ఆంతర్యాలు - బద్ది నాగేశ్వరరావు

నారాయణరావు కథ

    నా పేరు నారాయణరావు. పేరుకు తగ్గట్టు నిజంగా నేను దరిద్ర నారాయుణ్ణే. నాకు తల్లితండ్రి పేరు పెట్టలేదు. ఎందుకంటే నాకు తల్లితండ్రి లేరు. వారెవరో కూడా నాకు తెలియదు. ఊహ తెలిసినప్పటి నుంచి అనాథ శరణాలయం నా గృహం. నాలాంటి అనాథలందరూ నా సహచరులు. ఊహ తెలిసిన పక్షిపిల్ల గూడులోంచి బయటి ప్రపంచంలోకి చూసి ఆ ప్రపంచంలోకి తనూ వెళ్ళాలని ఎన్నో ఊహాగానాలు చేస్తుంది.

    అలాగే నేనూ బయట ప్రపంచంలోని ఖరీదైన మనుషుల్నీ విలువైన వస్తువుల్ని చూసి నేను కూడా ఆ విశాల ప్రపంచంలో అస్తిత్వం సంపాదించుకొని నేను కూడా ఆ భోగభాగ్యాలు, ఆనందానుభూతులూ పొందాలనుకోవడంలో తప్పేముంది?

    ఎలాగో వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని దాతల అండతో హైస్కూలు, కాలేజీ చదువులు పూర్తి చేశాను. యూనివర్సిటీ ప్రాంగణంలో కూడా అడుగుపెట్టాను. అక్కడ నాకు తారసపడింది ఆషాదేవి. ఆష! ఆ పేరులోనే ఉంది నిషా... మగవాడనే వాడెవడికైనా ఆషను చూస్తే మైమరపు తప్పదు.

    భగవంతుడు నాకు ధనం, భాగ్యం ఇవ్వకపోయినా చక్కని కంఠం ఇచ్చాడు. నేను ఏ పాటల పోటీకి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ రావడం ఖాయం. నేను పాడుతున్నప్పుడు అందరూ పరవశంతో నా పాటలు వింటారు. ఎంతో మెచ్చుకుంటారు. 
    
    ఆ రోజు యూనివర్సిటీలో ఏదో ఫంక్షన్ అయింది. అప్పుడు నన్ను పాడమన్నారు. నా పాటలకు శ్రోతలు పరవశించి పోయారు. తరువాత మా క్లాసుకు నన్ను ప్రత్యేకంగా అభినందించడానికి ఆషా వచ్చింది. నన్ను ఎంతో మెచ్చుకుంది. అప్పటి నుంచీ రోజూ సాయంత్రాలు నాతో గడపటం దినచర్యగా పెట్టుకుంది.

    నేను తనకి నచ్చిన పాటల్ని పాడుతుంటే ఆమె ఊహాగానాల్లో తేలిపోయేది. మాకు సమయం తెలిసేది కాదు, కారు చీకట్లు పరచుకున్నాక ఆమె డ్రైవరు తొందర పెట్టేవాడు. అప్పడు ఆమె వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళేది. ఆ పరిచయం దినం దినం వర్ధిల్లి మా మధ్య ఆకర్షణ... ప్రేమగా మారింది.

    అప్పటి నుంచీ నేను ఊహల్లో ఎదగడం ప్రారంభించాను. నటుడు విశ్వరూపం ఎత్తినట్టు నేను ఎదగసాగేను. బండ్లు ఓడలవుతాయనే నమ్మకంతో నేను ఇంకా ఎదగసాగేను. నా కళ్ళల్లో కార్లు...మేడలు... కాని ఊహ ఎంతోకాలం నిలువ లేదు. ఓడలు కూడా బండ్లవుతాయని తరువాత తెలిసింది.

