భద్రాచలం యాత్ర... వాళ్లక్క కథ? - వంశీ

    
శీతాకాలం పొద్దుటిపూట.

    గోదాట్లోంచొస్తున్న గాలి గజగజా వణికించేస్తుంది.

    ఒడ్డునున్న రావిచెట్టు ఆకులు గలగలా కదుల్తున్నాయి. 

    లాంచీలూ, వేటకెళ్ళొచ్చిన నావల్తో నిండిపోయుంది రేవు.  బైరాగులూ, అడుక్కునే వోళ్ళూ, లాంచీల్లో వెళ్ళాల్సిన ప్రయాణికులూ, కొండల్లోపలికెళ్ళి అపరాలు కొనుక్కోడానికెళ్ళే వ్యాపారుల్తో నిండిపోయుంది రేవు. లాంచీల్లో పనిచేసే సరంగులూ ఇంజను డ్రైవర్లూ సోవాలమ్మా పెసరట్లు పొయ్యిదగ్గరా, వరాలు టీ దుకాణం చుట్టూ మూగిపోయున్నారు. 

    ముద్దుకృష్ణా లాంచీ పడికట్టు మీద నిలబడున్న దాని ఓనరు గూటాలమూర్తి సామాన్లతో లోపలికొస్తున్న మనుషుల్ని "రండి అబ్బాయిగారూ రండి" అంటూ వాళ్ళ చేతుల్లో లగేజీ అందుకుని మర్యాదగా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడ్తున్నాడు.

    లాంచీ లోపలికొస్తున్నోళ్ళంతా అమెరికాలో ఉంటున్న మన తెలుగుజనం. ఈమధ్య చుట్టం చూపుకి మన దేశం వచ్చినవాళ్ళకి లాంచీలో రాజమండ్రి నించి భద్రాచలం వెళ్ళాలన్న కోరిక పుట్టింది. దాంతో, ఈ గూటాల మూర్తిగారి లాంచీ బుక్ చేసుకున్నారు. ఎప్పుడూ నవ్వుతా ఉండే వంటమనిషి బోసుని మాటాడుకున్నారు. రాత్రిళ్ళు తిప్పలమీద గుడారాలేసుక్న్నప్పుడు కరెంటు దీపాలు వెలిగించడం కోసం కోరుకొండ బాబ్జీ జనరేటరూ లైట్లూ రప్పించుకున్నారు. లాంచీ రాజమండ్రి నించి బయల్దేరేకా దార్లో వింతప్రదేశాలు ఏవన్నా చెప్పడానికి మంగరాజు అనే గైడుని పురమాయించుకున్నారు. 

    డుబ్ డుబ్ డుబ్ డుబ్‌మని చప్పుళ్ళు చేసుకుంటా బయల్దేరిన లాంచీ బ్రిటీషోళ్ళకాలం నాటి రైలు బ్రిడ్జీ దాటుకుని ముందుకెళ్తా గోదావరి మధ్యలో కొచ్చింది. దూరంగా సూర్యుడు లేస్తున్నాడు పైకి. గాలి చల్లటి ఇగణంలాగుంది. గోదారి నీళ్ళు వాసనేస్తున్నాయి.

    సీనారేకు పళ్ళాలమీద అడ్డాకులేసి పెసరట్లూ, ఉప్మా అల్లప్పచ్చడీ పెట్టి లాంచీలో ప్రయాణం చేస్తున్నోళ్ళకి పెడ్తుంటే గోదారి అందాలు చూస్తా అట్లు తింటున్న జనానికి ఆ ఆనందం ఇంతా అంతా కానిదైపోయింది. 

    "మెరక తగుల్తుంది మేటేసేసింది... ఎడం వేపుకి కొయ్యరా తారకం" అంటూ సరంగుకి చెప్తున్నాడు గెడేసే ముసలోడు లచ్చన్న. కోరుకొండబాబ్జీకి పాటలొచ్చు ఏదో పాడుతుంటే దాన్నాపమని గోదారిమీద పాటందుకో అన్నాడు గూటాల మూర్తి. ఇలా లాంచీలో తలొకడూ తలోమాటా మాటాడ్తున్నారు. నవ్వుతా వంటపనిలో పడిపోయేడు వంటోడు బోసు.

