అరుణ - మంజుశ్రీ

    నేను పరీక్ష కాలేదు. నా ఆశలు కూలిపోయాయి. క్షుభితమైన నా మనస్సుకి ఊరట కలిగించుకునేందుకు అసంగతాలైన ఆలోచనలతో రోడ్డంట నడుస్తున్నాను. ఈ పరీక్ష నేను తప్పటానికి కారణం పై అధికారులకి నామీద సదభిప్రాయం లేకపోవడం.సదభిప్రాయమంటే ఇక్కడర్థం వీళ్ళకు నామీద యేమిటో పగ ఉన్నదనీ, నేను బాగుపడటం చూడలేకనే అనిన్నీ చెప్పుకున్నాను. ఆఫీసులో మధ్యాహ్నం తెలిసింది ఈ విషయం. చాలామంది పరామర్శించిపోయారు. కాని ఇంతమందిలో నిజమైన సానుభూతి యెవరికో, యెవరికిలేదో కనుక్కోలేను కదా. ఏదియెలా నైతేనేం నాకు ప్రమోషన్ రావడం మళ్ళీ ఇంకొక్క సంవత్సరం వాయిదా పడిపోయింది. అంటే కొద్దిరోజులుగా నేను కన్న కలలన్నీ కరగిపోయినట్లే కదా - ఇంకొక బాధాకరమైన విషయమేమంటే ఆఫీసులో అందరూ నావేపు వింతగా చూస్తున్నారు. వింత అంటే కొత్తగా అని నా అర్హ్తం. ఇద్దరు ఆడగుమాస్తాలని మధ్యపెట్టుకుని ఆనందంగా నవ్వుతూ పేలుతూ ఉన్నారు. చాలా ఖుషీగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ ఆడపిల్లలిద్దరూ కొత్తగా చేరారు ఆఫీసులో. ఉద్యోగం ఇంకా కొత్త. అవును మరి రోజూ వొక కొత్త అనుభూతి కలగవచ్చు వాళ్ళకు. పనిలేకపోయినా నవ్వుకుంటూ, కళ్ళు తిప్పుకుంటూ, దొంగవేషాలతో కాలక్షేపాలు చేస్తున్నారు.

    నాకు వాళ్ళకు చెపుదామని వుంది.

    ఇలానే ఆఫీసుల్లో కొన్నాళ్ళు ఉద్యోగాలు చేశారా, మీకు సరైన కాలం రాకముందే కళ్ళు లోతుకు పోతాయి, బుగ్గలు పీక్కుపోతాయి, అక్కడక్కడ తల నెరుస్తుంది అని. 

    కాని నేనెలా చెబుతాను. అందుకే చెప్పలేదు.

    ఏమి వొళ్ళు విరుచుకుంటారో - ఏమి చిరునవ్వులు చిందిస్తారో - రోడ్డంట నడుస్తున్న నాకు అమిత విసుగ్గా వుంది. 

    చలికాలపు సాయంకాలం నా మనసుకి వూరట కలిగించటం లేదు.

    ఇంటికి చేరుకున్నాను. 

    వీథి చావడిలో అరుణ చామంతిపూలు లెక్కపెట్టిస్తున్నది.

    హాలులో కుర్చీలో కూర్చున్నాను. ఆవిడ వచ్చి 'చిల్లర' అన్నది. నాకు చిరాకెత్తుకొచ్చింది.

    "నేను వస్తానని తీసుకుంటున్నావా. నన్నడుగుతావేం"అన్నాను విసుగ్గా.

    ఆమె సమాధానం చెప్పకుండా వాడికి డబ్బులిచ్చి పంపివేసింది. అలకవచ్చింది కాబోలు ఆమెకు. కాఫీ కప్పు తెచ్చి ముందు బెట్టింది వొక్కమాటా పలుకూ లేక. నాకు అంతగానే వుంది. అలానే వొక అరగంట కూచున్నాను. 

    తరువాత లేచి నా ఆఫీసురూములోకి పోయినాను. 

    క్షణంలో నాకు పట్టలేనంత కోపం వచ్చింది.

    ఆఫీసులో పనితెమలక అప్పుడప్పుడు ఫైళ్ళు నేను ఇంటికి పట్టుకొచ్చుకుంటుంటాను. రాత్రిళ్ళుకూడా పని చేస్తుంటాను అప్పుడప్పుడు. నా టేబిలు మీద విప్పివుంచి నేను వ్రాసుకున్న తెల్లకాగితాల నిండా ఎఱ్ఱసిరా, నల్లసిరా కలగాపులగంగా చిన్న కాలవల్లా వున్నాయి.

    క్రిందికి చూశాను. చాలాభాగం నేలమీదకూడా బండలనిండా మరకల మరకల రూపాంలో సిరా ప్రత్యక్షమైంది. ఒక్క చుక్క కూడా సిరాబుడ్లలో సిరా మిగలలేదు. ఆ బీభత్సం చూచేసరికి పట్టలేని కోపం వచ్చింది. 

    ఇంకా చూద్దునుగదా వొక బారెడు పొడుగు నవారుపట్ట వొక చివర కుర్చీ కోడుకి కట్టివున్నది. ఆ నవారుపట్ట రెండో చివర వొక తెల్లటి చిన్న కుక్కపిల్ల మెడకు కట్టబడి వుంది. అది బుద్ధిమంతురాలిలాగా అరమూతల కళ్ళతో ఆనందాన్ని అనుభవిస్తూ వున్నది. దాని వొంటిమీద ఎఱ్ఱటి నల్లటి సిరాగుర్తులు కన్పించాయి.

    దాన్ని గొంతు పిసుకుదామన్నంత కోపం వచ్చింది. 

    అయితే అది టేబిలుమీదికి ఎవరైనా తీసుకొనివస్తేనే తప్ప రాలేదుకదా అని సరిపెట్టుకున్నాను.

    ఒక్క అంగలో వంటింటి గడపకూడా దాటేశాను. 

    ఆవిడ ముందు పెద్ద అద్దం పెట్టుకుని తలలో తురుముకున్న చామంతి పూఅవుల్ని తనివితీరా చూసుకుంటున్నది. కొద్దిదూరంలో కాఫీ కప్పునిండా కాఫీవుండి పొగలు పొగలతో యెవరికోసమో యెదురు చూస్తున్నది.

    "ఇదిగో" అన్నాను.

    ఆవిడ వొక్కసారిగా వులిక్కిపడినట్లు తలెత్తి నాకేసి చూసి చిరాకుతో "యేం?" అన్నది.

    నాకు అరికాలిమంట నెత్తికెక్కింది.

    "నా టేబిలు మీద..." అంటూండగానే రామూ కాళ్ళు చేతులూ కడుక్కోని వస్తున్నాడులావుంది, వంటింట్లోకి వచ్చేశాడు. కాఫీకప్పు అందుకోఅబోతుండాగా చప్పున నా దృష్టి వాడి మీద పడింది.

    ఆ ఎఱ్ఱటి, నల్లటి సిరామరకలు వాడి చొక్కాపైనా, లాగుపైనా ఇక్కడకూడా నాకు ప్రత్యక్షమైనాయి.

    చేతులు కడుక్కున్నప్పటికీ ఇంకా ఆ మరకలు పోలేదు. 

    'రామూ' - అన్నాను యెంతో కోపంతో.

    వాడు పెదవులవద్ద పెట్టుకోబోతున్న కాఫీకప్పు నేలమీదకు జారవిడిచి వణికిపోయినాడు. 

    ఒక్కసారిగా నాలోవున్న హితాహిత జ్ఞానం యావత్తూ నశించిపోయింది. వాడి దగ్గరగా వెళ్ళి చెవి పట్టుకొని ముఖంపైకెత్తి చెంప పగిలిపోయేట్టుగా, ఐదువేళ్లూ అంటుకునేట్లుగా, వెంటనే బురబుర పొంగిపోయేట్టుగా బలంకొద్దీ కొట్టాను. అరుణ ఇంతలా వూహించి వుండదు. 

