అవుటాఫ్ కవరేజ్ ఏరియా - పసునూరి రవీందర్

    
చార్జింగ్‌లో ఉన్న ఫోన్ మోగడంతో తీసుకొని చూశాడు జయంత్.

    ఊళ్లో ఉండే తన తల్లి కాయిన్ బాక్స్ నుంచి చేస్తున్న ఫోను. "హలో అమ్మా.. సోమారం బయల్దేరుతున్నావా? ఎందుకే, ఆదివారం మధ్యాహ్నం రావొచ్చు కదా. రైల్లో జనం తక్కువుంటరు'' అన్నా. "ఏమోరా మీ మామకు చెప్పు ఆ సంగతి'' అని తల్లి సమాధానం.

    జయంత్ మళ్లీ ఏదో చెప్పబోతుండంగనే సిగ్నల్ కట్ అయ్యింది. రెంట్‌ల బాధ పడలేనని సిటీకి దూరంగా ఈ కాలనీలో ఉంటున్నందుకు జయంత్‌కు ఈ సిగ్నల్ ప్రాబ్లమ్ నీడలా వెంటాడుతున్నది. ఏ కాల్ వచ్చినా గుమ్మంలోకో, వరండాలోకో వచ్చి మాట్లాడాల్సిందే. హలో, హలో అని ఎంత అరిచిన ఇటు మాట అటు వినబడది. అటు మాట ఇటు వినబడది. ఇక లాభం లేదని బయటికొచ్చి "అమ్మా వినబడుతుందా'' అని అంటుండగానే నెట్ వర్క్ కనెక్ట్ కావడంతో ఇక కాలు కదుపకుండా, కదిపితే ఎక్కడ సిగ్నల్ కట్ అవుతదోనని బొమ్మలా నిలబడి తల్లితో మనసారా మాట్లాడి చాలా సంతోషపడ్డాడు. ఈ కాలనీకి వచ్చి నెలైంది కానీ తల్లి ఒక్కసారి కూడా తన కొత్తకొంపకి రాలేదు. "ఊళ్లె ఒక్కదానివే ఏం చేస్తవే, పట్నంల మాతో ఉండమ''ని అడిగితే ... "ఒద్దు బిడ్డా, ఉన్న ఊరే కన్నతల్లి'' అంటది. దేశాలు పట్టుకొనిపోయి బతుకుడు నా వల్ల కాదంటది. ఇప్పుడు మాత్రం ఏ రాత్రి, ఏ కల కలవరపెట్టిందో, కొడుకును చూడాలనిపించి, వస్తున్న అనే సరికి జయంత్ సంతోషానికి అవధులు లేవు. తనకే కాదు రజితకు కూడా ఆనందం హద్దులు దాటింది. అదే ఆనందంతో ఆఫీసుకు బయల్దేరబోయాడు జయంత్.

    "బావా...'' అన్న పిలుపు విని తలతిప్పి చూశాడు. పెళ్లయి పన్నెండేళ్లు గడిచినా ఇంకా రజితకు తన మీద ఏ మాత్రం ప్రేమ తగ్గలేదు. ఏంటి? అన్నట్లు కనుబొమలెగరేశాడు. "ఏం లేదు రెడ్డమ్మ ఆంటీ, సుజాతక్క వాళ్లు చార్మినార్ దగ్గర మదీనాలో శారీలు కొనుక్కోడానికి వెళ్దామంటున్నారు. మీరో వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో ఇస్తే పెళ్లిరోజుకు చీర కొనిచ్చే పని తప్పుతుంది..'' అని తన డిమాండ్‌ను నెమ్మదిగా భర్తకు చెప్పింది. స్కాముల కాలం కదా అని రూపాయల్ని కోట్లుగా మార్చి మాట్లాడుతూ అందరిని ఆటపట్టించడం వీరిద్దరికి అలవాటే.

