బహుమతి - వల్లభాపురం జనార్దన

    
పొద్దుగూట్లకు వొయింది. మెల్లమెల్లగా సీకటి తీగెలు పాకడం షురువయింది. కాటికె పూసుకున్న గాంధీళిగాళ్ళ మొగాల్లా దిక్కులు నల్లవడ్డై. నల్లని మొగులుపాకిన ఆకాశం బొగ్గు మసి  పులుముకున్న పిల్లోని మొగంలా ఉంది. ఇప్పుడు ఆకాశం గ్రహణం మింగిన సందమామ. పేసలు రాలుతున్నట్లు సినుకులు మొదలై ధారలు గట్టినయి. ఉయ్యాల తాళ్ళలా సినుకులు నేలకు జారుతున్నై. సానిపిలాగా పరుసుకుంటున్న సినుకులు సిల్లుల కుండల్లోంచి కారుతున్న నీళ్ళధారల్లా దుంకుతున్నై. చెెర్నాకోలంవార్ల ఝళిపింపుల్లా తాకి నేలకు సురుకు పుట్టిస్తున్నాయి. 

    గుడిసెల్లో దూరిన కోళ్ళు మూలల్లో సర్దుకొని కొక్కొక్కొ అంటూ రెక్కలు కిందికి పిలుసుకొని  వెచ్చదనం అందిస్తూ ముడుసుకొని కూస్తున్నాయి. గుడిసెల ముందున్న దొడ్లలోకి  జొరవడ్డ మేకలు వోనజల్లు కొడుతున్నట్లల్లా లోపలికి లోపలికి జరుగుతూ గుంపుకూడుతున్నయి.

    మొగులు రంగు కలుపుకున్న సీకటి అంతకంతకు ముదురుతుండడం సూసిన మొగోళ్ళు పొంకాలు కొట్టడం మాని గుడిసెల్లోకి సేరి మునగదీసుకొని కూసుంటున్నరు. గుడిసెల నడుమ  సందులు వాకిండ్లు మునిగేలా పరుసుకపారుతున్న వోననీళ్ళు నడుచుగూడెంలోని గుడిసెలు నదుల పాయలనడుమ లంకల్లా గున్నై. సీకటి రాత్రి ముదురుతున్న కొద్దీ విడువకుండా కుండపోతగా కురుస్తున్నవోన నుండి కాపాడుకొని ఎచ్చదనం కోసం వెన్నెలజైలు గూడెం గుడిసెలు ఒక్కొక్కటీ నిశ్శబ్దాన్ని మోస్తూ మూసుకున్నై. కీసురాళ్ల రొదలను మోస్తున్న గాలి రప్పున శరీరాలను తాకుతూ వణికిస్తోంది. మెల్లెమెల్లెగా గూడెం నిద్రలోకి జారుకుంది. వోన లాఠీలతో  సీకటి కర్ఫ్యూతో గూడెం సందడి మానేసి మూగదయింది.  

    ఒక్క కిన్నెర నర్సయ్య గుడిసె మాత్రం కర్ఫ్యూగస్తీ కోసం తెరిసిపెట్టిన పోలీసు స్టేషన్‌లా మేలుకొని ఉంది.  గుడిసెలో నర్సయ్య పెళ్ళాం లచ్మి నులకమంచం మీద పండుకొని కాన్పునొప్పులతో మూలుగుతోంది. నర్సయ్య పక్క గుడిసెల ఆడోళ్లను కానుపు సేయించనీకె పిలిసిండు. వాళ్ళొచ్చి తమకు తెలిసిన రీతిలో కాన్పుసేయించనీకె తంటాలు వడుతుండ్రు. లచ్మి మూలుగులు రాను రాను అరుపులవుతున్నయి. ఏం సెయ్యటానికి తోసక గుడిసె లోపల ఆడోళ్ళు సేతలు పిసుక్కుంటున్నరు. కాలుగాలిన పిల్లుల్లా సుడిబడి తిరుగున్నరు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని నర్సయ్యను పిలిసిండ్రు. గుడిసె బైట వారపాకు కింద నిలబడి పిల్లో, పిల్లగాడో పుట్టిన తీపి కబురు ఎప్పుడు సెప్తరా అని ఎదురుసూస్తున్న నర్సయ్య వాళ్ళ పిలుపు విని గుడిసెలోనికి వొయ్యిండు. వాళ్ళు నర్సయ్యతో కానుపుసెయ్యడం మానుంచికాదు. మంత్రసానిని పిలుసుకరమ్మని సెప్పిండ్రు. నర్సయ్య ఉరుకులు- పరుగులతో పోయి మంత్రసానిని తోలుకొచ్చిండు.

