అన్ హ్యాపీడేస్ - పి.వరలక్ష్మి

    
"నాకేదో భయంగా ఉందిరా. నవీన్‌గాడు అన్నంత పనీ చేస్తాడేమో"

    ధారలుగా కారుతున్న చెమటను తుడుచుకుంటూ మహేష్ ఎవరినుద్దేశించి అన్నాడో గాని అది నిజమవుతుందేమోనని ఆ ముగ్గురి పాలిపోయిన మొహాల్లో, లోతుకుపోయిన కళ్ళలో భయం కదలాడింది. మొన్న సాయంత్రం నుండి నవీన్ ఫ్రెండ్స్ అతడి ఆచూకీ కోసం ఊరంతా తిరుగుతున్నారు. తెలిసిన వాళ్ళ ఇళ్ళన్నీ రెండుసార్లు చుట్టి వచ్చారు. ఉదయం కాలేజీక్కూడా పోకుండా తిరుగుతూనే ఉన్నారు. ఓ వైపు ఎండ నడినెత్తి మీద సెగలు కురిపిస్తోంది. ఉస్సూరుమంటూ రోడ్డు పక్కన బెంచీ మీద వాలిపోయి కూల్‌డ్రింక్ తాగుతున్నారు. వాళ్ళ మనసుల్లానే రోడ్డు ఖాళీగా ఉంది. అప్పుడప్పుడు వచ్చిపోయే లారీలు తప్ప జనసంచారం లేదు.

    "వీళ్ళు బతకనివ్వర్రా. ఇంటికి పోదామంటే ఇంత జరిగినాక ఇంట్లో మొహం ఎట్ల చూపియ్యాల్రా? నాన్నకు తెలిస్తే ఇంగేమన్నానా! ఈ టెన్షన్ భరించడం కంటే చావాలనిపిస్తోందిరా" మొన్న ఉదయం కాలేజీలో జరిగిన గొడవ తర్వాత కళ్ళ నిండా నీళ్ళతో అన్న మాటలు. ఆ తర్వాత వాడు కనిపించలేదు.

* * *

    సాదా సీదా సగటు విద్యార్థి నవీన్. అందరి తల్లిదండ్రుల్లానే కొడుకు మీద ఎంతో ఆశతో రెండు సంవత్సరాల క్రితం రెండెకరాల పొలం అమ్మి ఇంజనీరింగ్‌లో చేర్పించాడు వాళ్ళ నాన్న. నవీన్ అంత చురుకైన విద్యార్థి కాడు. ఇంజనీరింగ్ చదివితే తప్ప కొడుక్కు భవిష్యత్తు ఉండదని రెండు లక్షలు పోసి బిటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో చేర్పించారు. ఇంజనీరింగ్ చదువుతున్నాడన్న మాటేగాని థర్డియర్‌లోకి వచ్చేసరికి ఆరు సబ్జక్ట్లు బకాయి పడిపోయాయి. వాడికి ఎలక్ట్రానిక్స్ వంటబట్టలేదుగాని సంవత్సరానికంతా 'లోకజ్ఞానం' బాగా వంటబట్టింది. నాలుగు మాటలు మాట్లాడితే రెండు ఇంగ్లీషులో ఉంటాయి. వంద కిలోమీటర్ల వేగంతో బైక్ నడపడం నేర్చుకున్నాడు. అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా స్టైల్‌గా దమ్ముకొట్టగలడు. స్టన్నింగ్ బ్యూటీని తలచుకుంటూ ఛిల్ల్డ్ బీర్ తాగుతూ థ్రిల్ అవడం ఏమిటో ఫ్రెండ్స్ నేర్పించారు. వాళ్ళ దృష్టిలో లోక జ్ఞానం అంటే ఇదే.

