అమ్మ చెట్టు - యర్రమిల్లి విజయలక్ష్మి

    "మామ్మగారూ... మా అమ్మగారు కాసిని మావిడాకులు ఇమ్మన్నారు" అంటూ గేటుకవతల నిలబడి భయంభయంగా అడుగుతున్న పదేళ్ళ పిల్లని..."ఏ అమ్మగారూ... మావిడాకులా...ఎందుకట...!" ఉదయమే ఆదిత్య హృదయం చదువుకుంటున్న శారదమ్మ విసుగ్గా ఆరాతీసింది. ఆ సమయంలో తెలిసిన వాళ్ళవరూ ఆవిడగార్ని పలకరించే సాహసం చెయ్యరు. ఉదయం పూట ఆవిడకు సమయం చాలా విలువైంది. ఐదు గంటలకి లేచి స్నానం వగైరా కానిచ్చిందగ్గర్నుంచి ఆవిడ ఆరాధనా కార్యక్రమాలు, దేవుళ్ళ ప్రాధాన్యతా క్రమంలో ఎందిమిది గంటల వరకూ కొనసాగుతాయి. ధ్యానం, తులసి పూజ, ఆదిత్య హృదయ పఠనం, ఇష్టదేవతల ధూప దీప నైవేద్య పూజా కార్యక్రమం, ఇది పూర్తయ్యాక విష్ణు సహస్ర నామ పారాయణం మొత్తం ఈ కార్య్క్రమమంతా పూర్తయ్యాకే ఆవిడ దైనందిన గృహకృత్యాలకు పూనుకుంటుంది. సరే, తెలిసో, తెలియకో... శారదాంబగారు తూర్పు వాకిలి వరండాలో తడిబట్టతో నిలబడి తదేకంగా చూస్తూ సూర్యస్తొత్రం చేసుకుంటున్న సమయంలో ఆ పనిపిల్ల 'మావిడాకులు ఇమ్మన్నారు మా అమ్మగారం'టూ వచ్చింది. తన పూజా కార్యక్రమానికి ఆటంకం వచ్చినందుకు శారదమ్మ అంత బాధపడలేదు. అపరాధం చెప్పుకుని మళ్ళీ మొదలుపెట్టే అవకాశం వుంది. అయితే ఆ పిల్ల అడిగింది ఆవిడ పెరట్లో వున్న మామిడి చెట్టు ఆకులు..."ఊ..ఎందుకట... మావిడాకులిప్పుడు మీ అమ్మగారికంటే మాట్లాడవేం? ఏ అమ్మగారో చెప్పు ముందు...!" ఆ పిల్ల ఎవరింట్లో పనిచేస్తోందో గుర్తులేక రెట్టించిందావిడ.

    "సావిత్రమ్మ గారండి... ఆళ్ళింట్లో వ్రొతం చేసుకున్నారంట. మావిడాకులు మిమ్మల్నడిగట్రమ్మని పంపారు" అంది ఆవిడ కోసం చూసి భయంగా.

    శారదమ్మగారు ఆదిత్య హృదయం పక్కన వుంచి సూర్యబింబంకేసి చూసి చెంపలేసుకుని దణ్ణం పెట్టుకుంది. "వుండు వస్తాను" అంటూ పెరటు వైపుకు వెళ్ళింది. 'మావిడి చెట్టుని బతకనివ్వడం లేదు కదా... అందరికీ నా చెట్టు ఆకులే కావాలి!... ఆకులు తెంపేస్తే చెట్టెలా ఎదుగుతుంది? మావిడాకులు కావాలంటే తోటల్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి కాని...!' అని సణుక్కుంటూ ఏరి ఏరి నాలుగు ముదరాకులు రంగు మారి రాలిపోవడానికి సిద్ధంగా వున్నవి జాగ్రత్తగా కోసి తెచ్చి బంగారంలా అందించిందా పిల్లకి.