    "నా పర్సుల రెండు వేల కోట్లు కాదు కానీ, పదిహేనొందల కోట్లున్నయి. ఇవి తీసుకొని చీరే కొంటవో, సారే కొంటవో నీ ఇష్టం'' అని ఆ డబ్బు ఆమెకిచ్చేసి ఆఫీసుకు బయల్దేరడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో రజిత పిల్లల్ని స్కూలు బస్సు ఎక్కించి తన మహిళాలోకం స్నేహితులను తీసుకొని, చార్మినార్‌కు బయల్దేరింది. జయంత్ ఉంటున్న ఈ కాలనీలో ఇరుగుపొరుగుతో ఎలాంటి సమస్యలు లేవు. ఎక్కడెక్కడి నుండో వచ్చి స్థిరపడ్డ వాళ్లందరూ బంధువుల్లా కలిసిపోయిన తీరు తనకు బాగా నచ్చింది. ఏదైనా పండగొస్తే ఒకరింట్లో వంటల స్పెషల్స్ మరొకరింట్లోకి అనుమతులేవి లేకుండానే పంపిణీ అయ్యేవి. పుట్టినరోజుల వంటి చిన్న చిన్న ఫంక్షన్లకు ఫ్యామిలీలన్నీ కలిసిపోయి రకరకాల వరసలతో పిలుచుకుంటూ, కలిసిమెలిసి జరుపుకునే తీరు జయంత్‌కు ఒకింత మనశ్శాంతినిచ్చింది. ఒకవైపు తను చేసే ఉరుకుల పరుగుల ఉద్యోగానికి తోడు, కట్టాల్సిన ఫైనాన్స్‌లు, ఇంటికి పంపే పాత అప్పులు వంటి సమస్యల మధ్యన నైబర్స్‌తో ఎలాంటి సమస్యలు లేకపోవడం కొంత ప్రశాంతతనిచ్చింది. ఈ యిల్లు యిప్పట్లో ఖాళీ చేయొద్దని, ఓనర్‌కి రెంటు డబ్బులు ఒకరోజు ముందే అందేలా చేయాలని అనుకున్నాడు.

* * *

    సాయంత్రం కాస్త లేట్‌గా ఇంటికి చేరుకున్నాడు జయంత్. బైక్ పార్క్ చేసి ఇంట్లో అడుగుపెట్టాడు. షాపింగ్ కవర్‌లు చైర్‌లోనే ఉన్నాయి. రజితను చూసి "బాగా జరిగిందా మీ షాపింగ్ పర్యటన'' అన్నట్టు కనుబొమలెగరేశాడు.

    ఏదోలే అలా జరిగిందన్నట్టు తలూపింది. అంతా సైగల భాషే. కవర్ చేతుల్లోకి తీసుకొని చూసి ... జయంత్ బిత్తరపోయాడు. "అధ్యక్షా ఇదేంటి? ఒక్క చీర బదులు రెండేంటి? రెండింట్లో ఒక కాటన్ చీరేంటి?'' అని ప్రశ్నల జల్లు కురిపించాడు.

    షాపింగ్ అలసట రజితలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. "ఏదోలే... మా మేనత్త 'వరవ్వ' వొస్తున్నదని చిన్నపాటి మర్యాద. ఈ మాత్రం కూడా చెయ్యకుంటే, నన్ను తిట్టకుండ ఎట్లుంటది చెప్పు బావా? అందుకే'' అన్నది రజిత సిగ్గుపడుతూ.

    "హమ్‌మ్ ... బాగుంది. మీ అత్తాకోడళ్ల యవ్వారం. కానీ, అమ్మకు 'శారీ' నేను తర్వాత తీసుకుందును కదనే, ముందు నీకు మాత్రమే తీసుకోపోయావా'' అని ఇంకేదో చెప్పబోతుంటే రజిత తన సహజమైన శైలిలో అడ్డకట్ట వేసింది.

    "ఏ ఊరుకో బావా, మా అమ్మనాయన వచ్చినప్పుడు నువ్ ఇద్దరికీ బట్టలు తెచ్చినవ్ కదా. మరి, నేను కనీసం చీరైనా తేకుంటే మా అత్తకు నా మీద ప్రేమ తగ్గిపోదూ? పైగా మా అయ్యవలకు బట్టలు తెచ్చిన విషయం కూడా ఈ పాటికే తెలిసి ఉంటది. సమన్యాయం యువరానర్'' అని జయంత్ నోరు మూయించింది. అరె, సమన్యాయమో, సామాజిక న్యాయమో నువ్ వినవు కదా చెప్తే. సీతమ్మ ఎవరి మాట వినదు ... అని ఒక నవ్వు నవ్వాడు.

