అమ్మకొడుకు - టి.శ్రీరంగస్వామి

    పత్రిక తిరగేస్తున్నాను. 
ఒక పేజీ దగ్గర నా కళ్ళు ఆగిపోయాయి. నాకు తెలిసిన మిత్రుడి కథ... చందర్ కథకుడే... కొన్ని మంచి కథలను అందించాడు. వాస్తవ చిత్రాలను ఆర్ద్రతతో అందించే వారిలో చందర్ ఒకడు. చందర్ కథకుడే కాదు కవి కూడా. కవులలో కూడా తనదైన శైలిని ఏర్పరచుకున్నవాడు. నాటికలు కూడా అడపా దడపా రాశాడు. మొత్తానికి చందర్ అంటే నాకు సంపూర్ణంగా కాదు కాని ముప్పాతిక శాతం అభిమానమే. అందుకే కాబోలు, ఆయన కథ కనబడగానే నా కళ్ళు ఆగిపోయాయి.

    తన కన్న బిడ్డల పట్ల తల్లి ఎంతకా తల్లడిల్లుతుందో... తన కొడుకు ఎంత దుర్మార్గుడైనా, స్వార్థపరుడైనా, తన పట్ల తనవంతు కర్తవ్యం సరిగా నిర్వహించకున్నా, నిర్లక్ష్యం వహించినా ఆ తల్లి సంతానం పట్ల ఎంత ఆప్యాయతను, ప్రేమను వర్షిస్తుందో తన కథలో హృద్యంగా చిత్రించాడు. తన కడుపుకు లేకున్నా సరే... తన పిల్లల కడుపు గురించి ఆలోచిస్తుంది. కొడుక్కు అరవై సంవత్సరాలు వచ్చినా, తను తినే ముందు తన  కొడుకు తిన్నాడా అని ఆరా తీస్తుంది. ఇలా ఆరా తీసినప్పుడే కోడళ్ళకు, మనుమలు, మనవరాళ్ళకు ఉక్రోషం వస్తుంది. ఇంకా ఆయన చిన్న పిల్లాడేనా... ఆయన గురించి మేము ఆలోచించమా... అని అనుకుంటారు. కాని అది తల్లి హృదయం కదా! అందుకే తన పొత్తిళ్ళలో నుంచి సాదిన సంతానం యొక్క కడుపు గురించి ఆలోచన సహజమే కదా! చందర్ కథలో తన కొడుకు పట్ల ప్రదర్శించిన ఆప్యాయతను ఎంతో హృద్యంగానూ, మనసు కదిలించేలా చిత్రీకరించి మానవ సంబంధాలను తన కథలో బహిర్గత పరచి, పాఠకులను చమర్చింప చేసాడు. గత కథలతో పోల్చితే చందర్ కథలలో ఇంతటి ఆర్ద్రత, అనురాగం ఎక్కడా కనిపించలేదు. బహుశ గత ముప్పై ఏండ్ల సాహితీ సేద్యంలో కలం పరిణతి చెందడమేమో! జీవితం పట్ల ఒక నిర్దిష్టమైన గమ్యం, వైఖరి మనకు స్పష్టంగా కనబడుతుంది. తల్లి, బిడ్డల అనుబంధానికి ఈ కథ ఒక మచ్చుతునకగా నిలిచిపోతుంది.

    కథాసాహిత్యంలో ఒక మంచి కథ అందించాడని అనిపించింది. సంతృప్తిని కలిగించింది.

* * *

    బయట ఏదో చప్పుడవడంతో ఇంట్లో నుండి వచ్చి గడపలో నిలబడ్డాను. ఇంటి ముందటి నుంచి పోతున్న చందర్ తమ్ముడు వినోద్ కనబడ్డాడు.

    "ఏం! వినోద్... చాలా రోజులు అయింది. కనబడడం లేదు! చాలా బిజీగా ఉన్నావా!" అంటూ పలకరించాను.

    "అదేం లేదన్నా... నెల రోజుల క్రితం అమ్మ జరిగిపోయింది. అందుకే ఎటూ వెళ్ళడం లేదు. ఆ కార్యక్రమం వలన ఎటూ వెళ్ళడం లేదు. ఉద్యోగం... ఇల్లు... అన్నట్టుగానే ఉంది."

