అనుకున్నదొక్కటి..! - పులిచెర్ల సాంబశివరావు

    
     
'ఎచ్చులకు ఏటపాలెంపోతే తన్ని తలగుడ్డ తీసుకున్నట్లు' అయింది సుబ్రావ్ పని!

    పట్టుబట్టి హైడ్రాబ్యాడ్ ట్రాన్స్ఫర్ చేయించుకొస్తే అక్కడ పడరాని పాట్లు పడుతున్నాడు. హైడ్రాబ్యాడ్లో అన్నీ అతే! జనం, ధనం, రోగం, భోగం, పొగ, సెగ, ప్రేమ, దోమ అన్నీ!

    సుబ్రావ్ సర్వీసంతా బ్యాడే! నిజామాబ్యాడ్, ఔరంగాబ్యాడ్, అహమదాబ్యాడ్, అలహాబ్యాడ్ ... ఇప్పుడు హైడ్రాబ్యాడ్!

    సుబ్రావ్ హైడ్రాబ్యాడ్లో ఓ బ్యాంక్ సహాయాధికారి - అంటే అసిస్టెంట్ మేనేజరన్నమాట! ఉన్నమాట ఏమిటంటే పేరుకు సహాయాధికారేగాని సుబ్రావ్ నిజానికి అసహాయ, నిస్సహాయ 'వ్యధ'కారి! అతడి జాతకం ఏంటోగాని ఇంట్లో వంట పనిలోగాని, బ్యాంక్‌లో ఎకౌంటు పనిలోగాని ఎవరూ సాయం చేయరు. ప్రతివాళ్లూ 'ఆలికి అన్నంపెట్టి, ఊరును ఉద్ధరించాం' అని ఫోజు పెట్టినట్టు తమ పని వరకు తాము సరిపెట్టుకొని ఇంటి ముఖం పట్టేవాళ్లేగాని సుబ్రావ్‌కి చేయూతనిచ్చేవాళ్లే కరువయ్యారు.

    ఈ మాత్రం భాగ్యం కోసం భాగ్యనగర్‌కి ట్రాన్స్ఫర్ చేయించుకు వచ్చి చచ్చాడు! ఇప్పుడేమైంది? వానొస్తే రోడ్లపై వరద! అటు ఆఫీసుగ్గానీ, ఇటు ఇంటిగ్గానీ చేరేదాకా నమ్మకం లేదు! ట్రాఫిక్ జామింగ్, పోలీస్ చెకింగ్! టీవీల్లో హాట్ హాట్ న్యూస్! నో మెంటల్ పీస్!

    ఇలాంటి పరిస్థితిలో సుబ్రావ్ బాల్యమిత్రుడు అప్రావ్ పనిమీద హైడ్రాబ్యాడ్కి వచ్చి, పలకరించిపోదామని పాత మిత్రుడి వద్దకు వచ్చాడు. నగర జీవితం ఎంత వగరుగా వుందీ వర్ణించి వర్ణించి వాపోయాడు సుబ్రావ్. 'బోరుకొడుతుంటే మా వూరికి రా' అని ఆహ్వానించాడు అప్రావ్. 'వస్తాడా చస్తాడా' అని అప్రావ్ అనుకున్నాడు గాని సుబ్రావ్ సంక్రాంతికి సకుటుంబ సమేతంగా ఊడిపడతాడని అతను కలలోగూడా తలచలేదు!

* * *

    అప్రావ్ది పల్లెపాడు.

    పేరును బట్టే తెలుస్తోంది కదా అదొక మారుమూల పల్లెటూరు అయివుంటుందని. తెలుగునాట పల్లెటూరు, అందునా సంక్రాంతినాడు అనగానే సుబ్రావ్ ఊహల ఉయ్యాలలో, కలల అలల్లో ఊగాడు, తూగాడు.

    తెలుగునాటి శౌర్యాన్ని తెలియజెప్పే కోడి పందేలు, స్త్రీల కళాప్రవీణ్యాన్ని ప్రదర్శించే రంగవల్లికలు, మరుగునపడ్డ తెలుగుమాట తేటను తెలిపే గంగిరెద్దువాడు, అంబరాన్నంటే గొబ్బి సంబరాలు! ఇవన్నీ ఊహించడు.