    లేకపోతే యెప్పుడో అడ్డుపడి ఉండేది. 

    కత్తివిసరులా వచ్చి వాడిమధ్యా నా మధ్యా నిలబడ్డది. నావేపు తీక్షణంగా చూస్తూ "మతిగాని పోయిందా" అన్నది కర్కశంగా. నాకు మరీకోపం తెప్పించాయి ఆ మాటలు.

    ఇద్దరూ కూచుని యేడుస్తుంటే అనవలసిన నాలుగు మాటలూ అని చరచరా గదిలోకిపోయాను. దాని మెడ వొరుసుకుని పోయేట్లుగా అది కుయ్యోమని మొత్తుకుంటుంటే తాడు పట్టుకుని బరబరా లాక్కుపోయి వీధిలో వదిలేసి వచ్చాను ఆ కుక్కపిల్లని. తర్వాత నేనూ ఏమీ ఆలోచన లేకుండా వీథిలోకి నడచిపోయాను. ఎటుపోవటానికీ తోచలేదు. చిట్టచివరకు పార్కుకిపోయి, ఎవరూ పాటాడకుండా వొక మూలన కూచున్నాను. ఎప్పుడూ లేంది వరసగా ఐదారు సిగరెట్లదాకా తగలేశాను. నోరు చేదెక్కిపోయింది. కండ్లు మంటలు పుడుతున్నాయి. గుండెల్లో నీరసం వచ్చేసింది. 

    దూరంగా ఆకాశంమీద ఎఱుపు రంగు కనపడ్డది... క్రమంగా నలుపు రంగుగా మారింది... నా తెల్లటి కాగితాల పైన ఎఱ్ఱసిరా, నల్లసిరా మరకలు నాకు గుర్తు వచ్చాయి.

    ఆ పార్కు ఊరికి కాస్త దూరంగా వుంటుంది. దాని పక్కనే రైలుకట్ట వుంది.

    దూరంగా సిగ్నల్ స్తంభంపైన ఎఱ్ఱదీపం కన్పించింది. ఎఱ్ఱదీపమూ - పచ్చదీపమూ... పచ్చదీపమూ - ఎఱ్ఱదీపమూ.

    చీకటి పడిపోయింది. రైలు కూడా వచ్చేస్తుంది. ఆ రైలు యేడున్నరకికాని రాదు. 

    లేచాను. ఆఫీసులో ఆఫీసరూ, ఇంట్లో అరుణ గుర్తొస్తున్నారు నాకు... నడిచాను.

    ఇల్లు చేరుకునేసరికి ఎనిమిదైంది. ఇల్లంతా మూగబోయి వెలవెల బోయినట్లనిపించింది. ఏంలేదు. నా మనసే అలాగుంది అని సర్ది చెప్పుకున్నాను. 

    చావడిలో వీరయ్య కన్పించాడు. గదిలోకి పోయి లైటు వేసుకుని గుడ్డలు మార్చుకున్నాను. 'అరుణా' అని పిలిచాను బిగ్గరగా. నా పిలుపుకి సమాధానం రాలేదు. పోనీ సమాధానంగా ఆమేనా రాలేదు.

    నాకు మళ్ళీ కోపమొచ్చింది. నాటేబిలు మిద బీభత్సం అలానే వుంది. నా గదంతా వికృతంగా వుంది. మాసిపోయిన బట్టలూ - కుప్పగా పడివున్న పత్రికలూ, అన్నిటికన్నా ముఖ్యం టేబిలు మీదా, క్రిందా  సిరామరకలూ నాకు  వుక్రోషం కల్గింప చేశాయి. 

    నా గది నన్ను వెక్కిరించినట్లుగా అన్పించింది. 

    వీరయ్యా అని కేకపెట్టాను. వీరయ్య చప్పున వచ్చాడు. "ఈ వాలుకుర్చీ తీసుకెళ్ళి పంచలో వాల్చు" అన్నాను. వీరయ్య దాన్ని మోసుకెళ్ళాడు. కుర్చీలో కూర్చున్న తర్వాత వీరయ్య మెల్లిగా "క్యారియర్ తీసుకొస్తానయ్యా" అన్నాడు డబ్బులుద్దేశించి.

    ఇప్పటికిగాని నా గుండె క్రిందికి జారలేదు. 

    ఇప్పటికి నాకు వొకవిధమైన భయమూ, తరువాత యేవగింపూ, సంకోచం, వొక్కొక్కటే తమతమ స్థానాలు మార్చుకుంటుంటే యేమనటానికీ పాలుపోలేదు.

    నా అవస్థ వాడు కనిపెట్టి "అమ్మగారికి తల నొప్పిగా వుందట. ఒంట్లో యేమీ బాగోలేదు" అన్నాడు.

    నాకు జాలి కలగకపోగా యెంతకోపం వచ్చిందంటే ఆ క్యారియర్ వాడు తీసుకునివస్తే వొక్క మెతుకుకూడా మిగలకుండా మొత్తం తినేయాలనిపించింది. వెంటనే లోపలకు వెళ్ళాను. క్యారియర్ తీసుకొచ్చి వాడికిచ్చాను. డబ్బుకూడా ఇచ్చాను. 

    ఒక సిగరెట్ ప్యాకెట్టూ, మంచి కిళ్ళీ తీసుకునిరా అని కూడా చెప్పాను. వాడు వెళ్ళిపోయాడు.

    నేను పార్కులో కూచుని ఇంతసేపూ ఆలోచించిందేమిటి? నాక్కనపడుతున్న దృశ్యాలేమిటి? ఒళ్ళు మండుతుందంటే మండదూ మరి!

    ఆ టేబ్విలంతా శుభ్రంచేసి వుంచుతారు. రాగానే అమ్మా, కొడుకూ తప్పుచేసినట్టుగా వొప్పుకుని తీరుతారు అని ఆలోచించుకున్నాను. ఆ లక్షణాలు కనపడకపోగా సత్యాగ్రాహానికి పూనుకుంటారేం? 

    చచ్చీచెడీ రాసుకున్నదాని నిండా సిరా దొర్లిస్తే, రేపు ఆఫీసరు అడిగితే ఎంత సిల్లీగా వుంటుంది; సిరామరకలను గురించి సంజాయిషీ. నా బాధ వాళ్ళ కర్థంకాదా - అర్థం చేసుకోరా. ప్రయత్నించరా. తలనొప్పిగా వున్నదేం. మరచి పోయాను. పోనీలే వీరయ్య వచ్చిన తర్వాత మళ్ళీ బజారుకు పంపించి అమృతాంజనమో, ఆస్ప్రో బిళ్ళలో తెప్పిస్తాను. చూస్తున్నాను కొద్దిరోజులనుంచి అరుణ ధోరణి నాకు బాగులేదు. 

    వీరయ్య వచ్చాడు. 

    సిగరెట్‌ప్యాకెట్టూ, కిళ్ళీ తీసుకవెళ్ళి టేబిలుమీద పెట్టి వచ్చాను. కారియర్ లోపలకు తీసుకవెళ్ళాను. మధ్యాహ్నం టిఫిన్‌కూడా తీసుకోలేదు. ఆకలిగా వుంది. వీరయ్యని కూర్చునివుండమని చెప్పాను. పీట వాల్చుకుని కంచం పెట్టుకుని కూర్చున్నాను. మళ్ళీ మంచినీళ్ళు పెట్టుకోవటానికని లేచాను. ఒకసారి కూచోటం, మళ్ళీ యేదో గుర్తు వచ్చి లేవటం. చాలాసార్లు లేవాసి వచ్చింది. అరుణ వచ్చి చూసి పోయింది.

    ఓహో యీమాత్రం చాతకాదనుకుంటున్నది కామోసు!

    భోజనానికుపక్రమించాను. 

