ఆవిడగారు - కొఠారి వాణీ చలపతి రావు

    
ఎవరైనా వాళ్ళ భార్య గురించి చెప్పేటప్పుడు 'మా ఆవిడ' అని చెబుతారు. నేను మాత్రం 'మా ఆవిడగారు' అని చెప్తాను. ఎందుకంటే మా ఇంట్లో పెత్తనమంతా ఆవిడగారిదే. వివరంగా చెప్పాలంటే ఆవిడ బాస్ అయితే నేను సబార్డినేట్, ఆవిడ సబల అయితే నేను అబలుణ్ణి.

    ఇంకా వివరంగా చెప్పాలంటే మా ఆవిడగారి దృష్టిలో నేను చాలా అమాయకుణ్ణి, నలుగురిలో మాట్లాడటం చేతగానివాణ్ణి, లౌక్యం తెలియని వాడిని వగైరా,వగైరా! 

    ఆవిడగారి దృష్టిలో నేను అంత చేతగాని చవట దద్దమ్మలా ఎందుకు ముద్రపడిపోయానో ఎంత జుట్టు పీక్కున్నా, నాకు అర్హ్తమై చావడంలేదు. నా దృష్టిలో మాత్రం నేను ముక్కుసూటి మనిషిని, నిజం తప్ప ఆద్ధం చెప్పనివాణ్ణి. ఇందులో తప్పుడు పనిగానీ, అభ్యంతరకర ప్రవర్తన గాని ఏమిటో నాకు అర్హ్తం కాదు.

    ఆ మధ్య ఆవిడ మేనమామ మా ఇంటికి చుట్టంగా వచ్చాడు. ఎంత చక్కగా పలకరించానో, ఎన్ని మర్యాదలౌ చేశానో చూసి తీరాల్సిందేగానీ మాతల్లో చెప్పలేను. 

    ఐనా అన్నింటికీ వంకలే. అడుగడుగునా నిష్ఠూరాలే. ఆరోజు మా ఇద్దరికీ డైనింగ్‌టేబుల్‌మీద ప్లేట్లలో ఇడ్లీలు పెట్టి తను వడ్డిస్తోంది. మూడు ఇడ్లీలు తిన్నాక నాలుగోది చేతపట్టుకుని 'ఇంకొక్కటి వేయించుకోండి' అంటుంటే 'మూడు ఇడ్లీలకన్నా ఎక్కువ ఏ వెధవైనా తింటాడా?' అన్నాను. అందులో తప్పేముంది? నా వంక గుడ్లురిమి చూసింది మా శ్రీమతిగారు. ఆయన బయటకెళ్ళిన తరువాత నాకో క్లాసు పీకింది.

    "మీకు అస్సలు మాట్లాడటం తెలియదు. ఇంటికొచ్చిన అతిథితో అలాగేనా మాట్లాడేది? మీరు అలా అనగానే నాలుగో ఇడ్లీ వేసుకోబోయిన మామయ్య ఠక్కున ఆగిపోయి 'వద్దమ్మా! కడుపు నిండిపోయింది. నేను కూడా ఎక్కువగా తినలేను' అన్నాడు" అంటూ నన్ను అర్గంటసేపు ఆడిపోసుకుంది.

    మధ్యాహ్నం ఆయన లంచ్‌కి వచ్చారు. పొద్దున అలా అంది కదా అని ఈసారి నేనే ఆయనకు ఇబ్బడి ముబ్బడిగా అన్నం వడ్డించేశాను. 'ఫరవాలేదు బాబాయిగారూ... సుష్టుగా తినంద్డి... బాగా తినండి... సిగ్గులేకుండా తినండి' అన్నాను. చాలా బాగా మర్యాద చేశానని సంతోషపడుతుంటే మళ్ళీ మిర్రిమిర్రి నా వంక చూసింది నా ఇల్లాలు.

    'సుష్టుగా తినండి. సిగ్గులేకుండా తినండి' అనకూడదట. 'నెమ్మదిగా కూర్చోండి... మొహమాటపడకుండా భోజనం చేయండి' అనాలట. కూర్చొని తినక... నిల్చునో, పడుకునో తింటారా ఎవరయినా?... 'భోజనం'అన్నా... 'తిండి' అన్నా ఒకటే కదా. ఏమిటో మిడిమేళం మనిషి. చెబితే అర్థం చేసుకోదు.

