భారం - అబ్బూరి ఛాయాదేవి

    
"నేను వాళ్ళకేం అన్యాయం చేశాను" అని ఏడ్చింది అవని. అవని నా బాల్య స్నేహితురాలు. వాళ్ళాయనా, మావారూ ఉద్యోగరీత్యా ఈ నగరంలోనే ఉండటం వల్ల మా స్నేహం కొనసాగింది. అయితే, తరచు కలుసుకోవడానికి వీలు కుదరనంత దూరంలో ఉన్నాం.మొదట్లో తరచు కలుసుకోగలిగినా, ఇప్పుడు బస్సుల్లో ప్రయాణం చేసేటంత ఒపికా లేదు. ఆటోలో ప్రయాణం చేసేటంత అత్యవసర పరిస్థితులూ లేవెఉ. రిటైరైన కొత్తలో బాగానే గడిచింది. కొంతకాలం దేనికీ లోటులేకుండా. అయితే, బ్యాంకుల్లో వడ్డీరేట్లు పడిపోయిన దగ్గర నుంచి ఖర్చులకి కొంచెం ముందువెనుకలు చూసుకోవలసి వస్తోంది. అనవసరపు భేషజాలకి పోకుండా, ప్రతి విషయంలోనూ, జాగ్రత్త పడవలసి వస్తోంది. ఫోన్లో మాట్లాడుకోవడం మానట్లేదు మేమిద్దరం. అదొక్కటే కదా మనసు విప్పి మాట్లాడుకునే మార్గం మిగిలింది! 

    అవని ఇప్పుడు బాధపడుతున్నది కూతురు అల్లుడూ ప్రదర్శిస్తున్న ధోరణి గురించి. అల్లుడి సంగతి మొదటి నుంచీ తెలిసినా, ఇప్పుడు మరింత బాధపడుతోంది.

    అవని భర్త రాజారావుకి పక్షవాతపు లక్షణాలు వచ్చి, తగ్గి రెండు నెలలు దాటాయి. ఇప్పుడు బాగానే తన పనులు తను చేసుకుంటున్నాడు. కానీ ఇదివరకులా చురుకుగా వెళ్ళి పనులు చేసుకోలేక పోతున్నాడు. ఇంట్లో పనులూ, బయటి పనులూ అన్నీ అవని స్వయంగా చూసుకుంటోంది. అవస్థ పడుతోంది. 

    అవనికి ఒక్కర్తే కూతురు కుసుమ. అపురూపంగా పెంచి పెద్దచేశారు. గ్రాడ్యుయేషన్ అయ్యాక, బాగా పెద్దచదువు చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్న యువకుడికిచ్చి పెళ్ళి చేశారు. మాధవరావుకి తల్లి ఉంది. తండ్రి మాధవరావు పైచదువు చదువుకుంటున్న రోజుల్లోనే పోయాడు. అతనికి ఇద్దరు అన్నలూ, ఒక అక్కా ఉన్నారు. తల్లికి అతను ఆఖరు కొడుకు కావడం వల్ల, బాగా గారాబంగా పెంచడం వల్లా అతని తల్లి దగ్గర చేరిక ఎక్కువ. తల్లి పెద్దకొడుకుల దగ్గర కన్నా తన దగ్గరే ఎక్కువగా ఉండాలని కోరుకునేవాడు. ఆవిడకి అంతకన్న ఏం కావాలి!

    అవని కూతురికి పెళ్ళి చేసిన కొత్తలో అల్లుడితో ఎంతో ఆత్మీయంగా మాట్లాడింది - "బాబూ, మాధవ్ మాకు అల్లుడివైనా, కొడుకువైనా నువ్వే. నాకు కొడుకు లేని లోటు తీరినట్లుగా ఉంది నిన్ను చూస్తే" అని. అతను వచ్చినప్పుడల్లా, అతన్ని అడిగి, అతనికిష్టమైన వంటలూ, పిండివంటలూ చేసి పెట్టేది. అయినా అతను అంటీ ముట్టనట్లు ఉండేవాడు. అతన్ని తన ఆత్మీయతతో ముంచెత్తడానికి అవని ప్రయత్నించేది ఎంతో ఆప్యాయత కురిపిస్తూ. "కొడుకు కొడుకు అంటూ మీ అమ్మ నన్ను తన కొంగుకి కట్టేసుకోవాలనుకుంటోందా?" అన్నాడుట పెళ్ళాం దగ్గర. కుసుమ ఆ మాటల్ని తల్లి దగ్గర అనేసింది. ఆ సంగతి నాతో చెప్పి అవని ఏడించప్పుడు "ఏదోలే, కొందరికి మాట్లాడే తీరు తెలియదు. అదనతా మనస్సుకి పట్టించుకోకు" అని సర్ది చెప్పాను.

