అపోహలు - ఆర్.ఎస్.హైమవతి

    
ఆఫీసు నుంచి వస్తూనే సుమ తన హేండ్‌బేగ్ టీపాయ్‌పైకి విసిరిపడేసి సోఫాలో కూలబడింది ‘‘ఉష్...’’ అనుకుంటూ. అంతకన్నా కాస్త ముందుగా వచ్చిన సుమన్- 
‘‘ఏమిటోయ్? అసహనంగా వున్నట్లున్నావ్?’’ అన్నాడు.

    ‘‘అవును సుమన్.. ఎంత విడమరిచి చెప్పినా మన పరిస్థితి అర్థం చేసుకోవడం లేదు మా బాసుగాడు’’ అంది.

    ‘‘ఏమన్నాడేమిటి..?’’ అంటూ రెండు గ్లాసుల్లో కాఫీ పోసి తీసుకొచ్చి భార్యకో గ్లాసు ఇచ్చి తనో గ్లాసులో కాఫీ మెల్లగా పీలుస్తూ పక్కన కూర్చున్నాడు.

    ఎవరు ముందుగా వస్తే వారు కాఫీ కలపడం, కుక్కర్ పెట్టడం అలవాటు చేసుకున్నారు ఈ దంపతులు. ఈ పని వీళ్లే చేయాలి, ఆ పని వాళ్ళే చేయాలనే అరమరికలు వారికి లేవు.

    ‘‘ఏం చెప్పను? ఈ నెలాఖరుకి నువ్వు మలేషియా వెళ్ళాలన్నావు కదా మూడు నెలల ప్రాజెక్ట్ వర్క్‌కి. అందుకే ఇప్పట్లో నాకు లోకల్ ప్రాజెక్టులే ఇవ్వమని మా బాస్‌తో మొరపెట్టుకున్నాను. అయినా వినిపించుకోకుండా నన్ను ఆరునెలల ప్రాజెక్టుకి మస్కెట్‌కి వెళ్ళమంటున్నాడు. ఎన్ని విధాలా నచ్చచెప్పి చూసినా వినడం లేదు. ‘‘వెళ్లితీరాలి... నువ్వే సమర్థవంతంగా చెయ్యగలవు. అక్కడి క్లయింట్లు మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇది వదులుకుంటే కంపెనీకి ఎంతో లాస్ అవుతుందంటూ టీమ్ లీడర్ నుంచి జి.ఎం వరకు అంతా ఇవాళ నామీద ఒకటే ఒత్తిడి తెస్తున్నారు. అందుకే నాకు ఇవాళ చాలా చిరాగ్గా వుంది. ఏం చెయ్యాలో తెలియడంలేదు’’ అంది సుమ భర్త భుజంమీద తల వాల్చి.

    ‘‘ఏం చేస్తాం? తప్పనప్పుడు ఒప్పుకోవలసిందే!’’ అన్నాడు సుమన్ నిదానంగా.

    ‘‘ఏమిటి నువ్వనేది? అంత తాపీగా చెప్తున్నావు? పిల్లలను ఎవరు చూస్తారు? ఎవరిమీద వదులుతాం? ఇద్దరం దగ్గిర లేకపోతే వాళ్ళు చదువులు నిర్లక్ష్యం చెయ్యరా? వాళ్ళ భవిష్యత్తు ఏవౌతుంది?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సుమ. ఆమె ముఖంలో భయాందోళనలు ప్రస్ఫుటవౌతున్నాయి.

    ఇంతలో పిల్లలిద్దరూ నీరసంగా కాళ్లీడ్చుకుంటూ వచ్చి బ్యాగ్‌లు ఓ వారన పడేసి కుర్చీల్లో కూలబడ్డారు. తల్లిదండ్రుల ముఖాల్లో భావాల్ని గమనించే స్థితిలో వాళ్ళు లేరు. ఏదో సీరియస్ డిస్కషన్‌లో వున్నారని మాత్రం గ్రహించారు.
పొద్దున్న ఏడున్నరకల్లా పాలు తాగి, తినీ తినకా పరుగున బస్ పట్టుకుని వెళ్లి మధ్యాహ్నం టిఫిన్ బాక్సులోని చల్లబడి రుచిలేని అన్నం తినలేక, సమయం సరిపోక సగం అలాగే వదిలేసి సాయంకాలం ఇల్లు చేరి ఇంటి తాళం తమ వద్ద వున్న డూప్లికేట్‌తో తెరచుకుని, కాసిని మంచినీళ్లు తాగి ఫ్రిజ్‌లోంచి ఏ జ్యూసో తాగి, ఏ ఏపిల్ పండో తిని, స్కూల్ డ్రెస్ మార్చుకుని ట్యూషన్‌కి వెళ్తారు. అక్కడనుంచి వస్తూనే ఇలా కాళ్ళీడ్చుకుంటూ వచ్చి నీరసంగా కుర్చీల్లో కూలబడతారు.

