని. "అబ్బే నాకు వాళ్ళంతా కొత్త. నువ్వూ రమ్మ"న్నాడు తల్లిని. "మూడు నిద్దర్లు నీకా - నాకా. ఆట్టే నకరాలు చెయ్యక వెళ్ళి రమ్మం"టూ గద్దించింది ఆవిడ. 

    మహా గొప్ప మర్యాదలు చేశారు అత్తారింట్లో. వెళ్ళగానే కాళ్ళకి నీళ్ళందించారు. మరో రెండు నిముషాల్లో అత్తగారు చిక్కటి కాఫీని 'దబర'మంత గ్లాసులో తీసుకు వచ్చింది. అంత కాఫీ ఏమిటంటూ సగానికి సగం తగ్గించి త్రాగి మొహమాటంగా త్రేన్పు ఆపుకున్నాడు. ఓ నాలుగయిదు రకాల టిఫిన్లు చేయించి బ్రేక్‌ఫాస్ట్‌కి రమ్మని పిలిచారు. నాజూగ్గా రెండిడ్లీలు మాత్రం తినిలేచాడని బోలెడంతగా నొచ్చుకుని "రుచిగా చేయించక్కర్లేదా" అంటూ మామగారు అత్తగార్ని కేకలేయడం సుబ్బారావు చెవినపడింది. అంత మెల్లగా మందలించారాయన.  వంటావిడతో రకరకాల వంటలు చేయించి టేబిల్ నిండా సర్దార్ కంచాలు పెట్టుకోడానిక్కూడా చోటు లేకుండా. అన్నీ టేబిల్ మీదే ఉన్నాయని మరి సెల్ఫ్ సర్వీస్ అనుకుంటున్నారా?! అదంతా ఏంలేదు. అత్తగారూ, మామగారూ చెరో ప్రక్కా నుంచుని పోటాపోటీలుగా వడ్డించసాగారు. సుబ్బారావుది మొదట్నుంచీ కాస్త నాజూకు తత్త్వం. ఒక్కసారిగా అన్నిపదార్థాలూ అంతంత క్వాంటిటీలో ఒకేచోట చూసేసరికి తలతిరిగిపోయింది. ఏ పదార్థానికి అదే రుచిగా ఉండటంతో, మీగడ పెరుగు తనకంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని ఫీలయిపోయింది. మొత్తం మీద కుర్చీలోంచి లేవడానిక్కూడా మరొకరి సాయం అడిగేటంత తినిపించారు.  సరే కాస్సేపు విశ్రాంతి తీసుకోమని ఓ హంసతూలికా తల్పాన్ని చూపించారు. ఎయిర్ కండిషనర్ ఆన్ చేసి వెళ్ళిపోయారు మామగారు.  మంచి నిద్ర పట్టింది. 

    మెలకువ వచ్చేసరికి గుమ్మందగ్గర నిలబడి వినపడీవినపడనంత మెల్లగా ఏదో చెప్తున్న సుమతి కనిపించింది. "ఇలారా. ఏమిటలా గొణుగుతావ్? కాస్త దగ్గరగా వచ్చి గట్టిగానే చెప్పవచ్చుగా" అన్నాడు సుబ్బారావు. దానికే బోలెడంత సిగ్గు పడిపోయింది. 'అంతలా సిగ్గేసే మాటలు ఏం మాట్లాడానబ్బా' అనుకుంటూ విస్తుపోయాడు సుబ్బారావు. 

    "ఉదయం నుంచీ మొహమాటంతో మీరేం తినలేదనీ, ఈ అలమారాల్లో ఉన్న కారియర్లలో కజ్జికాయలూ, లడ్లూ, మైసూర్‌పాక్, మినప సున్ని, చక్కిలాలూ, ఉప్పుచెక్కలూ ఉన్నాయనీ, అవి మీకు పెట్టి రమ్మని పంపింది మా బామ్మ" ఎంచక్కా చెవుల జుంకీలు ఊగించుకుంటూ మాట్లాడుతున్న సుమతి ముద్దుగా తోచినా, ఆమె మాటల సారాంశానికి నిర్ఘాంతపోయాడు. 

    తడారిపోతున్న గొంతుతో "మీకు స్వీట్ షాపున్నదా?" అడిగాడు. 

    "లేదు. ఇవన్నీ మీకోసమే మా బామ్మ చేయించింది."  

