ఆటకట్టు - వీరాజీ

    
గెడ్డం మాసింది.

    వార్తాపత్రికలతోబాటు ఓ వారపత్రిక కూడా అర్జెంటుగా కొనుక్కొని వస్తున్నాను. వార్తలు, వారపత్రికలలో పచ్చళ్లు, కూరలూ శీర్షికతో సహా బొమ్మలూ ప్రకటనలూ  చదివేయడం; కాఫీ కఫేలు - అవీ తప్పితే సినీమాలు. వీటితో ఆత్మీయత, యీమధ్య చెక్రవడ్డీలాగ పెరిగిపొయింది. ఇటీవల దైనందిన కార్యక్రమం తృప్తి నివ్వదు గాని మహ అర్జంటుగా దాన్ని నెరవేర్చుకోడంలోనే ఉంది అంత శ్రద్ధా. సమాధానం రాని అప్లికేషనుమీద ఆశా, అక్కర్లేని సినిమా చూసి సంతోషపడ్డంలో గొప్పా, అలవాటై పోయింది.

    విద్యార్థి నిష్క్రమించి ఉద్యోగి ప్రవేశించలేదు ఎదనింకా. అయినా యింత వెలితి ఎందుకనో...

    పాఠాలు వెళ్లిపోయాయి. పరీక్షలు ఏడాదికి మూడుమార్లు అదో మాదిరి మలేరియాలా దాపురించేవి యిక రావు! గతానేక సంఘటనల్లో కలిసిపోయాయి. అయితే వెలితి మిగిలింది... ఎందుకు చెప్మా! సిలబస్‌లనేవే, పరిమితంగా ఉంటాయి! అందులోనించి కాంపోజిషనులు రాసుకుని ఆనక వాటినే ఇంపోజిషను రాసుకుని పరీక్షలు రాసేసి(పారేస్తే) అమ్మయ్య అనుకుంటాం. మూడోవంతు మార్కులకోసం మనమూ, అవి యిద్దామనే వాళ్లూ తాపత్రయం పడతాం. ఈ మూడోవంతు వ్యవహారం అతి రహస్యమేం కాదు గనుక, మేష్టార్లు యింతకి మించి చెప్పరు. చెప్పినా కుర్రాళ్లు వినరు. సరే... పేపరు తీసి చూద్దామా అనుకున్నాను. హెడ్‌లైన్లు చదువుదా మనుకున్నాను. కాని దాం దుంపతెగిరి ఎక్కడో తిరుగుబాటు సైన్యం చేత ప్రభుత్వ కైవసం. ఆఫ్రికాలోదో, ఆసియాలోదో కాబోలు. సోషల్ స్టడీసులో లేని రాజ్యంలో తిరుగుబాటూ గట్రా ఉంటుంది. దానికోసరం యిప్పు'డట్లాసు' వెతుక్కోవాలి. అంచేతనే తిన్నగా రెండోపేజీ చూస్తే చాలునులే అనుకున్నాను.

    కాని ఉద్యోగాల కాలమ్ చూడ్డానికి ధైర్యం ఉండాలి. అలవాటుండాలి. తెల్లార్లూ టీ తాగుతూ తూలుతూ పరీక్షలు చదివినప్పుడేనా మెడపీకలేదు గాని యీ ఉద్యోగాల (కలి) కాలమ్  చూసేసరికి దాహం వేస్తుంది. బ్రతుకు భయం కాలేజీగేటు దాటగానే వస్తుందని బళ్లో చెప్పని పాఠం. నిజమే! గాని అది అంచనాకు మించి వచ్చింది. అయితే నాయీ ఉద్యోగపర్వంలో అదో ఆశ. తృప్తిలేకపోయినా రేపటిమీద మమకార ముంది! ఎండమావులైతేనేం? దాహం వేసేవాడు పరుగెత్తాలంటే అవేనా అగుపించాలిగదా?

