అమ్మమ్మగారిల్లు - శ్రీదేవీ మురళీధర్

    వేసవికాలం సెలవులు.

    మార్చినెల సెలవలివ్వగానే అమ్మమ్మావాళ్ళ ఊరు వెళ్ళటం కొన్నేళ్ళుగా నాకు అలవాటు. సెలవులకీ అమ్మమ్మనీ తాతయ్యనీ చూచి తీరాల్సిందే. "ముసలి వాళ్ళం. ఎక్కడికీ రాం. మమ్మల్ని చూడటానికి మీరంతా వస్తూ ఉండండి. ఏదో మా ఘటాలిట్లా వెళ్లిపోవాల్సిందే మా ఊళ్ళో" అంటారిద్దరూ.

    మా అమ్మకి ఇద్దరు తమ్ముళ్ళూ, ఒక చెల్లెలూనూ. మామయ్యలిద్దరూ కేరాఫ్ అమెరికా. పిన్ని జయపూర్‌లో సెటిలయింది. మా నాన్నకు, అమ్మకూ హైదరాబాదులో ఉద్యోగం. నేను ఒక్కడినే కాబట్టీ, అమ్మమ్మ ఊరికి దగ్గరలో ఉండేది మేమే కాబట్టీ ఇలా ఎన్నో కాబట్టీల కారణంగా నేను తప్పనిసరిగా ప్రతీ సెలవులకీ రెండు నెలలు అక్కడ మకాం వేసేవాడిని.

    ఆ ఊరంటే నాకు ప్రాణం. సిటీల్లో అపార్ట్‌మెంట్లలో ఉండేవాళ్ళకీ అక్కడికి వెళ్తే జైలు నుండీ విడుదలై నట్లుంటుంది. మా తాతయ్యకి అక్కడ పొలాలూ కొబ్బరి తోటలూ ఉన్నాయి. అమ్మమ్మ, తాతయ్యా ఇద్దరిదీ మంచి ఆరోగ్యం అవటం వల్ల పనులన్నీ స్వయంగా చక్కబెట్టుకుంటూ ఉండేవారు. వాళ్ళ ఇల్లు పాతకాలం నాటిది. చాలా పెద్దగా, ఎత్తయిన గోడలతో, బరువైన చెక్కతలుపులతో విశాలంగా ఉండేది. ఆ ఇంటికి గేటులేదు. ముందంతా బోలెడన్ని పూలచెట్లు పందిరగుంజలూ, ఎన్నో రకాల కూరగాయల మడులూ ఉండేవి. ఒక పక్కగా గిలకబావి, ఇంటి వెనక పెద్ద పెరడు. నాలుగైదు పెద్ద మామిడిచెట్లు, నేరేడు, జామ, సీతాఫలం, దబ్బచెట్టు, ఒక చింతచెట్టూ ఉండేవి.

    ఇంటికి బాగా వెనకగా గొడ్ల కొట్టం, ఒక చిన్న పెంకుటిల్లు అందులో పాలేరు గంగాయి కుటుంబం కాపురముండేది.

    ఇల్లూ వాకిలీ చిమ్మి, నీళ్ళు చల్లి ముగ్గులెయ్యటం, కూరగాయలూ మొదలైనవి వంటకు సరిపడా కోసి పెట్టటం, పెరట్లో ఉన్న పెద్ద రోలు కడిగి, పీట వాల్చి సిద్ధం చెయ్యటం... ఒకటేమిటి...ఈ 'చిన్నాపొన్నా' పనులు తెల్లవారిన దగ్గర్నుంచి గంగాయి భార్యాపిల్లలు చకచకా చేస్తూ పోయేవారు.

    గంగాయి గొడ్లపనీ,పొలం పనులూ చక్కబెట్టుకొచ్చేవాడు. తాతయ్య ఎక్కడికి వెళ్ళినా నీడలాగా వెన్నంటి ఉండేవాడు.

    అమ్మమ్మ తెల్లవారక ముందే లేచి వంటిల్లూ, పూజలగదీ కడిగి, స్నానం చేసేది.ఎవరు ఎన్ని చీరలిచ్చినా అవి 'పిల్లలకు ఉండనీ' అని దాచిపెట్టి రెండో మూడో నేత చీరలు ఏడు గజాలవి కాశెపోసి(కచ్చాపోసి) కట్టుకునేది. ఒకటి చిలకాకుపచ్చ, రెండవది నెమలిఫించం రంగు... ఆ రెండు కలనేత చీరలు మాత్రమే కట్టుకునేది. కాలివేళ్ళకి పెద్దపెద్ద మట్టెలు, చేతులనిండా ఎరుపు, ఆకుపచ్చగాజులు... ముక్కుకి ముక్కెర, తెల్లరాళ్ళ కుచ్చు ముక్కుపుడక, చెవులకి పెద్ద పెద్ద తెల్లరాళ్ళ కమ్మలు... మెళ్ళో నాను, పలకసర్లు... పెద్ద ఎర్రటి కుంకం బొట్టు, తెల్లటి వెండి జుట్టు, పొడుగూ పొట్టీ కాకుండా ఉండి వత్తసరిగా ఉండేది.

    తాతయ్య బాగా పొడుగు, గుండూ, పిలకానూ, విభూతి, కుంకం ఎప్పుడూ ముఖాన ఉండాల్సిందే. మెళ్ళో రుద్రాక్షలు పాపం నాలుగైదు పళ్లు ఊడిపోయినాయి.

    వంటిల్లు, పూజగదీ దరిదాపుల పనులన్నీ అమ్మమ్మే స్వయంగా చూచుకునేది. గంగాయి పిండి తెచ్చిన పాల తప్పేలా కుంపటి మీదికెక్కించి మజ్జిగ చిలికి వెన్న తీసేది. తాతయ్య పొద్దున్నే చుట్ట కాల్చుకుంటూ కూచుంటే మజ్జిగ చేస్తూ "ఆడిపోసుకునేది". ఇలా అని తాతయ్యే అనేవాడు."ఎందుకే అలా ఆడిపోసుకుంటావ్?" అని.

