బహుమానం - స్వరలాసిక(కోడీహళ్లి మురళీమోహన్),


      
    తలపైనున్న కేప్ తీసి రుమాలుతో నుదుటికి, మెడకు పట్టిన చెమటను తుడుచుకున్నాడు రహమతుల్లా. రోహిణి కార్తె మొదలైంది కాబోలు నిన్నటి కన్న ఈ రోజు ఎండ బాగా ఎక్కువగా ఉంది అని అనుకుంటూ రైల్ థర్మామీటర్‌ను పరిశీలనగా చూశాడు. 'బాప్‌రే 60డిగ్రీలు'అనుకుంటు గ్యాంగ్ వైపు చుశాడు. అప్పుడే భోజనాలు ముగించుకుని చెట్టు కింద సేద తీర్చుకుంటున్నారు గ్యాంగ్‌మెన్‌లు. ఎండ ఎక్కువగా ఉండటంతో రహమతుల్లా పదకొండు గంటలకే పనిని నిలిపివేసి గ్యాంగ్‌తో కంకరను స్లీపర్ల చుట్టూ కప్పించాడు. మరో అరగంట అలా పనిచేయించిన తరువాత గ్యాంగ్‌కు విశ్రాంతినిచ్చాడు కానీ తను మాత్రం ట్రాక్‌ని వదలలేదు. గ్యాంగ్ చేసిన ప్యాకింగ్‌ను చెక్ చేశాక సంతృప్తి చెందిన రహమతుల్లాకు రైల్ టెంపరేచరు గాభరా పుట్టించింది.

       తన యూనిట్‌లో రైల్వే ట్రాక్ సగం సిమెంటు స్లీపర్లు, సగం స్తీలు స్లీపర్లు కావటంతో ఇబ్బంది కలుగుతోంది. స్టీలు స్లీపర్ల క్రింద ఎంత ప్యాక్ చేసినా అట్టే నిలపడటం లేదు. మరీ ముఖ్యంగా రెండు రకాల స్లీపర్లు కలిసే చోట. ఆ కాంట్రాక్టర్ ఎవడో స్టీలు స్లీపర్లు తొలగించి సిమెంటు స్లీపర్లు మార్చే పనిని సగంలోనే వదిలేయటం తనకు తలనొప్పిగా మారింది. పైగా బాలాస్ట్(కంకర) కూడా చాలా తక్కువగా ఉంది. ఉన్నదంతా బళ్ళ రాకపోకల వత్తిడితో మట్టిగా మారిపోయింది. బాలాస్ట్ కొరత గురించి తను సెక్షన్ ఇంజినీర్‌కు ఎన్నో సార్లు చెప్పినా ఆ మహానుభావుడి చెవికి సోకటం లేదు. పైగా ట్రాలీపై ఇన్స్‌పెక్షనుకు వచ్చిన ప్రతి సారీ పని గురించి ఏవో వంకలు పెడుతున్నాడు. తన యూనిట్‌లో పేరుకు ముప్పైమూడు మంది గ్యాంగ్‌మెన్లు ఉన్నా ఎప్పుడు సగానికి పైగా ఇతర పనులకు పురమాయిస్తాడు తన జూనియర్ ఇంజినీర్ (జే.ఇ) లింగారెడ్డి. మిగతా వాళ్లలో లీవు పెట్టిన వాళ్లు, పనికి ఎగనామం పెట్టిన వాళ్లు పోనూ గ్యాంగ్ బలం ఏడెనిమిది మంది కంటే మించదు. ఇంత తక్కువ మందితో పని నెట్టుకు వస్తున్నా పై అధికారులనుండి మాటలు పడటం తప్పలేదు. ఆలోచనల నుండి తేరుకుని రహమతుల్లా రైలు కమ్మీల వంక చూశాడు.