    లాంచీని ఎడం పక్కకి తిప్పించి కుమారదేవం రేవులో ఆపించిన గైడు మంగరాజు గోదారిలోకి ఒరిగిపోయున్న ఆ పాతకాలంనాటి నిద్రగన్నేరు చెట్టు చూపించి దాని చరిత్రంతా చెపుతుంటే ఆ చెట్టుకింద నిలబడి ఫోటోలు తీసుకున్నారంతా.

    లాంచీ కదిలింది. చిన్న బాల్చీకి మూరడు తాడుకట్టి దాన్ని గోదాట్లోకి ముంచి నీళ్ళు తోడి అందరూ తిన్న పళ్ళాలు కడిగేస్తున్నారు బోసు అసిస్టెంటు కుర్రోళ్ళు వీరభద్రం, రాంబాబూ.

    నవ్వుతా అందరి మధ్యలోకి వచ్చిన బోసు "మధ్యాన్నం వంటలు ఏం చెయ్యమంటారంటారండీ?" అనడిగేడు.

    "నాకు చేపల ఇగురు" అన్నాడు తాటి సతీష్ అనే అతను.

    "నాకు చేపల పులుసు" అన్నాడు కొల్లు శ్రీనివాస్.

    "నాకు రొయ్యల వేపుడు" అన్నాడు ముళ్ళపూడి ప్రసాద్.

    "నాకు కోడివేపుడు కావాల"న్నాడు పొట్లూరి ప్రసాద్. 

    "నాకు కైమా కాలిఫ్లవర్ ఇగురు" అన్నాడు అట్లూరి శ్రీను.

    ఇలా ఎవళ్ళనోటికొచ్చింది ఆళ్ళు అడుగుతుంటే నవ్వుతా ఆలకించిన బోసు "ఎవరికి కావాల్సింది ఆళ్ళకి వండుతానండి" అనేసెళ్ళిపోతుంటే వాళ్ళ మధ్యలో వున్న వేమూరి రవికిరణ్ అనే అతను విస్తుపోతా బోసుకేసి చూసి ఇంతమంది ఇన్ని అడుగుతున్నా అసలు ఏమాత్రం కోప్పడకండా పిసరంతైనా విసుక్కోకండా నవ్వుతా ఊకొట్టి వెళ్లిపోతాడేంటి వంటోడు. నిజంగా వాళ్ళకి కావల్సినవన్నీ వండగలడా?" అనుకున్నాడు. లాంచీ కొంతదూరం వెళ్ళేకా గాలి ఊదిన లారీ ట్యూబు మధ్యలో చిన్న బల్ల కట్టుకుని దానిమీద కూర్చుని రెయ్యలు పడ్తున్న ఒక పిల్ల కన్పించింది. లాంచీ ఆపించిన బోసు దాని దగ్గరున్న రెయ్యలు మొత్తం కొనేసేడు. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి కపిలేశ్వరపురపోళ్ళ వేటనావ ఎదురైంది. "ఏందొరికి నయ్యిరా ఇవ్వేళ?" అన్నాడు సరంగు తారకం.

    "రెండు బొచ్చులూ పాలెపు జెల్లా పడినియ్య" అన్నాడు అవతలోడు. 

    "ఎంత సేపయ్యింది వల్లో పడి?"

    "ఇంకా ప్రేణాల్తోనే కదుల్తున్నాయి కావాలంటే జూస్కో" అని అటూ ఇటూ మెదుల్తున్న రెండు చేపల్ని చూపించేడా మనిషి. అక్కడికొచ్చిన వంటలబోసు వెంటనే కొనేసేడు.

