అంతర్ముఖం - అడపా చిరంజీవి

    ఒక వ్యక్తికి జీవితం మీద విరక్తి కలిగింది. చచ్చిపోవాలనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిన దగ్గర నుంచీ అతడిలో వేదన మొదలైంది. అది మామూలు బాధ లాంటిది కాదు, మరణ వేదన. ఆ సంఘర్షణలో మనిషి ఎంతగా నలిగిపోతాడో తలుచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. అతడి మీద్ జాలి కలుగుతుంది. దయ కలుగుతుంది. అతడికేమైనా సహాయం చెయ్యాలనే తపన కలుగుతుంది. కానీ ఎవ్వరి సహాయాన్నీ పొందకుండానే, ఎవ్వరికీ ఏమీ తెలియకుండానే 'అతడు' ఈ లోకం నుంచి నిష్క్రమిస్తాడు. ఎవరు ఎప్పుడు ఎలా ఆత్మహత్య చేసుకుంటున్నారో ఎవరికి మాత్రం ఎలా తెలుస్తుంది?

    అలాగే అతడు కూడా చచ్చిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత మరణ వేదన అనుభవించాడు. ఆ తర్వాత ఎలా చచ్చిపోవాలనే సమస్య అతణ్ణి రెండురోజుల పాటు వేధించింది! రకరకాల ఆలోచనలు చేశాడు. చివరికి చచ్చిపోవడానికి ఒక పద్ధతి ఎన్నుకున్నాడు. ఒక ఎత్తయిన కొండ మీంచి దూకి, తన జీవితానికి ముగింపు పలకాలనుకున్నాడు.
    ఓ సంధ్యా సమయంలో ఒక కొండ శిఖరాగ్రాన్ని చేరుకున్నాడు అతడు. అక్కడి నుంచి కిందకు చూశాడు. ఆ కొండ కింద అగాథం లాంటి లోయ చూసేసరికి అతడి కళ్లు తిరిగాయి. మరు క్షణం ఒక అడుగు వెనక్కి వేశాడు. కొన్ని క్షణాలు మౌనం వహించాడు. ఇంకా ఆగితే, మనసు మారిపోతుందేమోనని భయపడ్డాడు.  

    బంధుమిత్రులందర్నీ ఒకసారి తలుచుకున్నాడు. ఇంకేమీ ఆలోచించకుండా కళ్లు మూసుకుని, కొన్ని క్షణాలు దైవాన్ని ప్రార్థించాడు. మరొక్క క్షణం కూడ ఆలస్యం చెయ్యకుండా ఆ లోయలోకి దూకబోయాడు.

    ఏదో అదృశ్య హస్తం పట్టి ఆపినట్టు అతడి అడుగు ముందుకు పడలేదు! ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు.     తేజోసంపన్నుడైన ఒక ఋషివర్యుడు కనిపించాడు. ఆయన చెయ్యి తన భుజం మీద వుంది.
    అతడు వెనక్కి తిరిగి, అప్రయత్నంగా ఆ ఋషికి నమస్కరించాడు.     "నాయనా! నీ ఆత్మహత్యా ప్రయత్నాన్ని రేపటి ఉదయం వరకూ వాయిదా వేయడం వలన నీకు వొనగూరే నష్టం ఏమీ లేదుకదా!" అన్నాడు ఋషివర్యుడు సౌమ్యంగా. ఆయన గొంతులో ధ్వనించే ఒక విధమైన గంభీరత అతణ్ణి మంత్రముగ్ధుణ్ణి చేసింది.     నష్టం లేదన్నట్టుగా అప్రయత్నంగా తల వూపాడు అతడు.     "అయితే నాతో రా నాయనా... ఈ రాత్రికి నా ఆతిథ్యం స్వీకరించు!" అంటూ ముందుకు నడిచాడా ఋషివర్యుడు.