    ఆషాదేవి నాన్నగారు పరాంకుశంగారు చేసే బిజినెస్ అకస్మాత్తుగా మూతపడింది. కొన్ని లక్షల నష్టాల్తో, కట్టుబట్టలతో మిగిలిపోయాడు. నేను...నా ఊహలు... అంతా గజిబిజి అయిపోయేయి. అయితే, నేనో సామాన్యుణ్ణి. వాళ్లను నేను ఆదుకోలేను. నా దగ్గరేముంది దరిద్రం తప్ప, నేనే దాతలపై ఆధారపడి జీవిస్తున్నాను. వాళ్లను నేనేమి ఆదుకోగలను?

    అందుకే ఆ రోజు ఆషాదేవి కళ్ళనీళ్ళు పెట్టుకుని తాము అకస్మాత్తుగా ఎలా వీధిన పడిందీ చెబుతూ ఉంటే... నేను గబుక్కున అనేశాను 'నేనింకా మీ స్టేటస్‌కి వద్దామని అనుకుంటుంటే, మీరే నా స్టేటస్‌కి దిగివచ్చేశారన్నమాట.' నా మాటలకు ఆమె దెబ్బ తిన్న పక్షిలా చూసింది.

    'అయితే మన ప్రేమ ....' అంటూ ఆగింది.

    'అన్నీ మరిచిపో ఆషా! నన్ను ప్రేమించి నా దరిద్రాన్ని తీసుకోవడం తప్ప నీకూ నాకూ సుఖం లేదు' అన్నాను. ఆమె హతాశురాలైంది. 'నాకు మీ ప్రేమించే మనస్సుని దానం చెయ్యండి చాలు. దరిద్రం క్రమేపీ నాకు అలవాటవుతుంది. నేను భరించగలను మీతో పాటుగా' అంటూ ప్రాధేయపడింది.

    'సారీ ఆషా! జోగీజోగీ రాసుకుంటే మిగిలేది బూడిదే. మనిద్దరం ప్రేమించుకుని పెళ్ళి చేసుకుంటే మనకు దక్కేది కన్నీరే. నన్ను మరిచిపో. నాకు చిన్నతనం నుంచీ డబ్బు మీద మోజు ఉంది. ఎంతో ఎదగాలని ఆశ ఉంది. చూసి చూసి దరిద్రంతో చేయి కలపలేను. నా అభివృద్ధికి దయచేసి అడ్డంకిగా ఉండకు' అని నిష్కర్షగా చెప్పేశాను.

    కాని మరునాడే ఆమె ఓ అందమైన కార్లో వెళ్తూ కనిపించింది. నేను నిశ్చేష్టుడినయ్యాను. ఆమె అంతా అబద్ధం చెప్పిందా? వాళ్ళ నాన్న బిజినెస్ నష్టమైందనీ, కట్టుబట్టల్తో మిగిలామనీ ఆ ఏడుపు అంతా...అంతా... అబద్ధమా... ఇదంతా నా మీద జరిగిన పరీక్షా? అయితే నేను నిజంగా మోసపోయేను. కాదు ఓడిపోయేను.

విద్యాసాగర్ కథ

    నాకు, పరాంకుశం గారికి కొన్ని కొన్ని పరిశ్రమల్లో భాగాలున్నాయ్. అప్పుడప్పుడూ వ్యాపార రీత్యా పరాంకుశం గారింటికి వెళ్ళేవాణ్ణి. పరాంకుశం గారిది పెద్ద భవంతి. ఎంతో అందంగా ఉంటుంది. అందులో ఎక్కడి వస్తువులు అక్కడ చక్కగా అమరచి ఉంటాయి. ఇంట్లో అంగుళం నేలయినా కనిపించకుండా ఖరీదైన తివాచీ పరచబడి ఉంటుంది. అక్కడ గోడల్లో మన ప్రతిబింబాలు కనిపిస్తాయ్. కాని అంతకన్నా అందంగా ఉంటుంది పరాంకుశం గారి ఏకైక పుత్రిక ఆషాదేవి! ఎప్పుడు చూసినా ఆమె చాలా ముభావంగా కనిపించేది. అయినా, ఆమెలో ఎంతో ఆకర్షణ! ఇక ఆమె నవ్వుతూ మాట్టాడితే...! చల్లని వెన్నెల మన మనస్సులో కురిసినట్లుండదూ? సమ్మోహనాస్త్రంతో ఎంతటి మగధీరుణ్ణయినా బంధించి వెయ్యదూ? ఒకటి రెండు సార్లు పలకరించేను.

