అవచారం - ఆరి సీతారామయ్య

        
    కేసు ఫైలు జాగ్రత్తగా చదివింది కమల.     రోగి పేరు ఎమిలీ. యాభై మూడు సంవత్సరాల వయసు. హైస్కూల్ టీచర్. ఇంతకు మునుపు జబ్బేమీ ఉన్నట్టు లేదు. వారం రోజులుగా సరిగ్గా నిద్రాహారాలు లేవనీ, చాలా దీనంగా కనిపిస్తుందనీ భయపడి, భర్త ఆమెను డాక్టరుకు చూపించటానికి తీసుకెళ్ళాడు. ఆయన ఎమిలీకేదో మానసిక వ్యాధి అని నిర్ణయించి, హాస్పిటల్లో సైకియాట్రీ వార్డులో చేర్పించాడు.     హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఈఫైల్లో ఏమీ కనిపించటంలేదు. రోగి ఏదో దాస్తున్నట్లుంది. ఒకటి రెండు రోజుల్లో అసలు విషయం తెలుస్తుంది. బహుశ డ్రగ్సుకు సంబంధించిన కేసై ఉండొచ్చు అనుకుంది కమల.     మరుసటిరోజు ఉదయం వార్డులో ఎమిలీ బెడ్ దగ్గిరకొచ్చి, "హయ్! నాపేరు కమల. నేనిక్కడ సోషల్ వర్కర్ని. రాత్రి బాగా నిద్ర పట్టిందా మీకు?" అని అడిగింది.     "ఊ హూ, బాగానే పట్టింది," అంది ఎమిలీ, కొంచెం అనుమానంగా చూస్తూ. ఈ అమ్మాయిగూడా ఇండియన్ లాగుంది. వీళ్ళకసలు వైద్యం తెలుసో లేదో. ఇట్లా హాస్పిటల్ నిండా డాక్టర్లేగాకుండా, సోషల్ వర్కర్లుగూడా వీళ్ళే ఎందుకున్నారూ? తెల్లవాళ్ళంతా యేమయ్యారూ? ఈ తక్కువజాతివాళ్ళకి తన గురించి చెప్పుకోవలన్నా ఇబ్బంది గానే వుందామెకు.     ఏమన్నా అల్పాహారం తిన్నారా అని కమల అడిగితే, దానిక్కూడా తలూపుతూనే సమాధానం చెప్పింది ఎమిలీ.     "ఈమధ్య మీకు చాలా అలసటగా ఉండిందా?" అనడిగింది కమల.     "లేదు. మామూలుగానే ఉండింది."     "ఇంటిదగ్గర పనులెక్కువయ్యాయా ఈమధ్య?"     "లేదు."     "స్కూల్లో బాధ్యతలేమన్నా ఎక్కువయ్యాయా?"     "లేదు. నాకు స్కూలంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నంత సేపూ నన్ను నేను మర్చిపోతాను. కాలం ఊరికే గడిచిపోతుంది," అంది ఎమిలీ చిరునవ్వుతో.     ఇంటిగురించి క్లుప్తంగా జవాబు చెప్పిన మనిషి స్కూలు గురించి బారెడు సమాధానం చెప్పటంతో సమస్య ఇంటిదగ్గరే ఉండి ఉంటుందని గ్రహించింది కమల. కాని ఆమెతో స్నేహ సంబంధం ఏర్పడాలంటే కొంచెంసేపు స్కూలు గురించి మాట్లాట్టమే మంచిదనుకుంది.     "మీరేం పాఠాలు చెప్తారు స్కూల్లో?"     "ఇంగ్లీషు."     "ఎక్కడ చదివారింగ్లీషు?"     "అదెప్పుడో పాతికేళ్ళనాటి సంగతి. చికాగో యూనివర్సిటీలో ఎం.ఏ. చదివాను," అని, "నువ్వెక్కడ చదివావు?" అనడిగింది ఎమిలీ.     "మిషిగన్ యూనివర్సిటీలో చదివాను," అని, "మీకు పిల్లలున్నారా?" అనడిగింది కమల.     "ఇద్దరమ్మాయిలు. మా పెద్దమ్మాయిగూడా చికాగోలోనే చదివింది," అందామె గర్వంగా. "మా చిన్నమ్మాయి నీలాగే మిషిగన్‌లో చదివింది." నాకూతురుగూడా అక్కడే చదివిందిగాబట్టి నీమిషిగన్ చదువు ఫరవాలేదులే అన్నట్లు చూస్తూ.     "మీరు విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం గ్రూప్ థెరపీ నడిపేది నేనే. ఆప్పుడు మళ్ళా మాట్లాడుకుందాం," అని, నవ్వుతూ తన ఆఫీసువైపు వెళ్ళిపోయింది కమల.
