అమూల్యం - నండూరి సుందరీ నాగమణి

  
     
భగవంతుడు కొన్ని పరిచయాలను పరిచయాలుగానే ఉంచేస్తాడు. కొన్నింటిని బలమైన బంధాలుగా మార్చేస్తాడు. అదే ఆయన లీల...

* * *

    "అరేయ్, ఊరొచ్చేస్తోందిరోయ్..." హుషారుగా ఈలేసాడు, డ్రైవర్ పక్కనే కూర్చున్న సుధాకర్. ప్రక్కనే నిద్రపోతున్న నీలేష్, రూపేష్ ఉలిక్కిపడి  లేచారు. మొబైల్ లో పాటలు వింటున్న మిగతా వాళ్ళు కూడా అలెర్ట్ అయిపోయారు. పచ్చని పంట పొలాల మధ్య బద్ధకంగా పడుకొని ఉన్న  నల్లని నాగుపాములాంటి రోడ్ మీద వేగంగా  దూసుకుపోతోంది, మా వాహనం. సాయంత్రం నాలుగవుతున్నా, నడివేసవి కావటంతో, చండ ప్రచండంగా చెలరేగిపోతున్న సూర్య ప్రతాపం ఏ మాత్రం తగ్గలేదు.

    నా పేరు ప్రణయ్. హైదరాబాద్ లోని ఒక చిన్న సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్నాను నేను. వీళ్ళంతా నా ఫ్రెండ్ మధు సహోద్యోగులు. వాడు కూడా హైదరాబాద్ లోనే వర్క్ చేస్తున్నాడు. మొత్తం పది మందిమీ కృష్ణా  జిల్లా లోని ఈ పల్లెలో రేపు అర్థరాత్రి దాటాక జరగబోతున్న మధు పెళ్ళికి బయలుదేరి వస్తున్నాము. లీవ్ ఇవ్వనన్న బాస్ ను బ్రతిమాలి ఒప్పించి, ఆఖరి క్షణంలో వీళ్ళతో పాటు నేనూ బయలుదేరాను. వీళ్ళతో పరిచయమే తప్ప నాకు పెద్దగా ఫ్రెండ్షిప్ లేదు. 
  
    ఊరిలోకి ప్రవేశించి, రెండు వీథులు దాటగానే కనబడింది, రంగులతో మెరిసిపోతున్న ఓ మూడంతస్తుల భవనం, దాని ముందు వేసి ఉన్న పచ్చగా మెరుస్తున్న పెద్ద తాటాకుల పందిరి... మామిడాకుల తోరణాలు, కొబ్బరిమట్టలతో చుట్టిన స్తంభాలతో అలంకరించబడి ఉంది. మా టాటా సుమో వచ్చి సరాసరి అక్కడే ఆగింది. మధు పెళ్ళి పెద్దలతో అక్కడే నిలబడి ఉండటం చూసి, అదే విడిదిల్లు అనీ, మా వాడు మాకోసమే ఎదురుచూస్తున్నాడనీ అర్థమైంది.

    మా వాళ్ళంతా గబగబా మధూ చుట్టూ చేరి, కరచాలన ఆలింగనాలతో వాడిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే, ప్రక్కగా నిలబడి చిరునవ్వుతో పరికిస్తూ ఉండిపోయాను నేను.

    "అరె, రారా కవికుమరా, రా... లీవ్ దొరకలేదన్నావు కదా, రావటం ఎక్కడ మానేస్తావో అని భయం వేసింది. పోన్లే, వచ్చేసావు. ఇక్కడ నీకు రాసుకోవటానికి బోలెడన్ని కవితా వస్తువులూ, ప్రకృతి దృశ్యాలూ..." అని ప్రేమగా నన్ను కౌగలించుకొన్నాడు మధు. తర్వాత మా అందరినీ తన మామగారు ఆదిశేషయ్య గారికి, బావమరది కుమార్ కు పరిచయం చేసాడు. 
 
    విడిదింట్లో మాకిచ్చిన రూముల్లో దిగి, స్నానాలవీ కానిచ్చి అందరమూ రెడీ కాగానే, కాఫీలూ టిఫిన్లు తరలి వచ్చాయి మా కోసం. దగ్గరుండి కొసరి కొసరి వడ్డించారు. మా వాళ్ళు అడిగిన బ్రాండ్ సిగరెట్లు, కార్డ్ సెట్లు, కూల్ డ్రింకులు క్షణాల్లో రప్పించబడ్డాయి. అందరూ సిగరెట్లు ఊదేస్తూ, పేకాట మొదలు పెట్టేసారు. నేను వాళ్ళకు ఓ ప్రక్కగా పుస్తకం చదువుకొంటూ కూర్చొన్నాను. పది నిమిషాల తర్వాత మధు వచ్చి మాతో కూర్చొన్నాడు.  

    "అరే, మధూ, నువ్వేం చేస్తావో మాకు తెలియదు కానీ, రాత్రికి మాత్రం డ్రింక్స్ అరేంజ్ చేయాల్సిందే..." డిమాండ్ చేస్తున్న మిత్రులవైపు చూసి నవ్వుతూ, "అరె, ఆ మాత్రం నాకు తెలియదూ? ఆ ఏర్పాట్లు అన్నీ ఎప్పుడో పూర్తయాయి లేరా..." అని చెప్పి, "మరి మన బుద్ధిమంతుడికసలు ఆ వాసనే పడదుకదురా, ఎలా మరి? " అని నా వైపు నవ్వుతూ చూసాడు మధు. అంతలో అటువైపు కుమార్ రావటంతో, అతన్ని పిలిచి, నా కోసం సెపరేట్ గా ఒక రూం అరేంజ్ చేయమని కోరాడు వాడు. వాడి వైపు కృతజ్ఞతగా చూసాను.  

    "నేను వెడతానురా, అవతల అమ్మా, నాన్నా ఎదురు చూస్తున్నారు..." అంటూ లేచాడు, మధు. "మరి నీ కాబోయే శ్రీమతిని ఎప్పుడు చూపిస్తావురా? " ముక్తకంఠంతో అడిగారందరూ.    