       'మొఖద్దం' రహమతుల్లా పెట్టిన గావుకేకకు వెంకటయ్య 'ఏమయింది దొరా!' అంటూ రైలు కట్ట ఎక్కాడు. 'బావుటాకు మనిషిని పంపు' తన సూపర్‌వైజర్ ముఖంలో ఆందోళనను పసిగట్టి రైల్వేలైన్ వంక చూశాడు. లైను పాములా మెలికలు తిరిగి ఉంది. వెంకటయ్యకు పరిస్థితి అర్థమయ్యింది. వెంటనే రామయ్యను కేకేసి తన సంచిలోనుండి ఎర్ర చేతి బావుటా, డిటొనేటర్లు తీసి ఇచ్చి 'ఏ.పీ. ఎక్స్ ప్రెస్ బెల్లంపల్లి వదిలి ఉంటుంది. పరిగెత్తు' అన్నాడు. రామయ్య చేతిలో రెడ్‌ఫ్లాగును పట్టుకుని దౌడు తీశాడు. వెంకటయ్య మిగతా గ్యాంగును లేపి పనులు పురమాయించ సాగాడు. బ్యానర్ ఫ్లాగును సిమెంట్ కర్రల వద్ద లైన్‌కు అడ్డంగా పాతాడు. బక్లింగ్ గురించి రహమతుల్లా ట్రైనింగ్‌లో చదవటమేగాని ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటి సారి. సుమారు అరకిలోమీటరు ట్రాక్ వంకలు తిరిగి పైకి లేచి ఉంది. చూస్తూ ఉంటే కాళ్ళూచేతులూ వణక సాగాయి. వెంటనే తేరుకుని రాబోతున్న ఎక్స్ ప్రెస్‌ను ఆక్సిడెంట్ కాకుండా కాపాడాలి తరువాతే మరేదైనా అనే స్థిర నిశ్చయానికి వచ్చాడు. ఏ.పీ.ఎక్స్ ప్రెస్ ఇప్పటికే దాటిపోవలసింది. ఎక్కడకు వచ్చిందో? రేచినీ రోడ్ స్టేషన్ మాష్టారికి సమాచారం అందివ్వాలి. జే.ఈ.లింగారెడ్డికి కూడా తెలపాలి. సిగ్నల్స్ లేక సెల్‌ఫోన్ పనిచెయ్యటం లేదు. గేట్‌కు ఎవరినైనా పంపి స్టేషన్‌కు ఫోన్ ద్వారా సంగతి తెలపాలనుకున్న రహమతుల్లా మనసు మార్చుకుని తానే గేట్‌కు వెళ్ళాలని నిర్ణయించుకుని గ్యాంగ్‌మ్యాన్ జంగయ్యను వెంట బెట్టుకుని గేట్ వైపు పరుగు తీశాడు. ఇంతలో దూరంగా ఎక్స్ ప్రెస్ ట్రైన్ రావటం కనిపించింది.

        చేతిలో ఎర్రబావుటా పట్టుకుని పరిగెత్తుతున్న రామయ్య సుమారు ఆరువందల మీటర్ల దూరంలో ఒక డిటొనేటర్‌ను రైల్ పై బిగించి ముందుకు పరిగెత్త నారంభించాడు. మరో ఆరువందల మీటర్ల దూరంలో మూడు డిటొనేటర్లు పెట్టాల్సి ఉంది. అయితే ఎదురుగా బండి వస్తూండటం గమనించి అక్కడే ఆ డిటొనేటర్లను పాతి బండికెదురుగా ఎర్ర జెండా పైకి ఎత్తుకుని పరిగెత్త సాగాడు.

        'బ్యానర్ ఫ్లాగ్ అహెడ్' అసిస్టెంట్ డ్రైవర్ శ్రీధర్ అరుపుతో అప్రమత్తమైన డ్రైవర్ జాన్ 'రైట్' అంటూ వాక్యూం రిలీజ్ చేశాడు. ఎదురుగా రెడ్ హేండ్ సిగ్నల్ ఫ్లాగుతో పరిగెత్తుకొస్తున్న వ్యక్తిని చూసి హారన్ కొట్టాడు. బండి దగ్గరకు రాగానే రామయ్య పక్కకు తప్పుకున్నాడు. జాన్‌కు ముందు కనిపిస్తున్న దృశ్యం దడ పుట్టించింది. 'ముందు ట్రాక్ బాగా డామేజ్ అయ్యింది. బ్యానర్ ఫ్లాగ్ పెట్టారు' గార్డుకు వాకీటాకీలో చెబుతున్నాడు శ్రీధర్. ఠాప్...ఠాప్... అంటూ డిటొనేటర్లు పేలి బ్యానర్ ఫ్లాగ్‌ను తొక్కి రెండు మీటర్ల దూరంలో ఇంజన్ ఆగింది. మరో రెండు మూడడుగులు ట్రైన్ పాసయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.