    ఆకులు తీసుకొని ఆ పిల్ల వెళ్ళిపోయింది కాని, శారదమ్మగారు సణుక్కుంటూనే వుంది. "క్రితం సారి తుఫానుకి చెట్టంతా చూడు... కూకటి వేళ్ళతో కదిలిపోయి ఎలా ఒరిగిపోయిందో. అసలు చచ్చిపోయిందనే భయపడ్డాను. ప్రశస్తమైన ఆవకాయ కాయ. ఎంత పెట్టినా దొరకదు. సంవత్సరమైనా ముక్క మొత్తబడటం కాని పులుప్ ఉ చావడం కాని వుండదు. ఎంత కష్టపడి మళ్ళీ బతికించుకున్నానో."

    "ఎందుకమ్మా... అంత కష్టపడతావు. ఆపిల్లని కోసుకెళ్ళమని చెప్పవచ్చుగా. పెరట్లో ఆ మూలకి నువ్వెందుకు వెళ్ళటం" అంటుంది శారదమ్మ కూతురు.
    శారదమ్మ గారిది ఇల్లు కాదు దివాణం. ఒక గదిలోంచి ఒక గదిలోకి తిరిగే సరికి కాళ్ళు గదుళ్ళు కట్టిపోతాయి. పాతకాలపు మేడ. చక్కగా నిర్వహించుకునే నాథుడు లేక పాడుపడీన రాజమహల్లా వుంటుంది. వెనకా ముందూ అరెకరం మేర విస్తరించివున్న పెర్డంతా జపాన్ తుమ్మ పొదలు, పిచ్చిమొక్కలు, తుప్పలతో చిన్నపాటి అడవిలా వుంటుంది. అంత ఇంట్లో పెళ్ళి కాకుండా మిగిలిపోయిన కూతురు విశాలాక్షి ఆవిడా ఇద్దరే వుంటారు. పుట్టుకతోనే ఏర్పడిన శారీరక లోపం మూలంగా విశాలాక్షి పెళ్ళి కాకుండా వుండి పోయింది. "అదీ ఒకందుకు మంచిదే అయిందిలే! అదీ వెళ్ళిపోతే ఈ వయసులో ఒక్కదాన్నే వుండద్దూ" అంటుంది శారదమ్మ. "చత్వారం వచ్చింది. సాయంత్రమైతే అలవాటైన ఇల్లు కనుక తిరగ్గలను కానీ చూపానదు. చేతులు కాళ్ళు స్వాధీనంలో వుండవు. పట్టుండదు. అదుంది కాబట్టి ఏదో వేళకింత ఉడకేసి పడేస్తుంది!" అనుకుంటుంది. అయినా ఎవరైనా దొడ్లో కలుపు మొక్కల్లా విస్తరించి వున్న కరివేపాకు రెమ్మ కోసం వచ్చినా బద్దకించకుండా తనే వెళ్ళి కోసుకొచ్చి ఇస్తుంది తప్ప వాళ్లను చెట్లమీద చెయ్యెయ్యనివ్వదు. నేలలో బలం తగ్గిపోయి వెలక్కాయల్లా అప్పుడప్పుడు ఒకటి రెండు గెలలు దిగే అర్ధ శతాబ్దం వయసుగల మూడు కొబ్బరి చెట్లు, ముదిరిపోయి ఊడలు దిగి ఇన్నేళ్ళు నీళ్ళు పోసి ప్రేమగా పెంచిన కృతజ్ఞతతో ఆవిడ పూజకు సరిపడా కాసిని పూలిచ్చే వంటి రెక్క మందార చెట్టు ఒకప్పటి ఉద్యాన అవశేషాలుగా మిగిలి వున్నాయి. వాటన్నింటినీ ఆవిడ శ్రద్ధగా సంరక్షించుకుంటుంది. అయితే అవన్నీ ఒక ఎత్తయితే ఆవిడకా మావిడి చెట్టొక ఎత్తు. ఆ చెట్టావిడ ప్రాణమే అని చెప్పవచ్చు.

