బొమ్మలు - బోయ జంగయ్య

    
"నా దేవున్ని నాకిప్పియ్యండి" అంటూ కలెక్టర్ కార్యాలయపు గేటులోకి ప్రవేశించాడు ఓ నడివయసు వ్యక్తి. వేసవి వేడిని తట్టుకోని ఉద్యోగులు కొందరు బయటకు వచ్చి అదే ఆవరణలో వున్న వేపచెట్టు కింద నిలుచున్నారు. అంతేకాదు, వాళ్ళు మధ్యంతర ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన మాటలు విని అతని వైపు మళ్ళారు.

    "మీరన్నా చెప్పండి అయ్యలారా, నా దేవున్ని నాకిప్పియ్యండి" అన్నాడు.

    అక్కడ నిల్చున్న వాళ్ళపైపు, ఆ తరువాత కలెక్టర్ గారి గదివైపు చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు.
    "నా భూమిని గుంజుకున్నరు. నా రాళ్ళను గుంజుకున్నరు. నా సుత్తెను గుంజుకున్నరు. నేను ఎవరినీ ఏమీ అనలేదు. ఆకర్కి నా దేవున్ని కూడ గుంజుకున్నరు. నేను అడుగుతున్న ఎందుకు గుంజుకోవల్సి వచ్చింది" అంటూ పిడికిలి బిగించి అడుగుతున్నాడు. ఎదనిండా బాధతో ఒగర్చుతున్నాడు.

    చూస్తూ నిలుచున్నారే తప్ప ఎవరూ ఏమీ మాట్లాడటంలేదు. ఏం మాట్లాడతారు. ఓ సంవత్సరం నుండీ జరుగుతున్నదే ఇది. వస్తాడు. అరుస్తాడు. ఎవరూ పట్టించుకోరు. తనంతట తానే తిరిగి వెడతాడు. అంతే కాదు, తిట్టుకుంటూ వెడతాడు. అప్పుడు రాళ్ళవాన వెలిసినట్టు ఉంటుంది.

    ఒకరోజు మధ్యాహ్న భోజన సమయంలో కలెక్టర్ గారు తన గది నుండీ బయటకు వస్తున్నప్పుడు ఎదురెళ్ళి
    "అయ్యా, నా దేవున్ని నాకిప్పియ్యండి. నీ కాళ్ళు పట్టుకుంట తండ్రి" అంటూ కాళ్ళ మీద వంగాడు.     "ఏయ్ వద్దు వద్దు" అంటూ వెనక్కి జరిగాడు కలెక్టర్. అతని వాలకం గ్రహించిన కలెక్టర్ గారు సి.సి ని పిలిచి -     "విషయం కనుక్కో" అన్నాడు.     "సరే సర్" అని తలవూపి అతనివైపు చూస్తూ పక్కకు జరగమని సైగ చేశాడు. అతను జరగకుండానే ధనస్సులాగ వంగి నిల్చుని-     "నా దేవుడు నాక్కావాలే" రొమ్ము బాదుకుంటూ అన్నాడు.

    కలెక్టర్ గారు ఆమాట విని నవ్వుతూ
    "భూమి అడుగు, ఏదన్న లోను అడుగు కానీ నేను దేవున్ని ఎక్కడినుండితేను" అనుకుంటూ నవ్వుకున్నాడు.     "ఏ ఊరు" అడిగాడు కలెక్టర్ అతని భుజం మీద చేయి ఉంచుతూ.

    "పంతంగి" అన్నాడు చేతులు జోడిస్తూ.     సంబంధిత ఎమ్మార్వోతో మాట్లాడి నోట్‌తీసుకొని     "ఈయన నీ పని చూస్తాడు" అన్నాడు ఆప్యాయత కనబరుస్తూ.

    "ఎవరూ చూడరు తండ్రి. ఆ ఎమ్మార్వోకూడ వాళ్ళవైపే వున్నడు. వాళ్ళకెయ్యే మాట్లాడుతుండు. నాకు మీరే దిక్కు తండ్రి" అన్నాడు వినయంగా.