        రహమతుల్లా ఇంజన్ దగ్గరికి పరిగెత్తి డ్రైవర్‌కు పరిస్థితిని వివరించాడు. తన పై అధికారులకు విషయం తెలపటానికి గేట్ దగ్గరకు వెళ్తున్నానని, ట్రాక్ సరిచేయటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని, ఇంతలో డౌన్ లైన్లో ఏదైనా ట్రైన్ వస్తే వాకీటాకీతో ఆ ట్రైన్ డ్రైవర్‌ద్వారా స్టేషన్‌కు కబురు పెట్టమని చెప్పి గేట్ వైపుకు పరిగెత్త సాగాడు. ఈ ప్యానెల్‌ని డీ-స్ట్రెస్సింగ్ చేయాలని గతంలో తాను రెండు మూడు సార్లు లింగారెడ్డికి చెప్పటం, అతను తాత్సారం చేయటం రహమతుల్లాకు గుర్తుకు వచ్చింది. అదే జరిగి ఉంటే ఈరోజు ఈ బక్లింగ్ అయ్యేదేకాదు. గేట్ సమీపించటంతో రహమతుల్లా ఆలోచనలకు బ్రేక్ పడింది. సూపర్‌వైజర్‌ను చూడగానే గేట్‌మ్యాన్ కొమరయ్య 'నమస్తే సార్' అన్నాడు. రహమతుల్లా బదులుగా తల ఊపుతూ గదిలో ఉన్న ఫోన్ తీసుకుని రేచిని స్టేషన్ మాష్టారితో మాట్లాడసాగాడు. 'సార్ నేను పి.వే.సూపర్‌వైజర్ రహమతుల్లా. టూట్వంటీసిక్స్ కిలోమీటర్ అప్‌లైన్లో ట్రాక్ బక్లింగ్ అయ్యింది. ఏ.ఫి. బ్యానర్ ఫ్లాగ్‌పై ఆగింది. జే.ఇ.గారిని వెంటనే నాతో మాట్లాడమనండి. నేను గేట్ వద్దే ఉంటాను. అలాగే బెల్లంపల్లిలో సెక్షన్ ఇంజనీర్‌కు ఇన్ఫార్మ్ చేయండి. ట్రాక్ ఈజ్ సస్పెండెడ్ అంటిల్ ఫర్దర్ అడ్వైజ్' అంటూ గబగబా చెప్పి ఫోన్ పెట్టేసాడు.  

        ప్రస్తుతం బ్లాక్‌స్మిత్ వచ్చి రైలు కట్ చేసే వరకు ఏమీ చేయలేము. హాక్‌సా బ్లేడ్లతో రైల్ తెగేటట్లు లేదు. గ్యాస్ కటింగ్ చెయ్యాలి. గ్యాస్ కటింగ్ సామాగ్రి బెల్లంపల్లి నుండి రావాలి. చాలా సమయం పడుతుంది. ఈలోగా ప్రత్యామ్నాయం ఆలోచించాలి.

        'జంగయ్యా! ఇక్కడ దగ్గరలో గ్యాస్ వెల్డింగ్ చేసే షాపుందా?'
        'రేపల్లెవాడలో వుండొచ్చు సార్. చూసివస్తాను'
        'ఉంటే ఆ వెల్డర్‌ను వెంటనే పిలుచుకురా! కట్టర్‌ను తీసుకు రమ్మని చెప్పు. ఎంత ఖర్చైనా ఫరవాలేదు. ఇదిగో ఈ వంద రూపాయలు అడ్వాన్సుగా ఇవ్వు. మిగతా సొమ్ము సార్లతో ఇప్పిద్దాం.'