    వంట మొదలు పెట్టి రోటి దగ్గర కూచుని పచ్చడి నూరేది. నన్ను పిలిచేది, అరచేతిలో పచ్చడి ఉంచి, 'ఉప్పుచూడరా సరిపోయిందో లేదో'అనేది.

    అమ్మమ్మ ఇంట్లో 'బ్రేక్‌ఫాస్టు' ఉండదు. పెద్ద గ్లాసుడు పాలు పంచదార వేసి తాతయ్య చేతికిస్తే ఆయన మరీ వేడి లేకుండా చల్లారపోసి నాకు ఇచ్చేవాడు. బూస్టో, హార్లిక్సో తాగే నాకు ఆ మాట కూడా గుర్తురానంత రుచిగా ఉండేవి ఆ పాలు. తాతయ్య స్నానం చేసి మడి కట్టుకుని సంధ్యవార్చుకున్నాక, పదకొండింటికి ఏకంగా భోజనం వడ్డించేది. వంటింట్లో పెద్ద పీట మీద తాతయ్య, చిన్నపీట మీద నేను, అమ్మమ్మ విసనకర్ర పెట్టి విసురుతుంటే వేడన్నం తినేవాళ్ళం.

    ఏ రకమైన పొడులూ, మసలాలు ఉండేవి కావు అమ్మమ్మ వంటలో. ఉప్పు, కారం, చింతపండు, తిరగమోతల డబ్బా వీటితోనే ఎన్నో వంటలు చేసేది. ఎక్కువగా నూనె, నెయ్యి కూడా వాడేది కాదు.

    తాతయ్య నాకు మొక్కలకు కలుపు తియ్యటం, మళ్ళకు నీళ్లు పట్టటం నేర్పాడు. ఆకుకూరలు ఎంత బలవర్థకాలో వాటన్నిటి పేర్లు, ఎలా వాటిని గుర్తించాలో వివరించాడు.

    అమ్మమ్మ తోటకూర, పొన్నగంటికూర వంటివి పచ్చిమిరపకాయ తిరగమోత వేసి పొడికూరగానూ, పాలకూర, బచ్చలి, గోంగూర, చుక్కకూర వంటివి పులుసు కూరగానూ వండేది.

    కూరలపాదులు... కాకర, బీర, బెండ వంటి వాటి పెంపకం ఎంత సుళువో చూపించి చెప్పేవాడు తాతయ్య. 

    అమ్మమ్మ వంటకూడా పూటకి సరిపడా, పనివాళ్ళకు కాస్త పెట్టతగినంత మాత్రమే చేసేది. రాత్రికి ఏవీ మిగిలేవి కావు. చారూ, కందీ, పెసరా వంటి పచ్చళ్ళూ, కవ్వం తిప్పిన మజ్జిగ చేసేది. చారు సువాసన ఆరుబయటికి కూడా వచ్చేది.
   
    బెండకాయ, బీర, పొట్ల వంటివి ముద్దకూరగా వండేది. ముద్దపప్పుతో పాటుగా సొరకాయ లేదా బూడిద గుమ్మడి, మునక్కాడలు వేసి పులుసుకానీ, మజ్జిగ పులుసుగానీ పెట్టేది. గుమ్మడి వడియాలు, చల్ల మిరపకాయలు వేయించేది. అప్పుడప్పుడు చింతకాయ, ఉసిరికాయ, దోసకాయ రోటి పచ్చళ్ళు చేసేది. తాజాగా తీసిన వెన్న నాకు అన్నంలో వేసేది. నాకు సరిగా కలుపుకొని తినటం రాదని ఇద్దరూ అనుకునేవాళ్ళు. అందుకే అమ్మమ్మ ఒక్కొక్కటి తనే కలిపి తినమనేది. తను కలిపినంతా తినాల్సిందే. తిన్నంతసేపూ, 'ఇదేం తిండీ... మీ మామయ్యలు నీ అంత ఉన్నప్పుడు...' అని చెబుతూనే ఉండేది.

    ఇంట్లో రోజూ డైనింగ్ టేబిల్ దగ్గర నానా గోల చేసి అమ్మ వంటకు పేర్లు పెట్టే నాకు అమ్మమ్మ వంట ఎంత ఇష్టమో చెప్పలేను. "పాపం బంగాళాదుంపలు ఎర్రగా వేయించి పెట్టవే బిడ్డకి" అని తాతయ్య అడిగితే

    "ఏమఖ్ఖరలేదు. వాళ్ళ ఊళ్ళో రోజూ తినేవి అవేగా. నాలుగు రకాల కూరలు తినడం నేర్చుకోవాలి. లేక పోతే 'అవొద్దు, ఇవొద్దు' అని షోకులు పోతారు రేపు పెద్దయ్యాక" అని కొట్టిపారేసేది.

    లేత కాకరకాయలు మధ్యలో గాటుపెట్టి ఉప్పూ కారంతో పాటు పంచదార కలిపి, అందులో కూరి దోరగా వేయించి తినిపించేది. "తీపి, పులుపు, కారం లాగా చేదు కూడా ఒక రుచే. అది తినడం కూడా అలవాటు చేసుకో, ఒంటికి ఎంతో మంచిది" అని నచ్చచెప్పేది.

    నేను ఇష్టంలేనట్లు ముఖం చిట్లిస్తే కాకరకాయ కూర కలిపిన అన్నం ముద్దలు నోట్లో పెట్టేది. రెండు ముద్దలు తిన్న తరువాత ఆ రుచి కూడా 'సూపర్' అనిపించేది. కొన్నిసార్లు సాయంత్రం మినపపిండితో పునుగులు, పులిబొంగరాలు చేసేది. అరిశెలు, వేరుశెనగపాకం, కొబ్బర్లౌజు లాంటివి చేసి డబ్బాకి ఎత్తిపెట్టేది సాయంత్రం తోచక ఆకలి అంటానని.