    "నాన్నగారు ఉన్నారా?"

    "మీరేమి చదువుతున్నారు?"

    "ఇంకా పైచదువులు చదువుతారా?"

    ఆమెతో మాట్లాడ్డమే ఒక అదృష్టంగా భావించేవాణ్ణి. ఆ అవకాశం ఏదోలా వినియోగించుకునే వాణ్ణి. ఆమె సమాధానాలు ఎలా ఉండేవంటే, ఒక్క వాక్యం చెప్పాలంటే ఒక్క పదం  మాట్లాడేది. ఒక్క పదం చెప్పాలంటే మందహాసం లేదా మౌనం...ఎంత సింప్లిసిటీ...సింప్లి సుబర్బ్! నిజంగా ఆమె అందం...ఆనెకు దేవుడిచ్చిన వరం!!  
 
    ఏ సాధారణమైన ఆడపిల్లకైనా అంత అందం ఉంటే ఎంత మిడిసిపాటో నాకు తెలుసు. నా ఆఫీసులో పనిచేసే టైపిస్టులకీ, స్టెనోలకీ అసలు అందం మాట అటుంచి ఆడవాళ్ళలాగే కనిపించని వాళ్ళు ఎంత అహంకారంగా, అహంభావంగా మగవాళ్ళ దగ్గర నీలుగుతారని.

    ఐశ్వర్యం, అందం, వినయం, వివేకం ఉన్న ఏమె యింత సింప్లిసిటీతో ఉందంటే రియల్లీ హేట్సాఫ్!

    వ్యాపారరీత్యా నాకు ఎంతోమంది అమ్మాయిలతో పరిచయం ఉంది. నేను 'ఊ'అనాలేగాని ఎలాంటి అందగత్తెలైనా నాకు దాసోహం అనాలి. అనాల్సిందే. అయినా ఎవరూ ఆకర్షించలేనంతగా నన్ను ఆషాదేవి ఆకర్షించింది.

    నెమ్మది నెమ్మదిగా ఆమెతో పరిచయం పెంచుకున్నాను. ఆమెలో పరివర్తన రాసాగింది. నాతో ఆమె నవ్వుతున్నప్పుడు...వెన్నెల జల్లు నాపై కురుస్తున్నట్టు...వెన్నెల్లో స్నానమాడినట్టు... 

    పరాంకుశం గారికీ తెలిసింది మేము ఇద్దరమూ మాటల్లో చాలా దగ్గర అయ్యామని. ఆయన కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేక ఇక మేము ఎందుకు వెనకాడాలి?

    వీలున్నప్పుడల్లా వాళ్ళింటికి వెళ్ళి నవ్వుతూ తుళ్ళుతూ హాయిగా గడిపేవాళ్ళం. ఇంతలో నాకు స్టేట్స్ ఆఫర్ వచ్చింది వ్యాపార రీత్యా!

    ఒక పెద్ద కాటన్ మిల్‌కి నేను డైరెక్టర్‌ని కూడా కావడం వల్ల నాకు ఈ ఆపర్‌ట్యునిటీ వచ్చింది. అదీ ఒకటి రెండు వారాలు కాదు. మూడు మాసాలు అక్కడ కంపెనీకి చెందిన కోర్సు కూడా నేను పూర్తి చేసి రావాలి.