    "దాని పనైపోయింది. ఐదేళ్ళ బట్టి చూస్తున్నా ఒక పువ్వు లేదు. పిందే లేదు. రొట్టలా ఆకులు మాత్రం వున్నాయి. అంతకన్నా కావాలంటే ఇంకో కొత్త మొక్క వేసుకోవటం మంచిది. అనవసరమైన చాకిరీ... శ్రమ!" అంటుంది కూతురు, రెక్కలు విరిగేలా బావిలో నీళ్ళు చేది తెచ్చిపోసే తల్లితో. ఆవిడ మాత్రం ఆ ముక్క ఒప్పదు. "చెప్పాగా ఆ తుఫానుకు చెట్టు దెబ్బతింది. బలం పెట్టి బాగా నీళ్ళు పోస్తే చక్కని కాపు కాస్తుంది. నీకేం తెలుసు! ఒక్కోసారి కాసిందంటే వెయ్య కాయ దిగుతుంది. మీ నాన్నగారు స్వయంగా ఆయన చేతుల్తో నాటారు. ఒకసారి ఆవకాయ పెడితే కాయ బాగాలేక ముక్క త్వరగా మెత్తబడి పోయింది. వెంటనే ఇది పనికాదని వెంకటస్వామి చేత ప్రత్యేకంగా తెప్పించి వేశారు. ఆయన పోయే నాటికి దీనికి సంవత్సరం వయసు. జాగ్రత్తగా పెంచుకున్నాను. ఎంత పంట! ఇటువంటి చెట్టిప్పుడు దొరుకుతుందేమిటి?" అంటూ ఆ చెట్టుని చేత్తో ప్రేమగా నిమురుతుంది. "క్రితం ఏడాది మరీని... అసలు పూతే లేదు. ఆపై ఏడు మరి ఆరొందలు కాయ దించింది. ఏమైందో...! చచ్చిపోతుందేమోనని భయంగా వుంది. మీ నాన్నగారు స్వయంగా తన చేతులతో నాటిన మొక్క. పైన చెట్టంతా చెదలు పట్టేస్తున్నాయి. ఆకులు వడలిపోతున్నాయి" అంటుంది బాధగా. చెదలన్నీ టెంకాయపుల్లల చీపురుతో దులిపి, చెదల మందు చెట్టంతా పూసి, ఎరువు వేసి, బోద చేసి, నీళ్ళు పెట్టి సంరక్షణ చేసింది. ఎప్పుడూ ఆ చెట్టుక్రిందే 'ఎండుటాకులు రాలిపోతే కొత్త చిగుళ్ళు వేస్తుంది' అంటూ కర్రతో చెట్టుకి దెబ్బతగలకుండా జాగ్రత్తగా ఎండుపుల్లలు, ఆకులు రాల్చేది. ఆవిడకా మావిడి చెట్టంటే ఎందుకంత మమకారమో విశాలాక్షి అర్థం చేసుకోగలదు. జీవించి వున్న ఆ మామిడి చెట్టు ఆవిడకొక పచ్చని వసంత కాలాన్ని గుర్తు చేస్తుంది. ముప్పై ఏళ్ళ క్రితం ఆవిడ నలభైయ్యో ఏట చనిపోయిన భర్త స్మృతి ఆ చెట్టుని చూస్తుంటే సజీవంగా నిలిచి వుంటుందనిపించినా- ఎందుకో మరి విశాలాక్షి గుండెలో జ్ఞాపకాల తడి ఇంకిపోయినట్లుంటుంది. తల్లి అవకాశం చిక్కినప్పుడల్లా కథలు కథలుగా గుర్తుచేసుకునే గత స్మృతులు ఆమెను బాధిస్తాయి. అశాంతికి గురిచేస్తాయి. "ఎందుకమ్మా జరిగిపోయిందల్లా పదే, పదే గుర్తు చేసుకుని బాధ పడతావు! ఈ జీవితంలో ఏది శాశ్వతం...! మనుష్యులే మాయమైపోతుంటే ఈ చెట్టొక లెఖ్ఖా. ఇంత తెలిసీ దీని మీద నువ్విలా ఎందుకు మమకారం పెంచుకుంటున్నావో అర్థం కాదు. ఇంకా ఎందుకు నీకీ తాపత్రయం" అంటుంది. కానీ ఆవిడ ధోరణి మారదు. "మీ నాన్న పోయేనాటికిది మారాకు కూడా వెయ్యలేదు. చిటికెన వేలంత అర్భకంగా వుండేది. జాగ్రత్తగా పెంచుకొచ్చాను. చిలువలు పలవలుగా ఇంతైంది. ఇంతవరకూ ఎన్నివేలు కాసిందని కాయ...?" అని ప్రారంభించేది. విశాలాక్షికి అర్థమైంది తన తండ్రి పోతూ పోతూ నాటిపోయిన ఆ మామిడి చెట్టు తల్లి ప్రాణ సమానమని, ఆయన స్మృతి చిహ్నంగా ఆవిడా చెట్టును సంరక్షించుకుంటోందని. అయితే విశాలాక్షికి అర్థంకాని విషయమొకటుంది. సర్వసంగ పరిత్యాగిగా నిర్మోహంగా అందరి చేత మన్ననలందుకునే తల్లికే వ్యామోహమేమిటని. 

