ఆలోకనం - రమగమిని

    
ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం వేళే చీకట్లు కమ్మేస్తున్నట్లుంది. గుడి తలుపులు వేస్తుంటే వచ్చాడు మేస్త్రీ సుబ్బారావ్! "రేపు గ్రహణమంట కదండీ పూజారిగారూ! మరో పక్క ఈ తుఫానొకటండి" అంటున్నాడు.

    గర్భగుడి గ్రిల్ తలుపు మూసేసి, పరదా లాగాను. పెనుగాలి వీచింది. మరింతగా ఆకులు, ఇసుక ప్రాంగణంలో నిండాయి. మేస్త్రీ ఆకుల్ని కాళ్ళతో అటూ, ఇటూ నెట్టాడు.

    "ఏంటండీ పూజారిగారూ! పేరుకే 'రత్న హనుమాన్' కనీసం ప్రహరీ అయినా లేని గుడి. ఏ సంబరాలు, వైభోగాలు లెవ్వండి మన స్వామికి. కానండీ, ఇట్టాంటి విగ్రహం గోదారి జిల్లా అంతట్లో మరోటి లేదంటండి. రాజుల నాటిదంట. మనిషెత్తు రూపం, ఒక చేత్తో గద, మరో చేతిలో పాము తోక... ఆ! హుషారుగా అంటూ నా వెనకే నడిచాడు.

    నేను మౌనంగా మెట్లు దిగి, నడక సాగించాను.

    "అన్నట్టండీ, మీ ఇంట్లో పాతకాలం పందిరి మంచం ఉందంట కదా" అడిగాడు సుబ్బారావ్.

    అవునని తల ఊపాను. అది మా ముత్తాత గారిది. పరిచేందుకు నా ఇల్లు చాలదు. నా చిన్నప్పట్నుండీ, విడిపలకలుగా అటక మీదే ఉంది.

    "కరణంగారింటి ముసలామె ఒకే నస. మునిమనవడికి ఆ మోడలే చేయించుద్దంట. కాస్త తీసి పెడ్తురూ, చూస్కుంటాను" మరోసారి చెప్పి కదిలాడు సుబ్బారావు. 

    ఇంటిదారి  పడ్తున్న నేను, అలవాటుగా గోదావరి పాయి దగ్గర ఆగాను. వాయుగుండం ప్రభావంతో ఉరకలేస్తోంది గోదావరి. ఏ రాజకీయ నాయకుల దయకీ నోచని చిన్న ఊరు మాది. మా వంశం అంతా ఈ ఊరి దైవం 'రత్న హనుమాన్'కి పరమ భక్తులు. ఆ గుడి పౌరోహిత్యం తరతరాలుగా మాదే. నేను మా తాతగారి దగ్గరే పెరిగాను. ఆంజనేయుణ్ణి మనసా, వాచా నమ్ముకున్నాను. ఈ ఊరి ప్రతి అణువు హనుమాన్‌తో ముడిపడినదే. తాతగారి మాటలు మరపుకు రావు.

    "ఈ గోదారికి అంత పొంగు ఎందుకో తెలుసా? అల్లదిగో, ఆంజనేయుడు ఆటలాడుతున్నాడు. తోక తడవకుండా పిల్లిమొగ్గలేస్తానని పందెం వేసి, కవ్విస్తున్నాడు." ఎటు నుండి పడ్తాయో, గోదాట్లోనూ, నేల మీదనూ పచ్చటి పూలే కన్పిస్తాయిక్కడ. "స్వామి రాత్రి వ్యాహ్యాళికి వెళ్ళి, ఆ అడవిపూలు త్రెంచుకుని, భద్రాచలం పోయి సీతమ్మ, రామయ్యలని సేవిస్తారు. మిగిలిన పూలని ఇలా దులిపేస్తారు!" ఈ మాటలేవీ కథలుగా అన్పించలేదు నాకెప్పుడూ. నమ్మకంగా నా అణువణువులో నిండిపోయాయి."మన తాతతరానికి బోలెడు ఆస్థి ఉండేది. మనకి మిగల్లేదు. విచారించకూడదు. స్వామినే కొలుచుకోవాలి. ఏదో నాడు, వాకిట్లో డబ్బు మూట విసిరేస్తారు!" ఇలా ఎన్నో జ్ఞాపకాలు.

    నా బాల్యం, యవ్వనం అంతా పేదరికంలోనే గడిచింది. రెండుసారు ప్రభుత్వోద్యోగావకాశం వస్తే, స్వామిని వీడలేక వదిలేశాను. స్వామి భక్తి నన్ను పేదరికంలోనూ ఆనందంగా ఉండేలా చేసింది. నా శక్తి కొద్దీ తమ్ముళ్ళనూ, చెల్లెలినీ స్థిరపరిచాను. కూటంలాంటి ఇంట్లో, చాలీచాలని భోజనంతోనే, నా భార్యా పిల్లల్ని పోషించుకున్నాను. ఆంజనేయుడికి మహా భక్తురాలు నా భార్య. నా పేదరికాన్ని, బాధ్యతలనూ, కష్టాలనూ సమంగా పంచుకుంది. ఎంతటి కష్టంలో ఉన్నా 'ఆంజనేయ' అని స్మరిస్తే చాలు, కొండంత ధైర్యం చేకూరేది.

    ఈ మధ్య, నా సంసారం ఒడిదుడుకులతో తల్లక్రిందులవుతోంది. నా కూతురి కాపురం డబ్బు కారణంగా కూలిపోయేలా ఉంది. ఎదిగిన నా కొడుకు చదువు, పెను భారమై నన్ను ప్రశ్నిస్తుంది. నా భార్య ఆరోగ్యం క్షీణించేలా ఉంది. దిగులు సుడిగుండంలా నన్ను చుట్టేస్తుంది. అయితే దిగులుకి కారణం ఈ సమస్యలు కావు. వీటి నేపథ్యంలో, చాపక్రింద నీరులా ఒక ఆలోచన నాలో చోటు చేస్కుంది. "దేవుడున్నాడా?" 

