అమ్మీ - ఎస్.గణపతిరావు

    
మహాభారతం డ్రామాలో కృష్ణుడికి పాట పాడి అదే డ్రామాలో శకునికి కూడా పాట ఉందని దర్శకుడు చెబితే ఆ పాత్రకి కూడా తానే పాడేస్తానని శకుని గొంతు తెచ్చుకొని ఓ గానగంధర్వుడు పాడి శ్రోతల్ని అబ్బురపరిచాడు. అంతేకాదు భీముడి గొంతుతో పాట పాడి వెంటనే కీచకుడికి కూడా పాడాడు.

    ఆ గాన గంధర్వుడు గొంతులు మార్చి అనేక డ్రామా ప్రదర్శనలలో రాముడికి, రావణుడికి పాడాడు. సుగ్రీవుడికి, వాలికీ పాడాడు. తన స్వరాన్ని ఆడ గొంతుకగా మార్చి సీతకు శూర్పణఖకీ పాడాడు.

    డ్రామాల్లో అందరికీ అతనే పాడడంచేత - అవకాశాలకోసం మోరలెత్తుకొని ఎన్నో యేళ్ళుగా ఎదురుతెన్నులు చూస్తూ అనేకమంది గాయకులు 'ఇహ లాభం లేద'నుకుని తమ స్వరపేటికల్ని చుర కత్తులతో కోసేసుకుని ఆ గాన గంధర్వుడికి 'సమర్పయామి'అంటూ స్వరార్పణ చేసేశారు.

    భరతఖండంలో ఆ విధంగా ప్రసిద్ధి చెందిన ఆ గానగంధర్వుడు వినమ్రుడై ప్రభుత్వాధినేతకు ఒకామెను పరిచయం చేస్తూ... "సార్ - ఒకప్పుడు ఈమె మంచి నటి. గాయని కూడా; ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించిపోయి ఆమె బ్రతుకు గతుకుల రోడ్డులా అయిపోయింది. ఆర్థిక స్థైర్యం యిచ్చేవాళ్ళు కానరాక అనునిత్యం దుఃఖసాగరంలో మునిగిపోతోంది. మీరే దిక్కని తీసుకొచ్చాను. మీరు చిరాకు పడకుండా మంచి మనసుతో ఈమెకు కాస్త ఆర్థిక సాయం చేయండి సార్! మీకు పుణ్యముంటుంది" అని అన్నాడు. 

    గానగంధర్వుడే స్వయంగా ప్రభుత్వాధినేత దగ్గరికి తీసుకువెడితే, ఆ ప్రభుత్వాధినేత మొహమాటానికి పోయి కాదనలేక పోయాడు. "అయితే కొంత సమయమివ్వండి" అన్నాడు. 

    కొన్నిరోజులైన తరువాత ఆ ప్రభుత్వాధినేత - నటి,గాయని అయిన ఆ 'బాల'కు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాడు. ఆ గాన గంధర్వుడు తన జేబు చిల్లు పడనందుకు చిలిపిగా నవ్వుకుంటూ ఎంతో సంతోష పడిపోయాడు.

    అయితే అమ్మీ, కోకి అనే రెండు కోకిలలు; ఆ గాన గంధర్వుడు ఏమైనా మంచి పాట పాడతాడేమోనని ఆశగా ఆ సమయానికి ప్రభుత్వాధినేత కార్యాలయానికి వచ్చి వరండాలో తచ్చాడుతూ ఫలితం లేకపోయేసరికి చాలా నిరాశపడిపోయి ఎగిరి అక్కడికి  దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద వాలాయి. 

    అంతే కాదు - అందులో అమ్మీకి ఈ గాన గంధర్వుడు చేసిన పని బొత్తిగా నచ్చలేదు. 

    రుసరుసలాడుతూ యిలా అంది. "ఈ రెండు లక్షల రూపాయలు ఈయన జేబునుంచి తీసివ్వలేడా? చాలా గొప్ప గాయకుడంటున్నావ్. దీనికోసం ప్రభుత్వ సమయం ఎంత వృధా చేశాడు? అంతే కాకుండా ప్రజలకి తప్పుడు సంకేతాలు కూడా యిచ్చాడు. ప్రజలు వాళ్ళ ఆర్థిక యిబ్బందుల్ని వాళ్ళే చూసుకోవాలి గానీ; ప్రభుత్వమేంటీ ధర్మ సంస్థా - డబ్బు సంచులు పట్టుకుని వచ్చిన వారందరికీ పంచడానికి?"