    ఇంటి ముంగిట్లో రంగురంగుల ముగ్గులు పెట్టినట్లు మందార, పారిజాతం పూలచెట్లు ఉండేవి. నేను  ఉడతా భక్తి సాయం చేస్తూంటే తాతయ్య మడి ధావళీ కట్టుకుని తేవతార్చనకు పూలు కోసేవాడు. వేసవి సాయంత్రాలు బావిదగ్గర చేసే 'ఓపెన్ బాత్' నేను చాలా ఎంజాయ్ చేసే ఘట్టాలలో ఒకటి.

    గంగాయి బిందెలతో తోడి నా మీద పోసేవాడు. నేను అల్లరిగా గెంతుతూంటే గంగాయి పిల్లలు చప్పట్లు కొట్టి ఎగిరేవాళ్ళు. తాతయ్య, అమ్మమ్మ కళ్ళల్లో తమ పిల్లల చిన్నతనాలు కదిలేవి కాబోలు అలాగే గుడ్లప్పగించి నన్ను చూస్తూ ఉండేవాళ్ళు.

    మా ఇంట్లో టీవీముందు గంటలు గంటలు కూర్చుని లేవని నేను తాతయ్య చెప్పే కాశీమజిలీ కథలు, చందమామ కథలు ఆసక్తిగా వినేవాణ్ణి. అమ్మమ్మ దగ్గర పెద్దబాలశిక్ష ఉండేది. అది మా అమ్మవాళ్ళ చిన్ననాటిదట. రాత్రి పడుకున్న తరువాత నా చేత  'అశ్విని, భరణి' అంటూ నక్షత్రాల ఇరవై ఏడు పేర్లు, 'ప్రభవ, విభవ' అంటూ తెలుగు సంవత్సరాల పేర్లు నా కళ్ళు మూతలు పడేదాకా వల్లెవేయించేది.

    అలా నాకు తెలీకుండానే నేను మా అమ్మమ్మ బళ్ళో సుమతీశతకం, వేమన పద్యాలు, సామెతలు, దిక్కులు... ఇలా లెక్కలేనన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాను ప్రతి ట్రిప్పులోనూ. అమ్మమ్మకు చదవడము, రాయడము కూడా వచ్చు.

    మధ్యాహ్నాలు ఇంటి పని ముగిసిన తరువాత సామాన్ల కొట్టిడి దగ్గర గంగాయి భార్యను కూచోబెట్టుకుని ఆవాల దగ్గర్నుంచీ బియ్యం దాకా చాటలో పోసుకొని శుభ్రంగా ఏరేది. చింతపండు గింజలు వలిచేది. ఈనెలు తీసేది.

    తాతయ్య, అమ్మమ్మ, నేనూ పోటీలు పడి వత్తి విడిపించి దీపారాధనకి వత్తులు చేసేవాళ్ళం. పువ్వొత్తులు, పొడవాటివి చాలా చక్కగా, ఒక్కొక్కటీ శ్రద్ధగా వత్తిని మెలితిప్పుతూ చేసేది.

    కార్తీక మాసం కోసం మూడొందల అరవై వత్తుల కట్టలు చేసేవాళ్ళం. ఎవరెక్కువ చేస్తారనే పోటీ నాకూ తాతయ్యకీ మధ్య ఎక్కువగా ఉండేది.

    వత్తులు చేసినంత సేపూ భగవంతుణ్ణి ధ్యానించాలని అమ్మమ్మ చెప్పేది. తాతయ్యకి కబుర్లంటే ప్రాణం.

    "అబ్బబ్బ. అలా వసపిట్టలాగా వాగుతూ చెయ్యకపోతే రామనామం చేసుకోరాదూ... ఇహానికి ఇహము, పరానికి పరం" అని తాతయ్యను కసిరేది.

    "ఆ... నువ్వు చేస్తున్నావు చాల్లే... పెద్ద బడాయి" పిల్లవాడి ముందు కసిరిందని అలిగి చురక అంటించేవాడు తాతయ్య.

    అన్నట్లు... అప్పడాల పిండి కలిపినప్పుడు వట్టిదీ తినేవాళ్ళం, అన్నంలో నెయ్యివేసి కలుపుకునీ తినేవాళ్ళం. అదొక ప్రత్యేకమైన రుచి.

    అన్నింటికంటే విశేషంగా చెప్పాల్సింది అమ్మమ్మ ఆవకాయ గురించి.

    ఆవకాయల రోజులొస్తే అమ్మమ్మ చెప్పలేనంత బిజీ! గంగాయిని పెరట్లో చెట్లెక్కించి కాయలు కోయించేవాడు తాతయ్య.

    గంగాయి పిల్లలతోపాటు నేను వాటిని బావి దగ్గర తొట్లో కడిగేవాణ్ణి. అమ్మమ్మ శుభ్రమైన తెల్లటి తుండుగుడ్డ ఇస్తే తాతయ్య నేను అది పెట్టి మామిడి కాయల్ని తడి లేకుండా తుడిచేవాళ్ళం. ఉప్పూ కారం కొద్దిగా అరచేతిలో కలుపుకుని ముక్క 'రుచి' చూచేవాళ్ళం. పళ్ళు పులిసే పులుపు. 'అబ్బో బోలెడంత ఉప్పూకారం పడుతుంది ఈసారి' అనుకునేది ప్రతిసారీ.

    పెద్ద వంట భాండీలు అటక మీది నుంచి దింపించి వాటిల్లో ఉప్పూ, కారం, ఆవపిండి, సెనగలు, ఇంగువా నూరి కలిపి, చివరగా నువ్వుల నూనె పోసేది. ముక్కల్ని కొద్దికొద్దిగా కారం నూనెలో వేస్తూ నాలుగువైపులా కలిపేది. ఆ పచ్చడిని గోడవారగా చేర్చి పెద్ద మూతలు పెట్టి మూడు రోజులు 'ఊరబెట్టేది'. నాలుగోనాడు 'తిరగగలిపి' రుచి చూడమని అన్నంలో వడ్డించేది. 'ఉప్పు చాలిందో లేదో జాగర్తగా చూచి చెప్పండి. చాలకపోతే, పచ్చడంతా బూజు పడుతుంది' అని హెచ్చరించేది నన్నూ, తాతయ్యని.

