ఔట్‌సోర్సింగ్ -మల్లెమాల వేణుగోపాలరెడ్డి

    
రైలు వేగం తగ్గింది. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ఔటర్‌లో ఆగింది. సిగ్నల్ లేదు. లగేజి సర్దుకుని కూర్చున్నాను. రామ్‌కుమార్ టెక్స్‌టైల్ మిల్స్ ఇంటర్నల్ ఆడిటింగ్ కోసం అహ్మదాబాద్ వెళ్తున్నాను. టెక్స్‌టైల్ మిల్ యజమాని సుందర్‌రాజ్‌శెట్టిది చిత్తూరు జిల్లా వాయల్పాడు. ముప్పై ఏళ్ల క్రితం అహ్మదాబాద్ వెళ్లి టెక్స్‌టైల్ వ్యాపారం ప్రారంభించి అక్కడే మిల్లు కట్టి స్థిరపడిపోయారంటారు. నాదీ వాయల్పాడులో వాల్మీకి పురంగా పిలవబడుతున్న ప్రాంతం. 

    రైలు కదిలింది. ఆగుతూనే కంపార్టుమెంటు వద్దకే వచ్చి లగేజి అందుకున్నాడు ప్రభాకర్. నా కాలేజి క్లాస్‌మేట్, ఆప్తమిత్రుడు. కారు డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నాడు ప్రభాకర్.

    "గెస్ట్‌హౌస్‌కెందుకు సాగర్! ఇంటికి వెళదాం! నిన్ను ఇంటికి తీసుకురమ్మంది కుసుమ."

    "లేదు! ఈ రెండ్రోజులు మిల్ ఆడిటింగ్ ఉంది. బిజీగా ఉంటాను. తర్వాత ఇంకో రెండ్రోజులుంటాను, అప్పుడొచ్చేస్తాలే" అన్నాను.

    సరస్‌పూర్‌లో ఉన్న రామ్‌కుమార్ టెక్స్‌టైల్స్ మిల్ గెస్ట్‌హౌస్‌లో నన్ను దించి వెళ్లిపోయాడు ప్రభాకర్.

    పగలంతా ఆడిటింగ్ వర్కు...సాయంత్రం ఊరు తిరగడం. సుందరరాజ శెట్టి కొత్తగా కట్టించిన "బాలాజీ దేవాలయం" సందర్శించి వచ్చాను. తిరుమల వెంకటేశ్వరుని దేవాలయం మోడల్‌లో ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేసి ఆగమశాస్త్ర పద్ధతిలో నిర్మించిన దేవాలయమది. అహ్మదాబాద్‌లో భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది. ఇంకోరొజు సాయంత్రం ప్రభాకర్‌తో కలిసి వెళ్లి షాపింగ్ చేశాను.

    ఆడిటింగ్ అయిపోయింది. మూడోరోజు ప్రొద్దున్నే ప్రభాకర్ వచ్చి, నన్ను వాడి అపార్ట్‌మెంటుకు తీసుకెళ్లాడు. ప్రభాకర్ వాళ్ల అపార్ట్‌మెంటుకు ఎదురుగా "నిర్మా" సబ్బుల ఫ్యాక్టరీ. రద్దీ ప్రాంతం. కుసుమ క్షేమ సమాచారాలు విచారించి అందించిన అథితి సత్కారాలతో ఆత్మీయత ముడివేసుకుంది. రెండ్రోజులు ప్రభాకర్ నాకోసం లీవు పెట్టాడు. ప్రభాకర్ మైక్రో బయాలజీ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాడు. ఎస్.జీ.రోడ్‌లో ఉన్న ఓ పెద్ద ఫార్మాస్యూటికల్స్‌లో ఆరేళ్ల నుండీ రీసెర్చి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అహ్మదాబాద్ అంతా వాడికి అలవాటైపోయింది.

    ప్రొద్దున టిఫిన్ ముగించుకుని బయల్దేరాం నేనూ, ప్రభాకర్. విజన్ ఇంటర్నేషనల్‌లో వీడియోగ్రఫీ సెక్షన్‌లో పనిచేస్తున్న సారంగపాణిని కారులో ఎక్కించుకుని బయల్దేరాం.

    "ఇక ఇప్పుడెక్కడికి?" అడిగాడు పాణి.

    "సుధీర దగ్గరికెళ్లి వద్దాం" ప్రభాకర్ అన్నాడు.