    మంత్రసాని గుడిసెలో కాలుపెట్టింది. నొప్పులు పడుతున్న లచ్మిని ఎగాదిగా సూసింది. ఇన్నాళ్ళుగా కాన్పులు సేయించిన అనుభవంతో ప్రయత్నం సేసింది. ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. అమ్మో.. అబ్బో. అయ్యో...  పానం బొయ్యేట్లుందిరో - ఏం సేతురోదేవుడా అంటున్న లచ్మి మూలుగులు అరుపులైనై. గుడిసె లోపల నొప్పుల బాధ తట్టుకోలేక లచ్మి అరుస్తున్న అరుపులు కటిక నిశ్శబ్దాన్ని పగులగొడుతున్నై. గుడిసెబైట కొండసిల్లివడినట్లు కిందికే మీదికే ఏకధారగా కురుస్తూన్న వోన. మెరిసే మెరుపులు, ఉరుముతున్న ఉరుములు. వారపాకు కింద గుండె అరసేతుల పట్టుకోని దిగులుతో - కంగారుతో గొంతుకూసున్న నర్సయ్య.

    మంత్రసాని కానుపు సేయించనీకె తిప్పలువడుతూనే ఉంది. కాని ఫలితం కనపించటంలేదు. కాన్పుగండం గట్టెక్కుట్లు లేదని తెలుసుకున్న మంత్రసాని నర్సయ్యను పిలిసింది. ''అమ్మా నా లచ్మికెట్లుంది. కానుపెప్పుడైతది?'' అడుగుతూ తడిక తోసుకొని లోనికొచ్చిండు నర్సయ్య. ''ఇప్పుడప్పుడే కాన్పు అయ్యేట్టులేదు. నాకు మించిన పనయింది. ఇప్పుడైతది, ఇంకాసేపటికైతదని సెప్పి కాలం గడిపితే మనున్న పానాన్ని మంట గలిపిన దాన్నవుత. అంత పాపాన్ని మూటకట్టుకోలేను. అలీసం అయ్యేకొద్దీ కడుపుల బిడ్డ అడ్డం తిరుగుతది. అప్పుడు పెద్ద పానానికే మోసమొస్తది. ఇంక ఆసుపత్రి ఒక్కటే దిక్కు. కొండ దేవరమీన భారమేసి ఆసుపత్రికి తీసుకపో. అంతకుమించి దారిలేదని'' సెప్పింది. ఆ మాటలు నర్సయ్య గుండెకు తుపాకీ తూటాల్లా తాకినై. మెదడు మొద్దుబారింది. ఆఁ...అంటూ అట్టనే రాటలాగ నిలబడిపోయిండు. ఇప్పుడేం సెయ్యాలె? ఇల్లెందు ఆసుపత్రికి ఎట్లపోవాలె? అని ఏడుపు ఆపుకుంటూ నెత్తికొట్టుకున్నడు.

