బతుకువేదం - శాంతినారాయణ

 
   
టైం చూసుకున్నాను. రెండుగంటలు కావొస్తూ ఉంది. వేసవి ఎండ తీవ్రంగా ఉంది. పొగలు గక్కుతున్న తార్రోడ్లో బస్సు ముందుకు పోలేక పోతూ ఉంది. బీడు భూముల్లోంచి సెగలుగక్కే 'వడగాలి' బస్సులోకి వీస్తూ ఉంది. పెళ్లి పార్టీ ఎక్కడం వల్ల బస్సులో రద్దీగా ఉండి, వేడికి దిక్కు తోచడంలేదు. కారిపోయే చెమటతో శరీరానికంతా అసౌకర్యంగా ఉంది. సంసారం అనంతపురంలో, ఉద్యోగం కళ్యాణదుర్గంలో అయినందువల్ల వారానికోసారి ఈ వేడి అనుభవం తప్పదేమో అనిపించింది.

    దప్పికతో పెదవులు ఎండిపోతున్నాయి. ఆత్మకూరు ఇంకా నాల్గైదు మైళ్ల దూరంలో ఉంది. ఎప్పుడెప్పుడు నోట్లో గుక్కెడు నీళ్లు పోసుకుందామా అనిపించింది. చిన్న పిల్లలు కొందరు 'నీళ్లు నీళ్లు' అని అరుస్తున్నారు. చంటి పిల్లలిద్దరు ఎండ వేడికి భరించలేక కేర్ మంటున్నారు. తల్లులు వాళ్ల ఏడుపు మాన్పడానికి అవస్థపడుతున్నారు. నోటితో గాలి ఊదుతున్నారు.

    ఎండకు ఏడుస్తూ వచ్చి బస్సు ఆత్మకూర్లో ఆగింది. రోడ్డంతా రద్దీగా ఉంది.

    కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళ్లే బస్సులన్నీ ఆత్మకూర్లో నాలుగైదు నిమిషాలు ఆగుతాయి. అది పెద్ద పల్లెటూరే కాకుండా ఇటీవలే మండల క్రేందమైనందువల్ల బస్‌స్టాండ్ కాస్తా రద్దీగానే ఉంటుంది.

    బస్సులోపలా బయటా కోలాహలంగా ఉంది. ఇద్దరు ముగ్గురు పిల్లలు సోడా పెట్టెలు భుజానేసుకుని ఆదరాబాదరగా వచ్చి 'షోడా షోడా చల్లని షోడా' అని అరుస్తూ సీసాలను ఎదకానించి ఓపెన్తో వొత్తి 'కయ్' మనిపిస్తూ బస్సులో వాళ్ల కందిస్తున్నారు. ప్యాసింజర్స్ బస్సులో నుండే చేతులు బయటికి పెట్టి సోడాల కోసం ఎగబడుతున్నారు.

    వెనకవైపు నుంచి ఎవరో పల్లెటూరాయన 'సోడా ఎంతరా అప్పయ్య' అని అడుగుతున్నాడు. కిందున్న సోడాల పిల్లవాడొకడు ‘పావలానే అన్నా' అని చెబుతున్నాడు. నేను ఒక సోడా తాగి దప్పిక తీర్చుకుని ఖాళీ సీసాతో పాటు కిటికీలో నుంచి వానికి పావలా అందించాను. ఆ పసివాడు డబ్బులందుకోవడానికి అవస్థపడుతున్నాడు. వాని ఆదుర్గాను చూసి నాలో నేను నవ్వుకుంటూ బ్రతుకుపట్ల ఆ వయసులోనే ఆపిల్లలకేర్పడిన బాధ్యతల్ని గురించి ఆలోచింపసాగాను.

    సోడా తాగి దప్పిక తీర్చుకుని కొంతమంది తేపుతున్నారు. ఒక మొరటు మనిషి 'వొట్టినీళ్లు గదరా భడవా! దీనికి పావలానా' అని బేరమాడుతున్నాడు. మరో పెద్దమనిషి 'ఏందిరో ఉడుకునీళ్లున్నట్లుండాయి' అంటూ వాఖ్యానం చేస్తున్నాడు. వెనకసీట్లో ఉన్న మీసాలాయన నాలుగు సోడాలు కొట్టివ్వమని తొందరపెడుతున్నాడు.