    స్కూలు నుంచి రాగానే వాళ్ళచేత హోంవర్క్ చేయించడం, చదివించడం తమకు కుదరదు కనుక ట్యూషన్ ఏర్పాటుచేశారు తల్లిదండ్రులు.

    అప్పటికా చర్చ ఆపి లేచి రాత్రికి వంట మొదలెట్టింది సుమ. సుమన్ కూడా మధ్యలో భార్యకి సాయపడుతూ, పిల్లలతో మధ్యమధ్య కబుర్లు చెప్తూ ఇటూ అటూ తిరుగుతున్నాడు. ఆలోచనలతో చాలాసేపు రాత్రి నిద్రలేదు సుమకి.

* * *

    అర్ధరాత్రి మెళకువ వచ్చిన సుమన్ భార్య నిద్రపోకపోవడం గమనించి ‘‘ఏమిటి సుమా? ఇంకా నిద్రపోలేదా? ఏం..?’’ అంటూ అడిగాడు.


    ‘‘లేదు సుమన్! ఇప్పుడు ఏంచెయ్యాలో తోచడంలేదు. పోనీ రిజైన్ చేసెయ్యనా?’’ అడిగింది సుమ.

    ‘‘చేసెయ్యచ్చు. కానీ మనం ఇద్దరి జీతాలు బాగా వున్నాయి కదాని లోన్లు తీసుకుని కారు, ఫ్లాటు కొనుక్కున్నాము. ఇప్పుడు ఒకరి జీతం వాటికి పోతోంది. ఒకరి జీతంలోనే మన ఖర్చు, పిల్లల స్కూలు ఫీజులు, కరెంటు బిల్లులు వగైరా వగైరా. అన్నింటికీ కటకటగా వుంటోంది. ఈ సమయంలో నువ్వు ఉద్యోగం మానేస్తే ఎలా?’’ అడిగాడు సుమన్.

    ‘‘అదీ నిజమే అనుకో! మరో ఉద్యోగానికి ప్రయత్నిస్తాను’’ అంది సుమ.

    ‘‘ఉద్యోగాలు ఎవరైనా పంచిపెడుతున్నారా? ఈ ఉద్యోగం దొరకడానికి మనమెంత కష్టపడ్డామో ఓసారి గుర్తుతెచ్చుకో!’’ అన్నాడు సుమన్.

    ‘‘అదీ నిజమే..! అయితే ఇప్పుడేం చేద్దాం? వెళ్ళక తప్పేలా లేదే!’’ అంది .

    ‘‘నేను ఆఫీసులో అడిగి చూస్తాను, నేను వెళ్లాల్సిన ప్రాజెక్టు వర్క్‌కి మరొకర్ని పంపి నన్ను లోకల్ ప్రాజెక్టుకి వెయ్యమని అభ్యర్థిస్తాను. అది కుదరకపోతే పిల్లలకి తోడుగా మా అమ్మ, నాన్నలను వచ్చి వుండమంటాను. వాళ్ళు పిల్లల్ని చూసుకుంటారు. మనం నిశ్చింతగా వెళ్ళొచ్చు’’ అన్నాడు సుమన్.

    ‘‘మీ అమ్మా, నాన్నలు రావడానికి నాకెలాంటి అభ్యతరమూ లేదు. వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకుంటారనే నమ్మకమూ నాకు వుంది. అయితే ఒకటి...’’ అంది సందేహిస్తూ సుమ.

    ‘‘ఏమిటి? చెప్పు, నేనేమీ అనుకోనులే!’’ అన్నాడు.

    ‘‘వాళ్ళవి పాతకాలపు అలవాట్లు, చాదస్తాలు. పిల్లల చదువుల్ని ఆటంకపరుస్తారేమోనని నా భయం. అంతేకాక వాళ్ళ పాతకాలపు భావాలు వీరిలోనూ నాటుతారు. అదే నా బెంగ. అందుకే మా అమ్మ నాన్నలని పిలుద్దామనుకుంటున్నాను. వాళ్ళైతే ఈ కాలానికి తగ్గట్లుగా వాళ్లూ వుంటారు. పిల్లల్ని అందుకు తగ్గట్లుగా ప్రవర్తింపచేస్తారు, ఏమంటావు?’’ అంది సుమ.