    తన తల్లి పట్ల రజితకున్న ప్రేమను గురించి తలుచుకుని లోలోపల సంబురపడ్డాడు జయంత్. తన షాపింగ్ పర్యటన విశేషాలన్నీ పూస గుచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టింది రజిత. భోజనానికి ముందు మొదలై... బెడ్ మీదికి చేరినా 'షాపింగ్ సీరియల్' మాత్రం నడుస్తూనే ఉంది. జయంత్ 'ఊ' 'ఆ' అంటూ వింటున్నాడు. ఇంకెప్పుడైపోతదిరా బాబూ అనుకుంటున్నాడు లోలోపల. కానీ, ఆ విసుగు పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. రజిత మాత్రం మధ్యలో వాణిజ్య ప్రకటనల బ్రేక్ (యాడ్) అయినా లేకుండా చెప్పుకుపోతూంది. "నిజంగా ఈ కాలనీ, ఇక్కడి మనుషులు నాకు బాగా నచ్చారు బావా. రెడ్డమ్మ ఆంటీ పేరులోనే రెడ్డి కానీ, మనిషి భలే మంచిది. ఇన్నిసార్లు కలిసి మాట్లాడుకున్నా, నన్ను ఏనాడు కులం అడగలేదు. అదే మన ఊళ్లెనైతే రెడ్డోళ్ల దాకెందుకు కాపోళ్లు, ముత్రాశోళ్లు కూడా మనల్ని ఎంత ఈసడించుకునేటోళ్లు ... తక్కువ జాతోళ్లని ఎన్నిసార్లు అనలేదు. మా నాయినోళ్ల ఎడ్లు వాళ్ల పొలంల పడ్డయని యేడాది పొడుగున ఎన్నిసార్లు 'లేకి' కులమని తిట్టిన్రో. కానీ, ఈ పట్నంల మాత్రం కులం లేదు. గిలం లేదు. అందరూ గిట్ల సమానంగా ఉంటే ఏమైతది బావా మనూరోళ్లకు?'' చివరకి ఓ ప్రశ్న సంధించింది.

    జయంత్‌కు నవ్వొచ్చింది. "రజీ, నువ్ ఇంట్ల ఉండి, కులం లేదు గిలం లేదని మాట్లాడుతున్నవ్‌గని, పట్నంల కూడా కులముంటదే. కాకుంటే బయటికి కనిపించకుండా దాని పని అది చేస్తుంటది. దాని బారిన పడినోళ్లకే అది కనిపిస్తది. దాన్ని పాటిస్తూ, ఆధిపత్యం చెలాయించే పెద్దకులపోళ్లకు మాత్రం అది లేనట్టుగా భ్రమింపజేస్తది. అందుకే బాధపడేటోళ్లు బాధపడుతుంటే, బాధపెడుతున్నోళ్లు మాత్రం ఇంకా కులమెక్కడిదని నీతులు చెబుతుంటరే'' అని రజీకి జ్ఞానోదయం అయ్యేలా వివరించాడు. కానీ రజిత అంత ఈజీగా నమ్మే ఘటం కాదు. "ఏమో బావా నేనైతే నమ్మలేను. ఇక్కడ పక్కింట్లో ఉన్నోడెవరో తెలియదు. ఇక వాళ్ల కులమేందో ఆరా తీసి తెలుసుకోవడం ఎవరి తరం చెప్పు?'' అన్నది.

    "పిచ్చి రజీ, మనం కిరాయికోసం వెతుకుతున్నప్పుడు చూడలేదా, ఎన్ని ఇండ్లకు 'ఓన్లీ వెజిటేరియన్స్' అని బోర్డులు పెట్టలేదు! అంతెందుకే మా ఆఫీసులో రెండొందల మంది ఎంప్లాయీస్ ఉంటే అందులో సెవంటీ పర్సెంట్ రెడ్డీలే తెలుసా. ఇంకా నువ్ చెబితే నమ్మవ్ కానీ, ఆ మధ్య నేను సుప్రజ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు అందులో డాక్టర్‌లు ఎక్కువమంది ఏ కులం వాళ్లో ... వాళ్ల జేబుకు ఉన్న పేర్లలోనే ఉంది కదా. అక్కడ ఊడ్చెటోళ్లు, తూడ్సెటోళ్లు మాత్రమే దళితులు. ట్రెయినింగ్ నర్సులు, వార్డు బాయిలు మాత్రం బీసీల్లాగా కనిపించారు'' జయంత్ తన అనుభవాలను ఒక్కొక్కటిగా ఉదాహరణలతో సహా వివరించాడు.