    కలెక్టర్ అతని వైపు పరిశీలనగా చూశాడు. సగం నెరిసిన తల, పెరిగిన గడ్డం, పాదాలకు చెప్పులు లేవు. కాషాయపు పంచె కట్టి అదే రంగు జుబ్బా వేసుకున్నాడు. అవి దుమ్ముపట్టి వున్నాయి. కాయకస్టంలో పెరిగి తరిగిన శరీరం. అతను ఆవేశంగా మాట్లాడుతూ వుంటే గొంతు నరాలు తేలి కదులుతూ వున్నాయి. మాటను పట్టి కదులుతున్న కనుగుడ్లు, నిక్కి, నీలుగుతూ కాలి బొటిమన వేలి మీద నిల్చుని ఆవేదనగా అరుస్తూ వున్నాడు. శరీరం అంతా చెమటతో తడిసిపోయింది.

    కలెక్టర్ కారులో కూర్చోగానే కారు కదిలింది. అతని కారుకు అడ్డంగా తిరుగుతూ అదేమాట. నా దేవున్ని నాకిప్పియ్యండి అన్నాడు. అటెండర్ అతన్ని పక్కకి జరిపాడు. కారు వెళ్ళిపోయింది. అతను మరింత ఆవేశంతో అటెండర్‌వైపు, అక్కడున్న వాళ్ళ వైపు చూస్తూ, రెచ్చిపోయి -

    "మీరంత దొంగలు, మంది నోళ్ళు కొడతరు. ఈ దేశంలోని చదువుకున్న వాళ్ళంతా మోసగాళ్ళు. వోటుకాడ మోసం, కట్టేకాడ మోసం, తొవ్వేకాడ మోసం, బడి కాడ మోసం, గుడి కాడ మోసం, మోసం, మోసం. ఇందరు వుండి నాదేవున్ని నాప్పియ్యటం లేదు. అంటే మీరంతా మోసగాళ్ళే" అంటు అందరివైపు చూపుడూ వేలును చూపిస్తున్నాడు. మీరంతా మోసగాళ్ళే అనేసరికి విధిలేక చిరునవ్వు తెచ్చిపెట్టుకుంటూ ఒక్కొక్కరు అక్కడినుండీ కదులుతూ ఉన్నారు.

    కలెక్టర్ సి.సి అతన్ని పిలిచి దరకాస్తు రాసి అతని సంతకం తీసుకున్నాడు.
    "నీ పేరు నాకు తెలుసు" అని వేలిముద్ర పక్కన ఎంకులు అని రాశాడు.     "ఎందుకు తెలియదు. ఎప్పటి నుండో తిప్పుతనే వుంటిరి. నాదేవున్ని నాకిప్పియ్యకపోతే చూడు. అసెంబ్లీ ముందు ధర్నా చేస్తా, ఢిల్లీకి వెళ్ళి దేశ ప్రధానిని అడుగుత, ఈ ఎంకన్న అంటే ఏమనుకున్నరు" అంటు ఓసారి గడ్డాన్ని చేత్తో దువ్వుకున్నాడు. అప్పుడు అతండు గాలిదుమారంలో ఊగుతున్న చెట్టులాగున్నాడు.

    ఈలోపు సి.సి.వైర్‌లెస్ సెట్ ఆన్ చేసి -
    "హలో హలో యం.ఆర్.ఓ చౌటుప్పల్ రెస్పాండ్ టూ జిల్లా ఆఫీస్, సి.సి.ని మాట్లాడుతున్నా ఓవర్"     "హలో మాట్లాడుతున్న సర్, ఓవర్"     "మీ పక్క ఊరి పూజారి పంచాయతీ ఏమైంది? దాని రిపోర్ట్ అర్జెంట్‌గ మెసెంజర్ ద్వారా పంపండి. ఓవర్"     "సరె సర్. అతను అక్కడికొచ్చి గొడవ చేస్తున్నాడా. పంపిస్తాను సర్. ఓవర్"