    నగరంలో పిజ్జాలు, బర్గర్లు, ఐస్‌క్రీములు, కూల్‌డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్ తిని తాగి అతని నాలుక చచ్చిపోయింది. పల్లె తల్లిలాంటిది. అమ్మ చేతివంట ముందు అమృతం ఎందుకు పనికొస్తుంది? భార్య చేతి పంచభక్ష్య పరమాన్నంకన్నా - తల్లి చేతి తవిటిరొట్టె మేలు! ఇలాంటి నానుడిలన్నీ గుర్తుకొచ్చాయి. చిక్కటి పాలల్లో కాగిన తియ్యని పాయసం, కరివేపాకు ఘుమఘుమలతో పైర వంకాయ కూర, కొత్తబెల్లం వేసి చేసిన గుమ్మడిపండు ముదురు పులుసు, గడ్డ పెరుగు, ఎర్ర ఎర్రటి పండు మిరపకాయల పచ్చడి ...! ఇవన్నీ గుర్తొచ్చి నోరూరించాయి.

    పల్లెటూరు వాసనే వేరు. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన మనసులు! బంతిపూలు విరగ పూస్తాయి. పైరు పంటలు విరగ కాస్తాయి. కోతకు సిద్ధమైన వరిచేలు బంగారు రంగుతో మెరిసిపోతూ వుంటాయి. ఎర్రగా పండిన మిరపపండ్లు, పసుపు పచ్చటి గుమ్మడిపూలు, ఆకుపచ్చటి పొలాలు అన్నీ కలిసి పంచరంగుల రామచిలకలవలె మెరిసిపోతాయి. కుండలకొద్దీ పాలనిచ్చే గేదెలు, రైతుల ముఖాన చిరునవ్వుల చిద్విలాసాలు! ఓహ్ ...

    వీటన్నిటినీ మదిలో పదేపదే తలచుకుంటూ సుబ్రావ్ రైల్లోంచి సకుటుంబంగా దిగి, పల్లె వెలుగు బస్సునెక్కి పల్లెపాడు చేరాడు.

* * *

    కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా సుబ్రావ్ అంతకుముందు గ్రామీణ జీవన సౌందర్యాన్ని అదే పనిగా అభివర్ణించి చెప్పాడు భార్యాబిడ్డలకు. వాళ్లు నిజమేననుకొని నోరు తెరుచుకొని, కళ్లు విప్పార్చుకొని, బస్సులోంచి బయటకు చూస్తున్నారు - అటువంటి దృశ్యాలు కనబడతాయేమోనని. ఎన్నడూ దొరకనమ్మకు ఏగాని దొరికితే ఏడు ముళ్లు వేసిందన్నట్టుగా రోడ్డు పక్కన అక్కడక్కడ కనపడిన జిల్లేడు పొదల్నే కన్నుల పండగ్గా చూశారు వాళ్లు. ఎక్కడా ఆవులమందగాని, గొర్రెలమందలుగాని, ఆఖరికి బర్రెలమందలుగాని కలికానిక్కూడా కంటపడలేదు.

    బర్రెలూ గొర్రెలూ కనపడకపోతే పోయె, కోళ్లూ కుక్కలైనా కనబడతాయేమోనని పిల్లలు కళ్లలో వత్తులేసుకొని సందు సందునా గాలించినా కనీసం పంది పిల్ల కూడా కంటపడలేదు! అలా అని ఇతర ప్రాణులేవీ లేవనుకోగూడదు. ఊరు దగ్గరయ్యేకొద్దీ దోమల గోల ఎక్కువైంది.

    "బర్రెల్లాగా బలిశాయమ్మా ఈ దోమలు!'' అంటూ వాటి కాట్లు పడలేక సుబ్రావ్ భార్య రాగాలు తీసింది.

    పల్లె వెలుగు బస్సు ఊళ్లోకి ప్రవేశించింది. పల్లెటూరు అనగానే బొడ్రాయి, వేపచెట్టూ, అరుగూ, చెరువూ ఉంటాయనుకొన్న సుబ్రావ్ ఊహ పటాపంచ లైంది. పంచె కట్టుకున్న వాడు ఒక్కడైనా వుంటే ఒట్టే! పశువుల కొట్టాలూ, పూరిపాకలూ, పెంకుటిళ్లూ ...! ఇదీ సుబ్రావ్ బుర్రలో పల్లెటూరి స్వరూపం. కానీ, ఇప్పుడక్కడున్నది పక్కా బిల్డింగులు! జీన్స్ ప్యాంట్లూ!

* * *

    "సుబ్రావ్, బస్సులో ఎందుకూ? ఫోన్ చేస్తే కారు పంపించేవాణ్ణిగా'' అన్నాడు అప్రావ్.

    "పల్లెటూరులో కారు ఉండదేమోననీ''.

    "నీ బొంద. ఈ పల్లెలో నానో నుండి నానా రకాల కార్లూ వున్నాయి''

    హాల్లోని సోఫాలో కూలబడుతూ "భలే బావుంది. ఎక్కడ కొన్నావ్?'' అని ప్రశ్నించాడు సుబ్రావ్.