        జంగయ్య గేట్‌మ్యాన్ కొమరయ్య సైకిల్ వేసుకుని వూరిలోకి వెళ్లాడు. ఈ లోగా ఫోన్ మోగింది. లింగారెడ్డి లైన్‌లోకి వచ్చాడు. రహమతుల్లా పరిస్థితిని వివరించాడు. వెంటనే కనీసం రెండు గ్యాంగ్‌లను, కమ్మరి మేస్త్రీని పంపాలని చెప్పాడు. బెల్లంపల్లి నుండి గ్యాస్ కటింగ్ పరికరాలను తెప్పించమని అడిగాడు.

        'నేను వెంటనే బ్లాక్‌స్మిత్ స్టాఫ్‌ను తీసుకుని ట్రాలీలో వస్తున్నాను. మూడో యూనిట్‌కు కబురు పెట్టాను. మరో పది నిమిషాల్లో అక్కడ ఉంటారు. బెల్లంపల్లి నుండి ఎస్.ఇ.,ఏ.డి.ఇ. మోపెడ్ ట్రాలీలో వస్తున్నారు. గ్యాస్‌కటింగ్ ఎక్విప్‌మెంట్ తెస్తున్నారు. రాజధాని ఎక్స్ ప్రెస్ ఇక్కడ రేచినిలో ఆగిపోయింది. బెల్లంపల్లిలో గోరఖ్‌పూర్ ఎక్స్ ప్రెస్ ఉంది. మనం వెంటనే ట్రాక్ క్లియర్ చెయ్యాలి. లేకపోతే మనకు తిట్లు తప్పవు.' రహమతుల్లాకు అంత టెన్షన్లోను లింగారెడ్డి మాటలు నవ్వు తెప్పించాయి. అక్కడికి ఏదో తనే కావాలని ఆలశ్యం చేస్తున్నట్లు. 

        స్పాట్‌కు చేరిన రహమతుల్లాకు బీటర్లతోనూ, గునపాలతోనూ రైలుకున్న క్లిప్పులను ఊడబెరకడానికి తంటాలు పడుతున్న గ్యాంగ్‌మెన్లు కనిపించారు. మరో నలుగురు గ్యాంగ్‌మెన్లు బకెట్లతో నీరు తీసుకువచ్చి రైలు కమ్మీలపై వరుసగా పోసుకుంటూ వాటిని చల్లబరచటానికి ప్రయత్నిస్తున్నారు. వెంకటయ్య ముఖద్దం గతంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవంతో నిశ్చల చిత్తుడై గ్యాంగ్‌తో పని చేయిస్తున్నాడు. 

        ఈలోగా గ్యాస్‌కట్టర్ కోసం వెళ్ళిన జంగయ్య సైకిల్‌పై వేగంగా వచ్చాడు. వెల్డర్ దొరికాడు కానీ అతని దగ్గర గ్యాస్ అయిపోయిందని చెప్పాడు. 'జంగయ్యా! వెంటనే ఆ వెల్డర్‌ను సామాన్లతో ఇక్కడకు పంపు. నీవు మాయింటికి వెళ్లి అమ్మనడిగి గ్యాస్‌బండ పట్టుకుని వచ్చేయి. నిన్ననే కొత్తది వచ్చింది. తొందరగా వెళ్లు'తరిమాడు రహమతుల్లా. తన రైల్వే క్వార్టర్స్ సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జంగయ్య రావటానికి మరో పావుగంట పట్టవచ్చు. ఈలోగా చేయవలసిన పనులగురించి ఆలోచించ సాగాడు.

        ఏ.పి.ఎక్స్ ప్రెస్ ఆగి అప్పటికే చాలా సేపు అయ్యింది. ఎందుకు ఆగిందో తెలుసుకోవటానికి ప్రయాణీకులు ఒక్కొక్కరే ట్రైన్ దిగి ఇంజన్ దగ్గరకు రావటం ప్రారంభించారు. పెద్ద ప్రమాదం తప్పిపోయిందని తెలియటంతో వారిలో కలకలం రేగింది. గ్యాంగ్ పనులకు ఇబ్బంది కలుగకుండా వారిని అదుపు చేయటానికి అవస్థలు పడుతున్నారు అసిస్టెంట్ డ్రైవర్ శ్రీధర్, గ్యాంగ్‌మాన్ రామయ్యలు. డౌన్ లైన్లో బండి రావచ్చని అటు వైపు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. వద్దని వారిస్తున్నా శ్రీధర్, రామయ్యల చేతుల్లో కొందరు ప్రయాణీకులు తమ ప్రాణాలను కాపాడారని కొంత పైకం బలవంతంగా కుక్కారు.