* * *  

    అదే వూరికి చెందిన ఓ కుటులంబంలో ఇద్దరు అన్నదమ్ములు. పెద్దవాడు ఎంకులు, చిన్నవాడు ఎల్లయ్య. ఎల్లయ్య పాతికేండ్ల వయసు నుంచే ప్రతి శనివారం పూనకం వచ్చి కొలువు చెప్పటం మొదలు పెట్టాడు. మువ్వల నిక్కరు తొడిగి, చేతిలో చెర్నకోల పట్టుకుని ఒంటికి పసుపు రాసుకుని, నడుంకు గవ్వల పట్టి పెట్టుకొని, సుద్దులు చెపుతాడు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు తమతమ సమస్యలతో వచ్చి బియ్యం, పైసలు ఇచ్చి తమ కష్టాలు తీర్చమని మొక్కుతుంటారు. దేవతలను తల్చుకోని వీభూతి పెడతాడు. తగ్గినోళ్ళకు తగ్గుతుంది. మరికొందరికి అక్కడికి వచ్చిన తృప్తితో తగ్గినట్లు అనిపిస్తుంది. అందువల్ల అప్పటి నుండీ ఈ తంతు నడుస్తూనే వుంది. అతనికి బట్ట పొట్ట గడుస్తూ ఉంది.

    పెద్దవాడు ఎంకులు, ఆయన భార్య మరి కొన్ని జంటలు కలిసి, ఊరి పక్కమ్మటే వున్న శనిగలగుట్టకు వెళ్ళి రాళ్ళు, కంకర కొట్టుకుని అమ్ముకుంటూంటారు. ఎంకులు విశ్రాంతి దొరికినప్పుడు ఓ బండకు ఓ కోతి బొమ్మను చెక్కాడు. దానికి కుంకుమ రుద్ది హనుమంతుడు అని మొక్కుతూ అక్కడికొచ్చిన వాళ్ళతో మొక్కిస్తూ వుండేవాడు. రాళ్ళు, కంకర తీసుకెళ్ళడానికి చుట్టుముట్టు ఊళ్ళవాళ్ళే కాకుండా, హైదరాబాద్ నుండి కూడా వచ్చేవాళ్ళు. అలా లారీవాళ్ళు పూలు వుంచి, కొబ్బరి కాయలు తెచ్చి కొట్టడం, దాని దగ్గర పడివున్న ఎంకులుకు ఒకటి రెండు రూపాయలు ఇవ్వడం జరుగుతూ వచ్చి ఓ సంవత్సరం తిరిగేసరికి అక్కడ ఓ భక్తి వాతావరణం ఏర్పడి, అక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. కొన్నాళ్ళ తర్వాత అదేగుట్టకు ఇరుకైన చరికలో నరసింహుడు వెలసినట్లుగా ఎంకులు అందరికీ చెప్పాడు. మొదట ఎవరూ నమ్మలేదు. ఆ తరువాత అక్కడికి వచ్చిన గ్రానైట్ పాలిష్ కొంపెనీ వాళ్ళు పరీక్షించి చూడగా ఆ చరికలో సింహం రూపం కనిపించింది. సన్నటి చరికలో సింహం తల చెక్కడం మనిషి పని కానేకాదు అంటూ, అక్కడ దేవుడే వెలిశాడు అన్న నిర్ణయానికి వచ్చారు. ఆ విషయం హైదరాబాద్ వాళ్ళకు తెలిసింది. అక్కడి వ్యాపారులు, ముఖ్యంగా పాల వ్యాపారస్థులు, కల్లు వ్యాపారస్థులు రావటం, కానుకలు సమర్పించి వెళ్ళటం జరుగుతూ వుంది. మొదట చూసి అందరికీ చెప్పిన ఎంకులే అక్కడ పూజలు చేస్తూ వచ్చాడు.