    "ఇంపోర్టెడ్. మొన్న మావాడొకడు ఇక్కడ అపార్ట్మెంట్స్ కట్టిస్తూ చైనా నుండి టైల్స్‌తో బాటు ఈ సోఫాసెట్ కూడా తెప్పించాడు''

    "హాయ్ ... అంకుల్, హాయ్ ... ఆంటీ. హాయ్ నాటీ బోయ్. హౌ ఆర్ యూ?''

    సుబ్రావ్, అతని భార్యా పిల్లలూ అటువైపు చూశారు.

    స్లీవ్‌లెస్, బాబ్డ్ హెయిర్, లిప్‌స్టిక్ ... జీరో నైజ్ అమ్మాయి ఒకత్తె కనిపించింది.

    "ఎవరండీ ఈ అమ్మాయి?'' ఆశ్చర్యంతో అడిగింది సుబ్రావ్ భార్య.

    "మా అమ్మాయే. బ్యూటీ పార్లర్ నడుపుతోంది'' అప్రావ్ పరిచయం చేశాడు.

    పల్లెటూళ్లో బ్యూటీ పార్లరా? ఆశ్చర్యంతో నోరు తెరిచింది సుబ్రావ్ కుటుంబం.

    "స్నానం చేసిరండి. భోంచేస్తూ మాట్లాడుకుందాం'' అప్రావ్ ఆప్యాయంగా అతిథి మర్యాదలకు నాంది పలికాడు.

    ఇటాలియన్ స్టైల్ బాత్రూం. టైల్స్ ధగధగలాడిపోతున్నాయి. రన్నింగ్ హాట్ అండ్ కోల్డ్ వాటర్!

    "నీ టేస్ట్ బెస్ట్‌రా అప్రావ్. లేటెస్ట్గా కట్టించావ్ హౌస్''ప్రశంసించాడు సుబ్రావ్.

    "ఆఁ ... నాదేముంది? ఈ వూళ్లో వెంకట్రావ్ల, శ్రీనివాస్‌ల ఇళ్లు చూడాలి...''

    "వాళ్లా! వాళ్లకి ఉంటానికీ తింటానికీ కూడా సరిగా ఉండేది కాదు గదా...''

    "నువ్వెక్కడో త్రేతాయుగంలో ఉన్నావ్. ఇప్పుడు ఈ వూళ్లో కోటేశ్వరుడు కానివాడు ఒక్కడు కూడా లేడు''

    "ఎలా?''

    "లోగడ ఎకరం యాభైవేలుండేది. రియల్ బూం రాగానే భం అని టౌనుకు పదిమైళ్ల అవతలగూడా ఎకరం కోటి దాటింది''

    టేబుల్‌పై భోజన పదార్థాలన్నీ ధగధగలాడే పాత్రల్లో నీట్‌గా పెట్టి వున్నాయి. సాస్‌లు, ఛీజ్‌లు, టిన్డ్ ఫుడ్స్, పాక్డ్ ఐటమ్స్!
గారెల్లేవు బూరెల్లేవు, పాయసం లేదు గోంగూర పచ్చడి లేదు, పులిహోర లేదు, పాల తాలికల్లేవు! ఇక పైర వంకాయకూర, గుమ్మడి పులుసు, గడ్డ పెరుగు ... ఏవీ? ఎక్కడా?

    "నాకు పల్లెటూరి వంటలంటే భలేయిష్టంరా'' ఉండబట్టలేక సుబ్రావ్ అన్నాడు.

    "సుబ్రావ్, అవన్నీ మన చిన్ననాటి ముచ్చట్లు. ముందు భోంచేయ్. తరువాత మాట్లాడుకుందాం''.

    ఇన్నాళ్లూ పిజ్జాలు బర్గర్లు వంటి రంగుల రసాయన పదార్థాలు కలిపిన ఆహారం తినగూడదని పెళ్లాం పిల్లలకు తెగ హిత బోధ చేసిన సుబ్రావ్ ఇప్పుడు అవే తినవలసి వచ్చినందుకు లోలోన తెగ బాధపడిపోయాడు.

    ఇప్పుడనుకొని ఏం లాభం? తల గొరిగించుకున్న తరవాత తిథి నక్షత్రం చూసుకుంటే ఏం ఫలం? అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊడిపొయ్యాయట!

* * *

    మెత్తటి పరుపు మీద నడుం వాల్చాడేగాని ముళ్ల కంప మీద ఉన్నట్లుంది.

    "అంతా భ్రాంతియేనా?'' దూరపు కొండలు నునుపు అన్నట్లు ఇన్నాళ్లూ పల్లెల్ని దగ్గరనుండి చూడక ఏవేవో భ్రాంతులకు లోనయ్యాడు. కంచం చెంబు బయట పారేసుకొని రాయిరప్ప లోపలేసుకున్నట్లున్నది తన పరిస్థితి.