    "అయ్యయ్యో... నాకు విషయం తెలియదు. తెలిస్తే నేను వచ్చేవాడిని! చందర్ కూడా చెప్పలేదు... అమ్మ స్మృతిని కవిత్వీకరించావా..." అని అడిగాను.

    "లేదన్నా! నేను రాయలేకపోయాను. అన్న అమెరికాలో పిల్లల దగ్గర ఉన్నాడు" అని చెప్పాడు.

    నేను కొంత ఆశ్చర్యపోయాను. అదేంటి... అమ్మ చనిపోతే పెద్దకొడుకుగా అమెరికా నుండి రాలేకపోయినాడా అని మదనపడ్డాను. అక్కడ ఉద్యోగం కూడా కాదు. కేవలం విజిటింగ్ వీసా మాత్రమే కదా! అదీ కాక ఇప్పుడే చదివిన కథ ప్రభావం నన్ను మరింతగా ఆలోచనలను రేకెత్తిస్తున్నది. 

    "అదేమిటి! చందర్ కథ ఇప్పుడే పత్రికలో చదివాను... మీ అమ్మ గురించి... మీ అమ్మ పట్ల తనకున్న ప్రేమను ఎంతో గాఢంగా... హృద్యంగా అందించాడ"ని వినోద్‌కు చెప్పాను. "చందర్‌కూడా ఉన్నాడనుకుంటున్నాను" అని అన్నాను.

    "అప్పుడు ఇక్కడే ఉన్నాడు... కాని... అమీరికాలో ఉన్న బిడ్డల దగ్గరకు చంద్రన్న వెళ్ళాడు. ఇక్కడ నుండి అమెరికాకు పోయినాక పదిహేను రోజులకు అమ్మ చనిపోయింది. మా అమ్మ గత 5,6 సంవత్సరాలుగా మా దగ్గరే ఉంటుంది తప్ప అన్న దగ్గర లేనేలేదు. కనీసం అమ్మ కలవరించింది అని చెప్పినా... వచ్చి చూసిన జాడలు అసలే లేవు. మా నాయన ఉన్నప్పుడు కూడా దూరంగానే ఉండేవాడు. మీరు చూసిన మా అన్న వేరు. ఆయన మా ఇంట్లోను, బయట ప్రవర్తించే విధానం వేరు. మీరు నాకు దగ్గరగా మెదలుతారు కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి మా అన్న గురించి... మా అన్న సాహిత్యం గురించి మొదటి నుండి మీకు తెలుసు. మా చిన్నప్పుడు మీరు ఇంటికి వచ్చినప్పుడు మా పరిస్థితి ఏమిటో మీకు తెలుసు. మీకు గుర్తుండే ఉంటుంది. మా అన్నయ్య మాకు ఓ 'రోల్ మాడల్'గా నిలబడ్డాడు కొంత కాలం. తను లెక్చరర్‌గా ఉద్యోగం నిక్కచ్చిగా సాగించినంత వరకు మాకు ఆనందంగానే ఉండింది. ఆయన ఉద్యోగం చేసుకుంటూనే ఎన్నో దందాలు..."

    "అవును నాకు తెలుసు... నేను కూడా నోటు బుక్కుల షాపును, బట్టల షాపును చూసాను... చద్దర్లు కూడా కొనుక్కున్నాను..."

    "అయితే... దీన్ని నేను తప్పు పట్టడం లేదన్నా... బతకడానికి ఎదగడానికి మనం చేస్తున్న వృత్తికి ద్రోహం చేయకుండా ఏవైనా చేయవచ్చని నా అభిప్రాయం"

    "మరి..."

    "తను నమ్మిన విద్యార్థులను, ప్రభుత్వం అందించిన సౌకర్యాలు అందుకుంటూనే సంవత్సరాల కొద్ది సెలవులను పెట్టుకొని ప్రైవేటు కళాశాలల్లో పనిచేయడం నాకు నచ్చలేదు అన్నా! ఇలా అంటే అసూయ అంటారు. మనం భావుకులము, మనం రాసే రాతలు మనం చేసే పనులకు భిన్నంగా ఉంటే ఎలా ఉంటుంది. మీరు చదివిన కథను నేను కూడా చదివాను. ఇక్కడొక విషయం చెప్పాలి మీకు. మా మధ్య జరిగిన సంభాషణ ఇది.