    "ఎందుకూ! నాల్రోజులు ఆఫీసుకి ఎలాగూ సెలవు పెట్టానుగా నాలుగు వీధుల్లో ఇవి అమ్ముకుంటూ తిరగనా?!"  ఎవళ్ళమీద కోపమొచ్చినప్పటికీ పెళ్ళాన్ని విసుక్కోవచ్చు అనుకున్నట్లు ఉన్నాడు.

    ఇంతలో గుమ్మం బయట అత్తగారు నుంచుని మసాలావడలూ, రవ్వకేసరీ, బాధం హల్వా కంచం సైజులో ఉన్న ప్లేటులో పెట్టినవి సుమతి చేతికందించి "అల్లుడుగారికి ఇవ్వమ్మాయ్" అన్నది. అత్తగారేమన్నా అనుకుంటుందేమో అని అందుకుని ప్రక్కన పెట్టేశాడు.  

    స్వతహాగా సుబ్బారావు కలుపుగోలు మనిషి. కాస్త కొత్త తగ్గి స్వతత్రంగా ఇల్లంతా తిరగసాగాడు. అతన్ని చూసి తెగ ముచ్చటపడి పోయారు సుమతి పుట్టింటివాళ్ళు. 

    "మీకు నాజూకైన హెల్దీ ఫుడ్ అలవాటనుకుంటాను. ఉండండి. మీకు నేను స్వయంగా చేసిస్తాను. ఈ రోజుల్లో అందరూ ఎలా తింటారో మీ అత్తగారికంతగా తెలీదు" అంటూ చకచకా నాలుగు కారట్లూ, కీరదోసకాయ, ఉల్లిపాయ ముక్కలు చక్రాల్లా పలచగా తరిగి పైన కాస్త ఉప్పూ, ఛాట్ మసలా చల్లి అల్లుడుగారికి ఆప్యాయంగా అందించారు మామగారు. ఆనూనె వంటలకన్నా ఇవి మేలనిపించి ఏవో నాలుగు తిన్నాడు సుబ్బారావు. 

    రాత్రి భోజనానికి పొట్టలో చోటులేదన్నా వినక బలవంతం చేయసాగారు. పైగా ఆకలి పెంచే మందేదో ఉన్నదిట. అది వేసుకుంటే అంతా సరవుతుందంటూ సలహా కూడా ఇచ్చారు. 'మరీ ఇంత అర్భకపు తిండయితే ఎలాగం'టూ ఒహటే బాధపడిపోయారు. "నీ తిండి కూడా ఈ లెవెల్లోనే ఉంటుందా" హడలిపోతూ అడిగి సుమతిని ఎగాదిగా చూస్తూ "నిన్ను చూస్తే అలా లేవులే మరి" అన్నాడు సుబ్బారావు. అతడి మాటలు అర్థం కానేలేదు సుమతికి. 

    బయట తిరుగుతూ  ఉంటే కాఫీయో, కూరముక్కలో తినటానికో, త్రాగటానికీ ఇస్తూనే ఉన్నారని, ఆ ధాటికి తట్టుకోలేక, మరునాడు గదిలోనే మంచం మీద పడుకుని వీక్లీ చదువుకోసాగాడు. పనీపాటా లేదాయె, కడుపు ఫుల్ లోడ్‌లో ఉంటోంది. దానితో వేళ కాకపోయినా నిద్ర పట్టేసింది. ఉన్నట్లుండి ఏవో శబ్దాలు వినిపించి కళ్ళు తెరిచి చుట్టూ పరికించి చూశాడు. కొంచెం సేపటికి కిటికీ కర్టెన్ సందులోంచి ఎవరో తొంగిచూస్తున్నట్లు రెండు కళ్ళు కనిపించాయి. గుండె గుభేలుమన్నది. నిజమా, కలా అని పరికించి చూశాడు. ఎవరూలేరు. మరో నిముషంలో మళ్ళీ ఎవరో కనిపించారు. కిసుక్కున నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోయింది ఆశాల్తీ. పాపం చెప్పొద్దూ బిక్కచచ్చిపోయాడు మన సుబ్బారావు. ఎంతసేపట్నుంచి జరుగుతున్నదో ఈ కార్యక్రమం అనుకుని సర్దుకుని లేచి కూర్చున్నాడు. బయటినుంచీ సుమతి బామ్మగొంతూ మరెవరెవరివో ఆడవాళ్ళగొంతులు వినపడ్డాయి. సుబ్బారావుని స్నానానికి పిలవడానికి వచ్చిన సుమతిని దొరకబుచ్చుకుని"మీ బామ్మేమన్నా జంతుప్రదర్శనశాలలో పనిచేసిందా మునుపు? నన్నేదో బోనులో జంతువల్లే చూపిస్తుంది ఏమిటావిడ?" ఉక్రోషానికి కోపం మేళవించి ఆరున్నొక్కరాగాలాపనకి సిద్ధమయిపోయాడు. 'కంట్రోల్ యువర్ సెల్ఫ్ మిష్టర్ సుబ్బారావ్' అని తనని తానే ఓదార్చుకున్నాడు. 

