అనుబంధం లోగిల్లో ప్రేమ జల్లు - యలమర్తి అనూరాధ

    నిశ్శబ్ద రాగాన్ని ఆలపిస్తూ భూదేవి సకల జనాలనూ ఆదమరిచి నిదుర పోయేలా జోల పాడుతున్న వేళ కృష్ణకిరణ్ మాత్రం నిద్ర పోకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అదే ప్రభుత్వ పంచవర్ష ప్రణాళిక గురించో కాదు. రేపు అమ్మ, నాన్నలను ఏ విధంగా చూసుకోవాలి? ఎంతలా సుఖపెట్టాలని! అతని ప్రతి ఆలోచనా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దానికో ఆకారం వస్తేగానీ అతనికి మనఃశ్శాంతి ఉండదు. అప్పటిదాకా అలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంటాడు. చెట్లన్నీ మౌన పాఠాన్ని వినిపిస్తున్నాయి. ఎదురింటి గోడమీద పడుతున్న అతని నీడ ఒక్కటే తోడుగా అనుసరిస్తోంది. అతని నిస్వార్థ కృషి ఫలించి తొమ్మిది నిముషాల తరువాత ఓ మంచి ఆలోచన పురుడు పోసుకుంది. సంతోషం  పాప పుట్టింది. అది వెల్లువై రేపు తన తల్లిదండ్రులను ఆనందంలో తడపాలి అనుకున్నాక అప్పటిదాకా దూరంగా దాక్కున్న నిద్రాదేవి అమాంతం వచ్చి మీద పడి అతన్ని ఆవహించింది.

    అమ్మా! నాన్నా! ఈ రోజు మనం 'సిరిపురం' వెళుతున్నాం.

    "నిజమాఁ!" వాళ్ళిద్దరి కళ్ళలో అంతులేని కాంతులు.

    "తొందరగా రడీ అవండి. ఆలస్యం చేస్తే ఊరుకొనేది లేదు" తండ్రి పిల్లలకు చెప్పినట్లు చెప్పి ఇద్దరకూ ముద్దు ఇచ్చి వెళ్ళాడు. 

    ఎందుకాలస్యం చేస్తాం అన్నట్లు తల్లీ, తండ్రి పోటీ పడుతూ గబగబా లేచి దుప్పట్లు మడత బెట్టబోయారు.

    "ఆ పని మీకెందుకు? నేను చూస్తానుగా! మీరు వెళ్ళి తయారవ్వండి" ఎప్పుడు వచ్చిందో కోడలు 'కారుణ్య' కళ్ళముందు ప్రత్యక్షమయ్యింది.

    ఏపనీ చెయ్యనివ్వదు. 'పైగా ఇన్నాళ్ళూ చేసింది చాలు. ఈ వయసులో హాయిగా విశ్రాంతి తీసుకోవాలి' అంటూ వాళ్ళను చిన్నపిల్లలను చేసి నీతులు చెబుతుంది.

    అందుకే చిన్నతనంలో తను ఏదయినా పని చెప్పినప్పుడు కామ్‌గా చేసేస్తానన్నట్లు నోటిమీద వేలువేసుకుని కృష్ణ తమకు సంజ్ఞ చేసి ఆ పని చేసేవాడు. అది గుర్తు వచ్చి నవ్వుకుంటూ బయటకు నడిచారు.

    కొడుకు, కోడలి ఆప్యాయతతో అనునిత్యం సుప్రభాతం పాడే అదృష్టం నూటికో కోటికో ఏ ఒక్కరికో దక్కుతుంది. అది భగవంతుడు తన సొంతం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనను అనుసరించింది ఆమె.

    ఎనిమిది గంటలకు అలారం కొట్టింది.

    టిఫిన్ తిని హాలులో పడక్కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటున్నా తండ్రి చెంత చేరి 'నాన్నా! ఇదుగో మీ షుగర్ టాబ్లెట్' అన్నాడు.