    మా పోస్టుమ్యానుతో ఎంతో దోస్తీ ఐపోయింది నాకు. మూడు బిందెలు ఒకదానిమీద ఒకటి పెట్టుకుని వాటిని నెత్తిన పెట్టుకుని, ఐనా ఒయ్యారంలో లోపం రాకుండా పంపునించి నీళ్లు పట్టుకుపోయే కాపు పిల్లలు కూడా నన్నంత ఆకర్షించడంలేదీ మధ్య. అందమైన వస్తువు కనిపిస్తే కళ్లు పూర్వం నాలుగూ, ఆరూ అయ్యేవిగాని యీమధ్య గెడ్డం తడుముకుంటే బాగుణ్ణు! అనిపిస్తోంది.

    వెనుక (అబ్బ! అప్పుడే కాలేజీ బ్రతుకు గతం అయిపోయింది.) పోస్టుమేన్ ఉత్తరాలివ్వడం అందుకోవడం అలవాటులేదు, ఎప్పుడూ మణియార్డర్లను సంతకం చేయడం తప్ప. ఆ పోస్టుమాన్‌లు ఒక్కడేనా జ్ఞాపకం లేదు నాకు.

    కాని యిప్పుడో... మా పేపరు అప్పారావు తలలో తెల్ల వెంట్రుకలున్నాయని, మా పోస్టుమాను శ్యామూల్ పిల్లలవాడనీ (పేరుకూడా ఎంతో జ్ఞాపకం) అతని మొహాన కందికాయ ఉందనీ యివన్నీ తెలుసు. చిన్నప్పుడు మాష్టారు ట్రైయాంగిల్ అంటే త్రిభుజము అని కంఠోపాఠం చేయమన్నారు. చూస్తే తెలియదూ? దాందుంపతెగ త్రిభుజానికి ఎన్ని భుజాలో!... కాని పాఠాలు శ్రద్ధగా చదవాలని మాష్టార్లు అలా చెప్తారుట(!)

    అప్పారావు పేపరు అందిస్తూ నవ్వుతాడు.

    అందుకుంటూ నేను నవ్వుతాను. పోస్టుమానూ అంతే. మా వ్యవహారం నవ్వులూ, యివన్నీ - రైలు రావడం రెక్కవాలడం, రైలు వెళ్లడం రెక్క లేచిపోవడం లాంటివి.

    ఇవాళ  శ్యామూల్ యింకా రాలేదు. అతగాడి కొడుకు మెట్రిక్యులేషను ఒక్క మార్కులో పోయిందటా. ఒక్క మార్కు కాదు, ఒక్క సంవత్సరం! అంటాడు శ్యామూలు.

    'నామాట విని చదివించు ప్యాసవుతాడు' అంటే నువ్వేం చేస్తున్నావు ప్యాసై అన్నాడు నా అంతవాణ్ణి నన్ను శ్యామూలు. 'ఫేలైతే ఏ పనేనా చేసుకుంటాడు. ప్యాసైతే అదీ నామార్దాయే' ఇది శ్యామూల్ బ్రతుకు గురించి చెప్పే వేదాంతం! శ్యామూల్ చెప్పు తెగిందట. 'అందుకాలస్యం గంటన్నరా?' అడిగాను నేను. 'అబ్బే! మెయిలు గంటప్పావు లేటు మామూలేగా, నా జోడు కుట్టించుకోటం మరో పావుగంటా!' శ్యామూల్‌కి లెక్కలు వచ్చును. ఆల్జీబ్రా తెలిసిన నాకు మెయిలు అసలు టైము తెలియదు. దసరా కట్నం అడగడమే కాని క్రిస్టమస్ బక్షీస్ అడగడం శ్యామూల్‌కి రాదు. క్రిస్టమస్ ఎందుకో తెలిసిన్నాకు, దసరా సంగతి సందర్భాలు తెలియవు!