    జాగ్రత్తగా జాడీలకు ఎత్తిపెట్టి 'ఈ ఏడాది గడిచింది' అని తృప్తిగా నిట్టూర్చేది.

    గంగాయి... కుటుంబానికి కావలసిన ఆవకాయ తీసి ఇచ్చేది. వాడి ముఖం, వాడి పిల్లల ముఖాలు సంతోషంతో వెలిగిపోయేవి. తరువాత ఇరుగూ పొరుగూ వాళ్ళకు పంపేది. విచిత్రమేమంటే అమ్మమ్మకు ఎవ్వరూ ఆవకాయ తెచ్చిచ్చేవాళ్ళు కాదు.

    'ఆ, నీకేం నచ్చుతుంది లేవమ్మా మా ఇంటి ఆవకాయ, నీ అంత రుచిగా ఊళ్ళోనే కాదు, దేశంలోనే ఎవ్వరూ పెట్టలేరు' అనేవాళ్ళు అందరూ. 'నిజమే' అనేవాడు తాతయ్య గర్వంగా.

    మామయ్యలకు అమెరికా పంపటానికీ, పిన్నికి జయపూరు పంపటానికీ, మాకూ జాడీలు తీసిపెట్టేది. ఆ జాడీలను నాతో హైద్రాబాదు తెచ్చేవాణ్ణి, ఏవో తిప్పలు పడి అమ్మానాన్నా వాటిని గమ్యం చేర్చేవాళ్ళు. ప్రతీసారీ అన్నం తిన్న తరువాత ఆవకాయ ముక్కను కడిగి కొరుక్కుంటూ ఇల్లంతా తిరిగేవాణ్ణి. అమ్మమ్మ దగ్గరికి వెళ్తే 'బోరు కొడుతుంది' అనే మాటే ఉండేది కాదు.

    ఏవో గేమ్స్, కామిక్‌లూ నాతో తీసుకు వెళ్ళినా అవి పెట్టెలోంచి  బయటకు తీసే అవసరం ఎప్పుడూ రాలేదు.

    ప్రతీవారం ఆముదంతో తలంటేది. గంగాయి ఒళ్ళంతా నూనె పట్టించేవాడు. 'ఎండలో బాగా నాననీ' అనేది అమ్మమ్మ. జిడ్డు వదిలేదాకా నలుగు పెట్టి నల్చేవాడు. కుంకుడు రసం పెట్టి తలరుద్దేది. గాడి పొయ్యిపై కాచిన వేడివేడి నీళ్ళు నాలుగైదు బక్కెట్లు పోసేది.

    ఎందుకోగానీ తలంటి స్నానం పూర్తవగానే నిద్ర ముంచుకొచ్చేది. 

    ఒకరోజు నేను స్కూలు నుండి ఇంటికి వచ్చేసరికి చుట్టాలతో ఇల్లంతా హడావుడిగా వుంది. అమ్మ ఏడుస్తోంది.

    అమ్మమ్మ చచ్చిపోయిందిట.

    ఏ జబ్బూ, జ్వరమూ లేకుండా ఉన్నపళంగా ప్రాణం పోయిందిట. "ఏడవకమ్మా, ఆమెకేం మహారాజు, ఎవ్వరితోనూ చేయించుకోకుండా, మంచం పట్టి రొష్టు పడకుండా తిని తిరుగుతూ పువ్వులా రాలిపోయింది, మహారాజు" అని అమ్మను అంతా ఓదారుస్తున్నారు.

    అమ్మమ్మ చచ్చిపోవటమేమిటి రబ్బిష్ అనుకున్నాను. పూర్తిగా నమ్మలేదు కూడా.

    ఆ రాత్రి అమ్మమ్మ వాళ్ళ ఊరు చేరాము. మామయ్యలకు కబురు అందినా వాళ్ళు అప్పటికప్పుడు రాలేకపోయారు. రెండు మూడు రోజులు పట్టవచ్చు అన్నారు. పిన్ని కుటుంబం, చుట్టాలు వచ్చారు. అప్పటికే ఊరంతా ఆ ఇంట్లో ఉంది.

    తాతయ్య ముందు వసారాలో గుంజకు ఆనుకుని చుట్టకాలుస్తూ కూర్చున్నాడు. ఎవ్వరికీ తాతయ్యను పలకరించే ధైర్యం లేకపోయింది. "అయ్యో ఈ వయస్సులో ఈ కష్టం ఎట్లా ఓర్చుకుంటాడు?" అని అమ్మా, పిన్నీ తండ్రిని చూచి విలవిలలాడారు. అమ్మమ్మ మీద వాలిపోయి ఇద్దరూ ఒకటే ఏడుపు. అమ్మమ్మకి ముఖమంతా పసుపు రాసారు. పెద్ద కుంకం బొట్టు పెట్టి కొత్త చీర తీసి కప్పారు.

    గంగాయి కుటుంబం శోకాలు పెట్టి ఎలుగెత్తి ఏడుస్తున్నారు. అక్కడ ఏడవని వాళ్లు లేరు, నేను తాతయ్య తప్ప!

    "ఈ బిడ్డంటే ప్రాణం. ఏటేటా వస్తాడాయె. ఏదో చేసిపెడదామని ముసిలామెకి తాపత్రయం" నన్ను చూపించి చెప్పుకున్నారంతా.

    నా బిక్కముఖం చూచి 'ఎన్నడూ చావు చూచి ఎరగడు పాపం' అనుకుని బాధపడ్డారు అమ్మానాన్నా.

    బ్రాహ్మలు వచ్చి మంత్రాలేవో చదువుతున్నారు. తాతయ్యను రమ్మన్నారు. స్నానం చేసిన తడిబట్టలతో వచ్చి కూర్చుని వాళ్ళు చెప్పినట్లు చేస్తున్నాడు. తాతయ్య ఎవరి వంకా చూడటం లేదు... అమ్మమ్మ కసిరినప్పుడు అలిగినట్లున్నది ఆయన ముఖం.