    ఆకలంతా యెటుమాయమైందో మాయమైంది. 

    ఒకసారి కలుపుకుని తిన్నాను. తిన్నదిలెక్కకే రాదన్నట్లుగా కంచం నిండా యెంతో మిగిలివుంది. ఇంత యెందుకు వడ్డించుకున్నానా అనిపించింది. అయినా పంతానికి రెండు ముద్దలు యెక్కువే తిన్నాను. తిన్నట్లు అనిపించింది. కంచంలో మిగిలిపోయిన వస్తువులే కాకుండా, క్యారియర్ నిండా అన్నీ అలానే వున్నాయి.

    క్యారియర్ గిన్నెలకు మాత్రం మూతపెట్టి లేచాను. చావడిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాను.

    ఆశ్వయుజ మాసపు వెన్నెల ఆకాశాన్ని తళతళలాడిస్తోంది. నిండైన వెన్నెల. పండువెన్నల కాస్తున్నది. చాళ్ళు చాళ్ళుగా కురుస్తున్నది.

    వంటింట్లో ఏదో చప్పుడవుతే వెన్నుతిప్పి చూశాను.

    అరుణ లైటు తీసేసి వంటింటి తలుపు గడియ వేస్తున్నది.

    వీరయ్యని టేబిలుమీద వున్న సిగరెట్ ప్యాకెట్టూ, కిళ్ళీ తెచ్చిపెట్టమన్నాడు. వాడు తెచ్చియిచ్చాడు.

    అరుణ వచ్చి పంచలో నిలుచుంది.

    "వీరయ్యా, బజారు కెళ్ళి వో ఆస్ప్రోబిళ్ళల ప్యాకెట్టూ వో అమృతాంజనం డబ్బీ పట్టుకురా" అన్నాను. 

    "వద్దులే వీరయ్యా. ఇంటికి వెళ్ళు" అన్నది అరుణ.

    వీరయ్య కాసేపు తటపటాయించి "అయ్యా ఒకటడుగుతాను కోపం రాదు కదా?" అన్నాడు.

    "ఎందుకూ" అన్నాను.

    "మీ వయస్సెంత?"

    "ముప్ఫయ్యయిదూ"

    వీరయ్య వెళ్ళిపోయాడు. ఎందుకడిగాడో చెప్పలేదు. వీరయ్య ప్రశ్నలోని అంతరార్థాన్ని నేను వూహించలేకుండా వున్నాను. కాసేపు ఆలోచించాను. కాని నాకేమీ తెలీలేదు.

    అరుణ ఎప్పుడో వెళ్ళిపోయింది. కిళ్ళీ నములుతూ సిగరెట్ ముట్టించుకున్నాను. ప్రాణానికి హాఇయిగావుంది. కొద్దిగా చలి ప్రారంభమైంది. ఎక్కడినుంచో పూలవాసన తేలి వస్తున్నది.

    అరుణా అని పిలిచాను. సమాధానం రాలేదు. కాని అరుణ వచ్చి పక్కగా నిల్చుంది. మామూలుగానే నా పక్క యెక్కడ? అని అడిగాను. అరుణ మాటాడకుండా వెళ్ళిపోయింది. పోయేముందు అరుణ ముఖంకేసి వొక్కసారి చూశాను. పీక్కుపోయివుంది. ఈసారికూడా నాతో మాటాడకపోవటం నన్ను కదిల్చిందనే చెప్పాలి. వెనకనే వెళదామనిపించింది. అయినా అలానే ఆ కుర్చీలో చాలాసేపు కూర్చుండిపోయాను. నా మనసు చల్లబడిపోయింది. పూర్తిగా చల్లబడిపోయింది. ఎందుకో పాపం అనిపించింది. ఇంతవరకూ రామూని గురించి అనుకోకపోవటం నాకు వింతగానే అనిపించింది. ఎలానైనా నేను కాస్త కటిక గుండె వాణ్ణి అనిపించింది. 

    వెన్నెల నా ముఖం మీదకు వచ్చేసింది. 

    సాయంకాలం దృశ్యాలు వొక్కొక్కటి నా కనులముందర తిరుగుతున్నాయి. నేను ఇంటికి వచ్చేసరికి ఆమె పువ్వులు పెట్టుకుని అద్దంలో చూసుకోవటం అన్నీ గుర్తువచ్చాయి. నేను అప్పుడు గమనించలేదు. ఆమె అప్పుడు ఎంతో సంతోషంగానూ వుంది. పాపం, ఇలా అన్నం నీళ్ళూ మానేసి యెందుకు పడుకోవటం?

    మా అమ్మ నన్ను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు చిన్నతనంలో "ఒరే కోతీ" అని పిలిచేది. దానికి తగ్గట్టుగా నేను కోతిచేష్టలు చేస్తూనే వుండేవాణ్ణి. నా పేరు కూడా హనుమంతరావే మరి.

    ఇవాళ నేను కోతిచేష్టలు చేసినట్లుగా అనిపించింది.

    నిజమే నాకు కోపం రావలసిన మాటే. అయితే బాగానే వుంది. కోపం వచ్చింది. అందువల్ల వొరింగిందేమిటి? జరిగిపోయిన చెడుపనివలని ఫలితాలు అనుభవించవలసిందే కదా. కోపం దిగమింగుకోగలవాడే నిజమైన మనిషి. కోపం చూపించి చిందులు తొక్కేవాడు నిజంగా కోతే. వాళ్ళిద్దరూ అలా అభోజనం పడుకుంటే నేను సుష్ఠుగా భోంచేశాను. నాకు ఏ కోశానా వివేకమన్నది లేదు.

    పదిగంటలైపోయింది. చలి బాగావుంది బయట. పోయి పక్కమీద పడుకున్నాను. అటూ ఇటూ దొర్లాను. దుప్పటి ముసుగుబెట్టుకున్నాను. కాని నిద్రవచ్చే సూచన కనపడలేదు. అరుణ యెక్కడ పడుకుందో చూడాలనిపించింది. లేచి కూచున్నాను. నేలమీద జీరాడుతూ చామంతి పువ్వొకటి కన్పించింది. అది నావేపు జాలిగా చూసింది. బయట రోడ్డు మీద వెన్నెల కురుస్తున్నది మంచుతోకలసి.

    అరుణ హాలుపక్క గదిలో పడుకున్నది చాప పరచుకొని. మామూలుగా అక్కడ చాపపరచుకుని పడుకోవాసిన అవసరం యెప్పుడూ కలుగదు. సామాన్లు పడేసుకుందుకు వుపయోగించుకుంటుంటాం ఆ గదిని.

    అలా పడుకున్న ఆమెను చూసేసరికి నాకు జాలైంది. ఆమె సందిట్లో 'రామూ' కరుచుకుని పడుకునివున్నాడు. నేను రావటం చూసి ఆమె చప్పున కళ్ళు మూసుకుంది. అది నేను కనిపెట్టగలిగాను. ఆమె తలవద్ద కూచుని నుదురుమీద చెయ్యివేసి చూశాను. ఆమె కళ్ళుతెరచి చూసింది. నా చెయ్యి తీసివేసింది. ఆమె నుదురు మామూలుగానే వుంది. కాని ఆమె కంట్లో మాత్రం నీళ్లు నిలిచాయి.

    "బాగానే వున్నాం. వెళ్ళిపొండి" అన్నది. ఆమె స్వరంలో యేమాత్రమూ మార్దవం లేదు. 

    "తలనొప్పి తగ్గిందా?" అన్నాను.

    "నాకు తలనొప్పి లేదు"

    "కొద్దిగా అన్నం తిను లే. నేను కలిపిపెడతానులే"

    "మీకేం శ్రమ అవసరం లేదు" వెటకారం.

    "కోపమా-"

    మాటాడలేదు. రామూ వొంటిమీద చెయ్యివెయ్యబోయాను. ఆమె నా చెయ్యిని బలవంతంగా అవతలకు నెట్టి వేసింది. 