    దానికి రెండో కోకిల యిలా అంది - "అవునే అమ్మీ మా వాళ్ళెవరూ సొంత డబ్బు తీసి ఎవరికీ సహాయం చెయ్యరు... ప్రాణాలు పోతున్నా సరే! వాళ్ళ సుఖం, సంతోషం చూసుకుంటారు. మా వాళ్ళు ఒట్టి స్వార్థపరులు."

    "అవును కోకీ, నా చిన్నప్పుడు మీ దేశం కథలు మా ఫ్రెండ్స్‌తో కలిసి ఎన్నో చదివాను. అందులో ఒక కథ 'తన భర్తని బాణంతో చంపి - వేటగాడు మంటల్లో వేసి కాలుస్తుంటే - నా భర్త చనిపోయిన తరువాత నేను బ్రతికుండి ఏమి లాభం! నేను కూడా మంటల్లో పడి ఆ వేటగాడికి ఆహారమవుతానని ఒ  పావురాయి నిప్పుల్లో దూకి చనిపోయిన కథ' చదివిన తరువాత నాకు మీ దేశం మీద ఎంతో గౌరవం పెరిగింది. అలాంటి ఇంత గొప్ప త్యాగభూమిలో హృదయంలేని స్వార్థపరులెలా పుట్టుకొచ్చారే తల్లీ?" అంది అమ్మీ.

    అమ్మీ తన దేశాన్నీ, తన ప్రజల్నీ తక్కువచేసి మాట్లాడుతున్నట్లు కోకి భావించింది. వెంటనే టాపిక్ మార్చడం కోసం కోకి యిలా అంది - "సరేనమ్మా! అలా వెళ్ళి అక్కడ మామిడి తోటలో చల్లగా, ఉల్లాసంగా వుంటుంది. అక్కడ కలిసి హాయిగా పాటలు పాడుకుందాం పదా!!" అంది.

    "వద్దే కోకీ... యిలాంటి మనుషుల్ని చూస్తుంటే నా యీకలు రాలి - గొంతు కూడా పూడుకుపోతుందేమోనని భయంగా వుంది. నేవెళ్ళొస్తాను. నా 'పమేలా' అమ్మ గుర్తొస్తోంది" అంది అమ్మీ.

    "రాకరాక వచ్చావు - అప్పుడే వెళ్ళిపోతానంటావేమిటి?" అంది కోకి.

    "నువ్వేమీ బాధపడకే తల్లీ, నువ్వు చెప్పిన పెద్దమనిషి పాట ఎలా వుంటుందోగానీ; అతని నిర్వాకం చూసిన తర్వాత నాకిక్కడ ఒక్క నిముషం కూడా వుండడానికి యిష్టం లేదు. ఆ పమేలా యింటికే వెళ్ళిపోతా"నంటూ అమ్మీ మొండిపట్టు పట్టింది.

    'గానగంధర్వుడి మధురమైన పాటలు విందువుగానీ; ఎప్పుడూ యింగ్లీష్ డప్పులేనా అంటూ పిలిపించాను. అతని పాట లేకపోగా లేకి గుణం చూపించి దాని ముందు నా పరువు తీశాడు. అసలు దీన్ని శుభ్రంగా ఏ మామిడి తోటలోకో తీసుకెళ్ళి నాలుగు కబుర్లు చెప్పుకున్నా బాగుండేద'ని కోకి యిప్పుడు మరీ కుమిలిపోతోంది.

    'ఈ దేశంమీద ఎంతో ప్రేమతో నా అతిథిగా అమెరికా నుం చి  రెక్కలు కొట్టుకొంటూ ఎన్నో వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చింది. నాలుగు రకాల పళ్ళ రుచికూడా చూపించలేకపోయాను. అతిథిదేవోభవ అన్న ఈ దేశ సాంప్రదాయాన్ని నేను పాటించలేకపోయాను.'