    "సుధీర ఇక్కడుందా?" ఆశ్చర్యమేసి అడిగాను.

    "అవును. మూడేళ్లయింది యిక్కడికొచ్చి. చాలా నికృష్ట స్థితిలో కష్టాలు మోసుకుని అహ్మదాబాద్ చేరింది. నాకు ఉత్తరం వ్రాసి వచ్చింది. ఉద్యోగాల వేటలో అలసిపోయింది. కొద్దిరోజులు మేము ఆర్థికంగా ఆమెకు సహాయం చేశాం. తర్వాత ఇక్కడే ఒక హోటల్లో రిసెప్షనిస్టుగా కొద్దిపాటి జీతంతో చేరింది" ప్రభాకర్ అన్నాడు.

    "ఇప్పుడూ ఆమె పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది" సారంగపాణి అన్నాడు.

    "ఇప్పుడెక్కడుంది?"

    "ఇక్కడికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఆనంద్ సిటీలో ఉంది."

    "అక్కడేం చేస్తుంది."

    "ఔట్ సోర్సింగ్‌లో...అమ్మగా చేస్తుంది."

    "అంటే బేబీసిట్టింగా"

    "అక్కడికే పోతున్నాం గదా! అన్ని వివరాలు అక్కడే తెలుస్తాయిలే" ప్రభాకర్ అన్నాడు. వాడి మాటల్లో ఏదో దాపరికం ఉందనిపించింది.

    కారు సాగిపోతూంది.

    ఆనంద్ సిటీ అంటే దేశవ్యాప్తంగా పాల వుత్పత్తిలో కొత్త పుంతలను సృష్టించి ఓ భారీ పరిశ్రమగా పేరొందిన "అముల్" ప్రాజెక్ట్స్ ఉన్న నగరం.

    "అముల్ ఫ్యాక్టరీని చూడాలని ఉంది" అన్నాను.

    "అన్నీ చూద్దాం లే! ఈ సాయంత్రం దాకా సిటీ తిరిగి చూద్దాం" పాణి అన్నాడు.

    నేనూ, పాణీ, ప్రభాకర్ తిరుపతి యూనివర్శిటీ కాలేజీలో చదువుతున్నప్పుడు సుదీర పద్మావతి మహిళా కళాశాలలో డిగ్రీ చదువుతుండేది. ప్రభాకర్ చెల్లెలు సురేఖకు ఆమె హాస్టల్లో రూమ్మేట్. సుధీరది ప్రకాశం జిల్లా టంగుటూరు. ప్రభాకర్‌ది చిత్తూరులోని కట్టమంచి. మేం నలుగురమూ మంచి స్నేహితులం. సెలవులిస్తే వాల్మీకిపురం, కట్టమంచి, టంగుటూరులల్లో మా టూర్ ప్రోగ్రాంస్. అంతా ఫామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం. సన్నిహితంగా మెలిగాం.

    సురేఖకు, సుధీరకు పెండ్లిండ్లయిపోయాయి. సురేఖకు తిరుపతిలో ఓ బిజినెస్ మేన్‌తో, సుధీరకు నెల్లూరు జిల్లా కావలిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుతో పెండ్లిండ్లు. సురేఖ పెండ్లి ముందయింది. అందరం సుధీర ప్రెండ్లికి వెళ్లి వచ్చాం. పెండ్లి ఒంగోలులో వైభవంగా జరిగింది.

    క్రొత్త దంపతులతో తిరుమల వేంకటేశ్వరుణ్ణి దర్శించుకుని వచ్చాం. ఇదంతా ఏడేళ్ల నాటి మాట... మళ్లీ నేను సుధీరను చూడలేదు.    

    "సుదర్శన్ ఏం చేస్తున్నాడు" అడిగాను. సుదర్శన్ సుధీర్ భర్త.

    "సుధీరనే జవాబు చెబుతుందిలే! దగ్గరికొచ్చేసాం...కొంచెం ఆగు" ఉదాసీనంగా జవాబిచ్చాడు ప్రభాకర్.

    ఆనంద్ సిటీలో ఓ పెద్ద బిల్డింగ్ ముందు ఆపి కారు పార్క్ చేశాడు ప్రభాకర్.

    "డాక్టర్ నయనాపటేల్ వుమెన్ కేర్ హాస్పిటల్" బోర్డు చూశాను. లోపలికెళ్లాం.