    మా ఆవిడగారికి పుట్టింటివాళ్ళంటే వల్లమాలిన అభిమానం గనుక మేనమామ విషయంలో ఓవర్‌యాక్షన్ చేసి ఉంటుందిలే అనుకున్నా. 
కానీ మా ఊరి నుంచి వచ్చిన మా కజిన్ విషయంలోనూ అలాగే చేసింది. మా సుధాకర్ అన్నయ్య... వాళ్ల కొడుకు కాలేజీ ఎడ్మిషన్ కోసమని సర్టిఫికేట్లు పట్టుకొని వచ్చాడు. 

    ఆ విషయం చెప్పగానే నేను 'అంత దూరం నుంచి ఎందుకొచ్చినట్టు... ఆ సర్టిఫికేట్లు ఏవో కొరియర్‌లో పంపిస్తే నేను ఆ పని చేసి పెట్టేవాణ్ణిగా' అన్నాను. అందులో తప్పేముంది. ఆయనకు శ్రమ, ఖర్చు తగ్గించి పైగా నేను పనిచేసిపెడతానంటుంటే. కానీ అలా అనకూడదట. అంటే 'ఎవందుకొచ్చా'రని అడిగినట్టు అమర్యాదగా ఉంటుందట. 

    `అయితే - గుమ్మంలో అడుగుపెట్టగానే 'రండి! రండి! దయచేయండి! మీ రాక వల్ల మా ఇల్లు పావనమయింది...' అనాలా? అంటే మరీ అలాకూడా అనకూడదట... ఓవర్‌గా ఉంటుందట. ఎలా చావాలి మరి? ఆ మాటే తనను అడిగితే ఇంటికెవరన్నా రాగానే ఎదురెళ్ళి చిరునవ్వు నవ్వాలట. 'రండి! కూర్చోండి... బాగున్నారా?' అని కుశల ప్రశ్నలు అడగాలట.

    'అరె! నాకు తెలియక అడుగుతాను. గుమ్మం ముందుదాక తనంత తానుగా వచ్చిన చుట్టం... ఇంట్లోకి తనంత తానుగా రాలేడా... ఎదురెళ్ళి చెయ్యిపట్టుకుని నడిపించుకుని తీసుకురావాలా? ఏం మాట్లాడుతుంది ఈవిడగారు అర్థం లేకుండా! ఎతమతం మనుషులు... వాళ్ళకు తెలియదు... ఒకళ్ళు చెబితే వినరు.

    'సరే! ఇంట్లో గొడవెందుకు ఆవిడ చెప్పినట్లే వింటే పోలే' అనుకుంటూ... ఆ సాయంత్రం మా అన్నయ్య ఇంటికొచ్చినప్పటినుంచీ... అదేదో సినిమాలో బ్రహ్మానందంలా ఆయన వంకే చుస్తూ నిముషానికోసారి చిరునవ్వు నవ్వడం మొదలుపెట్టాను. మాటల మధ్యలో అన్నయ్య - 'ఏరా తమ్ముడూ, మా పెదబాబును హాస్టల్‌లో ఉంచుదామనుకుంటున్నాను' అనగానే 'మంచి పని చేస్తున్నావు. అలాగే ఉంచు' అన్నాను. 

    వెంటనే మా ఆవిడ అందుకుని 'అయ్యో! అదేంటి బావగారూ... మేముండగా హాస్టల్‌లో ఎందుకు? మా ఇంట్లో ఉండి చదువుకుంటాడులెండి' అంది.

    ఆమె ఆ మాటలు మర్యాద కోసం అన్నదని నాకేం తెల్సు. 'నీ ముఖం... నీకు తెలియదు. మన ఇంట్లో వద్దు. హాస్టల్‌లో ఉంటేనే చదువు బాగా సాగుతుంది' అన్నాను.

