అతిథి సత్'కారం' - ఎమ్బీయస్ ప్రసాద్

    
పొద్దున్న లేవగానే అనుకున్నాడు రాజా - 'సావిత్రిని దువ్వే కార్యక్రమం ఎంతమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదని.' శ్రీనివాసుగార్ని డిన్నర్‌కి పిల్చినది ఈ రాత్రికే. సావిత్రికి ఇంకా ఆ విషయం తెలియనే తెలియదు!

    అసలు నిన్న రాత్రి చెప్పవలసినదీ విషయం. శ్రీనివాసుగార్ని మధ్యాహ్నం ఆఫీసులో కల్సినప్పుడు అతికష్టం మీద ఆయన్ని డిన్నర్‌కి ఒప్పించాడు. వెంటనే ఆ విషయం ఫోన్లో సావిత్రికి చెప్పేయచ్చు, తగిన ఏర్పాట్లు త్వరగా చేసుకొనేందుకు వీలుగా.

    అయినా ఎవర్నైనా ఇంటికి భోజనానికి పిలిచిన విషయం భార్యకు చెప్పడానికి ఏ భర్తయినా వణుకుతాడన్నది జగమెరిగిన సత్యం. భర్త స్నేహితులు, బంధువులూ ఎందుకూ కొరగానివారని ప్రతీ భార్య ప్రగాఢంగా నమ్ముతుంది. అందుచేత తన ఫ్రెండుని భోజనానికి పిలుద్దామనే ఉద్దేశ్యం తనకు ఏ కోశానా లేదనీ, వాడంతట వాడే వస్తానంటే వద్దనలేక పోయాననీ భర్త నమ్మబలక వలసి ఉంటుంది. ఇదంతా ఫోన్ ద్వారా జరిగే వ్యవహారం కాదు.

    పైగా ఫోన్లో చెప్పగానే టక్కున "ఇవాళ నాకు తలకాయ నెప్పిగా ఉంది. రేపటికి కూడా తగ్గకపోవచ్చు. మీ ఫ్రెండుని పైసారి ఊరొచ్చినప్పుడు భోజనానికి రమ్మందురుగాని. ఈసారి కుదరదని చెప్పేయండి" అనవచ్చు. ఇంటికొచ్చాక "భోజనం ప్రోగ్రాం కాన్సిల్ అయిందనీ చెప్పారా? లేదా?" అని రూఢి చేసుకోవచ్చు కూడా.

    అందుచేత మనకు కుదరదని వాడికి సమాచారం అందించే సావకాశం లేని సమయం దాకా డిన్నర్ వార్త చెప్పనేకూడదు.. "ఇప్పుడింక ఏమీ చేయలేం ఈసారికేదో తంటాలు పడదాం" అని భార్యను బుజ్జగించడమే మేలు.

    కాబట్టి ఇంటికొచ్చాక చెబితే, ఆవిడ అనవలసినవన్నీ అన్నాక కూడా సణగడానికి రాత్రి రెండు మూడు గంటల వ్యవధి ఉంటుంది. ఆ ఆవిరంతా బయటకు పోయాక ఆవిడా చల్లబడి "సరే, తప్పేముందు, రేపు పొద్దున్న బజారుకెళ్లి ఫలానా,                     ఫలానా తెచ్చి పడేయండి" అంటుంది.

    రాత్రికి డిన్నర్ రెడీ చేస్తుంది. గండం గట్టెక్కుతుంది.

    ఇది ఎప్పుడూ జరిగే వ్యవహారమేకానీ ఖర్మ కాలి నిన్న రాత్రి ఆలస్యంగా వచ్చేశాడతను. (వ్యాపారం అన్నాక చాలా పన్లుంటాయి. అఫీసుల్లో పని చేసేవాళ్లలా టైముకి ఇల్లు చేరడం ఎలా కుదురుతుంది?) అది చాలదన్నట్టు భార్య మందు తీసుకురావడం తను మర్చిపోయాడు. సాధారణంగా మందు వేసుకోవడం ఆవిడకి గుర్తుండదు. ("ఇంటి పనుల్లో సతమతమయిపోయే వారికి ఇవి గుర్తుండవుట!") కానీ నిన్న మాత్రం గుర్తుంది!