    ఏదో వాసన వస్తున్నది.

    గాలి గట్టిగా వీచినప్పుడల్లా అది ఘాటుగా తగుల్తున్నది. ముక్కులు పగిలే దుర్వాసన. హైడ్రాబ్యాడ్ నల్లాల్లోంచి కూడా వెలువడనంత బ్యాడ్ స్మెల్! భరించలేక బయటకు వచ్చి అప్రావ్ను లేపి అడిగాడు. అప్రావ్ సుబ్రావ్ను ఇంటిపైకి వెంట పెట్టుకుపోయి పల్లె అవతల తెల్లగా వెలువడుతున్న పొగ చూపాడు. "పగలైతే బాగా కనబడుద్ది'' అన్నాడు.

    "ఏంటవి?''

    "తోళ్ల కంపెనీ. ఆ తూర్పు వేపున ఉన్నది ఎముకల పరిశ్రమ''

    "ఎముకలా?''

    "చచ్చిన జంతువుల ఎముకల్ని తెచ్చి, వాటిల్లోంచి ఆయిల్ తీస్తారంట ...

    ... గవర్నమెంట్ కొత్తగా ఓ కెమికల్ ఫ్యాక్టరీకి కూడా పర్మిట్ ఇచ్చిందట ...

    ... అతి కష్టంపై దాన్ని ఆపించాం. పద. పగలంతా జర్నీ చేసొచ్చావు. ప్రశాంతంగా పడుకో''.

    "అబ్బా! ఇదేం గబ్బురా బాబూ! దీనికంటే హైడ్రాబ్యాడ్ గబ్బే నయంగదా'' అంటూ అలా కళ్లు కొద్దిగా మూసుకున్నాడో లేదో ...

    " ... చంపండి! పొడవండి! నరకండి!'' అని భీకరంగా కేకలు వినబడ్డాయి.

    బయటకి రావడానికి భయపడి బితుక్కు బితుక్కుమంటూ తెల్లవారుజాము దాకా గడిపి, ఎప్పుడో తెల్లవారుజామున కాసేపు కునికాడు సుబ్రావ్!

* * *

    రాత్రి వినబడిన అరుపులేంటని పొద్దున్నే అప్రావ్ని అడిగాడు.

    "అవి మాకు మామూలే! మా వూళ్లో తాగుబోతులూ పేకాట రాయుళ్లూ కొంచెం ఎక్కువలే. తన్నుకోని రోజులు తక్కువ'' అని తేలిగ్గా చెప్పేశాడు అప్రావ్.

    మిగతావి ఎలాగున్నా భక్తి మాత్రం ఆ వూరి వాళ్లకి ఎక్కువే అని చెప్పాలి. అన్ని మతాలవాళ్లూ పోటీలు పడి, తెల్లవారుజామున మైకుల సౌండ్ పెంచి, స్వర్గలోకంలో ఉండే దేవుడికి వినబడేట్లు చేస్తున్న ప్రయత్నాలకు సుబ్రావ్ గూబలు గుయ్మన్నాయి. సౌండ్ పొల్యూషన్ విషయంలో పల్లెపాడుముందు హైడ్రాబ్యాడ్ ఎందుకూ పనికిరాదు అనుకున్నాడు.

    ముత్యాల ముగ్గులు కనబడతాయేమో అని బయటకొచ్చి చూస్తే నున్నని సిమెంట్ రోడ్డు దర్శనం ఇచ్చిందేగాని సన్నటి గీత ఒక్కటైనా గీసుంటే ఒట్టు. గొడ్లే లేవు గొబ్బెమ్మ లెక్కడినుంచి వస్తాయి?

    ఏనుగులే ఎగిరిపోతున్నాయంటే, మరి దోమలో అన్నాట్ట వెనుకటికొకడు! హరిదాసుల సంగతి అడగనే అక్కర్లేదు.

    "తినకుండా రుచి, దిగకుండా లోతూ తెలియవు గదా!

    ఇన్నాళ్లూ పల్లెటూరు గురించి ఏవేవో పగటి కలలు కన్నాడు తాను! జీలకర్రలో కర్రలేదు. నేతిబీరలో నెయ్యి లేదు! పల్లెటూరులో పల్లె కల్ల! పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కృత్రిమమైన నగరపు హంగులన్నిటినీ మన పల్లెలు అంటించుకొని మన పల్లెలు అఘోరిస్తున్నాయి! అనుకొన్నదొకటి అయినది వేరొకటి'' అనుకుంటూ సుబ్రావ్ హైడ్రాబ్యాడ్కి ముఖం వేలాడేసుకొని తిరుగుప్రయాణం పట్టాడు.

(ఆదివారం ఆంధ్రజ్యోతి 1 మే 2011 సంచికలో ప్రచురితం) 
Comments