* * * 

    కటిక చీకటి కాటుకకొండలా భయపెడుతుంది. మరోపక్క కిందికీ మీదికీ కొండపగిలి నీళ్ళు గుమ్మరించినట్లు ఒకటే వోన... వోన... వోన... వోన.... ఇడువకుండా ఉరిమి బెదిరిస్తున్న ఉరుములు కాన్పుకాక  ఆపసోపాలు పడుతూ నొప్పుల బాధ ఓర్సుకోలేక అరుస్తున్న పెళ్ళాం. సూస్తూ సూస్తూ ఏమీ సెయ్యలేని  ఎంగన్ననైపోవాలా? నాయింటి దీపాన్నీ- దాని కడుపులో ఊపిరి పోసుకొని భూమ్మీదికి రావాలనుకుంటున్న బిడ్డను సంపుకోవాలా? కొంతసేపు ఆలోసెనలో మునిగిండు. తల్లినీ, పిల్లనూ ఎట్టాగైనా బతికించుకోవాలని మనసులో గట్టిగా అనుకున్నడు. గుండె సిక్కవట్టుకున్నడు. తనకు తాను ధైర్యం సెప్పుకున్నడు. కొండదేవర మీద భారమేసి తెగింపుతో అమాంతం రెండు సేతులతో పెళ్ళాన్ని మంచం మీన్నుంచి పైకి లేపిండు. భుజానికెత్తుకున్నడు. తేరు గిర్రను ఆయుధంగా సేసుకొని పగోరి మీదకి దూసుకెళ్ళిన అభిమన్యునోలె గుడిసె నుండి కాలు బైటికి పెట్టిండు. వెన్నెల బైలు నుండి ఇల్లెందు బాట పట్టిండు. అడుగులో అడుగేస్తూ తల్లినీ- బిడ్డనూ బతికించుకొనే పోరులో గెల్పునాదే అనుకుంటూ కదిలిండు. పట్టుదలతో సాగిపోతున్న నర్సయ్యను మంత్రిసానితో సహా ఆడోళ్ళంతా కళ్ళప్పగించి సూస్తూ  నిలబడి కళ్ళు తడుసుకున్నరు. మనం మళ్ళా లచ్మిని సూస్తమ్మో లేదో? మన సేతుల్ల ఏముంది? అంతా కొండ దేవర దయ. అనుకొంటూ ఎవరి దారిన వాళ్ళు పొయిండ్రు.

* * * 

    గులేరు నుండి రివ్వు రివ్వున దూసుకొస్తున్న రాళ్ళలా సినుకులు శరీరాన్ని తప్పులు వెడుతున్నయి. వాటి రాపిడిని లెక్కసెయ్యకుండా ఉండుండి మెరుస్తున్న మెరుపులు బాట సూపుతుంటే అడవిలో ఒంటరిగా నర్సయ్య పెళ్ళాన్ని బుజానమోస్తూ ఇల్లెందు బాట వట్టిండు. తల్లిదండ్రులను తీర్థయాత్రకోసం మోసుకెళ్ళిన శ్రవణ కుమారునిలా తనమేనులో సగమైన తన బతుకుదీపమైన పెళ్ళాన్నీ - బిడ్డనూ బతికించుకోనీకై పట్టుదలతో పంటిబిగువున మోస్తూ ఆసుపత్రికి తీసుకపోతున్నడు నర్సయ్య. కీచురాళ్ళు జోలిసెపుతున్నట్లు రొదసేస్తూ జతగా వస్తుంటే మిణుగురు పురుగులు అంగరక్షకుల్లా నడుస్తుంటే ఉరుముతున్న ఉరుములు గుండె దిటవును దిగజారుస్తున్నా ధైర్యాన్ని జారిపోనీయకుండా నిలబెట్టు కుంటూ చిమ్మ చీకట్లో సెట్టు  గుబురుకొమ్మల నడుమనున్న పిట్ట కుడికంటిలోంచి దూసుకుపోయేలా బాణమేయడానికి పూనుకున్న అర్జునుని ఏకాగ్రతతో పోటీ పడుతూ తను నడవాల్సిన ఇల్లెందు బాట తప్ప మరేదీ సూడకుండా సూటిగా పోతున్నడు. పంటిబిగువున బరువును భరిస్తున్నడు. నడుమ నడుమ నొప్పులకు తట్టుకోలేక మూలుగుతూ ఏడుస్తున్న భార్యను లచ్మీ ఏడువకు. భయపడకు. గుండెవగులకు. నీ పానానికి నా పానం అడ్డమేస్త. నిన్నూ, నీ కడుపులోని నా బిడ్డను బతికించకుంట. ఇల్లెందుకు దగ్గరవుతున్నం. అని ధైర్యం సెప్తూ- ఓదారుస్తూ గస పోస్తూ అడుగులేస్తున్నడు. ఒక్కో కిలోమీటరు రాయిని వెనక్కినెట్టేస్తూ పెళ్ళాన్నీ - ఇంటిదీపంగా పుట్టబోతున్న బిడ్డను బతికించుకొనే అవకాశానికి దగ్గరవుతున్నానన్న భరోసాతో మనసుకు నచ్చసెప్పుకుంటూ భీముడి అంగలు వేస్తున్నడు.