    అవసరాల కోసం, దేవుణ్ణి ఏనాడూ ప్రార్థించలేదు నేను. కానీ, ఈ సందేహం, చిన్న బీజంగా నాలో మొదలై వట వృక్షమైంది. నా ఆనందాన్ని, చిరునవ్వునీ నాశనం చేస్తుంది. "ఈ సుప్రభాత సేవలు, హారతులు, మంత్రాలు అందుకునే నాథుడు లే...డే...మో! నమ్మితే అన్ని సత్యమట! అంటే...? నమ్మకపోతే అసత్యమా? నా నమ్మకంతో పనిలేకుండా ఆకాశం, భూమి, కొండలు, సముద్రంలా 'దేవుడు' లేడా?" ఈ ఊహ నన్ను ఓ స్తబ్ధతలోకి తోసేస్తోంది. నాకు జీవితమ్మీదే ఇచ్చ లేకుండా చేస్తోంది. దైనందిన జీవితంలో భాగంగా పూజలు చేస్కునే వారికి నా బాధ అర్థం లేనిదన్పించవచ్చు. కానీ, భగవంతుడితో ప్రగాఢానురాగాన్ని ఉగ్గుపాలతో నాలో రంగరించుకున్నాను. చేసే ప్రతి చర్య దేవుడు చూస్తున్నాడనీ, అనుక్షణం స్వామి కట్టి కాచుకుంటాడన్న అచలిత విశ్వాసంతోనే బ్రతికానిన్నాళ్ళూ! అమృతభాండంలో విషపు చుక్కలా, ఈ చీడపురుగులాంటి ఆలోచన నాలో ప్రవేశించింది. భక్తిప్రపత్తులతో, ప్రేమతో పౌరోహిత్యం చేసేవాణ్ణి. ఇప్పుడు అనుభూతి లేదు. దీపారాధన చేస్తున్నా, నైవేద్యం పెడుతున్నా ఒక నిర్లిప్తత! 'ఇదో ఆచారం మాత్రమే! నా ఉద్యోగ ధర్మం' అన్న భావం నా గుండెల్ని ముక్కలు చేస్తోంది. "కలడు కలడనువాడు కలడో లేడో" అంటూనే గజేంద్రుడు ప్రాణం వదిలేశాడా?" "రామా రామా" అని కలవరితూనే కడతేరిపోయాడేమో రామదాసు! ఆ తర్వాత సాక్షాత్కారాలన్ని భక్తుల ఊరట కోసం, నమ్మకం కోసం కవులు కల్పించారేమో! టపటప వాన చినుకులు! ఇంటి వంక కదిలాను! అండగా హనుమాన్ ఉన్నాడని అన్ని కష్టాలనూ ఓర్చి ఎడారిలాటి జీవితంలోనూ ఆనందంగా నడిచాను. సగం దూరం అయ్యాక చూస్తే... నేను ఒంటరిగా ఉన్నానేమో అన్న భావం దిగులుతో ముంచేస్తుంది. 

* * * 

    ఇంటికొచ్చాను. పీటవాల్చి ఉంది. ఎదురుగా ఒకే కంచంలో భోజనం. భాగ్యం కోసం చూశాను. దుప్పటి పరుచుకుని పడుకుని ఉంది. గుండె కలుక్కుమంది. చేతిలో మట్టిగాజులు, మెళ్ళో పసుపుతాడు, ముఖంలో చిరునవ్వే ఆభరణాలుగా నట్టింట్లో తిరుగుతూ రాత్రి పొద్దుపోయే దాక ఏదో పన్లో ఉండే ఆమె, ఈ మధ్య పట్టపగలే పడుకుండిపోతోంది. దగ్గరకెళ్ళి మీద చేయి ఆనించాను. "ఒంట్లో బాలేదా... భోంచేశావా" పలకరించాను.

    కళ్ళు తెరిచింది."ఆఖరి మంగళవారం ఉపవాశాం" కంఠంలో నీరసం! నిట్టూర్పు విడిచాను. ఆమె పెదవిలో బిగపట్టిన దుఃఖం. "డబ్బు సమకూరి, అమ్మాయి కాపురం నిలబడ్తే, హరి చదువు ఒక దారికొస్తే... స్వామికి ఆకుపూజ చేసి, వడమాల వేస్కుంటాను"

    నేను రెండు క్షణాలు ఆమె వంక చూసి వచ్చేశాను. భోజనానికి కూర్చోబోతుంటే, మేస్త్రీ అడిగిన పందిరి మంచం గుర్తొచ్చింది.

* * *   
  
    అటక మీది పలకల్ని హరికి అందించాను. 'మధ్య పలక ఏది?' వెతికాను. అటు చివర్న కన్పించింది. దానిపై పేర్చిన ట్రంకు పెట్టెలు, గోనె సంచీలు! ముక్కుకి కండువా అడ్డుపెట్టుకుని భద్రంగా దాన్ని లాగాను. హరికి అందివ్వబోయే నేను, దాని మధ్య బిగించిన అద్దం పగిలి ఉండడం చూశాను. మెల్లగా అద్దం బైటికి లాగేశాను. అక్కడో మూట ఉంది. తెరిచాను. గులాబీరంగులో మెరిసే పట్టు వస్త్రంలో చుట్టిన ఒక వస్తువు జారిపడింది.ఆశ్చర్యపోయాను! ఈనాటిదాకా నేను దాన్ని చూడనేలేదే! ఇంత గుప్తంగా దాచారేంటి? బట్ట తొలగించాను. ఒక పుస్తకం. నా భృకుటి ముడిపడింది. తీశాను.

    రహస్యం:

    ఆ అక్షరాలు చూడగానే ఉలికిపాటు కలిగింది. 'ఏంటి రహస్యం!'

    "నాన్నగారూ! సుబ్బారావ్ వచ్చాడండీ"

    హరి పిలుపు. చప్పున పుస్తకం మూసి, నా నడుముకి కండువాతో కట్టేస్కున్నాను. పలక అందించి, నిచ్చెన దిగాను. చకచక భోంచేస్తున్నాను. 'ఏదో తెలుసుకోబోతున్నానని' అన్పిస్తోంది. నా కళ్ళు అటక వంక తిరిగాయి. తాతగారు గుర్తుచ్చారు. ఎనభై ఏళ్ళకి కూడా కడ్డీలా ఉండే ఆయన, ఒకనాడు హఠాత్తుగా కాలుజారి పడ్డారు. ఆయన మాట పడిపోయింది. మంచం నుండి  అటక వంక చూస్తూ గోలగోలగా ఏడ్చారు. అర్థం కాక అక్కడి ప్రతీ సంచీ దింపి ఆయనకి చూపించాను. అసంతృప్తిగానే కన్ను మూశారాయన. ఆయన చెప్పదల్చుకుంది ఇదేనేమో!

    "నాన్నా! భువనత్తా, పిల్లలు వచ్చారు"

    హరి మాటలకు తలెత్తి చూశాను. క్షణంలో ఇల్లంతా సందడి. నాకిక ఒక క్షణం గడబనట్లుంది. చేయి కడిగేశాను. పని ఉందని చెప్పి బైటకొచ్చేశాను. 

    గుడి చేరుకుని, దొంగలా వెనక్కి వెళ్ళాను. మనిషి కన్నా ఎత్తు సరుగు చెట్లు పిచ్చి మొక్కలు, గడ్డి భయం గొలిపేలా ఉంటుందక్కడ. చోటు చూస్కుని కూర్చున్నాను. పుస్తకం తెరిచాను. మడతలుగా ఉన్న పేజీ విశాలంగా తెరుచుకుంది. నిలువెత్తు ఆంజనేయుడు! 'రత్న హనుమాన్'. గుండె ఝల్లుమంది. మరో పేజీ తెరిచాను. బంగారు రంగు అక్షరాలు!