    డబ్‌ డబ్‌ డబ్‌మని చప్పుళ్ళు చేసుకుంటా వెళ్తుంది లాంచీ. గైడు మంగరాజుగాడు ఉన్నయ్యీ లేనియ్యీ జాయింట్లేసి చెప్పుకుంటా పోతున్నాడు. వేగేశ్వరపురం దాటిన లాంచీ తాళ్ళపూడి రేవు దాటుతుండగా టాపెక్కి నిలబడి చాలా దూరంగా ఉన్న ఆ ఊరున్న దిక్కు చూస్తున్న బోసు ముఖంలో నవ్వు మటు మాయమైపోయింది. ఆ బోసునే చూస్తున్నాడు రవికిరణ్. తాటిపూడి కూడా దాటి గూటాల రేవులో లాంచీ ఆగిన వెంటనే గబగబా ఊళ్ళోకి పరుగెట్టిన బోసు కైమా, కోడిపెట్టా, గుడ్లూ కొనుక్కొచ్చి వంట మొదలెట్టేడు. నెమ్మదిగా కదిలింది లాంచీ. కొత్త పట్టిసీమ దాటి పాత పట్టిసీమ రేవులో కొచ్చేటప్పటికి మధ్యాహ్నమైపోయింది. 

    గోదావరికి మధ్యలో ఎత్తయిన ఇసక దిబ్బ. దాని మీదున్న ఈశ్వరుడిగుడి చుట్టూ చెట్లూ, ఆ గుళ్ళని గోపురాల్నీ చూపించిన మంగరాజు "శివరాత్రి తీర్థం, జాతర మా గొప్పగా జరుగుతాయండి. ఇప్పుడు ఎక్కడో ఉంటున్న పోలవరం జమీందార్లు శివరాత్రినాడు స్వామికి అభిషేకం జరిపించడాంకి మట్టుకి దిగుతారండి ఇక్కడికి" అన్నాడు. 

    పొద్దుట చెప్పినట్టు ఎవరికి ఏం కావాలో ఆ వంట రెడీచేసి నవ్వుతా వడ్డిస్తుంటే మతులు పోయినియ్యి అందరికీ. ఆ జనంలో ఉన్న వేముల రవికిరణ్ అనే అతను "ఈడు మామూలోడు కాదు" అనుకుని "ఎప్పుడూ నవ్వుతానే ఉంటన్నావ్ అసలు నీకు కోపం రాదా?" అన్నాడు. 
 
    "ఎందుకు సారూ?" ఎదురడిగి నవ్వేసేడు బోసు. "ఇందాకేంటి ఆ తాళ్ళపూడి దాటతా ఉంటే అదోలాగా చూసేవ్?" అని రవికిరణ్ అడిగేసరికి నవ్వేసిన బోసు "ముందర అన్నాలు తినెయ్యండి తర్వాత మాటాడూకుందారి" అన్నాడు.
 
    బోసు వండిన వంటల్ని ఆవురావురు మంటా తినేసిన జనం మట్టిదాకల్లో మిగిలింది కూడా ఊడ్చుకుని మరీ నాకేసి ఆ ఇసకలో ఒళ్ళెరక్కుండా నిద్రోయేరు. కొన్ని గంటల తర్వాత లేచిన వాళ్ళందరికీ నవ్వుతా మషాళా టీ ఇచ్చేడు బోసు. 
 
    లాంచీ బయల్దేరింది. బంగారమ్మ పేట, కృష్ణారావు పేట దాటుతుండగా ఒక కొండమీద కనిపించిన రెండు పాతకాలం నాటి గుళ్ళని చూపించిన గైడు మంగరాజు "ఇది మహానందేశ్వరుడి కొండండి. పూజార్లులేరండి. అర్చనలు జరగవండి" అని చెప్పుకుపోతున్నాడు. నెమ్మదిగా వెళ్తున్న లాంచీ గోదారికి ఎడం పక్కున్న పైడిపాక దాటుతుంటే ఆవూరికేసి చూసి దణ్ణం పెట్టుకుంటున్నాడు బోసు. కేబిన్‌లోంచి బయటికొచ్చిన రవికిరణ్ బోసుని చూసేడు డిటెక్టివ్‌లాగ.