    అమ్మ చనిపోయాక నేను అమెరికాలోనున్న అన్నకు ఫోన్ చేసి అమ్మ ఈ తెల్లవారకట్ల చనిపోయింది. మీరు రండని చెబితే

    "వినోద్! అయ్యో! అమ్మ పోయిందా! సరేలే... గత 5,6 నెలల నుండి నువ్వు ఇబ్బంది పడుతూనే ఉన్నావు. పాపం... అమ్మ మంచంలో అనేక ఇబ్బందులు పడింది. అంతకంటే నీవు, నీ పిల్లలు ఆమెకు పరిచర్యలు చేయడానికి కష్టపడ్డారు. ఆమె తన బాధలనుండి విముక్తి పొందింది. ముమ్ములనూ విముక్తులను చేసింది. సరే... సరే... ఇప్పుడూ నన్ను అక్కడకు రమ్మంటావా!"

    "కర్మకాండ చేయాల్సిన వాడివి నీవేకదా! ఇంటికి పెద్దవాడివి, మమ్ములను మార్గదర్శకం చేయాల్సిన వాడివి కూడా..."

    "అంతే గాని... ఒక పని చెయ్... వినోద్... నేను ఇక్కడకు వచ్చి కొద్ది రోజులే అయింది కదా! గన్ని పైసలు పెట్టుకొని వస్తిని... ఇక్కడ ఎందర్నో కలువాలి... వారితో ముందస్తు అపాయింటుమెంటు తీసుకున్నాను కూడా..."

"అది కాదు అన్నా... నీవు లేకపోతే బాగుండదు... బంధువులు ఏమైనా అనుకుంటారు... కావాలంటే మళ్ళీ పోదువు... రావే... నువ్వు వస్తే అమ్మ ఆత్మ సంతోషిస్తాది..."

    "ఇగో! వినోద్... నా మాట విను... నేను ఇప్పుడు వస్తే అమ్మ వస్తదా! ఎలాగూ రాదు... పోయిన వాండ్లతో మనం ఎలాగు పోలేం కదా...మనం సంప్రదించలేం కదా... నీవే ఏదో ఒకటి చేసై... ఆ తర్వాత ఇతర విషయాలు మాట్లాడుకుందామ"ని  ఫోన్ పెట్టేసాడు.

    మా అమ్మ మంచంలోనున్నా మా అన్న రెణ్ణెల్ల కొకసారి చూసిపోయె. మా అన్నకు తన చేతిలో ఏదైనా తినేది ఉంటే అమ్మ ఆయన చేతిలో పెట్టేది. అది ఆమె ప్రేమ. కాని ఈయనకు తన అమెరికా ప్రయాణమే ముఖ్యమయి పోయింది. ఇది నీ మనసులోనే ఉంచుకో అన్నా!" అంటూ వినోద్ వెళ్ళిపోయాడు.

    నాకు తెలిసిన చందర్‌లోని కొన్ని అంశాలకు తోడుగా ఈ విషయం నన్ను మరింత దిగ్భ్రాంతుడిని చేసింది. కన్న తల్లి పట్ల అతను నిర్వహించిన తీరు, ఆయన రాసిన కథలోని అమ్మ పట్ల చూపిన ఔన్నత్యం రెండూ భిన్న దృక్పథాలు.

    పేరుకు పాకులాఆడడం, దాని కొరకు ఎన్ని హేయమైన ఎత్తుగడలు వేసినా, తల్లి పట్ల నిర్వహించిన విధానం అంతకన్నా హేయమైనదనిపించింది. నాకు అప్పుడు మార్జాల జంబుక న్యాయం గుర్తుకు వచ్చింది. రాతలను చూసి మోసపోవద్దని, రచయితలను అంచనా వేయవద్దని చెప్పాలనిపించింది.

(ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా జనవరి 2010లో ప్రసారితం)         
  
Comments