    పేపరు ప్రక్కన పెట్టి ఆయన మందు బిళ్లను తీసుకోగానే ఎడమచేతిలో ఉన్న మంచినీళ్ళ గ్లాసును కుడిచేతిలోకి తీసుకొని ఆయనకి అందించాడు.

    పక్కింట్లోంచి పరశురామయ్య గొంతు "నాకూ ఉన్నారు కొడుకులు. చంపటానికి మందులిస్తారు కానీ బ్రతకటానికి మంచినీళ్ళు కూడా పొయ్యరు. 'ప్రక్కింటి కృష్ణను చూసి బుద్ధి తెచ్చుకోండిరా' అంటే 'పెద్ద చెప్పొచ్చావులే! నోరు మూసుకు కూర్చో!' అని దబాయిస్తూ ఏదో బిరుదు ఇచ్చినంత ఆనందపడిపోతారు. ఎవరికెంత రాసిపెడితే అంతే. ఇలా సర్దుకుపోవటం అలవాటు చేసేసుకున్నాను.తప్పదుగా మరి." 

    "అమ్మా! బి.పి.టాబ్లెట్"

    "నేను వేసుకుంటాను కదరా! కాళ్ళూ చేతులూ ఆడుతున్నంత సేపూ మా పని మమ్మల్ని చేసుకోనివ్వరా!"

    "మరి చిన్నప్పుడు నేను ఆ పని చేయలేనా? మీరెందుకు చేసే వారు?" అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు.

    "అదా! చిన్నతనం కదా! ఆ చేతులూ ఈ చేతులతో తీసి వేసుకుంటే లేని రోగం వస్తుందని భయం"

    "ఇప్పుడూ మీరూ నాకు అంతేనమ్మా! ఒక టాబ్లెట్‌కి ఒక టాబ్లెట్ వేసుకున్నా, అది తీసుకుంటుంటే జారి క్రింద పడినా, మరిచిపోయినా... ఇలాంటివి ఎన్నో చెప్పగలను"

    "సరేలేరా!"

    క్రింద కూర్చుని అమ్మ ఒడిలో తల పెట్టుకుంటూ "అయినా అమ్మా! ఆఫీసు కెళ్ళే దాకానే కదమ్మా నీకు నేనేం చేసినా. ఆ తర్వాత నేను చెయ్యాలన్నా చెయ్యలేనుగా".

    "పిచ్చి నాన్నా!" అంటూ అతని నుదురు మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది.

    ఇలాంటి చిన్నచిన్న ఆనందాలు వెతుక్కోవటానికి వాడు రెండు గంటల ముందు నిద్రలేస్తాడు. అలాంటివి తలుచుకుంటేనే ఎంతో హాయిగా ఉంటుంది.

    "తాతయ్యా! ఈ రోజన్నా మీ కంటే ముందు రడీ అవుదామనుకున్నాం. ప్చ్! ఎప్పుడూ మీరే గెలుస్తారు" బుంగమూతి పెడుతూ నిర్మల్, ఖ్యాతి అన్నారు ఒకేసారి.

    "రేపు నేను ఓడిపోతాను. సరేనా!"

    "వద్దు. గెలుపు అన్నది ఒకరు ఇస్తే తీసుకొనేది కాదు. ఎవరిక్ వాళ్ళు సాధించి గెలుచుకోవాలని నాన్న చెప్పారు"

    "అవును. రేపు ఇంకొంచెం ముందు లేచి మేమే ఫస్ట్‌గా తయారవుతాం. కదరా అన్నయ్యా!"

    తలుపాడు నిర్మల్ అవునన్నట్లుగా.

    "అందరూ రడీయేనా! ఇక బయలుదేరుదామా?" వాచీ పెట్టుకుంటూ అడిగాడు. "ఓఁ!" అన్నారు అందరూ ఒకేసారి.