    సుట్టూ సీమ సిటుక్కుమన్నా ఇనిపించేంత నిశ్శబ్దం. అప్పుడప్పుడూ భయంలేదని ఈపు తడుతున్నట్లు మెరుస్తున్న మెరుపులు. గుబులుపెంచుతున్న ఉరుములు. తలస్నానం చేసి తలారబెట్టుకుంటున్న ఆడోళ్ళ తలవెంట్రుకల బారుల్లా వాలిన ఆకులతో నిలబడ్డ సెట్లు. ఓదార్పురాగం పాడుతున్న కీసురాళ్ళు. భయం పెంచుతున్న పరిసరాలను పట్టించుకోకుండా వాటినే ఆత్మవిశ్వాసానికి ఆసరాగా సేసుకుంటూ ముందుకు పోతున్నడు. ఒంటరి యోధుడుగా అడవిబాటను గెల్వాలని అడుగులేస్తున్నడు. అతని పట్టుదల ముందు 20 కిలోమీటరు రాళ్ళు ఓడిపోయి ఎనక్కెళ్ళినయి. మర్రిగూడె మొచ్చింది. నర్సయ్య బాటపక్కనున్న ఓ యింటి ముందు ఆగిండు. బుజం మీంచి పెళ్ళాన్ని దించి గోడకు ఆనుకునేలా సర్ది కూసపెట్టిండు. కుక్కలు కుయ్యిమనడం లేదు. నక్కలు ఊళలువెడతున్నయి. నర్సయ్య అలసట ఆయాసం తీరేలా కూసున్నడు. లచ్మి మూలుగుతూనే ఇప్పుడు మనం ఏడున్నం.? ఇది ఇల్లెందా? కాకుంటే ఇది ఏ ఊరు? ఇంకా ఇల్లెందు ఎంత దూరముంది? అబ్బ.. పలుపు పురివెడుతున్నట్లు కడుపుల పేగులు వడివడుతున్నై. అదే పనిగ నొప్పులు కట్టెలు మండరిపొయిల నుండొస్తున్న పొగలా గుప్పుగుప్పున పెనవడుతున్నయి. సెప్పతరంగాని బాధయితుంది. తట్టు కోలేకుండ ఉన్న అంది లచ్మి. ''లచ్మీ మనను కొండదేవర సల్లంగ సూస్తడు. భయపడకు. అడవిబాట దాటినం. ఇదిమర్రిగూడెం. రోడ్డుకొచ్చినం. ఈణ్ణుంచి ఇల్లెందుకు లారీలు-జీపులు పోతుంటయి. ఇంకొంచెం సేపు ఓపికవట్టు. నేను రోడ్డుకుపోయి లారన్నా జీపన్నా వస్తుందేమో సూస్త. మన అదృష్టం బాగుంటే ఏదో ఒకటి రాకపోదు. వచ్చిన లారీని కానీ జీపును కానీ ఆపి వాళ్ళకు మన బాధ సెప్పుకుంట. మనను ఇల్లెందు ఆసుపత్రికి సేర్చి పున్నెం కట్టుకోమని వేడుకుంట'' అని రోడ్డుమీదికి వచ్చి నిలబడ్డడు. అనుకోని ఆపద్భాంధవునిలా ఓ జీపు వస్తూ కనపడింది. నర్సయ్య సెయ్యెత్తి జీపునాపిండు. దగ్గరికి వొయ్యి జీపులోని వాళ్ళకు మొక్కి అయ్యా.. నా పెళ్ళాం కాన్పునొప్పులతో బాధపడుతుంది. ఆసుపత్రికి పోతె తప్ప నా పెళ్ళాం బిడ్డలు దక్కరు. దయసూపండి. మీ జీపులో మమ్మల్ని ఎక్కించుకొని ఇల్లెందు ఆసుపత్రికి సేర్చండి. మీ కాళ్ళు వట్టుకుంట. మిమ్మల్నే దేవుడిలా నిత్తెం తలుసుకుంట అని మొరపెట్టుకున్నడు. జీపు వాళ్ళు సరే అనంగనే భార్యను ఎత్తుకొని వచ్చి జీపులోకి ఎక్కించి తనూ ఎక్కాడు. నర్సయ్య మనసు కొంచెం కుదుటపడింది. జీపు ఇల్లెందు వైపు సాగింది. కొంతసేపటికి ఇల్లెందు ఆసుపత్రి ముందు జీపు ఆగింది.

