అందలాలు-అగాధాలు - కొల్లూరి సోమశంకర్

    
నేను ఇంటికి చేరేసరికి ఏడయ్యింది. అప్పటికే ప్రభు వచ్చేసాడు. సోఫాలో జారబడి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

    నన్ను చూస్తునే, “మా అక్క ఫోన్ చేసిందా?” అని అడిగాడు. నేను అవునన్నట్లు తలూపాను. “నాకు బావగారు చేసారు” చెప్పాడు.

    “కాఫీ కలపనా?” అని అడిగి, ఫ్రెష్ అవడానికి బాత్ రూం వైపు నడిచాను. కాఫీ కలుపుతూ, మా వదినగారి సమస్యని ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్నాను. ప్రభు ఓ కప్పు అందించి, నేనూ సోఫాలో కూలబడ్డాను.

    “ ఎదుగుతున్న కూతురితో అలాంటి విషయాలు నేనెలా మాట్లాడను…అని బావగారు అంటున్నారు. అక్క చెబుతుంటే రమ్య అర్ధం చేసుకోడంలేదు…” అన్నాడు ప్రభు.

    “మూడు నెలల నుంచి ఇదే గోలట. మొదట్లో ఏదో సరదాగా అంటోందేమో అని అనుకున్నారట. కాని రమ్య యాడ్- ఆన్ క్రెడిట్ కార్డు ఉపయోగించి దానికి కావలసినవి కొనేసుకుందట! చదువుని నిర్లక్ష్యం చేస్తూ, ఈ గోల ఏంటని వదినగారు బాధపడ్డారు…” చెప్పాను,

    “మూడు రోజులైందేమో కదా, రమ్య నీ దగ్గరికి పాఠాలు చెప్పించుకోడానికి వచ్చి?”

    “అవును. ఏదో ఫ్యాషన్ షో ఉందట. అక్కడికి వెళ్ళిందట.”

    “ ఈ మోడలింగ్ పిచ్చేమిటి దీనికి? నాకేం అర్ధం కావడం లేదు”

    “వదినగారు నీకు చెప్పారో లేదో, ఇంకో విషయం కూడా ఉంది. దాని పుస్తకంలో ఓ ఉత్తరం దొరికిందట. దాని క్లాసుమేట్ ఎవడో రాసాడట. ‘ప్రేమించుకుందాంరా, నిన్నే పెళ్ళాడతా, నీకూ నాకూ మధ్య… లాంటి సినిమా పేర్లతో కవిత్వం వెలగబెట్టాడట. ఉత్తరం చివర్లో – బస్ట్ క్రీం వాడమని, తరచూ మసాజ్ చేయించుకోమని, కుదిరితే ఇంప్లాంట్స్ పెట్టించుకోమని రమ్యకి సలహా ఇచ్చాడట. అప్పుడికి మోడలింగ్ లో రమ్యకి తిరుగుండదని వాడి ఫీలింగట. వాడి సలహా పాటించేసి నీ మేనకోడలు కాస్మోటిక్స్, బస్ట్ క్రీం, పాడెడ్ బ్రాసరీలు కొనేసుకుంది…” చెప్పాను నేను.

    “నిండా పదిహేనేళ్ళు లేవు. ఇంకా పదో క్లాసు కూడా పాసవలేదు. ఈ పిల్ల ఏంటి – అప్పుడే ఫ్యాషన్ షోలు, మోడలింగ్ మైకంలో పడిపోయింది? ఫాస్ట్ ఫుడ్ తిన్నంత తేలికా, శరీరాన్ని ఆకర్షణీయంగా మార్చేసుకోడం..?” అని ఆవేదనగా  అన్నాడు ప్రభు. మళ్ళీ తనే మాట్లాడుతూ ” సత్యా, నువ్వు కాస్త దానికి నచ్చజెప్పవూ – శరీరాన్ని మనసుని సహజంగానే ఎదగనివ్వాలని…” అని అన్నాడు.

    ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. నేను తలుపు తీయగానే, పుస్తకాలు మోసుకుంటూ, రమ్య ఉస్సూరుమంటూ లోపలికి వచ్చింది. ‘హాలో అత్తా, హాయ్ మావయ్యా’ అని అంది.

    “ ఏం రమ్యా, నిన్నా మొన్నా రాలేదు. లెసన్సు ఏవీ లేవా?” అడిగాను. రమ్య మౌనంగా ఉండిపోయింది.

    “సరే పద, మనం ఆ గదిలో కూర్చుందాం… ” అని రమ్యని లోపలి గదిలోకి తీసుకెళ్ళాను. ప్రభు వార్తల కోసం టి.వి. పెట్టుకున్నాడు. పది నిమిషాలు గడిచాయో లేదో, “సత్యా, సత్యా,” అంటూ ప్రభు కేక వినిపించింది.

    “ ఏమైంది ప్రభూ?” అంటూ లోపలినుంచే అడిగాను.

    “సత్యా, త్వరగా రావాలి. స్వప్న కనబడింది. టి.వి.లో చూపిస్తున్నారు….” మళ్ళీ అరిచాడు ప్రభు. ఈ సారి అతడి గొంతులో ఉత్సాహం ధ్వనిస్తోంది. నేనూ, రమ్య టి.వి. దగ్గరికి చేరాం. ఓ అమ్మాయి మతిభ్రమించి ఢిల్లీ వీధుల్లో తిరుగుతోందని, ఆమె ధరించిన ఆధునిక వస్త్రాలు చూస్తే బాగా చదువుకున్నదానిలా ఉందని, ట్రాఫిక్ పోలీసులతో గొడవ పడుతూ, ఇంగ్లీషులో ధాటిగా మాట్లాడుతోందని న్యూస్ రీడర్ చెబుతున్నాడు. చింపిరి జుట్టు, మాసిన బట్టలు, ఒంటిమీద అక్కడక్కడ చిన్న గాయాలతో ఉన్న ఆమెని ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపాడు.

    ఆమె రూపాన్ని పరీక్షగా చూస్తున్నట్లు ఉండిపోయిన నేను కూడా ఆమె స్వప్నేనని నిర్ధారించాను.

    “స్వప్న ఎన్ని రోజులకి కనిపించింది?” అంటూ మరిన్ని వివరాలకోసం ఛానల్ మార్చాడు ప్రభు.

    “ ఇంతకీ స్వప్న ఎవరు అత్తా?” అడిగింది రమ్య.

    ముఖంలో కోపం, అసహనం వ్యక్తం చేస్తూ, “మీ మావయ్యకి ఒకప్పుడు ఆరాధ్య దేవత. కాలేజి రోజులలో ఆమెని ప్రేమించారట…” చెప్పాను నేను.

    “నిజమా మావయ్యా, ఈ విషయం అమ్మకి తెలుసా?” ఆసక్తిగా అడిగింది రమ్య. ఆమె మాటలని పట్టించుకోకుండా, ” ఒకప్పుడు ర్యాంప్ మీద ఓ వెలుగు వెలిగిన స్వప్నేనా ఈమె..” అన్నాడు ప్రభు. ర్యాంప్ అన్న మాట వినబడగానే, రమ్యకి ఉత్సాహం రెట్టింపయ్యింది. ” ఆమె మోడలా మావయ్యా?” అని అడిగింది. తలూపుతూ ప్రభు ఇంకో ఛానల్ మార్చాడు.
ఈ ఛానల్ లో అపడేట్లు కొంత ఆలస్యంగా వస్తాయి. ఇంతలో స్క్రోలింగ్ ఇచ్చారు – ఆమె పేరు దివ్యాంజలి అని, ఒకప్పుడు ముంబయిలో టాప్ మోడలని.., ఆ తర్వాత ఆమె ఎలా పిచ్చిదై ఉంటుందని ఊహిస్తూ, వార్తని ముగించారు.

    “మీరేమో స్వప్న అంటున్నారు. టి.వి.లో ఆమె పేరు దివ్యాంజలి అని చెబుతున్నారే?” అడిగింది రమ్య.