    మొదట్లో ఎలక్ట్రానిక్స్ ఎంతకూ కొరుకుడు పడకుంటే, 'నేనీ ఇంజనీరింగ్ చదవలేను. డిగ్రీలో చేరతాను' అన్నాడు. అంతే వాళ్ళ నాన్న ఇంతెత్తున లేచాడు. 'డిగ్రీ చేసి ఏం అడక్కతిందామని. ఇంటికొస్తే కాళ్ళిరగ్గొడ్తా'న్నాడు. ఇక తప్పలేదు. మెల్లగా అలవాటు పడ్డాడు. కోర్సుకు కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పే బిటెక్ లైఫ్ స్టైల్‌కి. బైట ఎంత ఎంజాయ్ చేసినా చాలాసార్లు ఆ కాలేజీ నరకంలాగా కూడా తోచేది. ఊరి బైట శ్మశానానికవతల ఎడారిలో చచ్చిపడిన ఒంటెలాగా ఉండే కాలేజీ. రోజూ ఎనిమిది గంటలు తనకర్థంకాని ప్రపంచంలో తనెందుకు ఉన్నాడో అంతు పట్టదు. ఏం చేస్తున్నాడో ఏం చేయబోతున్నాడో ఆలోచిస్తే అంతా గందరగోళంగా ఉంటుంది.

    అదేంటో హైస్కూల్ నుండీ చూస్తున్నాడు. పది పదైదడుగుల గోడలు, తన స్వేచ్ఛను హరించే జైలు గోడలు. స్కూల్లో ఎన్నిసార్లు పారిపోయాడో గోడ దూకి. ఇంట్లో, స్కూల్లో తన్నులు. అయినా నాలుగ్గోడల మధ్య ఉండలేని మనసు. నైంత్ క్లాస్‌లో ఉన్నప్పుడు గోడకు దగ్గరగా కొమ్మలు సాచి ఉన్న వేపచెట్టుని నరికేసినప్పుడు తను రెక్కలు తెగిన పక్షే అయిపోయాడు. అంతకన్న తన చేతులు నరికెయ్యకూడదూ అనుకున్నాడు. 'ఇంగ ఎట్ల పారిపోతారో చూద్దాం' అని నడుం మీద చేతులు పెట్టుకుని హెడ్ మాస్టర్ అంటున్నప్పుడు వాడ్ని చంపాలన్నంత కోపం. 

    ఇంటర్‌లో ఇంక చెప్పనలవి కాదు. గేటు దాటాలంటే సవాలక్ష ఆంక్షలు. ఇంక అయిపోయిందిలే పీడ అనుకున్నాడు ఇంటర్ గట్టెక్కినప్పుడు. స్కోర్ తక్కువొచ్చిందని నాన్న తిట్టినప్పుడు కాస్త బాధపడ్డా తానిక స్వేచ్ఛా ప్రపంచంలో విహరించవచ్చు అనుకున్నాడు ఇంజనీరింగ్‌లో చేరే రోజు. అక్కడా అటువంటి గోడలే చూసి నీరసించిపోయాడు. తను చిన్నప్పటి నుండీ వినీ వినీ విసిగిపోయిన మాటలే అక్కడా మళ్ళీ. 'మీరిప్పుడు కష్టపడి చదువుకుంటే పెద్దయ్యక సుఖపడతారు.' సరే ఇప్పుడిక ఆఖరా అనుకోడానికి లేదు. ఉద్యోగాలొస్తాయన్న గ్యారెంటీ లేదు. నాలుగేళ్ళ నుండీ హైదరాబాద్ రోడ్లు పట్టుకొని తిరుగుతున్న తన సీనియర్స్ ఎంతో మంది ఉన్నారట. క్యాంపస్ సెలెక్షన్స్‌లో జాబ్స్ వచ్చిన వాళ్ళూ తెలుసు. రోజుకు 12 గంటలు పని అట. ఆఫీస్‌లో పక్కవాడితో మాట్లాడటానికి లేదట. కెమెరా పెట్టి మరీ వాచ్ చేస్తారట పని చేస్తున్నాడా లేదా అని. ఛ, ఏం బతుకది. కుక్క బతుకు.

    నైంటీ పర్సెంట్ అటెండెన్స్ లేకపోతే పేరెంట్స్ నుండి లెటర్ తేవాలి. కాలేజ్ అవర్స్‌లో బైటికి పోవాలంటే గేట్ పాస్ మీద ప్రిన్సిపాల్ సంతకం తెమ్మంటాడు వాచ్‌మెన్. వాడితో కూడా తిట్లు తినాల్సి రావటం ఏమిటో.

   బంధువులింట్లో డిన్నర్‌కు వెళ్లాలని పర్మిషన్ అడిగినప్పుడు 'సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ అయినాయా' అని అడిగాడు.