    నర్సయ్య ఒక్క ఉదుటున జీపు నుండి దుంకినట్లు దిగిండు. భార్యను దించుకున్నడు. జీపులోని వాళ్ళకు సేతులెత్తి మొక్కిండు. భార్యను భుజంమీదికెత్తుకున్నడు. ఆసుపత్రిలోనికి అడుగుపెట్టిండు. ఎదురుగా డ్యూటీ నర్సు కుర్చీలో కూసోని కనపడింది. ఆడున్నబల్లమీద పెళ్ళాన్ని కూసోబెట్టి నర్సుకు తనగోడు సెప్పిండు. ఆమె వెంటనే  డాక్టరుకు ఫోనుసేసింది. ఫోను రింగవుతున్నా డాక్టరు ఫోనెత్తలేదు. ఫోను రింగయి ఆగిపోయింది. నర్సు మళ్ళీ మళ్ళీ ఫోను సేసింది. రింగవుతున్న ఫోనువల్ల నిద్రాభంగమైనందుకు విసుక్కుంటూ డాక్టరు ఫోనెత్తి హాలో అన్నడు. నర్సు డాక్టరుగారూ ఒక కాన్పుకే సొచ్చింది. సీరియస్‌గా ఉన్నట్లుంది. మీరు వెంటనే రండి అని ఫోను పెట్టేసింది.

    ఇక తప్పదన్నట్లుగా డాక్టరు ఆసుపత్రికి వచ్చిండు బల్లమీదున్న పేషంటును చూసిండు. ఆమె మూలుగులు- ఆమె పడుతున్న ఆయాసం సూసిండు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందనే అంచనాకు వచ్చిండు మహిళా డాక్టరు లేదు. తను కాన్పుసేయించడానికి ప్రయత్నంసేస్తే జరగరానిది జరగొచ్చు. ఆమె సనిపోయినా ఆమె కడుపులోని బిడ్డ సనిపోయినా నా మెడకే సుట్టుకుంటది. సరైన వైద్యం సేయలేదని - నిర్లక్ష్యం సేసినానని అందుకే ఇలా అయిందని నానెత్తిన పిడుగుపడ్తది. లేని తద్దినాన్ని ఎందుకు తెచ్చిపెట్టుకోవాలె. తప్పించుకోవడమే అన్ని విధాల మంచిదని మనసులో అనుకున్నడు. ''ఈమె కండీషను ఏమీ బాగాలేదు. కాన్పు అయ్యేట్లు కనిపించడంలేదు. ఆపరేషను సేసి బిడ్డను బైటికి తియ్యాలె. ఆపరేషను సెయ్యడానికి అవసరమైప పరికరాలు లేవు. అత్యవసరంగా వాడాల్సిన మందులూ లేవు. ఆలస్యమయ్యేకొద్దీ ప్రమాదం ముంచుకొస్తది ఖమ్మం ఆసుపత్రికి తీసుకుపోవడం అన్నివిధాలా మంచిది'' అన్నడు డాక్టరు.