    "రాజా రాఘవ భూపతి, ఈ ప్రాంతాన్ని కన్న తండ్రిలా పాలించారు. ఒకనాడు, ఆంజనేయుడు స్వప్నంలో సాక్షాత్కరించి తనకు రత్నాల హారం చేయించమని అడిగారట. రాజు మహదానంద భరితుడై, స్వామికి హారంతో పాటు రత్న కిరీటం, మొలత్రాడు, ఆభరణాలు చేయించి, ఆస్థానంలోని స్వామికి అలంకరించి ఉత్సవాలు చేయించారు. అటు పిమ్మట స్వామి మరల కలలో దర్శనం ఇచ్చారట! నగలన్నీ తీసేసి, ఒక్క రత్నాల హారాన్ని మాత్రం తీస్కొని ఎగురవేస్తూ, గిరగిరతిప్పుతూ, ఆడుకుంటూ అడవిలోనికి వెళ్ళి, ఒక చోట ఆ హారాన్ని పడవేసి, దానిపై తన కాలిని ఉంచి, ఒక చేత్తో గద, మరో చేత్తో పాముతోకతో...శిలాప్రతిమలా ఉండిపోయారట! మేలుకున్న రాజు అచ్చం, కలలో తాను చూసిన విధంగా స్వామి విగ్రహాన్ని చేయించి 'రత్నహనుమాన్' అన్న నామంతో ప్రతిష్ఠించారు. అక్కడ రహస్యంగా స్వామి ఎడమకాలికి పక్కగా ఒక అర చేయించి, అందులో బంగారు చెంబులో ఉంచిన రత్నాల హారాన్ని భద్రపరిపించాడు. ఇది మన వంశం వారికి మాత్రం తెలియవలసిన రహస్యం! గుడి మరమ్మత్తులు జరిపే తరుణంలో, ఆ హారాన్ని భద్రపరచి మరల యథాస్థానంలో ఉంచవలెను. ఇది స్వామి ధనం! తస్కరించాలని చూస్తే, స్వామి ప్రచండ రూపంలో సాక్షాత్కరించి సంహరిస్తారు!" కళ్ళ ముందు ఈ సంఘటనలన్నీ చూసినట్లు ఉంది.

    నాకు ముచ్చెమటలు పట్టాయి. "ఇది నిజమా! ఈ కథ తాతగారి నుండి వినలేదే! రాజా వారంటే ఎప్పటి మాట? ఈ నాటికీ ఆ హారం ఉందా?" ఈ ఊహకే విద్యుత్తు ప్రవహించింది నాలో! మరో చిన్న పర్సు ఉంది. చప్పున తెరిచాను. ఒక తాళం చెవి. గుండె దడ హెచ్చింది. ఇది ఆ రహస్యపుటరదా? పుస్తకాన్ని భద్రపరిచి, చుట్టు తిరిగి గుడి ప్రాంగణానికొచ్చాను. రెపరెపలాడే పరదాని తొలగించాను. నిలువెత్తు హనుమాన్! ఒక చేత గద, మరో చేత పాము తోక! గుండెపై చాచి కొట్టినట్టు, వెనక్కి తిరిగి పోయాను. మొట్టమొదటిసారి ఆ విగ్రహాన్ని చూసినట్లు అదురుపాటు కలిగింది.

    "ఈ రహస్యం, నాకు తప్ప మరెవరికీ తెలిసే అవకాశమే లేదు. ఒకసారి చూస్తే? ఆ హారం ఉందేమో! ఉంటే... అదలా భూస్థాపితం కావల్సిందేనా? నా స్వంతమైతే?" భయం జరజర వెన్నులోంచి పాకింది. గంట మ్రోగింది. ఎవరో భక్తులు. త్వరగా లేచి, గుడి తలుపు తీశాను. దీపం వెలిగించి, హారతిచ్చాను. నా కళ్ళు స్వామి ఎడమకాలు వంక పాకాయి. చేతుల్లో ప్రకంపనం! గణగణమ్రోగే గంటలో అపశృతి! సాహసం చేయమంటుంది మనసు! అయోమయంలోకి జారిపోతున్నాను. ఆ హారం నాదైతే, ఇక ఏ బాధలూ ఉండవు. నా కష్టాలన్నింటికి డబ్బే పరిష్కారం. నేనేంటి? నా తర్వాతి తరాలు కూడా దర్జాగా బ్రతకొచ్చు. కానీ... ఇది సాధ్యమా? నాలో సంఘర్షణ. నాపై నేను యుద్ధం. కాసేపటికి, నా తెగింపే గెలిచింది. ఈ అవకాశాన్ని వదిలితే, జీవితం ఇక ఇంతే! రేపు గ్రహణం! పగలంతా గుడి ముసేస్తాం. పట్టపగలు అసాధ్యం కనుక, ఈరాత్రికే పని పూర్తి కావాలి. ఇంట్లో ఏం చెప్పాలి! అసలేం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఒక ప్రణాళిక నాలో రూపు దిద్దుకుంది.

    సాయంత్రం ఏడు గంటలు దాటింది. గాలి ఊపు అందుకుంది. ఆవరణలోని ఒక్క బల్బు మిణుకుమిణుకుమని ఆరిపోయింది. వాతావరణం బీభత్సంగా ఉంది. దీపం వెలిగించి కంతలో పెట్టాను. వసారాలో కూలబడిపోయాను.

    "తప్పు చేస్తున్నానా?  భాగ్యానికి తెలిస్తే, ఇక నా ముఖం చూడదు. నియమ నిష్ఠలకీ, భక్తి ప్రపత్తులకీ మారుపేరు అన్న ఇన్నేళ్ళ గౌరవ మర్యాదలు మట్టిలో కలుస్తాయి. పూర్వీకుల ఆత్మలు ఘోషిస్తాయి. ఈ జీవనాధారమూ పోతుంది. ముందు జీవితం లేకపోగా, మరణానికీ అర్హత ఉండదే!" తల విదిలించాను. నా పిరికితనం మీద నేనే విరుచుకు పడ్డాను.

    "ఎవరికీ తెలియదు. ఒక పక్క తుఫాను. మరోవైపు గ్రహణం! అర్థరాత్రి ఎవరొస్తారు? పట్టపగలే భక్తుల కొరత. ఈ భయంకర వాతావరణంలో మానవ మాత్రులు రాగలరా?" డబ్బుమన్న శబ్దం. ఉలిక్కిపడ్డాను. ఎవరో దూకారు. "ఎవరూ?" పెద్దగా అంటూ లేచాను. దీపం తీసుకొచ్చి, అరచేయి అడ్డుంచి చూచాను. చీకట్లో పొడుగ్గా, దృఢంగా ఉన్న ఆకారం. ఎందుకో భయం వేసింది. వెలుతురు చూసి, దగ్గరగా వస్తోందాకారం! కాసేపటికి స్పష్టత చేకూరింది. ఒక యువకుడు. హఠాత్తుగా కరెంటు వచ్చి, బల్బు వెలిగింది. నా కళ్ళు చెదిరినట్లయ్యాయి. దబ్బ పండు ఛాయ. గోధుమ రంగు కళ్ళు. భుజాల దాకా వ్రేలాడే జుత్తు. విశాలంగా ఉన్న వక్షస్థలం. అందమైన ముఖం! నన్ను చూసి నవ్వాడు. చిగుర్లు కన్పించేంత విశాలమైన నవ్వు. చాలా ఆకర్షణీయంగా ఉంది. తన గుండెపై చేయి ఆనించుకున్నాడు.

