బరువు – పంతుల విజయలక్ష్మి

    ఒక చేతిలోపుస్తకాల సంచీ, మరో చేతిలో చిన్న కేరియర్ , భుజాన వాటర్ బాటిల్ తో  పదేళ్ళ ఆ పాప గబగబా స్కూల్ వేపు అడుగులు వేస్తోంది. టైమ్ అయి పోతోందేమోనని ఒక పక్క గాభరా, వేళకి స్కూలుకి చేర గలనో లేదో అని భయం మరో పక్క ...   కాళ్ళకి చెప్పులు లేవు. పాదాల నిండా దుమ్ము పేరుకు పోయి ఉంది. బట్టలకు అక్కడక్కడా చిరుగులు కని  పించకుండా వేసిన కుట్లు. వారం రోజులనుండీ అవే బట్టలు వేసు కోవడం చేత మాసి  పోయి ఉన్నాయి. పాపం,  ఆ పాప అన్ని అవసరాలనీ తీర్చగల కుటుంబంలో పుట్టిన పిల్ల కాదు. పేదింటి పిల్ల మరి ! తండ్రి సంపాదన కుటుంబానికి తిండి పెట్టడానికే చాలదు. ఇక పిల్లల కనీస అవసరాలేం తీర్చ గలరు?

     రోడ్డుకి ఒక పక్కగా ఆగి, తన చేతుల్లోని బరువుని అటుదిటు మార్చుకుందా పాప.  పాపం, ఎన్ని పుస్తకాలో !  మోయలేనంత బరువుని మోస్తూ అడుగులు వేస్తోంది. రోజూ స్కూలుకి మైలు దూరం నడిచి వెళ్ళి రావాలి.

    నిమిషానికోసారి రోడ్డు మీద ఎదుట పడిన వారిని ఆపి,  టైమ్ అడుగుతోంది. స్కూలుకి చేరేసరికి బెల్ అయిపోతుందేమో అని భయం. బెల్ అవకూడదని మనసులోనే దేవుడకి మొక్కు కుంటోంది. అడుగుల వేగం పెంచింది.

    మొదట్లో యిలా బడికి వెళ్ళి రావడం ఎంతో సరదాగా ఉండేది. ఏదో తెలీని వింత ఆనందాన్ని అనుభవించేది. కాని – రాను రాను, రోజూ వెళ్ళి రావడం  భారంగా తయారవుతోంది, ఆ పాపకి. వెళ్ళకపోతే అమ్మా నాన్న ఊరుకోరు ‘‘ ఇంట్లో ఉండి ఏంచేస్తావ్, గోళ్ళు గిల్లు కుంటూ కూర్చుంటావా?’’ అని తిడతారు.

    స్కూలు దగ్గర పడుతోంది. ఆ మలుపు తిరిగితే కాస్త దూరంలో స్కూలు కనిపిస్తుంది. మలుపు తిరిగే సరికి, ఆ పాపకి గుండె దడదడ లాడింది. గేటు దగ్గర పిల్లల సందడి, అప్పుడే  మొదలు అయినట్లు తెలుస్తోంది.

    పరుగులాంటి నడకతో స్కూలుకి చేరుకుంది. గేటు దాటి, ఆవరణలో అడుగు పెట్టింది. దగ్గర యిళ్ళకి వెళ్ళడానికి గేటు దాటుతున్నపిల్లలు కొంత మంది , చేతుల్లో  చిన్న కేరియర్లు, టిఫిన్ బాక్సు ల్తో గుంపులుగా విడి పోతున్నపిల్లలు మరి కొందరు, -  వాళ్ళని చూస్తుంటే  ముచ్చట వేస్తోంది ఆ పాపకి.

    అలవాటైన చెట్ల దగ్గరికి తడబడే అడుగుల్తో చేరిందా పాప. అప్పటికే ఆ పాప తల్లి పాచి పని చేసే ఇంటి వాళ్ళమ్మాయి సుస్మిత రుస రుసలడుతూ ఎదురు చూస్తోంది.‘‘ఎన్ని సార్లు చెప్పాలి నీకు? త్వరగా కేరియర్ తీసుకు రమ్మని ! చూడు, అప్పడే నా ఫ్రెండ్సందరూ భోజనం చేసేస్తున్నారు. ఇలా అయితే రేపటి నుంచి నిన్ను మాని పించేయమని చెప్తాను, అమ్మతో! ’’ విసురుగా ఆ పాప చేతిలో నుంచి కేరియర్, వాటర్ బాటిల్ లాక్కుంటూ ధుమ ధుమ లాడిపోయింది, ఆరవ తరగతి చదువుతున్న సుస్మిత.

 * * *

    అరగంట తరువాత-

    కడుపు నిండిన పిల్లలంతా తృప్తిగా, హుషారుగా మధ్యాహ్నం క్లాసులకి - తరగతి గదుల్లోకి అడుగు పెడుతూ ఉంటే, చీవాట్లతో కడుపు నిండిన ఆ పాప, మండే కడుపుతో, ఖాళీ కేరియర్తో, సుస్మితకి ఉదయం అవసరం తీరిపోయిన పుస్తకాలతో, భారంగా అడుగులు వేస్తూ స్కూలు గేటు దాటి, బయటకి అడుగు పెట్టింది..

(ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక 22-6-1988 సంచికలో ప్రచురితం)

Comments