    ఇక అంతే. ఎంకులు ఎంకన్న అయ్యాడు. అర్చన చేసుకుంటూ రాళ్ళు కొట్టడం మానేశాడు. ఎంకన్న వేషభాషలలో మార్పు వచ్చింది. పట్టణాలనుండి మార్వాడీ వాళ్ళు రావడం, స్వామివారికి బట్టలు, నగలు తేవడం జరుగుతూ వుంది. పెద్ద పెద్ద వాళ్ళ రాకతో పెద్ద పెద్ద పందిళ్ళు వేయించి ఉత్సవాలు జరుపుతూ వచ్చారు. శనిగల గుట్టకు వెలిశాడు కాబట్ట్ శనిగల నర్సింహస్వామి అని నామకరణం చేశారు. ముందు గ్రానైట్ కమెపెనీ వాళ్ళు గుడ్డి కట్టించారు. ఆ తర్వాత మార్వాడీలు ధర్మ సత్రాలు కట్టించారు. పూజారి ఉండడానికో చిన్న ఇల్లు కట్టించారు. ఆ ఇంట్లోనే ఎంకన్న ఉంటూ వచ్చాడు. సూర్యోదయంతో సుప్రభాత గీతాల పాటలు మైకు ద్వారా వినిపిస్తున్నారు. గుట్ట చుట్టూ వున్న బావుల దగ్గరి దొడ్లలోని పశువులు స్నగీతాన్ని వింటూ నెమరు వేస్తూ ఉంటాయి. చుట్టూరా చెలుకల్లో, చెట్ల కింద ఎడ్ల బండ్లు, జీపులు, కార్లు, ప్రతి రోజూ ఆగేవి. మరీ శనివారం రోజుల్లో జనమే జనం. నిత్యం అక్కడ జాతరే జాతర. మెయిన్ రోడ్డు నుండీ గుట్ట వరకు రోడ్డు వేశారు. ఎటు రెండుకిలోమీటర్ల దూరంలో వ్యవసాయ బావుల దగ్గర పంట పండించడం మానేసి ఆ బావుల్లోని నీటిని బిందెల లెక్కమ్మటి అమ్ముకోసాగారు. పొలాల్లో డేరాలు వేసి స్థలం రోజువారీగా అద్దెకిస్తున్నారు. చెట్ల నీడలను కూడా రోజు లెక్కన అద్దెకిస్తున్నారు. అక్కడ ప్రతీది వ్యాపారం అయింది. వచ్చిన వాళ్ళకు వంట పనుల్లో సహాయం చేయడానికి ఊళ్ళో ఆడ, మగ వచ్చి రోజు కూలీగా పనిచేసేవారు. ప్రతి వాడి చేతిలో పైసలు తిరగడం మొదలైంది. పట్టణపు అలవాట్లు, ఆకర్షణలు అన్నీ పల్లెకు చేరాయి. తాగుడు, జూదం, తందాన ఒకటేమిటి అన్నీ అందుబాటులోకొచ్చాయి.

    కట్టు,బొట్టు మారి వేష భాసల్లో ఎంతో మార్పు వచ్చింది. ఒక్కసారె ఆ వూరు మారిపోయింది. ఎస్.టి.డి.ఫోన్ వచ్చింది. దూరదూరం నుండి వచ్చి ఓ రాత్రి నిద్ర చేసి వెడుతూ ఉన్నారు. రోజుకో కిరాణం సర్కుల లారీ వస్తుంది. గ్రామ పంచాయితీ ఆదాయం పెరిగింది. గ్రామ సేవకులను, ఊడ్చేవాళ్ళను పెట్టి, ఊరిని శుభ్రంగా వుంచుతున్నారు. ఊళ్ళోకి గుర్రపు బండ్లు, ఆటోలు వస్తూ పోతూ ఉన్నాయి. అక్కడ అన్నీ పాత నమ్మకాలు - కొత్త కోరికలు.
    ఎంకన్నకు క్షణం తీరిక లేదు. రాబడి పెరిగింది. పూజలు, అర్చనలు, అభిషేకం, లారీల కొద్దీ కొబ్బరికాయలు, అగరొత్తులు, హారతి కర్పూరపు బిళ్ళలు, కుంకుమ కుప్పలు, రోజూ అక్కడ తిరునాళ్ళ సందడి. ఊరి దశ తిరిగిపోయింది. దేవాదాయ శాఖ వారు ఓ కమిటీని వేశారు. ఆ ఊరిపెద్దలను అందులో సభ్యులుగా వేశారు. మొత్తం మీద మూడు దీపాలు, ఆరు హారతి కర్పూరపు వెలుగుల్లా వెలిగిపోతూ ఉంది ఆ దేవస్థానం.