    గండం గడిసిందని సంబరపడుతున్న నర్సయ్య గుండెల్లో, డాక్టరు మాటలు తుఫాను పుట్టించినయి. నర్సయ్య డాక్టరు సేతులు పట్టుకోని ''అయ్యా దయసూపండి. వెన్నెల బైట నుండి పానాలు అరసేతుల్ల పెట్టుకోని నానాతిప్పలుపడి ఈడికొచ్చిన నా గోసంతాసెప్తె బారతమైతది. మళ్ళీ ఖమ్మం బొమ్మంటున్నరు. ఎట్లపోవాలె? మీ కాళ్ళు పట్టుకుంట. మీరే వైద్యం సేయండి. నా ఆలినీ- బిడ్డనూ బతికించండి'' అని బతిమాలుకున్నడు. ''ఈడ వైద్యం సాధ్యంకాదు. ఖమ్మం  పోవాల్సిందే. అంబులెన్స్‌ల పంపిత్తామంటే అది సెడిపోయి మూలకు పడింది. ఆసుపత్రిల మరో వాహనం లేదు. పరిస్థితి సూస్తే పానం మీదికొచ్చేటట్లుంది.  నర్సయ్యా అధైర్యపడకు. నేను ఏదో ఒకటి ఏర్పాటుసేసి మిమ్మల్ని ఖమ్మం పంపిస్త. ఖమ్మం డాక్టరుకు ఒక ఉత్తరం కూడా రాసిస్త. నువ్వు ఖమ్మం ఆసుపత్రికి వొయ్యినంక ఉత్తరాన్ని డాక్టరుకియ్యి అక్కడున్న డాక్టరమ్మ నీ భార్య సుఖంగా కనే ఏర్పాట్లు సేస్తది'' అని ఉత్తరం రాసిచ్చిండు. ఒక జీపు ఏర్పాటు చేసి నర్సయ్యనూ- ఆయన భార్యనూ ఖమ్మం ఆసుపత్రికి పంపించి హమ్మయ్య గండం గడిసింది అని ఊపిరి పీల్సుకొని ఇంటికి పొయ్యి హాయిగా నిద్రవొయిండు.

    జీపు ఖమ్మం బాటపట్టింది. జీపు చక్రాలు ముందుకు కదులుతున్నట్లే కాలం కూడా కదలిపోసాగింది. ఇంతలో జీపు ఖమ్మం ఆసుపత్రికి చేరుకొంది. జీపు ఆగీ ఆగగానే నర్సయ్య జీపు దిగిండు. భార్యను భుజం మీదేసుకొని ఆసుపత్రిలోకి అడుగుపెట్టిండు. డ్యూటీ నర్సు తానికొచ్చిండు. భుజం మీంచి లచ్మిని దించి బల్లమీద పడుకోబెట్టిండు. నర్సుకు సంగతి సెప్పిండు. ఇల్లెందు డాక్టరిచ్చిన ఉత్తరాన్నిచ్చిండు. నర్సు వెంటనే లేడీ డాక్టరుకు ఫోను చేసి కాన్పు పేషెంటు వచ్చినట్లు సెప్పింది. వెంటనే లేడీ డాక్టరు వచ్చింది. రాగానే నర్సు ఇల్లెందు డాక్టరు రాసిన ఉత్తరాన్నిచ్చింది. డాక్టరమ్మ ఆ ఉత్తరాన్ని చదివి విషయం గ్రహించింది. పేషెంటును చూసింది. పేషెంటు శరీరం కొంకర్లు వొయ్యి బిగుసుకుపోతున్న దశలో ఉండటం సూసింది. కండీషన్‌ సరిగాలేదని చాలా సీరియస్‌గా ఉందని అర్థం సేసుకుంది. వెంటనే లచ్మిని అత్యవసర వైద్యం సేయడానికి ఆపరేషన్‌ థియేటరుకు తరలించింది. పరీక్షలు మొదలుపెట్టింది. గర్భంలోని బిడ్డ పరిస్థితిని గమనించింది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగి ఉండడం బిడ్డలో కదలికలు లేకపోవడం గమనించింది. వెంటనే ఆపరేషను చేసి చనిపోయిన బిడ్డను బయటికి తీసింది. 

    లచ్మి ఆపస్మారకంలోకి పోయింది. స్పృహ తెప్పించటానికి అవసరమైన వైద్యం చేసింది. వైద్య సపర్యల వల్ల కొంతసేపటికి లచ్మి స్పృహలోకి వచ్చింది. స్పృహలోకి వచ్చీరాంగానే ''ఏదీ నా బిడ్డ? మగబిడ్డా? ఆడబిడ్డా? ఎక్కడుంది? నా బిడ్డను సూడాలె. సూపించడని'' అడిగింది.