        దూరంగా ట్రాలీ కనబడటంతో రహమతుల్లా ఊపిరి పీల్చుకున్నాడు. జే.ఇ. లింగారెడ్డి వచ్చేసరికి జంగయ్య గ్యాస్ సిలిండర్‌తో వెల్డర్‌ను వెంటబెట్టుకుని వచ్చాడు. ఇంతలో మరో గ్యాంగు కూడా అక్కడకు చేరుకుంది. లింగారెడ్డి ఆ గ్యాంగును రైలుక్లిప్పులు ఊడబెరకమని పని పురమాయించాడు. కమ్మరి మేస్త్రీ యాదగిరికి వెల్డర్‌ను అప్పజెప్పి రైల్‌ను రెండు వైపుల అర మీటరు కట్ చేయటానికి రైల్‌పై గుర్తులు పెట్టాడు లింగారెడ్డి. ఒక వైపు గ్యాస్ కట్టర్‌తో రెండు కోతలు పెట్టి విరిగిన రైలు ముక్కను బయటకు తీయటానికి యాదగిరి తన కళాశిలతో పెద్ద సుత్తితో కొట్టించాడు. అంత బరువున్న రైలు ముక్క దూరంగా ఎగిరి పడింది. రైలు క్లిప్పులు ఊడబెరికి ఉన్నందువల్ల రైలు బుస్ మంటూ పొంగి కొంచం కూడా సందులేకుండా మళ్ళీ అతుక్కు పోయింది. రెండో వైపు కూడా అలాగే రైలును కత్తిరించాడు యాదగిరి వెల్డర్ సాయంతో. ట్రాక్‌లో ఇంకా పూర్తిగా స్ట్రెసస్ విడుదల కాలేదని నిర్ధారించుకున్న లింగారెడ్డి మరో అరమీటరు రైలును కత్తిరించమని యాదగిరిని ఆదేశించాడు.

        డౌన్‌లైన్‌లో రాంగ్‌రూట్లో రాజధాని ఎక్స్ ప్రెస్ హారన్ కొట్టుకుంటూ రావటం చూసి అందరూ పక్కకు జరిగారు. మెల్లగా వచ్చి స్పాట్‌లో ఆగింది. ఇంజన్‌లో నుండి సెక్షన్ ఇంజనీరు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు దిగారు. వెనక బోగీనుండి ట్రాలీమెన్‌లు మోపెడ్ ట్రాలీని, ఇతర సామాన్లను దింపాక రాజధాని మెల్లగా కదిలింది. రహమతుల్లా, లింగారెడ్డి తమ అధికార్లను విష్ చేశారు. అప్పటికే గ్యాస్‌తో రైల్‌ను కట్ చేయటం గమనించిన సెక్షన్ ఇంజనీర్ వర్మ ముఖం వెలిగి పోయింది. బయటి నుండి గ్యాస్ కట్టర్‌ను సమకూర్చింది తమ సూపెర్‌వైజర్ రహమతుల్లా అని తెలుసుకుని అతని వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు.  త్వరగా పని పూర్తి అయ్యేటట్టు చూడమని తన జూనియర్ లింగారెడ్డిని ఆదేశించాడు. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఏ.డి.ఇ. మెహతా హడావుడి చేయటం మొదలు పెట్టాడు.