    బస్సులో జనం కాస్తా రద్దీ తగ్గడంతో ఆ సోడా పిల్లవాని అవస్థ చూడలేక 'బస్సులోపలికి వచ్చి కొట్టీయరా' అన్నాను.

    'వస్తానయ్యా, యేరే వాళ్లతో తీసుకోవద్దని ఆయన్నతో రోంతజెప్పయ్యా' అంటూ వాడు బిరబిరా సోడాపెట్టె భుజాన వేసుకొని, ఆ గిరాకీ యెక్కడ తప్పిపోతుందోనన్న తాపత్రయంతో పరుగుపరుగున అటువైపు నుండి బస్సులోకొచ్చాడు. పెట్టె కింద పెట్టి యంత్రంలాగా చకచకా నాలుగు సోడాలు కొట్టి మీసాలాయనకిచ్చాడు. మరో నాలుగు ముందువైపున్న వాళ్లకిచ్చాడు.

    డ్రైవరు బస్సుకు నీళ్లు తాపి హార్న్ కొట్టి బస్సు స్టార్ట్ చేశాడు. కండక్టర్ ఎక్కడో వెనకవైపు నుంచి తాడు లాగాడు. బెల్ల సరిగ్గా మోగడం లేదు. తుటుక్ తుటుక్కుమంటూ ఉంది.

    సోడాల పిల్లవాడు డబ్బులీయుండని తొందరపెడుతున్నాడు. ముందువైపున్న వొక పెద్దమనిషి 'దొంగ నాకొడకా! సోడాలో గ్యాసే లేదు గదోయ్. దీనికి పావలా యియ్యాల్లా' అంటూ తిట్టాడు. 'అవున్రా షోడా యేం బాగాలేదు' అంటూ మరొకడు తాళం వేశాడు. వాళ్ల వాలకం చూస్తూ ఉంటే డబ్బులొస్తాయో రావో అన్న ఆందోళన వాని ముఖంలో కనిపించింది.

    'నేనేం జేత్తాను సార్? మా షావుకారి చేసిస్తే మేమమ్ముతాండాం' అని వాడు సంజాయిషీ చెప్పాడు.

    'అట్లయితే వాళ్లు డబ్బులీలేదని మీ షావుకారితో చెప్పరా' వాళ్ల మాటల్లో ఎగతాళి.

    'షోడా తాగి అట్లంటే యెట్లసార్?... ఖాళీ సీసాలన్నిటికీ మేం లెక్కగట్టీయల్ల' వాని మాటల్లో దిగులూ, మెత్తని తిరుగుబాటూ, 'ఊ... ఊ... దిగిపోదురారేయ్ సోడావాలా! టైమయ్యింది' అని కండక్టర్ మళ్లీ తాడు లాగుతూ వాన్ని తొందరచేశాడు. డ్రైవర్ గేర్ మార్చాడు. 'సార్ సార్.. రొంతసేపుండు సార్. వాళ్లింగా డబ్బులీలేదు.' అని ఆ పిల్లవాడు డైవర్ని ప్రాధేయపడుతూ సీసాలు, డబ్బులూ ఈయండి సార్ బస్సు కదుల్తాంది అంటూ వాళ్లను తొందరపెట్టాడు.

    ఆ ట్రౌజర్ పెద్దమనిషి నాలుగు సోడాలకు అర్థరూపాయిస్తూ 'చిల్లర లేదురా మళ్లాయిస్తాంలే...' అంటూ ఖాళీ సీసాలిచ్చాడు. అతని టెరీకాటన్ శ్లాగ్ జేబులో నుంచీ ఐదు రూపాయల నోటు నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ తొందరలో ఏమీ చేయలేని స్థితిలో ఆ పిల్లవాని ముఖం చిన్నబోయింది.