    "మా పనమ్మాయి ఇంటిదగ్గర వాళ్ళండీ. మిమ్మల్ని చూట్టానికొచ్చారు" అన్నది సుమతి. కొంచెం చొరవ ఏర్పడ్డట్టున్నది లెండి. "అలాగేం. మనిషికింత అని టికెట్టు కూడా పెట్టాల్సింది" అన్న సుబ్బారావు మాటలకి 'ఉష్... వాళ్ళకి వినబడుతుంది'అన్నట్లు చేతులూపుతూ సైగలు చేసింది సుమతి. 

    స్నానానికి టవల్ భుజానవేసుకు బయల్దేరిన సుబ్బారావుని చూపించి "మా మనుమడుగారు. మా మనుమరాలు సుమతి పెనిమిటి" పరిచయం చేసింది బామ్మ. మర్యాదగా ఉండదనిపించి ఆగి 'నమస్కారమండీ' అన్నాడు సుబ్బారావు టవల్ భుజాలమీంచి జారకుండా గట్టిగా పట్టుకుంటూ. "తరతరాలుగా మన ఇంట్లో వీళ్ళే బట్టలుతికేది" అంటూ బామ్మ చెప్పిన మాటలకి తలదిమ్మెత్తిపోయింది. కోపం నషాళానికంటింది. "అయ్‌బాబో.తవఁరు నాకు దణ్ణవెడతారేటయ్యా" కంగారు పడిపోయిందావిడ. చేయాల్సిందంతా చేసి, తీరుబడిగా చేతిలో ఉన్న తమలపాకుల డబ్బా తెరిచి వక్కపొడి నోట్లోవేసుకుంది బామ్మ. బామ్మకున్న ముఖ్యమైన అలవాట్లు మూడు. ఒకటి వక్కపలుకు, రెండు గవ్వలాట; ముఖ్యమైన మూడోది అవసరమున్నా లేకున్నా ఫేస్క్రీములా తలకు తలనొప్పికి రాసుకునే బాం రాసుకోవడం. ఏదీ ఆపదు

    ఇలా, అలా, ఎలాగో అలా మూడురోజులయిపోయాయి. 

    హనీమూన్‌కి వెళ్ళిరమ్మని టిక్కెట్లందించారు మామగారు. "విజయవాడలో స్టేషనుకి మా అన్నయ్యగారబ్బాయి, కోడలు వస్తారు. అక్కడ రైలు కొంతసేపు ఆగుతుంది లెండి" సుమతి తండ్రి వీళ్ళరైలు బయలుదేరబోతుండగా చెప్పాడు. 'అలాగలాగే'నంటూ బుర్ర గిరగిరా తిప్పాడు సుబ్బారావు. విజయవాడ స్టేషను వచ్చేముందు "ఈలోగా కాస్త ముఖం కడుక్కుని వస్తాన"ని వెళ్ళింది సుమతి. సుమతి తిరిగివచ్చేలోగానే స్టేషను వచ్చేసింది. ఎక్కేవాళ్ళూ దిగేవాళ్ళతో తొక్కిడిగా ఉన్నది. ఓ చెక్కపెట్టె పార్సిల్‌తో ఎక్కినతనితో అందరూ దెబ్బలాడసాగారు. పెట్టెగట్టిగా తగుల్తున్నదంటూ. ఆ పెట్టె ఆసామీ సరిగ్గా సుబ్బారావు ఎదుటిసీట్లోకి వచ్చి కూర్చొన్నాడు. ఆ పెట్టెకున్న మేకుకి సుబ్బారావు పాంటు పటుక్కన్నది. ఆ పెట్టెసొంతదారు దోవలో పెట్టె అడ్డమనుకుని జరుపబోయినట్టున్నాడు. సుబ్బారావు పాంటు కాస్తా అరచేయంత మేర చిరిగిపోయింది. చెప్పొద్దూ చాలా కోపమొచ్చేసింది సుబ్బారావుకి. 