    “మోడలింగ్ లోకి రాకముందు ఆమె పేరు స్వప్న. మా కాలేజిలోనే చదివేది. ఎంత అందంగా ఉండేదనుకున్నావు…. కుర్రాళ్ళందరూ ఆమె వెనకే తిరగేవారు” చెప్పాడు ప్రభు గతాన్ని గుర్తు చేసుకుంటూ.

    “వాళ్ళలో నువ్వు కూడా ఒకడివి కదూ” అన్నాను నేను.

    “అవును నిజమే. ఒక సారి నేను ఆమెని నన్ను పెళ్ళి చేసుకోమని అడిగాను కూడా. ‘నా లక్ష్యం వేరు. నేను దేశంలో కెల్లా టాప్ మోడలవ్వాలనేది నా కోరిక. ప్రేమా లేదు, దోమా లేదు’ అని కటువుగా చెప్పేసింది. నేను నా చదువు కొనసాగించాను. ఆమె ఎక్కడో శిక్షణ పొంది ముంబయి వెళ్ళిపోయింది. కొన్ని చిన్న చిన్న ప్రకటనలు చేసాకా, కొన్నాళ్ళకి ఆమెకి గుర్తింపు వచ్చింది. ఆమె తన లక్ష్యం చేరుకుందని, నేను సంతోషించాను. నాకు కాంపిటీటివ్ ఎగ్సామ్స్ ద్వారా ఉద్యోగం వచ్చాక, నేను సత్యని పెళ్ళి చేసుకున్నాను….” చెప్పాడు ప్రభు.

    “ మరి ఆ తర్వాత ఏమైంది?” రమ్య అడిగింది.

    “మా కామన్ ఫ్రెండ్స్ చెప్పినదాని ప్రకారం – రెండేళ్ళ పాటు తారాపధంలో వెలిగిపోయిన స్వప్నంటే జనాలకి మొహం మొత్తింది. ఫీల్డులోకి కొత్త నీరు వచ్చింది. స్వప్నకి అవకాశాలు తగ్గాయి. దాంతో ఆమె ఎలాంటి చిన్న ప్రకటనకైనా సిద్ధపడిపోయింది. ఆమె టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక కంపెనీ వాళ్ళు ఫోటో-సెషన్ అడిగితే చేయలేదు. ఇప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఫోటో-సెషన్ అడిగింది. వాళ్ళు లేదు పొమ్మంటునే, ” ఓ లైవ్ షో ఉంది చేస్తావా?” అని అడిగారట. సంతోషంగా ఒప్పేసుకుంది. ఆ షో లో మోడ్రన్ డ్రెస్ వేసుకుని ర్యాంప్‌పై నడిచే సమయంలో భుజంపై ఉన్న క్లిప్‌లు ఊడిపోయేలా వదులుగా పెట్టించారట. అవేవి తెలియని స్వప్న ర్యాంప్ మధ్యలోకి వచ్చేసరికి, డ్రెస్ పై భాగం ఊడిపోయి, రెండు మూడు క్షణాలపాటు అందరి ముందు అర్ధనగ్నంగా నిలుచుండిపోవాల్సి వచ్చింది. ఆ సంఘటన ఆమెకి చాలా అప్రతిష్ట తెచ్చింది…” అంటూ ఆపాడు ప్రభు.

    “అవునవును. ఈ సంఘటన గురించి నేనూ పేపరులో చదివాను. ఆ మోడల్ ఈమేనా?” అన్నాను నేను.


    “ ఇలాంటివి ఫీల్డులో చాలా జరుగుతాయి. కొన్ని బయట ప్రపంచానికి తెలుస్తాయి, మరికొన్ని బయటకు రావు…” అన్నాడుప్రభు.

    “ప్రభూ, ఆ తర్వాతేనా? ఆమెకి డ్రగ్స్ అలవాటయ్యాయి?” అడిగాను నేను.