    "రేపు ఉదయమే చూపిస్తాను సరేనా? ఈ రోజంతా ఎంజాయ్ చేయండి. ఏరా, ఋషిపుంగవా, మరి నీ కాలక్షేపం సంగతి ఏమిటి? ఇక్కడికి దగ్గరలోనే వేణుగోపాలస్వామి గుడి ఉంది. చాలా బావుంటుందక్కడ, వెళ్తావా? " మధు అడిగాడు నన్ను.  

    "అలాగేరా మధూ, నేను గుడికి వెళ్ళి వస్తాను. ఆ తర్వాత నా నేస్తాలున్నాయిలే..." అంటూ నా వెంట తెచ్చుకొన్న పుస్తకాలు చూపించాను. మధు నవ్వుకొంటూ వెళ్ళిపోయాడు.

    "మీకు ఆ కార్నర్ రూము అరేంజ్ చేసాను. మీ లగేజ్ అక్కడ పెట్టిస్తాను, " అంటూ వచ్చాడు, కుమార్. అతనికి థాంక్స్ చెప్పి, గుడి ఎటువైపో అడిగి తెలుసుకొని, ఫ్రెండ్స్ తో చెప్పి బయలుదేరాను.

* * *

    మే నెల కావటంతో సాయంకాలం ఆరున్నరవుతున్నా ఇంకా సంజవెలుగులు తగ్గలేదు. చల్లని పైరగాలులు వీస్తుంటే, స్నానం చేసిన మేనికి హాయిగా అనిపించసాగింది.  ఆలయం పదినిముషాల నడక దూరంలోనే ఉంది. మెల్లగా నడుచుకుంటూ, ఆలయ ప్రాంగణంలోనికి అడుగుపెట్టాను.

    చుట్టూ జేగురు రంగు వేసిన ప్రాకారం నడుమ విశాల ప్రాంగణంలో, విరబూసిన పూలవృక్షాల మధ్య ఎంతో అందంగా కనిపించింది, దేవాలయం.  అప్పుడే నేలంతా చల్లని నీటితొ తడిపారేమో, కమ్మని మట్టి పరిమళం ఆహ్లాదంగా నా మనసును పరవశింపజేసింది.  

    ఎత్తైన గాలిగోపురం మీద పావురాలు గుంపులు గుంపులుగా కువకువలాడుతున్నాయి. గర్భగుడిలో కొలువైన నల్లని వేణుగోపాలస్వామి విగ్రహం, చేతిలో వేణువుతో, పెదవులపై దరహాసంతో, తలపై నెమలి పింఛంతో మెడలో మల్లెల మాలలతో అద్భుతంగా అనిపించి, క్షణకాలం మా ఊరిలోని రామాలయంలో కొలువైన నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రుడిని జ్ఞప్తికి తెచ్చింది.    

    ప్రశాంతమైన మనసుతో స్వామికి నమస్కరించి, అర్చకులిచ్చిన తీర్థప్రసాదాలు స్వీకరించి, విశాలమైన ఆ మంటపంలో ఒక ప్రక్కగా కూర్చున్నాను. సన్నగా అలముకొంటున్న చీకట్లపై తన కిరణాల్ని చల్లగా కురిపిస్తున్న నెలరాజును చూస్తూ, బ్యాగ్ లోంచి డైరీని తీసి, ఆ ఆలయాన్ని, ఆ వాతావరణాన్ని, మనసు పొందిన సాంత్వనాన్ని కవితారూపంలో అక్షరీకరించసాగాను.  

    వ్రాసుకోవటం పూర్తయాక, ఇష్టంగా ఉత్పలను తలచుకున్నాను. వచ్చే సంవత్సరం ఈ సమయానికి మా వివాహం కూడా జరిగిపోతుంది. మా ఊరిలో తాతయ్య, అమ్మమ్మల చేతుల మీదుగా పెళ్ళి చేసుకోవాలని నా ఆలోచన.  మా నాన్న ఉద్యొగ రీత్యా ఢిల్లీలో ఉన్నారు. నా చిన్నప్పుడే అమ్మ పోతే, నాన్న మరో పెళ్ళి చేసుకొవటంతో తాతయ్య దగ్గరే చిన్నప్పట్నుండీ పెరిగాను. ఆయనది గోదావరిజిల్లా. వ్యవసాయం చేసుకొంటూ ఊరిలోనే ఉన్నారు. మా ఊరు, గోదావరి, అక్కడి ప్రకృతి అందాలు అంటే ప్రాణం నాకు. మొదట్నుండీ నాలో భావుకత కూడా ఎక్కువేకావటంతో కథలు, కవితలూ వ్రాయటం అలవాటైంది.  ఇప్పుడిప్పుడే నా రచనలూ పత్రికలలో ప్రచురించబడుతున్నాయి.

    రెండు సంవత్సరాలక్రితం హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరేవరకూ నేను తాతయ్య దగ్గరే ఉండేవాడిని.  ఏడాదినుంచీ ఉత్పలతో పరిచయం... ఈ మధ్యే అది ప్రేమగా మారింది.  ఉత్పల వాళ్ళ అక్కయ్య పెళ్ళి కాగానే మేము పెళ్ళి చేసుకోవాలని అనుకొన్నాము.  ఉత్పలను తలచుకొంటే చాలు, నా మనసంతా హాయిగా అయిపోతుంది.  ఆలోచనలలో పడిన నేను టైం చూసుకోలేదు. చిన్న పూజారి వచ్చి, గుడి మూసివేస్తున్నామని చెప్పటంతో లేచాను.

    నేను రూంకి చేరేసరికి, నా స్నేహితులందరూ అమృతసేవనంలో మునిగి ఉన్నారు. నన్ను కూడా జాయినవమని పిలిచారు. కానీ చిరునవ్వే సమాధానంగా సరిపెట్టి, మధు వాళ్ళ రూం కి వెళ్ళాను. అప్పుడే వాళ్ళంతా భోజనాలకి కూర్చుంటున్నారు. మధూ వాళ్ళ నాన్నగారు నన్ను సాదరంగా పిలిచి, తన ప్రక్కనే కూర్చోబెట్టుకొని, "నీ స్నేహితులందరిలో నాకు నచ్చింది, ఈ అబ్బాయేరా..." అన్నారు మధూతో.
భోజనం అయాక, కాసేపు వాళ్ళతో కబుర్లు చెప్పి, ప్రయాణ బడలిక వల్ల నిద్ర వస్తూండటంతో నాకిచ్చిన రూం కి వచ్చి, బట్టలు మార్చుకొని, కాసేపు ఫోన్ లో ఉత్పలతో కబుర్లాడి, నిద్రకుపక్రమించాను. ఒళ్ళు తెలియనంత గాఢనిద్ర పట్టిందారాత్రి.  