    'అతను అలాగా... నేను ఇలాగా! ఈ బుద్ధులు చూసి అమ్మీ ఏమనుకుంటుందో? పైగా అమ్మీ పమేలా... పమేలా అని ఒకటే పలవరిస్తోంది. ఆ పమేలా ఏమిటో, దాని కథేమిటో తెలుసుకుందామని' కోకికి అనిపించింది. వెంటనే కోకి యిలా అంది "సరేనమ్మా నీ యిష్టం - అలాగే వెళ్దువుగాని. అమెరికా విశేషాలేంటి? బరాక్ ఒబామా పాటలేమైనా పాడతాడా!! ఆయన భార్య మిచిల్లీ కూడా చక్కగా వుంటుంది. ఆమెకైనా పాడటం వచ్చా?" అని అడిగింది కోకి.

    "అమెరికాలో ఉండేవాళ్ళందరూ ఏదో రాగం తీస్తూనే వుంటారు. పాట రాని వాళ్ళు ఆటలు ఆడని వాళ్ళంటూ ఎవరూ వుండరు. అయినా నేనెప్పుడూ 'పమేల అమ్మ' యింట్లోనే వుంటాను. అదే నాకు స్వర్గధామం" అంది అమ్మీ.

    "ఏమిటే ఎప్పుడు చూసినా పమేలా...పమేలా... అని తెగ కలవరిస్తున్నావ్. ఎవరా పమేలా? ఏమాకథ..? చెప్పు వింటాను?" అంది ఆసక్తిగా కోకి.

    మనస్సుని కలచివేసిన గాన గంధర్వుడి సంఘటన చూసిన తరువాత కోకీకి తప్పనిసరిగా పమేలా గురించి చెప్పాలనుకుంది అమ్మీ. యిలా ప్రారంభించింది. 

    "పమేలా అండర్సన్ పేరు వినేవుంటావు. 'బేవాచ్' టి.వి.సీరియల్‌లో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఆమె గురించి వర్ణించడానికి మాటలు చాలవే. ఆమె శరీర సౌందర్యం చూస్తుంటే ఎలాంటివారికైనా మతి పోతుంది. 'షవర్'లో కూడా ఆమెని నఖశిఖపర్యంతం దగ్గరగా వుండి చూస్తూ నేను పాటలందుకుంటాను... ఆమె కూడా రాగయుక్తంగా జత కలుపుతుంది.

    కోకీ, అలాంటి శృంగార దేవత ఏ స్వర్గ లోకాల్లోనూ వుండదంటే నమ్ము. నేనింతకూ ఆమె శరీర సౌందర్యం గురించే ఎందుకు చెబుతున్నానంటే - ఆమె అంతర్ సౌందర్యం కూడా - అంతకన్నా గొప్పదే తల్లీ.

    మీ దేశం అమ్మాయే... రష్యన్ తల్లికి, ఇండియన్ తండ్రికి జన్మించింది. ఆమె పేరు మోహినీ భరద్వాజ్. ఆమెకి 'జిమ్నాస్టిక్స్'లో తిరుగులేదు. అయితే ఒలింపిక్స్‌లో తన ప్రతిభ చాటాలనుకుంటే ఆర్థిక స్థోమత లేక దిగులుగా వుంది. ఆ సమయంలో ఆమె స్నేహితులు లాటరీ నిర్వహించి వచ్చిన డబ్బుతో మోహినీని ఒలింపిక్స్‌కి పంపించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నది తడవుగా లాటరీ టిక్కెట్లు ముద్రించి యింటింటికీ తిరిగి అమ్మడం మొదలెట్టారు. అలా అమ్ముతూ పమేలా యింటికి వచ్చారు. కాలింగ్ బెల్ మోగడంతో మా పమేల అమ్మ తలుపు తీసింది.

    తలుపు తీసిందో లేదో వాళ్ళు 'లాటరీ  టిక్కెట్ కొనండి మేడమ్. మీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది' అన్నారు. పమేలాకు చాలా కోపం వచ్చింది. 'నాకు లాటరీ టిక్కెట్లు కొనే అలవాటు లేదు. అలా వచ్చే బహుమతులన్నా నాకిష్టంలేదు. దయచేసి వెళ్ళండి!' అని అంది.

