ఆయుధం - లక్ష్మీ మాధవ్

    పనిచేస్తూ మధ్య మధ్య కిటికీలోంచి చూస్తోంది చిత్ర. విదేశాలనుంచి చిన్నబాబు వస్తాడని జానకమ్మగారు వారం నుంచి నానా హడావిడీ పడ్తూ ఇల్లంతా దులిపి సర్దిస్తోంది. నర్సమ్మ పని ఎంత శుభ్రంగా చేసినా కూడా లోపాలు కనపడటంతో, దాని కూతురు చిత్రని పిలిపించి  మరి పనులు చేయిస్తోంది. కాస్తంత చదువు కోవటంవల్ల, చిత్రకి ఏ పని చెప్పినా, బాగా అర్థం చేసుకుని, మంచి అవగాహనతో చేస్తుంది. విసుక్కోకుండా ఓర్పుగా అనుకూలమైన విధంగా వొళ్ళు దాచుకోకుండా పని చయ్యటం చిన్నతనం నుంచీ చిత్రకి అలవాటు. చిన్నప్పటి నుంచీ జానకమ్మగారింట్లో పని చేయ్యటం వల్ల వాళ్ళింట్లో అలవాట్లు, ఆనవాయితులు  అన్నీ తెలుసు చిత్రకి ఇంట్లో మనిషిలాగ.
 
    ఎప్పుడో  నాల్గు సంవత్సరాల క్రితం చూసింది చిన్నబాబుని.  పై చదువులకి ఫారిన్ వెళ్ళాడని తెలుసు, మధ్య మధ్య అమ్మగారు చిన్న బాబు ఈమైల్ లో పంపిన ఫోటోలని  చూపించినప్పుడు చాలా మారినట్లు అనిపించింది తనకి. చిన్నప్పుడు ఇద్దరూ కలిసి ఆడుకున్న జ్ఞాపకం వచ్చింది చిత్రకి. జానకమ్మగారి లాగానే అతనికి కూడా కలిమి లేమి తేడాలు తక్కువ. తనతో ఇష్టపడి ఆడేవాడు. క్రమేపి తను చదువు మానేసి ఇళ్ళ పాచి పన్లలో తల్లికి సాయం చెయ్యటం మొదలుపెట్టింది. చిన్నబాబు పెద్ద క్లాసులకి రావటంతో ట్యూషునులతోనూ చదువులతోనూ బిజీగా ఉండేవాడు. పలకరింపుగా నవ్వటం తప్ప పెద్దగా మాట్లాడటం మానేసాడు. ఇప్పుడు సరేసరి ఫారిన్లో ఉన్నాడాయె! అసలు తనని మరచిపోయి ఉంటాడు అనుకుంటూ ఇల్లు తుడుస్తోంది చిత్ర. ఇల్లంతా శుభ్రం చేసి తోటలో పూలు తెచ్చి ఫ్లవర్‌వేజులో పెడ్తూండగా కారు ఆగిన చప్పుడయింది. తను గబగబా పక్కకు తప్పుకుంది. చిన్నబాబు, బాబుగారు లోపలికి వచ్చినట్లున్నారు. అందరూ కుశల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చిన్నబాబు జవాబులు చెప్తున్నాడు.
    
    చిత్ర కార్లోంచి సామాన్లు తెచ్చి లోపల పేడ్తుంటే అన్నారు జానకమ్మగారు కొడుకుతో" ఏరా జ్ఞాపకం ఉందిట్రా? మన నర్సమ్మ కూతురు చిత్ర?" చిన్న బాబు నవ్వుతూ "హలొ" అన్నాడు.
   
