అంతిమం - వరిగొండ కాంతారావు

    వరండాలో వాలు కుర్చీలో పడుకొని దినపత్రికలో చివరిదైన ఆటల పేజీని చూస్తున్నాడు జానకి రామం. జానకి రామం జీవితం గడియారం ముళ్ళంత ఠంచనుగా నడుస్తూంటుంది. ఉదయం ఐదింటికల్లా లేస్తారు దంపతులు ఇరువురూ. స్నానాదికాలు ముగించుకొని పిల్లల్ని బడికి పంపే కార్యక్రమంలో పడిపోతుంది ఇల్లాలు. జానకి రామం పూజ ఏడున్నరకల్లా ముగుస్తుంది. పిల్లలు స్కూలు బ్యాగులూ, టిఫిన్ బాక్సులూ తీసుకుని సిద్ధంగా ఉంటారు గుమ్మంలో. వాళ్ళని స్కూటరు మీద తీసుకెళ్ళి కాలనీ బస్టాపు దగ్గర స్కూలు బస్సు ఎక్కించి వస్తాడు జానకి రామం.

    స్కూటరు స్టాండు వేసి గుమ్మం దగ్గరకు వస్తాడో లేదో చిక్కటి చక్కటి కాఫీకప్పు నందిస్తుంది జమున. కాఫీ సేవనంతో మొదలైన పేపరు పఠనం గంటకు పైగా సాగుతుంది. జానకి రామం ఆటల పేజీ చదవడం పూర్తి అవుతుండగా వంటింట్లోంచి పిలుపొస్తుంది భోజనానికి రమ్మని. పదిగంటల పదిహేను నిమిషాలకు భర్త ఆఫీసుకు వెళుతుంటే టాటా చెబుతూ గుమ్మంలో నుంచుంటుంది జమున.

    ’భోజనం వడ్డించాను రండి’ లోపల్నించి పిలిచింది జమున. 

    పేపరు మడత పెట్టి కుర్చీ ప్రక్కన పెట్టి, లేవబోతున్నాడు జానకి రామం.  సరిగ్గా అప్పుడే గేటు తీసుకుని లోపలికి వస్తూ ప్రత్యక్షమయ్యాడు పాపన్న శాస్త్రి. ’నమస్కారమండి. రండి. కూచోండి’ అంటూ రెందు చేతులు జోడించే క్రమంలో తిరిగి కుర్చీలో కూలబడిపోయాడు జానకి రామం. ఈ మర్యాదలేవీ పట్టించుకునే స్థితిలో లేడు పాపన్న శాస్త్రి. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. జుట్టు రేగిపోయి వున్నది. పంచె కట్టు, పైన వేసుకొన్న కమీజు నలిగిపోయి వున్నాయి."నీ అవసరం ఉండకపోవచ్చు. అయినా చెప్పలేం. ఎందుకైనా మంచిది. అరగంటలో వచ్చేయి. రాత్రి ఏడింటికి అచ్చమాంబగారు పోయారు. ఇంకా ఏర్పాట్లు చూడాల్సివుంది." జానకి రామానికి విషయం అర్థమై సమాధానం చెప్పేలోపునే - గేటు వేసి రోడ్డుమీదకు వెళ్ళిపోయాడు పాపన్న శాస్త్రి.

    తన పిలుపుకు స్పందించి భర్త రాకపోవడమూ, గేటు చప్పుడవడమూ గమనించిన జమున వంటింట్లోంచి వీధి గుమ్మం దగ్గరకు వచ్చింది. గేటు వేసి వెళ్ళి పోతున్న పాపన్న శాస్త్రి కనిపించాడామెకు. 

    "పాపన్న శాస్త్రి గారా!" భర్తనడిగింది.

    "అవును"

    "ఎవరు పోయార్ట"

    "అచ్చమాంబగారు"

    "అనుకుంటూనే ఉన్నా. పాపన్నశాస్త్రి వచ్చాడంటే చావు కబురు వచ్చినట్లేనని. శుక్రవారం ప్రొద్దుటే వెధవ సంత. ఆయన కదేమి ఆనందమో తెలీదు. ఇల్లిల్లూ తిరిగి చావుకబుర్లు చెబుతుంటాడు."
 
    జానకి రామం ఏమీ మాట్లాడలేదు. 

    "సర్లెండి. ఒకటి తక్కువ తొంభై ఏళ్ళ కొచ్చింది ముసలావిడ. ఎంతకాలం పోకుండా ఉంటుంది. మీర్రండి భోజనం చేద్దురు గాని."

    "భోజనం వద్దు. నేనక్కడికి వెళ్ళాల్సివుంది" అన్నాడు జానకి రామం.

    "మిమ్మల్ని పిలవడానికి వచ్చాడా! ఊళ్ళో ఇంతమంది ఉండగా మీరే దొరికారా! ఆయన రాగానే మీరు గంగిరెద్దులా తలూపుతారు. మిమ్మల్ని లోకువ కట్టడానికి ఆమాత్రం చాలదా!"

    "కాదు జమునా! ఎంతో అవసరమైతే తప్ప ఆయన రారు. అయినా అది ఆయనింటి పని కాదుగదా! అంత్యక్రియలలో సహకరించడం అత్యంత పవిత్రకార్యం కూడాను."

    "మా బాగా చెప్పారు. స్మశానంలో కొలువుకు కుదురుకోండి. పుణ్యమూ, పురుషార్థమూను! ’మీ ఆయన చావుకొంపల చుట్టూ తిరుగుతూంటాట్ట. పిల్లల్ని జాగర్తగా చూసుకో! ఏ గాలో ధూళో ఆవహించగలదు’ అని మా మేనమామ ఇప్పటికి వందసార్లు చెప్పాడు. ఆయన మీలా ఇంగ్లీషు చదువులు చదువుకోకపోయినావేదం కంఠోపాటంగా నేర్చిన వాడు. మీరు నా మాట వింటేగా!"

    "శవాన్ని కాటికి చేర్చడం పితృదేవతలకానందం కలిగించే విషయం. మనల్ని పట్టుకు పీడించే విషయం కాదు. అయినా మనమూ అలాంటి సహాయం పొందిన వాళ్ళమే. ఆ విషయం మర్చిపోతే ఎలాగ!"

    "మాట్లాడితే మీరిలా దెప్పుతారని నాకు తెలుసు. పెద్దాడి పురిటికి నేను పుట్టింటికెళ్ళాను. పురిటి సమయానికి మీరక్కడే ఉన్నారు. అప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న మీ అమ్మగారు పోయారు. వర్షాకాలం. ఏర్లు పొంగుతున్నాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వార్త తెలిసి మీరు వచ్చేటప్పటికి రెండ్రోజులు పట్టింది. అప్పటిదాకా మీ అమ్మగారి శవాన్ని కంటికి రెప్పలా కాపాడారు పాపన్నశాస్త్రిగారు. ఆయన ఋణం ఏమిచ్చినా తీరనిది. ఈ క్యాసెట్టు నా దగ్గర వెయ్యిసార్లైనా వేసివుంటారు. నాకు కంఠోపాఠంగా వచ్చింది. అప్పజెప్పానుగా వెళ్ళిరండి" కోపంగా అంది జమున.