    అదీగాక పిల్లాడు ప్రోగ్రెసు కార్డు పట్టుకొచ్చి దెబ్బలు తిని ఉన్నాడు. పిల్లల చదువులు పట్టించుకోకుండా ఊరట్టుకొని తిరిగే తండ్రుల్ని ఆవిడ దుమ్మెత్తిపోస్తుంటే తను ఫ్రెండుకై డిన్నరు మాటెలా ఎత్తగలడు? చిన్నవాడికి మరుసటిరోజు నుండి క్లాస్ టెస్టులట. 'ఇంటిక్కాస్త పెందరాళే దయచేసి చదువు చూడక పోతే వాడు పెద్దయి ముష్టెత్తుకోవడం ఖాయం' అని భవిష్యద్వాణి వినిపిస్తుంటే తను మర్నాటి ప్రోగ్రాం సంగతి నోరెత్తగలడా? 

    అప్రియమైనది ఎదుర్కోడానికి సాహసించక వాయిదా వేసే సగటు మనుష్యుల్లో రాజా ఒకడు. అందువల్ల పొద్దున్న కూడా త్వరగా లేవడానికి భయపడి, పిల్లలు స్కూలుకి బయల్దేరాకనే నిద్రలేచాడు. భార్య కాస్త తెరిపినబడితే తన సొద వినిపించవచ్చని ప్లాను. పేపరు చదువుతూంటే సావిత్రి కాఫీ తెచ్చి ఇచ్చింది. చేతిలో పేపరు ఉన్నా రాజా చదువుతున్నది ఆమె ముఖంలో భావాలను!

    మరింక విషయం బయటపెట్టవలసిన సమయం ఆసన్నమయిందనిపించింది రాజాకి. భూమిక సిద్ధం కావాలంటే నాలుగు మనోరంజకమైన మాటలు చెప్పాలి -

    "ఇదిగో, ఏవోయ్, నువ్విప్పుడు కట్టుకున్న చీర మా అక్కావాళ్ళు పెట్టినదా?"

    ఆవిడ ఓ సారి తన చీరకేసి చూసుకొని "పెళ్లాం చీర మీద దృష్టి పడిందే ఇవాళ? మీ కంటికి టీవీ అనౌన్సర్ల చీరలు తప్ప వేరే ఏదీ ఆనవనుకొన్నాను" అంటూ దెప్పిపొడిచింది. 

    మాటకిమాట జవాబు చెప్పగలిగే మందుగుండు సామగ్రి తన దగ్గిర ఉన్నా అది బయట పెట్టే సమయం కాదని గుర్తు చేసుకొని,

    "జోకులు కాదు, నిజంగానే అడుగుతున్నాను. మా అమ్మ పెట్టిన చీరకంటే అక్క పెట్టిన చీర ఎక్కువ వెలిసిందని నువ్వోసారి అన్నట్లు గుర్తు. అందుకని అడిగా!" అన్నాడు రాజా.

    "నేనన్నానని కాదు. ఇది వెలిసిందా? లేదా? మీ అభిప్రాయం చెప్పండి."

    గట్టి చిక్కే వచ్చిపడింది. ఇది అమ్మపెట్టిందో అక్క పెట్టిందో, వేరే ఎవరైనా పెట్టారో తెలిస్తే బాగుణ్ను. చెప్పేయవచ్చు. అమ్మ అక్క ఇద్దర్లో ఎవరో ఒకరు పెట్టి ఉంటారు. వాళ్లిచ్చినవన్నీ ఈవిడ ఇంట్లోనే కట్టేస్తుంది. బయటకు కట్టుకెళ్లే క్వాలిటీ వాళ్లు పెట్టరుట!