    "అయితే పదండి. నేను కారు గ్యారేజీ లోంచి క్షణంలో తీసుకు వచ్చేస్తాను" కీ చైన్‌ను ఊపుకుంటూ వెళ్ళిపోయాడు కృష్ణకిరణ్.

    సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే కాలమే తెలియలేదు. 

    "అప్పుడే వచ్చేసామా!" అనుకున్నారు అందరు. 

    పచ్చటి పొలాల మధ్య ఆ భవనం ప్రశాంతతకు నిలయంలా కనిపిస్తోంది.

    వివేకానంద్ పరుగులాంటి నడకతో వచ్చి కౌగలించుకున్నాడు విద్యాసాగర్‌ని 'కలా? నిజమా!' అంటూ.

    "నిజమేరా బాబూ!" అన్నాడు నవ్వుతూ.

    "ఈ రోజుల్లో కాస్త సమయం దొరికితే చాలు ఆ ఛానల్, ఈ ఛానల్ అంటూ టీవీకి అతుక్కుపోతున్న వారే ఎక్కువ. అందుకే ఎదురు చూపులు, అనుభూతులు కరువయిపోయాయి."

    "అందుకే కదా నాన్నను తీసుకువచ్చింది. ఇక సాయంత్రం దాకా మీ ఇష్టం. అత్తయ్య దగ్గరికి అమ్మ చేరి పోయినట్లుంది."

    "ప్రాణస్నేహితురాలు కదా!"

    "ఇక మనమెవరం కనిపించం"

    "అప్పుడే మా ఇద్దరి మీద అభాండాలు వేయటం మొదలు పెట్టారా? అయినా కృష్ణా! నిన్న ఫోను చేసి చెప్పొచ్చుగా వస్తామని. ముందే లేచి వంట అంతా చేసుకునేదాన్ని. ఇప్పుడు అందరం కబుర్లు చెప్పుకునేవాళ్ళం" అంది విశాల.

    "అందరం కలిసి చేసుకోవచ్చు అంటాననుకున్నావా? అదేం కాదు. కారుణ్య అన్నీ రడీ చేసి తీసుకు వచ్చేసింది. నువ్వేం దిగులు పడకు. హాయిగా అమ్మతో కబుర్లు వేసుకో".

    "ఎందుకురా శ్రమ?" అంది కారుణ్యను ప్రేమగా చూస్తూ.

    "శ్రమకాదు మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేద్దామని" అంత కంటే చిలిపిగా సమాధానమిచ్చిందామె. 

    "అరేయ్! విద్యా నీతో చదరంగం ఆడి చాలా రోజులయింది. ఒక పట్టు పడదామా?"

    "నేను రడీ!" అన్నారాయన ఉత్సాహంగా.

    "నేను ఓడిపోతే మళ్ళీ గెలవాలని నువ్వు, నువ్వు గెలిస్తే మళ్ళీ నిన్ను ఓడించాలని నేను ఎంత పోటీ పడేవాళ్ళం?"

    "అవునురా వివేకా! అలా గంటలు మనకు తెలియకుండానే దొర్లిపోయేవి. వీళ్ళిద్దరూ ఏరి?"

    "ఇంకేముంది పెరట్లో 'దాయాలు' ఆడుతూ ఉండి ఉంటారు"

    అహ్హహ్హ... ఇద్దరూ నవ్వుకున్నారు ఆనందంగా.

    పిల్లలిద్దరూ తాతయ్యల  ప్రక్కకు చేరి ఆటను గమనిస్తున్నారు.

    కారుణ్య, కృష్ణ అమ్మకీ, అత్తయ్యకీ జోడీలయ్యారు.

    కడుపులో ఆత్మారాముడు గోలపెట్టడంతో ఆటలకు స్వస్తి చెప్పి భోజనాకుపక్రమించారు.   