    రిసెప్షనిస్టుతో ఫోన్ చేయింది డా.నయనా పటేల్‌ను కలిశాం. ఆమె మమ్ము సాదరంగా ఆహ్వానించింది.

    "వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ" అడిగింది.

    "మేము సుధీరను చూడాలని వచ్చాం మేడమ్" సారంగపాణి అన్నాడు.

    "సుధీరా!" అంది డాక్టర్.

    "అదే మేడమ్! మీ వద్ద సర్రొగేట్ మదర్‌గా చేరిన సుధీర" ప్రభాకర్ అన్నాడు.

    "సర్రొగేట్ మదర్" ఎక్కడో ఆ పదం విన్నట్టనిపించింది నాకు. గుర్తు చేసుకుంటున్నాను.

    "ఓకే! మీరు వెళ్లి చూడండి. ఆమె మూడ్ డిస్టర్బ్ చెయ్యొద్దు...ధైర్యం చెప్పండి" ఇంగ్లీషులో మాట్లాడింది డాక్టర్. మాతో పాటు ఓ కేర్‌టేకర్‌ని పంపింది.

    ఆ హాస్పిటల్ ఆవరణలోనే ఉన్న ఇంకో బిల్డింగులోకి తీసుకెళ్లింది కేర్‌టేకర్.

    పెద్ద హాలు...సోఫాలు...మాతృమూర్తుల ఫోటోలు...పొత్తిళ్లలో పసిబిడ్డల ఫోటోలు...పెద్ద టీపాయ్ మీద వివిధ రకాల మేగజైన్లు... పరిసరాలు చాలా శుభ్రంగా ఉన్నాయ్... మమ్మల్ని సోఫాలో కూర్చోబెట్టి లోనికెళ్లి తిరిగివచ్చి "సుధీరాజీ ఔర్ పంద్రా మినిట్‌మే ఆనేవాలా హై...ఆప్ తోడీ దేర్ వెయిట్ కరీయే" చెప్పి వెళ్లింది.

    "ఇన్‌ఫర్టిలిటీ...ఆర్టిఫిషియల్ ఇన్‌సెమినేషన్...టెస్ట్ ట్యూబ్ బేబీస్" శీర్షిక ఉన్న ఓ ఇంగ్లీష్ మేగజైన్ చూశాను. చదవనారంభించాను.

    "సర్రోగేట్ మదర్స్" శీర్షిక. ఇంగ్లీషులో ఉంది. తెలుగులోకి అనువదిస్తే సారాంశం "ఇతరుల కోసం బిడ్డల్ని కనిపెట్టే వనితల్ని సర్రోగేట్స్" అంటారు.

    సంతాన సాఫల్యం లేని భార్యాభర్తల్లో...పురుషునికి శారీరక లోపాలున్నప్పుడు, వీర్యకణాలు తక్కువగా ఉన్నప్పుడు, భార్య అండంతో భర్త వీర్యకణాలను ఘనీభవపరచి, ప్రత్యేక పద్ధతుల ద్వారా ఫలదీకరణ చెందించి భార్య గర్భసంచిలోనికి ప్రవేశపెడతారు. దీన్ని ఆర్టిఫీషియల్ ఇన్‌సెమినేషన్ అంటారు. భార్య అనారోగ్యంగా ఉన్నా, బిడ్డను గర్భంలో మోసే సామర్థ్యం ఆమెకు లేకున్నా, వేరొక స్త్రీ గర్భంలో ఫలదీకరించిన అండాన్ని ప్రేవేశపెడతారు. వేరొకరి అండాన్ని తన గర్భంలో పిండంగా నవమాసాలు మోసి కని ఇచ్చే మహిళలని సర్రోగేట్ మదర్స్ అంటారు. బిడ్డకు ఇంకో రూపాంతర పదం "టెస్ట్‌ట్యూబ్ బేబీ". చదువుతుంటే ఆసక్తిగానే ఉంది. కానీ సుధీర సర్రోగేట్ మదర్‌గా అక్కడుందంటేనే నా ఆశ్చర్యమంత... చదవడం కొనసాగించాను.