    'సిక్స్ సబ్జెక్ట్స్ పెండింగ్' అని తనన్నాడో లేదో 'సిగ్గులేకపోతే సరి, ఎందుకొస్తారు కాలేజికి' అంటూ పది నిమిషాల పాటు తిట్టాడు ఇంగ్లీషులో.

    ఎంత కోపమొచ్చిందో తనకు.

    'మాకంత వర్త్ లేదని తెలిసినా లక్షలు తీసుకొని సీట్లెందుకివ్వడం' అందామనుకున్నాడు. 

    కాలేజ్‌డే కోసం వెరైటీ కల్చరల్ ప్రోగ్రాంస్ ఆర్గనైజ్ చేస్తామని ఫ్రెండ్స్‌తో పాటు అడగడానికి పోయినప్పుడూ అదే అడుగుతాడు 'సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ అయినాయా' అని.

    ఒక నెల అటెండెన్స్ తక్కొవొచ్చినప్పుడూ అదే.

    స్పోర్ట్స్ మీట్ అటెండ్ అవుతానన్నప్పుడూ అదే.

    ఎవరి ముందన్నా అడిగితే మరింత బాధ.

* * *

    ఆ రోజు వారంలో రెండో అవుట్ పాస్ కోసం ప్రిన్సిపాల్ వద్దకు వెళ్ళాడు నవీన్, మళ్ళీ ఏమంటాడో అని భయపడుతూనే. చాలా ఏళ్ళ తర్వాత తన చిన్నప్పటి ఫ్రెండ్‌ని కలవాలి. రెండ్రోజుల్లో వాడు స్టేట్స్ వెళ్ళిపోతాడు.

    "యువార్ నవీన్; రైట్?" ప్రిన్సిపాల్ రామిరెడ్డి చూపులు తీక్షణంగా ఉన్నాయి.

    "యస్ సర్" నవీన్‌కేదో అనుమానంగా ఉంది.

    టేబుల్ పైనున్న కవర్‌లో నుండి గ్రీటింగ్ కార్డ్ ఒకటి బైటికి తీసి నవీన్ నుంచున్న వైపుకి విస్రాడు ప్రిన్సిపాల్.

    దాన్ని చూడగానే నవీన్ గుండె జారిపోయింది.

    శిరీషకు ప్రపోజ్ చేస్తూ తానిచ్చిన వాలెంటైన్ కార్డ్. పంచవన్నెల్లో, ముద్దుగా, ముచ్చటగా ఊసులాడుకుంటున్న ప్రేమ పక్షులు. ఐదారు షాపులు తిరిగి దాన్ని పట్టుకొచ్చాడు. ఎంత మురిపెంగా తెచ్చుకున్నాడో! ఇప్పుడదే చాలా భయంకరంగా కనిపిస్తోంది. 

    ఇంటర్‌లో తన క్లాస్‌మేట్ శిరీష. అప్పుడేం అనిపించలేదుగాని ఇప్పుడు ఇద్దరూ ఒకే కాలేజీలో మళ్ళీ కలవడం డెస్టినీ అనుకున్నాడు. ఆమెతో కాస్త పరిచయం పెరిగేకొద్దీ కొత్త కొత్త భావాలు మొగ్గతొడిగాయి. అవి తనను కుదురుగా నిలవనీయలేకపోయాయి. ధైర్యం చేసి నాలుగు రోజుల క్రితం వేలెంటైన్స్‌డే రోజు కార్డిచ్చాడు. అదేమైనా నేరమా? ఇష్టం లేక పోతే లేదని చెప్పాలి గాని ఇలా చేసిందేమిటి? అయిపోయింది! సర్వనాశనం అయిపోయింది! ఎలుగుబంటి తన్నిక బతకనివ్వడు. గజగజా వణికిపోయాడు నవీన్. 

    "చదువులు గాలికొదిలేసి ఇట్లాంటి పన్లు చేస్తున్నావన్నమాట!"

    "ఎంత మంచి ర్యాంకర్ ఆ అమ్మాయి! నీ వల్ల తన లైఫ్ స్పాయిల్ అవుతోంది తెలుసా?" 

    నవీన్‌కు అంతా శూన్యమైపోయింది.