    వాళ్ళు ఒక పట్టాన వెళ్ళలేదు.'లాటరీ టిక్కెట్ కొనండి... ఫస్ట్ ప్రైజ్ మీదేనండి' అంటూ పాట కూడా పాడారు. నాకు కూడా వాళ్ళమీద తెగకోపం వచ్చింది. వచ్చినవాళ్ళు కరెక్ట్‌గా విషయం చెప్పకుండా - ఈ పాటలేమిటి? ఈ డ్యాన్స్‌లేమిటి?? అనుకున్నాను."

    "తర్వాత ఏమైంది?" అడిగింది కోకి.

    "ఏమౌతుంది? పమేలాకు కోపం వచ్చి తలుపు వాళ్ళ మొహమ్మీద కొట్టాలని దురుసుగా గుమ్మం వైపు వెళ్ళింది.

    అప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. మా పమేలాకి కోపం ఒక్కసారి దిగిపోయి - ప్రేమగా, అభిమానంగా వారందర్నీ సాదరంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టింది. తన చేతులతో తనే స్వయంగా మధుర పానీయాలు తయారు చేసి వారికి హుషారుగా అందించింది" అంటూ చెప్పింది అమ్మీ.

    "ఏమిటీ? ఈలోపు ఏం జరిగిపోయిందేమిటి, ఆమె అలా మారడానికి? చెప్పు చెప్పు... సస్పెన్స్ తట్టుకోలేక పోతున్నాను. నువ్వు పాటలు బాగా పాడటమే కాదు. మాటలు కూడా బాగా చెబుతున్నావ్... భేష్..." అంది ప్రశంసాపూర్వకంగా కోకి.

    తన స్నేహితురాలు కోకి ఉత్సాహం చూసి అమ్మీ ఎంతో మురిసిపోయింది.

    "ఏం జరిగివుంటుందో నువ్వూహించుకొని చెప్పవే కోకీ" అంది.

    "ఏం ఊహించుకుంటావే తల్లీ... ఇక్కడి బుద్ధులన్నీ స్వయంగా చూసి కూడా అలా అడుగుతున్నావ్" అంది నిష్ఠూరంగా కోకి.

    "ఊరికే అన్నానులే... సరే చెబుతాను విను. పమేల తలుపు వేయడానికి కోపంగా వెళ్ళింది. అప్పుడు వచ్చిన వారిలో బహుశా ఆ అమ్మాయి కూడా మీ దేశం అమ్మాయే అయివుంటుంది. ఆ అమ్మాయి పమేలాతో యిలా అంది.

    'మేడమ్ లాటరీలో వచ్చిన డబ్బుతో ఒక పేద అమ్మాయిని ఒలింపిక్స్‌కి పంపిస్తున్నాము. దానికోసమే ఈ లాటరీ' అంది ఎంతో వినయంగా. 

    పమేల కోపంమీద చన్నీళ్ళు చల్లినట్లయింది. తలుపు వెయ్యడమూ ఆగిపోయింది. 

    "ఏమిటీ మరొకసారి చెప్పు?" అంది పమేల ఆ అమ్మాయితో.

    ఆ అమ్మాయి మరింత ధైర్యం తెచ్చుకొని చెప్పింది.

    వాళ్ళు పానీయాలు తాగిన తర్వాత ఆ ఖాళీ గ్లాసులన్నీ తనే తీసి టీ-పాయ్ శుభ్రం చేసి, తిరిగి వచ్చి వాళ్ళ మధ్య సోఫాలో కూర్చుంటూ పమేలా కిలకిలా నవ్వింది. 

    ఒసేవ్! కోకీ నీవేమైనా అనుకో... ఆమె కిలకిల నవ్వుల ముందు మనమెంత గొప్పగా పాడినా దిగదుడుపేనే" అంది అమ్మీ.

    "ఒసేవ్!! రన్నింగ్ కామెంట్రీ ఆపి అసలు విషయం చెప్పు. సస్పెన్స్‌తో నా ప్రాణం తీయకు" అంది కోకి.