    అన్యమనస్కంగానే బయలుదేరాడు జానకిరామం. "మహాఇల్లాలు రామలక్ష్మి. ఆవిడ కాబట్టి భరించింది. ఆర్నెల్లుగా ముసలావిడకన్నీ మంచంలోనేట. ఇప్పుడు విముక్తి అత్తగారికి కాదు కోడలికే!" తలుపులు వేసుకుంటూ జమున గట్టిగానూ, ఉద్దేశ్యపూర్వకంగానూ అన్న మాటలు జానకిరామం చెవిలో పడనే పడ్డాయి.

    వాసుదేవరావు గారిల్లు రెండు వీధులవతల వుంది. నడుస్తూ ఆలోచిస్తున్నాడు జానకిరామం. వారం రోజుల క్రితం రాత్రి భోజనాలప్పుడు జమున తనతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి.

    "ముసలావిడకి తొంభై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. ఆర్నెల్ల క్రితం వరకూ ఆవిడ పనులు ఆవిడే చేసుకొనేది. ఆర్నెల్లుగా మంచాన పడింది. కోడలు పరమగయ్యాళి. ఆవిడ బాగున్నప్పుడే ఆలనాపాలనా చూళ్ళేదు. ఇప్పుడన్నీ మంచంలోనేట. కనీసం ఒళ్ళుతుడిచడం, మొహం కడగడం వంటివి కూడా చూడడం లేదు."

    "ఎవరు చెప్పారు నీకివన్నీ" అడిగాడు జానకిరామం.

    "ఎవరు చెప్పడమేంటి లోకం కోడై కూస్తుంటేను. మొగుడు పెద్దాఫీసరేనాయే. ఓ మనిషినైనా పెట్టుకోవచ్చు కదా! అదీ లేదు. డబ్బుకు లేదా పోదా? పెద్దకొడుకు అమెరికా నుండి డాలర్లు కుమ్మరిస్తూనే ఉండె. డబ్బెక్కడ ఖర్చై పోతుందో అని ఉన్న చిన్న కొడుకును కూడా ఇంట్లోంచి గెంటేసింది. పైగా కోడలు గయ్యాళిదని ప్రచారమొకటి."

    "ఐతే ఏంటిట?" అసహనంగా అడిగాడు జానకిరామం.

    "నాకేముంది. ఒచ్చేదా పొయ్యేదా! మొగుడూ పెళ్ళాలన్నాక లోకాభిరామాయణం మాట్లాడుకోరా ఏంటి. ఏదో నా చెవిన పడ్డ విషయం మీకు చెప్పాను. అన్నీ విని ముంగిలా కూచోడం నాకు చేత కాదు మరి. మీతో ఇన్నేళ్ళు సంసారం చేసినా బడబడావాగే అలవాటు పోలేదు. పైనొకటీ లోపలొకటీగా బతకడం నేర్చుకోలేక పోతున్నాను మరి."

    విషయం గాడి తప్పుతోందని గ్రహించిన జానకిరామం "పోనీలే. ఎవరి పాపాన వారు పోతారు" అంటూ విషయానికి ముక్తాయింపు పలికాడు.

    వారం క్రితం సంభాషణకీ - ఇప్పుడు తలుపులు వేసుకుంటూ జమున అన్న మాటలకీ ఎక్కడా పొంతన లేకపోవడం - ఆశ్చర్యాన్ని కలిగించింది జానకిరామానికి.

    అచ్చమాంబ వాసుదేవరావు గారి తల్లి. చాలా పెద్దావిడ. వాసుదేవరావుగారొక్కడే కొడుకు. ఇద్దరు కూతుళ్ళున్నారు. ఒకావిడ పోయింది. ఇంకొకావిడ అమెరికాలో పిల్లల దగ్గరుంటుంది. ఆవిడ ఎప్పుడూ వచ్చిపోయిన దాఖలాలు లేవు. ఆలోచనలు తెగిపోకముందే వాసుదేవరావు గారింటికి చేరుకున్నాడు జానకిరామం.

    ఇంటి ముందు కొరకంచు వెలుగుతోంది. ముందు హాల్లో పడుకోబెట్టారు అచ్చమాంబగారిని. తలాపున దీపం తీసేస్తే - ఆవిడ బ్రతికుందనే అనుకోవచ్చు. ’ప్రేతకళ ఆవహించలేదు’ అనుకొన్నాడు జానకిరామం. ’లేదు ఆర్నెల్ల క్రితమే ఆవిడని ప్రేతకళ ఆవహించింది. అది నీకు అలవాటై పోయింది.’ అంది అతగాడి మనస్సు. ఆ వీధిలో ఆడా మగా ఒక్కొక్కరే వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు.

    ఇంటి బయటకు వచ్చాడు జానకిరామం. ఓ కుర్చీలో తల పట్టుకొని కూర్చున్నాడు వాసుదేవరావు. దగ్గరగా వెళ్ళి పలకరించాడు జానకిరామం. "రాత్రి ఏడుగంటలకి పోయింది. మీ అందర్నీ ఇబ్బంది పెట్టాల్సి వస్తున్నది" అన్నాడు వాసుదేవరావు.

    అతడు దుఃఖిస్తున్నాడో, దుఃఖాన్ని అనుభవిస్తూ అణచిపెట్టు కొన్నాడో, దుఃఖాన్ని అధిగమించాడో తెలియలేదు. తడిలేని సంభాషణ ఇబ్బందిగా వుంది. ఇంతలో పాపన్న శాస్త్రిగారొచ్చారు హడావుడి పడుతూ. ’హమ్మయ్య! వచ్చారా!’ అలసట తీర్చుకుంటున్నట్లుగా అన్నారు జానకిరామాన్ని చూస్తూ. ఆయన వెనకాల మరో నలుగురిని చూశాక అర్థమయ్యింది జానకిరామానికి ఆయన అలసటకి కారణం. బ్రాహ్మణుడొచ్చాడు. కార్యక్రమం మొదలైంది.

    ఇంకోగంటకి గోవిందనామ స్మరణతో శవం బయలుదేరింది స్మశానానికి. ఊళ్ళోనే ఉన్న వాసుదేవరావు చిన్నకొడుకూ, కోడలూ కనపడటం లేదు. ఆశ్చర్యంగా ఉంది జానకిరామానికి. వాళ్ళ కోసమన్నా కాసేపాగాలి కదా! అనుకొన్నాడు. పాపన్నశాస్త్రి గారిని అడుగుదామనుకొన్నాడు. కాని ఆయన సైనిక పాలనా విధానాన్ని చూసి మౌనంగా ఉండిపోయాడు. 