    "ఇద్దరూ ఒకలాటివే పెడతారనుకొంటాను" అన్నాడతను మధ్యేమార్గంగా.

    "అలాకాదు. ఇది బాగా వెలిసిందా? లేదా? అది చెప్పండి."

    "వెలుతురు కళ్ల మీద పడి సరిగా తెలియటం లేదు. కానీ వెలిసినట్టే ఉంది."   

     "అవునా, కళ్లున్న వాడెవడికైనా కనబడుతుంది ఈ చీర శుబ్బరంగా వెలిసిపోయిందని. మీ అమ్మగార్ని అడగండి - 'అబ్బే, అది కలనేత చీర, షేడ్‌లో అలా కనబడుతుంది' అంటారు. అక్కడికి మాకూ,మా పుట్టింటారికీ కలనేత చీరలంటే ఏమిటో తెలీవన్నట్లు. మొన్న పండక్కి మీ ఇంటికెళ్లినప్పుడు మాత్రం..."

    బండి గాడి తప్పుతోంది. పట్టాల మీదకు తీసుకురావాలి అనుకొని "ఇంతకీ ఈ చీరల ప్రస్తావన ఎందుకు తెచ్చానని అడగవే? నీకో చీర కొనే ఛాన్సు తగిలేటట్టుంది" అన్నాడు రాజా.

    సావిత్రి అనుమానంగా చూసినా, ఆనందం పట్టలేకపోయింది. వచ్చి కుర్చీ తేతిమీద కూచుని "నిజంగానా!? అయితే మొన్న మీ మేనకోడలి పెళ్లిలో మీ పెద్దక్కగారు కట్టుకొన్న పెద్ద పట్టుచీర, మామిడి పిందెల అంచుది..." అంటూ ఏదో చెప్పబోయింది.
    "ఆగాగు, కొడుకు పేరు సోమలింగం అనకు. విషయం పూర్తిగా విను. మనకి ఓ పెద్ద కాంట్రాక్టు తగలబోతోంది. దాన్ని శాంక్షన్ చేసే ఆఫీసరు శ్రీనివాసుగారని ఉన్నాడు. నిన్ననే కలిశాడు. సరదా మనిషి. కలుపుగోలుగా మాట్లాడతాడు. ఆయన దయతలిస్తే మనకు కాంట్రాక్టూ, నీకు చీరా ఖాయం..." రాజా గమ్యానికి రహదారి వేసేశాడు. 'ఇక ప్రయాణం సాఫీయే' అనుకొంటూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.

    కానీ ప్రయాణం అవసరమే పడనట్టుగా ఉంది. సావిత్రి లేచి నుంచొని "ఆయన్ని భోజనానికి పిలిచేరా?" అంది రౌద్రంగా. ఈ ఉపోద్ఘాతం చాలా పాతదే, ఆమె చాలా సార్లు విన్నదే!
    "అబ్బే, నేను పిలవడమేమిటి? ఆయనే..." రాజా నీళ్లు నములుతున్నాడు.     "ఆయనే 'హోటల్ డిన్నరివ్వద్దు. మీ ఇంటి మీద పడి మీ ఆవిడ చేతి వంట తింటే గాని నాకు తిన్నది అరగదు' అన్నాడు అంతేనా?" అంది వెక్కిరంపుగా.     "చూడు సావీ, అర్థం చేసుకో. హోటల్‌కి తీసుకెళ్లలేక కాదు. నాలుగు డబ్బులు పోయినా నీకు శ్రమ తగ్గుతుందని నాకూ తెలుసు. కానీ ప్రొహిబిషన్ పెట్టాక హోటల్ డిన్నరంటే ఎవడూ రావటం లేదు. ఇంట్లో అయితే ఎక్కణ్నుంచైనా 'ఎరేంజ్' చేయకపోతామా అన్న ఆశతో సరేనంటున్నారు. వ్యాపారస్తులం. వాళ్లని మంచి చేసుకోక పోతే మనకు వ్యవహారం గడిచేదెలా చెప్పు?" సావిత్రి మెత్తబడడం గమనించి హాడావుడిగా ఇంకోమాట కూడా చేర్చాడు, "ఇవాళ రాత్రి ఆయన మనింటికి భోజనానికి వస్తున్నాడు."     సావిత్రి మళ్లీ పూర్వరూపం ధరించింది. "ఇవాళ రాత్రా? నాకు కుదరదు. ఏం చేస్తారో నాకు తెలీదు. మీ ఇష్టం" అని అరిచింది.     'ఇవాళనే కాదు, ఏ రోజైనా కూడా ఇంత డ్రామా ఎలాగూ ఉండేదే' అని మనసులో అనుకొని " అన్నీ అలా తోసుకొచ్చాయి. చెప్పడానికి టైము లేకపోయింది. ఏమేం కావాలో చెప్పేస్తే అవి కొని పడేశాకనే నేను బయటకు వెళ్తాను" అన్నాడు రాజా ఉదారంగా.