* * *

    తెలతెలవారుతూ ఉండగా సన్నాయి మేళం శ్రావ్యంగా మ్రోగుతూ మేలుకొలుపు పాడింది. బయటకు వచ్చి చూశాను.  మధూ వాళ్ళ రూములో అందరూ చాలా హడావుడిగా ఉన్నారు. అప్పుడే నిద్రలేచిన మధూ నన్ను చూసి నవ్వి, 'గుడ్మార్నింగ్' చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు... ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా మధుని పెళ్ళికొడుకును చేస్తారని. నేను కూడా గబగబా కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం ముగించి, మంచి బట్టలు వేసుకున్నాను.

    మిగిలిన మిత్రులెవరూ ఇంకా నిద్ర లేవలేదు. నేను వెళ్ళి మధూ వాళ్ళ రూము బయట పందిట్లో వేసిన కుర్చీల్లో కూర్చున్నాను. 

    ఒకమ్మాయి వచ్చి "కాఫీ తాగారా సార్? " అని అడిగింది మర్యాదగా. 

    ఇంకా లేదన్నట్టు తలూపి, ఇవ్వమన్నట్టు ముఖం పెట్టాను.

    ఆమె ఇచ్చిన కాఫీ తాగుతూ "మీరు? " అన్నాను.

    "మీరని మన్నించనక్కరలేదు. నేను పనిమనిషిని..." అంది ఆమె నవ్వుతూనే.  

    ఆమె ప్రసన్నవదనం, చిరునవ్వుతో పలుకరించే కళ్ళు, మాటల్లో సంస్కారం, భాష ఆమె పనిమనిషని అనిపించనివ్వలేదు. 

    "చాలా థాంక్స్, కాఫీ చాలా బావుందండీ" అన్నాను , ఖాళీ కప్పు అందిస్తూ. 

    "మీ కాంప్లిమెంట్స్ వంటమనిషికి అందజేస్తాను. మీరు టిఫిన్ తినాలంటే చెప్పండి, పట్టుకొస్తాను, రెడీ అవుతోంది..." అని చెబుతూ ఉంటే, "బుజ్జమ్మా, ఇటు త్వరగా రా..." అంటూ ఎవరో పిలవటంతో వెళ్ళిపోయింది.

    రంగు తక్కువైనా కళ గల ముఖం, చక్కని తెలుగు సంప్రదాయాన్ని స్ఫురింపజేసే లంగా, ఓణీల్లో ఎంతో కుదురుగా ఉంది. చదువుకున్నట్టుంది, బుజ్జమ్మట పేరు, తమాషాగా ఉంది. ఉత్పలను లంగా ఓణీల్లో ఊహించసాగాను. ఆమె నాకు పరిచయం అయింది మొదలు, షర్ట్ ప్యాంట్ల లోనో,  స్కర్ట్ బ్లౌజ్ ల లోనో, జీన్స్ కుర్తాలలోనో, అరుదుగా చుడీదార్ డ్రెస్ లోనో తప్ప ఎప్పుడూ చీరలో కాని, లంగా ఓణీలలో కానీ చూడలేదు. అంత అందమైన అమ్మాయి, ముద్దొచ్చే ఈ డ్రెస్ లో మరింత ముచ్చటగా ఉండదూ? ఈసారి తప్పకుండా వేసుకొమ్మని అడగాలి తనను... ఇంతలో మళ్ళీ వచ్చిన బుజ్జమ్మ నా చేతిలో న్యూస్ పేపరు పెట్టింది. మరో అయిదు నిమిషాల్లొ టిఫిన్లు సిద్ధం అవుతాయని, డైనింగ్ హాల్ కి రమ్మనీ చెప్పి వెళ్ళిపోయింది.  
టిఫిన్ సెక్షన్ అయ్యాక, మెల్లగా నిద్ర లేచిన మా బ్యాచ్ అంతా జాయినయ్యారు ఫంక్షన్ కోసం. మధును పెళ్ళికొడుకును చేసిన తర్వాత వాడు మా అందరికీ అమ్మాయిని చూపించటం కోసం నాలుగిళ్ళవతలే ఉన్న పెళ్ళివారింటికి తానే స్వయంగా మమ్మల్ని తీసుకువెళ్ళాడు. 

    దీప్తిని కూడా పెళ్ళికూతుర్ని చేసినట్టున్నారు, కొత్త జరీ పట్టుచీరలో బుగ్గన చుక్కతో, కళ్యాణ తిలకంతో అందంగా మెరిసిపోతోంది.  

    మధు కూడా అంతే. సరికొత్త కాంతులీనుతున్నాడు. ఇద్దర్నీ పక్కపక్కన నిలబెట్టి ఫోటోలు తీసాను ఎంతో ఉత్సాహంగా. జంట ఎంతో చూడముచ్చటగా, 'మేడ్ ఫర్ ఈచ్  అదర్ ' లా ఉంది. మా అందరినీ దీప్తికి పరిచయం చేశాడు మధు. తను కూడా కొత్త లేకుండా ఎంతొ పరిచయమున్నట్టు స్నేహంగా పలకరించిందందరినీ.    

    అక్కడ కూడా బుజ్జమ్మ పెళ్ళి సామానులు సర్దుతూ కనబడింది. పలకరింపుగా చిరునవ్వు నవ్వాను. తర్వాత మా వాళ్ళంతా మార్నింగ్ షో సినిమాకి వెళితే, నేను పొలాల వైపు వెళ్ళాను. నాకు తాటిముంజెలు తినాలని ఉంది మరి.