    ఒకరోజు ఉన్నట్టుండి గుడి దగ్గరి పూజారిని తొలగించారు. అతను ఉంటున్న ఇల్లును ఖాళీ చేయించి అందులో కొత్త పూజారిని ఉంచారు. అనుకోని సంఘటనకు ఎంకన్న ఖంగుతిన్నాడు. 

    ఎందుకు అని ప్రశ్నిస్తే ఎవరూ జవాబు చెప్పలేదు.

    "నీకు చదువు రాదు. శ్లోకాలు చదవటం లేదు. భక్తుల గోత్రాలు అడిగి తెలుసుకొని వాళ్ళ పేరుమీద అర్చనలు చేయలేక పోతున్నావు. కాబట్టి ఇక్కడికొస్తున్న భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందుకే తొలగించటం తప్పనిసరి అయింది" అన్నాడు ఆలయ కమిటీ పెద్ద.

    "అసలు దేవున్ని నిలిపింది నేను. పూజలు మొదలు పెట్టింది నేను. ఊరూరా ప్రచారం చేసింది నేను. నేనెట్ల ఇక్కడనుండి పోతాను? పోను" అని గర్భగుడిలోనే కూర్చుండి దేవుని బొమ్మవైపు తీక్షణంగా చూశాడు.
    కొత్త పూజారి అర్చనలు సాగిస్తూనే ఉన్నాడు. ఎవరికి అర్థం కాని శ్లోకాలు వల్లిస్తూనే ఉన్నాడు. ఎంకులు మౌనంగా కూర్చొన్నాడు. అది గమనించిన కమిటీ వాళ్ళు అతను అలా కూర్చోవటం కూడా నచ్చక ఆఖరి బాణం సంధించారు.     "నీవు దళితుడివి. కనుక పూజారిగా వుండకూడదు. గర్భగుడిలోనూ కూర్చోకూడదు" అన్నారు.     అదివిన్న ఎంకులుకు మతి పోయినట్టయింది. ఎంకన్న ఒక్కసారే ఎంకులు అయిపోయాడు.
    "అది సార్ కథ. ఇక అప్పటి నుండి నా దేవున్ని నాకిప్పియ్యండి అని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వుంటాడు. పెడితే తింటాడు లేకుంటే లేదు. ఆయన భార్య ఎప్పటిలానే గుట్టకు కంకర కొట్టి పూట గడుపుకుంటుంది" అని ఎం.ఆర్.వో. రిపోర్టును కుదించి, నోటు రాసి కలెక్టర్‌కు సమర్పించాడు సి.సి.

* * *     

    తాటివనం మధ్యనుండి దండుబాట.దండుబాటనుండి ఊళ్ళోకి వెళుతూ వుంటే ఓ వాగు. వాగును దాటి రెండు ఫర్లాంగులు వెడితే గవర్నమెంటు వాళ్ళు కట్టించిన కాలనీ. దాన్ని దాటిపోతూవుంటే పాత ఊరి పక్కెమ్మటె దళితుల ఇండ్లు. ఆ ఇండ్లలో ఓ పెంకుటిల్లు ఎంకులుది. ఇంటి ఎదురుగా ఓ వేపచెట్టు. ఇంకొంచెం దూరంలో చేదబావి. తవ్విన కొత్తలో మాత్రమే నీరు ఊరి ప్రస్తుతం ఎండిపోయింది. బోర్లు వేయడంవల్ల నీరు అడుగుకు పీక్కపోయి ఎండిపోయిందని కొందరు, వర్షాలే సరిగలేంది బావులల్లో నీళ్ళు ఎట్టొస్తయని మరికొందరు అన్నారు.