     అప్పుడు మా ఆవిడ అపరకాళికలా నా వంక చూసింది. ఇంట్లోనే ఉంటే టీ.వీ.ఉంటుంది. టీ.వీ. ఉంటే పిల్లలు చదవరు. వాటికి అంటుకుపోతారు. అక్కడయితే క్రమశిక్షణతో స్ట్రిక్ట్‌గా చదివిస్తారన్నది నా ఉద్దేశం. 

    మన ఉద్దేశాలు మంచివయినా అలా మాట్లాడకూడదట. పిల్లాడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉన్నమాట అంటే ఎవరైనా ఎందుకు మరోలా అర్థం చేసుకోవాలో నాకు అర్హ్తం కాలేదు. మన మొహమాటాలు, మన మర్యాదలు ఎదుటివాళ్ళకు నష్టం కలిగించేవయినా ఫరవాలేదా? ఏమిటో మా ఆవిడ ఓ పట్టాన అర్థం కాదు నాకు. ఆవిడ ఎప్పుడర్థమైంది గనుక. పెళ్ళికి ముందూ అంతే. 

    ఎర్రగాబుర్రగా... ఒడ్డూ పొడుగూ లావుగా ఉన్నానని 'ప్రేమ...ప్రేమ' అంటూ నా వెంటబడి పెళ్ళివరకూ లాక్కొచ్చింది. ఆ రోజుల్లోను ఇంతే... ప్రతిదానికీ సాధింపులు, ప్రతి విషయాన్నీ తప్పు పట్టడాలు -

    'శ్రీరామ్... నువ్వు ఆ శ్రీరామచంద్రుడిలా ఆజానుబాహుడివి, అరవింద దళాయతాక్షుడివి. నీ విశాల వక్షస్థలంపై తల పెట్టుకు పడుకోవాలనీ, నీ బాహు పరిష్వంగంలో, ఈ ప్రపంచాన్నే మర్చిపోవాలనీ ఎంత ఆశో నాకు' అంటూ ప్రేమలేఖలు రాసి పుస్తకంలో పెట్టేది. నేను అలా జాబు రాసి తనకు పంపించలేదని కనబడినప్పుడల్లా సాధించేది. 

    అసలు ఆమె రాసిందేమిటో నాకు అర్థమై చస్తేగా 'జవాబు రాయాలా వద్దా' అని నిర్ణయించుకోవడానికి. అరవిందములు, అక్షులు, ఆజానుబాహులు, పరిష్వంగం ఈ మాటలకు అర్థం చెప్పని మా తెలుగు మాస్టార్ని పదేపదే తిట్టుకున్నాను ఆ రోజు.

    ఆ మాటే ఆమెతో చెబితే 'తెలుగు క్లాసుకు ఎప్పుడన్నా అటెండయి చస్తేగా నువ్వు' అంటూ తప్పు నాదే కానీ మాస్టారిది కాదని తేల్చేసింది.

    అప్పటి నుంచీ ప్రేమలేఖలు కాక ముఖాముఖీ కార్యక్రమాలు మొదలు పెట్టింది. 'శ్రీరామ్ నేను అందంగా ఉంటానా?' అని అడిగింది ఓ రోజు. 

    'అందంగా ఉండవు. ఓ మోస్తరుగా ఉంటావు' అన్నాను ఉన్న విషయమే కదా అని. లేని అందాన్ని ఉన్నట్టు మెచ్చుకోలేదని మూతిముడుచుకుంది.

    'నిజంగా నేను అందంగా లేనా?' అని మళ్ళీ అడిగితే 'ఒక్క మాటలో చెబితే సరిగా అర్థం కావటం లేదు కాబోలు' అనుకుని ప్రతి అవయవాన్నీ విడివిడిగా వర్ణిస్తూ -

    'నీ కళ్ళు చింతపిక్కల్లా చిన్నగా ఉంటాయి. ముక్కు ఒక దగ్గర కాస్త చట్టొఇగా ఉంటుంది. కనుబొమలు వంకర టింకరగా ఉంటుంది. కలర్ చామనఛాయ కన్నా కాస్త తక్కువ.కొంచెం లావుగా ఉంటావు' అన్నాను అంతే!