    "అంజి! పక్క ఊరు. బండి పంక్చర్. వాన. ఇటొచ్చా" ముక్కలుగా ఉన్న ఆ మాటలు ముద్దుగా ఉన్నాయి.

    "ఏం పేరు? అంజా? పక్కూరి కాలేజా! నిన్నెప్పుడూ చూళ్ళేదే" అడిగాను. ఆ కాలేజీ కుర్రాళ్ళు చాలా మంది నాకు తెలుసు.

    మళ్ళీ నవ్వు! "నువ్వు తెలుసు! చూశా! హారతిస్తావ్‌గా" చేతిని తిప్పి చూపించాడు.

    ఆ అందం, మాటల్లో ఆత్మీయత నన్నా క్షణం కట్టేశాయి. వాన జోరందుకుంది.

    అంజి అటు, ఇటు ఆవరణలోకి తిరుగుతున్నాడు. ఒకే సందడి. జరజరా స్తంభం పట్టుకుని గుడిపైకి ప్రాకాడు.

    "ఏంటది? దిగు" గద్దించాను.

    టక్కున తలతిప్పి నన్ను చూశాడు. వెంటనే విచ్చుకున్నాయి అందమైన పెదవులు! ఒక్కంగలో దూకాడు. నాకైతే నడుం విరిగిపోయేదే! కాసేపు నన్నంటుకున్నట్లు కూర్చున్నాడు. అంతలో ఒక్క పిల్లిమొగ్గ వేసి గర్భగుడి చేరుకున్నాడు. ఆదూకుడు, వేగం, శక్తికి ఆశ్చర్యం కలుగుతోంది.

    "ఏంటి? ఈ చేతిలో ఒక్క తోకే? పాము ఏది" అంజి ప్రశ్న!

    నేను వెనుదిరక్కుండానే జవాబిచ్చాను. "అదృశ్య రూపం! దుష్ట సమ్హారం చేసేటప్పుడు, నాగుడు ప్రత్యక్షమౌతాడు" అలవాటైన సమాధానం ఇది.

    "కిస్సు" మన్న శబ్దం! పెద్దగా నవ్వుతూ తల ఊగించేస్తూ, మోకాళ్ళ మీద నడుస్తూ నన్ను చేరాడు. "అన్నీ కథలే. అది నీకూ తెలుసు. ఈ రాతి బొమ్మ, దీపం, హారతి... అన్నీ ఒట్టివే... నిజం చెప్పు" నా కళ్ళల్లోకి చూశాడు.

    దెబ్బతిన్నాను. ఒక్క క్షణం మౌనం! ఈ కుర్రాడు యువతరం! విశ్వసించడం అత్యవసరం. నా అవిశ్వాసం, అపనమ్మకం నాకే పరిమితం. మరెవరన్నా సహించను, సమర్థించను. "అన్నీ అక్షర సత్యాలే! నమాలి! నమ్ముతావు" సూటిగా అంజి కళ్ళల్లోకి చూస్తూ ఖచ్చితంగా అన్నాను.

    నన్నలాగే చూసే, ఆ ముగ్ధమనోహర వదనం నుండి, నా చూపు అతడి ఎడమ చెవి పైకి పాకింది. ధగధగ మెరిసే చింతపిక్కంత నీలం!

    గమనించినట్లు, చేత్తో పోగుని గుంజాడు. "రత్నం నాది" రహస్యం చెప్తున్నట్లు కంఠం తగ్గించి, కళ్ళు పెద్దవి చేశాడు.

    ఉలిక్కిపడ్డాను. నా మదిలో రత్నాల హారం మెదిలింది. టైం మించుతోంది. లేచేశాను అంజి చూడకుండా, నా తల ఎత్తుకి వేలాడే బల్బుని లాగేసి, గోడవారగా పెట్టాను.

    "అయ్యో చీకటి" అంటున్నాడు అంజి.

    హారతి వెలిగించాను. ఆవెలుతురులో అంజిని చూశాను. ఎప్పుడు పడుకున్నాడో, కాళ్ళు, చేతులు వెడల్పుగా చాచి, గుడి ప్రాంగణంలో వెల్లకిలా ఉన్నాడు. ఆ భంగిమలో అతడి ఒడ్డు, పొడవు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆ అవరణని ఆక్రమించుకొన్న చక్రవర్తిలా ఉన్నాడు. నన్ను చూసి అదే కొంటె నవ్వు.

    "రాత్రి ఇక్కడే ఉంటా. రేపు పోతా!"

    నా గుండె జారింది. "నయం! లే! ఇక్కడెవరూ ఉండకూడదు. స్వామి వ్యాహ్యాళికి పోతారు. మనముంటే అపచారం" లేవదీశాను.

    తల ఊగిస్తూ, చప్పట్లు కొడ్తూ నవ్వుతున్న అంజి, నా చూపుకి బుద్ధిగా తల ఊపి, నోటిపై వేలుంచుకున్నాడు.

    నేను గుడి తలుపు మూస్తూ, ఓరగా చూశాను. ఓ మూల నేనింత క్రితం అమర్చుకున్న గునపం, చిన్న కత్తి, పూలు, కొబ్బరి చిప్ప ఉన్న పళ్ళెం, ఇతర సరంజామా! తాళం వేసి పరదా లాగాను. వాన జోరు తగ్గింది. మెట్లు దిగే నా వెనకే అంజి.

    "దేవుడంటే ఆ బొమ్మేగా! అది నడుస్తుందా" అంజి కబుర్లు.

    నేను వడివడిగా నడుస్తున్నాను. "పవిత్ర హృదయం ఉంటే, స్వామి ఏరూపంలోనైనా కన్పిస్తారు. నీ బండి ఎక్కడ ఉంది?"

    జవాబియ్యకుండా, నా భుజాన చరిచాడు అంజి. "ఆ...ఆ! ఏ రూపంలో అయినా వస్తాడా? నీ రూపంలో?" ఆ మాటల్లో అల్లరి.

    ఆ వెక్కిరింత అర్థమైంది. కోపంగా చూశాను. "నా రూపంలోనూ" కటువుగా అన్నాను.

    "అంటే...నీకూ పవిత్ర హృదయం లేదులే" నవ్వుతూ చేయి ఆడించాడు.

    చెంప పెట్టులా తగిలిందా మాట!

    "ఉంటే నా రూపంలో, నువ్వు స్వామిని చూడాలిగా"

    అంజి మాట వెంటే ఎక్కడో పిడుగు పడ్డ శబ్దం! తేరుకున్నాను. "త్వరగా పద" చకచక నడిచాను.

    "పోనీ మీ ఇంట్లో పడుకోనా?" అంజి మారాం!

    "హతోస్మి! వీడెక్కడ దాపురించాడు?" తిట్టుకుంటూనే, "నేనీ రాత్రికి పట్నం పోతున్నా. ఇంట్లో ఆడవారున్నారు. నువ్వు ఉండేందుకులేదు. నిన్ను నీ ఊరి బస్సెక్కిస్తా, నడు" మరో మాటకి అవకాశం ఇవ్వదల్చుకోలేదు. 