    "సర్లేవే!! కట్టె, కొట్టె, తెచ్చె అని రామాయణం గురించి మీరు చెప్పినంత ఈజీగా ఆమె గురించి చెప్పలేను. నీకు కాస్త వోపిక ఉండాలి"

    "ఇప్పుడు నా ఓపిక్కేమీ పరీక్ష పెట్టకు. వెంటనే చెప్పాలి లేకపోతే నిన్ను చంపేస్తాను" అంది కోకి ప్రేమతో నిండిన కోపంతో. అంతేకాదు తన కాలితో అమ్మి నెత్తిమీద సుతిమెత్తగా మొత్తింది కూడా.

    అప్పుడు అమ్మీ - 'ఒక మంచి చెబుతుంటే ఎవరికైనా వినడానికి ఎంత హాయిగా వుంటుంది. మరి మంచి చేయడంలో మరెంత గొప్పగా వుంటుందో కదా' అని అనుకుంది.

    "కోకీ మీ ముచ్చట చూస్తుంటే నాకెంతో ఆనందంగా, ఉత్సాహంగా వుంది. ఇక సస్పెన్స్ లేకుండా చెబుతాను. జాగ్రత్తగా విను" అంటూ యిలా కొనసాగించింది. 

    "మీరు తలపెట్టిన కార్యం చాలా గొప్పది. మిమ్మల్ని చూసి నేను గర్విస్తున్నాను. మీరిలా ఎంత కాలం గుమ్మాలు పట్టుకొని తిరిగి టిక్కెట్లు అమ్మి అంత డబ్బు పోగెయ్యగలుగుతారు?" అంటూ వాళ్ళ మధ్య నుంచి లేచి పమేలా చెక్ బుక్ తీసి పెన్నుతో చకచక రాసి, ముత్యాల ముగ్గులాంటి సంతకం పెట్టి చెక్ వాళ్ళ చేతిలో పెట్టింది. వాళ్ళు ఆ చెక్ చూస్తూనే ఆశ్చర్యపోయారు. నాకు కూడా పమేలా ఎంత విరాళం యిచ్చివుంటుందోనని ఉత్సాహంతో వాళ్ళ తలలపై ఎగిరి చక్కర్లు కొడుతూ నా కళ్ళతో ఆ చెక్ చూసి నేను సంతోషపడిపోయాను. 

    ఆమె విరాళం యిచ్చింది ఎంతో తెలుసా 20 వేల డాలర్లు!! పమేలా వాళ్ళకు చెక్కు యిచ్చి ఊరుకోలేదు. 'ఇప్పుడు మోహిని ఎక్కడుంద'ని అడిగింది. ఫలానా దగ్గర ప్రాక్టీస్ చేస్తోందని వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్ళందర్నీ తన కారులో ఎక్కించుకొని అక్కడికి వెళ్ళి మోహిని చేతిలో చెక్ పెట్టి 'బెస్ట్ ఆఫ్ లక్' అని చెప్పింది.

    అప్పుడు నేనుకూడా వాళ్ళ మధ్యలోనే వున్నాను కదా!! ఆ చెక్ చూస్తూనే మోహిని కళ్ళల్లో కోటి జ్యోతులు వెలిగాయి. మోహిని నోట మాట రాలేదు. ఆమె పమేలా ఔదార్యం చూసి తట్టుకోలేక కృతజ్ఞతాపూర్వకంగా అమాంతంగా పమేలాని తన రెండు చేతులతో గట్టిగా వాటేసుకుంది.

    గమ్మత్తేమిటీ తెలుసా? ఆ సంవత్సరం మోహిని ఒలింపిక్స్‌లో పాల్గొని సిల్వర్‌మెడల్ గెల్చుకొని తన సత్తా ప్రపంచానికి చాటింది. అదొక గొప్ప విజయయాత్ర!!

    పమేలా అండర్సన్‌లాంటి గొప్ప మానవతామూర్తులు ఈ ప్రపంచమంతా వుంటే పేదరికం, దారిద్ర్యం, వ్యాధులు, అవిద్య వుండనే వుండవు" అంది అమ్మీ ముక్తాయింపుగా.