    కారులోంచి సామానులు అన్నీ తియ్యటం కృష్ణ వంతు. చేరవేయటం పిల్లలు. సర్దటం కారుణ్య.

    అప్పటికే ప్లేట్లు, గ్లాసులు సర్దేసారు రూపా, విశాల. 

    అందరి మధ్య కబుర్ల రైళ్ళు పరుగెట్టాయి. విశేషాలు ఊర్లై సందడి చేసాయి. అరుపులు చుక్.. చుక్‌లై, కేకలు కూ... కూ...లుగా ఆ ప్రదేశమంతా నవ్వుల ప్లాట్‌ఫారంలా కళకళలాడింది.

    సాయంత్రం అవడంతో అందరి ముఖాల్లో దిగులు మేఘాలు క్రమ్ముకున్నాయి. అలా ఒక రౌండు వేసారు తోటలోకి. దోర మగ్గిన మామిడి పళ్ళను చేతితో కోసుకొని నోటితో కొరికి తిన్నారు. అందులో మజాను ఆస్వాదించారు. తిరుగు ప్రయాణాని కుపక్రమించారు.

    "అమ్మా! దారిలో నాన్నగారికి రెయిన్ కోటు, నీకు స్వెట్టర్ కొనుక్కుందాం. ఈసారి అన్నీ ఎక్కువేనట."

    "అలాగే లేరా!" అందావిడ పాతవి ఉన్నాయిగా అన్న మాటను గొంతులోనే మింగేస్తూ.

    తమ చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం ఉన్న కాస్త సంపాదనను పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ సాదా సీదా జీవితాన్ని గడిపారు. ఇప్పుడయినా తను సంతోష పెట్టాలి. అందుకే వారి ఆనందం కోసం లక్షలు గుమ్మరించటానికి కూడా తను వెనుకాడటం లేదు. అందుకే ఇందాక మామయ్యతో రహస్య మంతనాలు కూడా జరిపాడు తండ్రికి తెలియకుండా.

* * *

    పార్కు అంతా సందడి సందడిగా ఉంది. కానీ పరశురామయ్యలో మాత్రం ఆకాశమంత దిగులు. దానిని కాస్త తగ్గించుకోవటానికి విద్యాసాగర్‌ని పిలిచాడు. వస్తూ ఉండి ఉంటాడు.

    నూరేళ్ళ ఆయుష్షు అన్నట్లు ఆయన అప్పుడే వచ్చారు "ఏమిటిరా సంగతి" అంటూ.

    "ఏముందిరా రోజురోజుకు ఇంట్లో నా పరిస్థితి హీనమయైపోతోందిరా. వాళ్ళను నమ్మి నాకున్న ఆస్తినంతా ఇచ్చేసినందుకు నన్ను వృద్ధాశ్రమానికి పొమ్మంటున్నారురా."

    కళ్ళలో బాధ గొంతులోకి తన్నుకొస్తోంది.

    "నేను మీ పిల్లలతో మాట్లాడుతాను లేరా!"

    "మాట్లాడితే మారే రకాలా వాళ్ళు?"

    "మర్యాదగా వినకపోతే బెదిరిస్తాను"

    "ఎలా?"

    "వాళ్ళదారులు వారికుంటే మనదారు మనకుంటాయి. ఆరోగ్యం సరిగాలేని సమయంలో బలవంతంగా నాచేత సంతకం పెట్టించుకున్నారని కోర్టులో కేసు నీ చేత వేయిస్తానంటాను. దెబ్బకి దిగి వస్తారు."

    "ఎంత నాటకం ఆడారురా! వీళ్ళు నేను కని, పెంచిన పిల్లలేనా అనిపిస్తోంది? ఎంత నిస్వార్థంగా వాళ్ళను ప్రేమించాను? నోట్లోంచి మాట రాకుండానే అన్నీ కొనిపెట్టిన నాకు నోటికింత ముద్ద నందివ్వలేక పోతున్నారు. నా సంపాదనే నాకు ఖర్చుపెట్టలేక పోతున్నారు. ఇక వాళ్ళ దయితే నన్ను బ్రతికుండగానే శ్మశానానికి తోలేస్తారేమో!"