    బస్సు కదుల్తూ ఉంది. మీసాలాయనింకా పిల్లలకు సోడా తాపుతూ దగ్గరికొస్తున్న ఆ పిల్లవానితో 'పనికిమాలిన సోడా ఇచ్చినావు గద లే దొంగనాయాలా? ఎండలకాలంలో దప్పిగ్గొని యాదిచ్చినా తాగుతారనా? మోసం నాకొడుకుల్రా మీరు. దిగు దిగూ... దిగి అవతలికిరా, ఆ సీసాలిస్తాను, ఇంగా పిల్లోల్లు తాగుతాండారు' అంటూ వాణ్ణి గద్దించి రెండు సీసాలిచ్చాడు. డబ్బులేమో ఇవ్వలేదు.

    వాడు త్వరత్వరగా ఖాళీసీసాలు పెట్లో పెట్టుకుని కిందికి దిగాడు. వాని దైన్యాన్ని చూసి వానివెంట నాకూ దిగాలన్పించింది. 'యేం సార్,
యేదయినా మరిచిపోయారా' అని కండక్టర్ అంటూ ఉండగానే బస్సు దిగాను. మూడ్రూపాయలు వేస్టయితే మాన్లే అనుకున్నాను.

    ఆ పిల్లవాడు సోడా పెట్టె కింద బెట్టి పరుగు పరుగున అవతలి వైపుకు వెళ్లాడు. అప్పుడే బస్సు వేగమందుకుంది. ఆ మీసాలోడు సీసాలను కనీసం బయటికి కూడా చూసినట్లు లేదు. రెండు సీసాలను పోగొట్టుకుని ఆ పిల్లవాడు బాధగా బస్సు వైపు చూడసాగాడు. వాని కళ్లల్లో యెరుపు జీరలేర్పడ్డాయి.

    వాడు నిరాశతో కొట్టువైపొస్తూ నన్ను చూశాడు. ఆ చూపుల్లో చెప్పలేనంత ఆవేదన. ఆ ముఖంలో నన్ను తిట్టలేని ఆశక్తత. కోపంతో పళ్లకింద పెదవులు నలిగిపోతున్నాయి. 'రే రంగా నీకసలు బుద్ధిలేదురా, నిన్ను బస్సులోపలికి ఎవుడెక్కమన్నాడోయ్? బస్సౌత్తానే కాళ్లకాళ్లకు అడ్డమొచ్చి యెంపర్లాడి సత్తావ్... ఇప్పుడూ! ఆశకుబోతే గోసిలో రాయేరా' అంటూ మిగతా పిల్లలిద్దరూ వాని దగ్గరకొచ్చి ఎత్తిపొడుస్తూ తమ అక్కసం కక్కేశారు.

    'ఏమిరా బాబూ, ఆ మీసాలాయన సీసాలివ్వలేదా' నేను పలకరించాను వాణ్ణి.

    వాడు బాధతో మాట్లాడలేదు. కోపంగా ముఖమెత్తి నావైపు చూసి మళ్లీ ముఖం దించుకున్నాడు. వాణ్ణి మరీ పలకరించడానికి నాకెందుకో మనస్సు రాలేదు. 'నిన్ను బస్సులోపల కెవడెక్కమన్నాడోయ్!' అని వాళ్లన్నప్పుడు రంగడు, 'ఇడుగో ఈయనే' అని నన్ను జూపుతాడేమోనని గిల్టీఫీలయ్యాను. వాని బాధను గమనిస్తూ ఉంటే ఎంత పనిచేశానా? అనిపించింది నాకు.

    ఆ సోడా పిల్లలిద్దరూ ఖుషీగా తమ పెట్టెల్లోని ఖాళీసీసాలను పెద్ద పెట్టెల్లోకి వేస్తున్నారు. వాళ్లందరికీ యజమాని ఒకడే ఉన్నట్టుంది. సోడాలమ్మితే వాళ్లకేమిస్తారో తెలుసుకోవాలనిపించింది. ఆ ఇద్దర్నీ అడిగాను.

    'వొగసోడా అమ్మితే అయిదు పైసలిత్తాడయ్యా మా సావుకారి' జవాబు చెప్పాడొకడు.

    'రోజుకో పది రూపాయలు సంపాదిస్తారేంరా’ అనడిగాను.

    'యాడయితుంది సార్, సందకాడ దంకా కట్టవడితే ఐదార్రూపాయలొత్తుందంతే' నిరుత్సాహంగా చెప్పాడు వాడు.