    న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా, శాస్త్రీయమైన పద్ధతులలోనే అగ్రిమెంటు చేయించుకుని, ఒప్పందం చేసుకున్న ప్రకారం డబ్బు చెల్లించే ఏర్పాటు చేసి, కంటికి రెప్పలా, వైద్య సహాయం అందిస్తూ సేవ చేస్తున్నది డా.నయనా పటేల్ ఆస్పత్రి. అదొక సామాజిక సేవగా పరిగణింపబడుతూంది అక్కడ. బిడ్డను అసలు తల్లిదండ్రులకు అందించే వరకే కాకుండా ఆ తర్వాత గూడా సర్రోగేట్ మదర్స్‌కు స్వస్థత చేకూర్చి పంపుతుందా సంస్థ.  

    విధివంచితులైన అబలలు, భర్తల పురుషాహంకారానికి బలై తృణీకరించబడిన వనితలు, పేదరికంలో మ్రగ్గుతూ కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మ కడుపు అమ్మకానికి ఇచ్చే నిర్భాగ్యులూ అందరూ సర్రోగేట్ మదర్స్‌గా నమోదౌతున్నారు. బిడ్డను కని ఇవ్వడం ద్వారా మరొకరికి సహాయం చేయడంతో పాటు, తమ ఆదాయాన్ని పెంచుకోవడం ఓ గొప్ప అవకాశంగా భావించి, న్యాయ, ధర్మ సమ్మతాల విచారణలకు అతీతంగా ఒప్పందాలు జరుగుతున్నాయి.

    పేజీలు తిప్పుతున్నాను. "సిమ్మీ రావిడ్" అనే ఓ అమెరికా మహిళ వ్రాసిన వ్యాసం ఇంగ్లీషులోనే -

    "ఆర్టిఫిషియల్ ఇన్‌సెమినేషన్ ద్వారా మేము అమెరికాలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాదాపు మూడు లక్షల డాలర్లు ఖర్చయ్యాయి. ఫలితం లేకపోయింది. పిండం నా గర్భంలో పెరిగే అవకాశాలు లేవన్నారు. బిడ్డను మోసే సామర్థ్యం నా గర్భానికి లేదన్నారు. అమెరికాలో సర్రోగేట్ మదర్ కావాలంటే రెండు లక్షల డాలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇండియాలో 20వేల డాలర్లకు సర్రోగేట్ మరద్ అంగీకరించే అవకాశముందని తెలిసి మేము ముంబై వచ్చాము. డా.నయనా పాటిల్ హాస్పిటల్...గుజరాత్ రాష్ట్రంలో ఉత్తమ సేవలందిస్తున్నదని తెలిసి "ఆనంద్ సిటీ"కి వచ్చాం. మా అదృష్టవశాత్తూ ఉన్నత విద్యావంతురాలైన "సుధీర" అనే సోదరి మాకు సర్రోగేట్ మదర్‌గా సర్వ్ చేసేందుకు అంగీకరించింది. అంతా సవ్యంగా జరిగ్పోయింది. మా బిడ్డ ఆమె గర్భంలో పెరుగుతూ... నా గుండె వేగంగా కొట్టుకోసాగింది.

    "ఔట్ సోర్సింగ్‌లో అమ్మగా పనిచేస్తుంది" ప్రభాకర్ అన్న మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.

    "సుధీర సర్రోగేట్ మదరా"

    ఎదురుగా సుధీర.

    "హాయ్ సాగర్! అహ్మదాబాద్ ఎప్పుడొచ్చారు? అంతా క్షేమమా? హాయ్ ప్రభాకర్, హాయ్ పాణీ! కుసుమ ఎలా వుంది" సోఫాలో కూర్చుంటూ అంది సుధీర.

    "రెండ్రోజులయింది వచ్చి... ఆడిట్ కోసం వచ్చాను. ఇంకా రెండ్రోజులుంటాను."

    "నిన్ను చూడాలన్నాడు సాగర్! తీసుకొచ్చాము సుధీరా!" ప్రభాకర్ అన్నాడు.

    "మెనీ థ్యాంక్స్! పాణీ ఎలా ఉంది నీ జాబ్" అడిగింది సుధీర.

    సుధీర మాటల్లో ఏమాత్రం తొణకలేదు. నిబ్బరంగా ఉంది. ఆరోగ్యంగానూ ఉంది. మంచి దుస్తులు...మెడలో బంగారు గొలుసు. చేతికి బంగారు బ్రేస్‌లెట్.

    "నీ గురించి ఇప్పుడే అన్ని వివరాలు తెలిసింది సుధీరా! నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఆశ్చర్యంగా ఉంది" అన్నాను.