    ఇటుకలకోట, కంపెనీ, కుడిపక్కున్న గొందూరు, మహిమగల మహాశక్తి పోచమ్మగుడి, దేవీపట్నం దాటుకుంటా సింగన్నపల్లిరేవులో కొచ్చేసరికి సాయంత్రమయ్యింది. శీతాకాలం అవడంవల్ల తొందరగా పొద్దోయింది. ఆవేళ కార్తీకపౌర్ణమి. రేవులో జనం. అరటిడొప్పల్లో దీపాలు పెట్టి గోదాట్లోకి వదుల్తున్నారు ఆడాళ్ళు. 

    "లాంచీ ఇక్కడ ఆపేద్దాం" అన్నాడు సరంగు తారకం.

    "సరే" అన్నాడు ఇంజను డ్రైవరు కోటిలింగాలు.

    లాంచీ టాపుమీదున్న షామియానాలూ, టెంట్లూ తీసుకొచ్చి ఇసకలో పాతేసేరు. గాడిపొయ్యి తీసేరు. కోరుకొండబాబ్జీ బల్బులు తగిలించి జనరేటరు ఆన్ చేసేడు. అమెరికా నించొచ్చిన వాళ్ళు చెంద్రుడ్ని చూస్తా వెన్నెల్లో స్నానాలు చేసొచ్చేరు. లాంచీ ఓనరు గూటాల మూర్తిగారు ఊళ్ళోకెళ్ళి కోడిపెట్టలు కొనుక్కొచ్చేడు. రాత్రి  అమెరికానించొచ్చిన జనం ఇచ్చిన విదేశాల మందు లాంచీలో అందరూ పుచ్చుకున్నారు.

    బాగా రాత్రయ్యింది. గట్టుమీదున్న సింగన్నపల్లి ఊరు నిద్రోతుంది. గోదాట్లో వేటనావల్లో ఇళాయిబుడ్లూ మిణుక్కుమంటా మెరుస్తున్నాయి. రాత్రిపూట వెళ్తున్న కూనవరం టూ రాజమండ్రి పాసింజరు లాంచీ లోంచి జానపదాలు వినపడ్తున్నాయి. ఆకాశంలో చుక్కలు అందంగా మెరుస్తున్నాయి. కొండల్లోంచొస్తున్న చలిగాలి చక్కగా వీస్తుంది. వెన్నెల ఆ లంకలో పూసే పచ్చపువ్వులాగుంది. బోసు దగ్గరకొచ్చిన రవికిరణ్ "ఎందుకో నీ నవ్వుని నమ్మాలనిపించటం లేదు" అన్నాడు డిటెక్టివ్‌లాగ.

    నవ్వేసేడు బోసు.

    తెల్లారింది.

    నిద్రలేచిన జనం అలా ఇసుకలో నడుచుకుంటా వెళ్లి దూరంగా అన్ని పన్లు పూర్తి చేసుకుని స్నానాలూ జపాలూ కూడా చేసుకుని వచ్చేసరికి వేడివేడి ఇడ్డెన్లు అప్పుడే కాచిన నేతిలో ముంచి ఒక్కొక్కళ్ళ పళ్లెంలో వేస్తా కొబ్బరికాయా పునాసి మామిడికాయ పచ్చడి, కారప్పొడి వేసేడు బోసు. 

    "ఇంత ఫ్రెష్ నెయ్యి ఎక్కడ దొరికింది?" బోసునడేడు కొల్లు శ్రీనివాస్.

    "సింగన్నపల్లి ఊళ్ళో వెన్నపూస కొనుక్కొచ్చి కాసేనండి" నవ్వుతా అన్నాడు బోసు. 

    అంతా మరోసారి బోసు ఫలహారాన్ని మెచ్చుకున్నారు.

    టీలూకాఫీలూ తాగడం అయ్యేకా కదిలిన లాంచీ, కొత్తూరు, తెల్లవరం జంక్షనూ, మాందాపురం, వాడపిల్లి, ఎర్రవరం, పైడాకుల మావిడి తూటిగుంటా దాటుకుంటా మధ్యాన్నమయ్యేటప్పటికి టేకూరు రేవులో ఆగింది. ఎత్తయిన ఆ ఏటిగట్టు పైకెక్కేరు. అందంగా ఉందా గిరిజనులుండే ఊరు. పైన వేపచెట్టూ దానికింద పెద్ద సిమ్మెంటు దిమ్మ ఉంది. దాని మీద కూర్చుని గోదార్ని చూస్తుంటే ఎక్కడలేని హాయీ ఆనందం పుట్టుకొస్తున్నాయి.