    " ఏం విచిత్రా బాగున్నావా?"అంటూ చమత్కరించి లోపల సోఫాలో కూర్చుని షూస్ విప్పుకుంటున్నాడు. చిన్నబాబు బాగా మారాడు. అక్కడ వాతావరణం చల్లగా ఉండడంతో బాగా రంగు తేలాడు. సాక్సు విప్పుతున్నప్పుడు అతని పాదాల మీద పడ్డాయి ఆమె కళ్ళు. గులాబీరేకుల్లా ఉన్నాయి సున్నితంగా. అప్రయత్నంగా తన పాదాల వంక చూసుకుంది. పగిలిన అద్దం పెంకుల్లా, బీటలు తీసి వెక్కిరిస్తున్నాయి ఆమె పాదాలు.   

    అవును మరి... వారంనుంచి  సాయంకాలాలు వచ్చి జానకమ్మగారికి ఇల్లు సర్దటంలో సాయం చేస్తున్నా, పగలంతా గార పనికి వెళ్తోందాయె!
      
    నర్సమ్మ జీతంతో వాళ్ళకి వారం రోజులు కూడా గడవవు. అలాంటప్పుడు కట్టడ్డాలు కట్టే  చోట రోజుకూలి చేస్తుంటుంది చిత్ర. ఆ కూలి డబ్బులే వాళ్ళింటిల్లపాదికి మిగతా మూడు వారాలు గంజైనా తాగటానికి వేన్నీళ్ళకి చన్నీళ్ళుగా తోడు అవుతాయి. ఇలా ఇంటిపన్లు గార పన్లూ చెయ్యటం ఆమెకి అలవాటే, కాని చిత్రమెమిటంటే  ఆమె పాదాలు తమకి ఆ పనంటే ఇష్టం లేదని తమ వ్యతిరేకతని నెరడులు విచ్చుకుని, పళ్ళెత్తున్న విషయం మరచి చిగుళ్ళు కనిపిస్తూ తనివి తీరా నవ్వే మనిషిలా భీకరంగా నవ్వుతూ ప్రకటిస్తున్నాయి. బట్టలుతుకుతూ తన పాదాలని చూసి తనే అసహ్యపడింది చిత్ర. అయినా రాకుమారిడిలా పెరిగిన చినబాబు పాదాలతో తన పాదాలని పొల్చుకోవటం సబబేనా అనుకుంటూ ఉలిక్కిపడింది. ఇంటిలో ఎక్కడా సందడి లేదు. సరే బట్టలారేసి అమ్మగారికి చెప్పి ఇంటికెళ్దామనుకుంటూ బట్టల క్లిప్పులకోసమని వసారాలోకి వెళ్ళింది.
    
    గోడ పక్కగా సెల్ హెడ్సెట్లో పాటలు వింటూ ఊగుతూనే తనను చూస్తున్న చిన్నబాబుని చూసి ఉలిక్కి పడింది చిత్ర. తమాయించుకుంటూ పని ముగించి వంటింట్లోకి తొంగి చూస్తూ అంది,

    " అమ్మగారు బట్టలు ఉతకటం అయిందండి."

    "ఇంట్లో అందరూ గుడికెళ్ళారు, నేను క్షేమంగా వెనక్కి వచ్చాక గుళ్ళో పూజ చేయిస్తానని మొక్కుకుందిట అమ్మ" చెప్పాడు చినబాబు.

    "మనవాళ్ళేమి మారలేదు...పాత కాలం నమ్మకాలు వీళ్ళూను..." అంటూచిత్రనే చూస్తూ అమెకు బాగా దగ్గరగా వచ్చి నిలబడిన చిన్నబాబు తీరును చూసిన చిత్రకు  అతను తననుంచి ఏదో అశిస్తున్నట్లనిపించింది. 'సాద్యం అయినంత త్వరలో ఇక్కడనుంచి జారుకుంటే మంచిది.అసలే అమ్మగారు కూడా లేరు' అనుకుంటూ బక్కెట్లు బట్టల సబ్బు మిగతా సరంజామాని లొపలికి త్వరగా జారవేస్తూనే ఆమె ఆలోచిస్తొంది.