    "నిన్న వాళ్ళ ఫాదర్ వచ్చారు. వాళ్ళమ్మాయికి టీ.సీ.ఇవ్వమంటున్నారు."

    'స్టుపిడ్ ఫాదర్. పాపం తనేం చేసిందని?'

    "ఒక ఇడియట్ మూలాన మీ అమ్మాయి కెరీర్ ఎందుకు స్పాయిల్ చేస్తారు అంటే అలాంటి ఇడియట్స్‌ని కాలేజ్‌లో ఎలా పెట్టుకుంటారు అన్నాడాయన"

    అసలు జరిగింది ఏంటంటే శిరీష దగ్గరున్న కార్డ్ వాళ్ళమ్మ కంట పడటం, శిరీష నాన్న ప్రిన్సిపాల్‌ని కలిసి 'ఇలాంటివి కాస్త గమనిస్తూ ఉండడి, అసలే రోజులు బాగాలేవు' అనడం వరకే. అయితే స్టూడెంట్స్‌ని గ్రిప్‌లో పెట్టుకునే కళలు రామిరెడ్డి దగ్గర చాలా ఉన్నాయి.

    "పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు... ఎన్ని సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి నీకు?"

    'ప్రతీదానికీ అదే తీసుకొస్తాడు, ఎలుగుబంటి నాయాలు' మనసులోనే తిట్టుకోసాగాడు.

    "కమాన్ స్పీకవుట్"

    "సిక్స్ సర్"

    "సిగ్గులేదూ చెప్పడానికి"

    "ఇట్ల కాదుగాని రేపు మీ పేరెంట్స్‌ని పిలుచుకొని రా. నీతో మాట్లాడ్డానికేం లేదు."

    'నాన్నకు తెలిస్తే ఇంకేమన్నానా!'

    "అయామ్ సారీ సర్, తెలీక చేశాను. ఇంత దూరం పోతుందనుకోలేదు"

    "తెలీక చేసే పనులా ఇవి? ఇంట్లో వాళ్ళు కష్టపడి సంపాదించి పెట్టి చదువుకోండ్రా అంటే మీరు ఇట్లా పోరంబోకు వేషాలేస్తంటారు."

    "నేనేం చెయ్యలేదు సర్, జస్ట్ ప్రపోజ్ చేశాను, అంతే! ఆ అమ్మాయిని ఏమీ అన్లేదు సర్"

    "రాస్కెల్! ఏం చేద్దమనిరా అయితే" దిమ్మ తిరిగిపోయేలా నవీన్ చెంప ఛెళ్ళుమనింది.

    రెండో చెంపకు చెయ్యి తాకేలోపే మధ్యలోనే దాన్ని ఆపుతూ ఎడం చేత్తో పట్టుకున్నాడు నవీన్. అంతే! ప్రపంచం తల్లకిందులైంది. కాలర్ పట్టుకొని బరబరా బైటికి ఈడ్చుకొచ్చి రూం బైటికి తోశాడు.

    "గెట్ అవుట్ ఫ్రం దిస్ ప్రెమిసెస్"

    విసురుగా కింద పడేలోగా ఎన్ని దెబ్బలు తిన్నాడో లెక్కలేదు.

    "రేపొచ్చి టి.సి. కలెక్ట్ చేసుకో. వి డోంట్ వాంట్ యు ఇన్ అవర్ కాలేజ్"

    "అయామ్ సారీ సర్. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ సర్. తప్పయిపోయింది సర్"

    "ఇంకెప్పుడూ అట్ల చెయ్యను సర్" కాళ్ళు పట్టుకున్నాడు.

    "ఈ సారి అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకుంటాను సర్"

    అలా ఒక అరగంట బలిమిలాడినా ఫలితం లేకపోయింది.

    "ఏమైనా ఉంటే మీ పేరెంట్స్ వచ్చి నాతో మాట్లాడతారు" ఉరిమాడు ప్రిన్సిపాల్. 

    లంచ్ టైం అయిపోయిందంటూ బెల్ మోగింది. స్టూడెంట్స్ అంతా కాల్స్ రూముల వైపు వెళుతున్నారు. నవీన్ స్పృహలోకొచ్చి పరిసరాల జ్ఞానం తెలిసే సరికి అవమాన భారంతో కుంగిపోయాడు.