    "ఇందులో ఆశ్చర్యమేముంది. ఇదో సోషల్ సర్వీస్. నేనిప్పుడు సర్రోగేట్ మదర్ని"

    "సుదర్శన్ ఏమయ్యాడు"

    "ఏమయ్యాడూ...అతనికేమీ కాలేదు. నాకే విడాకులిచ్చాడు... వదిలేశాడు. భరణం కూడా నేను అడగలేదు... సంసారం చేసినంత కాలం వేధింపులే. అతడొక శాడిస్టు. నా తొలిగర్భాన్ని కూడా అబార్షన్ చేయించాడు. మా అమ్మానాన్న ఇంద్రకీలాద్రి వెళ్లి కనకదుర్గమ్మకు మొక్కుకున్నారు. తిరుమలకు నడచి వెళ్లి హుండీ సేవ కూడా చేశారు. వాళ్ల పిచ్చి అది"

    ప్రభాకర్ పాణిల సాయంతో అహ్మదాబాద్ చేరాను. అష్టకష్టాల్లో ఉన్న నాకు వాళ్లు గొప్ప ఆసరా...హోటల్లో రిసెప్షనిస్టుగా కూడా అవమానాలే. ఇదిగో! ఇప్పుడు కడుపు అమ్ముకుని, అమ్మగా అదే సర్రోగేట్ మదర్‌గా అమెరికన్ దంపతులకు బిడ్డను మోసి, కని ఇస్తున్నాను" సుధీర కళ్లలో కాంతి తప్ప చెమ్మ కనిపించలేదు.

     అంతా మౌనంగా వింటున్నాం.

     "ఇక్కడ వైద్య తనిఖీలు, పౌష్టికాహారం, టీ.వీ.వినోదం, లైబరరీ, కేర్‌టేకర్స్, మంచి వసతి ఆపైన మంచి ఆదాయం... ఇంకేం కావాలి...నా మొదటి కాంపులో అబార్షన్ అమ్మను. ఇప్పుడు ఈ  కాంపుకి సర్రోగేట్ మదర్ని...బిడ్డ అమెరికా దంపతులదైనా, తొమ్మిది నెలలు మోసిన అమ్మదనం చాలు. చాలా కమ్మని అనుభూతి. కన్నబిడ్డలు కనికరించక వృద్ధాశ్రమాలలో తలదాచుకుంటున్న ఎందరో సీనియర్ సిటిజన్స్‌కు ఒరిగిందేమిటి... నాకు దక్కనిదేమిటి" ఆమె చెబుతూ, "వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్" చెప్పి లోపలికెళ్లింది.

     తిరిగి వచ్చి అంది. "ఇక్కడ అరుణ అని ఒక అమ్మాయి ఉంది. ఆమెది కడప జిల్లా చిట్వేలి. ఆమెను మీకు పరిచయం చేస్తాను. ఇంకో పది నిమిషాల్లో ఆమె వస్తుంది" సుధీర కూర్చుంటూ అంది.

     "నీకు యిలా చెప్పడం బాధగా లేదా సుధీరా!" అడిగాను.

     "ఎందుకు బాధ! మనసుకు సంతోషం కావాలి. హృదయానికి సంతృప్తి కావాలి...అవి రెండూ నాకు దొరికాయి. నువ్వే చెప్పేవాడివి గుర్తుందా...

     తన సంతోషమే స్వర్గము... తన దుఃఖమే నరకమండ్రు - తథ్యము సుమతీ. నరకం నుండి స్వర్గంలోకి అడుగుపెట్టినట్లుంది నాకు" సుధీర చదివిన సైకాలజీ డిగ్రీ ఇప్పుడు ఆమెకు సహాయ పడిందన్నమాట. లక్ష్యాన్ని నేర్పిందన్నమాట. లోపలికెళ్లింది సుధీర.

     "మేం చెప్పి చూశాం... ఆమె వినలేదు. 9 నెలలు సినిమాలో సౌందర్య కోర్టులో వాదించిన సంభాషణలన్నీ వల్లెవేసింది సుధీర... ఆమె నిర్ణయం మంచిదేనేమో" అన్నాడు సారంగపాణి.

     సుధీర అరుణను వెంటపెట్టుకుని వచ్చింది.

     అరుణ వచ్చి నమస్కరించింది.