    ఆషాదేవిని వదిలి భారంగా స్టేట్స్‌కి వెళ్ళానన్న మాటేగాని నా మనస్సంతా ఇటే ఉండేది. ఆషాదేవి నుండి రోజూ ఫోన్‌కాల్స్ వచ్చేవి. కానీ అకస్మాత్తుగా ఆమె నుంచి కాల్స్ ఆగిపోయాయి. ఉనంట్టుండి ఒక్కసారిగా పరాంకుశం గారి నుంచి పిడుగులాంటి ఫోన్‌కాల్ వచ్చింది. ఆషాదేవికి ఏదో భయంకరమైన చర్మవ్యాధి సోకినట్టు, ముఖ్యంగా ముఖమంతా మచ్చలతో, గుంటలతో అందవికారంగా అయిపోయిందనీనూ, ఎంతో బాధగా చెప్పారు పరాంకుశం గారు.

    నేను అందాన్ని ఎంతగా ప్రేమిస్తానో, అందవికారాన్ని అంతకంటే ఎక్కువగానే ద్వేషిస్తాను. అందవిహీనులంటే నాకు మొదట్నించీ ఎలర్జీ. నా మట్టుకు నాకు అనిపిస్తుంది ఈ దేశంలో కుష్టు, గ్రుడ్డి, కుంటి మొదలైన వాళ్ళందరినీ షూట్ చేసి సంఘంలో  వారి నీద కూడా పడకుండా చెయ్యాలి. వాళ్ళవల్ల వాళ్ళకు మాత్రమే గాక, వాళ్ళున్న పరిసరాల్ని కూడా వాళ్ళు నరకం చేసేస్తారు. అందుకే ఆషాదేవి చిత్రాన్ని నా మనోఫలకం నుండి అప్పుడే తొలగించివేశాను.

    నా మనస్సు మొద్దుబారిపోయింది. ఎవరినో ఆ స్థానంలో నిలుపుకోకపోతే నాకు పిచ్చి ఎక్కేటట్టుగా ఉంది. అందుకే వెంటనే నాతో పాటు రిఫ్రెషర్ కోర్సుకు వచ్చిన మరో డైరెక్టర్ ఉషాబాలని అప్పటికప్పుడే పెళ్ళి చేసుకుని ఇండియా తిరిగి వచ్చేశాను. కోర్సు అయ్యేక ఆమెని తీసుకుని స్వదేశానికి తిరిగి రాగానే ఉషాబాలతో కలసి మా కంపెనీ వళ్ళు ఇచ్చిన పార్టీకి వెళ్ళాను. అక్కడ ఆషాదేవిని చూసి ఆశ్చర్యపోయాను. ఆమె ఎప్పటిలా కడిగిన ముత్యంలోఅ ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించింది. మొహం మీద మచ్చలూ లేవు. గుంటలూ లేవు. ఎప్పటిలా నిర్మలంగానే ఉంది.

    ఆమె ముందుకు వెళ్ళడానికే సిగ్గుపడ్డాను. నా తొందరపాటు తనానికి నొచ్చుకున్నాను. కేవలం అందానికే ప్రాధాన్యత ఇచ్చి నేను ఆషాదేవి, పరాంకుశం గారు పెట్టిన ఈ పరీక్షలో చాలా సహజంగానే ఓడిపోయాను. ఇది నా మానసిక బలహీనత. ఇందులో ఎవరిని ఏమన్నా ఏ ప్రయోజనమూ లేదు. 

డాక్టర్ ప్రఫుల్లచంద్ర కథ

    నేను డాక్టర్ ప్రఫుల్లచంద్రని!