    సావిత్రి ఇవేం వినటం లేదు. నెత్తిమీద చేతులు పెట్టుక్కూచుంది. "రోజూ ఇలా విందులూ, వినోదాలు అంటే పిల్లల చదువులు ఎలా సాగుతాయండీ?" అంది.     ఆఖరిసారి విందు ఇచ్చి నెలన్నర దాటిందని ఆ టైములో గుర్తుచేసే సాహసం చేయలేకపోయాడు రాజా. పేపరు పక్కన పడేసి, ఆమె భుజం మీద చెయ్యివేసి కూచున్నాడు అత్యంత విషాద రసాన్ని పోషిస్తూ. 

    అయిదు నిమిషాలకు తనని తాను ఓదార్చుకొంది సావిత్రి. "అది కాదండీ, ఇంటికెవరైనా వస్తే వండిపెట్టని రాక్షసిగా అనుకోకండి నన్ను. చచ్చీ,చెడీ రకరకాల అయిటమ్‌లు చేస్తానా. గుటుకూ,గుటుకూ మింగేసిపోతారు మీ ఫ్రెండ్సు. బాగుందని ఒక్కమాట కూడా అనరు"     ఆ మాట నిజమే! పీకలదాకా తిన్నా ఒక్కడూ 'పాపం కష్టపడి చేశారండి' అనో, 'వంట బాగుందండీ' అనిగానీ అనరు. ఇక వచ్చినవాళ్ల భార్యలైతే అదీ, ఇదీ కెలికి 'ఇది నాకు సయించదు, మా ఇంట్లో ఇలా చెయ్యం' అంటారు గానీ నవ్వుతూ ఏదీ తినరు.     ఆ మాటకొస్తే తనూ ఇంకొకళ్ల ఇంటికి వెళ్లినప్పుడు మెచ్చికోలుగా మాట్లాడడు. తనకైతే మొహమాటం. తక్కిన వాళ్లకి ఏం పోయేకాలం? సావిత్రీ ఇతరుల ఇంటికి వెళ్లినప్పుడు మొహం మాడ్చుకొనే ఉంటుంది. కష్టపడ్డారన్నమాట తనూ అనదు.     'అనచ్చుకదా' అని తనంటే 'కష్టపడితే అందును. సింపుల్‌గా చేసి పడేసింది, నాలా కాదు' అని జవాబిస్తుంది అని రాజాకి గుర్తొచ్చింది.     అక్కడికీ రాజా ఒకసారి తన భార్య బాధను అర్థం చేసుకొని ఓ ఫ్రెండ్‌తో 'మా ఆవిడ వంట నచ్చిందో లేదో' అన్నాడు. 'నచ్చకపోవడమేం? బ్రహ్మాండంగా ఉంటేనూ' అని అంటాడని ఎదురుచూస్తూ...     "అబ్బే, నాకు అదేంలేదోయ్, ఎలా చేసినా తినేస్తా" అన్నాడతను. ఎంతో జాలి గుండెతో రుచిహీనమైన అన్నం తిని వెడుతున్నట్టు.     ఆవేళే సావిత్రి వార్నింగిచ్చింది - ప్రాంప్టింగు ప్రయత్నాలు మానుకోమని.