    రంగని ముఖంలో విషాద రేఖలు ఎక్కువవుతూనే ఉన్నాయి. సోడాసీసాల రేటెంతుంటుందో తెలుసుకోవాలనిపించింది నాకు.

    ఈసారి వాళ్ల దగ్గరికి వెళ్లి అడిగాను. ఒకడు నిజంగానే విసుక్కుంటూ 'ఏమో మాకు తెల్దుసార్' అన్నాడు.

    'అందాజుగా ఎంతుండొచ్చు నాయనా' అని మరీ అడిగాను. నిజానికి సోడాసీసా రేటెంతో నాకంతవరకూ తెలీదు. 'రేటెంతో తె
ల్దుగానీ, వొగసీసా పోయిందంటే మా సావుకారు పది రూపాయలు వొసూల్జేత్తాడయ్యా' అంటూ రెండో వాడు రంగని వైపు చూస్తూ చెప్పాడు.

    రంగడెందుకంత బాధపడుతున్నాడో అప్పుడర్థమైంది. ఆ పిల్లవాని మాటల్తో వాడు మరింత కుమిలిపోయాడు. చెక్కిళ్ల మీద కన్నీళ్లు కారుతున్నాయి. నా మనస్సు చివుక్కుమంది. వాని బాధనెలా తీర్చాలో నాకర్థం కాలేదు. ఆ లేత ముఖం అనేక భావాల సంఘర్షణలో దీనంగా కనిపిస్తూ నా మనసును పిండుతూ ఉంది.

    ఎవరో తెల్లటి బట్టలేసుకున్న వో మిడిగుడ్ల మనిషి వచ్చి ఆ పిల్లలిద్దరి పెట్టెల్లో ఉన్న ఖాళీ సీసాలను లెక్కబెట్టి రంగని పెట్టెలోని సీసాలెంచసాగాడు. ఆ వాలకం చూసి సోడాల యజమాని అతడే కావచ్చనుకున్నాను. రంగడతనికి కనిపించకుండా శ్లాగ్‌తో కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు.

    'యేం లే రంగా, రెండు సీసాలు తక్కువుండాయే గద్దించాడతడు!' రంగడేమీ మాట్లాడలేదు. తలొంచుకుని నిల్చున్నాడు. 'నిన్నేరా గాడిదీ, రెండు సీసాల్తక్కువుండాయంటే యేం మాట్లాడవే' కోపంగా గుడ్లు మిటకరించాడతను. పక్కనున్న పిల్లలు జరిగిన విషయం చెప్పారు. 'ముండమోపి నాకొడకా, అంతచాతగాని వానివి బస్టాండ్లో సోడా లెందుకమ్మల్లరా సువర్' అంటూ వాని మీదికి చేయెత్తాడతడు. నేనడ్డం వెళ్లి అతడ్ని వారించాను.


    'లేస్సార్, ఈ నాకొడుకు శానా పనికిమాల్నోడు. ఇంతకుముందు ఇట్లే... నాలుగు సీసాలు పగలకొడితే, ఏదో కొత్త పిల్లనాయాలు పోన్లే పాపమని రెండు సీసాలు డబ్బులొదిలేసినా, సీసాల్సీసాలు పోగొడితే యాడికని సార్'... అంటూ వానివైపు చూసి 'యిదిగో యింగ నీ యాపారానికొగ నమస్కారం నాయనా. ఈ రెండు సీసాల్లడబ్బులూ తీరేదంకా మర్యాదగా పన్దేసి మీ ఇంటికెళ్లిపో' అని నిక్కచ్చిగా చెప్పాడు. వాడు కన్నీల్లు కారుస్తూ అట్లే నిలబడ్డాడు. 'అరె భాడకావ్, దొంగేడుపులు సాలిచ్చి ఆ బోరింగ్ కాటికి బోయి నీళెత్తకరా పో... యాడో శెన్నాకొడుకు దాపరించినాడు' అంటూ కసిరాడతడు. వాడు ప్లాస్టిక్ కడవ తీసుకుని వెళ్లిపోయాడు. నా పెదవులు బిగుసుకుపోయాయి, ఏదో చెప్పరాని వేదనతో.