    నాలుగైదు సంవత్సరాలుగా డాక్టర్ వృత్తిలో ఉంటున్నాను. మా అమ్మా నాన్నా నన్ను పెళ్ళి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. డాక్టర్ కోర్సులో చేరినది మొదలు చూస్తూనే ఉన్నాను. స్త్రీలలో మొరాలిటీ తగ్గిపోయి, స్వేచ్ఛ, తిరుగుబాటుతనం, అవినీతి పెచ్చుపెరినట్టు అనిపిస్తోంది. నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఎందరో అందమైన భాగ్యవంతులైన లేడీ డాక్టర్లు ముందుకు వచ్చేరు. ఎందుకో నాకు వారిమీద, వారి కేరెక్టర్స్ మీద సదభిప్రాయం లేదు. నా ఉద్దేశ్యం ఏమిటంటే అందం కంటే స్త్రీకి అణకువ, కేరెక్టర్ ముఖ్యమనీ నా బెటర్ హాఫ్‌కి అందం లేకపోయినా, మంచి కేరెక్టర్ ఉండాలనీ నా ప్రగాడ వాంఛ.

    విద్యాసాగర్, ఉషాబాలకి వాళ్ళ కంపెనీవాళ్ళు ఇచ్చిన పార్టీకి నేను కూడా వెళ్ళాను. అప్పుడు పరిచయం అయింది నాకు ఆషాదేవితో.

    అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని నన్ను ఆషాదేవి అందం, అణకువ, వినయం, సింప్లిసిటీ... అబ్బ ఆషాదేవి నన్ను ఎంతగానో ఆకర్షించింది!

    ఆమె నా వంక చూస్తే చాలు, ఎందుకో నా మనస్సు పరవశించిపోయేది.

    ఆ రాత్రి నాకు అంతా ఆషాదేవి తలపులే... కలల నిండా ఆషాదేవి రూపులే...

    ఆ మరునాటినుండీ ఆషాదేవితో పరిచయం పెంచుకున్నాను. ఆమె సాన్నిహిత్యం కోసం ఎంతో తపించాను. ఎలాగోలాగ ఆమెతో స్నేహం పెంచుకున్నాను. నా సంభాషణా చతురతతో ఆమెను ఎంతగానో ఆక్రషించాను. 

    ఒకసారి పరాంకుశం గారితో ఆషాదేవిని నేను వివాహం చేసుకుంటానని చెప్పాను. 'ఎందుకు మీకా కోరిక కలిగింది' అని పరాంకుశం గారు అడిగారు.

    దానికి నేను 'నన్ను ఎందరో లేడీ డాక్టర్స్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయినా వాళ్ళ జీవితాలలో ఎప్పుడో ఒకప్పుడూ కో - ఎడ్యుకేషన్ మూలంగా ప్రేమకు అవకాశం ఉండివుంటుంది. ప్రేమ విషయంలో గత చరిత్రలున్న స్తిరలైతే నాకు గొప్ప అసహ్యం. నేను ఎవరినైనా ప్రేమిస్తే ఏకంగా పెళ్ళే. దట్సాల్. ఒకరిని ప్రేమించడం ఇంకొకరిని పెళ్ళి చేసుకోవడం - ఐ రియల్లీ హేట్ ఇట్ అన్నాను. 

    అందుకే నా మనసులోని మాటను ఒకసారి ఆషాదేవిని అడిగాను, 'మీరు ఇదివరలో ఎవరినైనా ప్రేమించారా?' అని. ఆమె నా ప్రశ్నకు నిశ్చేష్టురాలయింది. అయినా దాపరికం ఇష్టంలేని ఆమె నిజాయితీ ఆమె చేత నారాయణరావు కథనీ, విద్యాసాగర్ కథనీ చెప్పించింది.
   
    ఆ రెండు ప్రేమ కథల్నీ విన్న నా ముఖం వివర్ణం అయినిది. ఏ గత చరిత్ర లేని ప్రేమమయి కోసం నేను ఎదురుచూశానో అది కాస్తా చేజారిపోయింది. మళ్ళీ నేను ఒంటరిగా మిగిలిపోయేను! నా కోరిక నెరవేరే సుముహూర్తం దగ్గరలో లేదని నేను చాలా దిసపాయింట్ అయ్యేను.