    నేను అనుకున్నట్లే గవర్నమెంటు ముద్దర్లు లేని ఉత్తరాలే యిచ్చాడు శ్యామూల్. బహుశా మిత్రకోటిలోని ముఖ్యరత్నాలై యుంటారు. ఐనా ఆశ చెడ్డది. ఎవరేనా రాశారేమో ఫలానా దగ్గర ఫలానా ఖాళీ ఉంది, ఫలానావాణ్ణి పట్టుకో దూర్చేస్తాడూ అని.

    అలాగే పేపరులోనూ అంతే. నా నోరు తిరగని పేరుగల ఆఫ్రికాదేశంలో విప్లవం. మొత్తానికి సైనిక స్వామికం ఎక్కడో అక్కడ రోజూను! ప్రజస్వామ్యం తరువాతిది. ఈమధ్య అదే! 

    "తస్మాత్! యీ విప్లవజాడ్యం మనకు రాకుండుగాక" అని రావాలనే బోలెడు కోర్కెతో ఓ ప్రతిపక్ష నాయకుని ప్రకటన. "అది రావడానికి ప్రతిపక్షులే నాంది కాగలరు" అని అధికార శిరోమణి ఒకడు ప్రతి ప్రకటన.

    సరే పేపరు రెండోపేజీ తాపీగా చూడాలని వాయిదా వేసి ఉత్తరాల్లో ఉద్యోగం, కుశల ప్రశ్నలు, పెళ్లి సంబంధం యీ మూడూ తప్ప నాలుగోది ఏమి ఉండగలదా? అని పోస్టలు ముద్రలు పరిశీలిస్తూ యింటి గుమ్మం ఎక్కుతూవుంటే సైకిలు గంట 'కింఖ్రిణేల్'మని.

    "ఏంరా! బావగారూ! లవ్ లెటర్సా?" మా సైకిల్ బావ ప్రశ్న. "మరే! నా గెడ్డం చూడు" అన్నాను. వాడు "సెంటిమెంటల్ ఫూల్!" అంటూ వెళ్లిపోయాడు. 'డామిట్! వీడిలాగే నేను కూడా ప్రేమలేఖలు రాస్తే ఎవడి చెల్లెలి మెళ్లోనో పుస్తె కట్టి వాళ్ల బావు జేబులో నుంచి సైకిలు కొనుక్కొని కింఖ్రిణేల్ మనుకుంటూ ముప్పైయ్యో యేట  ఎం.బీ  చదవాలి' అనుకున్నాను.

    ఔనుమరి! ఈ సైకిలు బావ అంటే మా పెద్ద చెల్లాయి భర్త.

    మరో పంచె బావ ఉన్నాడు. అక్కయ్య మొగుడు. ఇద్దరి పేర్లూ కోటీశ్వరరావులే గనుక యీ సంకేతాల అవసరం వచ్చింది. ఈ సైకిలుబావ మా చెల్లాయికి ప్రేమలేఖలు రాసి ఆనక ఉద్యోగం మాని, మా నాన్న భుజాల కష్టం మీద ఎం.బీ కి వెళ్తున్నాడు.

    సరే! ఉత్తరాలను పేపర్లనూ, ఆశగా చూసుకుంటూ లోపలికి వెళ్లాను.

    "ఏమే! రాణీ, మీ ఆయన బళ్లోకి వెళ్లాడా? వీడేడీ? విశ్వం!" అంటూ అమ్మ నా కోసరమే కాఫీ పట్టుకొస్తోంది.

    "ఆఁ! ఆఁ! వెళ్లారు. సైకిలు లేదుగా..." అంటూ అమ్మకి చెపుతూ చెల్లాయ్ వచ్చింది. "అదుగో అన్నయ్య" అంది. వారపత్రిక తీసుకుంది. అందులో అది 'అప్పడాలు వత్తుట' మీద ఎవరో రాసిన వ్యాసం మీద వచ్చిన అభిప్రాయం మీద తన ఖండన రాసింది. అందుకు... దాని ఆదుర్దా దానిది.