    డాక్టరమ్మ నర్సయ్యను లోపలికి రమ్మని పిలిసింది. ఆసుపత్రి వరండాలో దిగులు మొగంతో కూసున్న నర్సయ్య డాక్టరమ్మ దగ్గరికి వచ్చిండు నర్సయ్యా. ఆసుపత్రికి వచ్చినప్పుడు నీ భార్య పరిస్థితి దారుణంగా ఉండింది. శరీరం కొంకర్లు వొయ్యి బిగుసుకుపోతున్నదశలో ఉండింది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. బిడ్డలో ఏమాత్రం కదలికలు లేవు. బిడ్డమీది ఆశతో ప్రయత్నం సేస్తూ ఆలస్యం సేసేకొద్దీ తల్లిప్రాణం ప్రమాదంలో పడేది. అందుకే ఆపరేషను సేసి బిడ్డను బయటికి తీసి నీ భార్యను కాపాడాను. నీ భార్యకు నొప్పులు మొదలుకాంగనే ఆలస్యం సేయకుండా ఆసుపత్రికి తీసుకొచ్చింటే ఇలా జరిగి ఉండేదికాదు. తల్లీ-బిడ్డా క్షేమంగా ఉండేవాళ్ళు. ప్రమాదం ముంచుకొచ్చిన దశలో వచ్చినందున బిడ్డను కాపాడలేకపోయాను. జరిగిందానికి ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేం. బిడ్డ చనిపోయిందని బాధపడొద్దు. పెద్ద ప్రాణం బతికిబట్టకట్టిందని సంతోషించు. మీ వయసేం అయిపోలేదు. ముందు ముందు పిల్లలు పుడతారు అని డాక్టరమ్మ సెప్తుండగానే ఓ కొండ దేవరా! నన్ను తీసుకపోయ్యి నా బిడ్డను బతికించకూడదా అంటూ శోకాలు పెట్టింది లచ్మి. అప్పుడే పొడుపుకొండ నుండి సూర్యుడు బైటపడి వెలుగును ఎంటబెట్టుకొచ్చిండు. నర్సయ్య ఇంటి సూర్యుడు శాశ్వతంగా పడమటికొండలో దాక్కొన్నడు. ఆస్పత్రి బైట సెట్టుకింద నిలబడి నర్సయ్య ముఖానికి సెల్ల అడ్డంపెట్టుకొని గుండెలు బాదుకొని తనలో తాను ఏడుస్తున్నడు.

    చెంచుగూడెం నుండి ఖమ్మం ఆసుపత్రికి అత్యవసర వైద్యం కోసం కాన్పుకేసు అర్ధరాత్రి వచ్చిందన్న వార్త సెవినబడిన టెన్‌టీవీ బృందం ఆ కేసు సంగతి తెలుసుకొని వార్త ప్రసారం సేయాలని ఆస్పత్రి దగ్గర గద్దలా వాలింది. బృందానికి బైట సెట్టు కింది  దిగులుమొగంతో నిలబడ్డ మనిషి కనబడ్డడు. రాత్రి వచ్చింది అతడే అని ఊహించి టీ.వీ బృందం అతని దగ్గరికి వచ్చి విషయసేకరణం మొదలుపెట్టింది. 

    ఏమయ్యా నీవెవరు?

    నేను చెంచును

    నీపేరేంది?

    కిన్నెర నర్సయ్యండి.

    ఏ గూడెం?

    వెన్నెలబైలండి

    అర్థరాత్రి ఆసుపత్రికెందుకొచ్చినవు?

    నా భార్యకు వైద్యం కోసం

    నీ భార్యకేమయింది?

    నా భార్య యాకటి మనిషి. కనే పొద్దులు. గూడెంల మంత్రసాని కాన్పయ్యేట్లు లేదు. ఆసుపత్రికి తీసుకుపొమ్మంది.

    కిందికి మీదికి ఒకటే వాన కదా. అదీ రాత్రిపూట. ఆసుపత్రికి ఎట్లొచ్చినవు?

    వెన్నెల బైలు నుండి అడవిదారిలో నా పెళ్ళాన్ని బుజానికెత్తుకొని మోస్తూ 20 కిలోమీటర్లు నడిసి మర్రి గూడెమొచ్చిన.

    అణ్ణుంచి ఖమ్మం ఎట్లొచ్చినవు?

    మర్రి గూడెంల ఓ జీపు ఎదురైంది. వాళ్ళను అడుక్కోని అందుట్ల ఎక్కా.