    ఈ జిడ్డుని వదిలించుకోనిదే నా పని సాగేదెట్లా? మసక వెన్నెల! సన్నని కాలిబాటలో గబగబ నడుస్తున్నాం! వెనకే అంజి. ఆ కదలికల్లో, మాటలో ఒక జోరు. సుడిగాలిలా ఉక్కిరిబిక్కిరి చేస్తోందతడి సాహచర్యం. సహజంగా పిరికివాడైన నాకు, అంజి తోడు అంగరక్షకుడిలా ధైర్యాన్నిస్తోంది. "జాగ్రత్త" హెచ్చరించబోతున్న నా కాలే జారింది. చప్పున పట్టుకున్నాడు. ఆ పరిష్వంగంలో అతడి ముందు నేనెంత అల్పంగా, పిట్టలా ఉన్నానో అన్పించింది.

    బెదురుగా ఉన్న నా ముఖాన్ని చూసి నవ్వుతూ, భుజాల చుట్టూ చేయి వేశాడు. "పంతులూ...పంతులూ!ఊ...హ్" అరచేతులు నోటికి అడ్డుపెట్టుకుని, ఊళలాగా విచిత్ర శబ్దం చేశాడు.

    ఆ చీకట్లో, అంజి తోడు లేకపోతే వెళ్ళలేనన్న్న బేలతనం కాసేపు నన్నావరించింది.

    "నువ్వు బస్టాండుకి పో. నేనింట్లో చెప్పి, ఆఖరి బస్సుకు పోతాను" ఆగిపోయి అన్నాను.

    వీడు వెళ్తే, నేను గుడికి తిరిగి వెళ్ళవచ్చు.

    "నీకోసం ఆగుతా" పంతంగా అన్నాడు.

    ఆ క్షణం అంజి పీక నొక్కేయాలన్నంత కోపం వచ్చింది. ఉస్సూరంటూ బస్‌స్టాండు దాకా నడవాలే! "సరే నడు" పళ్ళ బిగువున అన్నాను. నా ఇల్లు వచ్చింది. "ఒక్క క్షణం" అంజిని అక్కడే ఆపి లోనికెళ్ళాను. పట్నం పోతున్నాననీ, రాత్రికి రానని భాగ్యానికి చెప్పి బయటకొచ్చాను.

    వెనకే అంజి! బస్‌స్టాండ్ చేరుకున్నాం. "అదిగో నీ బస్సు" ఆత్రంగా అటు చూపించాను.

    "నీ బస్సు ఇదిగో" అక్కడున్న పట్నం బస్సు వంక నడిపించి, భుజాలు పట్టి ఎక్కించేశాడు.

    చచ్చినట్లు ఎక్కాను. వెంటనే నా బస్సు కదిలింది. ఏడుపు వచ్చినంత పనైంది. పది నిమిషాల్లో బస్సు చీకటి రోడ్డు ఎక్కింది. ఆలస్యం చేయకుండా డ్రైవర్‌ని చేరాను. "పొరపాట్న ఎక్కాను బాబూ! ఆపవూ..." అర్థించాను.

    ఆగిన బస్సు నుంచి చకచక దిగేశాను. పై పంచె తల చుట్టూ కప్పుకుని చుట్టూ చూశాను. చిమ్మచీకటి! చుట్టూ పొలాలు. అసలైతే ఆ సమయంలో ఇల్లు కదిలే సాహసం అయినా చేయలేని నాలో మొండి ధైర్యం! వడివడిగా ఊరి వంక నడవ సాగాను. ఆ వేగానికి ఎగశ్వాస వచ్చేస్తోంది.

* * * 

    తుఫాను గాలి హోరున వీస్తోంది. వెన్నెల మాయమైంది. టపటప వాన చినుకులు. అలవాటైన డొంక దారిలో నడుస్తూ గుడి చేరుకున్నాను. బక్కపల్చగా ఉండే నేను, బలమైన పవనాల జోరుకి దాదాపు ఎగిరిపోతున్నాను. ఆకాశంలో ఉరుములు. అప్పుడప్పుడు మెరిసే మెరుపులు వెండివెలుగులనిస్తున్నాయి. గర్భగుడి తాళం తీసి, చటుక్కున దూరినట్లు లోనికెళ్ళి తలుపు వేసేశాను. ఇప్పుడు నాలో ఏ భయం లేదు. ఒక సైనికుడిలా అప్రమత్తంగా నా పథకం అమలు చేయసాగాను. 

    దీపం వెలిగించి దగ్గర ఉంచాను. స్వామి ఎడమ కాలి దగ్గర తడిమాను. ఒక చోటమాత్రమే నలుచదరమైన పలక తగిలింది. మిగిలిన స్థలం, అక్కడక్కడా విగ్రహం అడుక్కి పోతోంది. 'ఇదే!' గునపం అందుకొన్నాను. బలంగా శ్వాస తీసుకొని, గుండెల్లో నింపుకొన్నాను. దెబ్బ వేశాను. "ఖణేళ్"మన్న శబ్దానికి నిలువెల్లా ఒణికి పోయాను. నిశ్శబ్దమైన ఆ రాత్రి, గునపం అదిరిపడేలా చేస్తోంది. సాహసించి మరో దెబ్బ వేశాను. పాలరాతి పలక చక్కగా ఊడి వచ్చింది. ఆత్రుతగా తొలగించాను. లోపలి అమరిక చిత్రంగా ఉంది. అక్కడో చెక్క ఫలకం ఉంది. చాలా జాగ్రత్తగా అమర్చబడ్డ సొరుగులా ఉంది. పావు భాగం మాత్రమే బయటకు వుంది. మిగతా భాగం స్వామి తోక కిందికి వస్తుంది. ఆ చెక్క ఫలకం మీద ముద్దలుగా సీసం లాంటి పదార్థం. గునపం వేసే వీలులేదు. విగ్రహం దెబ్బ తినవచ్చు! గునపం పెట్టేసి, కత్తి అందుకున్నాను. ఆ సీసాన్ని చెక్కసాగాను. నా శరీరమంతా దిగకారే స్వేదం. చేతులు పిడి మీద జారిపోతున్నాయి. పిడి వదలి, కత్తినే రెండు అరచేతుల మధ్య బింగించాను. రక్తం కారుతోంది. లెక్క చేయలేదు. నాలో పట్టుదల. "ఒకటి హారంతో బైటకొస్తాను. లేదా శవంగా బైటకి పోతాను." పళ్ళ బిగువున సీసం మీద బలంగా కత్తిపోట్లు వేశాను. నా శ్రమ ఫలించింది. సీసం పెచ్చులు రాలాయి. తాళం చెవి పట్టే బెజ్జం స్పష్టంగా కనిపించింది.