    ‘‘నువ్వు ఇక్కడే పొరబడుతున్నావు సుమా! మా అమ్మ నాన్నలు మీ అమ్మా నాన్నల్లా మోడరన్‌గా వుండకపోవచ్చు. వాళ్ళు మన భారతీయ సంస్కృతికి ప్రతిరూపాలు. మన పిల్లల్ని క్రమశిక్షణతో సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతారు. ఈ ఎదిగే వయసులో వాళ్ళపై పాశ్చాత్య నాగరికత ప్రభావం పడడం నాకిష్టంలేదు. మన పెళ్లికి ముందే చెప్పానుగా! నేనా పద్ధతులకీ భావాలకీ వ్యతిరేకినని. అందుకే కదా! అమెరికా వెళ్ళే అవకాశాలు వచ్చినా వదులుకుని మన దేశంలోనే వుంటున్నది. అమ్మ నాన్నలని మన దగ్గిర వుంచుకుని కంటికి రెప్పల్లా వాళ్లని చూసుకోవాలన్నదే నా ఆశయం. అది కూడా నీకు ముందుగానే చెప్పాను’’ అన్నాడు సుమన్ కాస్త కోపంగా.

    ‘‘సరే! సుమన్. నేనిప్పుడు కాదన్నానా? మనం వున్నప్పుడు వాళ్ళని మన దగ్గిర వుంచుకుంటే నాకు అభ్యతరం లేదు. మనం లేనప్పుడు వాళ్ళని వుండమంటే వాళ్ళ భావాలు...’’ అని సుమ అంటూండగానే ‘‘అర్థమైంది. వాళ్ళవి చాదస్తాలని, అవి మన పిల్లలకి అలవాటు కాకూడదని. అదేగా! నీ సందేహం, ఆలోచనాను’’ అన్నాడు కినుకగా.

    భర్తకి కోపం వచ్చినట్లు గ్రహించి, ఇక వాదించి లాభం లేదని నిద్రకుపక్రమించింది సుమ.

* * *

    తన తల్లిదండ్రులను పిల్లల దగ్గిర వుంచడానికి తన ప్రయత్నం తాను చేసింది సుమ. కానీ వారికి తీరికలేదని, వారి మరో కూతురు దగ్గిరకి అమెరికా వెళ్ళే ప్రయత్నంలో వున్నారని తెలిసి ఆ ప్రయత్నం విరమించుకుంది. ఇక ఆమెకి అత్తమామలని రప్పించడం మినహా మరో మార్గం కనపడలేదు. చేసేది లేక భర్త ఆలోచనని సమర్థించింది.


* * *

    సుమన్‌కి తన తల్లిదండ్రుల దగ్గిర వున్న పిల్లలకి ఎటువంటి లోటుపాట్లు వుండవని, సంస్కారవంతులుగా హాయిగా పెరుగుతారని నమ్మకం వుంది కనుక అతడు మలేషియాలో ఆఫీసు పనుల్లో తలమునకలవుతూ వున్నా నిశ్చింతగా వున్నాడు.


    సుమకి మాత్రం తన పిల్లల గురించి బెంగగానే వుంది. అత్తమామలు తమ భావాలకి వ్యతిరేకంగా మారుస్తారేమోనన్నదే ఆమె అసలు బెంగ. అందుకే వీలయినప్పుడల్లా నెట్ ద్వారా పిల్లలతో ఛాటింగ్‌కి ప్రయత్నిస్తూనే వుంది. అయితే పిల్లలు అందులోకి రావడంలేదు. అందుకే ‘‘కంప్యూటర్ నాలెడ్జి లేని అత్తమామలు పిల్లలను నెట్‌కి దూరంగా వుంచుతున్నారు లా వుంది. అందుకే పిల్లలు ఛాటింగ్‌కి రావడం లేదు...’’ అనుకుంటూ ఫోన్ చేస్తోంది.
అయితే పిల్లల్లో మునుపటికన్నా ఉత్సాహం, ఆనందం అధికమైనట్లు సుఖంగా వున్నట్లు గ్రహించి సంతృప్తి చెందుతోంది. ఓ రోజు అడిగేసింది, ‘‘ఎందుకు? ఛాటింగ్‌కి మీరు రావడం లేదు? తాత, మామ్మ కంప్యూటర్ ముట్టుకోవద్దన్నారా?’’ అని.