    ఏమన్నా శారదమ్మ ఆశ తీరలేదు. ఆవిడ ఎంత ప్రయాస పడినా ఆ మామిడి చెట్టు ఆవిడ్ని కనికరించలేదు. ఒక్క పువ్వు కాని, పిందె కాని లేక వట్టిపోయిన కల్పవృక్షమై పోయింది. ఆవిడ పడిన వేదన ఇంతా అంతా కాదు.

    పుష్య మాసం మొదలైన దగ్గర్నుంచి ఆవిడ ధ్యాసంతా చెట్టు మీదే. "ఎప్పుడూ మన చెట్టు ముందే పూస్తుంది. ఊళ్ళో ఊరగాయ కాయ రాకుండానే మన చెట్టుకాయ తయారయ్యేది. ఏమైందో? పాడు వరదలు, తుఫానులు బంగారం లాంటి చెట్టును పాడు చేశాయి కదే. ఆకు కనబడకుండా రెమ్మ, రెమ్మకు తెల్లని పూల గుత్తులు వేలాడేవి. మంచు జడికి ఎంత పూత రాలినా ఎంత పిందె రాలినా వందలాది కాయ లిచ్చేది పిచ్చితల్లి!"
    "అమ్మా... దాని వయసై పోయిందే. చెట్టైనా, మనిషైనా, జంతువైనా చిగురించటానికి, పుష్పించటానికి, ఫలించటానికి జీవితంలో కొంత కాలమే అవకాశం వుంది! నీకా మాత్రం తెలియదా... వయసైపోయిన చెట్టు పూర్తిగా చచ్చిపోయే వరకూ నీరు పోసి నిలబెట్టుకోవటం తప్ప ఫలాలు ఆశించటం తెలివి తక్కువతనం" అంది విశాలాక్షి చాలా మామూలుగా. కానీ ఆ మాటలు ఆ వృద్ధురాలి మనసు మీద ఇంకోలా పనిచేసాయి. తను మరిచిపోయిన జీవిత సత్యాన్ని కూతురు చాలా సాదా మాటలతో గుర్తుచేసింది. అయినా ఈ చెట్టుకు వయసై పోయిందన్న మాట ఆవిడ మనసుకు నచ్చలేదు. మనసంతా చేదు తిన్నట్లు చిన్నపోయింది.

    "పిచ్చి వాగుడు వాగకే...! దానికి వయసై పోవటమేమిటి?! చూడు కొత్త చిగుళ్ళు వేసి కళకళ్ళాడి పోతుంటే ఆ ముక్కనటానికి నీ నొరెట్లా వచ్చింది. ఒక సంవత్సరం కాస్తే మరుసటేడు ఈ చెట్టు కాయ కాయదు అంతే!" అంది చెట్టు దగ్గర నిలబడి ప్రేమగా చెట్టంతా కలయచూస్తూ.

    విశాలాక్షికి నవ్వు వచ్చింది. క్రిందటేడు కాదు ఆపై ఏడు కూడ ఆ చెట్టు పట్టుమని పది పిందెలెయ్యలేదని గుర్తుచేసి తల్లి మనసును నొప్పించలేకపోయింది. ఆవిడ ఆశ ఆవిడది! వృథా శ్రమ అని తన బాధ.
      