    "కోపంలో యేదో అంటే..."

    ఆమె మాటాడలేదు. ఆమె ముఖాన్ని నావేపుకి తిప్పుకోబోయాను. 

    అసహ్యమైన స్వరంతో "దయయుంచి ఇక్కడినుంచి వెళ్ళిపొండి"

    "రామూకి కూడా అన్నం పెట్టలేదా?"

    "చాలా తిన్నాడుగా..."

    "నాకు వొళ్ళు తెలీని కోపం వచ్చింది. ఇంకెప్పుడూ..."

    "మనుషులకే జ్ఞానమనేది అవసరం"

    "నాకు తెలుసు. నా ముఖం చూడు. చూసి చెప్పు. నా మీద కోపమా"

    "ముఖం చూడాలంటే అసహ్యం పుడుతోంది"

    "ఎందుకూ..."

    "కన్నవాళ్ళకి తెలుస్తుంది"

    "నీవొక్కదానివే కన్నావా..." నా కంఠంలోనూ వెటకారం ధ్వనించి వుంటుంది. 

    రామూని మరీ దగ్గరగా తీసుకుంది. సన్నగా యేడుపుగూడా.

    "లే కొద్దిగా అన్నంతిను. తరువాత నన్ను యేమైనా అను..."

    "ఎంత ప్రేమ!" ఎంత వెటకారమో ఆ మాటల్లో.

    "మీరు వెళ్ళండి" అన్నది. మళ్ళీ "వీడి వొళ్ళు వోసారి చూడండి" అన్నది. చొక్కాయెత్తి పొట్ట చూశాను. మామూలుగానే వుంది. అయితే ఆ మాటమాత్రం నేననలేదు. వాడు మూలిగాడు. ఆమె లేచికూచుని తలవేపునుంచి ఏదో పొట్లంతీసి వాడినోట్లో మందువేసింది. పైన బెడ్‌లైట్ వెలుగుతున్నది. ఆవేశంతో ఆమె రెండుచేతులూ పట్టుకోబోయాను. కాని ఆమె విదిల్చివేసింది. నాకు తెలుసు. ఇక ఆమెను బ్రతిమాలలేను. ఇవాళనుంచి కాదు. పదిహేనేళ్ళనుంచీ తెలుసు. నేను లేచి నిలుచున్నాను. రామూ కలవరిస్తున్నాడు నా కుక్కపిల్ల యేదీ... అంటూ. వాణ్ణి జోకొడుతూ ఆమె అలానే కూచున్నది. నేను వచ్చేశాను.

    వాణ్ణి తెచ్చి నాదగ్గర పడుకోబెట్టుకొంటేకాని నాకు నిద్ర పట్టేట్లు లేదు. కాని నేను అంత ధైర్యం చెయ్యలేను. 

    అలానే పక్కమీద అటూ ఇటూ దొర్లుతూ గడపసాగాను. 

    బయట వెన్నెల... చలి. పువ్వుల వాసన... నాకు నిద్రపట్టటం లేదు...

    అరుణ గురించే నా తలపు నిండిపోయింది. చప్పున వీరయ్య అడిగిన ప్రశ్న గుర్తు వచ్చింది. దాంతోపాటే యెన్నెన్నో గుర్తువచ్చాయి. 

    వాడు అడిగిన ప్రశ్నలోని అంతరార్థం ఇదై వుంటుంది. 

    జ్ఞాపకాల తెరలని చీల్చి చూస్తే - పదేళ్ళనాటి సంగతి. 

* * *

    ఆఫీసునుంచి రాగానే అట్టహాసంగా అలంకరించుకుని వచ్చి 'వెళ్దామా మరి' అన్నది అరుణ. 

    "దేవిగారి సెలవైతే..." అన్నాను.

    "అబ్బ! అంతా నా ఆజ్ఞప్రకారమే నడుస్తున్నట్లు..."

    "ఏం కాదన్నాను చెప్పు..."

    అరుణ కళ్ళు గర్వంతో మెరిసిపోయినయ్.

    "మరి బయలుదేరుదాం" అన్నది.

    బయలుదేరాం.

    సుందర్‌విలాస్ దాటి నడుస్తుంటే అరుణ నా వైపు ప్రశ్నార్థకంగా చూసింది. కాఫీతాగుదామని లోపలకు వెళ్ళాము. అరుణకళ్ళు అందంగా మెరిసిపోతున్నాయి.

    కాఫీతాగి బిల్లు చెల్లించుదామని కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి వొక దృశ్యం నన్ను విచలితుణ్ణి చేసింది. నేను కొన్ని రోజులుగా అలాటి దృశ్యాలు అరుణకంటబడటం కూడదని, కంటబడకుండా వుండాలని లోపల్లోపల కోరుకుంటున్నాను. అరుణ చూడకుండానే వెళ్ళిపోదామనుకున్నాను. మెట్లు దిగుతున్నాను. దురదృష్టం యెదురు నడచి వచ్చినట్లుగా కృష్ణారావు యెంతో సంతోషంతో వచ్చి నా భుజం చరిచాడు. 

    అరుణ నా వెనకాల నిలుచుని వుంది.

    "ఏమిటోయ్ బొత్తిగా కనపడటం మానేశావు? ఈ మధ్య క్యాంపులు యెక్కువైనాయిలా వుంది?" అన్నాడు.

    "వస్తాను మరి, పనుంది బజార్లో" అని తప్పించుకోబోయాను. 

    కృష్ణారావు యేమిటో అర్థమైనట్లు నవ్వాడు.

    అరుణవేపు చూశాను. అరుణ ఆ దృశ్యాన్ని అతిశ్రద్ధగా పరికొస్తోంది. నా హృదయంలో యేదో దిగులైంది. ఆ విషయము నన్ను అడుగుతుంది. మేము నడుస్తున్నాం. అరుణ ముఖంలో యేదో అసంతృప్తి కనపడుతున్నది. 

    ఆ దృశ్యం మరేం లేదు. ఒక గుడ్డిమనిషి సుందర్ విలాస్ ముందు కూచుని ముష్టి అడుక్కుంటుంది. ఆడమనిషి. నేను మామూలుగా చూస్తూనేవుంటాను. ఇవాళ కూడా అలానే ఆ మనిషి కూచునుంది. పాతికేళ్ళకంటే యెక్కువుండవు. ఆ మనిషి తన సంతానానికి పాలు కుడుపుతోంది.

    అరుణ వేసే ప్రశ్నను నేను ఊహించగలను.

    అరుణ అడగనే అడిగింది. 

    "భగవంతు డెందుకండీ అలాటివాళ్ళకు సంతు యివ్వటం?"

    ఒక్కోసారి అరుణను చూస్తే నాకు చిరాకు కలుగుతుంది. అరుణని యేమిటో వెలితి బాధిస్తున్నది. కొద్దిరోజులుగా ఆమె అసంతృప్తితో బాధపడుతోందని నేను లీలగా గ్రహిస్తూనే వున్నాను.

    ఒక సంవత్సరం నుంచీ ఆమె నాతో వందపాళ్ళూ జీవితాన్ని పంచుకున్నపటికిన్నీ ఆమె తత్వం నేను తెలుసుకోలేకపోయినందుకు ఆశ్చర్యపోయేవాణ్ణి అప్పుడప్పుడు. ఎప్పుడు క్యాంపునుంచి ఇంటికివచ్చినా యెంతో దిగులుతో, ఏమిటో అసంతృప్తితో యెదురుచూస్తూ వుండేది. నాకు కొద్దికొద్దిగా అర్థమవుతూవుంది. ఆమెకు ఏమిటో అసంతృప్తి.

    అరుణ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేదు.

    అరుణ మాత్రం ఆలోచిస్తూనే వుంది.