    అంతా వచ్చి ఆ రచ్చబండమీద అలా కూర్చున్నారో లేదో పరిగెట్టుకుంటా వచ్చిన బోసు అందర్నీ ఓసారి లెమ్మని వీరభద్రంగాడితో ఆ రచ్చబండని సుబ్బరంగా కడిగించేసి అరిటాకులేసి వడ్డించటం మొదలెట్టేసేడు. బొమ్మిడాయిల ఇగురు (ఉడికేటప్పుడూ మధ్యలో పగిల్నియ్యి) పరజలు అనే పిట్టల వేపుడు, పుల్లటిచారు భలేగుంది వంట. 

    భోజనాలూ చెట్లకింద నిద్రలూ అయ్యేక టీ తాగి బయల్దేరుతుంటే "టేకు అడవుల్లోంచి ఈ వూరికి కొట్టుకురావడం వల్ల దీన్ని టేకూరు" అంటారని చెప్పడం మొదలెట్టేడు గైడు మంగరాజు. 

    గోదారికి ఎడం పక్కనున్న చీడూరు, శివగిరి, కొరుటూరు, కొండమొదలూ కుడి పక్కనున్న తెలిపేరు, నడిపూడి దాటాకా తలలెత్తి చూస్తే -

    ఎదురుగా కొండలు... ఆకాశాన్ని అంటుకుపోయున్న పాపికొండలు, రాజమండ్రి దగ్గర రెండు మైళ్ల వెడల్పుండే గోదావరి ఇక్కడికొచ్చేసరికి మా పసలపూడికాలవలాగ సన్నబడిపోయింది. చాలా లోతట అక్కడ. ఎవరో కొండోడ్నడిగితే చెప్పేడు మూడు నులకమంచాల తాడేసినా అడుగు ఇంకా తగలదంట. అంతలోతు. ఎత్తయిన ఆ కొండల్ని తలెత్తి చూస్తుంటే మెడలు నెప్పెడుతున్నాయి. చాలా ఎత్తయిన రెండుగోడల మధ్యలోంచెళ్తు న్నట్టుంది లాంచీ. సుళ్ళు తిరిగే గాలి భూజు భూజు మంటా చప్పుళ్ళు. ఈలోకం దాటి ఇంకో లోకానికెళ్తన్నామనిపిస్తుంది. కొంచెం భయంగా బాధగా కూడా అనిపిస్తుంది.

    గోదారితల్లికి ఎడం పక్కనున్న తెల్లదిబ్బలు (ఆ ఊరి పేరు) కుడి పక్కనున్న తాటివాడ దాటేసరికి పచ్చిమగోదావరి జిల్లా వెళ్ళిపోయి ఖమ్మం జిల్లా వచ్చేసింది. చాలా పొడుగూ, దూరం వున్న ఆ పాపికొండలు దాటి బయటికొచ్చేసరికి పొద్దోయింది. పౌర్ణమి వెళ్ళిన రెండోరోజది. అప్పటికే చెంద్రుడొచ్చేసేడు ఆకాశంలోకి. 

    స్పీడు తగ్గిన లాంచీ గోదారికి ఎడం పక్కకి చేరి ఆగింది. 

    సిమ్మెంటు మెట్లు కనిపించినియ్యి. పైన పెద్ద చింతచెట్టు వరదొచ్చి కొట్టుకుపోడం వల్ల దాని తల్లివేరుతో పాటు అన్నివేళ్ళు బయటికి కనిపిస్తున్నాయి. గైడు మంగరాజు చెప్పుకుంటా పోతున్నాడు. ఆ మెట్లెక్కి పైకెళ్తే వచ్చే ఊరిపేరు పేరంటపల్లట. లోపల శివాలయం ఉందట. పూజారి ఉండడట. దర్శనానికెళ్ళిన భక్తులెవరూ మాటాడకూడదంట. అక్కడ దక్షిణ వెయ్యడాణికి దిబ్బీ ఉండదంట. అసలు కానుకలనేవి సమర్పించకూడదంట స్వామివారికి. ఎనకటికి అక్కడున్న స్వామి బాలానంద అనే మునీశ్వరుడు పెట్టిన రూల్సంట ఇవన్నీ. ఆ గుడిమీద చాలా పుస్తకాలు రాసేరంట స్వామి. వాటిని లోపల గిరిజనులు అమ్ముతారంట. 