    క్రమేణా శారదమ్మ ఆరాటం తగ్గిపోయింది. దానికి కారణం ఆవిడకు ఓపిక తగ్గిపోయింది. ఇంటి పని, తల్లి సంరక్షణా బాధ్యత విశాలాక్షిపై పడింది. "ఆ తులసి మొక్కకు నీళ్ళు పోసావా! అమ్మవారి ముందు దీపం పెట్టావా? ఆ చెట్లు మరీ వాడిపోతున్నాయి. రెండు చెంబులు నీళ్ళు పోయవే విశాలం. ఇదిగో కమలమ్మ గారి పిల్ల కరివేపాక్కు వచ్చింది. నాకు ఓపిక వుంటే నేనే కోసిద్దును. రెమ్మలు విరిచేస్తారు. రెండు రెబ్బలు కోసి ఇవ్వమ్మా" ఇల్లా తాపత్రయం మాత్రం తగ్గలేదు. విశాలాక్షికి ఇదంతా విసుగ్గా వుంటుంది. 'ఎండి మోళ్ళైపోయిన చెట్లకి ఎన్ని నీళ్ళు పోసి మాత్రం ఏం ప్రయోజనం. బతికేనా...పెట్టేనా...' అని మనసులో సణుక్కుంటుంది. అయినా పెద్దావిడ మాట కాదనలేక ఏ సాయంత్రం వేళో తల్లికి తెలిసేలా పెద్ద చప్పుడు చేస్తూ వాటి తడి పెడుతుంది. లేకపోతే ఆవిడ నమ్మదని భయం. రాను, రాను ఆ తపన కూడా తగ్గిపోయింది. ఆహారం తీసుకోవటం తగ్గింది. రెండడుగులు గట్టిగా నడవలేక పోతోంది. అప్పుడప్పుడు కూతురి చేయూత నాశిస్తోంది. కొద్దికాలం క్రితం వరకు చువ్వలా చక చక ఎంత దూరమన్నా నడిచిపోయేది. రిక్షా బండి ఎక్కే ప్రశ్నే లేదు. 'అమ్మా... నీకు నీరసంగా వుంటున్నట్లుంది. డాక్టర్లు దగ్గరికి వెడదాం పద... బలానికి మందిస్తాడు...' అంది కూతురు.

    "డాక్టరుకేం తెలుసు... నాకేమిటో నాకు తెలియక పోతే కదా... మహా మహా వాళ్ళకే తప్పలేదు" అంది గూఢంగా. "డాక్టరుకి కాకపోతే ఎవరికి తెలుస్తుంది. ఒంట్లో ఏమిటో పరీక్ష చేసి మందులిస్తారు... అన్నింటికీ మొండితనమైతే ఎల్లా...!?" అని బాధపడింది విశాలాక్షి. తల్లి మాటల్లోని అర్థం గ్రహించలేకపోయింది. తరువాత రెండు రోజులకి విశాలాక్షి ఎంత మాత్రం ఊహించని విధంగా శారదమ్మ వున్నట్లుండి ప్రాతఃస్మరణ చేసుకుంటూనే ప్రాణం వదిలేసింది.

    జీవితంలో అప్పటికే వయసుకి మించిన కష్టాన్ని, విషాదాన్ని రుచి చూచివున్న విశాలాక్షికి మానవ జీవిత మర్మం బోధపడినట్టే వుంది. తల్లి తనకు 'అప్పుడప్పుడు జరగబోయేది చెప్తూనే వచ్చింది. సహజంగానే ఏదో మాయ పొర మనసును కమ్మి తనే తెలుసుకోలేక పోయింది. తెలుసుకున్నా తనేం చెయ్యగలదు? తల్లి మరణాన్ని ఆపగలిగేదా! పుణ్యాత్మురాలు... సునాయాస మరణం వరంగా పొందిందేమో...కన్నుమూసి తెరిచే వ్యవధిలో వెళ్ళిపోయింది!'అని వేదాంత ధోరణిలో తన్నితాను సముదాయించుకుంది. ఆవిడ తన అంతిమ కోర్కెగా ప్రత్యేకించి ఏ ఆశయం, బాధ్యత అప్పగించి పోలేదు. ఆవిడ జీవిత విధానమే తనకు ఆదర్శమనుకుంది. విశాలాక్షి తనకే తెలియని విధంగా అప్రయత్నంగా తల్లి ఆత్మేదో తన్నావరించినట్లు ఆవిడ పంథాలోనే జీవితం గడపసాగింది.