    "ఊరు తెల్లారకండా ఎక్కడికిరా? బయల్దేరావు. కాఫీ పట్టుకు గంటైంది. కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నా...' అమ్మ మూర్తీభవించిన అమృతమూర్తిలా నిల్చునుంది నా గది గుమ్మంలో.

    "మరేఁ! ఉద్యోగం వెతుక్కుందికి వెళ్లానమ్మా" నవ్వుతూ (నవ్వు అద్దంలో చూసుకుని ప్రాక్టీసు చేశాను లెండి) కాఫీ అందుకున్నాను. 

    "అలాగేం? మా అన్నయ్యవి కదూ!... అక్కడ మన కాలవలో వలేస్తే ఉద్యోగాలు పడ్తాయి కదురా? అన్నాయ్.' చిన్న చెల్లాయి శాంతి నవ్వుతూ వచ్చింది. అంతలో అక్కయ్య, "అది పోనీండిగాని, ముందు టిఫిను తిను, ఆనక స్నానం చేద్దువుగాని" అంటూ ఇడ్డెన్లు ప్లేటులో పట్టుకుని వచ్చింది.

    ఇంట్లో టిఫిన్లు తంతు అక్కయ్యది - పై పెత్తనం శాంతిది.

    "చూడవోయ్! అబద్ధం కాదు..." 

    పేపరు ఫట్‌మని పేజీలు విడేటట్లు దులిపి "యివన్నీ ఉద్యోగాలే" నన్నాను నేను శాంతి నుద్దేశించి.

    "బావుందర్రా మీ వరస! యివందుకోండి, నా కవతల పన్లున్నాయ్!" అని 'అవి' యిచ్చి అక్కయ్య వెళ్లిపోయింది.

    అమ్మ నవ్వుతూ కప్పు నందుకుని "ఓరినీ! అన్ని ఉద్యోగాలెందుకురా నాన్నా, మనకీ? నీకేది ప్రాప్తముందో అదే వస్తుంది. ఉద్యోగమూ రాక యీడొచ్చాకా పెళ్లామూ రాక ఏమవుతుంది? రోజూ, తెల్లారకండా యీ పేపరు సేవ మానేసేయ్" అని వెళ్లిపోయింది.

    అమ్మకు భయం. ఆ యింతా నేను చిక్కిపోతే ఆడపిల్లల తండ్రులు యీ యింటిమీద కాకులై వాలరని!

    "శాంతీ! సురేష్‌ని పోయి నాలుగు పొడుగు కవర్లూ ఒక ఉత్త కవరూ, స్టాంపులూ అవీ అన్నీ తెమ్మనవూ?"

    "ఎందుకండీ! దొరగారూ! ఎవరికి  ఉత్తరాలు రాస్తారేమ్...?" కొంటెపిల్ల శాంతి ఆశగా అడుగుతుంది.

    "చెబుతాగా... మీ ఆయన్ని వెతకాలి. త్వరగా రాపో."

    "ఛీ! ఫో! నే చెప్పను... ముందివాళ ఒచ్చిన ఉత్తరాలు చూపించు..."

    పిచ్చిపిల్ల దీనికి మాధవి రాసే ఉత్తరాల్లో ప్రేమ ఉంటుందని నమ్మకం. అనుమానం. కాని మాధవికి పెళ్లయి పోయిందని మొగుడికి ఉద్యోగం కూడా ఐపోయిందనీ తెలియదు. అన్నయ్యలంటే నవమన్మథులనో గోపీలోలురనో అనుకునే చెల్లెమ్మల్లో మా శాంతిది ఫస్టుమార్కు.

    ఉత్తరాలు బల్లమీద పడేసి కుర్చీలో కూలబడి బల్లమీద కాళ్లు పారేశాను.