    "ఎవరేమన్నా నీళ్ళూరని బావిని పూడపోయక తప్పదు" అన్నది ఎంకులు భార్య దుర్గమ్మ. జీవితం నేర్పిన పాఠాల మీద ఆత్మ విశ్వాసాన్ని పెంచుకున్న మనిషి ఆమె.
ఒకరోజు ఎక్కడికో పోయి తిరిగొచ్చిన భర్తతో -     "ఎన్నాలిట్ల తిరుగుతవు. నేను ఒక్కదాన్ని పనిచేస్తే పూటకెల్తదా?" అడవినుండి వచ్చిన్న దుర్గమ్మ జాలారిలో ఉన్న తొట్టెలోని నీళ్ళను ముఖం మీద చల్లుకుంటూ అంది. వేలాడబడ్డ నల్లపూసల పేరును రవికె ముడి కిందికి దోపుకుంది.
    
    ఎంకులు ఎల్లమ్మ తల్లి అంటూ వేపచెట్టుకు చేతులెత్తి దండం పెట్టాడు.
    "మొక్కు మొక్కు దాన్ని కొన్నోడు రేపు కొట్టుకపోతడుగాని" అంటూ చేతి గాజులను అటూఇటూ జరుపుకుంది. ఈ చెట్టు అమ్మితే వచ్చే డబ్బుతో వెండి కడియాలు చేయించుకోవాలని ఆమె కోరిక.

    "దేవ దేవ అనుకుంటూనే తిరుగు. ఆ ఏశం, ఆ గడ్డం, ఈడెవడో పిచ్చులోడు అని జనం రాళ్ళతో కొట్టెకాలం వచ్చింది" అంది మళ్ళీ తానే. అప్పుడు ఓ మాదిరి ఏవగింపు, కోపం రెండూ ఒకేసారి కనిపించాయి ఆమె ముఖంలో. కొంగుతో మోచేతులను తుడుచుకుంటూ వుంది. ఆమె అలికిడికి దడి చాటున పడుకున్న కోడి, కోడిపిల్లలు వచ్చి దుర్గమ్మ చుట్టూ చేరి అరుస్తున్నాయి. అది చూసి ఆమె ఇంట్లోకి వెళ్ళి ఇన్ని నూకలు తెచ్చి వాటిముందు చల్లింది. అవి వాటిని ఏరుక తింటూ ఉంటే, కడుపు నిడుతుంటే కలిగే తృప్తో, త్వరగా తినాలనే ఆతురతో కనిపించింది. అవి అదో మాదిరిగా శబ్దం చేస్తున్నాయి. తాను అడవి నుండి తెచ్చిన ఆకును మేక ముందేసింది. అది తోక ఆడిస్తూ మేస్తూ ఉంటే దాని పిల్ల పాలు చీకుతూ తోకాడిస్తుంది. వాటినే చూస్తున్న దుర్గమ్మకు మనసులోని ప్రేమ కళ్ళలోకి పాకి తడిగా మెరిసింది.
ఆప్పుడామె ఎదలో ఏదో బాధ కదిలింది. 

    దుర్గమ్మ ఇంట్లోకి వెళ్ళి చెంబులో నీళ్ళు తెచ్చి ఎంకులుకిస్తూ -
    "ఇక ఆదేవున్ని మరిచిపో. మనది కానిది మంది పాలైందాన్ని ఊర్కె ఆలోచిస్తే ఏమొస్తది. మనో వ్యధ మంచిది కాదంటరు పెద్దలు. నా ఇల్లు ముంచకు. పిల్లాజెల్లా లేనిదాన్ని" అంది మేకపిల్ల వైపు చూస్తూ.