    మళ్ళీ పదిరోజుల దాకా నన్ను కలవలేదు. ఆ పది రోజులూ నేను మాత్రం హాయిగా బతికేశాను. మళ్ళీ పదకొండో రోజు ప్రత్యక్షమయింది - 'నిన్ను చూడకుండా నేను ఉండలేక పోతున్నాను శ్రీరామ్'అంటూ. 'చూడు... నేనేమైనా వద్దన్నానా?' అన్నాను. 

    'నీకు నేనంటే ప్రేమ లేదా?' అంది.

    'అలాంటిదేమీ ఉన్నట్టు కనబడటం లేదు' అన్నాను మామూలుగా.

    'నీ మనసులోకి తొంగి చూసి ఆ మాట చెప్పు' అందామె నొక్కి పలుకుతూ.

    'మనసు ఎక్కడో లోపల ఉంటుంది. అదేమన్నా బయటికి కనిపించే అవయవమా. అందులోకి ఎలా తొంగి చూడను?' అన్నాను.

    తలపట్టుకుంది కాస్సేపు.

    మళ్ళీ తలెత్తి 'శ్రీరామ్! నన్ను పెళ్ళిచేసుకుంటావా?' అని అడిగింది.

    'చేసుకుంటాలే... ఎవరో ఒకర్ని చేసుకోవాలిగా... మా అమ్మ కూడా పెళ్ళి చేసుకోమని ఒకటే పోరు పెడుతోంది. ఇంతగా అడుగుతున్నదాన్ని నిన్ను చేసుకోకుండా వేరే ఎవర్నో చేసుకోవడం ఎందుకు?' అన్నాను.

    నేను ఏం తప్పు మాట్లాడానోగానీ దబ దబా అరచేత్తో నెత్తి బాదుకుంది ఈసారి. 'నువ్వూ, ఇదిగో ఈ గోడా, ఆ చెట్టూ ఒకటే! పెళ్ళి చేసుకుంటానన్నావుగా... ఎలాగోలా! అది చాలు! ఆ చేసుకునేదేదో త్వరగా చేసుకుని మిడుకు. ఆ తర్వాత నా తిప్పలేవో నేను పడతాను...' అంది.

    అంతే. ఠక్కున మా పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత ఆమె నాతో ఏం తిప్పలు పడిందో నాకు తెలియదుగానీ నేనుమాత్రం ఆమెతో రోజూ తెగ తిప్పలు పడుతున్నాను. ఏదో అడిగిందిగదా అని పెళ్ళిచేసుకుంటే - రోజూ ఒకటే నస - 'నేనంటే మీకు ఇష్టమేనా శ్రీరామ్?' అని అడుగుతుంది పదే పదే.

    'బహుశా ఇష్టమేననుకుంటా' అంటే, 'బహుశా ఏంటి ఖచ్చితంగా చెప్పలేవా?' అంటుంది. ఖచ్చితంగా నాకే తెలియంది తనకెలా చెప్పగలను?

    ఒక రోజు నేను 'రాను... రాను' అంటున్నా వినిపించుకోకుండా వాళ్ళ తమ్ముడి పెళ్ళిచూపులకు నన్ను తీసుకెళ్ళింది. 'ఇంటి అల్లుడు మీరు రాకుంటే బాగుండదూ. అమ్మ నాన్న ఏమైనా అనుకుంటారు' అంటుంటే 'నిజమే కాబోలు' అనుకుని పెళ్ళిచూపులకెళ్ళాను.

    'ఏం మాట్లాడితే ఏం దొబ్బో' అని అక్కడికీ నోరు మూసుకునే కూర్చున్నాను. తను తెరవమన్నప్పుడే తెరిచాను సుమా! వెళ్ళగానే వాళ్ళు మాకు తెగ మర్యాదలు చేసేసి కూర్చోబెట్టి ముందు మంచి నీళ్ళు... ఆ తర్వాత కూల్‌డ్రింక్‌లు ఇచ్చారు. 

    ఎండలో పడివచ్చాం కదా... దాహమేసి రెండుగ్లాసులూ గటగటా తాగేశాను. అంతే! మా ఆవిడ డొక్కలో ఓ పోటు పొడిచింది. 'అలా కాదు... ఒక్కొక్క చుక్కే సిప్ చేస్తూ ఆఖరికి పావువంతు డ్రింకు అందులోనే వదిలేయాలి' అంది మెల్లిగా.