    శాంతి నవ్వుతూ "ఐతే దాచుకో"మని వెళ్లిపోయింది. ఆడపిల్ల కదా! బల్లమీద పడేసి చూసుకోమంటే దాచుకోమంది. దాచుకుంటే చూస్తానని రక్కుతుంది.

    తొలి ఉత్తరం చింపేను. "నీతో గడిపిన రోజులు ఎలా మరిచిపోను డియర్!..." నవ్వొచ్చింది నాకు... మా శంకరం... రూర్కెలాలో ఉద్యోగం అయింది వీడికి. అయినా విచారిస్తున్నాట్ట! నాకే ఆ ఉద్యోగం అయితే వీణ్ణి వీడితో గడిపిన రోజులూ కూడా కలిపి మర్చిపోదును... ఏమో... కాని వాడు రాసిన ఉత్తరం అంతా చదివేసరికి నిజమే 'వీడు నన్ను యెంతో ప్రేమించాడు' అనుకున్నాను. దూరాభారం కూడానా?... రైలుకి వెళ్లి చూడాలి. రూర్కెలా వెళ్లిపోతున్నవాణ్ణి ధైర్యం చెప్పి పంపాలి.'అది నా తక్షణ కర్తవ్యం' - 

    "ఇదిగో కవర్లు... త్వరగా స్నానానికి రమ్మని పెద్దక్కయ్య చెప్పింది" సురేష్ వచ్చాడు - వాడెప్పుడు పరిగెడుతూనే వస్తాడు - నడక అలవాటులేదు.

    "చేస్తానుగాని, అమ్మావాళ్లూ ఏం చేస్తున్నార్రా?" అని అడిగాను. ఇంకా మా శంకరం గురించే ఆలోచిస్తున్నాను.

   సురేష్ కుర్రవెధవే ఐనా అదోలా నవ్వి "నీ గురించే మాట్లాడుకుంటున్నారు" అన్నాడు.

    "చచ్చేమ్! ఉద్యోగం, సద్యోగం లేదని కాదుగదా?" సరిగా అటెన్‌షన్‌లో కూచున్నాను.

    "ఊహూ... మామయ్య వచ్చారుగా! బ్రహ్మచారి ముదిరినా, బెండకాయ ముదిరినా... అని..." అంటూ వాడు చేతికందకుండా తుర్రుమన్నాడు.

    "హే భగవాన్! మావయ్యల నెందుకురా పుట్టించావ్" తల తాటించి కుర్చీలో వెనక్కి చేరబడిపోయాను. నేను ఆటలాడుతున్నా నంటాడు అతగాడు. పైగా నా ఆట కట్టిస్తా నంటాడు - దుంపతెగ... ఇంత పిసరు సానుభూతి లేదు. పైగా "మా రోజుల్లో ఇంకా తిప్పలు పడ్డాం... పెద్దవాళ్ళ కాళ్లుపట్టి వీపుగోకి బ్రతికి బాగుపడ్డాం... ఢక్కామొక్కీలు తినాలిరా... ఓ కాయితం ముక్క తేడం... దానిక్ ఫ్రేము బిగించడం ఆనక 'డిగ్రీ' అంటూ పెద్ద కబుర్లూ! అయితే, ఇంతవాళ్ల మవుదుమురా" అంటాడు. ఆ కాయితం ముక్కకై ఎన్ని అహర్నిశలు అఘోరించామో తెలీదుకదా ఆయనకి! ఉత్త పాతకాలం మనిషి మరి. ఏం చేస్తాం!

    ఎక్కడో సమ్మంధాలున్నాయంటాడు. ఎవడ్నో పట్టుకుంటే ఉద్యోగం వస్తుందంటాడు. దగాగోర్ బడాయికోర్ మామయ్య.