    కార్తీకం వెళ్ళి మార్గశిరం ప్రవేశిస్తున్న రోజులు. ఉదయమే తలస్నానం చేసి పూజా పురస్కారాలు నిర్వహించుకుంటోంది విశాలాక్షి. శారదమ్మ వుండగా మడి, తడి, జపతపాలు, పూజాదికాలు తిథుల ప్రకారం క్రమం తప్పకుండా ఆవిడే నిర్వహించుకుంటూ వుండేది. పైపై ఇంటి వ్యవహారాలు మాత్రం ఆమెకు అప్పగించేది. ఎప్పుడో తప్పని పరిస్థితుల్లో ఆవిడగారు చేయవలసిన పని విశాలాక్షి చేసినా ఆవిడకు సంతృప్తి వుండేది కాదు. కూతురు ఎంత జాగ్రత్తగా చేసినా ఏదో ఒక లోపం కనిపించేది. ఇప్పుడు మొత్తం ఇంటికి చెందిన పనులన్నీ విశాలాక్షే చేస్తోంది. తల్లి ఏ పని ఏవిధంగా చేసెదో గుర్తు చేసుకుని అలాగ చెయ్యాలని ప్రయత్నిస్తోంది. అసంతృప్తి చెందటనికి, అలా చేసావేమిటి తప్పు కాదూ అని మందలించటనికి తల్లి లేకపోయినా ఆమె వున్నట్టుగానే భావిస్తోంది విశాలాక్షి. నిరంతరం తన్ని వెన్నంటి అమ్మ వుందన్న భావం మనిషిని నడిపిస్తోంది.
    ఇప్పుడు తులసమ్మకు నీళ్ళు పోసి పసుపు, కుంకుమ, పూలు పెట్టి దణ్ణాలు పెడుతూ ప్రదక్షిణాలు చేస్తున్న విశాలాక్షి అకస్మాత్తుగా రెండో ప్రదక్షిణం మధ్యలో ఆగిపోయింది. ఆశ్చర్యంతో కళ్ళు వెడల్పయ్యాయి. తులసి కోటకు కాస్త దూరంలో వెనక ప్రహరీ దగ్గరగా వున్న మామిడి చెట్టు నిండా రెమ్మ రెమ్మకు తెల్లని పసిరి పూల గుత్తులతో కళకళలాడుతూ కనిపించింది. విశాలాక్షి తులసి పూజ మర్చిపోయింది. చెట్టు దగ్గరికి వచ్చేసి కలా...నిజమా అదంతా పూతేనా... అవన్నీ పూలగుత్తులేనా అన్న విస్మయంతో తల పైకెత్తి చెట్టువంక చూసింది. తదేకంగా అలా చూస్తూనే వుండిపోయింది. 'తను గమనించనే లేదు. ఇంత అద్భుతం ఎప్పుడు జరిగింది. ఎలా జరిగింది. మామిడి చెట్టు కా వెర్రి పూత ఏమిటి!' అనుకుంది సంభ్రమంగా.     తల్లి గుర్తుకు వచ్చింది. ఆవిడ ప్రాణాలన్నీ దీనిమీదే కదా...అనుకుంటే కళ్ళలో నీరు తిరిగింది. చట్టున చెట్టు దగ్గరకు వచ్చి చేతులతో మానును చుట్టేసింది. అందినంత మేరకు మాహా సౌందర్యంతో పరిమళిస్తున్న చెట్టంతా ఆతృతగా, ఆప్యాయంగా ప్రెమగా తడిమింది. సజీవమైన అమ్మ స్పర్శ అనుభవమీనట్లు గుండె పులకరించింది. వికసిత వసంతంలా పరిమళిస్తున్న ఆ చెట్టులో అమ్మను చూసుకుంటోంది. ఒకప్పుడు అమ్మలాగే...అవ్యక్తమైన అభౌతిక మర్మమేదో మనసులో స్పష్టమైంది.
(నడుస్తున్న చరిత్ర మార్చి2004 సంచికలో ప్రచురితం)

    
      

    
Comments