* * *
    గ్రూప్ థెరపీ అంటే సామూహిక వైద్యం. పదిమంది మానసిక రోగులు ఒకచోట కూర్చోని మాట్లాడుకుంటారు. ఒక్కొక్కరు తమ జబ్బు గురించి, దానివల్ల పడుతున్న ఇబ్బందుల గురించీ చెప్పుకుంటారు. ఈ జబ్బుల గురించి గానీ, వాటిని వదిలించుకునే మార్గం గురించి గానీ ఎవరికి తోచింది వారు ఫ్రీగా చెప్తారు. తన వేదనల్ను మనసులో పెట్టుకొని కుంగిపోతున్న రోగికి ఇట్లా నలుగురితో చెప్పుకోవటం వల్ల కొంత భారం తగ్గటమేగాక, ఇలాంటి ఇబ్బందులు తనకేగాకుండా చాలామందికుంటాయని తెలుస్తుంది. ఇలాంటి చర్చలను ఒక దోవలో నడపటం, పనికిమాలిన మాటల్తో కాలం వృధా కాకుండా చూడటం సోషల్ వర్కర్ పని. రోగుల మధ్య జరిగే సంభాషణలను గమనిస్తూ, వాళ్ళు తమగురించి చెప్పుకునేదాన్నిబట్టి, ఇతరరోగుల విషయంలో వాళ్ళు వ్యక్తపరిచే అభిప్రాయాలనుబట్టీ, వాళ్ళ జబ్బుల గురించి కొంత అవగాహన ఏర్పరుచుకుంటుంది సోషల్ వర్కర్.     సాయంత్రం జరిగిన గ్రూప్ థెరపీలో ఎమిలీ మిగతావాళ్ళతో సులభంగానే కలిసిపోయింది. ఆగ్రూపులో డ్రగ్సు వాడటంతో డిప్రెషన్‌లో పడిపోయిన వాళ్ళున్నారు. భార్యో, భర్తో వదిలెయ్యటం వల్ల మానసికంగా దెబ్బ తిన్న వాళ్ళున్నారు. తాగుడువల్ల ఆరోగ్యం క్షీణించిన వాళ్ళున్నారు. తన గురించి మాట్లాడుతూ, బొత్తిగా తీరికలేకుండా ఉండటమే తన వ్యాధికి కారణం అని చెప్పింది ఎమిలీ. ఇంతకుముందు అలాంటిదేమీ లేదని కమలతో అన్నట్లు గుర్తొచ్చి, కళ్ళతోటే కమలకు క్షమాపణ చెప్పింది. "ఫరవాలేదు, మాట్లాడండి," అన్నట్లు జవాబుగా చూసింది కమల.     చిన్నప్పట్నుంచీ పెన్సిల్తోబొమ్మలు గీయటం ఇష్టం అట ఎమిలీకి. తన చిత్రాలు అప్పుడప్పుడూ ఎగ్జిబిషన్‌లలోగూడా ప్రదర్శించబడ్డాయట. కానీ దాదాపు పదిసంవత్సరాల్నించి తనకు బొమ్మలు గీయటానికి సమయం దొరకటంలేదట. ఎప్పుడూ ఏవో పనులుంటున్నాయట.     "శనాదివారాలేంజేస్తుంటావు? అప్పుడు గీసుకోరాదూ బొమ్మలు?" అందొకావిడ.     రెండుక్షణాలు మౌనంగా ఉండిపోయింది ఎమిలీ. కొంచెం తేరుకొని, "సోమవారం నుంచి శుక్రవారం దాకా చెయ్యటానికి వీలుగాని పనులన్నీ శనాదివారాలకు నెట్టుకుంటూ వస్తాను. అందువల్ల, అసలు శనివారం ఆదివారం సెలవురోజుల్లాగా వుండవు. పనికెళ్ళే రోజులకంటే అప్పుడే ఎక్కువ పనులుంటయ్," అంది ఎమిలీ నిస్సహాయంగా నవ్వుతూ.     ముఖకవళికల్నిబట్టి చూస్తుంటే ఈమెకు జబ్బంటూ ఉన్నట్లు ఎవరికీ అనిపించలేదు. కమలక్కూడా ఈమెజబ్బుకు కారణం ఏమిటో ఇంకా అంతుబట్టలేదు.
* * *
    రోగి కుటుంబంతో కలిసి మాట్లాడటం, జబ్బును గురించి వాళ్ళకేమైనా ప్రశ్నలుంటే సమాధానాలు చెప్పటం, కుటుంబ పరిస్థితుల గురించి వాళ్ళనడిగి రోగి మీద వాటి ప్రభావం గురించి ఆలోచించటం గూడా సోషల్ వర్కర్ బాధ్యతల్లో ఒకటి.     మరుసటి రోజు శనివారం. ఏమిలీ భర్త రాబర్టూ, పెద్ద కూతురు మార్షా వచ్చారు. తొమ్మిది గంటలకు రావాల్సినవాళ్ళు పదిహేను నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. వస్తూనే క్షమాపణలు చెప్పుకుంటూ, తల్లి హాస్పిటల్లో ఉండటం వల్ల తనకు చాలా ఇబ్బందిగా ఉందనీ, పిల్లలను చెల్లెలి ఇంటి దగ్గర వదిలేసి తిరిగి వచ్చేటప్పుడు ట్రాఫిక్ వల్ల ఆలస్యం అయిందనీ, వల్లె వేసింది మార్షా. "ఫరవాలేదు," అని, "పిల్లలు ఎంత వయసు వాళ్ళు?" అని పరామర్శించింది కమల. ఇద్దరు కొడుకులనీ, వయసు మూడు సంవత్సరాలూ, ఒక సంవత్సరమూ అనీ చెప్పింది మార్షా.