    'హతవిధీ! నాకు పెళ్లాం అవసరమో కాదో నాకు తెలియదా? ఇంత నమ్మకం నామీదనున్నదే వీళ్లకి. ఏం చేయాలి? ఆ పిల్లదెవరో దానిక్కూడా ఈ నమ్మకం నా మీద నుండొద్దా? దానికి ఆలోచనలే ఉండరాదు కాబోలు!! ఈ మాటే బయటికన్నానో, బాబోయ్? ఒక్కసారి కంచుగంటల్లాంటి మూడు కంఠాలు నామీద దాడిచేస్తాయ్! మామయ్య క్రౌర్యం దీనికి గుణకమవుతుంది. ఉద్యోగం ఐతే గాని పెళ్లి యేమిటీ? అంటే చాలు.'

    "మీ ఆవిణ్ణి ఒంటి స్తంభం మేడలో కూచోబెట్టి పారాయిస్తో ఉంటావా? లేక కృష్ణపరమాత్మలా పాదతాడనం చేయించుకుంటావా?" అంటుంది కొంటెగా అక్కయ్య. 

    బావ ఏం చేస్తాడో మనకి తెలియదుమరి. పోన్లే పెద్దదాని రహస్యాలు మన కెందుకుకని గాని లేకపోతేనా?...

    అంతలో అమ్మ నా అభ్యుదయ భావాలన్నీ 'నేరాలు' క్రిందే జమ కడుతుంది.

    "నీకు ఉద్యోగం వచ్చేకా పెళ్లాం కావాలా? అంటే ఉద్యోగం, పెళ్లీ, రెండూ చంక నెత్తుకుని నువ్వు చక్కాపోతానంటావ్? అంతేనా? చూశావురా అన్నయ్యా! వీడి తంతు. ఇక నాకు వీడు ఆలి వచ్చాకా కూడేం పెడతాడ్రా" అని వాళ్లన్నయ్యకి (పైన నేను మనవిచేసిన విలన్‌కి) ఫిర్యాదు కూడా చేస్తుంది వెర్రిబాగుల అమ్మ.

    అమ్మకి వాళ్లన్నయ్య నూటపదహారు వన్నెల బంగారం - 

    ఆ మామయ్య వెంటనే "అంతవాడే వీడు" అంటూ అందుకుంటాడు - పైగా "ఆ మూడు ముళ్లూ వేశాకగాని వీడికి ఉద్యోగం రానివ్వకూడౌ - ఇలా ఐతేనేగాని వీడి ఆటలు కట్టవ్" అంటాడు కూడాను. 

    నా అభ్యుదయ భావాల మీద అమ్మకు కలిగే అపోహలను తొలగించడం బ్రహ్మతరం కూడా కాదు. ఈ ఒక్క మామయ్యకు తప్ప - ఈ ఆడ అమ్మలు, అక్కలు, చెల్లెలూ మొదలైన వాళ్లతో వాదించగాల తర్కజ్ఞానం గాని వాదనా పటిమగాని ఏ టెక్స్ట్ పుస్తకంలోనేనా రాసినా బాగుణ్ణు! మొత్తానికి నా నోరు కట్టుబడిపోయిన గంటదాకా వాళ్లంతా నా మీద దండయాత్రను ఉపసంహరించుకోరు.

    పేపర్లో 'వాంటెడ్ కాలమ్స్' చూస్తూచూస్తూ ప్రాణం విసిగి 'మాట్రిమోనియిల్' కాలమ్స్ కేసి కన్ను తిప్పుతానో లేదా, కాలేజీలో ఇంటర్‌మీడియేట్ వెలగబెట్టిన నేరాన, ఇట్టే పసిగట్టేస్తుంది ఆ విషయం చెల్లి.

    "ఒరే! దాచినా దాగదురా... నీ కెందుకురా ఆ శ్రమ? రంభలాంటి పెళ్లాన్ని..." అంటుదది. దాని మాటలను సగంలోనే అందుకుంటాడు మావయ్య... "వాళ్ల నాన్న అనగా 'రంభ' నాన్న వేయించే ఉద్యోగాన్నికూడా తెస్తాం" అంటూ పూర్తి చేస్తాడు.