    అల్లుడు అవనికి దగ్గర కాకపోవడం మాట అటుంచి, భార్య కుసుమని తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ సమయం గడపనిచ్చేవాడు కాదు. ముఖ్యంగా, తల్లి కూతురి కోసం ఫోన్ చేసినా, తనే ముందు మాట్లాడి, భార్య చేత ముక్తసరిగా మాట్లాడించి, ఫోన్ పెట్టించేసే వాడుట.
    అవని అప్పుడప్పుడు తనబాధ నాతో చెప్పుకునేది.     "నేనేం లోటు చేశాను? ఎందుకంత అంటీముట్టంట్లుగా ఉంటాడు? కుసుమని కూడా నాతో సరిగ్గా మాట్లాడన్నివ్వడు" అని వాపోయేది.
    "ఏదో, పెళ్ళయిన కొత్త కదా, కొన్నేళ్ళయితే వాళ్ళే మీ ఆప్యాయతని అర్థం చేసుకుని దగ్గరవుతారు. ఈ మాత్రానికే ఎందుకు బాధ పడతావ్ ఏదేదో ఊహించుకుని" అని సముదాయించేదాన్ని.

    కానీ అవని బాధ అంతటితో ఆగలేదు. కుసుమకి సీమంతం చెయ్యడానికి పుట్టింటికి తీసుకొచ్చారు. పురుడు అయ్యేవరకు ఉంచకుండా, ఆ సమయానికి మళ్ళీ పంపిస్తానని తీసుకు వెళ్ళిపొయాడు మాధవరావు. అతను ఏం చెబితే అది చెయ్యక తప్పలేదు అవనికీ, రాజారావుకీ. రాజారావు లోలోపల బాధ పడతాడు. అవని నాలాంటి వాళ్ళతో తన బాధ చెప్పుకుంటుంది.

    ఉన్న సమస్యలకి తోడు కుసుమకి సిజేరియన్ ఆపరేషన్ అయింది. అదేదో కుసుమ తల్లిదండ్రుల దోషం అన్నట్లు సాధించి పోశాడు అల్లుడు. కుసుమకి ఏ మాత్రం శ్రమ కలగకూడదని, తన వంటపంతో పాటు పిల్లవాడి ఆలనా పాలనా అంతా అవని చూసుకుంటూంటే, పిల్లవాడు అమ్మమ్మ దగ్గర ఉంటే సహించలేకపోయేవాడు.ఇంట్లో ఇన్నాళ్ళకి మగపిల్లవాడు పుట్టాడు. తనకి లేక పోయినా, తన కూతురికి పుట్టాడని మురిసిపోతుంటే, తన కొడుకు అమ్మమ్మకి ఎక్కడ దగ్గరవుతాడోనని గిలగిల్లాడేవాడు. పిల్లవాడు తన భార్య దగ్గరే ఉండాలనేవాడు. చివరికి పనిమనిషిని ఏర్పాటు చేశాక కొంత స్థిమితపడ్డాడు. "పనిమనిషి కన్నా హీనం అయిపోయానా? మనవణ్ణి ఎత్తుకుని ముద్దూముచ్చటా తీర్చుకునే అదృష్టం లేదా నాకు?" అని విలవిల్లాడేది అవని. పోనీ, కుసుమ భర్తకి నచ్చజెబుతుందా అంటే, భర్తతో వాదించడానికి భయం. అది కప్పి పుచ్చుకుంటూ, భర్తనే వెనకేసుకొచ్చేది. "వాడిని నువ్వు ఎత్తుకుని ముద్దు చెయ్యడం అలవాటయితే రేపు మా ఊరు తీసుకు వెళ్ళాక నీకోసం బెంగ పెట్టుకుంటాడని ఆయన భయం" అని భర్తని సమర్థించిందిట.

    అక్కడికి వెళ్ళాక నాయనమ్మకి చేరికైతే అతనికేమీ ఇబ్బంది అనిపించలేదు! అది సహజం అనుకున్నాడు. పిల్లవాడు కొంచెం ఎదిగాక, 'అమ్మ' తరవాత 'బామ్మ' అనే మాటని తొందరగా నేర్చుకున్నాడు. పుట్టింటికి ఒకసారి దీపావళి పండక్కి వచ్చి రెండు రోజులున్నప్పుడు, అమ్మమ్మని కూడా బామ్మ అంటుంటే, "కాదమ్మా నేను అమ్మమ్మని. ఏదీ 'అమ్మమ్మా'అనూ" అంటూ ముద్దుగా నేర్పించబోతే, వాడు చేతుల్లోంచి గింజుకుని తల్లి దగ్గరికి వెళ్ళిపోయే వాడట. "వీడికి అన్నీ తండ్రి బుద్ధులే వచ్చాయి"అని నాతో చెప్పుకుని బాధ పడింది అవని. 