    ఆనందంతో నోటి నుండి వెలువడ్డ శబ్దాన్ని ఆపుకుంటూ రక్తసిక్తమైన చేతుల్తోనే ముఖం తుడుచుకున్నాను. నా దగ్గరున్న తాళాన్ని తీసి, బెజ్జంలో ఉంచి, శక్తినంతా వినియోగించి లాగాను. వెంటనే తెరుచుకుంది. ఆత్రుతగా వంగాను. అంతే! కళ్ళు చెదిరిపోయే నవ వర్ణాలు! "హే" గుండెల్లోంచి కేక! దీపాన్ని దగ్గరగా లాగాను. లోపల బట్ట కప్పిన చెంబు! బట్టనుండే ధగద్ధగాయిమానంగా ప్రకాశించి నవరత్నాల హారం! పెద్దగా అరిచేయాలన్నంత సంబరం! చేయి చాచాను. చాలా సన్నగా ఉన్న సొరంగం అది. చేయి సగమే పఒతోంది. సాష్టానగ పడ్డట్టు బోర్లా పడుకుని, చేతిని లోనికి పోనిచ్చాను. చెంబు చుట్టూ అరచేతిని బిగించబోయాను. హఠాత్తుగా 'ప్రమాదం' అన్న హెచ్చరిక చేసింది మస్తిష్కం! రోమరోమం నిక్కబొడుచుకుంది. కంతలోకి చూసి నేను బిగుసుకుపోయాను. నా చేతిమీదుగా, మెత్తగా పైకి సాగే ఆకారం! నల్లరాతికి వెన్నపూస పూసినట్లు నిగనిగలాడే చర్మం, నల్లటి ముత్యాల్లా, కుంకుడు గింజ పరిమాణంలో కనుగుడ్లు, సూదిలాంటి నాలుకను విదిలిస్తూ అతి భీకరంగా నా కళ్ళల్లోకి చూస్తూ, ముఖాన్ని సమీపిస్తోంది నల్ల త్రాచు!

    ఊపిరి విడిచే ధైర్యం లేదు! కనురెప్ప వేసే దారిలేదు. చూపు తిప్పుకునే వీలూ లేదు. మృత్యువుకి తల ఒగ్గుతున్నట్లు స్తంభించిపోయాను. నా ముఖం మీంచి భుజం పైకి ప్రాకింది పాము. క్రమంగా దాని స్పర్శ నా శరీరం నుండి దూరమైంది. అతి మెల్లగా శ్వాస వదిలాను. అణువణువులో అలజడి! త్రాచు ఏ మూల నుండి కాటు వేస్తుందో! ఎటు కదలగలను? ఎక్కడ పొంచి ఉందో! ఈ ఆలోచన పూర్తి కాకముందే ధనధనమని శబ్దం! చెవులు రిక్కించాను. ఎవరివో అడుగుల సవ్వడి! నిలువెల్లా కంపించిపోయాను. పై ప్రాణాలు పైనే పోయాయి. సందేహం లేదు. ఎవరో వచ్చారు. 'ఉఫ్'మని దీపం ఊదేశాను. త్రాచు గురించి భయపడి దాక్కోలేదు. ఎవరి కంటయినా పడేకన్నా, దాని కాటుకి బలికావడమే ఉత్తమం.

    నా చుట్టూ చీకటి. ఆ కాళ రాత్రి, కాలకుకట విషంలా నన్ను చుట్టేస్తోంది. అక్కడున్న కొబ్బరి చిప్పల పళ్ళెంతో, సొరంగాన్ని మూసేశాను. అతి మెల్లగా కాళ్ళూ చేతులు దగ్గరకి తెచ్చుకొని గొంతుక్కూర్చున్నాను. మల్లగా పాకుతూ గోడ చాటుకి వెళ్ళాలని నా ఆరాటం. గాలికి పరదా ఎగిరిపోతోంది. ఆ అడుగ్లూ సవ్వడికి గర్భగుడి అదిరిపోతోంది. కూచున్న పళానే నడుస్తున్న నేను, క్షణం సేపు అటు చూశాను. సరిగ్గా అప్పుడే మెరిసిందో మెరుపు. అంతే! నా శరీరం ఆధీనం కోల్పోతున్నట్లుంది. అప్రయత్నంగా లేచి నిలబడ్డాను. తలుపుకి అటు పక్కనున్న రూపం చూసి స్థాణువయ్యాను. నమ్మలేనట్లు అరచేతుల్తో కళ్ళు నులుముకొన్నాను. నా కళ్ళు నన్ను మోసం చేయడం లేదు. ఆలయ ప్రాంగణంలో ఉన్నది ఎవరో కాదు. సాక్షాత్తు ఆంజనేయుడే! ఆకుపచ్చ రంగులో నిగనిగలాడే శరీరం, భల్లూకవదనం, పొడవాటి పళ్ళు, బలమైన బాహువులు. తలని వేగంగా అటూ, ఇటూ తిప్పుతూ ఏదో వెదికేస్తూ, గర్భగుడిని సమీపిస్తున్నాడు. తలపై, భుజాలపై ఆకులు, పసుపచ్చని అడవిపూలు!

    "వ్యాహ్యాళికెళ్ళి తిరిగి వచ్చావా స్వామీ?" నా కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. ఇదే ఆఖరి క్షణమా?

    "హారం స్వామి ధనం! తస్కరించాలని చూస్తే స్వామి ప్రచండరూపంలో సాక్షాత్కరించి సంహరిస్తారు" ఎవరివో గొంతులు ప్రతిధ్వనిస్తున్నాయి.

    పంచప్రాణాలు ఒక్కొక్కటే నన్ను వీడిపోతున్న అనుభూతి. నాలోని జీవం గజగజలాడ్తోంది. "స్వామి చేతిలో మరణం ఎంత భయానకంగా ఉంటుందో?" అలాగే, ఒక్కో అదుగే వెనక్కి వేస్తున్నాను. స్వామి కటకటాల తలుపుకి దగ్గరౌతున్నాడు. ఆ ఆఖరి అడుగు పూర్తయింది. వెనక, స్వామి విగ్రహం అడ్డుకుంది. ముందు, వెనుక స్వామే. నన్ను అష్టదిగ్బంధనం చేసెశాడు. అలాగే విగ్రహాన్ని అంటుకుపోయాను. కళ్ళు ఎదురుగా, చీకట్లోని ఆకారానికే అంకితమైపోయాయి. గుండె పేలిపోయేలా కొట్టుకుంటోంది. తలుపులు తోసినట్లు తెరుచుకున్నాయి.

    మరో మెరుపు మెరిసింది. ఆకుపచ్చని స్వామి! ఆ చూపు నా చూపుతో కలిసింది. యమపాశమై నా ప్రాణాన్ని పెకిలించివేస్తోంది. గుండె గొంతుదాకా వచ్చి ఆగినట్లయింది. అంతలో వెలుగు మాయం. మృత్యుఘోషలా గాలి 'ఓ'మని వీచింది. కటిక చీకటి పరుచుకుంది. అంతే! ప్రాణభయంతో నరనరాల్లో శక్తి పొంగింది. ఆఖరి ప్రయత్నంగా పరుగు లంకించుకొన్నాను. పెద్ద పెట్టున దుఃఖం!

    "శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం" అలవాటైన మంత్రం ఉదరం నుండి ఎగదన్నుతోంది. ఎటు పోతున్నానో నాకే తెలీదు. అడ్డుకున్న తలుపుల్ని దబదబ బాదాను. తెరుచుకున్నాయి.