    అందరూ స్మశానానికి చేరుకొన్నారు. పేర్చిన కట్టెలతో చివరి పడక సిద్ధంగా ఉంది. అచ్చమాంబగారిని పడుకోబెట్టారు. అందరూ తలో పుడకా వేస్తున్నారు ఆవిడ పైన. అదే చివరి దర్శనం. సరిగ్గా అప్పుడు ప్రత్యక్షమయ్యాడు చైతన్య, అచ్చమాంబగారి మనుమడు. వాసుదేవరావు తల్లికి తలకొరివి పెట్టి సోలిపోతుంటే- పాపన్న శాస్త్రి పట్టుకుని దూరంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు.

    కపాలమోక్షానికి ఎదురు చూస్తున్నారందరూ. చైతన్య ఒక్కడూ విడిగా దూరంగా కూర్చున్నాడు. జానకిరామం వెళ్ళి అతని పక్కనే కూర్చుని వీపు మీద చెయ్యి వేశాడు సముదాయింపుగా. చైతన్య ఒరిగి పోయాడు జానకిరామం ఒళ్ళోకి. ఆస్పర్శలో తెలిసిందతనికి - బామ్మ మరణానికి చైతన్య ఎంత బాధ పడుతున్నాడో. కడుపులో లుంగ చుట్టుకుపోయిన బాధ హృదయపు లోతుల్ని తన్నుకుంటూ పీకెగసి కంటి కవాటాల్లోంచి ధారాపాతంగా నీరై కారుతున్నది. అంతా నిశ్శబాగానే. పది నిమిషాల తర్వాత తెప్పరిల్లిన చైతన్య లేచి కూచున్నాడు సిగ్గుపడుతూ.

    జానకిరామం ఏమీ అడగకుండానే సంజాయిషీగా చెప్పుకొచ్చాడు చైతన్య. "రాత్రి వచ్చి వెళ్ళామంకుల్. పిల్లలు నిద్రకాగలేక పోతే ఇంటికి తీసుకెళ్ళాం. పిల్లల్ని బడిలో దింపేసి ఇటొచ్చాను."

    "తాతమ్మ పోయిన రోజున కూడా పిల్లలు బడికి వెళ్ళాలా?" ఎంత తగ్గించుకున్నా జానకిరామం గొంతులో తీవ్రత ధ్వనిస్తూనే ఉంది.

    "ఏంచేయమటారంకుల్. ఈ సంవత్సరమే పిల్లలిద్దర్నీ 'ట్వింక్లింగ్ హోప్ - కాన్సెప్ట్ స్కూల్లో' చేర్పించాం. అబ్బాయి మూడో క్లాసు, అమ్మాయి రెండో క్లాసూను. దేశంలోనే 'ఎల్కేజి' నుంచి 'ఐ.ఐ.టి.' ఫౌండేషను ప్రారంభించిన మొదటి పాఠశాల ఇది. నాకు తెలిసిన కార్పొరేటరు ద్వారా - విద్యాశాఖా మంత్రిని పట్టుకుని రికమెండేషన్ చేయిస్తే వచ్చాయా సీట్లు. డొనేషన్ చెరి ఓ లక్షా అంటే కాదని చెరి యాభై వేలకీ ఒప్పించుకున్నాను. అదీ రెండు ఇన్‌స్టాల్‌మెంట్లలో. అదీగాక మామూలు ఫీజు ఏడాదికి చెరి పాతిక వేలూను. బడికి ఆలస్యంగా వస్తే ఒప్పుకోరు. ఐదు నిమిషాల లేటు నెలకి రెండుసార్లు ఒప్పుకొంటారు. వంద రూపాయల ఫైనుతో అరగంట లేటుతో ఒప్పుకొంటారు. అరగంట దాటితే లోపలికి రానివ్వరు కానీ 'లేటు' అని రాసుకొంటారు. తెల్లారి సకాలంలో వెళ్ళి ఐదొందలు జరిమానా కడితేనే పిల్లాడ్ని లోపలికి రానిస్తారు. అలా కాని పక్షంలో పేరు తీసేస్తారు. రోజుకు వెయ్యి చొప్పున జరిమానా కట్టాకే బడికి రానిస్తారు."

    "సెలవు చీటీ పంపవచ్చును కదా!" అడిగాడు జానకి రామం.

    "కనీసం ఒక వారం ముందుగా పంపిన సెలవు చీటీలనే అంగీకరిస్తారు. అది కూడా మనం తెలిపిన కారణం స్కూలు యాజమాన్యానికి సబబనిపిస్తేనే సెలవిస్తారు. సెలవిచ్చేదీ లేనిదీ - మనం సెలవు కోరిన దినానికి ఒక రోజు ముందు తెలుపుతారు. ఏం చేస్తామంకుల్. పిల్ల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలికదా!" అన్నాడు చైతన్య. 

    కపాల మోక్షం జరిగినట్లుంది. అందరూ స్నానాలకు లేస్తున్నారు. ప్రక్కప్రక్క పంపుల కింద స్నానం చేస్తుంటే చెప్పాడు చైతన్య. "ఇప్పుడు నేను ఇంటికెళ్ళి పిల్లల టిఫిన్ క్యారేజీలను బళ్ళో అందించి శ్రీదేవిని వెంటబెట్టుకు రావాలి. స్కూలు ఫీజులు చాలా భారంగా ఉన్నాయి. తనకు కూడా ఉద్యోగం ఏదైనా వెదకాలనుకొంటున్నాను."

    స్నానాలయ్యాక తడిబట్టలతోటే ఇంటి ముఖం పట్టారందరూ. "తల్లి ఋణం ఇలా తీరింది. మాకు ఈ మాత్రపు అదృష్టమైనా పడుతుందో లేదో" - నిర్వేదంగా అన్నారు వాసుదేవరావు మోటారు సైకిలు మీద వెళ్ళిపోతున్న కొడుకును చూస్తూ.

* * *

    మోటరు సైకిలుతో పాటు గతంలోకి వెళ్ళాడు జానకిరామం. చైతన్య మంచి కుర్రాడే. అతడి పెళ్ళికి కూడా వెళ్ళాడు తను. శ్రీదేచికూడా మంచి పిల్ల. అత్తమామల్తో మమేకమైపోయింది. ఎప్పుడన్నా ఇంటికెళ్తే అత్తగారు కోడల్ని పొగడని క్షణమంటూ ఉండేదికాదు. మూడేళ్ళ క్రితం ఓ రోజు సాయంకాలం ఆదర్శనగర్ కాలనీలో ఏదో ఇల్లు ఖాళీగా ఉందంటే వాళ్ళాఫీసరు కోసం చూసివస్తున్నాడు జానకిరామం. దారిలో ఓ ఇంటిముందు నుంచుని కనిపించింది శ్రీదేవి.