    ఇదెక్కడి గోల? దాహమేస్తే నీళ్ళు, కూల్‌డ్రింకు తాగటం కూడా తప్పేనా?

    ఆ తర్వాత ట్రేలలో ప్లేట్ల నిండా మైసూర్‌పాక్, బర్ఫీ, కారంబూందీ పట్టుకొచ్చారు. నాకు మైసూర్‌పాక్ అంటే చచ్చేంత ఇష్టం. గబగబా తింటే ఏమంటుందోనని ఈ సారి ప్లేట్ తీసి ఒళ్ళో పెట్టుకుని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను మెల్లమెల్లగా ప్లేట్ ఖాళీ చేశాను. అకస్మాత్తుగా ఇటు తిరిగి చూసి... మళ్ళీ డొక్కలో ఒక్క పోటు పొడిచింది. 'మళ్ళీ ఏమొచ్చింది?' అని అడుగుతున్నట్టు ఆమెవంక చూశాను.

    'పెళ్ళిచూపులకొచ్చి అలా గతకకూడదు' అంది మళ్ళీ మెల్లిగా నాకుమాత్రమే వినబడేలా.

    'ఇది మరీ బాగుంది. ఎవరైనా ఇంటికొచ్చినవాళ్ళకు స్వీట్లు, హాట్లు పెట్టేది తినమనేగా! ప్లేటు చూస్తూ గుటకలు మింగమని కాదుగా.అంత 'తినకూడద'ని రూల్ ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎందుకు పెట్టాలి? పెట్టాక మనం ఎందుకు తినకుండా వదిలెయ్యాలి? డబ్బు దండగ... వృథాశ్రమ తప్ప!' అని నేను మనసులోనే మా ఆవిడగారి మీద కారాలూ, మిరియాలూ నూరుతుండగా నా డొక్కలో మరో పోటు పొడిచి 'ఏదయినా మాట్లాడండి... బాగుండదు' అంది.

    గొంతు సవరించుకుని, సీరియస్‌గా ముఖంపెట్టి పెళ్ళిపిల్లవంక చూస్తూ 'అమ్మాయ్! అసలు పెళ్ళెందుకు చేసుకుంటారో తెల్సా నీకు?' అని అడిగాను. అందరూ ఒక్కసారిగా ఎందుకనో గానీ అదిరిపడ్డారు. ముఖముఖాలు ముందు 'వాళ్ళు' చూసుకుని తరువాత 'నా' ముఖం వంక చూశారు. అప్పుడుగానీ నాకు వెలగలేదు అందులో ద్వంద్వార్థం ఉందని. 

    నా ఉద్దేశం మూడు ముళ్ళ బంధం గురించీ, ఆడ మగ కలిసి లక్షణంగా కాపురం చేయాల్సిన పద్ధతిని గురించీ ఆ అమ్మాయి చెబితే వినాలని... సరిగ చెప్పలేకపోతే నేను చెప్పాలని. నా ఆలోచన కాస్తా అట్టర్ ఫెయిల్యూరు అయిపోయిందని మా ఆవిడగారి నిప్పుల చూపూ, నొప్పి పెట్టే డొక్కలో పోటూ చూసి, అనుభవించాకగానీ తెలియలేదు.

    అరె...! ఇంటికెళ్ళాక రాక్షసిలా మరింత నా మీద ఎగబడుతుందేగానీ నా ఉద్దేశం అర్థం చేసుకోదే! ఒకటికాదు, రెండుకాదు నానా మాటలు అంది ఆ రోజంతా.

    పెళ్ళికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుని పోవటం అంటే ఇదే అని అంది! అంటే నేను పిల్లినా?

    'మొగుడు పెళ్ళాల బంధం గురించి, ప్రేమ గురించి మీకొకటి తెలియదుగానీ మీరు ఇంకొకళ్ళకు చెప్పాలనుకున్నారా?' అంది. తెలియందే ఇన్నాళ్ళుగా మా ఆవిడతోగాక 'మా ఆవిడగారి'తో కాపురం చేయగలుగుతున్నానా? ఆ మాటే అంటే 'ఆ చేస్తున్నారు లెండి మహా... గొప్ప కాపురం. ఓ సరదా, సరసం, ముద్దూ ముచ్చటా పెళ్ళయిన కొత్తలో కూడా ఎరగను' అంటూ సాధింపు ఒకటి.