     "చెప్పు అరుణా! నీ కథ చెప్పు" అరుణతో అంది.

     "సార్ మాది కడప జిల్లా...చిట్వేలి...పదో తరగతి చదివాను. పదహారేళ్లకే పెళ్లి చేశారు. అతను నాకంటే పదేళ్లు పెద్ద... నిరుద్యోగి. నిరాశతో వ్యసనాలకు గురయ్యాడు. ఒక పాపను పుట్టించి ఆక్సిడెంట్‌లో కన్నుంశాడు. మా వాళ్లకు నేను బరువయ్యాను. ఇరవై వేలు ఖర్చు చేసి దళారులు కువైట్ కోసం దొంగ వీసాతో ముంబై చేర్చి నన్ను రెడ్‌లైట్ ఏరియాకు అమ్మజూశారు. కన్నవారినీ, కన్నబిడ్డనీ వదిలేసి వచ్చినా కష్టాలే ఎదురయ్యాయి. ముంబైలోని "ఆశ్రిత మహిళా సేవా సంస్థ" వారి సహకారంతో తైవాన్ దంపతులకు బిడ్డను కని ఇచ్చే ఒప్పందంతో ఇక్కడికి పంపారు. నాకు ఐదువేల డాలర్లిస్తానన్నారు. ఇక్కడ ఎవరింట్లో పనిమనిషిగా చేరినా నెలకు వెయ్యిరూపాయలిస్తారు. పదహైదేళ్లు పనిచేస్తే కానీ యీ ఆదాయం రాదు. వాళ్లు ఇంకో బిడ్డను కనియిస్తే, చిట్వేలిలోని నా బిడ్డను చదివించుకోవచ్చు. ఇంకోసారి కడుపు అమ్ముకుంటే తర్వాత ఇక్కడే ఆయాగా ఉద్యోగమిస్తానని పటేల్ మేడం చెప్పింది" అరుణ కథాగమనంలో ఇంకెన్నో మలుపులు లేవు. సాఫీగానే కనిపించింది.

     "మరిచాను సాగర్! నయనా పటేల్‌గారు నా ప్రసవం తర్వాత ఇక్కడే కౌన్సెలింగ్ స్టాఫ్‌గా జాబ్ ఇస్తానన్నారు... అది నాకు ప్రమోషనే" నవ్వుతూ అంది సుధీర. ఆ నవ్వులో ఎంత ఉన్నత భావాలు...

     అరుణ అందుకుంది.

     "ఇక్కడ ఇంకో ఇద్దరు బీహారీ అమ్మాయిలున్నారు. గిరిజన ప్రాంతం నుండి వచ్చారు. ఇద్దరూ అక్కచెల్లెళ్లు. అక్క మొదట ఒక లండన్ దంపతులకి కడుపు అమ్ముకుంది. ఇప్పుడు చెల్లెలు ఓ స్విట్జర్లాండ్ వాళ్లకు గర్భం మోస్తూంది. అక్కను చెల్లెలుకు ఆయాగా నియమించింది మేడమ్"

     "వీరందరి విషయాల్లో ఎంత ఆత్మవిశ్వాసం..." నా గుండె ఇప్పుడు వేగంగా కోవడం లేదు, నిబ్బర పడింది.  

     "చూడు సాగర్! జీవితపయనం ఓ మలుపుల దారి...తగిన సమయంలో తీసుకునే నిర్ణయం, ఒక ఆచరణ, ఒక దృఢసంకల్పం, ఒక కృతనిశ్చయమైన సవాల్... జీవితాన్ని ఊహించరాని విధంగా మార్చేస్తుంది. ఎక్కడి టంగుటూరు...ఎక్కడి అహ్మదాబాద్...ఎక్కడి ఆనంద్...గతం మన చేతిలో లేదు... దాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం అవివేకం... భవిష్యత్తు మన చేతుల్లో లేదు. ఇప్పుడున్న యీ సమయం...అదే వర్తమానం...అదే మనకున్న గొప్ప ఆశ...అవకాశం. దాన్ని చేజార్చుకోకూడదు... మనసుంటే... మార్గం కరువు కాదు" సుధీర మాటల్లోని తాత్వికత సమర్థనీయం. ఆమె ఓ మహత్తర వ్యక్తిగా, ఒక అనుపమాన వ్యక్తిగా నాకు గోచరించింది...ప్రభాకర్, సారంగపాణిల మౌనం సుధీరకిచ్చిన బలం.