    ఆదిశేషయ్యగారు నాకు తమ చిన్న పాలేరు సూరిని తోడు ఇచ్చి పొలం వైపు పంపించారు. వెళ్ళగానె అక్కడి కూలీలు కొబ్బరి బొండాలు కొట్టిచ్చారు. ఒక్కో బొండాం చిన్న సైజ్ బిందె అంత ఉంది. ఒకటి తాగేసరికే కడుపునిండిపోయినట్టనిపించింది. అతికష్టం మీద మరొకటి తాగి, లేత కొబ్బరి తిన్నాను ఇష్టంగా. తరువాత వాళ్ళ పొలం అంతా తిప్పి చూపించాక, తోట కూడా చూపించారు. కూరగాయలు, పూలు, పళ్ళు సాగు చేస్తున్నారు.   

    మామిడి, సపోటా, నిమ్మ, నారింజ చెట్లున్నాయి. మామిడికాయలు విరగకాసి ఉన్నాయి. 
మల్లె అంటుల్ని మడులలో పెంచుతున్నారు. విరగబూసివున్న మల్లెపొదలు చెప్పలేనంత మత్తైన సుగంధాన్ని వెదజల్లుతున్నాయి.  అక్కడ కొంతమంది కూలీలు మల్లెమొగ్గల్ని కోసి బుట్టల్లోకి వేస్తున్నారు. మరోవైపు జాజి పందిళ్ళు, కనకాంబరం మడులు కూడా ఉన్నాయి.   

    మరో పక్క రకరకాల రంగు రంగుల గులాబీలు కనువిందు చేసాయి. అప్పటికే తెంపిన జాజుల్నీ, కనకాంబరాల్ని, రంగురంగుల గులాబీలను, మరువాన్ని బుట్టల్లో సర్దిపెట్టారు. 

    "ఇవన్నీ మార్కెట్ కి పంపిస్తారా? " సూరినడిగాను ఆసక్తిగా.

    "రోజూ ఐతే మార్కెట్ కి, వేణుగోపాలస్వామి గుడికీ పంపిస్తారు గానండి, ఈరోజు పాపగారి పెళ్ళి కదండీ, అందుకని, ఇవన్నీ గుడికి, పెళ్ళి పందిట్లోకే..." హుషారుగా చెప్పాడు వాడు.

    ఆదిశేషయ్యగారి టేస్ట్ ను మనసులో అభినందించకుండా ఉండలేకపోయాను.

    పూలదగ్గరనుండి ఇవతలికి వచ్చి మామిడిచెట్టు నీడలో ఉన్న అరుగుమీద కూర్చున్నాను. సూరి అక్కడికి ముంజికాయ గెలలు పట్టించుకొచ్చేసాడు.  

    "తినండి అబ్బాయ్ గారూ, మీకు కావలసినన్ని ముంజెలు" అంటూ కొడవలితో కొట్టిస్తూంటే బొటనవేలితో పొడుచుకుంటూ అరడజను పైనే లాగించేశాను.

    లేత ముంజెను వేలితో పొడవగానే, ఆ లేతరసం ఫౌంటెన్ లా ఫోర్స్ గా పైకి ఎగజిమ్మటం, అప్పుడప్పుడూ కంట్లో పడటం చాలా బావుంటుందెప్పుడూ. 

    చిన్నప్పుడు ముంజెలు తిన్నాక, ఆ ఖాళీ బుర్రలతో బండి చేసుకుని తోసుకుంటూ తిరుగుతూ ఆడుకోవటం గుర్తొచ్చి నవ్వుకున్నాను. ఇంతలో నా సెల్ మ్రోగింది. 

    అవతలినుంచి మధు... "ఎండలో ఎక్కడ తిరుగుతున్నావ్ రా? త్వరగా వచ్చెయ్, భోజనం టైం అయింది కదా..." అని కేకలెయ్యటంతో సూరిగాడితో సహా ఇంటిముఖం పట్టాను. కొబ్బరి నీళ్ళు, ముంజెలు బాగా పట్టించటంతో అసలు ఆకలి లేకపోయినా, వాడికోసమని కొంచెం తిన్నాననిపించి, రూం కి వచ్చి నిద్రలోకి జారిపోయాను.  

* * *

    ఐదింటికి నిద్ర లేచి బయటకొచ్చేసరికి ఒక అపురూపమైన దృశ్యం కనిపించింది. బుజ్జమ్మ, మరికొందరు అదే ఈడు అమ్మాయిలు మల్లెపూలు రాశిగా పోసుకొని దండలు కడుతున్నారు.  అప్పుడే విచ్చీవిచ్చకుండా విచ్చుకుంటున్న మల్లెలు గుప్పున తమ పరిమళాలు గాలిలో వ్యాపింపజేస్తున్నాయి.  అనుకోకుండా, "గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా... గుండెలే దోస్తావు ఓ మల్లికా..." అనే దాసం గోపాలకృష్ణ గారి పాట నా మదిలో మెదిలింది.

    అప్పుడు గమనించాను, నాలో ఏదో అనీజీనెస్ మొదలైందని. బాగా జలుబు చేసి, సన్నగా తలనొప్పి మొదలైంది. వెలుతురు చూడలేకపోతున్నాను. బయట కూర్చోవాలనుకున్నా కూర్చోలేక రూము లోకి వెళ్ళి పడుకున్నాను. కాసేపటికే బాగా జ్వరం వచ్చింది.  

    మధుకు కాని, మిగతా ఫ్రెండ్స్ కి కాని చెప్పాలనుకున్నాను కాని,  'అదే తగ్గిపోతుందిలే, పాపం వాళ్ళ మూడ్ పాడుచేయటం ఎందుకని '  ఊరుకున్నాను. 

    మరో పది నిమిషాల్లోనే చలి కూడా మొదలైంది.

    ఇంతలో నన్ను పిలవటానికని వచ్చిన కుమార్ ఖంగారుగా తట్టిలేపాడు కానీ నేను బరువెక్కిన కనురెప్పలను తెరవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ మళ్ళీ నిద్రలోకి జారిపోయాను. తర్వాత మగత నిద్రలో డాక్టర్ రావతం, ఇంజక్షన్ ఇవ్వటం లీలగా తెలిసింది.