    ఆ రాత్రికి అక్కడే మకాం.

    ఆవపెట్టిన పనసపొట్టుకూర, ఆకాకరగాయకూర, పప్పు పులుసూ చేసిన బోసు "దేవుడి గుడి దగ్గరున్నాం గదా అని నీచువండలేదండి" అన్నాడు నవ్వుతా. తిన్న వాళ్ళంతా "అద్భుతం... అమృతం" అన్నారు. 

    మర్నాడు పొద్దుట స్నాలాలు అయ్యీ చేసి గుడిముందు పడ్తున్న జీవధారని తలమీద జల్లుకున్నాక పరమశివుడ్ని దర్శనం చేసుకుని తిరిగి లాంచీ దగ్గరకొచ్చేసరికి పుల్లట్లు, కొంచెం చితపండు కలిపిన శనగపిండి పచ్చడితో రెడీగా ఉన్నాడు బోసు. 

    అవి తిన్న తాటిసతీష్ "నువ్వేం చేసినా గొప్పగా ఉంటందేంటి మాతో పాటు అమెరికా వచ్చేస్తావా?" అన్నాడు. 

    "వద్దులెండి ఇక్కడే బాగుంటది మాకు" నవ్వేసేడు బోసు.

    లాంచీ బయల్దేరింది. 

    గోదార్ని రెప్పార్పకండా చూడాలనిపిస్తంది. ఆ తల్లికి ఎన్ని అందాలు? ఎన్ని ఒంపులు ఎన్ని ఒయ్యారాలు. ఎడం పక్కనున్న తుమ్మిలేరు, మసకపిల్లి, జీడుపాక, శ్రీరామగిరి, కుడిపక్కనున్న కాగీచునూరు, కొయిదా ప్రతిరేవులోనూ ఆగుతుంటే అందరి మధ్యలోకి వచ్చిన గైడు మంగరాజు "లాంచీ ఇలాగ ఆగడానికి కారణం నేలబాట లేదండి జనానికి. ఎక్కడికెళ్ళాలన్నా నీటి మీదే" అని చెపుతుండగా తిర్లాపురం దాటి కూనవరం వచ్చింది లాంచీ. 
 
    ఆరోజుకి కూనవరంలో ఆగిపోయేరు. బోసుకి అసిస్టెంటు వీరభద్రంగాడు తెలీక కూరలో ఉప్పెక్కువ వేసేసేడు. ఇంకో వంటోడయితే చంపేసేవాడు. బోసు మాత్రం వాడ్నేం తిట్టకుండా నవ్వుతా వాడి భుజంమీద చెయ్యేసి మెత్తగా మందలిస్తుంటే చూసిన రవికిరణ "నీ వెనకాలేదో ఉంది కదా?" అన్నాడు డిటెక్టివ్ స్టైల్లో. 
నవ్వుతా తప్పించుకోబోతుంటే "మోసం చెయ్యకు" అన్నాడు రవి. 
 
    "ఇంత ఇదిగా అడుగుతున్నారు గాబట్టి భద్రాచలం వెళ్ళేకా కొంచెం తీరిక దొరుకుద్ది అప్పుడు చెపుతాను" అన్నాడు. 
 
    గైడు మంగరాజు కూనవరం గురించి చెప్పడం మొదలెట్టేడు. మర్నాడు అక్కడక్కడా ఆగి వెళ్తా కిన్నెరసాని దర్శనం చేసుకుని మర్నాడు భద్రాచలం చేరేరు. 
 