        ఇంటికి దగ్గర్లో ఎవరూ బేబీ సిట్టరు దొరకరా అని అడిగితే నవ్వుతూ, పిల్లలకు అమ్మమ్మ దగ్గిర బాగా అలవాటు అయిందనీ, అవసరమైనప్పుడల్లా పిల్లల్ని ఆమెదగ్గిరే వదిలేస్తుంటుందనీ, ఇప్పుడామె హాస్పిటల్లో ఉండటంవల్ల చాలా ఇబ్బందిగా ఉందనీ చెప్పింది మార్షా.
    ఇంకా తెలిసిన విషయాలేమిటంటే మార్షా వాళ్ళ పిల్లలేగాక, ఆమె చెల్లెలు ఎలిజాక్కూడా ఒక కూతురుంది. ఆ అమ్మాయికిగూడా మూడోయేడు. ఒక శనాదివారాలు మార్షా బిడ్డల్నీ, తర్వాతి శనాదివారాల్లో ఎలిజా కూతుర్నీ చూస్తుంటుంది ఎమిలీ. ఒక్కోసారి ఇద్దరూ తమపిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి ఏవో పన్లు చూసుకుంటుంటారు.     ఎమిలీ జబ్బుకు కారణం ఏమిటో తెలిసినట్లనిపించింది కమలకు. పాపం ఆమెకు అసలు తీరికేదీ?     "ఆరోగ్యం బాగుపడాలంటే ఎమిలీకి విశ్రాంతి చాలా అవసరం. ప్రతి శనాదివారాలూ మనవల్నో, మనవరాలినో చూసుకుంటూ ఉండటంతో, ఆమెకసలు తీరికలేకుండా పొయింది," అని మార్షాతో, రాబర్టుతో నిర్మొహమాటంగా చెప్పింది కమల. మార్షా దోషిలాగా నిలబడింది. ఇంటిదగ్గరున్న ఎలిజామీద అసూయ పొంగింది.     మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఎమిలీతో మట్లాడింది కమల. ముఖం చూస్తుంటే ఆమె రాత్రి బాగానే నిద్రపోయిందనిపించింది. బాగున్నారా అనడిగితే సౌమ్యంగా అవును అన్నట్లు తలూపింది.     "నాకు బాగానే ఉంది. ఇక డిస్ఛార్జి చేయించరాదూ?" అని అడిగిందామె.     "మీరు మనోవ్యాధితో ఇక్కడకొచ్చారు. దానికి కారణం తెలియకుండానే ఇంటికి పంపిస్తే మళ్ళా రెండురోజుల్లో తిరిగొస్తారు."     "అబ్బే, అదేంలేదు. మనోవ్యాధంటూ ఏమీలేదు. విశ్రాంతిలేక అలా అయింది. ఈరెండురోజుల్లో చాలా విశ్రాంతి దొరికింది. మళ్ళా ఇక్కడకు రావాల్సిన అవసరం ఉండదు."     "విశ్రాంతి దొరకటానికి జీవిత విధానంలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలో మీరు ఆలోచించారా?"     "ఏముందీ ఆలోచించటానికి? జీవిత విధానం మార్చుకోవటం అంత సులభమైన పనికాదు. ఎలాగో బండి నడుపుకుంటూ పోవటమే! నువ్వింకా చిన్నదానివి. జీవితం గురించి నీకంతగా తెలియదింకా."     "మార్పులు రావటం సులభంగాదు. నిజమే. కాని ఒక జీవిత విధానం మిమ్మల్ని రోగిగా తయారు చేసిందంటే, దాన్ని మార్చుకోలేకపోతే మీ ఆరోగ్యం చెడిపోతుంది," అని, ఈఘటం ఎలాగూ అసలు విషయం గురించి మాట్లాడదనుకుని, "మీరసలు శనాదివారాల్లో అంతగా చేసేదేమిటీ?" అని అడిగింది.     "నాకు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం ఇష్టం. పనికెళ్ళే రోజుల్లో ఇల్లు శుభ్రం చెయ్యటం వీలు పడదు. అందువల్ల, వాక్యూం చెయ్యటం, వంటగది ఫ్లోర్ తుడవటం, బాత్రూం శుభ్రం చెయ్యటం, బట్టలుతుక్కోవటం ఇవన్నీ శనాదివారాల్లోనే."     "నిజమే. కానీ ఇవి అందరూ చేసుకునే పన్లే. రెండురోజులు విరామం లేకుండా చేసుకోవటానికి సరిపడే పన్లుగాదు."     "శనివారం పదీ పదకొండు గంటలకల్లా పన్లన్నీ ఐపోవాలి. అప్పటికి మా మనవలూ, మనవరాలూ వచ్చేస్తారు. వాళ్ళొచ్చింతర్వాత పన్లు చేసుకోవటం వీలుపడదు."     "అంటే మీరు అమ్మమ్మలన్నమాట! ఆమాట చెప్పలేదేం మరి! ఎంతమంది పిల్లలు మీ అమ్మాయిలకి? ఎన్నేళ్ళుంటాయి?"     "పెద్దమ్మాయి మార్షాకి ఇద్దరబ్బాయిలు. వాళ్ళకి వయసు మూడు సంవత్సరాలూ, ఒక సంవత్సరం. చిన్నమ్మాయి ఎలిజాకు ఒక కూతురు. దానికీ మూడేళ్ళు."     "నెలకెన్నిసార్లొస్తారు పిల్లలు మిమ్మల్ని చూట్టానికి?"     "నెలకా? ప్రతి శనాదివారాలూ ఎవరో ఒకరు పిల్లల్ని నాదగ్గరొదిలేసి వెళ్తారు. ఒక్కొక్కసారి ఇద్దరికీ ఏవోపన్లుంటాయి. ఇద్దరి పిల్లలూ నాదగ్గిరే ఉంటారు."     "మరి మీవారున్నారుగా. ఆయన రిటైరయ్యారుగూడా. పిల్లల్నాయన దగ్గరొదిలేసి మీరు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవచ్చుగా?"     "ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. శనివారం ఎప్పుడొస్తుందా అని చూస్తుంటాడు పిల్లలొస్తారుగదా అని. కానీ ఆ టీవీలో ఎప్పుడూ ఏవో ఆటలొస్తూనే ఉంటాయి. వాటినిచూస్తూ పిల్లల సంగతి మర్చిపోతాడు. వాళ్ళేదో కిందకు లాగటమో, పైనపడేసుకోవటమో చేస్తుంటారు," అంది నిస్సహాయంగా ఎమిలీ.     "సరే. మీకెందుకు విశ్రాంతి లేదో మీకు బాగా తెలుసు. మరి పరిస్థితులు మారాలంటే ఏం చెయ్యాలో గూడా మీకు బాగానే తెలిసుంటుంది. కానీ ఆమార్పు ఎలా తీసుకురావాలా అనేదే ముఖ్యమైన విషయం."     "చూడు కమలా, నీపేరు కమలే కదూ? కమలా అని పిలుస్తాను నువ్వేమీ అనుకోకపోతే. తల్లులూ కూతుళ్ళూ ఉన్నంత కాలం కూతుళ్ళు తల్లుల మీద ఆధార పడుతూనే ఉంటారు. నాకు పిల్లల్ని చూట్టం వీలుగాదు, ఎవర్నైనా బేబీ సిట్టర్ని చూసుకోండి అని చెప్పటం ఏం బాగుంటుంది చెప్పూ? మనవల్నీ మనవరాళ్ళనూ గారాబం చేసి పాడుచెయ్యటం అనాదిగా వస్తున్న ఆచారం," అంది ఎమిలీ నవ్వుతూ.     "ఎప్పుడూ కాదనటం కాదు, మీకు వీలుకానప్పుడూ, అలసటగా ఉన్నప్పుడూ, ఈరోజేదైనా బొమ్మలుగీసుకుంటే బాగుండూ అని అనిపించినప్పుడూ వీలుకాదని చెప్పండి. మిమ్మల్నెవరూ తప్పు పట్టరు," అని సలహా చెప్పింది కమల. చూస్తాన్లే అన్నట్లు తలూపింది ఎమిలీ.
* * *
    ఎమిలీ డిస్ఛార్జ్ ఐ వెళ్ళిపోయింతర్వాత కూడా ఆమె గురించి చాలా సార్లు ఆలోచించింది కమల.     ఎమిలీకి కూతుళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళకీ తల్లి మీద చాలా ప్రేమ. మరి తల్లినెందుకు వాళ్ళు అలా అనాలోచితంగా తమ అవసరాలకు వాడుకుంటున్నారు?     రాబర్టూ అనవసరంగా ఒక్కమాటకూడా మాట్లాడడు. అవసరమైతే తప్ప ఒక్కపనీ చెయ్యడు ఇంట్లో! ఎమిలీ తో ఉంటున్నాడేకాని, అతని ప్రపంచం వేరే లాగుంది. అందువల్లే ఎమిలీ పరిస్థితి విషమించేంతవరకు గుర్తించలేదు?     తను చెయ్యలేని రోజు కూడా ఈరోజు పిల్లల్ని చూడటం నాకు వీలుకాదు అనలేదు ఎమిలీ. ఎందువల్ల? వీలుకాదంటే తను మాతృమూర్తి స్థానం నుంచి పడిపోతుందని భయమా?