    సడన్ గా మెలకువ వచ్చేసింది.  క్షణకాలం పాటు ఎక్కడున్నానో అర్థం కాలేదు నాకు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఎంతో నీరసంగా ఉంది. నుదుటిమీద తడిగా తగలటంతో తడుముకుని చూస్తే, చల్లని నీటితో తడిపి, నాలుగు మడతలు వేసిన జేబురుమాలు బహుశా జ్వరం తగ్గటానికనుకుంటాను పట్టీలా వేసివుంది.
టైమెంతయిందో...అనుకుంటూ, అతికష్టం మీద పక్కకు తిరిగి దిండు కింద ఉన్న సెల్ అందుకొని చూస్తే రాత్రి పది అవుతోంది. 

    'అమ్మో, ఎంతసేపు నిద్రపోయాను, పన్నెండున్నరకే కదా మధూ గాడి పెళ్ళి...' అనుకుంటూ మంచం మీదనుంచి లేవబోయి, తూలిపడబోయాను. ఎక్కడినుంచి వచ్చిందో గానీ బుజ్జమ్మ గబుక్కున వచ్చి పడకుండా పట్టుకుంది నన్ను. "థాంక్స్" అస్పష్టంగా అన్నాను.  

    "ఎందుకు లేచారు? మీకసలు ఒంట్లో బాగాలేదు కదా?" అంది నన్ను మంచం మీద కూర్చోబెడుతూ. 

    "అదే...మధూ పెళ్ళికి వెళ్ళాలి కదా" అన్నాను తడబాటుగా. ఏమిటో నోరంతా చేదుగా ఉండి, నాలుక మొద్దుబారిపోయినట్టయి మాటకూడా సరిగ్గా రావటం లేదు. 

    "మీకు 102 టెంపరేచర్ ఉంది. పైగా చాలా నీరసంగా ఉన్నారు. డాక్టరు గారేమో 'ఫ్లూ' అని, మిమ్మల్ని మంచం దిగనీయవద్దని చెప్పారు. మీరు ఇప్పుడు పెళ్ళి చూడటం ముఖ్యం కాదు. కోలుకోవటం ముఖ్యం. పాలు తాగేసి పడుకోండి." అని ఫ్లాస్క్ లోంచి గాజు గ్లాసులోకి పాలు వంచింది. మరో గ్లాసులో సగానికి గోరువెచ్చని నీళ్ళు నింపి టాబ్లెట్స్ నోట్లో వేసి నీళ్ళు తాగించింది. పాలు తాగించబోతుంటే, "నేను బాత్ రూం కి వెళ్ళాలి" అన్నాను మొహమాటంగా. 

    'అయ్యో,' అంటూ మెల్లగా లేపి, పట్టుకొని నడిపిస్తూ బాత్ రూం తలుపు తెరిచి, "జాగ్రత్తగా గోడలు పట్టుకుని వెళ్ళండి లోపలికి. తలుపు దగ్గరగా వేసి ఉంచండి... జాగ్రత్త" అని హెచ్చరించి లోపలికి పంపించింది. తిరిగొచ్చాక ఆమె అందించిన పాలు అతి కష్టం మీద తాగగలిగాను. 

    "పడుకోండి..." మృదువుగా చెప్పింది.

    "చాలా థాంక్స్. నువ్వు పెళ్ళికి ఎందుకు వెళ్ళలేదు?" అని అడిగాను.

    చిన్నగా నవ్వింది. "మీకు బాగా లేదు కదా, మీ పరిచర్యను నాకప్పగించారు. అందరూ బిజీగా ఉన్నారు కదా మరి? "

    "నీకు ఏం సంబంధం? అందులోనూ ఆడపిల్లవి" మొహమాటంగా అన్నాను. 

    "నేను కొన్నాళ్ళు డాక్టర్ గారి హాస్పిటల్ లో పనిచేసాను. ఇంజక్షన్ ఇవ్వటం అదీ వచ్చు. అందుకని నన్నుండమన్నారు. ఏం ఫరవాలేదు లెండి, మీకు తగ్గేవరకూ మీ బాధ్యత నాదే...ఆడపిల్లనని ఫీలవకండి." 

    "ఏం చదువుకున్నావు బుజ్జమ్మా? "

    "నా పేరు సాంత్వన. ఇక్కడందరూ బుజ్జమ్మనే పిలుస్తారనుకోండి, మా నాన్న సుబ్బయ్య, ఆదిశేషయ్యగారి దగ్గర పాలేరు పని చేస్తాడు. మా అమ్మాయి గారు అదే దీప్తి, నేను చిన్నప్పట్నుండీ టెంత్ వరకూ కలిసే చదువుకున్నాం. అమ్మ పోయాక, తనలా పట్నం వెళ్ళి పెద్ద చదువులు చదివే అవకాశం నాకు లేకపోయింది. అందుకే వాళ్ళింట్లోనే పనిచేస్తూ అమ్మగారికి సాయం చేస్తూంటాను." 

    "నీ పేరు చాలా బావుంది. నీ నైజానికి తగిన పేరు. ఎవరు పెట్టారు? "

    "నేను పుట్టినప్పుడు మా ఊరికి ఒక స్వామీజీ వచ్చారుట. ఆయన దగ్గరికి ఆశీర్వదించమని మా అమ్మ నన్ను ఎత్తుకు వెడితే ఈ పేరు పెట్టారు. అన్నట్టు, మీ కథలు నేను చదివాను. చాలా బాగా రాస్తారు మీరు..."

    "నిజంగానా? థాంక్ యూ" 

    "కానీ కొంతమంది మీ రచయితలంటే నాకు కొంచెం కోపం తెలుసా? "

    "ఎందుకుట పాపం? "

    "నా పేరును 'స్వాంతన '  అని తప్పుగా రాస్తారు. మరి ప్రింటింగ్ తప్పో, రచయితల తప్పో తెలియదు కానీ చాలా కథల్లో చదివానలా"  

    చిన్నగా నవ్వి, అవునన్నట్టు తల ఊపాను. "ఆ పొరపాటును ఫ్లోలో నేనూ చేసే ఉంటాను. ‘ఉపశమనం, ఓదార్పు’ అనే అర్థాన్నిచ్చే ఈ పదాన్ని తప్పుగా రాయటం నిజంగా తప్పే..." అన్నాను కళ్ళు మూసుకుంటూ.  