    'లంచ్ బ్రేక్! అందరూ చూసుంటారు!'

* * *

    రోజూ సాయంత్రం వాళ్ళు అయిదుగురూ బాలాజీ పార్క్‌లో కలుసుకుంటారు. ఫోన్‌లోనూ దొరక్క, అక్కడికీ రాకపోయేసరికి వాళ్ళలో అనుమానం మొదలైంది. చూడ్డానికట్లుంటాడేగాని వాడు చాలా సెన్సిటివ్ అని వాళ్ళ అభిప్రాయం. 

    "అంతా ఆ ఎలుగుబంటిగాడి వల్లేరా. పాపం నవీన్ గాడ్ని కుక్కను గొట్టినట్లు కొట్టినాడ్రా" రెండ్రోజుల్నాటి సంఘటన గుర్తు తెచ్చుకున్నారు. 

    "ఎక్కడ దొరికినాడ్రా వీడు మనకు. థూ! ఈ చదువులు లేకున్నా మానె"

    "మల్ల తిట్టుకోవచ్చుగాని ముందు నవీన్ సంగతి ఆలోచించండ్రా"

    "పోలీస్ కంప్లైంట్ ఇద్దాం రా"

    "వేస్ట్‌రా నోయూజ్"

    "అట్‌లీస్ట్ ట్రై చేయాలి గదరా"

    "ఓకే రా. పోలీస్ కంప్లయింట్  ఇద్దాం. రే రాము మళ్ళీ ఒకసారి నవీన్ నెంబర్‌కు ఫోన్ కొట్టరా"

    ఫ్యాంట్ జేబులోంచి సెల్ తీసి ఒకే ఒక్క కీ నొక్కి స్పీకర్ ఆన్ చేశాడు రాము.

    నిన్నటి నుండి ఆ సమాధానం ఏ వంద సార్లో విని ఉంటారు వాళ్ళు. 

    "పోలీస్ కంప్లయింట్  కంటే ముందు ఒక సారి ప్రిన్సిపాల్‌ని కలిసి విషయం చెప్పాలి"

    "ఎలుగుబంటి దగ్గరికా, నేను రాను బాబోయ్"

    "తప్పదురా బాబూ"

    "రే. రాము! పదరా మనిద్దరం పోదాం" మహేష్, రాము అక్కడి నుండి కదిలారు.

* * *

    క్రిష్ణారెడ్డి కాలేజ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ రామిరెడ్డిగారి ఏసీ రూంలో బిక్కుబిక్కుమంటూ నిలబడ్డారు రాము, మహేష్.

    "సర్! నవీన్ రెండ్రోజుల్నుండి కనపడ్డం లేదు సర్"

    "నవీన్ సరే, మీరు రెండ్రోజుల్నుండి కాలేజీకి వస్తున్నారా?"

    "లేదు సర్, నవీన్ కనపడకపోయే సరికి వెతుకుతున్నాం"

    "రాస్కెల్స్! అందరూ కలిసి దూకండి, దేంట్లోనైనా" కుర్చీలో అసహనంగా కదిలాడు రామిరెడ్డి.

    "నవీన్ వాళ్ళింటికి కూడా ఫోన్ చేశాం సార్, అక్కడ కూడా లేడు"

    "ఎక్కడికి ఛస్తాడ్రా. నాలుగు రోజులుంటే వాడే వస్తాడు. ఫస్ట్ యు గో టు యువర్  క్లాసెస్" చికాకు కాస్తా కోపంగా మారుతోంది.

    తలవంచుకొని బైటికి నడవక తప్పలేదు వాళ్ళు. ప్రిన్సిపాల్ గది దాటి బైటికొచ్చారో లేదో రాము సెల్ 'బీప్ బీప్'మని శబ్దం చేసింది.

    "లోపలున్నప్పుడు గనక మోగింటేనా, నా పని ఫినిష్" అనుకుంటూ జేబులో నుండి ఫోన్ తీశాడు.

    "రే, మహేష్! నవీన్‌గాడు ఎస్సెమ్మెస్ పంపాడు" కంగారుగానూ, ఆశ్చర్యంగానూ అరిచాడు రాము.