     "నేను ఏం చేసినా మీ ఫ్రెండ్స్‌కీ,బంధువులకీ ఆనదు. ఈ మాత్రం దానికి నేను కష్టపడటం ఎందుకు? రెక్కలు ముక్కలు చేసుకోవడం ఎందుకు?" అంటోంది సావిత్రి.

    గాసు, కుక్కర్, గ్రైండర్, మిక్సీ ఇంట్లో ఉండగా రెక్కలు ముక్కలు కావని ఆ క్షణంలో రాజా గుర్తు చెయ్యలేదు; సావిత్రితో రాజీ పడుతున్న ఆ క్షణంలో "కరెక్ట్, అందుకనే లైట్‌గా చేసేయి. ఏం కావాలో లిస్టు ఇచ్చేయ్" అంటూ విజయగర్వంతో లేవబోయేడు రాజా.
    "ఏమీ అక్కర్లేదు. ఆయనకి పులిహోర, దద్దోజనం చేసిపెడతాను. కడుపునిండా తినమను' అంటూ లేచి వంటిట్లోకి వెళ్లిపోయింది సావిత్రి 'అదే ఫైనల్' అన్న స్టైల్లో. 

    రాజాకు మతిపోయింది. 'అంతేనా? ఆ రెండు అయిటమ్సేనా? ఏమీ అనుకోడు కదా. తనే ఏదో సర్దిచెప్పుకోవాలి. ఎవర్నైనా అడిగి 'జానీవాకర్' కొట్టుకొస్తే సరి. తిండి ఎలా ఉన్నా పట్టించుకోడు.'

    పులిహోర, దద్దోజనం మాత్రమే పెట్టినందుకు శ్రీనివాసు ఏమీ అనుకొన్నట్టు కనబడలేదు. అంతకుముందే వెరైటీగా 'హోమ్లీ ఫుడ్' గురించి రాజా అతనికి లెక్చరిచ్చి ఉన్నాడు కూడా!     పైగా సావిత్రి వంట అతనికి బాగా నచ్చింది. ఆ విషయం దాచుకోకుండా చెప్పాడు కూడా. మందెక్కువై మాట్లాడుతున్నాడేమోనని రాజా భయపడ్డాడు. తర్వాత సావిత్రికి అతను చెప్పిన బిజినెస్ అయిడియాలు వింటూంటే 'సోబర్'గానే ఉన్నాడనిపించింది.     "చూడండి సావిత్రిగారూ - ఈ మధ్య 'స్వగృహ ఫుడ్స్'కే డిమాండ్. పాతరకం అని మనం అనుకొంటాం చూశారా? వాక్కాయపప్పు, కందిపచ్చడి, దద్దోజనం, పాత చింతకాయపచ్చడి - ఇలాటి వాటికే మంచి డిమాండ్. ఎగబడి కొంటున్నారు. మీ పులిహోర కనక చక్కగా 'పాక్' చేసి అమ్మేరనుకోండి హాట్‌కేక్స్‌లా అమ్ముడు పోతాయి. రాజా గారు రోడ్లు వేసే కాంట్రాక్టు మానేసి హోటల్స్‌కి ఇది సప్లయి చేసే వ్యాపారం పెట్టవచ్చు."
    "మీరు జోక్ చేయటం లేదు కదా?" అంది సావిత్రి ఒక పక్క పొంగిపోతూనే.