    "నిద్ర వస్తే పడుకోండి" అంటూ పల్చని బెడ్ షీట్ కప్పి ఫ్యాన్ స్పీడ్ తగ్గించింది. మందుల ప్రభావం వల్ల కావచ్చు, మళ్ళీ నిద్ర పట్టేసింది నాకు. ఎప్పుడో కలలోలాగ మంగళవాయిద్యాల శబ్దం విని 'మధు గాడి పెళ్ళైపోయిందీ అనుకున్నాను. ఆ తర్వాత మధ్యలో రెండు సార్లు సాంత్వన నా నోట్లో థర్మామీటర్ పెట్టటం, మందులు మింగించటం లీలగా గుర్తు.   

* * *

    తెల్లవారింది. లేచి కూర్చున్నాను. చాలా నీరసంగా ఉంది. కాని టెంపరేచర్ మాత్రం లేదిప్పుడు. రూం లో బుజ్జమ్మ, అదే సాంత్వన లేదు. బాత్రూం లోకి వెళ్ళి, బ్రష్ చేసుకునొచ్చి, మంచమ్మీద కూర్చున్నాను. ఇంతలో దీప్తితో కలిసి మధు వచ్చాడు. ఇద్దరిలోనూ ఏదో వితసొగసు, ఎంతో కళ, సంతోషపు పరిమళాలు... వాళ్ళిద్దరినీ అలా చూస్తూంటే నా మనసంతా ఆనందంతో నిండిపోయింది.  

    "ఏరా, ఎలా ఉన్నావ్? ప్చ్...ఎంత నీరసపడిపోయావో..." ఆప్యాయంగా అంటున్న మధు చేతిని నా చేతిలోకి తీసుకొని, మృదువుగా నొక్కుతూ ..

    "బావుందిరా, పెళ్ళి బాగా జరిగిందిగా? " అన్నాను.  

    "అన్నయ్యా, టెంపరేచర్ తగ్గిందా? ఈ సాంత్వన ఏమైందీ?" అంటూ ఆమె కోసం దీప్తి అటూ ఇటూ చూస్తూంటే, బయటనుండి వచ్చిన సాంత్వన, తన చేతిలో మూత పెట్టి ఉన్న డిష్ ను టేబుల్ మీద ఉంచుతూ, "ప్రణయ్ గారికి టిఫిన్ తేవటం కోసం వెళ్ళాను" అని దీప్తికి చెప్పి, "ఇప్పుడే లేచారా? ముఖం కడుక్కుంటారా?" అంటూ నన్నడిగింది.

    నిద్రలేమితో అలసటగా ఉన్న ఆమె ముఖాన్ని, ఎర్రకలువల్లా ఉన్న కళ్ళను చూస్తూ అయిపోయిందన్నట్టు సైగ చేసాను. "సారీరా నీ పెళ్ళి చూడలేకపోయాను..." నొచ్చుకుంటూ అన్నాను మధు తో. 

    "అయ్యో, అదేమిట్రా, అలా అంటావ్? నా పెళ్ళికి వచ్చి హ్యాపీగా తిరగకుండా సిక్ అయ్యావని నేను బాధ పడుతుంటే? సరే కానీ, కాసేపట్లో మేము తిరుపతి వెడ్దుతున్నామురా. మన వాళ్ళంతా మధ్యాహ్నం బయలుదేరిపోతామని అంటున్నారు. డాక్టరుగారికి కబురు పెట్టాము. ఓ అరగంటలో వచ్చి నిన్ను చూస్తారు. నువ్వు ఓ రెండ్రోజులుండి రెస్ట్ తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. మా మామయ్యగారు, బావా ఉంటారు, నీకేం భయంలేదు, సరేనా? " వాడి ఆప్యాయతకు నా కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి.  

    "వస్తామన్నయ్యా, మీరు మా పెళ్ళికి వచ్చినందుకు చాలా థాంక్స్. సాంత్వనా, బాగా చూసుకోవే..." అంది దీప్తి. 

    వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక ఇంజక్షన్ ఇచ్చి, ప్లేట్ లో పొగలు కక్కే ఇడ్లీలు, కారప్పొడి వేసి, స్పూన్ పెట్టిచ్చింది సాంత్వన. 

    ఆకలి బాగా వేస్తూండడంతో గబగబా తినటం మొదలు పెట్టాను. కానీ, ఒకటికన్నా తినలేకపోయాను. తిన్న రెండు నిమిషాల లోనే వాంతి అయిపోయింది. 

    నేలమీద, నా షర్ట్ మీద, పక్క బట్టల మీద పడింది. తడిబట్టతో నా ముఖం, మూతి, బట్టలు తుడిచి, పక్క బట్టలు మార్చి, నేల తుడవసాగింది సాంత్వన.

    "అయాం సారీ సాంత్వనా, నీతో అడ్డమైన పనులూ చేయించుకుంటున్నాను. శ్రమ ఇచ్చినందుకు నిజంగా సారీ... నీ ఋణం ఎప్పటికైనా తీర్చుకుంటాను" అన్నాను అపరాధభావన తో. 

    "ప్లీజ్, అలా ఫీలవ్వకండి, ఇది నా ధర్మం" చిరునవ్వుతో సమాధానం చెప్పి, తన పనిలో నిమగ్నమయిపోయింది, సాంత్వన.

    డాక్టర్ సూచన మేరకు నేను మర్నాటి వరకూ అక్కడే ఉండిపోవలసివచ్చింది.

* * *

    హైదరాబాద్ తిరిగొచ్చి ఉద్యోగంలో జాయినయ్యాను. జ్వరం వల్ల వచ్చిన నీరసం నన్ను చాలా కాలం వెంటాడింది. ఉత్పల అప్పుడప్పుడూ కలుస్తోంది.

    ఊరిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెబితే, "ఎండలో తిరుగుతూ అడ్డమైన చెత్తా తిన్నావ్...అందుకే సిక్ అయ్యవు.." అని కోప్పడింది. కొబ్బరి బోండాల్నీ, తాటిముంజెల్నీ 'చెత్త ' అన్నందుకు కించిత్ కోపం వచ్చింది నాకు. 