    "అమ్మీ అంత దూరంనుంచి రెక్కలు ముక్కలు చేసుకొని, పెద్ద బుద్ధితో మంచి విషయం చెప్పావ్. నువ్వు చెప్పిందే యిక నుంచి నా పాట. కనీసం యిలాగైనా నా జీవితం ధన్యం చేసుకుంటాను. మంచి చూడు... మంచి చేయి... మంచి విను... అన్న మహాత్ముడి మాటలు నాకిప్పుడు గుర్తుకొస్తున్నాయి" అంది కోకి.

    "అవునే, ఎంత బాగా గుర్తుచేశావు. మహాత్ముడు పుట్టిన దేశంలో విహరించాలన్నది నా జీవిత స్వప్నం. తన దేశ ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇచ్చి, ప్రపంచానికి  అహింసా సిద్ధాంతం నేర్పిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ మా ప్రజలకి కూడా ఆరాధ్యుడే. ఒబామా రోజూ మహాత్ముడ్ని స్మరించుకుంటూ వుంటాడు. నాకిక్కడికి రావడం ఎంతో గర్వకారణం వుంద"ని ఎంతో ఉద్వేగం చెప్పింది. దీంతో అమ్మీ తన అలసట మర్చిపోయింది.

    ఇక అమ్మీ తిరుగు ముఖానికి సిద్ధమయ్యింది. ఆ విషయం గ్రహించిన కోకి కొమ్మ మీద నుంచి గెంతుతూ అమ్మీ పక్కకు చేరింది. రెండూ ఒకదాని ముక్కులో మరొకటి ముక్కు పెట్టి తమ ప్రేమను చాటుకున్నాయి. రెక్కలు టపటపా కొట్టుకొని ఒకదాని మీద ఒకటి వాలి - అనుబంధాన్ని, అభిమానాన్ని పంచుకున్నాయి. ఆ రకంగా రెండు దేశాల కోకిలమ్మలు సమస్త లోకాల్ని మర్చిపోయి పరవశిస్తున్న మధురక్షణాలవి.  

    ఆ సమయం కోసమే ఒక కిరాతకుడు మాటు వేసుకొని వున్నాడు. రెండింటినీ ఒకేసారి గుట్టుగా వలేసి పట్టేసుకుందామనుకున్నాడు. వాడు ఆశగా వల విసిరాడు. వాడ్ని పసిగట్టిన కోకి తన ప్రాణాలు దక్కించుకోవాలనే దురాశతో ముందు హెచ్చరిక చేయకుండానే ప్రాణభయంతో గాలిలోకి ఎగిరి అరక్షణంలో మాయమైపోయింది. చెప్పా పెట్టకుండా మధ్యలో అది అలా ఎగిరిపోవడం అమ్మీకి ఏమీ అర్థం కాలేదు. 

    అయితే వాడు విసిరిన వలలో అమ్మీ చిక్కింది. వాడు దాన్ని చేతిలోకి తీసుకుని గొంతు నులిమాడు. రెండు కాళ్ళూ విరిచేశాడు. 

    "ఆ గానగంధర్వుడి పాటల కోసం మా జనం చెవులు కోసుకుంటారు. నువ్వొకసారి యిటురా... విని పులకించిపోదువుగాని" అంటూ కోకి వసంత సందేశాలు అనేకం అమ్మీకి పంపించింది. ఎట్టకేలకు అమ్మీ ఆ ఆహ్వానం స్వీకరించి వచ్చింది. ఇప్పుడు అమ్మీ ప్రాణాలు కిరాతకుడి చేతిలో విలవిలలాడుతున్నాయి.

    తన ప్రియతమ నేస్తం ఇక్కడెక్కడైనా తనకు సహాయం చెయ్యడం కోసం నక్కివుంటుందేమోనని తెగి వెలాడుతున్న మెడతో చెట్టూ పుట్టల వైపు ఆశగా దృష్టి సారించింది అమ్మీ.

    పారిపోయిన కోకి ఆ గాన గంధర్వుడి యింటిముంగిట సురక్షితంగా వాలి 'బ్రతుకు జీవుడా' అనుకుంటూ వుంది.    
Comments