    "నో,నో! మీకు తెలీదా? ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో కూడా ఇప్పుడు పంచె కట్టుకొని, అరిటాకుల్లో ఆవిరి కుడుములు, ఉలవచారు వడ్డిస్తున్నారు తెలుసా? మనవాళ్లు ఇళ్లలో తీసి పారేసిన కంచు మరచెంబులలో నీళ్లిస్తున్నారు. ఫారినర్సంతా 'రియల్ ఇండియా అంటే ఇదే'నంటూ బ్రహ్మాండంగా మోజుపడుతున్నారు. వాళ్లు రోజూ తినే పిజ్జాలే మనమూ పెడితే బోరు కొట్టదూ పాపం? వెరయిటీ కోసం ఇండియాకు వచ్చిందెందుకుట? మీరు మీ ఆయనతో చెప్పి మీ వంటకాలని సరిగ్గా మార్కెట్టు చేయించండి. లక్షలకు లక్షలు కురవకపోతే అప్పుడు నన్నడగండి"
    ఆ రోజు నుండి రాజా బ్రతుకు దుర్భరమై పోయింది. సావిత్రి అతన్ని నిలవనివ్వటంలేదు. రోజుకో పాతరకం వంట చేయడం, ఎవరైనా హోటల్ వాళ్లకి రుచి చూపించి ఆర్డర్లు తెమ్మనడం.     సావిత్రి వంట ఏదో సంసారపక్షంగా ఉంటుందని రాజాకు తెలుసు. అవి పట్టుకుని మార్కెట్ చేయాలంటే అయ్యే పనా? తను తన వ్యాపారమే చేస్తాడా? ఇవి పట్టుకు తిరుగుతాడా?     సావిత్రి అలా అనుకోలేదు. తన చేతిలో అంత విద్య ఉండగా వేరే వ్యాపారమెందుకంటుంది. మొగుడు ఒక్క ఆర్డరూ తేకపోయే సరికి అతని శీలాన్ని శంకించింది. మహిళా ప్రగతి ఓర్వలేని పురుష మద వరాహం(మేల్ షావనిస్టు పిగ్)గా తిట్టిపోసింది. తనకి ఇంగ్లీష్ రాకపోవడం వలననే ఈ విధంగా అణచబడుతున్నానని ఆక్రోశించింది.     శ్రీనివాసుని తనకి పరిచయం చేసిన సెక్షనాఫీసరు దగ్గిర ఓ రోజు మొరపెట్టుకున్నాడు - "ఇంటికి పిల్చి జానివాకరిప్పించానన్న కృతజ్ఞతయినా లేకుండా ఆయన ఇలా నా కొంప కూల్చేడేమిటండీ?" అంటూ.     పదిరోజుల తర్వాత వెళ్లేసరికి సెక్షనాఫీసరు గారు పిల్చి శ్రీనివాసు ఆయనకి రాసిన ఉత్తరం చూపించాడు -     "... కాంట్రాక్టరు రాజా నీ దగ్గర ఏడ్చాడని రాసేవు. వాడి తిక్క కుదిరింది అని సంతోషించేను. వద్దంటూంటే ఇంటికి పిలిచి పులిహోరా, దద్దోజనం పెడతాడా? వాడే పెద్ద ప్రాక్టికల్‌ జోకర్ అనుకొన్నాడా? అందుకే వాళ్లావిణ్ని ఉబ్బించి, ఊదరగొట్టేశాను. ఇక వాడి బతుకు కుక్కబతుకే. ఇన్నాళ్లూ తన వంటకాల విలువ రూపాయల్లో గుర్తించనందుకు కాల్చుకు తినేస్తుంది ఆవిడ..., చూస్తూండు."
    "నువ్వనుకోవచ్చు, చిన్నప్పుడు డల్‌గా ఉండటం చేత క్లాసులో నాకు 'దద్దఒజనం' నిక్‌నేం పెట్టరు కాబట్టి ఉడుకుబోత్తనం కొద్దీ నేను రాజా మీద ప్రాక్టికల్ జోక్ చేశానని ...మేబీ యూ ఆర్ రైట్..."
(ఆంధ్రప్రభ డైలీ హాస్య ప్రత్యేక సంచిక రవళి -నవంబరు 1996 లో ప్రచురితం)     
Comments