    నా కళ్ళకు మొదటిసారిగా 'ముసలితనం' కనిపించింది ఆయనలో.

    అమ్మమ్మ చుట్టూతిరిగి నమస్కారాలు చేస్తున్నారంతా. చివర్న ఆమె నోటి దగ్గర బియ్యపుగింజలు వేస్తున్నారు. నా చాత కూడ వేయించారు. అమ్మమ్మ అలా కదలకుండా అంతసేపు పడుకుని ఉండటం ఎన్నడూ చూడలేదు. ఎప్పుడూ ఏవో పనులు చేస్తూ, పురమాయిస్తూ తిరిగేది... ఇదేనా చావంటే?

    అమ్మమ్మకు బియ్యం పెట్టినప్పుడు మాత్రం చెట్టు విరిగినట్లు కూలిపోయాడు తాతయ్య. పెద్దపెట్టున ఏడ్చి "నీ ఋణం  ఇవాళ్టితో తీరిపోయిందా" అని తలబాదుకున్నాడు, చూడలేకపోయాను.

    పరిగెత్తి వెళ్ళి తాతయ్యను చుట్టుకున్నాను. నాకూ ఏడుపు లోపల్నుంచి తన్నుకొచ్చింది. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న నన్ను నాన్న లోపలికి తీసుకువెళ్ళాడు.

    ఊరంతా తనకోసం ఏడుస్తోంటే అమ్మమ్మ ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపోయింది.

    ఆ డిసెంబరు నెల చాలా నెమ్మదిగా నత్తనడక నడుస్తూ గడిచింది. మార్చిలో పరీక్షలు కాగానే ప్రతిసారిలా 'అమ్మమ్మ వాళ్ళ ఊరు' ప్రోగ్రాం వేశాను. 'నీ మొహం ఏముందక్కడ? అసలే పెద్దాయన ఒక్కడూ ఇబ్బంది పడుతూంటే' అని విసుక్కున్నాడు నాన్న.

    "ఏం చేద్దాం... మొదటినుంచీ ఇద్దరికీ మొండి పట్టుదల... అక్కడే ఉండి, అక్కడే రాలిపోవాలని" కళ్లు తుడుచుకుంటూ అన్నది అమ్మ.

    "ఆయన వస్తే ఎవరు కాదంటారు? అందరమూ అడిగాము. కాళ్ళా, వేళ్ళా పడ్డాము. ఊహూ వింటేనా?" కాస్త కోపంగా అన్నాడు నాన్న.

    "ఆవిడను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. ఉన్న పళంగా అందరూ రమ్మంటే మాత్రం ఇష్టపడొద్దూ? ఆ ఇల్లు వదిలి ఎక్కడా ఉన్న అలవాటే లేదాయె' బాధగా అనుకున్నది అమ్మ.

    అలా నన్ను పంపకుండా ఒక నెల గడిచింది. ఇంతలో గంగాయిని వెంటబెట్టుకుని ఊరి పెద్దమనిషి వచ్చాడు మాయింటికి. తాతయ్య పంపించాడు నన్ను వెంటబెట్టుకు రమ్మని. ఇంక నన్ను పంపక తప్పింది కాదు. ఎగిరి గంతేసి బట్టలు సర్దుకొని బయలుదేరాను.

    అమ్మమ్మ లేని లోటు స్పష్టంగా కనిపించింది. నాకు ఎంతో ఇష్టమైన ఆ ఇంటినీ, పెరడంతా తిరిగి తిరిగి చూశాను. అమ్మమ్మ నాకు కనపడకుండా ఎక్కడో ఇంకా తిరుగుతూందనే అనిపించింది కానీ 'చచ్చిపోయింది ఇంక రాదు' అనుకోవటం చాతకావట్లేదు, ఎందుకోమరి! తాతయ్య నన్ను చూచి చాలా ఆనందపడ్డాడు. అమ్మమ్మ చేసినంత బాగా కాదు కానీ వంటా అదీ తాతయ్యే చేస్తున్నాడు.

    'రారా శేషూ అన్నానికీ' అని పిలిచి వంటింట్లో చిన్న పీట వాల్చాడు. అన్నం కూర వడ్డించాడు.

    రుచి ఫరవాలేదు.

    'కలపనా?' అనడిగితే వద్దులే అన్నాను. అమ్మమ్మ నా దగ్గర కూచుని విసురుతూ మధ్య మధ్య అనుపానాలు కలిపి తినమనటం గుర్తొచ్చింది తిన్నంతసేపూ. అమ్మమ్మ కబుర్లు చెప్తే తాతయ్యను ఏడిపించటం ఔతుందనిపించి సాధ్యమైనంత వరకు వేరే కబుర్లు చెప్పాను.

    తాతయ్య మామూలుగానే కనిపించాడు. నవ్వుతూ ఏవేవో విషయాలు మాట్లాడాడు. పాత తాతయ్యలాగే ఉన్నాడు.

    మధ్యాహ్నం పొలం దగ్గర ఏవో పనులుండి గంగాయితో వెళ్ళాడు. పెరట్లో మామిడి చెట్టుకింద చప్టామీద చాప వేసింది గంగాయి భార్య. పైకి చూస్తూ వెల్లకిలా పడుకున్నాను. చెట్టునీడ హాయిగా ఉంది. ఎండ తగిలీ తగలకుండా మెల్లగా గాలి వీస్తోంది.

    గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు విరగకాసి ఉన్నాయి. 'ఎన్ని కాయలో? ఇంకెవరు కోస్తారు? ఆవకాయ పెట్టేవాళ్ళే లేరుగా' అనుకున్నాను.

    అబ్బ! ఆవకాయ పెట్టేటప్పుడు ఎంత హడావుడి చేసేది అమ్మమ్మ. ఇంకెప్పుడూ ఆవకాయ పెట్టం కదా. ఎవరు నా చేత ముక్కలు తుడిపించి, జీడి తీయిస్తారు? అంత రుచిగల ఆవకాయ ఎవరు కలుపుతారు?

    అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళింది? తాతయ్యనూ, ఇంటినీ వదలి ఎలా వెళ్ళగలిగింది? ఈ ఇల్లు వదిలి ఎవరి దగ్గరకీ రాని మనిషి అలా నిద్రపోయినంత తేలికగా ఎటు మాయమైపోయింది? జరిగినదంతా గుర్తొచ్చి కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి.

    'యెబ్బే! ఏడుస్తారా ఎవరైనా?' అన్నట్లు వినిపించింది. అమ్మమ్మ గొంతే అది. కన్నీళ్ళు తుడుచుకుని చుట్టూ చూస్తే గంగాయి పిల్లలు చెట్లెక్కి ఆడుతున్నారు. నేను కూడా గబగబా చెట్టుపైకి ఎగబాకాను. పైకి... పైపైకి ఎక్కాను దట్టంగా ఉన్న మామిడి కొమ్మల నిండా కాయలు వ్రేలాడుతున్నాయి.

    'ఒరే నువ్వు కిందికి దిగరా. నేను కాయలు కోసి పడేస్తా, పట్టుకో' అన్నాను గంగాయి కొడుకుతో. చాలా కాయలు కోసి కిందకి పడేస్తే వాడు నవ్వూతూ 'కేచ్' పట్టుకున్నాడు.

    'శేషూ' అని తాతయ్య గొంతు వినిపించింది. "ఇక్కడ, ఇక్కడ" అని అరిచాను చెట్టుపైనుంచి.

    "ఆరి భడవా, ఎంత పైకెట్టా ఎక్కావురా" అన్నాడు తాతయ్య ఆశ్చర్యంగా పైకి చూస్తూ. "దిగిరా, జాగ్రత్త చేతులూ కాళ్ళూ దోక్కోకుండా చూసుకు దిగు" అన్నాడు.

    దిగి వచ్చి 'తాతయ్యా చూడు, ఎన్ని కాయలు కోశానో' అన్నాను. ఒక్కక్షణం ఏమని మాట్లాడాలో అర్థం కానట్లు ఉండిపోయాడు తాతయ్య.

    'భలే... మంచి కాయలు ఏరి కోశావులే. రా, లోపలికి పోదాం' అంటూ నన్ను తీసుకుని లోపలికి నడిచాడు. గంగాయి పిల్లలు కాయల్ని కుప్పగా రాతి తొట్టి దగ్గర పోశారు.

    "తాతయ్యా, మరీ ఇందాక నేను మామిడి చెట్టుకింద కూచుంటే అమ్మమ్మ బాగా జ్ఞాపకం వచ్చి ఏడుపొచ్చింది... అంతలో" అంటుండగానే 'మీ అమ్మమ్మ గొంతు వినిపించిందా?' అన్నాడు తాతయ్య నవ్వుతూ.

    'అరె నీకెట్లా తెలుసు?' అన్నాను ఆశ్చర్యపోయి. గట్టిగా నవ్వాడు. 'అమ్మమ్మ ఇక్కడే ఉందిరా. ఎక్కడికీ పోలేదు. రోజంతా నా మీద ఒక కన్నేసి ఉంచుతుంది. నేను లేచానో లేవలేదో, తిన్నానో లేదో, అన్నీ ఒక కంట కనిపెడుతుంది.'

    'మరి నువ్వు చుట్ట కాల్చేటప్పుడు ఆడిపోసుకుంటుందా?' అనడిగాను.

    చిన్న మొట్టికాయ వేశాడు తాతయ్య.

    "నన్ను ఆడిపోసుకోకపోతే దానికి రోజు గడుస్తుందిట్రా?" అన్నాడు నిట్టూర్చి.

    తాతయ్య చుట్టలు కాల్చటం బాగా తగ్గించాడు. అలవాటుగా రోజూ కాల్చటం లేదు. నేనున్న రెండు నెలల్లో ఒక నాలుగైదు సార్లు కాల్చాడేమో.

    'తాతయ్యా మనం ఏడుస్తూ కూచుంటే అమ్మమ్మకు నచ్చదు కదా' అన్నాను అమ్మమ్మ పద్ధతులు గుర్తుచేసుకుంటూ. అమ్మమ్మ చాలా ప్రాక్టికల్ మనిషి. పల్లెటూరులో ఉంటూ కూడా ఆ వయసు పెద్ద వారిలో ఉండే భావకాఠిన్యం, చాదస్తాలు ఆమెలో చాలా తక్కువనే చెప్పాలి.

    "ఛఛ, ఎందుకురా ఏడుస్తూ కూచోవటం? ఎందుకంట? లక్షణంగా తాను తింటూ, నలుగురికీ చేసి పెడుతూ, మంచం పట్టకుండా తిరుగుతూ తిరుగుతూ వెళ్ళిపోయింది మహారాజు" కండువా దణ్ణెం మీద వేస్తూ అన్నాడు.

    "ఏమో తాతయ్యా, చెట్టు నిండా మామిడికాయలు చూచి ఆవకాయ పెట్టుకోవటం ఇంక లేదేమో ననిపించింది. ఇంట్లో కూడా, మునుపటిలా... అమ్మమ్మ ఉన్నప్పటిలాగా లేదు..." మళ్ళీ కన్నీళ్ళొచ్చాయి నాకు.

    తాతయ్య ఏమీ అనలేదు. మంచం  వాల్చుకుని కూర్చున్నాడు. వాన వెలసిన ఆకాశంలా విప్పారి ఉంది ఆయన ముఖం. రెండు నెలల క్రితం చావు జరిగినప్పుడు చూచిన తాతయ్యలా లేడు. అమ్మమ్మ ఉన్నప్పటి తాతయ్యలాగే హాయిగా ఉన్నాడు.

    నా చేతిని తన చేతిలోకి తీసుకుని దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు.

    'ఎలా ఉంటుందిరా శేషుడూ... ఎప్పటికీ మనకు మునుపటిలా ఉండదు. అడుగడుక్కీ జ్ఞాపకాలు వదిలి పెట్టి పోయిందాయె. ఏం చేస్తాం? తప్పనిసరి ప్రయాణం.