    రజిత మాత్రం "నువ్ మరీ ఎక్కువ చెప్తున్నవ్ బావా, నర్సింగ్ స్టూడెంట్స్ బీసీలని నీకెట్ల తెలుసు?'' వకీలు కొచ్చెన్ వేసింది. "ఇంజక్షనో, టాబ్లెట్లో ఇస్తుంటే పలకరిస్తం కదా, మాటల సందర్భంలో అడుగుతం కదనే, ఏం చదువుతున్నరు, పై చదువులు ఎందుకు చదువలేదు, తల్లిదండ్రులు చేసే పనులు ఏమిటని సంభాషణల్లో ఎక్కడో కులం తళుక్కున మెరువక పోతదా చెప్పు. ఈ దేశంలో బాగుపడ్డ శానా మందికి కులం ఒక ఆధారమైతే, అదే కులం కోట్లాదిగా ఉన్న బహుజనులకు గుదిబండలా తయారవుతదే...'' నిట్టూర్చాడు జయంత్. "ఏ పోనీ నీ కులం లొల్లి ఎప్పుడూ ఉండేదేగని, రేపు మా మేనత్త వొస్తున్నది అధ్యక్షా, నువ్ పొద్దుగాల్నే స్టేషన్‌కు పోయి పికప్ చేసుకొని రావాలె, ఇగ పడుకో'' అన్నది. ఈ లోకం మీది ముచ్చట్లన్ని మాట్లాడుడుతోటి అప్పటికే పన్నెండైంది టైం.

* * *

    సోమవారం రానే వచ్చింది. తన తల్లి వరవ్వ వస్తుందనే ఆనందంతో జయంత్ నిద్ర కూడా సరిగా పోయినట్టు లేడు. ఎప్పుడు తెల్లారుతుందా అని గోడ గడియారం దిక్కు చూస్తూనే గడిపాడు. సూర్యకిరణాల వెలుతురు కనిపించిందో లేదో హడావుడిగా లేచి ట్రైన్ రావడానికి అరగంట ముందే బైక్ తీసుకొని రైల్వే స్టేషన్‌కు పోయి వెయిట్ చే తల్లిని ఇంటికి తీసుకొచ్చాడు. అక్షరం ముక్కరాని తల్లి ఇంత జాగ్రత్తగా పట్నం చేరుకోవడం జయంత్‌కి ఒక వింత. కానీ, "చదువు రాకుంటేనేం. అడుక్కుంటూ అడుక్కుంటూ ఢిల్లీకి కూడా పోవచ్చు బిడ్డా'' అంటది వరవ్వ. తన కొడుకు జయంత్ ఈ మాత్రం ప్రైవేటు కొలువు చేసే దాకా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డ శ్రమజీవి ఆమె. జయంత్ చిన్ననాడే భర్త దూరమైనా మీ నాయన బతికున్నప్పుడు 'కింది కులపోళ్లకు సదువొక్కటే ఆస్తి' అని చెబుతుండె. చదువును వొదులద్దు బిడ్డా అని గుర్తుచేస్తూ చదివించింది. ఊర్ల అందరి పిల్లలకంటే తన కొడుకే ఎక్కువ చదివిండని ప్రతీరోజు చెప్పుకునేంత చదివించింది. బైకు గేటు ముందు పెట్టి లోపటికి నడుస్తుంటే .."బిడ్డా ఎంతరా గీ యిల్లు కిరాయి? మనూల్లె పటేలు దొరల ఇండ్ల లెక్కున్నది'' అని కొడుకును అడిగింది వరవ్వ.

    "అరె నీ యవ్వా ఎంత అయితే ఏమున్నది లేయే? నిమ్మలంగా అన్నీ తెలుసుకుందువ్ లే'' అన్నడు జయంత్. పెద్ద సదువులు సదివినా, ఊర్ల తనవాళ్లు మాట్లాడే భాషే తల్లితో మాట్లాడుతడు జయంత్. ఆఫీసులో మాత్రం అంతా ఇంగ్లీషు రాజ్యమే.

    వరవ్వ ఇంట్ల అడుగు పెట్టుడు ఆలస్యం. మనవడు, మనవరాలు "నానమ్మా ...'' అంటూ మీద పడ్డారు. మరోవైపు రజిత మొఖం పున్నమినాటి వెన్నెలైంది. ఒకటే ఉరుకులు పరుగులు. పనులన్ని ఇవాళ మరింత స్పీడుగ చేస్తున్నది. వరవ్వ చేత 'షెబాశ్' అనిపించుకోవాలని. పట్నం పోయినా, తాను మారలేదనిపించుకోవడానికి, తన ప్రేమను నిరూపించుకోవడానికి రకరకాల వంటల చేస్తున్నది. మధ్య మధ్య వాళ్లు బాగున్నరా, వీళ్లు బాగున్నరా, మార్తమ్మ బిడ్డె సౌజన్యకు కొడుకా? బిడ్డా? అని ఆరా తీస్తూ అత్తతో ముచ్చట పెడుతున్నది. ఆ ముచ్చట్ల మధ్యలో వరవ్వకు కొడుకు చెప్పని సమాధానం యాదికొచ్చింది.