    ఇల్లెందు దవఖానకు పోయిన

    ఆడ వైద్యం సెయ్యలేదా?

    లేదు. ఆడ డాక్టరమ్మలేదంట. ఆపరేషన్‌ సరంజామా తగినంత లేదంట. మందులూ లేవంట. డాక్టరు ఖమ్మం బొమ్మనడు.

    ఖమ్మం ఆసుపత్రికి ఎట్ల్లొచ్చినవు?

    డాక్టరే జీపు ఏర్పాటు సేసి పంపించిండు

    నీ ముఖం సూస్తే ఏదో జరగరానిది జరిగినట్లుంది. ఇక్కడ వైద్యం జరగలేదా?

    అవునయ్యా. జరగరానిదే జరిగింది. ఈడికొచ్చేటప్పటికే మించుకొచ్చిందంట. కడుపుల బిడ్డ అడ్డం తిరిగిందంట. తల్లినీ బిడ్డను బతికించడానికి  సాధ్యం కాలేదంట. బిడ్డ కడుపులనే సనిపోయిందంట. తల్లిని మాత్రం బతికించినం అన్నది డాక్టరమ్మ. నా పెళ్ళాం బతికిందని సంతోషపడాలో బిడ్డ దక్కలేదని ఏడ్వాలో తెలియక నెత్తిన గుడ్డేసుకున్న.

    ఎందుకిట్లయ్యిందనుకుంటున్నవు?

    ఎట్ట సెప్పాలె? ఏం సెప్పాలె? అడవిని నమ్ముకొని బతుకుతున్న చెంచును. అడివేనాకు అమ్మ అయ్యా కూడు, నీడ, అడవి నా బతుకుకు భరోసా యిచ్చింది. అడవి ఎప్పుడూ నన్ను దగా సేయ్యలే. మీ పట్నం నన్ను పరేషాను చేసింది. 

    ఎందుకట్లనుకుంటున్నవు?

    చెంచుగూడెంలలో దవాఖానలు లేవు. గూడేల నుండి పట్నాలకు రానీకె పోనీకె వసతుల్లేవు. మాకు రోగాలొస్తే కచ్చాకుపుచ్చాకులే గతి. నా పెళ్ళాం యాకత్తైంది. కనే పొద్దులొచ్చినై. కాన్పుసెయ్యడం మంత్రసాని నుంచి కాలేదు. కన్నతిప్పలు పడి ఇల్లెందుకు పోతే ఇల్లె అయింది. ఖమ్మం వచ్చెటాళ్ళకు నా పెళ్ళాం కడుపు గుమ్మడిపండు మురిగినట్లు మురిగి పోయి బిడ్డ దక్కలేదు. గుడ్డిలో మెల్లలా భార్య దక్కింది. నా పట్ట కొండదేవర దయ తప్పింది. అందుకే పట్నం పరేషాను చేసింది.

    నర్సయ్యా. నీకు కొండదేవర దయలేక కష్టం రాలేదు. నష్టం రాలేదు. మన ప్రజాస్వామ్య పాలకుల నిర్లక్ష్యం వల్ల నీకు కష్టమొచ్చింది. పల్లె పల్లెకూ రోడ్లేసినం. బస్సులు కదిలిస్తున్నం. ఆసుపత్రులు పెట్టినం. అందరికీ వైద్యం అందిస్తున్నం. అని కాగితాల మీద లెక్కలు సూపిస్తున్న పాలకుల స్వార్థం వల్లనే ఇదంతా జరిగింది. అడవి నీకు అన్ని ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడితే మా నగరం - నాగరికత - ప్రజాస్వామ్యం కొడుకు చావు నీకు బహుమతిగా ఇచ్చింది. ఇది అవినీతి పాలకులు నీకిచ్చిన బహుమతి. నీ కథను టీ.వీ.లో సూపిస్తాం. అది సూసైనా పాలకుల వైఖరిలో మార్పు వస్తుందని ఆశిద్దాం అంటూ భుజం తట్టి వెళ్ళిపోయింది టీ.వీ. బృందం. 

(సాహిత్య ప్రస్థానం జనవరి 2014 సంచికలో ప్రచురితం) 
Comments