    "పట్నం పోలేదా... ఆ! ఇదేంటి... అమ్మో" ఎదురుగా భాగ్యం. ఆమె పాదాల మీద కుప్పకూలిపోయాను.

* * *

    మగతో, మరణమో! నా కళ్ళ ముందు చూట్టూ ఎటు చూసినా ఆంజనేయుడే! ఆకాశమంతా నిండిపోయాడూ.'గర్భగుడిలో వణికే నేను! ఎదురుగా, ఆజానుబాహుడు, విశాల వక్షం, ఆకుపచ్చనిదేహం, తలని వేగంగా తిప్పుతూ నన్ను వెదికే సుందరాకారం! ఆ వేగానికి ఎడమ చెవిలో తళుక్కుమన్న నీలం!'

    "ఆ... నీలం...నీలం చెవిదుద్దు. ఆ కదల్లికలు, దారుఢ్యం, కదిలే పవనం లాంటి ఆకారం... అంజీ... అంజీ..." పెనుకేక వేశాను! నా కళ్ళలో అంజి! "నువ్వు తెలుసు. హారతిస్తావ్‌గా! నీది పవిత్ర హృదయమైతే నన్ను గుర్తించేవాడివి. రత్నం... నాది" అందమైన నవ్వు. "రత్నహనుమాన్" దిక్కులు పిక్కటిల్లేలా కేకపెట్టాను.

    "స్వామీ! నువ్వే అంజివా? హయ్యో! ఎంతగా ఆడించావ్? నవ్విస్తూ నచ్చచెప్పాలని చూశావు. దుర్మార్గుణ్ణి గుర్తించలేదే! దురాశను వీడలేదు. ప్రచండరూపం చూపావు చాలు! శాంతించవయ్యా" కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి.

    నాతో పాటే ఎవరిదో ఏడుపు. మెల్లగా లేచాను. నా తల భాగ్యం ఒడిలో ఉంది. "ఏంటండీ? అర్థరాత్రి పరుగున వచ్చారు. రత్నహనుమాన్...అంజీ అంటూ కేకలు! ఒళ్ళంతా రక్తం. స్వామీ నా పెనిమిటిని కాపాడు" భాగ్యం ఏడుస్తోంది.

    చాలా సేపటికి తేరుకున్నాను. మజ్జిగ త్రాగాను. శరీరం వెయ్యి లంఖణాలు చేసినట్టు నిస్త్రాణం! మెల్లగా లేచి వసారాలోకి వచ్చాను. నా కళ్ళు ఓ మూల విసిరినట్టున్న మూటపై పడ్డాయి. దానికి గుచ్చిన ఉత్తరం! విస్మయంతో తెరిచాను.

    "పంతులూ!" ఆ సంబోధనకి గుండె ఆగింది. "ఆచారిగారూ" అని ఊరంతా గౌరవంగా పిలిచే నన్ను అలా పలకరించేది ఇంకెవరూ... అంజా? నా కళ్ళు అక్షరాల వెంట పరుగుపెట్టాయి.

    "నేను అంజీ! నాది ఈ దేశం కాదు. అయినా కొన్నేళ్ళుగా ఈ దేశంలో పాగా వేశాను. నాకు ఏ మతమూ లేదు. నేనో టెర్రరిస్టుని!" "ఆ" నా కాలి కింది భూమి కదిలినట్లుంది.

    "మీ ఊరి గుడి పేల్చేసేందుకు వచ్చాను. మీ ఊరి శ్మశానంలో తలదాచుకున్నాను. బస్ ఎక్కించి అడ్డు తొలగించుకొన్నాను." చదివే నా తల గిర్రున తిరగసాగింది. చెవుల్లో వడగాలి లాటి హోరు!

    "పంతులూ! నాలో ఉన్మాదం ఉంది. అల్లరి ఉంది. కసి, క్రౌర్యం కూడా ఉన్నాయి. మీ మతమన్నా, దేవుళ్ళన్నా నాకు వెక్కిరింత! ఆంజనేయుడిలా, వినాయకుడిలా వేషాలేస్కుని, నాటకాలాడి మా వాళ్ళని నవ్వించేవాణ్ణి!

    బాంబు పెట్టేటప్పుడు, నన్నెవరూ గుర్తించకుండా మాస్క్ వేసుకోవడం అలవాటే! నిన్న కావాలని, హనుమాన్‌ని వెక్కిరించాలని, నా మాస్క్‌లు వెదికి భల్లూకం మాస్క్ ధరించాను. బాంబు సామాగ్రితో గుడి చేరుకున్నాను. గర్భగుడి తలుపులని ఒక్క తోపు తోసి, టార్చి వెలిగించాను. షాక్ అయ్యాను. లోపల స్వామి ఉన్నది ఇందాకటిలా రాతిబొమ్మ రూపంలో కాదు. కళ్ళార్పుతూ, శ్వాసతీస్తూ... మానవ రూపంలో...! నీ రూపంలో పంతులూ! నీ రూపంలో"

    ఒక్క క్షణం చదవడం ఆపేశాను. భరించలేని ఉద్వేగం నన్ను కుదిపేసింది. కాళ్ళల్లో శక్తి లేనట్లు కూలబడిపోయాను. జరిగింది అర్థమౌతోంది. నేను గర్భగుళ్ళో ఉన్నప్పుడు వచ్చింది అంజా? నాలాగే... నన్ను చూసి... స్వామి అని భ్రమపడ్డాడా? ఉత్తరం అందుకొన్నాను.