    ‘‘అదేం కాదమ్మా! తాత, మామ్మ కూడా మా దగ్గిర కంప్యూటర్ ఎలా వాడాలో అన్నీ నేర్చుకుంటున్నారు. ట్యూషన్ మానిపించి తాతయ్యే మాకు పాఠాలు నేర్పుతున్నారు. ఇప్పుడు మేము క్లాసులో ఫస్టునించీ ఐదు రేంకుల్లోపలే వస్తున్నాము. వాళ్ళేమీ మాకు కంప్యూటర్ ముట్టుకోవద్దని చెప్పడం లేదు. నువ్వు లైన్‌లోకి వచ్చినపుడు మేం చదువు కుంటూండడమో, కరెంట్ పోవడమో అయుంటుంది’’ అ న్నారు వాళ్ళు.

    అప్పుడప్పుడు ఛాటింగ్ చేసినప్పుడు కూడా మునుపెన్నడూ చూడని హుషారు పిల్లల్లో చూసి- ఇదెలా సాధ్యం? అని ఆశ్చర్యపోతూ వచ్చింది సుమ.

    ఇదివరలో తనోసారి దుబాయ్ వెళ్ళినప్పుడు తన తల్లిదండ్రులని ఇంట్లో పిల్లల దగ్గిర వదలి వెళ్లింది. తను తిరిగి వచ్చేసరికీ పిల్లలు చిక్కి సగమై నీరసంగా కనపడ్డారు. అదేమిటంటే తరవాత తెలిసింది, తన తల్లిదండ్రులకి పిల్లలని చూసే ఓపిక, శ్రద్ధలేక పనిపిల్ల మీద వదిలి వారు షాపింగ్‌లని, కంప్యూటర్‌లో అందరితో ఛాటింగ్‌లు, టీవీ ప్రోగ్రాములు- ఇలా వారి జల్సాలేగాని పిల్లల్ని పట్టించుకున్న పాపాన పోలేదని గ్రహించింది.

    గట్టిగా అంటే తన భర్తకి వాళ్ళు లోకువవుతారని తను సుమన్‌కి సర్ది చెప్పింది. అయినా సుమన్ గ్రహించలేని తెలివిహీనుడు కాడు. అందుకే ఈసారి వారిని వద్దన్నాడు అనుకుంటూ, పోనీలే..! ఎవరైతేనేం పిల్లలు హుషారు గా ఆరోగ్యం గా వున్నారు, తనకదే చాలు అను కుంది సంతృప్తిగా.

    సుమ కన్నా ముందు గా స్వదేశానికి వచ్చిన సుమన్- తన తల్లిదండ్రుల లాలనతో పిల్లల్లోని ఉత్సాహాన్ని చూసి తలమునకలయ్యాడు ఆనందంతో. రోజూ ఛాటింగ్ ద్వారా సుమతో కూడా తన ఆనందాన్ని పంచుకుంటున్నాడు.

* * *

    మస్కట్ నుంచి వచ్చేసిన సుమ పిల్లల్ని చూసుకుని మురిసిపోతూ అత్తమామలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇదివరకులా పైపైమాటలు కావని కోడలిలో నిజంగానే మార్పు వచ్చిందని గ్రహించారు రాజేశ్వర్రావు, రమణమ్మ దంపతులు.


    మాటల్లో వారు కోడలితో చెప్పారు- ‘‘మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవి. పాశ్చాత్యులు కూడా ఆశ్చర్యపోయి ఆచరిస్తున్నారు. మనం పాశ్చాత్య నాగరికతా వ్యామోహంలో పడి మన సంస్కృతిని విస్మరించి వారి మార్గాలని అనుసరిస్తూ మన సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నాము. వాళ్ళల్లోని మంచిని స్వీకరించాలి తప్ప గుడ్డిగా వారి పద్ధతులని అనుసరించకూడదు. ఈనాడు చాలామందికి మనవాళ్ళు ఏదిచెప్పినా చాదస్తంగా కనబడుతోంది. అదే మాటని ఏ అమెరికా వాడో, రష్యా వాడో చెప్తే అది శిరోధార్యవౌతోంది. మనవాళ్ళకి ఏమీ తెలియదని, వాళ్ళే గొప్పవాళ్ళని అందరిలో భావాలు నాటుకుపోయాయి. వాళ్ళు సృష్టిస్తున్న ప్రతీ అంశానికి పునాది మన వేదాలలో, పురాణాలలో చెప్పబడిందని మనవారికన్నావారు ముందుగా గ్రహించి చెప్తున్నారు. అప్పుడుగాని మనవారు నమ్మటం లేదు. అది మన దౌర్భాగ్యం. ఈ వక్రబుద్ధి పోతేగాని మన దేశం బాగుపడదు’’ అంటూ చెప్తున్నవారి మాటల్ని తల వంచుకుని శ్రద్ధగా విని మనస్ఫూర్తిగా ఆమోదించింది సుమ. భార్యలోని మార్పుని గమనించాడు సుమన్.