ఆషాదేవి కథ

    నారాయణరావుతో నా పరిచయానికి సుమారు ఆరుమాసాలకి ముందు ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయేను. అప్పుడు నన్ను హాస్పిటల్‌లో చేరారు. ఒక్కసారి కళ్ళు తెరచి చూశాను. మా నాన్నగారు ఆతృతగా నా కళ్ళలోకి చూస్తున్నారు. 'ఎలా ఉందమ్మా ఆషా?' అంటూ ఆప్యాయతగా అడిగారు.

    'ఏమైంది నాన్నగారూ నాకు?' అంటు ఎదురు ప్రశ్నవేశాను.

    'ఏమీ లేదమ్మా! కాస్త మొహం తిరిగింది. అందుకే హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాం' అన్నారు బాధగా. కాని ఆ మరునాడు తను నిద్రపోయాననుకుని డాక్టర్‌గారు, నాన్నగారు మాట్లాడుకున్న మాటలు తను స్పష్టంగా వింది.

    "డాక్టర్ గారూ! ఏమిటీ మీరంటున్నది? ఇంకా కొద్ది మాసాలా? నా చిట్టితల్లిని నా చేతులతో మట్టి చేయాలా? నా చిట్టితల్లి జీవితం ఇంకా కొన్నిమాసాలా?" అంటూ మా నాన్నగారు ఆక్రోశిస్తున్నారు.

    "ఏమిటి? ఇంకా కొద్ది నెలల్లో నా జీవితం పూర్తి అయిపోతుందా? భగవాన్ ఏమీ పరీక్ష నాకు?" అంటూ మూగగా నా మనస్సు రోదించసాగింది.

    "డాక్టర్ గారూ! తల్లిలేని పిల్లను కష్టం తెలియకుండా పెంచాను. నా చిట్టితల్లిని నా చేతులతో మట్టి చేయాలా? నెవ్వర్ డాక్టర్! ఎంత ఖర్చయినా ఫరవాలేదు బ్రతికించండి డాక్టర్! నా చిట్టితల్లిని బ్రతికించండి!" నాన్నగారి ఆవేదన. "సారీ సార్! ఇది లంగ్‌కేన్సర్! చాలా ముదిరిపోయింది వ్యాధి. మీరీ కష్ట కాలంలో ధైర్యంగా ఉండాలి. మీరే ఇలా చిన్న పిల్లాడిలా దిగాలు పడితే కొద్దిమాసాలు జీవించాల్సిన మీ అమ్మాయికి ఆ జీవితం కూడా ఉండదు. ప్లీజ్!" అంటూ డాక్టర్ అనునయించేరు.

    తరువాత కొద్దిరోజులకు నాకు నారయణరావుతో పరిచయం అయింది. నాకు మనశ్శాంతి కోసం అతనితో పాటలు పాడించుకునే దాన్ని. నేనెక్కడ పెళ్ళి చేసుకుంటానో అని భయపడి నాన్నగారు 'అమ్మ్మా నారాయణరావు మన డబ్బును ప్రేమిస్తున్నాడు. నిన్ను, నీ అందాన్ని కాదు. కావాలంటే మన బిజినెస్ అంతా నష్టపడిందనీ, కట్టుబట్టలతో మిగిలామనీ అబద్ధం చెప్పు. అప్పుడు కూడా నిన్ను చేసుకుంటానంటే నువ్వు తపకుండా చేసుకుందువు గాని' అన్నారు.

    ఆయన చెప్పినట్టుగానే నారాయణరావు తప్పుకున్నాడు. తను అందవికారంగా మారిందనీ, మొహమంతా మచ్చలు వచ్చాయనీ చెబితే అందాన్ని ఆరాధించే విద్యాసాగర్ చాలా సహజంగానే తప్పుకున్నాడు.

    అలాగే గతచరిత్ర లేని అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని ఆశయంగా పెట్టుకున్న డాక్టర్ ప్రఫుల్లచంద్ర తన ప్రేమ వ్యవహారం తెలుసుకుని చాలా డిసపాయింట్ అయ్యేడు.