    ఆఫీసునుంచి వస్తూ ఏనాడయినా ఓ మూరెడు మల్లెపూలు తేలేదట నేను. పుట్టినరోజునాడు, పెళ్ళిరోజునాడు అయినా ఓ కొత్త చీర కొనిపెట్టలేదట! అనవసరంగా అభాండాలు వేయటం అంటే ఇదేమరి!

     నాకు తెలియక అడుగుతాను... ప్రతిరోజూ సాయంత్రంపూట మా ఇంటిముందు నుంచే మల్లెపూలు అమ్మే అబ్బాయి సైకిల్‌మీద వెళతాడు. ఒక్క మూర కాకపోతే పదిమూరలు కొనుక్కోమను. ఎవరొద్దన్నారు? ఇక చీరల విషయానికి వస్తే మా ఇంటికి కూతవేటు దూరంలో బోలెడు చీరల దుకాణాలున్నాయి. తనకు వెళ్ళి తెచ్చుకోవటానికి బద్ధకమైతే... ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు ఇంటికి తెచ్చి మరీ ఇస్తాడు ఆ షాపు అతను.

    అయినా నేనే పూలు తెచ్చి ఇవ్వాలనీ, నేనే చీర కొనిపెట్టాలనీ తనకా ఫట్టుదల ఏంటో నాకు అర్థం కాదు. అన్ని విష్యాల్లోనూ అలాగే చేస్తుంది. అన్నింటికీ ఆంక్షలే... అడుగడుగునా విమర్శలే.

    'నేనసలు కపటం లేని మనిషిని. మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరోలా మాట్ళాడటం, ఫాల్స్ ప్రిస్టేజీని ప్రదర్శించడం, మొహమాటాలకు, మెరమెచ్చు మాటలకు పోయి ఉన్నది లేనట్టుగా చెప్పడం నా స్వభావానికి విరుద్ధం.'అయినా నా మానాన నన్ను పోనివ్వకుండా నా మీద ఈవిడగారి కంట్రోల్ ఏమిటి? ఈసారి మళ్ళీ ఏదన్నా అననీ, అప్పుడు ఖచ్చితంగా చెప్పేస్తాను' అనుకున్నాను నాలో నేను కోపంగా.

    ఆ 'ఈసారి'... 'మర్నాడే' వస్తుందని అనుకోలేదు. ఏదో పనిమీద మా కొలీగ్ ఒకతను మా ఇంటికి వచ్చాడు. నేను అప్పుడే 'టీ'తాగేసి... వక్కపలుకులు కూడా నోట్లో వేసుకుని కూర్చున్నానుగనుక అతనికి తాగటానికి ఏదో ఒకటి ఆఫర్ చేయాలన్న ద్యాస నాకు రాలేదు.

    నాకు రాకున్నా అలాంటి ధ్యాసలు మా ఆవిడగారికి ఇట్టే వచ్చేస్తాయి గనుక 'ఉండండి... టీ తీసుకువెళుదురు గాని' అంటూ ముందుగదిలోకి తయారైంది.

    నేను ఆశ్చర్యంగా ఆమె వంక చూస్తూ 'ఇప్పుడే కదా... మనకు 'టీ' పెట్టి... ఇప్పుడు ఎవరైనా ఇంటికొచ్చారంటే టీ పెడదామన్నా పాలు లేవు అనుకున్నావ్?' అన్నాను. అంతే... ఆవిడ తెల్లముఖం వేఇసింది. ఆ తరువాత నన్ను శపించేలా చూసింది. మా కొలీగ్ 'నో...నో... నేనూ ఇప్పుడే 'టీ'తాగివచ్చాను' అంటూ లేచి వెళ్ళిపోయాడు.
    
    'మీకసలు బుద్ధుందా?' అంది మా ఆవిడ. ఇంతకు ముదెప్పుడూ నన్ను అంత మాట అనిన గుర్తు లేదు. 'ఇప్పుడు నేను ఏమన్నాను... 'పాలు లెవ్వు' అన్నాను. పాలు లేకుండా 'టీ'ఎలా పెడతావు నువ్వు?' అన్నాను కోపంగా.