    అక్కడికి ఒక ఫర్లాంగు దూరంలో పచ్చటి చెట్లమధ్య వుంది ఆయన పర్ణశాల.
    అతడు ఆ పరిసరాలు చూస్తూనే నిశ్శబ్దంగా ఆ ఋషివర్యుని వెంబడించాడు.     ఆ ఇద్దరూ పర్ణశాలని సమీపించారు.     అక్కడ వివిధ పనుల్లో నిమగ్నులై వున్నా ఆ ఋషివర్యుని శిష్యులు కొందరు భక్తిప్రపత్తులతో ఆయన్ని సమీపించారు. వాళ్లకి కొన్ని పనులు పురమాయించారాయన.     ఒక శిష్యుడు మట్టిచెంబుతో నీళ్లు తెచ్చి ఆ కొత్త వ్యక్తికి ఇచ్చాడు.     అతడు కాళ్లు, ముఖం కడుక్కున్నాడు.

    మరో శిష్యుడు శ్వేత వస్త్రం ఒకటి తెచ్చి ఇచ్చాడు.
    ఆ వస్త్రంతో అతడు ముఖం తుడుచుకున్నాడు.     ఆ పర్ణశాలను ఆనుకుని వున్న ఒక వటవృక్షం కిందకి అతణ్ణి తీసుకు వచ్చాడు ఆ ఋషివర్యుడు.     ఆ వృక్షం చుట్టూ రాతి వేదిక కట్టివుంది.     వెన్నెల పుచ్చపువ్వులా కాస్తోంది.     వటవృక్షం కిందున్న ఆ రాతి వేదిక మీద బాసిమటం వేసుకు కూర్చున్నాడు ఆ ఋషివర్యుడు. చేసైగ చెయ్యగానే, ఆయన ఎదురుగా వినమ్రంగా కూర్చున్నాడు అతడు.     ఒక శిష్యుడు అరిటాకులో భోజన పదార్థాలు వడ్డించి, దాన్ని తెచ్చి ఆ కొత్త వ్యక్తి చేతిలో పెట్టాడు.     మరో శిష్యుడు ఒక దీపాన్ని తెచ్చి అక్కడ పెట్టాడు.     ఆ ఋషివర్యుడు ఆ వ్యక్తిని చూసి, "భోజనం చెయ్యి నాయనా!" అన్నాడు.

    అతడు ఆకలి మీద వున్నాడేమో ఇంకేమీ మాట్లాడలేదు. నింపాదిగా భోజనం చేసి తన ఆకలి తీర్చుకున్నాడు.     దీపం, ఎంగిలి విస్తరి, మంచినీళ్ల చెంబులను ఋషివర్యుని శిష్యులు తీసుకు వెళ్లిపోయారు.     కొంత సమయం గడిచిన తర్వాత ఋషివర్యుడు "నాయనా! కాసేపు అలా తిరిగి రా!" అంటూ తన శిష్యులకు సైగ చెయ్యగానే ఇద్దరు వచ్చి నిలబడ్డారు. వారి వెంట ఆ పరిసరాలు చూడటానికి వెళ్లాడు అతడు.     ఒక గంట తర్వాత అతడు తిరిగి వచ్చేసరికి అప్పటివరకూ జపంలో వున్న ఆ ఋషివర్యుడు కాల్లు తెరిచాడు. ఆయన చేసైగ చూసి అతడు కూర్చోగానే ఋషివర్యుడు అడిగాడు. "మా పర్ణశాల పరిసరాలు ఎలా ఉన్నయి నాయనా?"     "ఇంత గొప్ప ప్రశాంతమైన పరిసరాలను నా జీవితంలో చూడలేదు స్వామీ!" నిజాయితీగా చెప్పాడు అతడు.     ఋషివర్యుడు రెండు నిమిషాలు మౌనం వహించాడు. ఆ తర్వాత మంద్రమైన స్వరంతో అడీగాడు. "నాయనా! నువ్వు ఎందుకు ఈ జీవితాన్ని చాలించాలనుకున్నావో నేను తెలుసుకోవచ్చా?"