    నేను తనకోసం లంగా, ఓణీ సెట్ కానుకగా ఇస్తే, "బాబోయ్, ఇదెవరు వేసుకుంటారు, బోర్...నాకొద్దు..." అంటూ తిరస్కరించింది. 

    నాకు మనసు చివుక్కుమంది. ఈమెదంతా మోడరన్ ట్రెండ్. నావన్నీ పాత అభిరుచులు. నాకు ఘంటసాల పాటలు ఇష్టమైతే, ఈమెకు రాక్ మ్యుజిక్ ఇష్టం. నాకు కూచిపూడి ఇష్టమైతే, ఈమెకు సల్సా ఇష్టం. ఆమె మీద రాసిన కవితలను చదివి వినిపిస్తే అర్థం కూడా నన్నే విప్పి చెప్పమంటుంది. ఇలా అయితే ఎలా? కాని ఉత్పల అంటే నాకు చాలా ఇష్టం. ఎదుటివారి అభిరుచులను గౌరవిస్తూ, మన అభిప్రాయాలను వాళ్ళమీద రుద్దకుండావుంటే ఆ జంట అన్యోన్యంగానే ఉండవచ్చు కదా? ఇరుహృదయాలను కలిపే ప్రేమ చాలదూ?  

    మధూ, దీప్తీ హైదరాబాద్ లోనే ఫ్లాట్ తీసుకొని కాపురం పెట్టారు. అప్పుడప్పుడూ నా ఫ్లాట్ కి వస్తూంటారు.

    ఇంతలో ఒక ఉపద్రవం జరిగిపోయింది. రెసిషన్ పుణ్యమా అని నష్టాల పాలు కావటంతో నేను పని చేస్తున్న కంపెనీని అర్థాంతరంగా మూసివేసారు. నా ఉద్యోగం పోవటంతో భవిష్యత్తంతా చాలా శూన్యంగా తోచింది. మధు చాలా ధైర్యం చెప్పి తన కంపెనీలో తప్పకుండా రికమెండ్ చేస్తానని అన్నాడు.  కానీ, అదేమిటో, నా ఉద్యోగం పోయినప్పట్నుండీ ఉత్పలలో మార్పు వచ్చేసింది. నన్ను కలవటం చాలా తగ్గించేసింది.

    ఈలోగా ఊరినుంచి కబురు, తాతయ్యకు ఆరోగ్యం దెబ్బతిందనీ, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమనీ...నాకు చాలా గాబరాగా అనిపించి, వెంటనే ఊరికి ప్రయాణమయ్యాను. లైట్ గా పెరాలసిస్ సోకిన తాతయ్యను చూడగానే చాలా దిగులనిపించింది.  బాగా చిక్కిపోయాడాయన. ఎడమ వైపు చేయి, కాలు సరిగ్గా పని చేయటంలేదు. అదంతా వ్యాధి ప్రభావం, వయస్సు ప్రభావమే కాక నా మీద ఉన్న బెంగ కూడా ఒక కారణమే అనీ, ఆ ఉద్యోగం వదిలిపెట్టేసి, వ్యవసాయం చూసుకుంటూ ఇక్కడే ఉంటే బావుంటుందనీ చెప్పింది అమ్మమ్మ.   

    చేస్తున్న ఉద్యోగం ఎలాగూ పోయింది.  మళ్ళీ మరో ఉద్యోగం చూసుకుని నేను సిటీకి వెళ్ళిపోతే ఇక తాతయ్యను శాశ్వతంగా పోగొట్టుకున్నట్టే అనిపించింది నాకు. కాని ఉత్పల?  ఉత్పల ఇక్కడికి వచ్చేసి ఉండగలదా? ఏదో తెలియని ఆందోళనతో నా మనసు ఊగిసలాడింది.   ఆ రాత్రి భయపడుతూనే ఉత్పలకు ఫోన్ చేసి పరిస్థితి చెప్పాను.   

    "ఉండిపో ప్రణయ్, నీకు మీ తాతయ్య, అమ్మమ్మ తప్ప ఇంకెవరూ లేరు కదా, మరో ఉద్యోగం కూడా వెంటనే దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదీరోజుల్లో..." చెప్పింది ఉత్పల. 

    "మరి...మరి...నువ్వు ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చేస్తావా? "

    "సారీ ప్రణయ్, నేను ఇంత మంచి జాబ్ వదిలి రాలేను. నాకు విలేజెస్ సరిపడవు. మన పెళ్ళి మాట మర్చిపో. అసలు నేను నిన్ను ఇష్టపడిందే నీ జాబ్ చూసి... మన అలవాట్లు వేరు, మన అభిరుచులు వేరు... ప్లీజ్ ఫ్రెండ్స్ లా విడిపోదాము. నీకు అనుగుణంగా ఉండే, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకో.. ఆల్ ద బెస్ట్."

    "అదేమిటి ఉత్పలా, డబ్బే ముఖ్యమా? మనసులూ, మమతలూ లెక్కలోకి రావా?"  అయోమయంగా ప్రశ్నించాను.  "వట్టి అమాయకుడివి ప్రణయ్...ఈ లోకంలో డబ్బు తర్వాతే కదా ఏదైనా... అయాం సారీ..." అని ఫోన్ కట్ చేసింది ఉత్పల.

    నా మనసంతా నిర్వేదం అలముకుంది.  కానీ ఆ దుఃఖాన్ని  ఇంట్లో నేను నిర్వర్తించవలసిన బాధ్యతలు అధిగమించాయి.  ప్రతిరోజూ ఆచారిగారిచ్చే తైలంతో తాతయ్య కాలు, చేయి తోమి మర్దన చేయటం, పాలేర్ల సహాయంతో పొలం పనులు చూడటం, అమ్మమ్మ దగ్గర కూర్చొని ఆమెకు ధైర్యం చెబుతూ ఉండటంతో నాకసలు టైమే తెలిసేది కాదు.