    కొడుకు స్నానానికి పోయింది చూసి "ఏం కులపోల్లది బిడ్డా ఈ యిల్లు? మస్తున్నది'' అని నీళ్లు తాగిన చెంబు పక్కన పెడుతూ కోడల్ని అడిగింది వరవ్వ.

    "ఎందుకు అట్ల అడుగుతున్నవ్ అత్తమ్మా?'' వంట చేస్తూ రజిత ప్రశ్న.

    "ఏం లేదు బిడ్డా, మనమా తక్కువ కులపోళ్లం. మరి ఈ ఇల్లుగల్లోల్లు ఆ విషయం తెలిసి మనల తక్కువ చూస్తే నారాజైతది కదా. అందుకే అడిగిన బిడ్డా'' అన్నది.

    "అదేం లేదు అత్తమ్మ. ఓనరు వాళ్లు ఇక్కడుండరు. వాళ్లకు సిటీల ఇంకో యిల్లున్నది. కిరాయి కూడా అకౌంట్‌లో వెయ్యమంటరు. అంతే ఇగ వాళ్లు ఏంటోల్లో మనకు తెల్వది, మన కులమేందో వాళ్లకు తెల్వది'' అన్నది రజిత.

    "అట్లయితే ఏ బాధ లేనట్టే బిడ్డా మీకు'' అన్నది వరవ్వ.

    ఇంతలోనే జయంత్ ఆఫీస్‌కు రడీ అయిండు. "అమ్మా అన్నం తిని రెస్టు తీసుకో, నేను ఆఫీసుకు పోవాలె. సాయంత్రం తొందరగ వొస్త. మనం శిల్పారామం గిట్ల చూసి, అన్నం కూడా ఏదన్న హోటల్లనన్న, రెస్టారెంట్లనన్న తినొద్దాం'' అని తల్లితో చెప్పిండు.

    "అదేందిరా ఇంట్ల బియ్యం గిట్ల లెవ్వా ఏంది?'' అన్నది వరవ్వ. ఆ ప్రశ్నకు బిత్తర పోయిండు జయంత్. ఊళ్లె కూలీనాలీ చేసుకోని బతికిన వరవ్వకు వరిగడ్డి గుడిసే స్వర్గం. కట్టెల పొయ్యి మీద ఒండుకున్న అన్నం కూరలే పరమాన్నాలు. ఏం లేనప్పుడు నూకల అన్నంలో ఎల్లిపాయె కారమేసుకొని తిని, కొడుకును సదివిచ్చిన కూలీతల్లికి హోటలల్ల వందల నోట్లు ఖర్చు పెట్టి బిర్యానీలు తిన్న అనుభవం ఏనాడు లేదు. అందుకే బియ్యం లేవారా అని అడిగింది. తల్లికి అర్థమయ్యేటట్టు చెప్పాలనుకున్నడు జయంత్. "అమ్మా అట్ల కాదే, ఈ పట్నంల జెర నాలుగు పైసలు సంపాంచెటోల్లు రోజూ ఇంట్ల ఏం తింటమని, వారానికి ఒకసారి అట్లా బయటి రుచులకు అలవాటు పడుతరె, ఈడ అదో సోకే (స్టయిల్) అవ్వా'' అని సమాధానమిచ్చిండు.

    వెంటనే అందుకున్నది వరవ్వ. "ఓర్నీ ఇదేం బతుకురా, ఇంత బతుకు బతికి ఇంటెన్క సచ్చినట్టు, బువ్వ కొనుక్కొని తినుడేందిరా. ఎన్నడన్న మనూళ్లె అన్నం కొనుక్కున్న రోజులున్నాయిరా?'' అన్నది. దెబ్బకు జయంత్‌కు పట్నం మత్తొదిలింది.

    అమ్మో నా వల్ల కాదురా దేవుడా, ఇంత చికెనో, మటనో ఇంటికే తెచ్చి వండుక తినుడు మేలు. ఇగ హోటల్‌కు ఒప్పించి తీసుకపోయినా, ఈ అత్తాకోడండ్లు అక్కడుండే ఐటమ్‌లను చూసి దీనికెంత? దానికెంత? అని పోలీస్ ఇంటరాగేషన్ లెక్క ఎన్ని ప్రశ్నలేసి సంపుతరోనని సల్లగ జారుకున్నడు.