    అతడు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు.     "నీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పు నాయనా, బలవంతం ఏమీలేదు!"     "అనునిత్యం ఆర్థిక ఇబ్బందులతో, కోరికలు తీరన్ ఈ దౌర్భాగ్య జీవితం గడిపేకంటే చావడం మేలని నిశ్చయంచుకున్నాను స్వామీ!"     "ఏం పని చేస్తావు నాయనా?"     "ఒక ప్రైవేటు కంపెనీలో క్లర్కుగా పని చేస్తున్నాను స్వామీ!"     "నీ జీతం ఎంత?"     "మూడు వేలు..."     "నీకు పెళ్లి అయిందా?"     "లేదు స్వామీ! ఈ జీతంతోనే బ్రతకలేకపోతున్నాను, ఇక నా బ్రతుక్కి పెళ్లి ఒకటే తక్కువ!" 

    "నువ్వు భోజనం వండుకుంటావా, బయట తింటావా?"     "వండుకుంటాను స్వామీ! అప్పుడప్పుడూ హోటల్లో భోంచేస్తాను."     "బియ్యం నెలకి ఎంత ఖర్చు అవుతాయి?"     "పది పదిహేను కిలోల వరకూ ఖర్చవుతాయి."     "వంటకి కావలసిన సరుకులు ఎక్కడ కొంటావు నాయనా?"     "నేను అద్దెకుండే ఇంటికి దగ్గరలోనే పచారీ కొట్లో కొంటాను స్వామీ!"     "ఆఫీసుకి బస్సు మీద వెళతావా?"     ఈ వివరాలన్నీ ఆయన ఎందుకు అడుగుతున్నాడో అతడికి అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా చూస్తూనే జవాబులు చెబుతున్నాడు.

    "జుట్టు పెరిగితే, నీ జుట్టు నువ్వే కత్తిరించుకుంటావా?"
    "లేదు స్వామీ! సెలూన్‌కు వెళతాను."     "నీ బట్టలు నువ్వే ఉతుక్కుంటావా?"     "అప్పుడప్పుడు ఉతుక్కుంటాను స్వామీ! ఎక్కువగా చాకలికే వేస్తాను."
    "జాగ్రత్తగా గమనించు నాయనా, నీకు తెలియకుండానే నీమీద ఎంతమంది ఆధారపడి బ్రతుకుతున్నారో చూశావా! నువ్వు అద్దెకుండే ఇంటి యజమానికి నీ కారణంగా డబ్బు వస్తోంది. నువ్వు బియ్యం కొన్న వర్తకుడికి నీవల్ల ఆదాయం వస్తోంది. నువ్వు పచారీ సామాన్లు కొనే దుకాణందారుడికి నీ కారణంగా లాభం వస్తోంది. నువ్వు భోజనం తినే పూటకూళ్ల ఇంటి యజమానికి నీవల్ల ఆదాయం వస్తోంది. నువ్వు బస్సు ఎక్కడం వలన ప్రభుత్వానికి కూడ ఆదాయం వస్తోంది. పరోక్షంగా ఆ ఆదాయం మళ్లీ ప్రజలకే అందుతోంది. నీ జుట్టు కత్తిరించే క్షురకునికీ నీ డబ్బు అందుతోంది. నీ బట్టలు ఉతికే చాకలికీ నీ డబ్బు ముడుతోంది. ఒకటా రెండా, నువ్వింకా లెక్క వేసి చూస్తే నీ డబ్బు మీద ఆధారపడి బ్రతికే వాళ్లు ఇంకా చాలామంది వుంటారు. చూశావా! వీళ్లంతా నీ జీతం మీద ఆధారపడి బ్రతుకుతుంటే, నీ జీతం నీ ఒక్కడీకే సరిపోవడం లేదని ఎలా అంటున్నావు? ఇంతమంది ఇన్ని విధాలుగా నీమీద ఆధారపడి బ్రతుకుతున్నారే! వాళ్లందర్నీ అన్యాయం చేసి, ఈ జన్మని ఇంతటితో చాలించాలని ఎలా అనుకున్నావు నాయనా?" అంటూ ముగించాడు ఋషివర్యుడు.
    ఒక్కసారిగా అతడికి విద్యుద్ఘాతం తగిలినట్టు అయిపోయింది. తల నుంచి పాదాల వరకూ ఏదో జరజరా పాకుతున్నట్టు అనిపించింది. అదేదో... ఇదీ అని చెప్పలేని భావం... మనసును పట్టి కుదిపేస్తున్న ఏదో పులకరింత ఒళ్లంతా ప్రవహించింది.     మునీశ్వరుడు అడిగిన ఒక్కో విషయం అతడి కళ్లముందు దృశ్యాలుగా కనిపిస్తున్నాయి. ఆఖరుగా ఆయన అడిగిన ప్రశ్న అతణ్ణి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ ప్రశ్న గురించి ఎంతగా ఆలోచించినా జవాబు దొరకక అతణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