    "ఏం శ్రీదేవీ బాగున్నావా! ఇదేంటి ఇక్కడున్నావు! ఎవరన్నా బంధువుల ఇల్లా ఇది?" అడిగాడు జానకిరామం.

    డిగినదానికి సమాధానం చెప్పకుండా 'లోపలికి రండంకుల్' అంటూ లోనికి దారితీసింది. వెళ్ళక తప్పలేదు జానకిరామానికి. పిల్లలిద్దరూ ముందు గదిలో బొమ్మల్తో ఆడుకుంటున్నారు బుద్ధిగా. చల్లటి మంచినీళ్ళు తెచ్చిచ్చింది శ్రీదేవి. బయట ఎండగా వుందేమో గటగటా తాగేశాడు గ్లాసెడు నీళ్ళనీ జానకిరామం.

    "మేమిప్పుడు ఇక్కడ విడిగా వుంటున్నామంకుల్" అంది శ్రీదేవి నింపాదిగా. 

     "అదేమిటి మీ అత్తా కోడళ్ళిద్దరూ అన్యోన్యంగానే వుండేవారుగా! నాకు తెలిసి మీ మామగారు కూడా ఇంటి విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకొనే మనిషి కానేకాదు. మరి వేరింటి ఉద్దేశ్యమెలా వచ్చిందమ్మా!" సూటిగానే అడిగాడు జానకిరామం.

    కాసేపు తటపటాయించింది శ్రీదేవి. ఓ ఐదు నిమిషాల మౌనం తర్వాత - లేచి నుంచున్నాడు జానకిరామం.  "కూర్చోండంకుల్. మా ఇంటికి వచ్చిన మొదటి అతిథి మీరే. కాస్త కాఫీ తాగి వెళ్ళండి" అవకాశమివ్వకుండా వంటిట్లోకి వెళ్ళింది శ్రీదేవి. కూర్చోక తప్పింది కాదు జానకిరామానికి. 

    మరో ఐదు నిముషాలతర్వాత పొగలుకక్కే కాఫీ కప్పుతో వచ్చింది శ్రీదేవి. అతడు కాఫీ తాగుతుంటే ఆమె చెప్పసాగింది.

    "మరోలా అనుకోకండంకుల్. మా కుటుంబంలోని లోలోతు విషయాలు బయటివాళ్ళకు చెప్పడం ఇష్టం లేక మేమెవరికీ విడిపోతున్న కారణాన్ని చెప్పలేదు. మీకు చెప్పాలనిపిస్తోంది... అదీ నేను చెప్పే మాటలు మీ లోనే నిక్షిప్తం చేసుకుంటానని మీరు మాట ఇస్తేనే!" ఆగింది శ్రీదేవి.

    జానకిరామం ఆ అమ్మాయి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ కళ్ళలోని నిజాయితీకి ఆశ్చర్యపోయాడు. అర్థింపుకు లొంగిపోయాడు. "నువ్వు చెప్పే మాటలు నన్ను దాటి బయటికెళ్ళవు సరేనా!" అన్నాడు. మరో రెండు నిమిషాల తర్వాత చెప్పడం మొదలెట్టింది శ్రీదేవి.

    "అత్తయ్యగారు స్వతహాగా మంచివారే. మామయ్యగారు దేముడితో సమానం. కానీ ఆవిడ ప్రవర్తన అమ్మమ్మగారితో అంటే ఆవిడ అత్తగారితో మటుకు విపరీతంగా వుండేది. ముసలావిడకి ఎనభై ఏళ్ళ పైమాటే. ఆరోగ్యం అంతంతమాత్రంగానే వుండేది. అయినా సాధ్యమైనంత మేరకు ఆవిడ పనులను ఆవిడే చేసుకుంటూండేది. కుటుంబమన్నాక మనిషి సాయం లేకుండా ఎలా! ముసలావిడకు చూపు తక్కువ. దానికి తోడు తరచుగా బాత్రూంకి వెళ్ళాల్సి వచ్చేది. ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి. అన్నం కంచం ఒక చోట వుంటే చేతులొక చోట పెట్టేది. ఇలాగ ప్రతిపనికీ - సాయం అవసరమయ్యేది. అత్తయ్యగారు సాయం చేస్తూనే వుండేది. చేసినప్పుడల్లా ఏదో ఒక సూటిపోటి మాట అంటుండేది. నేను వేరే గదిలో వున్నప్పుడు చెయ్యి చేసుకొనేదని కూడా నా అనుమానం. 

    అత్తయ్యగారు పడుకున్నప్పుడో - మామయ్యగారితో కలిసి గుడికెళ్ళినప్పుడో - సొద వెళ్ళబోసుకొనేది ముసలావిడ. పెద్ద కూతురు చిన్నతనంలోనే అంటే తొల్చూలు కాన్పులోనే పోయింది. పుట్టిన పిల్లాణ్ణి అత్తింటివాళ్ళే తీసుకెళ్ళారు. వాళ్ళకీ, వీళ్ళకీ సంబంధాలు లేవు. రెండో కూతుర్ని పెద్దింటికే ఇచ్చి చేశారు. వాళ్ళస్థాయికి వీళ్ళు తగరు కనుక - అమ్మాయిని కనీసమ్ పురుళ్ళకీ పుణ్యాలకీ కూడా పంపేవాళ్ళు కాదుట. వీళ్ళే వెళ్ళి వచ్చేవారుట. వాళ్ళ ఈసడింపులు భరించలేక వీళ్ళు వెళ్ళడం క్రమేపీ మానుకొన్నారు. సుగుణమేమిటంటే వీళ్ళమ్మాయినీ, పిల్లల్నీ మటుకు వాళ్ళు బాగానే చూసుకొనేవాళ్ళుట. కొన్నేళ్ళ కా కుటుంబం అమెరికా వెళ్ళిపోయారని తెలిసింది. దాంతో కబుర్లు తెలియడం కూడా ఆగిపోయింది.

    ఇక మిగిలిందల్లా మామయ్యగారు. మామయ్యగారంటే ఆవిడకు ప్రాణం. అచ్చమాంబకారు అత్తయ్యగార్ని పల్లెత్తు మాట అనడం నేనెరుగను. అత్తయ్యగారు ఆవిడని మాట అనని రోజునూ నేనెరుగను. ఉండబట్టలేక ఒక రోజున అడిగేశాను అత్తయ్యగార్ని. అడిగేశాను అనడం కంటే కడిగేశాను అనడం సమంజసమనుకుంటా!"

    "ఆ రోజు రాత్రి పదిగంటలకు నన్ను డాబా మీదకు తీసుకెళ్ళింది అత్తయ్యగారు. మామయ్యగారు ఆఫీసు పని మీద క్యాంపుకెళ్ళారు. ఈయన స్నేహితుడి పెళ్ళికని పొరుగూరు వెళ్ళారు. అప్పుడు చెప్పుకొచ్చింది తన గతాన్ని.