    స్నానాలూ జపాలూ అయ్యేకా రాములోరి గుళ్ళోకెళ్ళేరంతా.
 
    తొందరగా వెళ్ళొచ్చేసిన బోసు రాములోరి ప్రెసాదమయిన విప్పపువ్వు తింటుంటే పక్కకి జేరిన వేమూరి రవికిరణ్ "చెపుతాను అన్నావ్ గదా" అన్నాడు. ఆకాశం కేసి చాలా సేపు చూసిన బోసు ముఖంలో నవ్వులేదు. తుఫానుకి ముందు మబ్బుల్తో మూసుకుపోయిన ఆకాశంలాగుంది. 
 
    చెప్పడం మొదలెట్టేడు.
 
    "మేమిప్పుడు రాజమండ్రిలో ఉంటన్నంగానీ మా సొంతూరు మట్టుకి అదిగాదు. దానికి దిగువలో ముప్పైమైళ్ళ అవతలున్న పసలపూడి.
 
    చాన్నాళ్ళక్రితం రాజమండ్రీ వచ్చేసేం మేం. లాంచీల రేవుల దగ్గర కనపడే సుశీల అన్న పేరున్న లాంచీ మాదే. మా అక్కపేరు సుశీల. అదే లాంచీకి పెట్టేడు మానాన్న. పెద్దోళ్ళంతా పాప అనీ, మేవంతా సుశీలక్కా అని పిల్చేవోళ్ళం మా అక్కని. చాలా అందగత్తె మా అక్క. తడిగచ్చు తుడిచిన చీరగట్టినా అందంగా ఉంటదీ పిల్ల అనేవోరంతా. మీ కర్థమయ్యేలాగ చెప్పలంటే సినేమా యాక్టరు చంద్రకళకి దగ్గరగా ఉంటాయి మా సుశీలక్క పోలికలు.
 
    మా ఇంట్లో వాళ్ళతో గొడవపడి మరీ హార్మోనియం నేర్చుకున్న మా సుశీలక్క పచ్చబొట్టూ చెరిగీ పోదూలే అన్నపాట చాలా బాగా పాడేది. చాలా ఎక్కువసార్లు ఆ పాటే పాడేది. దాంతో పాటు సంగీతం మేష్టారు నేర్పిన కీర్తనలూ, శ్రీరామనవమి భజన పాటలు కూడా పాడేది. అదే టీ పొడుం, అదే పందార, అవే పాలు అదేంటో ఆటితో టీ కాచిస్తే తాగినోళ్ళు తెగ మెచుకునేవోరు మా సుశీలక్కని. ఇక మా అక్క వంటల్ని పోలిస్తే నా వంటలు గిరగిరా తిప్పేసి పెంటకుప్ప మీద పారెయ్యాలి. చాలా గొప్పగా ఉంటాయి మా అక్క వంటలు. మధ్యాన్నం అన్నాలయ్యేకా గడప దగ్గర కూర్చుని లేసు పన్లు చేసేది. ఆటిని చూసిన జనం ఎగబడి పట్టుకుపోయేవోరు. ఆళ్ళెవరి దగ్గరా పావళాకాసు పుచ్చుకునేదిగాదు. 
 
    పైడిపాకలో శ్రీహరిరావు అనే అతనికిచ్చి చాలా గొప్పగా జరిపించేరు మా సుశీలక్క పెళ్ళి. మా బావకి తాళ్ళపూడిలో ఏదో ఉజ్జోగం. సువేగా బండ్లో వెళ్ళొస్తుండే వాడంట. మా సుశీలక్క అత్తగారి పేరు నెలపర్తమ్మ అదోరకం మనిషి. మంచిది గాదంట.
 
    మా బావ పండగలకీ పబ్బాలకీ వస్తుండేవాడు మా ఇంటికి. ఓమాలు దీపావళీ పండక్కొచ్చి సిసింద్రీలూ, చిచ్చుబుడ్లూ, బాంబులూ, తాటాకు టపాకాయలూ చేసి నాకిచ్చేడు. దాంతో నాకు చాలా గొప్పోడయిపోయేడు మా బావ. 
 
    కొన్నేళ్ళయ్యింది.
 