    ‘‘నాన్నా, మేం వున్నప్పటికన్నా బాగా ఖర్చు తగ్గింది. ఇదెలా సాధ్యం? మీరు మీ డబ్బు ఖర్చుపెట్టారా?’’ అడిగాడు సుమన్ తండ్రిని.

    ‘‘ఏంరా? ఖర్చుపెడితే తప్పా? నేనేం పరాయివాళ్ళకి ఖర్చుపెట్టానా? అయినా నేనేమీ వేరే దేనికీ నా డబ్బు ఖర్చుపెట్టలేదులే! అన్నీ ఎకౌంట్ రాశాను చూడు. మిగిలిన బాలన్స్ చూసుకో..!’ అన్నాడు రాజేశ్వర్రావు.

    ‘‘అదే..! ఎలా సాధ్యం? అని అడుగుతున్నా!’’ అన్నాడు సుమన్.

    ‘‘ఏం వుంది? ట్యూషన్ మాన్పించి నేనే వాళ్ళ పాఠాలు ముందుగా చదువుకుని వాళ్ళకి చెప్పాను. ఆ వెయ్యి కలిసొచ్చింది. బైట చిరుతిళ్ళు, హోటల్ ఖర్చులు పెట్టకుండా ఇంట్లోనే మీ అమ్మ రోజూ ఏదో ఒకటి పిల్లలు స్కూలునుంచి వచ్చేసరికి చేసిపెడుతోంది. పొద్దున్నపూట రోజూ అన్నం దగ్గిరుండి తినిపించి వాళ్ళకిష్టమైనవే డబ్బాల్లోకి చేసిపెడుతోంది. అందుకే పిల్లలూ ఆరోగ్యంగా వున్నారు.. ఖర్చు కలిసొచ్చింది’’ అన్నాడు రాజేశ్వర్రావు.

    సుమ, సుమన్‌లు ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకున్నారు. ‘‘ఇక నుంచి మీరిద్దరూ ఇక్కడే వుండండి. మాకూ అండగా వుంటారు. పిల్లలూ బాగుపడతారు. మీరక్కడ ఎలా వుంటారో? అన్న బెంగ మాకూ వుండకుండా వుంటుంది’’ అన్నాడు సుమన్.

    ‘‘అవును మామయ్యా! నేను ఇన్నాళ్ళూ అపోహపడిన మాట నిజం. అందుకే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోయాను. నన్ను క్షమించండి. అందరం ఒకచోటే వుంటే బాగుంటుంది’’ అంది సుమ మనస్ఫూర్తిగా.

    ‘‘మీదగ్గిరకి కాక మేం మాత్రం ఎక్కడికి పోతాం? అక్కడ మనింటి పనులు కొన్ని వున్నాయి. అవి పూర్తిచేసి ఇల్లు అద్దెకిచ్చి అప్పుడు వస్తాం’’ అన్నాడు రాజేశ్వర్రావు.

    ‘‘త్వరగా వచ్చేయాలి తాతయ్యా!’’ అని మనవడంటే-

    ‘‘నానమ్మా..! ఈసారి మళ్లీ నాకు పువ్వుల జడ కుట్టాలి’’ అంది మనవరాలు.

    ఆ పిల్లల్ని అక్కున జేర్చుకున్నారు తాత, మామ్మలు. ఆ నలుగురినీ చూసి మురిసిపోయారు సుమన్, సుమలు. తన చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి సుమన్‌కి.

(ఆంధ్రభూమి దినపత్రిక 28 జూన్ 2014 సంచికలో ప్రచురితం)
Comments