    "డియర్ ఫ్రెండ్స్! మీరు నాకు లైఫ్‌లో మర్చిపోలేని ప్రేమను పంచారు. అందుకే నా లాస్ట్ మెసేజ్ మీకే ఇస్తున్నాను. ఈ టెన్షన్ లైఫ్ మోయలేక పోతున్నా. నాకోసం వెతక్కండి. ఫైవ్ మినిట్స్‌లో అంతా అయిపోతుంది. గుడ్ బై ఫరెవర్... నవీన్"

    "ఏందిరా ఇది? పిచ్చి పట్టిందిరా వాడికి"

    "ముందు మన వాళ్ళకు ఫోన్ చెయ్యి. మనం మళ్ళీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడదాం... కాదురా, ముందు నవీన్‌కు చెయ్యి... షిట్!"

    టకటకా కీస్ నొక్కి విన్నదాన్ని నీరసంగా చెప్పాడు రాము "స్విచ్చిడాఫ్!"

    "మనవాళ్ళకు చేద్దాం" అంటూ మళ్ళీ ఏవేవో నెంబర్లు నొక్కాడు.

    "రేయ్ కార్తీక్, నవీన్‌గాడు ఎస్సెమ్మెస్ పంపినాడు. లాస్ట్ మెస్సేజ్ అని ఏదో పిచ్చిపిచ్చిగా రాసినాడు. ఇంక ఫైవ్ మినిట్స్ అంట! అత్నా అయిపోతుందంట! భయంగా ఉందిరా!"

    "మేం కాలేజ్‌లోనే ఉన్నాం" అటువైపు నుండి అడిగిన ప్రశ్నకు త్వరత్వరగా సమాధానం ఇస్తూ

    "ఎట్లైనా వెతకండ్రా"

* * *

    రెండు నిమిషాల్లో మళ్ళీ ప్రత్యక్షమైన మహేష్, రామూలను ప్రశ్నార్థకంగా చూశాడు ప్రిన్సిపాల్.

    "సర్ నవీన్..." ఏమీ మాట్లాడలేక నవీన్ మెసేజ్ చూపించాడు మహేష్.

    "నాకు మీ గురించి తెలుసురా! బెదిరించడానికి చేస్తున్నారా? లాస్టియర్ ఇట్లనే ఒకడు" రామిరెడ్డి బీపీ పెరిగిపోతోంది.

    "సర్... నిజంగానే వాడేమైనా చేసుకుంటే?"

    "ఛస్తే చావనీ, నష్టమేం లేదు!"

    "అట్లెట్ల చెప్తారు సార్..."

    "నాతో ఆర్గ్యూ చేయడానికి వచ్చారా? గెటవుట్!"

    ఆరోజు క్లాసులైపోవడంతో ఊపిరి పీల్చుకుంటూ గుంపులు గుంపుల్గా బైటికొస్తున్నారు స్టూడెంట్స్ అంతా. పరిగెత్తుకుంటూ వెళ్ళి గేటుకడ్డంగా నిలబడ్డారు రాము, మహేష్.

    "ఫ్రెండ్స్... ఒక్క మాట!" గట్టిగా అరిచాడు రాము.

    "మొన్న నవీన్ ప్రిన్సిపాల్‌తో దెబ్బలు తిన్నప్పటి నుండి కనిపించడం లేదు. ఇంక ఫైవ్ మినిట్స్‌లో సూసైడ్ చేసుకుంటానంటూ ఇందాక మెసేజ్ పంపాడు. ప్రిన్సిపాల్‌కు చెప్తే నమ్మడం లేదు. మనందరం కలిసి ఒకసారి రిక్వెస్ట్ చేద్దాం. మన సార్‌కు చాలా ఇంఫ్లూయన్స్ ఉంది కదా, పోలిసులతో వెతికిస్తాడు"