    కాసేపయ్యాక ఆ మిడిగుడ్ల మనిషి సోడా గ్యాసయిపోయిందనీ అనంతపురం పోవాలనీ ఆ పిల్లలిద్దరికీ కఠినంగా ఏవో ఉత్తర్వులు జారీ చేసి బజార్లో కెళ్లాడు. మౌనంగా ఆలోచిస్తున్న నాకు అతని కేకలు తప్ప వాళ్లకేం చెప్పాడో వినిపించలేదు.

    రంగడు నీళ్లెత్తుకొని వచ్చి సిమెంటు తొట్టిలో పోసి చిన్న డబ్బాతో సోడాసీసాల మీదున్న వరిగడ్డి మీద చల్లుతున్నాడు. వాడిప్పుడు కన్నీళ్లు కార్చలేదు. ముఖం ఎర్రబడి ఉంది.

    'ఆ బస్సు అనంతపురం నుంచీ మళ్లీ ఇప్పుడు తిరిగొస్తుంది కదా బాబూ... సీసాలెక్కడబోతాయిలే, తప్పకుండా బస్సులోనే ఉంటాయి’ అని వాణ్ణి చల్లబరచడానికి ప్రయత్నించాను. ఊదుకున్న రబ్బరు పీపీ లాగా వాడొక్కసారిగా పగిలిపోయినట్లయ్యాడు.

    'ఊ ఉంటాయ్, యెందుకుండవూ? అంతా దొంగనాకొడుకులు, మోసం లంజకొడుకులు. ఆ డ్రైవర్ గాడయితే నిమ్మకాయ సోడా ఇవ్వకపోతే వానికి మంట. కండట్టర్ గానికి కూల్ డ్రింకు ఇవ్వలేదని కోపం. అందుకే ఆ నాకొడుకులు బస్సు నిలబెట్టకుండా పోయినారు. ఆ మీసాల ముసిలోడు సోడా తాగి దుడూ ఈలేదు, సీసాలూ ఎత్తకపోయినాడు. ఇంగ ఆ ముందరుండే తప్పుడు నా కొడుకులయితే నాలుగు సోడాల్తాగి
అర్దరూపాయిచ్చినారు,  లేకి నాకొడుకులు' వాని కంఠం బొంగురుపోయింది. కన్నీళ్లు మళ్లీ కట్టలు తెంచుకున్నాయి. ఎక్కిళ్లు మొదలయ్యాయి.

    ఇదంతా నా వల్ల జరిగిందని వాన్ని శాంతింపజేసి నిమ్మకాయ సోడా ఒకటిమ్మని ఇరవై రూపాయల నోటు వాని చేతికిచ్చాను. వాడు నిమ్మకాయసోడా తయారు చేసి నాకిచ్చి చిల్లరలేదని ప్రక్క షాపుకు వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాలేదు.

    అనంతపురానికి బస్సెంతకుందో తెలుసుకోవాలనుకుంటుండగానే జీపొకటి వచ్చి ఆగింది. జీపులో నుంచే ఎవరో పిలిచినట్లయితే అటు వైపు చూశాను. కవి మిత్రుడు బుచ్చిరెడ్డి ‘ఏమిట్రా యిక్కడ దర్శనమిచ్చావ్, అనంతపురం వస్తావా?’ అంటూ పిలిచాడు. మిత్రుడు కనిపించాడన్న సంబరంతో జీపెక్కాను. జీపు కదిలింది. మిత్రుడు ఆసక్తి కనపరిస్తే, ఆత్మకూర్లో ఎందుకు దిగిందీ, ఏం జరిగిందీ చెప్పాను. ఇరవై రూపాయల నోటు ప్రస్తావన కూడా చేశాను.

    అంతా విని మిత్రుడు నిటూరుస్తూ 'ఈ వ్యవస్థలో యిదీ వో చిన్న రకమైన దోపిడీనే' అన్నాడు. 'నా ఇరవై రూపాయల నోటు కూడానా?' అన్నాను నవ్వుతూ.

    'కాదంటావా?’ అని వెటకారంగా నవ్వాడు మిత్రుడు. ఆ నవ్వు నా హృదయంలో ఎక్కడో ముల్లమాదిరి కుచ్చుకుంది.

(ఉదయం దినపత్రిక ఆదివారం జులై 1994లో ప్రచురితం)
Comments