    మాధవరావుకి ఢిల్లీలో ఉద్యోగం వచ్చేసరికి, అతని కోరికకి తగినట్లుగానే అత్తవారికి దూరంగా ఉండే అవకాశం వచ్చింది. పిల్లవాడు శ్రీకాంత్‌ని అక్కడ స్కూల్లో చేర్పించాక ఇంగ్లీషు, హిందీ తప్ప తెలుగు మాట్లాడడం మానేశాడు. తల్లిదండ్రులిద్దరూ కూడా ముద్దుగా ఇంగ్లీషులోనూ, హిందీలోనూ మట్లాడుతుండేసరికి, వాడికి మాతృభాష పరాయిభాష అయిపోయింది. అమ్మమ్మ మరింత పరాయిదైపోయింది.

    మాధవరావు భార్యతోనూ, కొడుకుతోనూ వరంగల్ వరకూ వచ్చి, తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవడమే గాని హైదరాబాద్ వరకూ వచ్చేవాడు కాదు. కుసుమకి తల్లిదండ్రుల్ని చూడాలని పట్టుపట్టే ధైర్యం లేదు. భర్త ఎంత చెబితే అంత. ఎక్కడున్నా వాళ్ళు సుఖంగా ఉన్నారు. అంతే చాలు అని సరిపెట్టుకున్నారు అవని, రాజారావు.

    అయితే, కొన్నాళ్ళకి అనుకోకుండా కాశీ ప్రయాణం పెట్టుకున్నారు. భార్యాభర్తలిద్దరూ - యాత్రా స్పెషల్‌లో - తెలిసిన దంపతులు బయలు దేరుతుంటే, వీళ్ళుకూడా వెళ్ళి చూడాలని ఉత్సాహపడ్డారు. వెంటనే అవని కూతురికి ఉత్తరం రాసింది - ఫలానా తేదీన బయలుదేరి ఢిల్లీ వస్తున్నాం.అక్కడ మీ ఇంటికొచ్చి కొద్ది సేపు ఉండి , మళ్ళీ కాశీకి వెడుతున్నాం తక్కిన వాళ్ళతో కలిసి. వీలైతే తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంట్లోదిగి, తర్వాత ఢిల్లీ, ఆగ్రా అవీ చూసి వస్తాం" అనీ, మళ్ళీ ఫోన్ చేస్తాననీ రాసింది. ఉత్తరం అందిన వెంటనే, కుసుమ ఫోన్ చేసి "మేము సమయానికి ఢిల్లీలో ఉండటం లేదు. మా ఆయన హయ్యర్ ట్రైనింగ్ కోసం కలకత్తా వెడుతున్నారు. నన్నూ, శ్రీకాంత్‌నీ కూడా తీసుకు వెడుతున్నారు" అని చెప్పిందిట. "అయ్యో, రాకేఆక మీరొస్తూంటే, ఆ సమయానికి మేమూ లేకుండా అవుతోంది, నాకు చాలా బాధగా ఉందమ్మా..."లాంటి మాటలేవీ మాట్లాడకుండా శ్రీకాంత్ ముచ్చట్లు ఏవో చెప్పి ఫోన్ పెట్టేసిందిట. ఆ విషయం ఎంతో బాధపడుతూ చెప్పింది అవని నాతో. నేను ఏమని సముదాయించను. వాళ్ళని ఏమని సమర్థించను? "ఒక్కక్కప్పుడు అలాగే అవుతుంది అవనీ. అన్నీ మనం అనుకున్నట్లు జరుగవు" అని తాత్త్వికంగా మాట్లాడాను - విచారించి లాభం లేదన్నట్లు. తన అన్న పిల్లలతోనూ, మనవలతోనూ, అక్క పిల్లలతోనూ, మనవలతోనూ ఉన్న సాన్నిహిత్యం సొంత కూతురితోనూ, మనవడితోనూ లేకుండా పోయిందన్న బాధ వదలటంలేదు అవనిని. "మా కష్ట సుఖాలు పంచుకోవడానికి ఇంక ఎవరున్నారు?" అని బాధ పడుతోంది తరచుగా.

    ఈ మధ్య రాజారావు ఆరోగ్యం దెబ్బతింది. ఉన్నట్టుండి పక్షవాతపు లక్షణాలు కనిపించాయట. తక్షణం అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళింది అవని పక్కింటి వాళ్ళ సహాయంతో. తరవాత మాకు ఫోన్ చేసి చెప్పింది. ఆ రాత్రి కూతురికి ఫోన్ చేసి చెప్పిందిట తండ్రి పరిస్థితి గురించి. కుసుమ కంగారు పడి తల్లికి మొదటిసారి ధైర్యం చెప్పిందిట. "వీలు చూసుకుని త్వరగా వస్తాం నాన్నగారిని చూడటానికి" అందిట. ఆ మాత్రానికే అవనికి కొండంత ధరియం వచ్చినట్లనిపించి, భర్తని ధైర్యంగా ఉండమని చెప్పిందిట. ఆసుపత్రిలో పది రోజులుండవలసి వచ్చింది. లక్షకి పైగా ఖర్చయింది.