     "అబ్ జానాహై సార్! సుధీరాజీ! మేడం చెప్పమన్నారు" కేర్‌టేకర్ వచ్చి చెప్పింది.

     అంతా లేచాం...సుధీరకు, అరుణకూ శుభాకాంక్షలందించి బయల్దేరాం.

     ఆఫీసులో డా.నయనా మేడమ్ కూర్చుని ఉన్నారు.

     నా క్యూరియాసిటీ కొద్దీ ఆమెను కలిసి అడిగాను. ఇంగ్లీషులోనే సంభాషణ.

     "మేడమ్! మీరు చేస్తున్న పని మీకు సంతృప్తినిస్తున్నదా?"

     ఆమె మాటల సారాంశం.

     "ఓ ష్యూర్!" చెప్పసాగింది.

     "మేం చేస్తున్న పనిలో తప్పేమీ లేదు. మునుపు మీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఓ ఆవిడ గృహనిర్మాణంలో కూలిపని చేస్తుండేది. ఇద్దరు బిడ్డలు...అందీ అందని కాలం, చాలీ చాలని జీతం... బిడ్డలూ పస్తులు...ఇప్పుడావిడ్ తన మూడో కాంపుని సర్రోగేట్ చేస్తూ ఉంది. ఆమె రూపే మారిపోయింది. కడుపుకింత మంచి తిండి తిని కడుపులో విదేశీయుల బిడ్డను మోస్తూ ఉంది. ప్రసవమైన తర్వాత తనకు రావాల్సిన పైకం మొత్తం తీసుకెళ్లి ఓ చిల్లరకొట్టు పెట్టుకొని వాళ్ల ఊళ్లోనే ఉంది. పిల్లని పెంచి పోషించుకుంటుందట. పిల్లవాణ్ణి వాళ్ల ఊళ్లోనే సాంఘిక సంక్షేమ హాస్టల్లో చేర్పించే ఏర్పాటు చేసుకుంది.

     "ఈ ఆనంద్ సిటీలోనే ఇప్పుడు ఇరవై మంది సర్రోగేట్ మదర్స్ గర్భాల్ని మోస్తున్నారు. ఇంతకుముందు మరో నలభై మంది విదేశీయులకీ మన దేశంలోని సంపన్న కుటుంబాల స్త్రీలకు బిడ్డల్ని కనియిచ్చారు. మన దేశంలో గర్భం ధరించే ఓపిక, మిడ్డను మోసే తీరికా లేక సంపన్నులైన మహిళలు సర్రోగేట్ మదర్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. బిడ్డల్ని మరొకరు కనియిస్తే, పెంచి ఇచ్చే సంస్థలు కూడా తయారయ్యాయి. మేమిచ్చే కేర్, వైద్య సదుపాయాలు, వసతి భోజన సౌకర్యాలు, చూపే ఆత్మీయ అనురాగాలు మాకూ వారికీ సంతృప్తికరంగానూ, ఆనందంగానూ ఉన్నాయ్" ఆమె చెప్పుకు పోతూ ఉంది.

     "మీరు చదువుకున్నవారు, సెంటిమెంట్లను విడనాడి మా యీ సేవా కార్యక్రమాలను ప్రోత్సహించండి...న్యాయపరమైన, చట్టపరమైన మార్పులూ వస్తాయి. థాంక్యూ ఫర్ విజిటింగ్ అవర్ ఇన్సిట్యూట్" లేచి నమస్కరిస్తూ అంది డాక్టర్ నయనా పటేల్.

     "థాంక్యూ మేడమ్" చెప్పి సెలవు తీసుకుని కారెక్కాం.  

     "అముల్ ఫ్యాక్టరీ" వైపు సాగిపోతూంది కారు.

     "సైన్స్ టుడే" మేగజైన్ ఉంది కారులో...ప్రభాకర్ సైన్స్ మేగజైన్‌కు రెగ్యులర్ చందాదారుడు.

     మేగజైన్ పేజీలు తిరగేశాను.