    పార్కుకి వెళ్ళి వొకమూలగా పచ్చటి గడ్డిపైన కూచున్నాం. రకరకాల మనుష్యులు. పిల్లా పాపా, కుఱ్ఱకారు, ముసలివాళ్ళు యెంతమందితోనో పార్కు కళకళ్లాడిపోతున్నది. 

    అరుణ హఠాత్తుగా నేవేపు తిరిగి 'చూడండీ, చూడండీ' అని అటువేపు చూపింది. నేను చూశాను. దంపతులు తమ చిన్న కుఱ్ఱాణ్ణి మధ్య చెరొకవేలూ పట్టుకుని నడిపించుకుంటూ వస్తున్నారు. అదేమి ఆశ్చర్యకరమైన దృశ్యమా!

    ఆ కుఱ్ఱాడు నడవనని మారాం చేస్తున్నాడు.

    అరుణవేపు చూశాను. అరుణకళ్ళు సంతోషంతో మెరిసిపోతున్నాయి. వాళ్ళు మావేపే వచ్చారు. నాకు మళ్ళీ వొక గడ్డుప్రశ్న యెదుర్కొన్నది. ఆ వచ్చినతడు నా చిన్ననాటి స్నేహితుడు రామారావు. అయినా నేను ముభావంగానే ఊర్కున్నాను. అతడే దగ్గరగా వచ్చి పలకరించాడు. వాళ్ళు కూడా మా పక్కనే వోచోట కూచున్నారు. అరుణ ఆవిడతో అప్పుడే మాటలు కలిపేసింది. ఆ కుఱ్ఱాణ్ణి వొళ్ళో కూచో బెట్టుకుని ముద్దాడింది. 

    రామారావు అదృష్టవంతుడివి అని నన్ను అభినందించాడు. 

    రామారావుకి ముగ్గురు పిల్లలట. ఒక పిల్లను అమ్మమ్మ వాళ్ళింట్లోనూ, కుఱ్ఱాణ్ణి తన తండ్రిదగ్గరా వదిలేసి వచ్చారట. వీడు చిన్నవాడు. రామారావు అందుకే నన్ను అభినందించాడు. నేను చిన్నగా నవ్వి ఊరుకున్నాను. ఇంకా నయం.

    అరుణ మా మాటలు వినలేదు.

    వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా పైకి.

    అరుణ నా పక్కనే జరిగి కూచుంది. 

    "రెండోయేడేనట. అన్ని మాటలూ వచ్చునండీ" అన్నది ఆ చిట్టిబాబు నుద్దేశించి. నేను నిర్లిప్తతతో 'ఊ' అన్నాను. 

    అరుణ ముఖం చిట్లించుకుంది. ముభావంగా కాసేపు అటూఇటూ చూస్తూ కూచుంది. 

    ఇంతలోకే నా చేతిని మృదువుగా నొక్కి ఆకాశం కేసి చూస్తూ "వాన వచ్చేలా వుంది. ఇక వెళ్ళిపోదామా" అన్నది.

    ఆకాశం నిమిషంలో నల్లటి మబ్బులతో నిండిపోయింది. చల్లటి గాలి కూడా వీచసాగింది. లేచి పార్కుగేటుదాకా నడిచి వచ్చాము. పార్కు గేటు పైకి ఆర్చీలా కాగితపు పూల చెట్లు యెగబాకి రంగురంగు పూలతో యెంతో అందంగా వున్నాయి. గుత్తులుగుత్తుల పూలు. లైట్లు వెలిగించారు. చాలా మనోహరంగా వుంది సాయంకాలం. ఇటువంటి సాయంకాలాలంటే నాకు యెంతో ఇష్టం. 

    రిక్షాని పిలిచాను. 

    "ఎందుకు నడిచిపోతే సరిపోదూ" అన్నది అరుణ.

    "వాన వచ్చేలావుంది"

    పార్కునుంచి చర్చి ముందుదాకా సిమెంటురోడ్డు పల్లంగా వుంటుంది. రిక్షా జోరుగా పోతున్నది. 

    చర్చి ముందు వచ్చి ఆగిపోయింది.

    రోడ్డుమీద వొక పెద్ద గుంపు వుంది అడ్డంగా. ఇంకా రెండు మూడు రిస్ఖాలు కూడా వున్నాయి. ఒక పోలీస్ కాన్‌స్టేబిల్ కూడా అక్కడే నిలుచుని వున్నాడు. రోడ్డుకి అడ్డంగా వుంది ఆ గుంపు. రిక్షావాడు రిక్షా ఆపి దిగి ఆ గుంపులోకి దూరాడు. ఒక్క రెండు నిమిషాల్లోనే వచ్చాడు. నేనుకూడా అప్పటిదాకా దిగేవున్నాను. రిక్షావాడు రాగానే నేను రిక్షా యెక్కాను. గుంపు కాస్త చెదిరింది. ఒక దారుణమైన దృశ్యం కంటబడింది. రోడ్డు మీద గుంపు మధ్య ఇద్దరు మనుష్యులు పెద్దపెద్ద లాటీల్లాంటి కఱ్ఱలు పుచ్చుకుని నిలుచుని వున్నారు. వాళ్ళ కాళ్ళవద్ద వొక కుక్క పడివుంది. ఆ కుక్క నోట్లోంచి వరదగా నెత్తురు కారుతోంది. మధ్య మధ్య కుయ్యోమని అరుస్తోంది. ఆ దృశ్యం అరుణ కూడా చూసింది. అరుణ వొక్కసారిగా వొణికిపోయి నా భుజంమీదికి వొరిగి పోయింది. విహ్వలమైన స్వరంతో 'యేమిటండీ యేమిటండీ...' అన్నది. రిక్షా అతను ఇంకా వెళ్ళేందుకు వీలులేక అలానే నిలబడిపోయాడు. 

    పోలీస్ కాన్‌స్టేవిల్ గుంపుని చెదరగొడుతున్నాడు. కుక్క మొత్తుకుంటున్నది. కుక్కకి రెండుపక్కలా నిలుచుని వున్న మొద్దు మనుషులు కఱ్ఱలతో వొకరు విడిచి వొకరు మళ్ళీ దాన్ని బాదారు. మాకు బాగా కనపడుతూనే వుంది. ఇక్కడొద్దు. పోనీయ్, పోనీయ్... మీరు చెప్పండి. పోనీమనండీ..." నా చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని "మనం వెళ్ళిపోదాం. నడచిపోదాం రాండి. పశువులు. నేను చూడలేను" అని ముఖం కప్పేసుకుంది. 

    "ఎలా పోనిస్తానమ్మగారూ" అన్నాడు రిక్షావాడు.

    "పోనీయ్ నెట్టుకుపో" అరుణ యేడుపుగొంతుతో వాణ్ణి ప్రాధేయపడుతోంది.

    గుంపు చెదరిపోయింది. చిన్న కుక్కపిల్ల. చచ్చిపోయింది. అరుణ కళ్ళుమూసుకుని వుంది. రిక్షా మెల్లగా సాగిపోయింది. అరుణ నన్ను వొరుసుకుని కూచింది. ఆమె చేయి నా చేతిలోనే వుంది. అరుణ యే మాత్రపు విషాదాన్నీ భరించలేదు. అందుకే ఆమెను చూస్తే నాకు దిగులవుతుంది. క్యాంపులో వున్నన్ని రోజులూ మనసంతా అనుక్షణమూ ఆమె చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. 

    దారిలో అరుణ అడిగింది రిక్షావాణ్ణి.

    రిక్షావాడు చెప్పాడు. రిక్షావాడు చెప్పకముందే అరుణ మనుష్యులను తిట్టింది. పశువులన్నది. పశువులు నయమన్నది. దయలేదన్నది. మనుషులుగా యెందుకు పుట్టారన్నది. వణకి పోవటం నాకు తెలుస్తూనే వున్నది.

    రిక్షావాడు చెప్పాడు.