    నాన్నగారు నన్ను పెళ్ళి చేసుకోకుండా ఆపగలిగానని అనుకున్నారే గాని నాకు నా జీవితం ముగిసిపోతుందని తెలుసుననీ, నాన్నగారి ఆనందం కోసం ఈ ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నాననీ నాన్నగారికి తెలియదు. 

    నేను చనిపోయేముందు ఈ ఆరుమాసాలన్నా నాన్నగారికి ఆనందం కలిగించాలని నా ఆశ, నా చివరి కోరిక కూడాను.

పరాంకుశం కథ

    తల్లిపోయిన పిల్లకు నేను తల్లినై, ఇరవై సంవత్సరాలు పెంచేను. కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా కూతురు ప్రాణం దక్కించుకోలేని దౌర్భాగ్యుణ్ణి అయ్యేను. 

    నా చిట్టితల్లి ఎవరినీ పెళ్ళి చేసుకోకుండా ఆపగలిగేనే గాని ఆమెను మృత్యుకోరల నుంచి ఏ విధంగా తప్పించగలను?

    ఆ రోజు మళ్ళీ నా ఆషా స్పృహతప్పి పడిపోయింది. డాక్టర్లు ఎంతగా ప్రయత్నాలు చేసినా చివరి ఘడియలని, ఇంక రక్షించుకోవడం దైవం వల్ల కూడా కాదని డాక్టర్లు పెదవి విరిచేశారు. 

    చివరిసారిగా  నా చిట్టితల్లి కళ్ళు తెరిచింది. నా వైపు జాలిగా చూసింది. ఆమెను ఆ పరిస్థితిలో చూశాక నా గుండె చెరువై గొల్లుమన్నాను.

    "ఆషా! నీకేం కాదు ధైర్యంగా ఉండమ్మా!" అని దీనంగా అన్నాను.

    "నాన్నగారూ! ఎందుకండీ ఇంకా నన్ను మభ్యపెడతారు. నేను ఇంక బ్రతకను నాన్నగారూ! నా చావు సంగతి ఆరు నెలలకు ముందుగానే తెలిసింది నాన్నగారూ! ఆ రోజు మొదటిసారిగా నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేసినప్పుడే మీరు డాక్టర్ గారితో మాట్లాడిన మాటలు ఆ రోజే విన్నాను. నాకు తెలిసినట్లుగా మీకు తెలియకూడదని ఇంతవరకు జాగ్రత్త పడ్డాను. నా సుఖం కోసం, నా చివరి ఘడియల్లో నా  ఆనందం కోసం మీరెంత మదనపడ్డారో నిద్రాహారాలు మానేసి మీరెంతగా కృశించిపోయారో నేను చూస్తూనే ఉన్నాను నాన్నగారూ!

    మిమ్మల్ని ఆనందపరచాలనే ఉద్దేశ్యంతోనే నేను నారాయణరావునీ, విద్యాసాగర్‌నీ, ప్రఫుల్లచంద్రనీ ప్రేమించినట్లుగా నటించి చివరకు విఫలమైనట్లుగానే నటించాను.

    మీరు కోరుకున్నట్లుగానే జరిగింది. నాన్నగారూ నేను అల్పాయుష్కురాలిని. ఎవరినైనా ఎందుకు పెళ్ళి చేసుకుంటాను నాన్నగారూ!

    నన్ను క్షమించండి నాన్నగారూ! అమ్మలాగే నేను కూడా మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కడుపునే పుడతాను నాన్నగారూ!" అంటూ శాశ్వత నిద్రలోకి పోయింది నా చిట్టితల్లి.

    నాకు ప్రపంచమంతా శూన్యంగా కనిపించింది. కోట్ల ఆస్తి ఆ క్షణంలో తృణ ప్రాయమనిపించింది.

(ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి 2002లో ప్రసారితం)    
Comments