        తాను చెప్పినట్లు యాదగిరి మరో అరమీటరు మేరకు రైలును రెండు వైపులా కత్తిరించాడని తెలుసుకున్న లింగారెడ్డి వెంటనే రహమతుల్లాకు చేయవలసిన పనుల గూర్చి వివరించి త్వరగా పూర్తి చేయాలని కోరాడు. రహమతుల్లా ఆదేశం మేరకు నలుగురు గ్యాంగ్‌మెన్లు ఆ చివరి నుండి ప్రతి మూడో స్లీపరుకు క్లిప్పులను బిగించుకుంటూ వచ్చారు. వారి వెనుకనే మిగతా గ్యాంగుతో రహమతుల్లా కచ్చాపక్కాగా ప్యాకింగ్ చేయించ సాగాడు. రైలు కత్తిరించిన చోట సుమారు ఎనిమిది అంగుళాల గ్యాప్ ఉండటంతో ఆరు అంగుళాల ముక్కలు రెండు వైపులా ఉంచి ఫిష్ ప్లేట్లకు క్లాంపులను గట్టిగా బిగించాడు యాదగిరి. బండిని సురక్షితంగా పంపవచ్చన్న నిర్ణయానికి వచ్చిన ఎస్.ఇ.వర్మ ట్రాక్‌ఫిట్ సర్టిఫికెట్‌ను వ్రాసి డ్రైవర్ జాన్‌కు ఇచ్చాడు. రైలు బండిని స్టార్ట్ చేయబోతూ సూచనగా హారన్ మోగించాడు డ్రైవర్. కిందకు దిగిన ప్రయాణీకులందరూ గబగబ ట్రయిన్‌లోకి ఎక్కసాగారు. మెల్లగా కదిలిన ఏ.పీ.ఎక్స్ ప్రెస్‌ను చూసి చాలా తక్కువ సమయంలో ట్రాక్ సరిచేయ గలిగినదుకు సంతోషించారు రహమతుల్లా, లింగారెడ్డి. 

        ముప్పై కె.ఎం.పి.హెచ్ కాషన్ఆర్డర్ ఇంపోజ్ చేస్తున్నానని, పూర్తిగా క్లిప్పులను బిగించి, అలైన్‌మెంట్ వగైరా సరిచూసుకుని గట్టిగా ప్యాకింగ్ చేయించమని, గ్యాస్ కటింగ్ చేసిన భాగాన్ని హాక్‌సా బ్లేడ్లతో కత్తిరించి ఆరు మీటర్ల పొడవు గల రైలుతో మార్చమని, రేపు డీ స్ట్రెస్సింగ్‌కు ప్లాన్ చేసి కట్ రైలును వెల్డింగ్ చేయించమని, ఆ తర్వాత కాషన్ఆర్డర్‌ను ఎత్తి వేయమని లింగారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు ఎస్.ఇ.వర్మ, ఏ.డి.ఇ.మెహతా. తక్కువ సమయంలో చురుకుగా వ్యవహరించి ప్రమాదాన్ని నివారించినందుకు, వెంటనే ట్రాక్‌ను పూర్వపు స్థ్తికి తీసుకు రాగలిగినందుకు మెహతా గ్యాంగును, సూపర్‌వైజర్‌ను, జే.ఇ.ని అభినందించాడు. సూపర్‌వైజర్ రహమతుల్లా పేరును రైల్వే బోర్డు అవార్డు లేదా జనరల్ మేనేజర్ అవార్డుకు సిఫారసు చేస్తానని హామీ ఇచ్చి ఎస్.ఇ.తో కలిసి మోపెడ్ ట్రాలీలో వెనుదిరిగాడు.

        తన సహచరుల ప్రసంశలతో కించిత్ గర్వపడిన రహమతుల్లా మరుసటి రోజు డివిజినల్ హెడ్‌క్వార్టర్స్ నుండి వచ్చిన లెటర్ చదివి అవాక్కయ్యాడు. పనిలో నిర్లక్ష్యం చూపి అనేక ఎక్స్ ప్రెస్ రైళ్లు పలు స్టేషన్లలో నిలిచిపోయి ప్రయాణీకుల అసౌకర్యానికి కారణమైన తనపై ఎందుకు చర్య తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వవలసినదిగా పై అధికారులు పంపిన శ్రీముఖం అది. పెద్ద ఆక్సిడెంటు కాకుండా తాను పడిన శ్రమకు తగిన ప్రతిఫలం లభించిందని చిన్నగా నిట్టూర్చాడు రహమతుల్లా.

Comments