    "పిచ్చికుక్క అమ్మా. పిచ్చెత్తింది. ఇద్దరు పిల్లల్ని కరచింది. పాపం ఒక పిల్లవాడు ఆస్పత్రిలో పోయినాడట. ఇందాక వొక యెద్దునూ కరచిందట. పిచ్చెక్కిన తర్వాత చంపకపోతే యెలానమ్మా. మనుషులని కరిస్తే బతికే ఆశ వుందా" అరుణ యేదుపు దిగమింగుకుంది. ఆ కళ్ళలో యెంత దైన్యమో! అరుణవేపు చూస్తే నాకు దిగులైంది. 

    ఇల్లు చేరుకున్న తర్వాతనైనా అరుణ అలానే వుండిపోయింది. ఎక్కడో, యేమిటో ఆలోచన. మధ్యమధ్య కళ్ళు చెమ్మగిల్లటం నేను చూస్తూనే వున్నాను. దగ్గరగా తీసుకుని అనునయించాను. 

    ఆమె అడిగింది.

    "అవునండీ నిజంగా పిచ్చెక్కుతుందా. ఎందుకు పిచ్చెక్కిందో దానికి పాపం."

    అరుణకి యేమని సమాధానం చెప్పను. 

    అరుణ అంటే అమాయకత్వం. కరుణ. జాలి.

        అవాళ రాత్రి అంతా అరుణ వణకిపోతూనే వుంది. అరుణని చూస్తే నాకు దిగులైంది. ప్రొద్దున్నే నేను క్యాంపుకు వెళ్ళాలి. ఉదయానికల్లా అరుణ మామూలు మనిషైంది. ఎప్పటిలానే "తొందరగా వచ్చేయండి" అని చెప్పింది.

కలకదేరిన మనస్సుతోటి వీరయ్యని తీసుకుని నేను క్యాంపుకి వెళ్ళిపోయాను. అడవిలో యేడిసింది ఆ పల్లె. పొద్దుగూకితే భయం.

    ఆ వారం రోజులూ బ్రహ్మప్రళయంలా గడిచింది. 

    వీరయ్యని మాత్రం మఱ్ఱోజున్నే పంపించివేశాను.

    మఱ్ఱోజున బయలుదేరి నేను వెళ్ళిపోవచ్చు.

    చీకటిపడిన అరగంటకి తూర్పు దిక్కున చంద్రబింబం ఎఱ్ఱగా తోచి క్రమంగా తెల్లబడింది. 

    బంగళా ఆరుబయట కుర్చీ వేయించుకుని కూచున్నాను. దూరంగా చెట్ల ఆకుల సందునుంచి ఆ దృశ్యం నాకు బాగా కనపడుతున్నది.

    అందమైన రాత్రి.

    చింతచెట్టుకొమ్మమీంచి వెలిగిపోతున్న చంద్రబింబం నా కెన్నో పూర్వ స్మృతులని గుర్తుకు తెచ్చింది. ఎక్కడి నుంచో అడవిపక్షులు గోలచేస్తున్నాయి. పేరుతెలీని పువ్వులు వాసనలు వెదజల్లుతున్నాయి. ఆఫీసరుగారు దూరంగా కూచుని చుట్ట కాల్చుకుంటున్నారు. బంగళాముందు అడవి మృగాలు రాకుండా ఎఱ్ఱటి మంట మండుతున్నది.

    నిజంగా అందమైన రాత్రి.

    సరిగ్గా యిలాటి రాత్రే అంచుల్లేని బంగారు పళ్ళెంలా చందమామ తూర్పుదిక్కున వెలుగుతుండగా అరుణతో పల్లకీ యెక్కి వూరేగాను. అవాళ ఉత్సాహం, అవాళ్టి సంబరం యేమని వర్ణించను. హృదయం కూడా నేను చెప్పలేను అంటున్నది.

    అరుణ ఆరోజున రూపుగొన్న ముగ్ధత్వం.

    కన్నులు అరమూతలు పడి ఆరోజున యెన్ని కలలు కన్నదో - భవిష్యత్తుని గురించి తియ్యగా వూహించి వుంటుంది. కలల్లో బతుకుతున్నదానివలె యెవరివేపూ కన్నెత్తికూడా చూడలేదు. నావేపు చూడటానికే యెంత సిగ్గు పడి పొయ్యేది!

    ఆమె కలలన్నీ యేమైనాయో? నాతోటి చెప్పిందా? అసంతృప్తి అంటే అసంతృప్తికాదూ! ఐదేళ్ళు గడచిపోయినవి. 

    పదిరోజులు వుంటే పదిరోజులు ఇంట్లో వుండటానికి వీలులేని ఉద్యోగం. ఆమె ఒక్కతే ఇంట్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాలి. అరుణపైన చెప్పలేని జాలికలిగింది.

    ఎంత త్వరగా తెల్లవారుతుందా అని హృదయం వేగిరపాటు చెందింది.

    అరుణతోటి జీవితాన్ని పంచుకున్ననాటి సంగతులు వొక్కొక్కటే కళ్ళముందు తిరిగాయి. పాపం ఆమెకు అసంతృప్తి లేకుండా చెయ్యాలి. ఇకముందు ఆమె మనసులోని వెలితిని కనుక్కునేందుకు ప్రయత్నిస్తాను.

    తెల్లవారగానే ఆఫీసరుకు చెప్పాను మూడునెలల దాకా నాకు క్యాంపుడ్యూటీ పెట్టవద్దని. ఆయన వొప్పుకున్నారు. ఎంతో సంతోషంతో ఇంటికి బయలుదేరి వచ్చేశాను. 

    ఇల్లు చేరుకునేసరికి నాకు ఆశ్చర్యమైంది.

    ఎవరింటికన్నా చేరుకున్నానా అనిపించింది.

    నేను ఇంట్లోకి అడుగు పెడుతుండగానే యెదురువచ్చే అరుణ యెదురు రాలేదు కదా, యెక్కడవుందో మరి కన్పించలేదు. హాల్లో నా టేబిలు ప్రక్క కుర్చీలో వొక కుక్కపిల్ల కూచుని నన్ను చూసి భౌ భౌ మంటూ మొరగటం సాగించింది. నాటేబిలూ, కుర్చీ వాటి స్థానాలు మార్చుకున్నాయి. ఆ కుక్కపిల్ల నన్ను చూసి మండిపడసాగింది. దాని మెడకి వున్న చిన్న బెల్టూ, గొలుసూ లేకుండానే వుండి వున్నట్లయితే నామీదబడి పీకిపెట్టేదేమో నన్నట్లుగా వుంది దాని వాలకం. నేను అప్రతిభుణ్ణయిపోయి కాసేపు అలానే నిలుచుండిపోయాను. 

    ఇంతలో అరుణ వచ్చింది... వస్తూనే నన్ను చూసింది... చూస్తూనే అతి సంతోషంగా నవ్వింది... నవ్వుతూనే ఆ కుక్కపిల్లదగ్గరకు పోయింది... పోయి దాన్ని రెండు చేతుల్లోనూ తీసుకుంది. 

    "బుజ్జిముండా యెవరనుకున్నావే, తెగ అరుస్తున్నావు. నాన్నగారమ్మా. అలా చెయ్యొచ్చునా తప్పుకదూ. అల్లరి చెయ్యకూడదు. బుద్ధిమంతుడిలా వుండాలి. కన్నా నేను చెప్పినట్లు వింటావు కదూ" అని దాన్ని దువ్వుతోంది.

    అది నన్ను చూసి ఇంకా మధ్యమధ్య కుంయ్, కుంయ్ మంటూనేవుంది. నాకు తల తిరిగిపోయినంత పనైంది. అరుణకి పిచ్చిపట్టలేదుకదా - అరుణ నిజంగా పిచ్చిదై పోతున్నది.

    ఒక్కొక్కరికి వొక్కొక్కరకం పిచ్చి. అరుణకి... పిచ్చి.