    అత్తయ్యా వాళ్ళ నాన్నగారు - అచ్చమాంబగారికి కట్నం కింద రెండెకరాల మాగాణీని అదీ కాలవ కింద పొలాన్ని ఇస్తానని వాగ్దానం చేశారట. ఆ పొలాన్నే లోగడ తనఖా పెట్టి ఇద్దరాడ పిల్లల పెళ్ళిళ్ళు చేశేడాయన. మా అత్తగారు మూడో పిల్ల. పెళ్ళి చేయడమే గగనమైంది. పొలాన్ని అప్పులాళ్ళు రాయించేసుకున్నారు. ఇంకేమివ్వగలడాయన ప్రాణాన్ని తప్ప. మంగళగౌరీ వ్రతానికి కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్ళడానికొచ్చాట్ట వాళ్ళ నాన్న. గుమ్మంలోనే నిలబెట్టి కడిగేసిందిట అచ్చమాంబగారు. పచ్చి మంచినీళ్ళయినా ముట్టుకోకుండా వెనక్కి వెళ్ళిపోయాట్ట ఆయన. ఈ ఊళ్ళో బస్సెక్కాడు. ఆ ఊళ్ళో దిగడానికి ఆయనకు ప్రాణం లేదు. సీట్లో కూచున్న వాడి ప్రాణం కూచున్నట్టే పోయింది.

    అప్పట్లో వాళ్ళదేదో పల్లెటూర్లో ఉండేవార్ట. ఇప్పుడంటే మామయ్యగారు ఇన్‍కంటాక్సాఫీసరు. అప్పట్లో ఏదో చిన్న ఉద్యోగమే చేసేవార్ట పట్నంలో. రెండు సంసారాలంటే జీతం చాలదని తానొక్కరే పట్నంలో వుంటూ - అత్తయ్యగార్ని వాళ్ళమ్మా చెల్లెళ్ళ దగ్గరే ఉంచేవార్ట. వారానికోసారి వచ్చేవాడయన. ఈలోగా ఈవిణ్ణి వాళ్ళు ముగ్గురూ కలిసి రాచిరంపాన పెట్టేవాళ్ళు. వారానికోసారి వచ్చెఅ మొగుడి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక తన కష్టాలని ఆయనతో చెప్పుకునేది కాదుట. ఇంతటితో వాళ్ళ మనసు తృప్తి పడలేదు. మామగారు బస్సు దిగి గుమ్మంలోకి అడుగుపెడ్తారో లేదో - భార్యమీద నేరాలు చెప్పేవారట. ఆయన అలసట కారణంగా ఈవిడ మీద విసుక్కునేవార్ట. చివరికి భరించలేక ఓ ఆదివారం మా అత్తగారు విషయాలన్నీ ఏకరువు పెట్టి పెంట పెట్టిందిట. ఆ రచ్చ కాస్తా రోజుల తరబడి నలిగినలిగి మామయ్యగారు ఈవిడ మీద చెయ్యిచేసుకునే వరకూ వెళ్ళింది. ఈ గొడవలు భరించలేకనో- భార్యను అనవసరంగా కొట్టాననో - ఆయన మూణ్ణెళ్ళవరకూ ఇంటి ముఖం చూడలేదుట. నెలనెలా డబ్బులు మాత్రం ఎవరిద్వారానో ఒకరి ద్వారా పంపిస్తుండేవారట. మా అత్తగారు తెచ్చే రెండెకరాల మాగాణిని అమ్మి ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలని అచ్చమాంబగారి పథకం. అది నెరవేరలేదు. ఆ ఉక్రోషమంతా కోడలి మీద చూపెట్టే వారట వాళ్ళు. ఆఖరికి ఆవిడ తొడల మీద వాతలు కూడా పెట్టారట. చెప్పుకొని ఏడ్చిందావిడా రాత్రి డాబామీద.

    ఆ తర్వాత్తర్వాత ఇద్దరాడపిల్లల పెళ్ళిళ్ళూ మా మామగారే చేశారు. పరీక్షలు రాసి పాసై ఆఫీసరు హోదా సాధించుకున్నారు. ఇంతైనా పెద్దకూతురు పురిట్లో పోవడానికీ, అమెరికా కూతురు మాట్లాడక పోవడానికీ మా అత్తగారే కారణమని నెపంబెట్టి ఒంట్లో అజమున్నంతవరకూ అంటే మా పెళ్ళి కంటే ఓ నాలుగైదేళ్ళ ముందువరకూ - మా అత్తగారిని సాధిస్తూనే ఉండేదిట. ఈ విషయాలన్నీ మా మామగారికి తెలుసో తెలీదో కాని తెలియనట్టే ఉండేవారట.

    ఈ విషయాలన్నీ తెలిసాక నాకా ఇంట్లో ఉండడం కష్టమైంది. అత్తగారి ప్రతీకారేచ్ఛ సమంజసమైందే. అమ్మమ్మ గారి ఆవేదన సహజమైందే. మా అత్తగారు నన్ను తనకు సహాయకారిగా ఉండాలనుకొనేది. అచ్చమాంబగారు నేను తన పక్షాన వకాల్తా పుచ్చుకోవాలనుకొనేది. ఈ రెండూ సాధ్యమయ్యే పనుకు కావు. నా మానసికారోగ్యం దెబ్బతినకముందే - బయటకు రావాలనుకొన్నాను.

    చైత్యన్యతో మాట్లాడాను. ఆయన నన్నర్థం చేసుకొన్నారు. వేరింటి కాపురం పెట్టుకొన్నాం. ఇదీ అంకుల్ జరిగిన విషయం. కనీసం లోకంలో ఒకరన్నా మా పరిస్థితి నర్థం చేసికొన్న వాళ్ళున్నారన్న సంతృప్తి మిగలాలనే మీకీ విషయాలు చెప్పాను. నా మనసులో బరువు తీరిపోయింది" అంది కళ్ళల్లో నీరొత్తుకుంటూ శ్రీదేవి.

    "నువ్వు చేసింది నూటికి నూరుపాళ్ళూ సహేతుకమైన పనేనమ్మా! నువ్వు తప్పేమీ చేయలేదు." మనస్ఫూర్తిగా అంటూ లేచాడు జానకిరామం. 

* * *   

    ఎవరి ఆలోచనల్లో వాళ్ళుగా - ఎవరికి వారు మౌనంగా వాసుదేవరావు గారింటికి చేరుకొన్నారు.

    వీళ్ళు ఇల్లు చేరుకొనే లోపునే ఇల్లంతా శుభ్రంగా కడిగి ధారపాత్ర పెట్టాల్సిన చోట దీపం వెలిగించి సిద్ధంగా వుంచింది పాపన్నశాస్త్రి గారి భార్య జానకమ్మ. స్మశానానికి వెళ్ళివచ్చిన వారందరూ దీపానికి దణ్ణం పెట్టుకుని ఇంటి ముందరి షామియానా క్రింద వేసిన కుర్చీలలో కూర్చొన్నారు. లోపల జానకమ్మ వంట ప్రయత్నంలో నిమగ్నమైంది. వాసుదేవరావుని గతం కమ్ముకొస్తోంది.