    "అంతంత మాటలెందుకు లేరా! నేను చూసుకుంటానన్నానుగా. వదిలెయ్. ప్రశాంతంగా ఉండు."

    "ఎక్కడ ప్రశాంతత? అది నా జీవితంలో దొరుకుతుందని నమ్మకమే లేకుండా పోయింది."

    "అలా వైరాగ్యపు మాటలు వద్దు. రేపటిలోగా నీ సమస్యను తేల్చేస్తానని అన్నానుగా"

    "సరే! చూద్దాం!"

    అనుకున్న వారిద్దరూ మళ్ళీ కలవలేనంత దూరంగా విడిపోయారు. ప్రశాంతత దొరకదన్న ఆయనకు శాశ్వత ప్రశాంతత ప్రసాదించాడు భగవంతుడు. దొంగ ప్రేమలు, దొంగ ఏడూపులతో పది రోజులు నాటకాన్ని రక్తి కట్టించారు. పదవ రోజు, పదకొండవ రోజు కార్యక్రమాలు మాత్రం ఘనంగా జరిపించారు. 

    బ్రతికుండగా ఆయన్ని పట్టించుకోలేదు కానీ ఆత్మశాంతి కోసం తెగ ఖర్చు పెట్టేశారు. అలా చెయ్యకపోతే దెయ్యమై పీడిస్తాడని భయం కాబోలు!

    విద్యాసాగర్ కళ్ళనించీ రెండు కన్నీటి బొట్లు రాలాయి పరశురామయ్య గారి ఆత్మశాంతి కోసం.

    నాకోసం కన్నీళ్లు కార్చేవాడు ఒకడున్నాడని పరశురామయ్య ఆత్మ ఆనందంతో గెంతులేసింది. 

    నిజంగా దెయ్యమయ్యి పిల్లలను పీడించాలనుకోలేదు. తండ్రి మనసు మరి. అది ఎప్పుడూ పిల్లల బాగునే కాంక్షిస్తుంది.

* * *

    "అమ్మా మిమ్మల్ని ఈరోజు ఎక్కడికి తీసుకు వెళుతున్నానో తెలుసా?"

    "లేదురా! ఎవరిదైనా పెళ్ళి ఉందా?" 

     "పెళ్ళి కాదమ్మా! అంతకన్నా గొప్పదే"

    "ఏమిటో నువ్వే చెప్పు"

    "ఊహు! చెప్పను! చూపిస్తాను"

    "నీదంతా సస్పెన్సేరా! నాన్నకైనా చెప్పావా?"

    "అబ్బో! నాన్నకు చెబితే నీకు చెప్పకుండా ఉంటారా?"

    నవ్వుకుందావిడ లోలోపల.

    "ఈ రోజెక్కడికో?" అనుకుంటూ వచ్చి కారెక్కాడు విద్యాసాగర్. చిన్నప్పుడు వీడిని తనెంత ఆనందపెట్టాడో తెలియదు కానీ వీడు మాత్రం నవ వసంతంలా రోజుకో సంతోషాన్ని అందిస్తున్నాడు.

    కారు నిమ్మకూరు వైపు కదిలి పోతోంది.

    "అరె! మన ఊరండీ!" ఆశ్చర్యంగా అంది రూపాదేవి.

    వాళ్ళిద్దరూ మేనత్త, మేనమామ బిడ్డలు. ఒకే స్కూల్లో, ఒకే ఇంట్లో పెరిగి పెద్దవారయ్యారు. ఇక అర్థమైపోఅయింది. వీడు తమ ఇంటికి తీసుకు వెళ్తున్నాడని.