    రజిత అత్తను జాగ్రత్తగా చూసుకుంటూ సపర్యలు చేసుడు షురూ చేసింది. అత్త వచ్చి మూడు రోజులైంది. పొద్దుందాకా టీవీ చూసుకుంట ఏం కూసుంటది? పిల్లలు సాయంత్రం అయిదు దాటంది ఇంటికి రారు. వచ్చినా వెంటనే ట్యూషన్‌లు, హోం వర్క్‌లు ఒకటే బిజీ. అందుకే వరవ్వను ఒకసారి తన మహిళాలోకం స్నేహితుల దగ్గరికి తీసుకపోతే బాగుంటది కదా అని మనసులో అనుకున్నది రజిత. వరవ్వకు మంచిగ తలస్నానం చేయించి, అత్త మీద ప్రేమతో తను తీసుకొచ్చిన కొత్త కాటన్‌చీర కట్టించి రెడీ చేసింది. వరవ్వ మొరటుగా ఉంటది.

    అందుకే తన స్నేహితులు ఏమనుకోకుండా ఉండేందుకు తన ప్రయత్నాలు తాను చేసింది. ముడిసిన తలవెంట్రుకలను విడదీసి, జడ వేసినట్టు చేసింది. తన ఇరుగుపొరుగు స్నేహితుల దగ్గరికి తీసుకపోయి పరిచయం చేసింది. అప్పటికే, వాళ్లు ఫోన్ చేసి, "ఏం రజితా ... మమ్ముల పూర్తిగా మరిచిపోయినట్టున్నవ్ కదా, మాక్కూడ అత్తలున్నరమ్మా'' అంటూ ఎగతాళి చేస్తనే ఉన్నరు. రజిత వరవ్వను రెడ్డమ్మ ఇంటికి తీసుకపోయి సుజాతక్క, అలివేలు అందరివి పక్కపక్క ఇండ్లే కాబట్టి అందరిని అక్కడికే పిలిచి పరిచయం చేసింది. మొగుడి మీద సెటైర్‌లేసే రజిత తన స్నేహితుల దగ్గర మాత్రం సైలెంట్‌గా ఎందుకుంటది. అందరిని రకరకాలుగా కామెంట్ చేసి, వారిని నొప్పించకుండా కడుపుబ్బా నవ్వించడం తనకు అలవాటే. ఆ నవ్వుల సాయంత్రంలో ఇప్పుడు కొత్తగా అత్త వరవ్వను కూడా చేర్చింది. దాంతో వరవ్వ మనసు ... నిండిన కల్లుకుండ నురుగు లెక్క ఉప్పొంగింది.

    చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఊళ్లె తన కండ్ల ముందే ఆడుతూ పాడుతూ తిరిగిన రజితేనా అనిపించింది వరవ్వకు. ఇంతమందిల గలగల మాట్లాడుతూ నలుగురిట్ల, అందరూ మెచ్చుకునేలా ఎదిగినందుకు కడుపు నిండినట్లయింది. రజిత తన వెంట రాకున్నా అందరి ఇళ్లలోకి వెళ్లి పలకరించే సాన్నిహిత్యం వరవ్వకు తొందరలోనే దొరికింది. మధ్యాహ్నం పూట రజిత ఇంట్ల తన పనుల్లో తానుంటే, "ఉన్నారుల్ల, తిన్నరా'' అనుకుంటూ వరవ్వ ముచ్చట్లకు పొయ్యేది.

* * *

    ఉన్నట్టుండి ఒకరోజు పొద్దున "రేపు నేను ఊరికి పోతరా'' అన్నది వరవ్వ కొడుకు, కోడలుతో.

    అదేందమ్మా ఇంకో నాలుగు రోజులుండవచ్చు కదా, ఊరికి పోయి నువ్ చేసే పనులు ఏమున్నాయి అన్నాడు జయంత్.

    కొడుకు కోడలు ఎంత బాగా చూసుకున్నా, వరవ్వకు పట్నం నచ్చలా. కొత్తిమీర మొదలు అన్నీ కొనుక్కొని బతుకుడు తనకు నచ్చలా. ఎప్పుడెప్పుడు తన ఊరికి వెళదామా అని ఎదురు చూసింది. ఊరిలో ఉన్న బంధువులు, ఉన్న అరెకురం భూమి, రాత్రిపూట బొడ్రాయికాడ చెప్పే 'చిందోళ్ల కథ' - ఇవే వరవ్వ ఇష్టాలు. సరే ఇప్పుడు ఊళ్లు కూడా మారిపోయి కథలు చెప్పెటోళ్లు లేకున్నా అప్పటి సంగతులన్ని తన ఈడు ముసలోళ్లతోటి గుర్తుచేసుకుంటు కాలం గడుపుడే వరవ్వకు నచ్చుతుంది. పట్నం అంతా కొత్తేనాయె. ఎవలకు ఏమని చెప్తది, ఎన్నని చెప్తది? అందుకే తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది.