    'పాలు లేకుంటే దొడ్డిదారిన వెళ్ళి ఏ ఇరుగింటి నుంచో కొంచెం పాలు తెస్తాను. మరో నాలుగు అడుగులు వేసి పక్క షాపునుంచి పాల ప్యాకెట్ తెస్తాను. అంతేగాని 'ఇంట్లో పాలులెవ్వని' ఇల్లెక్కిన కోడిలా అరిచి మరీ అందరికీ చెప్పాలా? ఫ్రిజ్‌లో పాలు, పెరుగు స్టాక్ ఉండవంటే ఎంత అవమానం' అంది ఆవిడ రంకెలేస్తూ.

    'ఎంత అవమానం? రాముడు సీతకు పెట్టిన అగ్ని పరీక్ష అంతటిదా? లేక నిండు సభలో ద్రౌపదికి జరిగినంతటిదా? అవమానమట! ఆఫ్ట్రాల్ పాలు... అవీ ఇల్లు అన్న తర్వాత ఉంటాయి... ఉండవు.

    లేవు గనుక నువ్వు కష్టపడిపోతావని 'ఉన్న విషయం' అంటే నీకెందుకు అంత ఉలుకు? అయినా ఆయన ఇంటిదగ్గర తాగే వచ్చానని అంటున్నాడుగా' అంటుంటే నా ధాటికి తట్టుకోలేక కాబోలు ఆవిడ నెత్తి కొట్టుకుంటూ రుసరుస లోపలికి వెళ్ళిపోయింది.

    నాకు ఎంత ఆనందం కలిగిందో ఆమె ఓటమికి... నా విజయానికి. ఉన్నట్టుండి నేనో పెద్ద మేధావిగా మారిపోయినట్టు అనిపించింది. అంతటి సంతోషంలో, ఆ రాత్రి ఓ చక్కటి కలకూడా వచ్చింది. ఉన్నట్టుండి నేను 'ఆయనగార్ని' అయినట్టు ఆవిడగారు ఉట్టి 'ఆవిడ'గా కుచించుకుపోయినట్టు.

    ఇంటి పెత్తనంతో పాటు దర్జాగా కాలుమీద కాలేసుకుని ఆవిడ మీద అథారిటీ కూడా చలాయిస్తున్నట్టు కల వచ్చింది. ఇంతలో 'లెండి...లెండి... ఎనిమిదైంది...' అంటూ చేతిలో చీపురుతో సిద్ధమైపోయింది మా ఆవిడ. వెంటనే లేవకపోతే చీపురు ఎక్కడ తిరగబెడుతుందోనన్న అనుమానంతో దిగ్గున లేచి కూర్చున్నాను.

    'ఇంట్లో పాలు లెవ్వు.ఈ రోజు రాలేదు. బయటికెళ్ళి 'టీ'తాగి... ఆ చేత్తోనే నాకూ పట్టుకురండి. ఇంట్లో మినప్పప్పు,బొంబాయిరవ్వ అన్నీ నిండుకున్నాయి. అవేవీ లేకుండా టిఫిన్ ఎలా చేస్తాను పాపం! అందుకే బయట హోటల్‌కెళ్ళి టిఫిన్ తిని రండి.

    మీకు అంతటి తెలివితేటలు, ధ్యాస ఉండవు గనుక చెబుతున్నాను. ఆ చేత్తోనే నాకూ ఒక ప్లేటు తెండి' అంటూ ఆర్డర్స్ పాస్‌చేసుకుంటూపోతోంది ఆవిడ.

    నిన్న జరిగినదానికి ఇది కక్ష సాధింపు చర్య అని నాకు అర్థమైపోయింది. వెంటనే లేవకుంటే 'చెత్త'తోపాటు ఆ చీపురుతో నన్ను కూడా ఎక్కడ ఊడ్చేస్తుందో అని భయపడి అక్కడినుంచి పారిపోయాను.

(స్వాతి సపరివార పత్రిక 11.05.2007 సంచికలో ప్రచురితం)
Comments