    మా అక్కకి పిల్లలు పుట్టడం లేదు. గర్భసంచిలో ఏదో తేడా అంట.
 
    మా బావ మా ఇంటికి రాడం మానేసేడు. 
 
    అత్తగారయిన నెలపర్తమ్మ చాలా హింస పెడ్తుందంట మా అక్కని. అక్కడ బండకష్టాలు పడ్తున్నా బయటికి చెప్పడం లేదు మా అక్క. ఆటిని భరించలేక మా ఇంటికొచ్చేసిన మా సుశీలక్క మూడేసి నెలలపాటు మా ఇంటి దగ్గరే ఉండిపోయేది. ఆ వయసులో మా సుశీలక్క మా ఇంట్లో ఎందుకు ఉండిపోయేదో తెలిసేదిగాదు నాకు.
 
    ఒకరోజు నేను చీపురు పుల్లల్ని ఇంజక్షన్లలాగ చేసి నాతోటి పిల్లల్తో ఆడుకుంటుంటే మా ఇంటి ముందాగిన జట్కా ఎక్కి వాళ్ళ అత్తోరింటికి బయల్దేరిన మా సుశీలక్క "వెళ్ళొస్తాన్రా" అంది. ఆడుంటున్న నేను ఎందుకన్నానో ఏంటోగానీ "ఎళ్ళుగానీ ఇంక రాకు" అన్నాను. అది విన్న మా అక్క నవ్వుకుంది. ఎందుకు నవ్వుకుందో అప్పుడు అర్థం గాలేదు. ఇప్పుడర్థమయ్యి సుకమేంటండీ?
 
    ఆవేళ శ్రీరామనవమి. గుడి గోపురానికి కట్టిన స్పీకర్లలోంచి పచ్చబొట్టూ చెరిగిపోదులే అన్నపాట వస్తుంది. మధ్యాన్నం తర్వాత పైడిపాకలో ఉండే గంటాశేషమ్మ, తాళ్ళ సీతమ్మా అగులు గుద్దుకుంటా మా ఇంటికొచ్చి
మా సుశీలక్క చచ్చిపోయిందని చెప్పేరు. 
 
    ఉన్న పళాన బయల్దేరేం.
 
    పైడిపాకలో వాళ్ళ అత్తోరింటి ముందు మా సుశీలక్క చచ్చిపోయి ఉంది. 
 
    మొక్కాలిపీట మీద కూర్చోబెట్టి వేడ్నీళ్ళ స్నానం చేయించి కొత్తవాయిలు చీరకట్టి పసుపురాసి కుంకం బొట్టెట్టి, ఆ వేళ జూలై మూడు, గురుపౌర్ణమి. గోదారొడ్డునున్న సీమచింత చెట్ల వెనకనించి పైకి లేచేడు నిండు చంద్రుడు. ఆ వెన్నెల్లో ఆ తుమ్మచెట్లకింద ఆ పైడిపాక గోదారొడ్డున గొయ్యి తీసి కప్పెట్టి వచ్చేం మా అక్కని.
 
    మా సుశీలక్క పోయేక మా ఆస్తి పోయింది. దాని పేరెట్టిన మా లాంచీ పోయింది. మా నాన్న పోయేడు. మా అమ్మ పోయింది. అందరూ పోయేరు. అన్నీ పోయినియ్యి. వంటోడి అవతారమెత్తి ఇలా లాంచీల్లో వంటలు చేసుకు బతుకుతున్న నేను మట్టుకి మా బావ ఉజ్జోగం చేసే తాళ్ళపూడి కనపడితే అదోలాగ చూస్తాను. పైడిపాక ఊరొచ్చినప్పుడు మట్టుకి మా అక్కకి దణ్ణవెట్టుకుంటాను అని చెప్పడం పూర్తి చేసిన బోసు ఏడుస్తానే "పాటలన్నీ వింటాను గానండీ ఆ పచ్చబొట్టూ చెరిగీపోదూలే పాటంటే మట్టుకు నాకు ఈరోజుకీ అసహ్యమే" అన్నాడు.
 
  
  
     
Comments