    కొడుకు మాటకు అడ్డు చెబుతూ ... "లేదు బిడ్డా, మన ఎల్లవ్వ కొడుకు పెండ్లి దగ్గరపడే. పనులన్ని అట్లనే ఉన్నయ్. రమ్మని నిన్న రజితవ్వ సెల్లుకు ఫోన్ చేసి చెప్పింది'' అని పోవడానికి ఒక సాకు చూయించింది వరవ్వ. కానీ రజిత "ఆ చేస్తే చేసింది కానీ, నువ్ పండుగ ఎల్లే వరకు ఈన్నే ఉండాలె'' అని మేనత్తను ప్రేమతో కట్టడి చేసింది. "వొద్దులే బిడ్డా ఎండాకాలం వొస్త, అప్పుడుంటాలే'' అని ఇక వెళ్లడానికి నిర్ణయించుకున్నట్టు పలికింది వరవ్వ. సరే అని మరుసటిరోజు తెల్లవారే స్టేషన్‌కు వెళ్లి, వరంగల్‌కు డైరెక్ట్ టిక్కెట్ తీసుకొని, తల్లికి అన్ని జాగ్రత్తలు చెప్పి, 'వద్దులేరా' అని తల్లి అంటున్న వినకుండా ఓ ఆర్నెల్లు తన ఖర్చులకు సరిపడా డబ్బులుచేతికిచ్చి, ట్రైన్ ఎక్కించి ఇంటిదారి పట్టిండు. అప్పటికే ఆఫీస్ నుండి ఫోన్. వస్తున్నవా లేదా అని. దాంతో ఇక హడావుడిగా ఆఫీస్‌కు వెళ్లాడు జయంత్.

    రెండు రోజులుగా రజితలో హుషారు తగ్గింది. వరంగల్ నుండి తన బంధువులు ఇంతదూరం ఎవ్వరూ రారు. దూరంతో పాటు వారి ఆర్థికస్థితిగతులు కూడా ఈ ప్రయాణ ఖర్చులను భరించే స్థాయిలో లేవు. బహుశా వరవ్వ వెళ్లిపోయినందుకేనేమో రజిత డల్ అయ్యిందనుకున్నాడు జయంత్.

    మూడు, నాలుగు రోజుల పాటు అలాగే ఉంటే ... భోజనాలయినంక, పడుకునే ముందు ఏమైందన్నట్టు చూపులతోనే సైగ చేశాడు.

    "ఏం లేదు బావా. ఎందుకో ఉన్నట్టుండి రెడ్డమ్మ, సుజాతక్క, అలివేలు వీళ్లెవరు మునుపటిలా నాతో ఉండడం లేదు. ఇదివరకు కూరగాయలకో, కంగన్‌హాల్‌కో కలిసిపోదాం అని వెంట తీసుకుపోయేవాళ్లు. ఇప్పుడు పలకరించినా, తల కిందికేసుకొని చూడనట్టు వెళుతున్నారు, వాళ్ల పిల్లల్ని కూడా మన పిల్లలతో ఆడుకోనివ్వటం లేదు. కొట్టి మరీ బయటి నుంచే తీసుకుపోతున్నరు'' అని టప టప కన్నీళ్లు రాలుతుంటే జీరబోయిన స్వరంతో తన గుండెల్లో రగులుతున్న బాధను జయంత్‌కు చెప్పి అతని భుజం మీద తలవాల్చింది. జయంత్ నివ్వెరపోయాడు. అయినా తేరుకొని ... ఏం జరిగి ఉంటుందో తర్వాత ఆలోచిద్దాం, ముందు రజితను ఓదార్చాలనుకొని "రజీ ఏంటిది, చిన్నపిల్లలా ... నువ్వెప్పుడూ వాళ్లను ఆట పట్టిస్తవ్ కదా, ఈసారి నిన్ను ఆట పట్టిద్దామని అలా చేస్తున్నారేమో లే'' అని సముదాయించిండు. కానీ, దాని గురించే లోలోపల ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు.

    మరుసటి రోజు మధ్యాహ్నం ఊరి నుండి కాయిన్ బాక్స్ నుంచి తల్లి ఫోన్ ...

    సాధారణంగా ఈ టైంలో తాను ఆఫీసులో ఉంటానని తన తల్లికి తెలుసు. అయినా చేస్తున్నదంటే రజిత ఫోన్ కలువకపోవచ్చని అర్థం చేసుకున్నడు. నెంబర్ చూసి బయటికొచ్చి "హలో అమ్మా ... ఎట్లున్నవే, మంచిగ చేరుకున్నవ్ కదా ..?'' అడుగుతున్నడో లేదో వరవ్వ గండి పడ్డ చెరువోలె ముచ్చట్లన్ని వరుసగా చెప్పుడు మొదలుబెట్టింది.