    ఏ సంబంధమూ లేని పాపన్నశాస్త్రి కుటుంబం దైవం పంపించినట్లుగా ఇలా ఆదుకొంటోంది. ఊళ్ళో ఉన్న చిన్న కొడుకు చుట్టంచూపుగా వచ్చి చూసి పోతున్నాడు. అదీ బామ్మ చనిపోతే. కారైతే గంట ప్రయాణం బస్సైతే రెండుగంటలూను. కన్నతండ్రి -తల్లి చనిపోతే చూడాలనిపించని కూతురు కామాక్షి. రక్త సంబంధాల్లో ఏం మిగిలిందని. పెద్దాడు శ్రీరమణ. వాడు చదువుకుంటానంటే అమెరికా పంపించాడు. పంపించే స్థోమత ఉండిందా! ఊరంతా అప్పుల్జేసి మరీ పంపించాడు. అప్పట్లో తను ఇన్‍కంటాక్స్ ఇన్స్పెక్టరు. ఇప్పుడు ఐ.టి.ఓ. అయితే ఏంటి లాభం. జీతం తప్ప ఎర్రని ఏగానీ ఎరుగడు. తన నిజాయితీని గుర్తించిన వాడెవడూ లేడు. పై ఆఫీసర్లకు పనికిరాని వాడి కిందే లెఖ్ఖ. తోటి వాళ్ళకి - తన పేరు ఎకసెక్కాలాడేందుకు పనికి వచ్చేది. క్రింద ఉద్యోగులు మాత్రం భయపడేవాళ్ళు. గౌరవించేవాళ్ళు. అది చాలనుకున్నాడు తను. వాళ్ళది కూడా నటనేనని - తను రిటైర్ అవడానికి - ఓరోజు ముందు తెలిసింది. తను ఛాంబర్లో ఉన్న సంగతి గమనించని ఇద్దరు ఉద్యోగుల సంభాషణ తన చెవిన పడినందున తెలిసింది. తననందరూ జి.వి.డి. అని పిలుస్తారు. ’జి.వి.డి. అంటే తెలుసా?’ అడిగాడు ఒక ఉద్యోగి ఇంకొకణ్ణి. ’ఏముందీ జి.వాసుదేవరావు’ అని సమాధానమిచ్చాడు రెండో ఉద్యోగి. "కాదు.’గడ్డివాముదగ్గర రావు’ తను తినడు. ఇంకొకణ్ణి తిననివ్వడు" అంటూ నవ్వాడు మొదటి ఉద్యోగి. శృతి కలిపాడు రెండోవాడు. తనకు కోపం వచ్చింది. వాళ్ళని పిలిచి మందలిద్దామనుకొన్నాడు. ఇంకా మిగిలివున్న ఒక్కరోజు సర్వీసులో ఒరిగేదేముంది. వాళ్ళ మనసులో మాట తనకు తెలియనట్లుండడమే మంచిది.

    శ్రీరమణ యం.యస్. పూర్తయ్యాక రిసెర్చి కూడా చేస్తానన్నాడు. నువ్వు డబ్బులు పంపక్కర్లేదు. ఇక్కడ పార్ట్‍టైమ్ జాబ్ చేస్తూ, యూనివర్సిటీ వారిచ్చే స్కాలర్‍షిప్‍తో పూర్తి చేస్తాను. అని భరోసా ఇచ్చాడు. కొడుకు ప్రయోజకత్వం ఏ తండ్రికి ఆనందాన్నివ్వదు. శ్రీరమణ కాస్తా డా.శ్రీరమణ అయ్యాడు. అక్కడే ఉద్యోగం చూసుకున్నాడు. గ్రీన్‍కార్డు హోల్డరు కూడా అయ్యాడు. ఆర్థిక స్థోమత లేని కారణంగా ఆరేళ్ళపాటు అటే ఉండిపోయాడు. ఓ ఏడాదిపాటు ఉద్యోగం చేశాక ఓ రోజున తండ్రికి ఫోను చేశాడు. తాను ఇంటికి వస్తున్నట్లూ, ఓ నెలరోజులపాటు తమ తోనే ఉంటాననీనూ. ఇల్లంతా పండగ సందడి. రామలక్ష్మి ఆనందానికి అవధుల్లేవు. కాలనీ అంతా తిరిగి ఎరిగున్న వాళ్ళకీ లేని వాళ్ళకీ చెప్పి వచ్చింది నా కొడుకు అమెరికా నుండి వస్తున్నాడని. పొరుగూళ్ళలో ఉన్న బంధువులందరికీ ఫోన్లు చేసి మరీ చెప్పింది.

    ఆఖరికి వాడు రానే వచ్చాడు. కూడా ఒక ఇంగ్లీషు దొరసానిని తీసుకువచ్చాడు. స్నేహితురాలు - ఇండియా చూస్తానంటే తీసుకొచ్చానన్నాడు. వాడు తెచ్చిన గిఫ్టులన్నిటినీ ఒక్కొక్కటిగా అందరికీ ఇచ్చేశాడు. తను ఇండియాలో లేనప్పుడు పెళ్ళైన చెల్లికీ బావకీ కూడా గిఫ్టులు తెచ్చాడు. మూడో రోజు ఉదయం చెప్పాడు - కూడా వచ్చిన అమ్మాయి మీ కోడలని. ఆ అమ్మాయి క్రిష్టియన్. వీడు కూడా క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. విషయం తెలిసిన రామలక్ష్మి అగ్గిమీద గుగ్గిలమైంది. నువ్వు నాకొడుకువే కాదు పొమ్మంది. తన కొడుకును వలలో వేసుకొన్నందుకా పిల్లను దుమ్మెత్తి పోసింది. తను నచ్చ చెప్పినా విన్లేదు. తనకంటే ముందుతరం మనిషి అత్తగారు రాజీపడినా - రామలక్ష్మి రాజీపడలేదు. ఆ పిల్లని ఒదిలేస్తేనే ఇంట్లోకి రానిస్తాననంది కొడుకుని. నెల్రోజులుంటాని కొచ్చిన వాడు నాలుగోరోజే పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. "మా ఆవిణ్ణి నాతో సమానంగా చూసే పక్షంలోనే మళ్ళీ ఈ యింటి గుమ్మం తొక్కుతాను. లేదంటే మీకూ నాకూ చెల్ల"ని చెప్పి మరీ వెళ్ళిపొయాడు. వెళ్తూ వెళ్తూ ఫోన్ నెంబర్లూ చిరునామాలూ కూడా ఇచ్చి వెళ్ళాడు. "మొదటి ఫోను మీ నుంచి వస్తేనే నా స్పందన ఉంటుంద"ని హెచ్చరించి మరీ వెళ్ళి పోయాడు.