    కొంతమంది రాము, మహేష్‌లను చుట్టుముట్టారు. ఇంకొందరు వాళ్ళలో వాళ్ళే గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. మరికొంత మంది జరుగుతున్న దాన్ని నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డారు. ఎవరూ గేటు దాటి బైటికి పోలేదు. క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపాల్ మొండితనం  తాలూకు చేష్టలు వాళ్ళ అనుభవంలో గుర్తుచేసుకుంటున్నారు. చీటికీ, మాటికీ వందలూ, వేలు ఫైన్లు వాటి మూలాన ఇంట్లో, కాలేజీలో తిట్లు, తమని స్కూలు పిల్లల కంటే చులకనగా చూసే మేనేజిమెంటూ, ఇలా అన్ని రకాల అసంతృప్తులు బైటికొస్తున్నాయి. విద్యార్థి సంఘాలు ఫీజుల విషయమై లేదా బంద్ సందర్భంగానో ఆందోళన చెయ్యడానికి వచ్చినప్పుడు గేటు వద్దే గుండాలతో కొట్టించిన రెండు మూడు సందర్భాలు కొంత మంది గుర్తుచేసుకున్నారు. 

    "ఏం జరుగుతోందక్కడ? ఏంటీ న్యూసెన్స్? దాన్నిప్పుడు పెద్ద ఇష్యూ చేస్తున్నారా? ఆ పోరంబోకోనికి మీ సపోర్టా?" ప్రిన్సిపాల్ కార్లో నుండి తల బైటికి పెట్టి అరిచాడు.

    అంతా గోలగోలగా కారును చుట్టుముట్టారు. ఏదో జరగబోతోందని ఊహించి జేబులోంచి ఫోన్ తీశాడు. ఎవరితోనో మాట్లాడాడు, అడ్రస్ చెబుతూ, త్వరగా రండి అంటూ. విద్యార్థులు ఒక్కసారిగా అరుస్తూ చుట్టుకునే సరికి ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. రాము గుంపులో నుండి కారు వెనక డోర్ వద్దకొచ్చి గొంతు పెంచాడు.

    "నవీన్ గురించి భయంగా ఉంది సార్. ఎట్లైనా వాన్ని వెతికించండి సార్" అంటున్నాడు. 

    గుంపుని వెంటేసుకొచ్చేసరికి రామిరెడ్డికి పిచ్చి కోపమొచ్చింది. కారు స్టార్ట్ చేసి గుంపుల నుండి పోనిచ్చాడు. ముందు పక్క నించున్న వాళ్ళు ఎగిరి పక్కకు దూకారు. ఏం జరగబోతోందో అర్థమయ్యేంతలో కారు అద్దాలు భళ్ళు భళ్ళున పగిలాయి. ఆ తర్వాత ప్రిన్సిపాల్ రూంలో కుర్చీలు, కాగితాలు చెల్లా చెదురయ్యాయి. కంప్యూటర్లు బోర్లా పడ్డాయి. కీబోర్డులు మానిటర్లను గుద్దుకున్నాయి. 

    ఐదే ఐదు నిమిషాలు. 

    కంప్యూటర్లు క్రమశిక్షణ ఉల్లంఘించి చిందర వందరయ్యాయి. మరుక్షణంలో ముక్కలు చెక్కలైనాయి.

* * *

    ఇక ఐదే ఐదు నిమిషాలు.

    "రైలు కింద తల పెట్టాలనిపిస్తోందిరా" నవీన్ మాటలు సడన్‌గా గుర్తొచ్చాయి. 

    కార్తీక్ బైక్ 120 కిలోమీటర్ల వేగంతో రైల్వే స్టేషన్ వైపు దూసుకెళ్తోంది. దూరంగా ఒంటరి ప్లాట్‌ఫాంపై చిట్టచివరి బెంచీ ముందు సడన్ బ్రేక్‌తో ఆగింది.

    "థాంక్ గాడ్!"

    బైక్ కింద పడేసి నవీన్‌ను గట్టిగా అతుక్కుపోయాడు కార్తీక్.

    "ఇడియట్! పిచ్చారా నీకేమన్నా...? ఎంత భయపడ్డామో తెలుసా?"

    "అమ్మ గుర్తొచ్చిందిరా..." కళ్ళ నీళ్ళు కట్టలు తెంచుకున్నాయి.

    "... లేకపోతే ఈ పాటికి..."

    "నిన్ను ఊరికే వదిలి పెట్టకూడదురా" కళ్ళ నీళ్ళు అదిమి పెట్టుకోడానికి ప్రయత్నిస్తూ నవీన్ పొట్టలో గుద్దాడు కార్తీక్.    
Comments