* * *
    కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు కమలనూ, నారాయణనూ భోజనానికి పిల్చారు వెంకట్రామిరెడ్డీ సులక్షణలు. వాళ్ళకీమధ్య కొడుకుపుట్టాడు. అదీగాక ఇన్నాళ్ళూ ఎపార్ట్ మెంటులో ఉన్నవాళ్ళు ఈమధ్య ఒక ఇల్లు కొనుక్కున్నారు. వచ్చే ఆదివారం వాళ్ళింట్లో గ్రుహప్రవేశం జరుపుకుంటారు. సత్యనారాయణ పూజ కూడా చేస్తారు. ఈ సందర్భంగా మిత్రులందరినీ భోజనాలకు పిల్చారు.     ఆరోజు వాళ్ళింటి కెళ్ళే సరికి కొంచెం ఆలస్యం అయింది వీళ్ళకు. కమలకి అలంకారం అయ్యేసరికి మామూలుగా ఆలస్యం అవుతూనే ఉంటుంది. తలుపు తట్టగానే అంతకు ముందే వచ్చినవాళ్ళలో ఒకతను తలుపు తీసాడు. "నమస్కారం, రండి," అని, "ఆడ వాళ్ళంతా వంటగదిలో ఉన్నారు," అన్నాడు కమలను చూస్తూ. నారాయణ్ణి చూస్తూ, "మగాళ్ళు కొంతమంది బేస్ మెంటులో ఉన్నారు, కొందరిక్కడ లివింగ్ రూంలో ఉన్నారు," అన్నాడు, నీ ఇష్టం వచ్చినచోట చతికిలబడమని ఆహ్వానిస్తూ.     లివింగ్ రూంలో ఇంకా ఫర్నిచరు ఏమీలేదు. మడత కుర్చీలమీద ఒక సర్కిల్లో కుర్చోనున్నారు అతిథులంతా. ఒక్కొక్కరితో చేతులు కలుపుతూ, నాపేరు నారాయణ అని చెప్తూ, అతనిపేరు వింటూ, అందరితో పరిచయం చేసుకొని ఒక కుర్చీలో కూర్చున్నాడు నారాయణ. అప్పటికే సంభాషణ జోరుగా సాగుతున్నట్లుంది. నారాయణతో పరిచయాలు ముగించటమే ఆలస్యంగా మళ్ళా మొదలయింది. బబ్రీ మసీదూ, అయోధ్య, చర్చీలమీద బాంబులూ, వీటి మీద రకరకాల సిద్ధాంతాలూ, వేడి వేడి వాదోపవాదాలూ. నారాయణకు రొండు నిమిషాల్లోనే బోర్ కొట్టింది. పొద్దుటే ఇంత లోతైన విషయాలెలా దొరుకుతాయి వీళ్ళకు? ఎవ్వరికీ ఇబ్బంది కలక్కుండా అక్కడ్నించి లేచి మెల్లగా బేస్ మెంటు చేరుకున్నాడు నారాయణ. బేస్ మెంటు పెద్దది. ఒకవైపు టేబుళ్ళమీద తిండిపదార్థాలన్నీ అమర్చబడిఉన్నాయి. రెండోవైపు రెండు గ్రూపులుగా మడతకుర్చీలమీద కూర్చోని బాతాఖానీలు కొడుతున్నారు గెస్టులు. ఒక గ్రూపుకు దగ్గరగా వెళ్ళి కూర్చున్నాడు నారాయణ. పరిచయాల జోలికిపోవటం అనవసరమనుకున్నాడు. సంభాషణ ఇక్కడగూడా జోరుగానే సాగుతుంది.     "చంద్రబాబంత గౌరవం ఉన్న ముఖ్యమంత్రి మరొకడు లేడు," అన్నడొకాయన.     "అసలు చంద్రబాబు సియ్యెం గాకముందు న్యూయార్క్ స్టాక్ మార్కెట్ లో ఒక్క ఇండియా కంపెనీగూడా ఉండేదిగాదంట. ఇప్పుడు మనోళ్ళవి అరడజెను కంపెనీలున్నై," అన్నాడింకొకతను.     "ఆసియా ఖండం మొత్తంలో నాయుడంత గొప్ప నాయకుడ్లేడని సింగపూరు పత్రికలన్నీ రాసినయ్యంట," అన్నాడింకొకతను.     "సింగపూరే గాదు, జపాన్ లో, చైనా లో అందరూ చంద్రబాబు గురించేనంట మాట్టాడు కోవటం. ఆయన పుణ్యమా అని జపాన్ వాళ్ళు హైదరాబాదొస్తున్నారంట కంప్యూటర్ల గురించి నేర్చుకోవటానికి," అన్నాడొకాయన.     "పూజ మొదలుబెడుతున్నారండీ," అని అందరినీ ఈలొకంలోకి తీసుకొచ్చిందొకావిడ. లేచి పైకెళ్ళటానికి సిద్ధమయ్యారంతా.