    కనుమరుగవుతున్న ప్రదేశాలను, వాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కబుర్లలో పడ్డారు. 

    సడన్ బ్రేకుతో కారు ఆగటంతో వాళ్ల కబుర్లూ ఆగాయి.

    ఎదురుగా తాము చదువుకున్న జిల్లా పరిషత్ హైస్కూలు.

    రంగురంగుల కాగితాలతో అలంకరించారు.

    'ఈ రోజు ఆగష్టు 15 కాదే' విద్యాసాగర్ ఆలోచిస్తున్నాడు. 

    రూపాదేవి అయితే ఇంకా ఆశ్చర్యంలోనే ఉంది.

    అప్పటిదాకా గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్న వారంతా కారు ఆగటంతో ఒకరి తర్వాత ఒకరుగా నెమ్మదిగా ఆ జంటను చేరారు.

    వాళ్ళలో కొందరు తమ తోటి టీచర్లు, మరి కొందరు స్టూడెంట్స్. అందరినీ ఒక్క చోటు చూడటం వారిద్దరికీ కనుల పండుగలా ఉంది. 

    ఒక్క 'సిరిపురం' వెళ్ళి స్నేహితునితో గడిపి వస్తేనే ఎంతో ఆనందించాడు. అలాంటిది ఇంతమంది స్నేహితులు ఒక్కసారి వచ్చి ముందు నిలుచుంటే... మాటలు కరువవుతున్నాయి. 

    కృష్ణకిరణ్ ఎక్కడని ఆయన కళ్ళు వెతుకుతున్నాయి.

    కారును ఒక ప్రక్కగా పెట్టి అప్పుడే లోపలికి వస్తున్నాడు అతను.

    ఒక్కసారి వెళ్ళి ఆప్యాయంగా అతని కౌగిలించుకుని వెన్ను తట్టారు.

    కళ్ళతోనే సమాధానమిచ్చాడు కృష్ణకిరణ్.

    కబుర్లు ముచ్చట్లు అయ్యాక పది గంటలకు సభ ప్రారంభమైంది.

    సభ ముఖ్యోద్దేశాన్ని కృష్ణకిరణ్ తన మాటల్తో తెలియపరచటం ప్రారంభించాడు.

    నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు విచ్చేసిన నాన్నగారికి స్నేహితులకు, శిష్యులకు, వారి వారి కుటుంబాలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరి చిరునామాలను సేకరించటంలో ఎందరో నాకు తోడ్పడ్డారు. వారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి సహాయానికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు.

    మా అమ్మ, నాన్నగార్ల పేరిట ఏదైనా మంచి పని చెయ్యాలని ఎప్పటి నుంచో ఒక కోరిక నాలో మిగిలి పోయింది. 'రూపాసాగర్' పేరుతో ఒక ట్రస్ట్‌ను, ఒక కాలేజీని మన ఊరిలో నిర్మించాలని నిశ్చయించాను. దీనితో ఉన్నత చదువులకు మన ఊరి పిల్లలు వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలాగే బీదరికం, అనాథననే భావన ఎవరిలో ఉండకూడదనేది ట్రస్ట్ ఆశయం. ఏ తోడూ లేని వారికి మా ట్రస్ట్ అమ్మగా, నాన్నగా నిలబడుతుంది. వారికి ఉచిత విద్య, వసతి, భోజనాలను అందచేస్తుంది. 

    ఈ శుభకార్యానికి మీ అందరి ఆశీస్సులు కావాలి.

    తమకు చదువు చెప్పిన గురువుగార్లను అమ్మా, నాన్నగార్లు సత్కరిస్తారు. ఆ పైన విందు కార్యక్రమం. అందరూ భోజనం చేసి ఆటపాటలలో పాల్గొని వెళ్ళవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.