    అవును... నిజమే కదా! ఇంతమంది తనమీద ఆధారపడి బ్రతుకుతున్నారా? తనకు ప్రతిరోజూ అనుభవంలోకి వచ్చే ఇంత చిన్న విషయం తనకు తట్టలేదెందుకని? ఇలాంటి ఆలోచన తనకు రాలేదెందుకు?
    దీర్ఘంగా ఆలోచించేకొద్దీ అతడి మనసులో 'సత్యం' ఒక చిన్న బీజమై మొలకెత్తింది. అస్పష్టమైన రీతిలో దృగ్గోచరమై, అర్థమయ్యీ కానట్టుగా అతడు మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఋషివర్యుడు మరో ప్రశ్న సంధించాడు.     "నీ కోరికలు ఏమిటో నాకు చెప్పడానికి నీకేమైనా అభ్యంతరం వుందా నాయనా?"
    "లేదు స్వామీ!" అంటూ తన కోరికలన్నీ అతడు ఏకరువు పెట్టాడు.

    "నాకు కట్టుకోడానికి బట్టలు ఎక్కువగా లేవు స్వామీ! తరచుగా మంచి ఖరీదైన బట్టలు కొనుక్కోవాలని వుంటుంది. అలాగే నేను వున్న రూము చాలా చిన్నది, ఇరుకైనది. ఇంకా విశాలంగా వుండే గదిని అద్దెకు తీసుకోవాలని వుంటుంది. నాకు ఇతరమైన చెడు అలవాట్లు లేవు. చిరుతిళ్లు రోజూ తినాలని వుంటుంది. ఆఫీసుకు వెళ్లడానికి ఒక మోటార్ బైక్ కొనుక్కోవాలని వుంటుంది. నేనున్న గదిలో మంచం, పరుపు, ఫ్యాను, టీవీ లాంటివి ఏర్పాటు చేసుకోవాలని వుంటుంది. కానీ నేనున్న పరిస్థితుల్లో నా తిండికే డబ్బులు సరిపోవడం లేదు. ఇక ఇవన్నీ ఎక్కడనుంచి వస్తాయి స్వామీ!" అన్నాడు అతడు.

    "నువ్వు చెప్పిన సౌకర్యాలు అందరికీ అందుతున్నాయా నాయనా? నీ బ్రతుకు వెళ్లదీయడానికి ఇవన్నీ అవసరమా?" అని ఋషివర్యుడు అడిగేసరికి అతడు ఆయన వైపు అయోమయంగా చూశాడు.
    "జాగ్రత్తగా ఆలోచించు నాయనా! ఈ ప్రపంచంలో పడ్డందుకు నీకు బ్రతకడానికి కావలసింది తిండి, బట్ట, నీడ... అంతే కదా! మిగతావన్నీ నీకు నువ్వు కల్పించుకున్నవేగా! అవన్నీ అవసరమా, చెప్పు? మనిషిని పట్టి పీడించేవి అంతులేని కోరికలే నాయనా! కోరికలకు దాసులైనవాళ్ల అవస్థలు ఏమని చెప్పగలం? నీకు ఆత్మహత్యకు దారి చూపించింది కూడ ఆ కోరికలే! 