    "అవును పంతులూ, సాక్షాత్ నీ రూపమే! ఒక చేత గద, మరో చేత పాము తోక, మధ్యలో రక్తసిక్తమైన ముఖం. నా దుస్సాహసాన్ని వారిస్తున్నట్లు మిటకరించిన కళ్ళు.భారంగా వదిలే శ్వాస! అంతే కాదు, నువ్వన్నట్లు, అదృస్య రూపంలో నాగు ప్రత్యక్షమైంది. అవును పంతులూ! స్వామి శిరస్సు మీద కదుల్తున్న పాము, నన్ను చూసి దుష్టసంహారానికన్నట్లు బుస్సున పడగ విప్పింది. అంతే! టార్చ్ వదిలేశాను. విరుచుకు పడిపోయాను. మగతలో అంతా స్వామే! నా కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ, నువ్వు నన్ను నమ్ముతావు. నవ్వలి'అంటున్నాడు. కలలో పాము ఎన్నో సార్లు కాటు వేస్తోంది. కాసేపటికి మెలకువ వచ్చింది. భయం జరజర పాకింది. ఎక్కడైనా తలదాచుకోవాలనే పిరికితనం! నాకెవ్వరూ లేరే! నీ ఇల్లు గుర్తొచ్చి దిక్కుతోచక అటు పరిగెత్తాను. కిటికీ నుండి, నులక మంచంలో నిద్రపోయే నువ్వు! నువ్వింకా పట్నం చేరి ఉండవు. మరి... ఇంట్లో ఎలా వున్నావు? నా తల గిర గిర తిరిగింది. క్రమంగా అర్థమైంది. గుడిలో కలిసిందీ, మాట్లాడిందీ, బస్సు ఎక్కించింది నిన్ను కాదు. నీ రూపంలో ఉన్న స్వమితోనే. అంతా స్వామి మాయే! స్వామి నీ రూపంలో నాతో మాట్లాడాడు. తాకాడు. బుజ్జగించాడు. నా మనసు మార్చాలని చూశాడు. నేను అర్థం చేసుకోలేదు. ఈ ఊరు ధ్వంసం చేయబోయాను. భీకర రూపం చూపాడు! నన్ను మార్చేందుకు స్వామి స్వయంగా పూనుకొన్నాడు. నా భయం మటుమాయమైంది. భక్తిగా చేతులు జోడించాను. నాలో దివ్యానుభూతి! అలౌకికానందం. చుట్టూ కాంతిపుంజం! ఆ కాంతి నన్నావరించింది.  ఇప్పుడు నాలోనూ కాంతే! స్వామి అనుక్షణం నాతోనే ఉన్నాడు. నన్ను సన్యసించమనీ, హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయమనీ, విశ్వశాంతికై కంకణం కట్టుకొమ్మనీ అదేశించాడు. నేను వెళుతున్నాను. నిన్ను కలుసుకునే ఆలోచన ఇక నాకు లేదు. కారణం నువ్వు నన్ను గుర్తించలేవుగా! ఈ ఉత్తరం నీకు అర్థమైందో లేదో! ఒక్క మాటలో చెప్తాను. సాక్షాత్కారానికి స్వామి నిజ రూపం ఎంచుకున్నాడు. నువ్వు ధన్యుడివి పంతులూ! ఈ వస్తువులు నువ్వు స్వీకరించు. ఇదీ స్వామి సందేశమే!"

    శెలవ్

-అంజి

    ఉత్తరం పూర్తయింది. నా అశ్రువులతో తడిసిపోతోంది.

    "ఏమండీ..." భాగ్యం కేక.

    చూశాను. మూటలో మొద్దుగా ఉన్న రెండు బంగారు గొలుసులు, నాలుగైదు ఉంగరాలు, నీలం చెవిదుద్దు, కొన్ని డబ్బు కట్టలు.

    "స్వామే... వాకిట్లో డబ్బు మూట...?" ఇంకా మాట్లాడే భాగ్యం నోరు మూశాను. "రహస్యం" హెచ్చరించాను. సంబరం తొణికే కళ్ళతో తల ఊపిందామె.

    "నాన్నారూ! ఊరంతా గోలగోలగా ఉంది. పోలీసులొచ్చారు. శ్మశానంలో బాంబుసామాగ్రి ఉందట."

    హరి వెంటే వెళ్ళాను. శ్మశానంలో ఒక డేరా! అందులోంచి దాచినట్లుగా ఉంచిన మోటార్ సైకిల్ చుట్టూ జనం. "బాంబు పేలి ఉంటే చుట్టుపక్కల మూడు ఊళ్ళు ధ్వంసం అయ్యేవట. మరి ఎందుకు పేల్చకుండా నిర్వీర్యం చేశారన్నది అంతు చిక్కలేదంటున్నారు. మన అదృష్టం స్వామి కాపాడాడు" జనం గుసగుసలు. 

    "ప్రజలంతా ఎలర్ట్‌గా ఉండాలి. చిన్న ఊరు, పెద్ద ఊరని లేదు. మరి ఈ ఊరిని పేల్చాలనో, లేక పక్కూరి కాలేజీ, కొత్త కంపెనీని ఎయిం చేశారో తెలీదు. కొత్త వ్యక్తులని గమనించుకోండి. అనుమానం వస్తే పోలీసులకి ఇన్‌ఫాం చేయండి" ఇన్స్‌స్పెక్టర్ హెచ్చరికలు. పక్కకి తప్పుకోబోయిన నా కాలి కింద ఏదో మెత్తగా తగిలింది. తీసి చూశాను. భల్లూకం మాస్క్. వరదగోదారిలా దుఃఖం పొంగింది. గుండెలకి హత్తుకొని గుడి వంక పరుగుపెట్టాను.

    "స్వామీ! నువ్వున్నావు. సృష్టిలోని అణువణువులో నువ్వే! అనంత కోటి జీవరాశికీ అంతర్యామివి నువ్వే!

    దుర్మార్గం తలపెట్టిన నాలో, అంజికి కనిపించావు. ఒక ఉగ్రవాదిని ఆత్మజ్ఞానిగా మార్చి, ప్రపంచశాంతి కోసం సంధించావు.

    ఇటు మారణహోమం చేసేందుకు వచ్చిన అంజిలో నాకు దర్శనం ఇచ్చావు. నా దురాశకీ, అవిశ్వాసానికీ చరంగీతం పాడావు. ఈ ఊరిని కాపాడావు. ప్రచండశక్తివి నువ్వు. నిరాకారుడివి. నిన్ను దర్శించాలంటే, నిన్ను ప్రతిబింబించగల పాత్ర కావాలిగా! ఆ శక్తిని క్షణమైనా, మాలో నిలుపుకోగల పాత్రని మాకివ్వు" ఏడుస్తూనే చెక్కపలకని లాగబోయిన నాకు, లోపల కదలాడే నాగు కన్పించింది. ఆనందంతో, సంతృప్తితో కళ్ళు తుడుచుకున్నాను. పలక మూసేసి, తాళం వేసాను. "రత్నాల హారం నీదేనయ్యా రత్న హనుమాన్! నన్ను మన్నించు" స్వామి విగ్రహాన్ని పెనవేస్కున్నాను. ఆ ఆలింగనం అచ్చం అంజి స్పర్శలాగే ఉంది.

    ఇంటికొచ్చి, అంజి నగల మూటని, నా పూజామందిరంలో ఉంచి చేతులు జోడించాడు. "స్వామీ! అంజి ధన్యుడు. నిన్ను చూడగలిగాడు. నీ సందేశాన్ని, నా రూపంలో అందుకోగలిగాడు. అతడి దృష్టిలో నేనే నువ్వు, కానీ, నేను పలకని మాటలనీ, ఏనాటికీ చూపలేని బాటనీ కూడా చూడగలిగాడంటే, అది ఖచ్చితంగా నీ సాక్షాత్కారమే! ఈ ధనాన్ని తాకే అర్హత నాకు లేదు. నా నుదుటి వ్రాతని బట్టి నా జీవితం ఉంది. కానీ, ఈ 'డబ్బు మూట' నా ఆఖరి క్షణం వరకు నీ ఉనికిని నాకు చవి చపిస్తూనే ఉంటుంది.

    గలగలలాడే గోదాట్లోకి చేతిలోని తాళాన్ని విసిరేశాను. నాలో ఆనందం పొంగుతోంది. నా విశ్వాసానికి పట్టిన గ్రహణం వీడింది. నా అంతరాత్మ అఖండ జ్యోతిలా ప్రకాశిస్తోంది.

(నవ్య వారపత్రిక మే 5, 2010 సంచికలో ప్రచురితం)
   
Comments