    "చూసుకోవద్దుటండీ. లగేజీ ఎలాగంటే అలాగేనా పెట్టేదీ" ఇంకా ఈ డైలాగులు నోటి నుంచి బయటికి రానేలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన సుమతి "ఏరా అన్నయ్యా బాగున్నావా? ఎలా ఉన్నారొదినా?" అంటూ ఆ పెట్టె శాల్తీని పలకరించింది.   దాంతో షాకయ్యాడు సుబ్బారావు. సుమతీవాళ్ళ పెళ్ళికి సదరు పెట్టె అన్నయ్య రాలేదు. అందుకేమరి సుబ్బారావు వాళ్ళకీ, వాళ్ళు సుబ్బారావుకీ తెలీదు. 'వీరే మీ బావగారం'టూ పరిచయం చేసింది. 

    "అయ్యో... క్షమించండి బావగారూ. ఇంతసేపూ మీరు పక్కనే ఉన్నా మాట్లాడనేలేదు. ఏదీ  మీ పెళ్ళికి రావటం కుదర్లేదు" తో మొదలు పెట్టి ఏమిటేమిటో ఏకరువు పెట్టసాగాడతను. రైలు కదలబోతుండగా కిందికి దిగుతూ చెప్పాడు ఆ పెట్టెలో మామిడి పళ్ళున్నాయనీ, అవి వీళ్ళకోసమేననీ. ఖంగు తిన్నాడు సుబ్బారావు. 

    "ఏకంగా ఇన్నిపళ్ళు ఇద్దరికోసమా. నాచేత ఏమన్నా పళ్ళవ్యాపారం పెట్టించే ఆలోచన ఉన్నదా మీ అన్నయ్యకి. అయినా ఎక్కడా దొరకనివా ఏమిటి. ఎవరయినా రెండో, మూడో ఇస్తారు. ఇ...న్నా..."విసుక్కున్నాడు సుమతి మీద. 

    "అవునండీ ఇవి వాళ్ళ తోటలో పళ్ళు. అమృతంలా ఉంటుంది రుచి" వివరించింది సుమతి. 

    "ఈ ఎండకి ఆ పళ్ళు నిలవవు. అలాగని రైల్లో కూర్చుని ఈ పళ్ళన్నీ తింటే ఇంక ఇంతే సంగతులు" వెటకారంగా చేతులూ, కళ్ళూ తిప్పుతూ చెప్పాడు. 

    "పోన్లెండి. కోప్పడద్దు. పెట్టెలో పళ్ళు రైల్లో మనతో ప్రయాణం చేసే వాళ్ళందరికీ ఇచ్చేస్తే సంతోషంగా తింటారు" శాంతపరుద్దామని అన్నదేకానీ, అగ్నిలో ఆజ్యం పోసినట్లవుతుందనుకోలేదు. 

    "వద్దుతల్లీ... కొత్త గొడవలేవీ వద్దు" కంగారుగా అడ్డుకున్నాడు. 

    "అయినా మీ పుట్టింటి వాళ్ళంతా తిండికే ప్రాధాన్యం ఇస్తారేమిటి?" అన్న సుబ్బారావు మాటలకి "మరి ఎవరయినా అందుకే కదండీ కష్టించి సంపాదిస్తారు" అంటూ జీవితరహస్యం వివరించింది సుమతి. 

    అప్పటి నుంచీ అత్తవారింటి మర్యాదలంటే హడల్ సుబ్బారావుకి. ఇప్పటికీ అత్తారింటికి వెళ్ళాలంటే ముచ్చెమటలు పోస్తాయి అతనికి. షష్టి పూర్తయ్యాకయినా లెస్ లగేజ్‌తో హనీమూన్‌కి జాలీగా వెళ్ళాలనుకుంటున్నాడు సుబ్బారావు సుమతి పుట్టింటి వాళ్ళకి తెలియకుండా. 

(ఆకాశవాణి మద్రాసు కేంద్రం నుండి ప్రసారితం)    
Comments