    అరుణ దాన్ని తీసుకునే నా దగ్గరా వచ్చింది.

    అరుణను చూస్తుంటే నాకు నవ్వూ యేడుపుకూడా వస్తున్నాయి. నేను ముఖం పక్కకి తిప్పుకున్నాను.

    "బుజ్జిముండ మీదగ్గరకు వస్తుందట తీసుకోండి" అన్నది. నేను తీసుకోలేదు. అరుణవేపు చూసిమాత్రం దిగులుగా నవ్వాను. అరుణ అంతే.

    నమ్మకం కుదిరినట్లుగా నేనెవరో దానికి తెలిసిపోయినట్లుగా నా మీదికి మీదికి పాకుతోంది కుక్కపిల్ల.

    "బుజ్జిగాణ్ణి తీసుకోరేమండీ"

    కుక్కపిల్లని దువ్వి ఇంట్లోకి వెళ్ళిపోయాను.

    అరుణకూడా నా వెనకనే వస్తుంటే కుక్కపిల్ల కుయ్యోమని మొత్తుకుంటూ అరుణదగ్గర నుంచి పోవటంలేదు. 

    "కన్నయ్యా నీతో ఆడుకుంటానికెట్లానమ్మా. నాన్నగారికి కోపమ్రాదూ. ఇప్పుడే వస్తాను మరి. నాన్నగారికి నీళ్ళు తోడాలి, కాఫీ కలిపి ఇన్వ్వాలి. నీవంటే పాలుతాగి గంతులేస్తుంటివి"

    అరుణకి పిచ్చిపుడుతుందా భగవంతుడా. అరుణని యెలా సరిద్దిద్దుకోవాలి. నాకేం తోచటంలేదే. ఏం చేయాలి అనుకున్నాను.

    నిమిష నిమిషానికీ ఆ కుక్కపిల్లను చూస్తుంటే నాకు వొళ్ళు మండిపోతున్నది.

    స్నానం చేసి కాఫీ త్రాగుతూ "వెధవ కుక్కపిల్ల. దాన్ని బయట వదిలేసి వస్తాను" అన్నాను అరుణవేపు చూస్తూ. అరుణ ముఖం చిట్లించుకుంది.

    "పోనీండి. అది మిమ్మల్నేం చేసింది. పాపం దిక్కు లేనిది. ఒకరోజు ప్రొద్దున్నే చూద్దునుగదా మీ టేబిలు చాటున దాక్కుని వణికిపోతున్నది. పెద్దకుక్కలన్నీ కలిసి పీకి పెట్టినయ్ కాబోలు, వళ్ళంతా గాయాలు. దిక్కులేని ముండ అని, దాని కిన్ని పాలు పోసి ఆ సాయంకాలం బయటకు పంపించివేద్దాం కదా అని అనుకున్నాను. కానీ యెంతకూ పోనంటుందే. చూడండీ కుక్క విశ్వాసం మనిషికికూడా వుండదంటారు. ఆ విషయం నా కవాళ బాగా తెల్సింది. కాళ్ళకు కాళ్ళకు చుట్టుకుని తిరిగింది. వీరయ్యా దీన్ని బయట విడిచిపెట్టు అని పంపించాను. బయటకు తీసుకెళ్లుతుంటే ఒకటే గోల. తలుపులు వేయమన్నాను. వీరయ్య వీథి వాకిలి మూసేశాడు. వాకిలి దగ్గర కాళ్ళతో తలుపులు గోకుతూ రెండు గంటలు యేడ్చిందండీ! నాకు జాలైంది. యేడుపు కూడా వచ్చింది. చిన్నిముండకు నేనంటే యెంత ప్రేమ అనుకున్నారు! తలుపు తియ్యగానే ఒక్క పరుగున వచ్చి కాళ్ళ చుట్టూ తిరిగింది. దీన్ని యెలా పంపించనండీ బయటికి! మీరు కూడా పంపించలేరు. పోనీలెండి. ఈ బుజ్జిముండతోటి నాకు బాగ కాలక్షేప మవుతోంది. మీరు క్యాంపుకెళ్ళినప్పుడు ఒక్కదాన్ని బిక్కుబిక్కుమంటూ వుండేదాన్నా! ఇప్పుడా భయంలేదు. ఏదో కాలక్షేపమవుతుంది. ఈ బెల్టు వీరయ్య చేత తెప్పించానండీ. ఏమంత బాగా లేదు. సాయంకాలానికి మీరొక మంచి బెల్టు తెచ్చి పెడతారు కదూ! తప్పక తేవాలేం! మంచివారు కదూ! తెస్తారు. పిచ్చిముండా వస్తున్నానే. నాన్నారికి కాఫీ యివ్వవద్దూ"

    నాకు తలపట్టుకోవాలనిపించింది. 

    అసలే నా సహజప్రవృత్తికి కుక్కలంటే పరమ అసహ్యం. నేనేమైనా మూర్ఖంచేసి దాన్ని వెళ్ళగొట్టిస్తే అరుణ అన్నం నీళ్ళూ మానేస్తుంది. అది తథ్యం, కనుక భరించవలసిందే. తప్పూదు. భగవంతుడా అరుణకుగాని పిచ్చెత్తదుగదా!

    భగవంతుడికి రెండుచేతులూ యెత్తి మనస్సులోనే నమస్కరించాను. 

    రోజురోజుకీ వాళ్ళిద్దరిమధ్యా ప్రేమానురాగాలు యెక్కువవుతూ వున్నాయి. చూస్తున్నాను. నాకు చాలా కోపంగాను కూడా వుంది. అయినా యేమీ చెయ్యలేక చూస్తూ వూరుకున్నాను. ఈమధ్య క్యాంపులు కూడా లేవు. రోజురోజుకీ భరించలేకుండావున్నాను అరుణ వ్యవహారం. దానికి నీళ్ళుపొయ్యటం, పాలు పొయ్యటం, షికార్లు తిప్పటం మొదలైనవన్నీ కళ్ళప్పగించి చూస్తూ వుండవలసి వస్తున్నది. 

    చివరకు నాగురించి కూడా శ్రద్ధ తక్కువైంది అరుణకు. ఎప్పుడేనా నేను విసుక్కుంటే "యేం చేసేదండి. బుజ్జిగాడి అల్లరి రోజురోజుకీ మరీ యెక్కువవుతున్నది. ఏపనీ చేసుకోలేక పోతున్నాను" అనేది. 

    ఒక్క నెలరోజుల్లో అరుణ పెంచిన కుక్కపిల్ల వచ్చినప్పటికి రెండింతలు బలిసింది. నున్నగా నిగనిగలాడుతూ బొచ్చుపెరిగి వొక్కొక్కసారి నాక్కూడా ముచ్చటయి ఇదివరకున్న కోపంకాస్తా కరగిపోతున్నదా అనిపించేది.

    ఒక రోజున కృష్ణారావు నాతో పనుండి వచ్చాడు.

    మా కుక్కపిల్ల కాస్తా కృష్ణారావు మీద యెగబడ్డది.

    అరుణ దాన్ని యెత్తుకుని లోపలికి తీసుకునివెళ్ళినదాకా కృష్ణారావు అలానే వాకిట్లోనే నిలబడిపోయినాడు.

    లోపలికి వచ్చి కూచున్న తర్వాత "ఛాఛా కుక్కపిల్లను పెంచుతున్నావటోయ్. అవంటే నాకు పరమ అసహ్యం. వెధవ న్యూసెన్సూ..." అన్నాడు కృష్ణారావు. నేనేమీ సమాధానం చెప్పలేదు. అయితే తలుపుచాటున నిలుచుని వున్న "అరుణ నేతాలు" మాత్రం నా కళ్ళలో కదిలినై.