    తండ్రి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాకే కుసుమా, మాధవరావూ వచ్చారు. అతనికి సెలవు లేదనీ, కొడుక్కి కాలేజీలో పరీక్షలు, అందుకని వాణ్ణి ఒక్కణ్ణీ ఇంట్లో వదిలి రావలసి వచ్చిందనీ తాము వెంటనే తిరిగి వెళ్ళాలనీ చెప్పారట. తల్లిదండ్రుల్ని తమతో తీసుకువెళ్ళే ప్రసక్తే తేలేదు కుసుమ. రాజారావు అప్పటికే విల్లు రాసి ఉంచాడట. దాని కూతురికీ అల్లుడికీ చదివి వినిపించాడట. అందులో, తమ తదనంతరం తమ ఇల్లూ, బ్యాంకులో ఉన్న డబ్బూ కూతురికి చెందుతుందని రాశాడుట. "సరేలెండి. ఇప్పుడదంతా వినిపించడం దేనికి?" అన్నాడు మాధవరావు. కూతురు తలవంచుకుని కూర్చుందిట. మర్నాడే తిరుగు ప్రయాణం. అంటీ ముట్టనట్లున్న అల్లుడి ధోరణి చూశాక అవని గుండెల్లో రాయి పడింది. ముందు ముందు తమకి ఎవరు అండగా నిలుస్తారు కష్ట సమయంలో? ఇటు తన అత్తవారింట్లో గాని, పుట్టింట్లోగాని సాయంగా వచ్చి ఉండే వాళ్ళెవరూ లేరు. అందరూ పెద్దవాళ్ళయి పోయారు. ఎవరి బాధ్యతలూ, సమస్యలూ వాళ్ళకున్నాయి. మగ పిల్లలున్నా వాళ్ళు అమెరికాలోనూ, కెనడాలోనూ ఉంటున్నారు.

    రాజారావుని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చాక సాయానికి, ఒక నౌకరు కుర్రవాణ్ణి పెట్టుకున్నా, అవనికి శ్రమ ఎక్కువైపోతోంది. తనకి కూడా బి.పి. ఎక్కువవుతోంది. ఈ మధ్య ఒక కంట్లో శుక్లం కూడా పెరుగుతోందని చెప్పాడుట. ఉండబట్టలేక, కుసుమకి తన సమస్యల గురించి చెప్పుకుందిట. అంతా విని బాబోయ్, నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే భయమేస్తోంది. మీ వల్ల నాక్కూడా బి.పి.పెరిగిపోతోంది" అందిట - తల్లికి స్వాంతన వచనాలు చెప్పడానికి బదులు. అవని వెంటనే ఫోన్ పెట్టేసిందట.
    తరువాత నాకు ఫోన్ చేసి ఈ సంగతంతా చెప్పి, "నేను వాళ్ళకేం అన్యాయం చేశాను?" అని ఏడ్చింది అవని. "కన్న కూతురు కదా అని కష్టసుఖాలు చెప్పుకోవడమే నేను చేసిన పాపమా?... ఎంత అపురూపంగా పెంచి పెద్ద చేశాం దాన్ని! ఎప్పుడైనా ఏఇదైనా లోటు చేశామా? ముందు ముందు మా గతేమిటి?" అంది. నేను వాళ్ళని చూడటానికి వెళ్ళాను. మళ్ళీ అలాగే మాట్లాడింది.     "నువ్వు అంత నిస్సహాయంగా ఉన్నట్లు బాధపడకు. మీ భారం వాళ్ళమీద ఎక్కడ పడుతుందో అని మీ అల్లుడి భయం కావచ్చు. అతనికి నీ కూతురు ఎదురు చెప్పలేదు. వాళ్ళకి సేవ చెయ్యాలని అనిపించినా, చేసే పరిస్థితులు లేకపోవచ్చు. ఆ వాస్తవాన్ని గ్రహించి, మీకున్న దాంతో మీరు సుఖంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. అంతే, పిల్లల్ని కని పెంచి పెద్ద చేశామనీ, మన తదనంతరం మన ఆస్తులన్నీ వాళ్ళకే ఇస్తున్నామనీ వాళ్ళకి చెప్పి లాభం లేదు. బతికి ఉన్నన్నాళ్ళూ మీ భారం మీరే వహించడానికి సంసిద్ధంగా ఉండాలి. మమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకోండి" అన్నాను.
    అవని అమాయకంగా, జాలిగా చూసింది నా వైపు.


Comments