    కొడుకు వెళ్ళి పోయాక ఏడ్చి ఏడ్చి మంచమెక్కింది రామలక్ష్మి. కోలుకోవడానికి రెండు నెలలు పట్టింది. రమణకి ఫోన్ చేస్తానంటే ఒద్దంటుంది. ఉత్తరం రాస్తానంటే వద్దంటుంది. నా కడుపు మీద తన్నిపోయిన వాణ్ణి నేను దేబిరించడమేమిటంటుంది. ఆ పిల్లను ఒదిలేస్తేనే వాడు నా రక్తం పంచుకు పుట్టినట్టు లెక్క అంటుంది. అదొక విచిత్రమైన స్థితి. కొడుకును ప్రేమిస్తుంది. కొడుకు ప్రేమించిన పిల్లని ద్వేషిస్తుంది.

    క్రమేణా అందరూ విషయాన్ని మర్చిపోయారు. రామలక్ష్మి కొత్త ప్రచారం మొదలు పెట్టింది. కొడుకు తన దగ్గరకు రాకపోయినా ఫోన్లో మాట్లాడుతున్నాడనీ, వాళ్ళ నాన్నకి నెలకి వంద డాలర్ల డబ్బు పంపిస్తున్నాడనీను. ఈ అసత్య ప్రచారం తనకిష్టం లేదు. రామలక్ష్మిని మందలించాలని చూశాడు. ఈ విషయం ఎత్తినప్పుడల్లా రామలక్ష్మి డిప్రెషన్లోకి వెళ్ళి పోతోంది. కొడుకు ప్రేమలో పీకల్లోతు కూరుకు పోయింది రామలక్ష్మి. కొడుకు కనిపిస్తే క్షమిస్తుందేమో అనిపించి రమణకి ఫోను చేశాడతను. నెంబర్లు మారిపోయి వుంటాయి కలవలేదు. అడ్రసుకి ఉత్తరం రాశాడు కూడా. అవీ తిరిగి వచ్చేసింది. చేసేదేమీ లేదింక రామలక్ష్మి ప్రచారాన్ని అంగీకరించడం తప్ప.

    నాలుగేళ్ళవుతుందేమో దసరాకని పిల్లల్తో పుట్టింటికి వచ్చింది కామాక్షి. "నాన్నా ఆయన యం.యస్. తర్వాత మూత్రపిండాల రంగంలో స్పెషాలిటీ పూర్తి చేశారు. ఇప్పుడు ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి కొంతమంది మిత్రులతో కలసి సూపర్‍స్పెషాల్టీ ఆసుపత్రి పెడుతున్నారు. ఆయన వాటా కింద పది లక్షలు పెట్టుబడి కావాల్ట. ఓ ఐదు లక్షలవరకూ ఏర్పాటు చేసుకున్నారు స్వంతంగా. నువ్వొక ఐదు లక్షలు అప్పుగా ఇచ్చావంటే ఏడాదిలో తిరిగిచ్చేస్తానని చెప్పమన్నారు" అంది.

    "అంత డబ్బు నాదగ్గరెక్కడుందమ్మా! నా జీతమెంతో నీకు తెలుసుకదా! నేను లంచాలు కూడా తీసుకోనని తెలుసుకదా!"

    "అది తెలుసు నాన్నా! నేనడిగింది నీ డబ్బు కాదు. అన్నయ్య నెలనెలా పంపిస్తున్న డబ్బుగురించి. అమ్మనడిగితే డబ్బంతా నువ్వే దాస్తున్నావని చెప్పింది."

    "అమ్మా! అదంతా ఓ తియ్యటి అబద్దం. మీ అమ్మ డిప్రెషన్‍లో ఉంది తల్లీ. శ్రీరమణ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు. వాడు కనబడితే గాని మీ అమ్మకి డిప్రెషన్ పోదు. ఇప్పుడున్న నిజాన్ని - అంటే వాడు డబ్బు పంపట్లేదనీ - తనతో టెలిఫోన్‍లో మాట్లాడడం లేదనీ - నలుగుర్లో ఋజువు చేస్తే మీ అమ్మ పిచ్చిదై పోవచ్చు, షాక్‍తో ప్రాణాలు కోల్పోయినా కోల్పోవచ్చు" అన్నాడు తను. 

    "నాన్నా! నీ కిష్టం లేకపోతే డబ్బివ్వనని చెప్పు. అంతేగాని నిక్షేపంగా ఉన్న అమ్మ మీద అభాండాలు వేయవద్దు. ఆవిడకి అనారోగ్యాన్ని ఆపాదించి ప్రాణాలు తీయనూ వద్దు" అంటూ కోపంగా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. మనుమల్తో సరదాగా గడవాల్సిన దసరా ఒంటిగా రోదనల్తో గడిచి పోయింది.

    అప్పటికీ ఇప్పటికీ రాలేదు కామాక్షి. ఆఖరికి బామ్మపోతే కూడా!

    "అప్పుడే తీసుకెళ్ళిపోయారా! ఈ మనుమరాలికి ఆఖరు చూపు దక్కాలన్న ఆలోచనే ఎవరికీ లేకుండా పోయిందా!" పెద్దగా రోదిస్తూ అరుస్తున్న కామాక్షి గొంతు విని ఈ లోకంలోకి వచ్చాడు వాసుదేవరావు.

    సరిగ్గా అప్పుడే శ్రీదేవితో పాటు గుమ్మంలోకి అడుగుపెడుతున్న చైతన్య వెనక్కి చూసి అక్క దగ్గరకి వచ్చి "రాత్రి ఎనిమిదింటికి ఫోన్ చేస్తే తీరిగ్గా ఇప్పుడు పగలు ఒంటి గంటకు వచ్చి బామ్మ మీద పెద్ద ప్రేమకారి పోతున్నట్టు అరుస్తావేమిటే!" అన్నాడు గట్టిగా.

    "నువు రాత్రి ఫోను చేశావా" అంతే గట్టిగా అంది కామాక్షి.

    "రాత్రి ఎనిమిదింటికి మీ ఇంటికి పదిసార్లు ఫోన్ చేశాను. ఎవరూ ఎత్తలేదు. నీ సెల్‍ఫోనుకీ చేశాను. నువ్వెత్తలేదు."

    "సెల్‍ఫోను ఛార్జింగు అయిపోయినట్లుంది. పేషంట్లు విసిగిస్తారని రాత్రి పూట ల్యాండులైను ప్లగ్గు తీసిపడేస్తాను. అందుకే నీకు సమాధానం రాలేదేమో!" అంది నిర్లక్ష్యంగా.  