    కృష్ణారావు యింకా కాసేపు కుక్కలని తిట్టి వెళ్ళిపోయాడు. కృష్ణారావు అలా వెళ్ళాడో లేడో అరుణ వుప్పెనలా వచ్చి "ఆయన ఇంక మనింటికి రావలసిన పనిలేదు" అని చెప్పింది.

    ఇంకా నయం. అతడు వుండగానే చెప్పలేదు. చెపితేమాత్రం నేను చేసేదేముంది.

    రెండు నెలలు గడచిపోయినై. ఇంకో నెలరోజుల్లో నేను మళ్ళీ క్యాంపుకి పోవలసివుంటుంది. వర్షాలు ప్రారంభమై నాలుగైదు వానలు కురిసినై. 

    ఒకరోజు ప్రొద్దున్నే లేచి ముఖం కడుక్కుని మామూలుగా కాఫీ కొరకు వంటింట్లోకి వెళ్ళాను. కుంపటి ముందు కూచుని అరుణ చేతికేమిటో తడిగుడ్డ చుట్టుకుంటున్నది. నన్ను చూడగానే నేను చూడకూడదనే వుద్దేశంతో గబగబా చేతికి చుట్టుకోవటం ప్రారంభించింది. నేను ఆమె చేతిని నా చేతుల్లోకి తీసుకుని ఆ తడిగుడ్డ విప్పి చూచాను.

    ఆమె తల వంచుకుంది.

    అరటిపువ్వులాటి ఆమె మణికట్టు పైభాగంలో రక్తపు మరకలు చూసిన తర్వాత నా కళ్ళు చెదరిపోయినయ్. "ఏమిటైంది?" అన్నాను.

    ఆమె చిరునవ్వుతో 'బుజ్జిగాడి అల్లరి' అంటే నా పై ప్రాణాలు పైనే పోయినయ్. నిజంగా యీమెకు పిచ్చి పట్టిందా! నా కళ్ళు చెమర్చాయి. భగవంతుడా అరుణకు పిచ్చి పట్టిందా!?

    ఇల్లు నాలుగుమూలలూ వెతికాను. కుక్కపిల్ల కనపడలేదు. కనపడితే దాన్ని గొంతుపిసికి చంపాలని. వీరయ్య చేత రిక్షా పిలిపించాను. ఆమె యేమంటున్నా వినిపించుకోకుండా డాక్టరు దగ్గరకు వెళ్ళి కట్టు కట్టించాను. గోళ్ళతో గీకిన గాయమేనట. అదృష్టవంతుణ్ణి. బ్రతికి పోయాను. అవాళ ఆఫీసుకు సెలవు పెట్టాను.

    డ్రాయింగురూములో కూచుని పని చేసుకుంటున్నాను. అరుణ వచ్చి నా పక్కనే నిలుచుంది. కళ్ళెత్తి ఆమె వేపు చూశాను. అరుణ కళ్ళనీళ్ళు పెట్టుకుని "బుజ్జిగాడు ఎక్కడా కనపడలేదు. ఇల్లంతా వెతికాను" అన్నది. పీడా పోయింది అనుకున్నాను మనస్సులో. "ఎక్కడకూ పోదు. మళ్ళీ వస్తుంది" అన్నాను. అరుణ దిగులుగా చూసింది. వాకిట్లోనే కనిపెట్టుకుని కూచుంది. పన్నెండైనా కుక్కపిల్ల రాలేదు. నాకు సంతోషంగానే వుంది, కాని అరుణను చూసి నాకూ దిగులుగా వుంది. అరుణ అన్నం తిననని పట్టుపట్టింది. ఎంతో బ్రతిమాలిన తర్వాత కొద్దిగా తిన్నది. నాకు కొత్త దిగులు పట్టుకుంది. అరుణ యీ దుఃఖాన్ని యెలా మరచి పోవాలి. సాయంకాలమైనా కుక్కపిల్ల రాలేదు. అరుణ ఆ రాత్రి అన్నం తినలేదు. ఎంత బ్రతిమాలినా వినలేదు. 

    మర్నాడు ప్రొద్దున ఆశగా నిద్రలేచింది. కాని కుక్కపిల్ల కనపడలేదు.

    "మీరు డాక్టరు దగ్గరకు వద్దో మొఱ్ఱో అంటే వినకపోతిరి. మనం డాక్టరు దగ్గరకు పోయినప్పుడు యీ నిద్ర పెద్దమ్మ వీరయ్యని మోసం చేసి బుజ్జిగాణ్ణి యెవరో తీసుకపోయి వుంటారు. నా బుజ్జిగాడు నాక్కావాలిప్పుడు. తీసుకురాండి" అని వీరయ్యని తిట్టింది. నన్ను సాధించింది. తనని తాను తిట్టుకుంది. "వీరయ్యా బుజ్జిగాణ్ణి తీసుకురా. నీకు పది రూపాయలిస్తాను. వెతుకుపో.వెతుకుపో" అని వీరయ్యని బ్రతిమాలుకుంది.

    అరుణని చూస్తుంటే భయమవుతున్నది. దిగులవుతున్నది. ఆవాళకూడా కుక్కపిల్ల ఇంటికి రాలేదు.

    అరుణ ఆవాళకూడా అన్నం ముట్టలేదు.

    నేను యెంతో బుజ్జగించాను. "వస్తుంది. ఎక్కడో వుంటుంది. ఎవరో కట్టేసే వుంటారు చిన్నపిల్లలు. వీల్గాక వుండేవుంటుంది. ఎప్పుడో వాళ్లు యేమరివుంటే పరుగెత్తుకుని వస్తుంది. నామాట వినవూ. అబ్బే ఇలా అయిపోతారా పిచ్చీ. నువ్వు ఇలా అయిపోతే నాకెంత దిగులవుతుందో వూహించుకో"

    అరుణ నావైపు దిగులుగా చూసింది. వీరయ్య ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు. మూడోరోజు కూడా కనపడలేదు. అరుణ అన్నం తింటూనే వుంది. ఐనా ఏదో చెప్పలేని దిగులు, నిర్లిప్తత. నాలుగోరోజు నేను ఆఫీసునుంచి వస్తూ ఇలా ఆలోచించుకున్నాను. "కనపడింది. పదిరోజుల్లో పంపిస్తామన్నారు వాళ్ళు" అని చెపుదామని ఆలోచించాను. పదిరోజులయ్యేసరికి కొంత స్వస్థ పడుతుంది. చిన్నగా అలవాటవుతుంది అని వూహించాను.

    ఇంటికి వచ్చి యెంతో ఉత్సాహంతో అరుణని పిలిచాను. అరుణ వచ్చింది.

    "మన బుజ్జిగాడు కనపడింది అరుణా. ఆ వీథిలో వాళ్ళింట్లో వుంది. వాళ్ళ పిల్లలు సరదాపడ్డారు పాపం. పది రోజుల్లో పంపిస్తామని చెప్పారు" అన్నాను. 

    అరుణ నాకు బాగా దగ్గరగా వచ్చింది. నా ముఖంలోకి చూస్తూ "నాకేం మాయమాటలు చెప్పనక్కరలేదు. నన్నేం మోసపుచ్చ నవసరం లేదు. ఇందాక వీరయ్య చెప్పాడు. ఆ వీథిన నా బుజ్జిగాణ్ణి చంపేశారట, పిచ్చెక్కిందని చంపేశారట. నా బుజ్జిగాడికేం పిచ్చెక్కలేదు. వాళ్ళకే పిచ్చి పట్టింది. వాళ్ళు పశువులు. వాళ్ళు మనుషులు కారు. అమ్మో కఱ్ఱలతో కొట్టి చంపివుంటారు. వాళ్ళు మనుషులు కారు. పశువులు, మనుషులు కారు..." అంటూ నా వొళ్ళో తల ఆన్చి వెక్కి వెక్కి యేడ్చింది అరుణ.

(జయంతి మాసపత్రిక జనవరి 1959వ సంచికలో ప్రచురితం)      
Comments