    చూడు మనిద్దరం ఇలా బాధపడటం మళ్ళీ జరగకూడదు. ఇలా బాధపడాలనీ, ఏడుస్తూ కూచోవాలనీ కాదు మీ అమ్మమ్మ వెళ్ళిపోయింది... తను లేకపోయినా మనం మామూలుగా బతక గలగటం అలవాటు చేసుకోవాలని..." అన్నాడు తాతయ్య.

    "పద, మీ అమ్మమ్మ బాలశిక్ష తీసుకొచ్చి కాసేపు కాలక్షేపం చేద్దాం" నాకు తోచటం లేదనీ అందుకే అమ్మమ్మను మాటిమాటికీ తల్చుకుంటున్నాననీ అనుకుని లేచాడు. మండువాలో ఒక ప్రక్కగా కావిడిపెట్టె ఉన్నది. దాంట్లో ఏవేవో వస్తువులు ఒక అద్దాలు కుట్టిన బట్ట సంచీ తీశాడు. దాంట్లో అమ్మమ్మకూ, తాతయ్యకూ పిన్నీ, మామయ్యలు, అమ్మా రాసిన ఎన్నో ఉత్తరాలు, ఫోటోలు ఉన్నాయి. న్యూస్ పేపరుతో అట్టలేసిన 'పెద్దబాలశిక్ష' తీసాడు.

    అపురూపమైన ఆ పుస్తకాన్నీ, సంచినీ తీసుకుని బయటికి వచ్చాం. మామయ్యలు తమ తల్లిదండ్రుల్ని రమ్మని పోరుతూ రాసిన ఉత్తరాలు, పిన్ని అమ్మ పండుగలకి రమ్మని రాసిన కార్డులూ, మా చిన్నతనాలవి బోలెడన్ని ఫోటోలు... ఆవకాయ, వంటలూ ఎలా చెయ్యాలో తెలియబరచమని కోడళ్ళు రాసిన ఉత్తరాలు... ఇలా ఎన్నెన్నో...

    బాలశిక్ష తిరగేశాం. తెలిసినవే మళ్ళీమళ్ళీ ఇద్దరం గట్టిగా చదివి నవ్వుకున్నాం. అప్పుడు కనిపించింది... పుస్తకం ఆఖర్న 'న్యూస్‌పేపర్ మడత దగ్గర జాగ్రత్తగా మడిచి పెట్టిన రూళ్ళ కాయితం'.

    'ఇదేమిట్రోయ్?' అంటూ ఆశ్చర్యంగా దానిని మడత విప్పాడు తాతయ్య.

    ఆవకాయ పాళ్ళు అని గొలుసుకట్టు రాతలో రాసి వుంది హెడ్డింగు.

    ఆవపిండి, ఉప్పు వంటి దినుసులు, ఎన్ని కాయలకు ఎంత కొలత వెయ్యాలో లెఖ్ఖరాసి వుంది. పచ్చడి కలిపే విధానం, ఊరిన తరువాత తిరగతిప్పే విదానం ఉన్నది. అయితే కిలోగ్రాముల లెఖ్ఖ కాకుండా సోలేడు, గిద్దెడు, మానెడు వంటి యూనిట్లు రాసి ఉన్నాయి.

    ఈ కాగితం చివర్న అమ్మమ్మ బ్రాండు ప్రాక్టికాలిటీ కనిపించింది.

    పచ్చడి కొలతలు పిల్లలకు అర్థం కావని తెలుసేమో "మన పెద్ద స్టీలు గ్లాసుతో రెండు... గిద్దడంటే మనం పప్పు కొలుచుకునే బోడిగిన్నెతో..." ఇలా వివరణలు ఇచ్చింది.

    "ఎప్పుడో తన పిల్లలకోసం రాసిన బాపతు కాయితం లాగుంది" అన్నాడు. మాయిద్దరిలో ఏదో ఎగ్జయిట్‌మెంట్. ఏదో సంతోషం..."పదరా అబ్బీ... లేలే..." అన్నాడు తను ఒక్క ఉదుటున లేచి

    "ఎక్కడికి తాతయ్యా?"

    "హారి పిచ్చెధవా... ఇంకా అర్థం కాలెదుట్రా? ఈ కాయితం ఏమిటనుకున్నావ్? మీ అమ్మమ్మ ఆవకాయ పెట్టమని ఆర్డరు వేసింది.

    ఇందాక నీ చేత కాయలు కోయించింది. ఇప్పుడు ఈ కాయితం మనిద్దరి చేతికీ ఇచ్చింది, ఎట్లా పచ్చడి కలపాలో తెలుసుకొమ్మని."

    నిజమేననిపించింది. అమ్మమ్మ ఆవకాయ ఇక తినే అవకాశం లేదనుకున్నాను. ఎవరు పెడతారని బాధపడ్డాను. ఇప్పుడూ ఇలా జరగటం వింతగా, అద్భుతంగా అనిపించింది. 

    అనుకోవటమే ఆలస్యం... చకచకా పనులు ఊపందుకున్నాయి. గంగాయి పిల్లలు కాయల్ని కడిగి తెచ్చారు. నేనూ, వాళ్ళూ శుభ్రంగా కాయల్ని తుడిస్తే తాతయ్య, గంగాయి అటకమీద నుండి భాండీలు దింపి చకచకా ముక్కల్ని 'ఆరు పచ్చాలు'గా కొట్టాడు. జీళ్ళు తీసి తుడిచిపెట్టుకున్నాం.

    తాతయ్య లెక్క చూసుకుంటూ దినుసులు కలిపాడు. సెనగలు, మెంతులు మర్చిపోతే నేను గుర్తుచేశాను. నూనె కలిపాక సరిగ్గా అమ్మమ్మ చేసినట్లే నేనూ, తాతయ్య పిండిని పైకీ కిందికీ చాలాసేపు కలిపి, ముక్కలు జాగ్రత్తగా కలిపాము.