    ఇలాంటివి మనం రోజూ వింటూనే వున్నాం. వార్తాపత్రికల్లో చూస్తూనే వున్నాం. ఆర్థిక ఇబ్బందులకు మన అసంబద్ధ జీవితమే అసలు కారణం. పంటలు లేదని రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మంచి మార్కులు రాలేదని విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగాలు పోతున్నాయని కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. సరైన జీవితం లేదని నువ్వు ఆత్మహత్య చేసుకోబోయావు. వీటన్నిటికీ కారణం ఒక్కటే నాయనా! అది డబ్బుకాదు, మనిషి ఆలోచనా తీరే వక్రంగా వుంది.
    నేను నిజమే చెబుతున్నాను నాయనా! సక్రమంగా ఆలోచిస్తే, నువ్వు చేసేది ఎంత తప్పో నీకే తెలుస్తుంది. డబ్బు లేనంత మాత్రాన చావవలసిన పనిలేదు. మనల్ని వక్రమార్గంలో నడిపించే కోరికలే మన బాధలకు, ఆవేదనలకు, సంఘర్షణలకు, చివరికి మన చావులకు కూడా అవే కారణం! వీటన్నిటికీ కారణం, క్రమశిక్షణా లోపమే నాయనా! అది ఉండి వుంటే, ఈ రోజు ఇన్ని ఆత్మహత్యలు జరగవు. డబ్బే సర్వస్వం అనుకోవడం ఒట్టి భ్రమ! డబ్బు భ్రమలో మనల్ని మనమే మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నాము. మానవ జన్మను చరితార్థం చేసుకోవాలేగానీ ఇలా అర్థంతరంగా చావకూడదు. ఆలోచించు, ఆ సత్యాన్ని నువ్వు కాదనలేవు! ప్రస్తుతానికి ఇంకేమీ ఆలోచించకు... ఈ రాత్రికి హాయిగా నిద్రపో. రేపు ఉదయం లేచిన తర్వాత, నీకు ఏది మంచిది అనిపిస్తే అలా చెయ్యి!" అంటూ కళ్లు మూసుకుని ధ్యానంలోకి వెళ్లిపోయాడా ఋషివర్యుడు.     ఆయన శిష్యుల్లో ఒకడు అక్కడికొచ్చి, ఆ కొత్త వ్యక్తిని పర్ణశాలలోకి తీసుకు వెళ్లి, అక్కడ పడుకోడానికి పక్క ఏర్పాటు చేశాడు.     ఆ రాత్రి అతడు ఏ ఇతర ఆలోచనా లేకుండా మనశ్శాంతిగా, ప్రశాంతంగా నిద్రపోయాడు.     ఉదయం లేచిన వెంటనే అతడికి అంతా కొత్తగా వుంది. ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, అతనికి ఇప్పుడు చచ్చిపోవాలని లేదు. చచ్చేవరకూ బ్రతకాలని వుంది! ఎందుకంటే, అతడికి బ్రతుకు విలువ తెలిసి వచ్చింది. ఋషివర్యుడు చేసిన జ్ఞానబోధ అతడికి అమృతంలా పనిచేసింది.     అతడు చుట్టూ చూశాడు.
    వటవృక్షం కింద ఋషివర్యుడు ధ్యాన ముద్రలో వున్నాడు. ఆయన ధ్యానాన్ని భగ్నం చేయడం ఇష్టం లేక, ఆనందం ఉప్పెనలా ఉప్పొంగుతూండగా ఋషివర్యుని పాదాలకు నమస్కరించి అక్కడినుడి మౌనంగా వెళ్లిపోయాడు అతడు.

    
    

    
Comments