* * *
    ఫామిలీ రూంలో పూజకు అంతా సిద్ధం చేసారు. సత్యనారాయణ పటం. దానిముందు పూజ సామగ్రి. ఒకవైపు పూజారి, రెండోవైపు వెంకట్రామిరెడ్డి, సులక్షణలు కూర్చున్నారు. వాళ్ళముందు నాలుగైదు వరసల్లో ఆడవాళ్ళూ, వాళ్ళ వెనక కొందరు నేలమీద, కొందరు మడత కుర్చీలమీదా మగవాళ్ళూ కూర్చున్నారు. పూజ పదకొండుగంటలకు మొదలయింది. పూజారి అతివేగంగా మంత్రాలు చదివాడు. అప్పుడప్పుడూ తనుచదివిన మాటలను వెంకట్రామిరెడ్డినీ సులక్షణనూ పలకమన్నాడు. కాని వాళ్ళా మాటల్ని అనటానికి సరైన వ్యవధివ్వకుండానే తర్వాతి మాటలకెళ్ళాడు. మధ్య మధ్యలో ఒకనడివయస్సులో ఉన్నామెను ఏవేవో తీసుకురమ్మని పురమాయించాడు. ఆమె వంటగదిలోకెళ్ళి అడిగిన వస్తువులు తెచ్చిచ్చింది. ఆమె వెంకట్రామిరెడ్డి తల్లో, సులక్షణ తల్లో అయుంటుందనుకున్నాడు నారాయణ.     పూజ జరుగుతుంటే వెనకచేరి మగవాళ్ళు ఏవేవో సంభాషణలు సాగిస్తూనే వచ్చారు. అప్పుడప్పుడూ పూజారి వారిని "కొంచెం చిన్నగా మాట్లాడుకోండి బాబూ" అన్నట్లు చూసాడు. దాదాపు పన్నెండున్నరకు పూజ అయిపొయింది. ముందువరసలో కూర్చున్న ఒకామెకు సత్యనారాయణ వ్రత కథ చదవమని పుస్తకమొకటిచ్చాడు పూజారి. కొంతసేపు ఆమెచదివి, రెండో కథను చదవమని పక్కావిడకిచ్చింది.     "అసలు ముందు కథ చదివి, తర్వాత పూజ చేస్తే మంచిదండీ. పూజను శ్రద్ధగా చూడకుండా కబుర్లుచెప్పుకునే వాళ్ళను దేవుడు ఎలకలుగానో, పిల్లులుగానో, కందగడ్డలుగానో చేసిపారేస్తాడని కథ చెప్పి, తర్వాత పూజ మొదలుపెడితే, అందరూ గప్ చిప్ గా ఉంటారు," అన్నాడు పక్కనకూర్చున్నాయన, తన తెలివితేటలకు తనే మురిసిపోతూ. "ఔను," అన్నాడు నారాయణ.     కథాపారాయణం జరుగుతుండగానే కొందరు ఆడవాళ్ళు బేస్ మెంటులోకెళ్ళి భోజనాలు ప్లాస్టిక్ ప్లేట్లల్లో పెట్టటం మొదలుపెట్టారు. కొందరు మగవాళ్ళు ప్లేట్లకోసం లైన్లో నిలబడ్డారు. అప్పటికే లైను పొడుగ్గా ఉండటం చూసి నారాయణ ఒక కుర్చీలో కూలబడ్డాడు.     ఇంతలో నారాయణను వెతుక్కుంటూ వచ్చింది కమల. "వాళ్ళబ్బాయిని చూసావా?" అని అడిగి, లేదని అతను తలూపితే, "మరి చూద్దాం రా," అని అతన్ని పైకి లాక్కెళ్ళింది.     వెంకట్రామిరెడ్డి తల్లి గాబోలు, పిల్లాణ్ణి చేతుల్లో పెట్టుకొని ఉయ్యాల్లా ఊపుతుంది. ఆమె దగ్గిరకెళ్ళి "నమస్కారం" అన్నారు వీళ్ళిద్దరూ. పిల్లాణ్ణి చూట్టానికొచ్చారని గుర్తించి, "రండి, ఇప్పుడే నిద్రపోయాడు," అంటూ," కొంచెం పక్కకి తిరిగింది, పిల్లాడి ముఖం వాళ్ళకి కనిపించేటట్టు.     "అంతా వాళ్ళ నాన్న లాగే ఉందికదూ ముఖం?" అందామె.     "అవునండీ. మీరు వెంకట్రామిరెడ్డి తల్లిగారు కదూ?" అనడిగాడు నారాయణ.     "కాదు బాబూ. సులక్షణవాళ్ళమ్మని."     "అలాగా. మీఅమ్మాయిచేత పూజ బాగా చేయించారండీ," అంది కమల.     సంతోషంతో, అభినందనలు అలవాటులేక వచ్చిన సిగ్గుతో, తలొంచుకుందావిడ. "ఏదోలెమ్మా. మీలాంటి వాళ్ళు అండగా వుంటే, వాళ్ళు బాగానే వుంటారు."     కట్టూ బొట్టూతోబాటు ఆమె మాటలు గూడా నిరాడంబరమైన పల్లెటూరి మనిషని చెప్తున్నాయి. ఇండియాలో తనవారంతా గుర్తుకొచ్చారు నారాయణకు.     "మీరొచ్చి ఎన్నాళ్ళయిందండీ?"     "రెండునెల్లు దాటి ఆర్రోజులయిందయ్యా." రోజుల్లెక్కబెట్టుకుంటుందని చెప్పనవసరంలేకుండానే చెప్పిందామె.     "ఈవూరు నచ్చిందా మీకు?"     "బాగానే ఉందయ్యా. ఆంతకుముందున్న గదిలో ఇరుగ్గా ఉండేది. ఈ ఇంట్లోకొచ్చి పన్నెండురోజులయింది. ఇక్కడ చానా స్తళం ఉంది. పిల్లోడు అటూ ఇటూ తిరిగే వయసొచ్చేటప్పుటికి ఇక్కడ బాగుండిద్ది."     "ఇల్లు కాదండీ. ఈ ఊరు మీకు నచ్చిందో లేదో అని."     "ఊరి సంగతి నాకేం తెలుసయ్యా?" అందామె.     "మీ ఊళ్ళో ఏంచేస్తుంటారీ రోజుల్లో?"     "ఏముందయ్యా. మామూలు పన్లే. చేలల్లో పన్లెప్పుడూ ఉండేయే. పొగాకూ, పత్తీ, వొరీ యేస్తారు మావూళ్ళో. ఆపత్తికెప్పుడూ ఏదో సేవజేస్తూనే ఉండాల. రోజుమార్చిరోజు ఏవేమో మందులుగొడ్తుండాల. అంతా జేస్తే అందులోంచి వొచ్చేదీ లేదు పెట్టేదీ లేదు. ఈయనేమో పొద్దస్తమానం ఆ పొలంకాడే బడుంటాడు."     ఆమె మనసెక్కడుందో అర్థమయింది నారాయణకు. ఇంతలో ఇంకెవర్నో తీసుకొచ్చింది సులక్షణ పిల్లాణ్ణి చూట్టానికి. ఆమెవైపు తిరిగి, "ఊరికి పంపించేలోగా మీ అమ్మగార్ని మాయింటికొకసారి తీసుకురాండి," అన్నాడు నారాయణ.     "అలాగేనండి. ఉంటుందిలెండి రెండుమూణ్ణెల్లు. మొన్ననేగా వొచ్చింది," అంది సులక్షణ.
* * *
    భోజనాలయ్యింతర్వాత తిరిగి ఇంటికెళ్ళేటప్పుడు సులక్షణ వాళ్ళమ్మ గురించి ఆలోచిస్తూ కూర్చుంది కమల. పాపం ఆమె మనసు ఇండియాలోనే ఉంది. తన పనులు, ఇష్టాయిష్టాలూ వదిలేసి, కూతురు అడిగితే కాదనలేక, అమెరికా వచ్చుంటుందామె. పొలం పన్లున్నయ్, సహాయంగా ఉంటావు, నాలుగునెల్లు ఇండియా రమ్మని కూతుర్నడుగుతుందా ఆమె? అడగదు. కానీ కూతురు అడగ్గానే వచ్చుంటుంది. నాకు వీలుగాదు అని చెప్పగలదా ఆమె? చెప్పలేదు. "అమ్మ" అంటేనే ఇవ్వటం అని అర్థం. తీసుకోవటం కాదు.     ఎమిలీ గుర్తొచ్చింది కమలకి. దేశం, జాతీ, మతం, భాషా, వేషం, దేంట్లోనూ కలవని ఎమిలీ, సులక్షణ వాళ్ళమ్మ పిల్లల విషయంలో మాత్రం ఒకే విధంగా ప్రవర్తిస్తారు. కారణం?     "ఏంటీ ఆలోచిస్తున్నావు?" డ్రైవ్ చేస్తున్న నారాయణ అడిగాడు.     "సులక్షణ వాళ్లమ్మను ఇక్కడకు తీసుకురావటం బాగా లేదుకదూ?" అంది కమల.     "ఏం?"     "ఆమె భర్త ఇంటిదగ్గర పొలం పనుల్లో మునిగున్నాడు. ఆమె మనసక్కడే ఉంది."     "అవుననుకో. వీళ్ళకు ఇల్లు కొనుక్కోవటం, డెలివరీ, అన్నీ ఒకేసారి రావటం వల్ల సులక్షణ ఇండియా పోలేక, వాళ్ళమ్మనే ఇక్కడకు తీసుకొచ్చుకుంది. ఇదిమామూలేగా?"     "ఏదీ మామూలు?"     "డెలివరీకి అమ్మగారింటికిపోవటం, లేక అమ్మను అమెరికా తీసుకొచ్చుకోవటం. నువ్వుమాత్రం చెయ్యవూ అట్లా?"     "చెయ్యను. మాఅమ్మే రావాలని ఏముందీ? మీ అమ్మగారెందుకు రాగూడదూ? అసలు వాళ్ళెందుకూ రావటం? నువ్వే ఎందుకు సహాయం చెయ్యగూడదూ?"     "చెయ్యొచ్చు. కానీ అన్ని రోజులు సెలవు దొరకొద్దూ?"     "అంటే కనటానికి నాకు సెలవు దొరుకుతుందిగాని, కొన్నాళ్ళపాటు సహాయం చెయ్యటానికి నీకు సెలవు దొరకదంటావు? లేక ఇట్లాంటి పన్లు చెయ్యటానికి సెలవు తీసుకోవటం దండగ అనా?"     "ఇప్పుడిదంతా మనకెందుకు? ప్రస్తుతం పిల్లలొద్దనుకున్నాం గా మనం."     "ఇప్పుడయినా, నాలుగేళ్ళ తర్వాతైనా పన్లుచేసిపెట్టటానికి మా అమ్మను తీసుకొద్దాం అంటే నేనొప్పుకోను."     "సరే నీయిష్టం. కానీ ఇలాంటి మాటలు నేనెప్పుడూ విన్లేదు."     "ఎలాంటి మాటలూ?"     "కాన్పుకు తల్లిని సహాయంగా తీసుకొచ్చుకోవటం ఆడవాళ్ళందరూ చేసేదే. అది తప్పని నువ్వెందుకనుకుంటున్నావో నాకర్థంగావటంలా."     "అమెరికా చూపించటానికి ఆమెను తీసుకొద్దాం అంటే నాకేమీ అభ్యంతరం లేదు. కాని నీకు ఇంట్లో పన్లు చెయ్యటం ఇష్టంలేక ఆమెను తీసుకొద్దాం అంటేమాత్రం నేనొప్పుకోనంటున్నాను."     "పొన్లే. మా అమ్మ వొస్తుందేమో?"     "మా అమ్మైనా, మీ అమ్మైనా ఒకటేనన్నాను కదూ? వాళ్ళెందుకూ రావటం?"     "నువ్వెందుకిలా తలతిక్కగా మాట్లాడుతున్నావీరోజు? తల్లి కూతురుకు సహాయం చెయ్యటం తరతరాలుగా వస్తున్న ఆచారం."     "అవచారం."     "అంటే?"     "అవసరాలు తీర్చుకోవటానికి చేసిన ఏర్పాటు. ఆడవాళ్ళచేత పన్లుచేయించుకోవటానికి కనిపెట్టిన గొప్ప పవిత్ర సంబంధం."     "కమలా, నువ్వేదో స్త్రీవాదం గొడవలో పడ్డట్టున్నావు."     "అవును. కడుపులు చెయ్యటం పురుష వాదం గొడవ, పురుళ్ళు పొయ్యటం స్త్రీవాదం గొడవ."     ఈసంభాషణ శ్రుతి మించింది. మరేదైనా విషయంగురించి మాట్లాడుకుంటే బాగుంటుందనిపించింది నారాయణకు.     హైవే నుంచి బయటికొచ్చేసి ఒకచిన్న వీధిగుండా పోతుంది కారు. రెండువైపులా పెద్ద పెద్ద ఇళ్ళూ, వాటి ముందు చక్కగా తీర్చిదిద్దినట్లు పూలవనాల్లా ఉన్న లాన్లూ చూస్తూ, "ఈ ఇళ్ళు ఎంత బాగున్నాయో చూడు కమలా," అన్నాడు నారాయణ.     "ఈ ఇళ్ళవాళ్ళు ఎవ్వరూ బైట పని చెయ్యరు. ఆ మెక్సికో వాళ్ళున్నారుగా వీళ్ళకు పన్లు జెయ్యటానికి. వాళ్ళులేకపోతే ఇంత అందంగా ఉండవు వీళ్ళ ఇళ్ళూ, లాన్లూ," అంది కమల.     "మెక్సికో వాళ్ళు ఊరికే వొచ్చి పన్లు చెయ్యటం లేదుగా కమలా. వీళ్ళు ఖర్చులుపెట్టి, వీసాలూ అవీతెప్పించి, తీసుకొస్తేనేగదా వాళ్ళు రాగలిగింది."     "అవును. వెంకట్రామిరెడ్డి వాళ్ళత్తను తీసుకొచ్చినట్లు."     "కమలా, ఇండియా నుంచి వాళ్ళత్తను తీసుకు రావటం, మెక్సికో నుంచి పన్లు చేసే వాళ్ళను తీసుకురావటం రెన్డూ సమానం అంటున్నావా?"     "నువ్వు కాదంటావా?"     "అవును."     "ఏంటీ తేడా?"     "మెక్సికో నుంచి వచ్చే వాళ్ళు అక్కడ పనులు దొరక్క వస్తున్నారు. సులక్షణ వాళ్ళమ్మ కూతురి మీద ప్రేమకొద్దీ వచ్చింది. "     "ఆమె రావటానికి కారణం ప్రేమ కావచ్చు. ఆమెను తీసుకురావటానికి కారణం మాత్రం ప్రేమ కాదు. బేబీ సిట్టర్ దొరక్క పోవటం. సులక్షణకు ఉద్యోగం వొదులుకోవటం ఇష్టం లేకపోవటం. వెంకట్రామిరెడ్డికి కొన్నాళ్ళు సెలవు తీసుకోని ఇంట్లో సహాయం చెయ్యటం ఇష్టం లేక పోవటం."     "నిజం చెప్పనా కమలా? అందమైన తల్లీ బిడ్డల సంబంధంలో లేని పోని లోపాలు చూపించటానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. ఎందుకు అలా చేస్తున్నావో నాకర్థంగావటంలా."     "ఒక్కొక సారి ఈ అందమైన సంబంధాల వెనుక వినపడని, కనపడని బాధలుంటై," అంది కమల. ఎమిలీ తలపుకొచ్చి, మౌనంగా ఉండిపోయింది.
(ఇండియా టుడే 2 జనవరి 2001 సంచికలో ప్రచురితం)
Comments