    నేనింక హైదరాబాద్ వెళ్ళనన్న నమ్మకం కుదిరాక అనూహ్యంగా తాతయ్య ఆరొగ్య పరిస్థితి మెరుగు పడటం మొదలయింది. కాలు, చెయ్యి కాస్త స్వాధీనం లోకి వచ్చాయి. కర్ర సహాయంతో నడవటం మొదలు పెట్టాడు. ఒకరోజు నా పెళ్ళి ప్రస్తావన తెచ్చాడు తాతయ్య. తానిక ఎక్కువ కాలం బ్రతకననీ, పోయేలోగా నా పెళ్ళి చూడాలని వుందనీ, నేనెవరినైనా ఇష్టపడితే సిగ్గుపడకుండా చెప్పమనీ అడిగాడు. ఉత్పల గుర్తుకు వచ్చి నా మనసు బాధగా మూలిగింది. కాని అది ఒక్క  క్షణమే. నిజానికి మేమిద్దరమూ ఒకరికొరం సరిపడము.  

    "ఆస్తులూ, అంతస్తులూ చూడకురా బాబూ, ఎవరైనా సరే, ఈ ఇంట్లో ఇమిడిపోగలిగే అమ్మాయి అయితే చాలు..." అంది అమ్మమ్మ.

    నాకెందుకో మనసులో సాంత్వన మెదిలింది.  ఆ అమ్మాయిలో ఎంత సహనం, మరెంత సేవాగుణం? వినయం, అణకువ, పొందిక కలగలసిన సద్గుణరాశి... ఆమె నా ఇల్లాలైతే...సరికొత్త ఊహ...ఔను, ప్రేమించటం మాత్రమే తెలిసిన ఆమె ఈ ఇంట కోడలిగా అడుగుపెడితే మా తాతయ్యను, అమ్మమ్మను ఎంతో బాగా చూసుకుంటుంది.  అలాగే, నాకూ తోడుగా, నీడగా ఉంటూ అనురాగాన్నీ పంచి ఇస్తుంది.
వెంటనే మధుకి ఫోన్ చేసి మాట్లాడాను- నెల రోజుల క్రితం సాంత్వన తండ్రి పాము కాటుకు గురై మరణించాడనీ, ఆమె అనాథగా మిగిలిపోయిందనీ తెలిసి షాకయ్యాను. వెంటనే, అమ్మమ్మతో, తాతయ్యతో ఆ అమ్మాయి గురించి, అప్పుడు నేను పెళ్ళికి వెళ్ళటం, నేను మంచాన పడితే ఆమె నాకు సేవ చేయటం...అవన్నీ చెబుతూ, చివరి విషయం చాలా సంశయంగా చెప్పాను- "ఆ అమ్మాయిది మన కులం కాదు, అసలు ఏ కులమో కూడా నాకు తెలియదు" అని.

    "మంచితనాన్ని మించిన కులం, మానవత్వాన్ని మించిన మతం ఏమున్నాయిరా? నీకు ఇష్టమైతే, నాకూ ఇష్టమే... చిన్న కారు మాట్లాడు, మన కుటుంబరావు మామయ్యతో కలిసి నలుగురం వెళ్ళి, ఆ ఆదిశేషయ్య గారితో మాట్లాడి వద్దాము..." తాతయ్య మంచి మనసుకు, ఔన్నత్యానికీ నా నోట మాట రాలేదు. 

    విషయం విన్న ఆదిశేషయ్యగారు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. ఫోన్లో మధూ కూడా మామగారితో మాట్లాడాదు.  ఆదిశేషయ్య గారు సాంత్వనను పిలిచారు. నన్ను చూడగానే వెలిగిపోయిన ఆమె ముఖం నాపై గల అభిమానాన్ని చెప్పకనే చెప్పినట్టయింది. తాతయ్యను, అమ్మమ్మను పరిచయం చేసి, వారి ప్రతిపాదనను ఆమె ముందుంచారు ఆదిశేషయ్య గారు. 

    అప్పుడొచ్చింది ఆమెకు దుఃఖం. రెండు చేతులతో ముఖం కప్పుకుని భోరున ఏడ్చింది. 

    "తప్పమ్మా, సంతోషకరమైన సమయంలో అలా కంట తడి పెట్టవచ్చా? " సాంత్వనను అక్కున చేర్చుకున్న అమ్మమ్మ ఆప్యాయంగా ఆమె కళ్ళు తుడిచింది చీరచెంగుతో.

    "అమ్మా, నీకు నా ఇంట ఏ లోటూ కలగనీయను. నీవు బాధపడే సందర్భం ఇదే చివరిది కావాలి. మా తర్వాత నా మనవడిని జాగ్రత్తగా చూసుకోగలిగే శక్తి నీకే ఉంది. కాదనకమ్మా, మా ఇంట కుడికాలు పెట్టు..." అన్నాదు తాతయ్య ఆమె తలనిమురుతూ.

    "ఇంకేమీ ఆలొచించకు బుజ్జమ్మా, మేము నీకు పెళ్ళి చేయాలన్నా, ఇంత మంచి సంబంధం తేగలమా? అబ్బాయే కాదు, అతని పెద్దవాళ్ళు కూడా చాలా మంచి వారు. కాదనకు..." చెప్పింది ఆదిశెషయ్యగారి భార్య. 

    కళ్ళు తుడుచుకొని తాతయ్య, అమ్మమ్మలకు పాదాభివందనం చేసింది, సాంత్వన.  

* * *

    నెలరోజుల తర్వాత మా ఇంటి ఆవరణలోనే తాతయ్య, అమ్మమ్మల చేతులమీదుగా మా పెళ్ళి జరిగిపోయింది.  పెళ్ళికి మధు, దీప్తి హాజరయ్యారు. దీప్తి అమ్మానాన్నలే సాంత్వనను కన్యాదానం చేసారు. 
ఆ రాత్రి నా కౌగిలిలో ఒదిగిపోతూ అంది సాంత్వన, "ఇంతటి అదృష్టానికి నేను నిజంగా అర్హురాలినా? ఎందుకింత పెద్ద వరం అనుగ్రహించారు? "

    "ఎందుకంటే, భగవంతుడు నాలాంటివారందరిఖీ సాంత్వననివ్వటానికే సృష్టించిన అమూల్యమైన వజ్రంగా నిన్ను అనుగ్రహించాడు కాబట్టి..." సమాధానం ఇచ్చి, ఆమె నుదుట ప్రేమగా ముద్దు పెట్టుకున్నాను.


(స్వాతి మాసపత్రిక మార్చి2012 సంచికలో ప్రచురితం)
Comments