    "బావగారి సెల్‍కీ చేశాను. అదీ నోరిప్లై వచ్చింది. ఆఖరికి ఆసుపత్రి రిసెప్షనిష్టుకు చేస్తే - ఆపరేషను థియేటర్లో ఉన్నారు. వచ్చాక చెబుతామన్నారు. అంతకు మించి ఏంచేయమంటావే. మీ ఆసుపత్రి వాళ్ళు చెప్పకపోతే మా తప్పా!" అన్నాడు చైతన్య.

    "రాత్రి పన్నెండింటికి ఇంటికొచ్చేటప్పుడు చెప్పార్ట ఆసుపత్రి వాళ్ళు. ఆ అలసటలో ఆయన నాకు చెప్పడం మర్చిపోయారు. ఉదయం పదిగంటలకి ఆస్పత్రికి వెళితే - రిసెప్షనిస్టు మళ్ళీ గుర్తు చేశాట్ట. వెంటనే నాకు ఫోన్ చేసి నన్ను వెళ్ళమన్నారు. ఏదో ఎమర్జెన్సీ వచ్చిందట. లేకపోతే ఆయనా వచ్చేవారు. రాకపోవడమే నయమైంది. లేకపోతే ఆయనకీ ఈ అవమానమే ఎదురయ్యేది."

    "ఏమిటే అవమానం. మీరొస్తారో రారో తెలీదు. ఎంతసేపు పెట్టుకుంటారే చనిపోయిన మనిషిని ఇంట్లో. మీరు మరిచిపోవడంలో లేని అవమానం మేం బామ్మని తీసుకు పోతే వచ్చిందా?" ఎదురుదాడికి దిగాడు చైతన్య.

    "ప్రొద్దుటే ఇంకో సారి ఫోన్ చేసి వుండవచ్చు కదా! ఐనా పోయిన ప్రాణాలకన్నా పోకుండా కాపాడవలసిన ప్రాణాలే మిన్న. అందుకే రాలేదు మా ఆయన" అంటూ లోపలికెళ్ళి అమ్మని వాటేసుకుని బిగ్గరగా ఏడవసాగింది కామాక్షి.

    నాలుగు నెలల క్రిందట తల్లి ఆరోగ్యం మెరుగుపరుచుకుందుకు అవకాశముందేమో కనుక్కుందామని అల్లుడి దగ్గరకు వెళ్ళాడు వాసుదేవరావు. రిపోర్టులన్నీ చూశాక "ఆవిడ ఆరోగ్యం మెరుగయ్యే అవకాశాలు తక్కువ. ఎందుకనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకుంటారు" అన్నాడాయన. "డబ్బెంత ఖర్చైనా ఫరవాలేదండీ. మీరు నయమయ్యే అవకాశముందని చెబితేచాలు" అన్నాడు వాసుదేవరావు.

    ఆ రోజంతా కూతురింట్లోనే వున్నాడు. మర్నాడు ప్రొద్దుట కూతురు చెప్పింది." మా ఆసుపత్రిలో ఉండాలంటే గదికైతే రోజుకు వెయ్యి రూపాయలూ, వార్డులోనైతే రోజుకు ఐదొందలూ ఛార్జీలుట. వైద్యం ఖర్చులూ, మందుల ఖర్చులూ వేరేట. ఉచితంగా ఉంచుకోందుకు మిగిలిన డాక్టర్లొప్పుకోలేదుట. అందుకని ఏదైనా గవర్నమెంటాస్పిటలు చూసుకోమన్నారు నాన్నా!"

    ఆసుపత్రుల చుట్టూ తిరగడానికి మనుషులు కావాలి. ఉన్నదిద్దరు. అందుకే రోజూ ఇంటికొచ్చి చూచే డాక్టర్నీ, నర్సునీ పెట్టుకున్నారు. రిటైర్మెంటు డబ్బులింకా చేతికి రావాల్సివున్నాయన్న ఆశతో కొత్త అప్పులు చేస్తూ పోతున్నాడు వాసుదేవరావు. కొడుకు మీద కనికరం కలిగిందేమో అచ్చమాంబకి ఇక చాలనుకొని వెళ్ళిపోయింది.

    కామాక్షి ఏడుపాపి ఇంటి ముందుకొచ్చి కుర్చీలో కూచొంది. "నాన్నా! అమ్మ ఇంకా ఏడుస్తూనే వుంది. మానడం లేదు. ఎంత చెప్పినా వినడంలేదు." చైతన్య వచ్చి చెప్పాడు తండ్రికి.

    "ఏడవనీ! ఏడుపే ఉపశమనం మీ అమ్మకిప్పుడు. ఆర్నెల్లుగా బామ్మని కన్నతల్లికన్న మిన్నగా ఆదరించింది. కన్నకూతురి కంటే ఎక్కువగా సేవలు చేసింది. నిద్రాహారాలు మాని పని చేసింది. వాళ్ళిద్దరిదీ జన్మాంతర వైరమనుకునేవాణ్ణి నేను. నేను నా కన్నతల్లికి అరవై ఏళ్ళుగా అందించిన ప్రేమని మీ అమ్మ ఆర్నెల్ల కాలంలో అందించింది. ఇప్పుడిది ప్రేమ వాయుగుండం. తీరాన్ని తాకి తుఫానుగా మారింది. వర్షం పూర్తిగా పడితేనేగాని ఆకాశం నిర్మలమవదు" అన్నాడు వాసుదేవరావు.

    "భోజనాలు సిద్ధమైనాయి." కబురు పంపింది జానకమ్మగారు. అందరూ కాళ్ళు కడుక్కుని హాల్లో భోజనాలక్కూర్చున్నారు. ఇంటరు రెండో సంవత్సరం చదువుతున్న పాపన్నశాస్త్రిగారబ్బాయి రామ్మూర్తి విస్తళ్ళు వేసి గ్లాసుల్లో మంచినీళ్ళు పోస్తున్నాడు.

    "పాపన్న శాస్త్రిగారూ! మీకోసం ఎవరో వచ్చారు..." బయటి నుండి కేకేశారెవరో. బయటకు వచ్చారు శాస్త్రిగారు. స్కూలు ప్యూను.

    "ఏంటి ఇలావచ్చావు. ప్రొద్దుట సెలవు చీటీ పంపించాను కదా!" అన్నారు శాస్త్రిగారు.

    "స్కూలుకి డి.ఇ.ఓ.గారొచ్చారండి. మిమ్మల్నొక రెండు నిమిషాలొచ్చి వెళ్ళమని హెడ్మాష్టారు కబురు పెట్టారు" అన్నాడు ప్యూన్.

    హాల్లో ఒకడుగు వేసి "నేనిప్పుడే వస్తాను. మీరు కానివ్వండి" అంటూ బడి బాట పట్టారు పాపన్నశాస్త్రి.

    ’మనిషంటే ఈయన కదా!’ మనసులో అనుకున్నాడు జానకిరామం.   
Comments