    “అవును. అవకాశాల పేరుతో కొందరు ప్రబుద్ధులు ఆమెని శారీరకంగా వాడుకున్నారు. మోజు తీరాక వదిలేసారట. ఆ తర్వాతే ఆమె కనపడకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు… ఇలా… కనపడింది. ఎన్ని కష్టాలు పడిందో ఏంటో..” అంటూ విచారం వ్యక్తం చేసాడు ప్రభు. నేను లేచి టి.వి. కట్టేసాను. రమ్య ఆలోచనలో పడింది. కొంత సేపయ్యాక, “అంటే మోడలింగ్ చేయడం తప్పా మావయ్యా?” అని అడిగింది.

    “తప్పని నేను అనను. కాని ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చెయ్యాలి. నీ వయసులో నువ్వు చదువుకోవాలి. ఇతర ఆలోచనలు ఉండకూడదు. ఊహాలోకాలలో విహరించకూడదు. శిఖరాలు అందుకోవాలనుకుంటే, లోయల గురించి తెలుసుకుని జాగ్రత్త పడాలి. తొందరపడి ప్రలోభాలకి గురైతే, స్పప్నలాగే జీవితం నాశనమైపోతుంది” చెప్పాడు ప్రభు.

    “మరి మోడలింగ్ చాలా మంచి కెరీరని మా ఫ్రెండ్ చెప్పాడే?” కాస్త తికమకి గురైనట్లుగా అడిగింది రమ్య.

    “రమ్యా, ఏదైనా ఒక రంగంలో కెరీర్‌ని ఎంచుకునేడప్పుడు, ఆ రంగంలోని నిష్ణాతుల సలహా తీసుకోడం మంచిది. మోడల్స్ కెరీర్ స్పాన్ చాలా తక్కువ కదూ, ప్రభూ. మహా అయితే నాలుగేళ్ళు! పైగా మీడియా విజృంభిస్తున్న ఈ రోజులలో అయితే టాప్ మోడల్‌గా ఉండగలిగేది రెండేళ్ళేనేమో! ఆ తర్వాత? ఇంకో ఫీల్డులోకి మారాల్సిందే. మనలాంటి మధ్య తరగతి వాళ్ళు రెండు కెరీర్లలో నిలదొక్కుకోడం సాధ్యమేనా? ఆలోచించు. నన్ను చూడు. దేశం మొత్తం మీద సి. ఎ. మూడో ర్యాంకులో పాసయ్యాను. నా కెరీర్ లాంగెవిటీ ఎక్కువ కదా? ఏదైనా చదువుని నమ్ముకున్నంత ఉత్తమం ఇంకొకటి లేదు….” చెప్పాను నేను ధృడంగా.
రమ్య ఆలోచనలో పడింది. మేము మళ్ళీ పుస్తకాల దగ్గరికి వెళ్ళాం. కాసేపు పాఠాలు చెప్పాక, నేను రమ్యకి కొన్ని జాగ్రత్తలు చెప్పాను. ఇంప్లాంట్స్, వాటి దుష్ఫలితాల గురించి చెప్పాను. రమ్య నిశ్శబ్దంగా వింది. ఇంటికి వెడుతూ, ఓ పాంఫ్లెట్‌ని ఉండలా చుట్టి చెత్తబుట్టలోకి విసిరేసింది. రమ్య వెళ్ళాక, ఆ కాగితాన్ని తీసి చూసాము. అది కొత్త మోడల్స్ కావాలనే ఓ ప్రకటన!

    “థాంక్యూ, మోడల్ దివ్యాంజలి..” అన్నాడు ప్రభు, తేలిక పడ్డ మనసుతో.

    ఆమె ఎవరో ఏమిటో నిజానికి మాకసలు తెలియదు. టి.వి.లో చూపించిన వార్తని ఉపయోగించుకుంటూ, అప్పటికప్పుడు ‘స్వప్న’ పేరుతో మేమా కథ అల్లినట్లు రమ్యకి తెలియదు. బహుశా తెలియకపోడమే మంచిది కూడ!

 * * *

(జాగృతి వారపత్రిక 21 ఏప్రిల్ 2008 సంచికలో ప్రచురితం)


Comments