    పెద్ద మూతలు పెట్టి గోడవారగా భాండీలను నెట్టాము.

    అప్పటికే చీకట్లు ముసురు కుంటున్నాయి. గంగాయి భార్య సంజెకసువు చిమ్మి గుట్లో దీపం పెట్టింది.

    తాతయ్య స్నానం చేసి వచ్చి తులసికోటలో దీపం పెట్టాడు. కుంపటి మీద అన్నం వండి, చారు పడేశాడు. నేనూ స్నానం చేశాను.

    కారం నూనె తగిలిన అరచెయ్యి భగ్గున మండుతూంటే ఊదుకుంటూ కూర్చున్నాను.

    కొబ్బరినూనె తెచ్చి అరచేతికి  మర్దించాడు. తాతయ్య 'తగ్గిపోతుందిలే' అంటూ. నిజంగానే పావుగంటలో తగ్గిపోయింది.

    "మొత్తానికి ఈ ఏడాది అలవాటు తప్పకుండా ఆవకాయ పెట్టించిందిరా మీ అమ్మమ్మ" అన్నాడు సంతోషంగా.

    "అమ్మమ్మ సంతోషిస్తుంది కదూ తాతయ్యా" అన్నాను.

    "ఓ తప్పకుండా, అన్నీ తనున్నప్పుడు జరిగినట్లే జరగాలని కోరుకున్నదేమోరా. ఎవ్వరూ తను లేకపోతే దేనికీ లోటు పడకూడదని దాని వెర్రి తాపత్రయం కాబోల్ను" అమ్మమ్మ మనసు నాకు విప్పి చెప్పాడు.

    తరువాత రెండేళ్ళకి తాతయ్య కూడా "తప్పనిసరి ప్రయాణం" చెయ్యవలసి వచ్చింది. అంతటితో అమ్మమ్మ ఊరు నా కళ్ళకు దూరమైనా, మనసులో శాశ్వతంగా, సజీవమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది.

* * *

    శేషుడు శేషగిరిగావయ్యాడు.

    ఒక్కోసారి వెనుదిరిగి చూసుకుంటే అమ్మమ్మ గారింట్లో గడిపిన వేసవికాలం సెలవులన్నీ వెరసి నా బాల్యంగా నా స్మృతిపథంలో నిలిచిపోయాయి. అమ్మమ్మ - తాతయ్యల విలక్షణ వ్యక్తిత్వాలూ, నామోషీ ఎరుగని కాయకష్టం, పిల్లలను సహజ స్వార్థ పూరితమైన మమకారంతో ఇంటికి కట్టివేసి  వారి అభివృద్ధి నిరోధించకుండా అందరి చదువులకనీ, పై చదువులకనీ ప్రపంచంలోకి వదిలి వారికి జీవితాన్ని, వారు వెదుక్కొనే స్వేచ్చను ప్రసాదించటం, భేషజాలకు పోకుండా సామాన్య జీవితాన్ని సంతృప్తితో గడపటం, ముఖ్యంగా అమ్మమ్మ ప్రాక్టికాలిటీ... ఎవరికీ అడ్డం కాకుండా, అడ్డం రాకుండా, తనదైన వ్యక్తిత్వంతో తన పరిధిలోనే ఒక ఉనికిని ఏర్పరచుకోవటం... ఇలాంటివన్నీ నా పిల్లలతో నేను వ్యవహరించే తీరు పైనేగాక, నా దైనందిన జీవితంపైన కూడా తమ ప్రభావాన్ని చూపించాయి. ఈ నా వైఖరిని నా తల్లిదండ్రులు 'శేషుడికన్నీ అమ్మమ్మ-తాతయ్యల పోలికలే' అని అనువదించుకుంటారు.

    ఇంతెందుకు? చిన్న చిన్న విషయాల ప్రసక్తి వస్తే నా పిల్లలు అన్ని కాయగూరలూ ఇష్టంగా తింటారు... కాకరకాయ కూడా. ఆకుకూరల పేర్లు, రకాలు, వాటి పోషక విలువలు వాళ్ళకి తెలుసు. మా ఇంట్లో కూడా ఆవకాయ పెట్టటం ఏటా ఒక తతంగం. సీజను వచ్చిందంటే నేనూ, పిల్లలూ, నా భార్యా కూచుని ఆవకాయ కలుపుతాం.

    అమ్మమ్మ 'రెసిపీ'కాగితం అతిజాగ్రత్తగా బీరువాలోంచి తీసి చేత్తో పట్టుకొని 'పాళ్ళు' చదివి ఆవకాయ కలపటం ఒక మాటలకందని అనుభూతి.

    పాతబడిన కాయితం, గొలుసుకట్టు దస్తూరీ, రెండు తరాల క్రితం తాతమ్మ రాసిన పాళ్ళు చదువుతూ మూడో తరం సంతతి ఆవకాయ పెట్టుకోవటం దేశంలో అరుదేమీ కాదేమో కానీ, నా ఇంట్లో అపురూపం! ఈనాటికీ మేము తినే భోజనంలో ఆనాటి మాతృమూర్తి వాత్సల్యం వ్యక్తమవటాన్ని ఏ పేరుతో పిలవగలను?

    కాలగతిలో ఎన్ని మార్పులొచ్చినా, మనిషిని నేలమీద స్థిరంగా నిలబెట్టి నడిపించే విలువలు మాత్రం మారవనే సత్యం నా వయసుతో పాటు గ్రహింపుకొచ్చింది. బహుశ అవే విలువల్ని నా నుంచి నా పిల్లలు నేర్చుకోవాలని తండ్రిగా ఆశిస్తున్ననుంకుంటా.

    ఇవాళ ఆదివారం. అరుగో పిల్లలొస్తున్నారు, పెద్దబాలశిక్ష పుచ్చుకుని. అమ్మమ్మ మూడో తరానికి కూడా మౌలికమైన లోకజ్ఞానాన్ని అందించటానికి నన్నొక పరికరాన్ని చేసింది.. ఇంక చెప్పటానికేముంది?

    చరిత్ర పునరావృతమౌతోంది...
Comments