     "స్టెమ్ సెల్స్" శీర్షిక - స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు. మానవ శరీర కర్మాగారంలో ఏ అవయవమైనా మరమ్మతులకు గురికావచ్చు... చికిత్సకూ లోంగని పరిస్థితిలో అవయవ మార్పిడి అవసరమౌతుంది - స్టెమ్ సెల్స్... మూల కణాలు పిండంలోని అవయవ నిర్మాణానికి మూల ధాతువులు. పరికరాలు పిండంలోంచి మూల కణాలను తొలగించి, ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా భద్రపరచి అవసరమైనప్పుడు అవయవాలుగా అమర్చుకునే ప్రక్రియకు పరిశోధనలు పూర్తయి, ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

     ఆ ప్రయోగాలు విజయవంతమైతే... అవయవాలు చెడిపోవడం వల్ల మనిషి మరణించే పరిస్థితి రాదు. "మూల కణాలు తొలగిస్తే పిండం మరణిస్తుంది. అదో భ్రూణ హత్యతో సమానం. ఒక జీవి ప్రాణం తీసి ఇంకొకరికి పోస్తే అది అనైతిక చర్య" ఇదీ ఆస్తికవాదుల వాదన. పిండానికి ఎలాంటి హాని కలగకుండా మూలకణాలు సేకరించి రూపొందించగలిగే క్రొత్త ప్రక్రియకు శాస్త్రవేత్తలు జరిపే పరిశోధన దాదాపు విజయవంతమైంది. అది ప్రయోగాత్మకంగా రూపొందడమే తరువాయి.

     ఆసక్తికరమైన విషయాలు చదువుతుంటే మెదడుకు మేత దొరుకుతూంది. శాస్త్ర పరిజ్ఞానం శిఖరాలను దాటి ఎదిగిన వర్తమాన ప్రపంచంలో భవిష్యత్తు ఎన్నెన్ని క్రొత్త ప్రయోగాలకు నెలవవుతుందో!

     "సాగర్! ఆర్టికల్ చదివావా! సెంటిమెంట్లకూ, సాంప్రదాయాలకు పాడికట్టి నూతన సృష్టికి ప్రపంచం ఆయత్తమౌతూ వుంది. ఇది శుభపరిణామం" ప్రభాకర్ అన్నాడు.

     "ఇంకో విషయం...ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ...లూసీ బ్రౌన్ కృత్రిమ గర్భధారణ ద్వారానే 1978 జూలై 25న జన్మించింది. ఈ మధ్యనే ఆమె ఓ చక్కటి మగబిడ్డను ప్రసవించింది... సహజ కాంపు" సారంగపాణి అన్నాడు.

     కారు "అమూల్ ఫ్యాక్టరీ" ముందు ఆగింది... ఫ్యాక్టరీ అంతా తిరిగి చూశాము. అదో వింత ప్రపంచం... క్షీరవిప్లవానికి క్రొత్త నిర్వచనాన్నిచ్చి, నిరూపించి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన సంస్థ. వేలాదిమంది సమిష్టి కృషికి  నిలువెత్తు సాక్ష్యం... ఓ మహా యజ్ఞం.

     గుజరాత్‌లోని సూరత్, వడోదరాలాంటి ఇతర నగరాలు సైతం పారిశ్రామిక వాడలు కావడం, వస్త్రప్రపంచం, ఔషధ కర్మాగారాలు, వజ్ర సంపద, స్వర్ణమయమైన విశేషాలు రాష్ట్రం నిండా పరచుకున్నాయి.

     గాంధీ పుట్టిన రాష్ట్రంలో -

     నరసింహ మెహతా తిరగాడిన నేలలో -

     కచ్, భుజ్ భూకంపాలూ -

     గోద్రా నరమేధాలూ -

     మత మారణహోమాలు -

     హింసా ప్రవృత్తులూ -

     ఎన్ని ఉన్నా -

     అన్నిటికీ అతీతంగా -

     సూరత్ ప్రకాశిస్తూ ఉంది.

     'ఆనంద్'లో అంతా ఆనందమే.

     ప్రపంచీకరణ...ఔట్‌సోర్సింగ్‌ల ద్వారా సంపన్నదేశాలు మనలను హైజాక్ చేస్తున్నాయి. ఇప్పుడు కనే కడుపులు సైతం హైజాక్ అయిపోయాయి. "అమ్మ కడుపు చల్లగా ... కమ్మదనం మెండుగా..." కారులో టూ ఇన్ వన్‌లో గీతం సాగుతూంది. "సర్రోగేట్ మదర్స్...కడుపులు చల్లగా" నాలో మౌనగీతం.   

Comments