    మార్పంటే...? శీలానికి ఇచ్చే విలువల్ని పల్చబర్చటమా?లేక  మానవతా విలువల్ని కరిగిస్తూ అవకాశం దొరకగానే అత్యాచారాలు చెయ్యటమే అతని దృష్టిలో మార్పా?

    పాశ్చాత్య జీవన శైలిని మన సంస్కృతికి పోల్చుకుని వాటిని అనుకరించాలని అర్రులుచాస్తున్న మన యువత ఏ విధమైన మార్పుల్నిమనవారు స్వీకరించాలని ఆశిస్తోంది?దేశ విదేశేయులంతా భారతీయులు సౌశీల్యానికి ఇచ్చే విలువల్ని నైతికంగాను వైజ్ఞానికంగానూ మన్నిస్తున్న ఈ తరుణంలో మన యువత ఆశిస్తున్న మార్పేమిటి?

    ఆమె పని ముగించి దొడ్లోంచి ఇంట్లోకొచ్చి బయట పడేలోపే చినబాబు వడివడిగా వచ్చి చిత్ర భుజాల చుట్టూ చేతులు వేస్తూ ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. ఎదురుచూడని అతని  ఈ చర్యకు అవాక్కైన చిత్ర అతని చేతులను బలంగా విడిపించుకంటూనే తలుపు వైపుకు పరుగు తీసింది. 

    అతను ఆమెను మరల చుట్టేస్తూ, "తలుపులు వేశానులే ..., అమ్మకి కూడా చెప్పను" అంటూ ఆమెను తన గదిలో మంచం వైపుకు నడిపించాడు బలవంతంగా తోస్తూ.

    ఆమె అతనినుంచి విడిపించుకోవటానికి పెనుగులాడుతోంది. పురుషశక్తితో ఆమెను అధిగమిస్తున్నాడు చినబాబు. ఆమె ఎంత వారిస్తున్నా విడవక బిగుసుకుంటున్నాయి అతని బాహువులు. ఇంతలో "హా షిట్" అంటూ మూలిగినట్టైంది. అతని పట్టు కాస్త సడిలింది.

    ఒక్క ఉదుట్లో ఆమె అతని పట్టు సడలడానికిగల కారణాన్ని పసిగట్టింది. తను పొద్దుట్నించి చినబాబు పాదాలని చూసి చిన్నచూపు చూసుకుని,తన దౌర్భాగ్యంగా  భావించి సిగ్గు పడిన తన పగిలిన పాదాలే క్షణంలో ఆమెకు ఆయుధాలుగా  తోడ్పడ్డాయి. పదునుగా ఉన్న భాగాన్ని శూలంలా గాయ పరచటానికి వాడుతూ సున్నితంగా ఉన్న అతని కాలిచర్మం అంతా గాయ పడేలా పైకి కిందకి వడివడిగా గీరింది,  అతన్ని దూరంగా తోస్తూనే. 

    అతను "హా...యూ బిచ్" అంటూ ఆమెనువదిలి రక్తం చమరుస్తున్న కాళ్ళని బాధగా  పాముకుంటున్నాడు.

    ఆమె అదే సందుగా హడావిడిగా తలుపులు తీసుకుని రొప్పుతూ ఇంటి బయట పడింది. 

    "ఎంతటి గండం గడిచింది...? ఈ కాలం నాగరిక యువతుల్లా కరాటే, కుంగ్ఫూలు నేర్చుకోలేక పోయినా, సందర్భోచితంగా బుధికుశలతతో తన శీలాన్ని తను రక్షించుకోగల్గింది." 

    తను రోజూ అసహ్యించుకునే తన పగిలిన పాదాలే ఈనాడు తన  శీలాన్ని కాపాడుకోవటానికి చేయూతగా  నిలిచిన ఆయుధాలు, అని వాటి వంక అప్యాయతగా చూసుకుంటూ ఇంటివైపుకు దారితీసిందామె.  
 
(గృహశోభ మాసపత్రికలో ప్రచురితం)
Comments