    తప్పట్లతో ఆ ఆవరణ ఆంతా ఒక్కసారి మారుమ్రోగి పోయింది. సన్మానాల కార్యక్రమాలు ముగిసాక స్కూలు యాజమాన్యం ఉడుతా సాయంగా చిరు సత్కారాన్ని ఆ దంపతుల కందజేసారు.

    షామియానా క్రింద ఆ తర్వాత పిల్లలూ,పెద్దలూ కేరింతలతో ఆ ప్రాంగణం అంతా కళకళలాడింది.

    సూర్యాస్తమయం వేళ వీడ్కోలు తీసుకున్నారు.

    అప్పటిదాకా ఉన్న ఆనందం ఆవిరయిపోయి వేదన మబ్బు కళ్ళలో కన్నీళ్ళ రూపంలో వర్షంలా జారింది.

    అందులో కూడా తీయని అనుభూతి.

    ఆ ఆస్వాదనలో తమని తాము మరచిపోయిన ఆ దంపతులకు మరో గొప్ప అనుభూతి. కళ్ళెదురుగా వారి అనుబంధాల లోగిలి.

    గత పాతికేళ్ళుగా తమ సంసార జీవనాన్ని గడిపిన తమ ఇల్లు పెళ్ళికూతురిలా రంగు రంగుల దీపాలతో వెలిగిపోతోంది.

    ఇంటి ముందు స్థలం ఇరుగు పొరుగులతో, ఊరి వారితో, బంధువులతో కిటకిటలాడుతోంది. ఆహ్వానించటానికి వస్తున్న కూతురు, అల్లుడు, పిల్లలు.

    అడుగులో అడుగు వేస్తూ గేటును సమీపించిన ఆ జంటకు 'షష్ఠి పూర్తి ఆహ్వానం' అన్న బేనరు స్వాగతం పలికింది. దానికి ఇరువైపులా తామిద్దరి ఫోటోలు. సిగ్గు పడ్డారు కొత్త జంటలా ఒక్క క్షణం. అభినందనల వెల్లువలో ఆ బిడియం ఎటో వెళ్ళిపోయింది.  

    కృష్ణకిరణ్ దూరంగా నిలబడ్డా తల్లితండ్రుల కళ్ళలో కనిపించే వెలుగులను గమనిస్తూనే ఉన్నాడు. అందులో అనుబంధానికి అర్థం వెతుక్కుంటున్నాడు. 

    "ఏరా! నా అవసరం ఏమీ ఉండదులేరా! ఇక నే వెళ్ళి రానా!" డాక్టర్ ఫ్రండ్ ప్రశ్నకు ఉలిక్కిపడుతూ

    "ఓరేయ్! నువ్వు డాక్టరుగా ఉండక్కర్లేదు. కానీ స్నేహితునిగా ఉండనంటే చంపేస్తా!" అన్నాడు.

    అతని ఆప్యాయతకు చలించిపోయాడు.

    ఇన్నాళ్ళూ ఇతను తన కుటుంబాన్నే ప్రేమిస్తాడను కున్నాడు.

    కాదు. అందరినీ ప్రేమిస్తాడు.

    అందరినీ ఆదరిస్తాడు.

    నిజమే! ఇతను ప్రేమైక జీవి.

    కళ్ళలో చిప్పిల్లిన భాష్పాలను చేతి రుమాలుతో ఒత్తుకుంటూ కృష్ణకిరణ్‌ను కౌగిలించుకున్నాడు.

    సూర్యుడు తన కిరణాలతో జగత్తును వెలుగులో నింపుతాడు. అలాగే కృష్ణకిరణ్ తన చుట్టూ మానవత్వ కిరణాలను చంద్రుడు వెన్నెలను పరిచినట్లు పరుస్తూనే ఉంటాడు. 

    ఆ వెన్నెలలో కరిగిపోతూ మనమూ అలా మారాలని ప్రయత్నించడమే మన పని. 

(నవ్య వీక్లీ డిసెంబర్ 19, 2012 సంచికలో ప్రచురితం) 
Comments