    "మీకు జీవితమంటే ఆటగా ఉందన్నమాట?" నేను అభిమన్యుడంత కోపం ప్రదర్శిస్తాను.

    అంతా నవ్వేస్తారు.

    "మాకుకాదు జీవితం అంటే ఆటగా ఉంట - అది నీకే... అది కట్టించాలనే వెళ్లారు మీ నాన్నగారు" అంతా ఏకగ్రీవ తీర్మానం చేస్తారు.

    "నేను... నేను... పార్వతీశంగారి ఇంటికి వెళ్తాను చదరంగం ఆడుకుందికి - "

    లేచి  వెనుదిరగకుండా వెళ్లిపోతున్నాను - ఆడియన్స్ అల్లరి ప్రారంభిస్తే స్టేజీమీద నించి వింగ్‌లోకి పారిపోయే నటుడిలాగ!

    గుమ్మంలో అసలు సూత్రధారి ప్రత్యక్షం.

    "ఏరాఁ... విశ్వం! ఉండు నీతో మాటాడాలి" అంటూ నాన్న ఎదురయ్యాడు.

    తిరిగి మేకపిల్లలా వచ్చి కుర్చీలో కూలబడ్డాను.

    "కాయా? పండా?" నాన్న అంటే బొత్తిగా (ఆయన బొద్దు మీసాలంటే కూడా) భయంలేని అమ్మ ప్రశ్న!

    "పండున్నరా" నాన్న జవాబు.

    "ఆటకట్టు" విలన్ మామయ్య ఆనందం. చివరికి కథ అంతా టూకీగా ఏమిటయ్యా? అంటే... "తాంబూలాలు పుచ్చుకుంటే నేను కోరిన ఉద్యోగం ఆనక కన్యాదానం చేస్తాట్ట ఓ మోతుబరిగారు. పేరెందుకు లెండి పెద్దమనిషిగదా..." 

    పార్వతీశంగారితో చదరంగం ఆడుతున్నాను. ఐనా మూడేళ్ల క్రితం జూలైలోనే, పదిహేనో తేదీనాడు రాత్రి అవతల వానకురుస్తో ఉంటే కిటికీలోనించి మీదపడే 'జల్లు' ననుభవిస్తో డైరీలో రాసుకున్న మాటలు... 'నేను ప్రేమించి పెళ్లి చెసుకుంటాను... అదీ ఉద్యోగం వచ్చాకా పెళ్లి చేసుంటాను... దమ్మిడీ కట్నం అడగను' అని రాసిన కవిత్వమే జ్ఞాపకం వస్తోంది నాకు. 

    "ఇదిగో నా గుర్రం గెంతింది... నీ ఆట కట్టు!" పార్వతీశంగారికి, ఛెస్సాటలో గెలిస్తే హిట్లరంత శరీరమై పోతుంది!

    "ఆటకట్టు!" అన్నమాట ఫెడీలుమంది తగిలింది నా కర్ణపుటాలకు.

    "విలన్ మామయ్య ప్రవేశించాడుగా లేపోతే ప్రేమించే పెళ్లి చేసుకుందును" అన్నాను పిక్కలు కలిపేస్తూ నేను.

    "ఇంకా చెప్పావుకాదు...? ఉద్యోగం ఇచ్చే మామగారేనా?..." అంటూ పార్వతీశంగారు తనకే మరో పెళ్లి కాబోతున్నంత సంతోషంగా నా వీపుమీద 'ఛెళ్లు'న ఒక్క చరుపు చరిచాడు.

    "అదీ సంగతి... అందుకే అబ్బాయిగారి ఆటగట్టిందీ' అన్నాడు మళ్లీ పరమరహస్యం కనిపెట్టినట్లు.

(భారతి మాసపత్రిక జూలై 1963 సంచికలో ప్రచురితం) 
Comments