    "జయన్న ఎట్లున్నవు బిడ్డా? రజితవ్వ పిల్లలు మంచిగున్నరా, నేను మంచిగనే చేరుకున్నా. మొన్న నీకు చెప్పుడు యాది మరిసినరా. ఆ రెడ్డమ్మ ఇంటికి పోయినపుడు, దసరకు ముందు జరిగిన వాళ్ల కొడుకు పెండ్లి ఫోటోలు చూపెట్టింది. 'రెడ్డమ్మ ఘనంగనే చేసినట్టున్నవ్ పెండ్లి' అని ముచ్చట పెడుతుంటే వాళ్ల కొత్తకోడలు పిల్ల చాయ (టీ) తెచ్చి ఇచ్చింది. చాయ తాగుకుంట ఆ కోడలుపిల్ల వంటింట్లకు పోయింది చూసి అడిగిన, "రెడ్డమ్మ నీ కోడలు కట్నమెంత తెచ్చింది'' అని. ఆ పిల్ల ఇంటే బాధపడుతది కదా. అందుకు రెడ్డమ్మ "ఏమున్నది వరవ్వ పదిహేను లక్షలు, పది తులాల బంగారం, ఉప్పల్ కాడ ఓ ప్లాట్ ఇచ్చిన్రు. గంతే ఏమున్నది సక్కదనం'' అని వెటకారంగా అన్నది. నాకు గుండె గుభేల్ మన్నది బిడ్డా.

    నా నోటి మాటాగక, ఇంకేం తక్కువైందవ్వ? మా కులంలనైతే ఒక్క లచ్చ ఇచ్చెటోల్లు పదూళ్లకు ఒక్కరు కూడా దొరుకరు అన్న. వెంటనే రెడ్డమ్మ ఏం కులం వరవ్వ మీది అని మంచిగనే మర్యాదగనే అడిగింది. ఇగ నాకు ఎట్లనో అనిపిచ్చింది. మాదిగోళ్లమంటే, ఏమనుకుంటరో ఏమోనని, 'హరిజనోళ్లం' అని చెప్పిన. రెడ్డమ్మ ముఖం మారిపోయింది. అప్పుడే తాగిన చాయకప్పు తీసుకపోనీకి వాళ్ల కోడలొచ్చింది. "ఆగవే నీలిమ, ఆ కప్పు పనిపిల్ల తీసుకపోతది, నువ్ లోపటికి పో'' అన్నది. ఇగ నాకు అర్థమయ్యింది. మనం తక్కువ కులపోళ్లం కదా మనం తాగిన కప్పు వాళ్లు ఎట్లా తీస్తరని? అంతే, నేను పోతా రెడ్డమ్మ అని ఇంటికొచ్చిన. ఇక నాకు అక్కడ ఉండ బుద్ధికాకనే మనూరు కొచ్చిన బిడ్డా. జెర రజితవ్వను పైలంగ ఉండుమని చెప్పు బిడ్డా'' అని ఫోన్ పెట్టేసింది.

    జయంత్‌కు ఇప్పుడు విషయం అర్థమయ్యింది. అందుకే రజితతో వాళ్లెవరు మాట్లాడ్డం లేదని తెలుసుకొని, ఇంటి దగ్గర రజిత ఇంకా ఏడుస్తూనే ఉన్నదేమోనని ఫోన్ చేసిండు. ఎన్నడూ లేంది ఇవాళ రజిత సెల్‌కి నెట్‌వర్క్ అందడం లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా ... ఒకటే సమాధానం "ద మొబైల్ యు ఆర్ ట్రయింగ్ టు రీచ్ ఈజ్ అవుటాఫ్ కవరేజ్ ఏరియా..''

    ఔను, ఈ లోకానికి మా బతుకులు ఎప్పుడూ 'అవుటాఫ్ కవరేజ్ ఏరియా'నే అని మనసులోనే అనుకున్నాడు జయంత్.

    రజిత మాత్రం కులనెట్‌వర్క్‌ల దెబ్బకు 'రెక్కలు తెగిన పక్షి'లా ఇంట్లో ఒంటరిగా విలవిలలాడుతూనే ఉంది. 

(ఆదివారం ఆంధ్రజ్యోతి 29-04-2012 సంచికలో ప్రచురితం) 

Comments