    చెంబెడు నీళ్ళు తాగి ఖాళీ చెంబును భార్యకిస్తున్నప్పుడు భార్యముఖంలోకి చూశాడు. ఏదో బాధ ఎదలోనుండి కళ్ళలోకి పాకుతున్నట్టు గ్రహించాడు.
    "పిల్లజెల్ల లేదంటె నేనేంచెయ్యను. నీవే కంటలేవైతివి" అన్నాడు కాస్త నవ్వునటిస్తూ ఆమెను నవ్వించాలన్న ఉద్దేశంతో.     ఆ మాట అనగానే ఆమెకు రోషమొచ్చి -
    "ఇత్తనాన్ని భూమి ఎప్పుడూ దాచుకోదు. అంతేకాదు, అదును,పదును, అవసరం దాన్ని గుర్తించి మసలుకోవాలె." కట్టె విరిచినట్టయింది.

    మరునాడు తెల్లవారుజామున లేచి తట్ట,పార్ అందుకొని బావిని వూడబోస్తూ ఉంది. మంచి పొడగరి. పొడవుకు తగ్గ లావు. కాయకష్టం చేసి రాతి శిల్పంలా ఉన్న దుర్గమ్మకు బావిని పూడ్చడం ఓ పనేమీ కాదు. అంతకు ముందుకూడా భార్యా భర్తలు ఇద్దరే ఆ బావిని తవ్వారు. బండ కనిపించగానే లోతు తవ్వలేక పోయారు. ఎంకులు వచ్చి దుర్గమ్మ దగ్గర పారను తీసుకున్నాడు. దుర్గమ్మ గోచిని తీసి, నడికట్టును వదులు చేసికొని, నుదుటి చెమటను కొంగుకు అద్దుకుంది. తడిసిన వొంటికి రవికె అంటుకు పోయింది. చెమట మట్టిని కడుక్కోవడానికి జాలారులోకి వెళ్ళింది. ఆమెది ఎండుకొబ్బరి లాంటి నల్లని శరీర ఛాయ.

    "నీరూరని బావెందుకు?" అని తనలో తానే అనుకుంటూ తలమీద నీళ్ళచెంబు గుమ్మరించుకుంటున్న శబ్దం.
    "నన్ను పిలిచితివా" అని అడిగాడు ఎంకులు జాలారు వైపు చూస్తూ.     "బాగుంది నేనేదో అనుకుంటే నిన్ను జాలాట్లోకి ఎందుకు రమ్మంట."     "ఒళ్ళు రుద్దటానికి గట్టా" అన్నాడు ఎంకులు ముసిముసిగ నవ్వుతూ.     "సక్కదనం సల్లంగుండా. అంతకు నోచుకున్నాం మనం. ఓ దిక్కు సన్నసులమై తిరుగుతుంటిమి గాని, అదును పదును పట్టింపె లేదాయె" అనుకుంటూ చిరాకుతో మరో చెంబు గుమ్మరించుకున్న శబ్దం వచ్చింది.     "ఇకనుండి నీవు పొద్దంత పనికి పోయి, రాత్రీలు ఇంటిదగ్గర ఉండకపోతివి నీ సంగతి చెపుత" అంటూ దడి మీద చీరను అందుకుని ఒంటికి చుట్టుకుని ఇంట్లోకి నడిచింది.     ఎంకులుకు నోటి మాట రాలేదు.

* * *

    పూజారి విషయం పునరాలోచించవలసిందిగా, అంతే కాకుండా మొదటి నుండి పుజారిగా వున్న ఎంకులుకు అక్షరజ్ఞానం కల్పించి అర్చక వృత్తిలో శిక్షణ ఇప్పించి రాజ్యాంగ పరమైన అతని ప్రాథమిక హక్కులను కాపాడవలసిందిగా ఆలయ కమిటీవారికి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

    అది విన్న ఎంకులు ముఖం విప్పారింది. ఆ రోజు రాత్రి పొద్దుపోయేవరకు గ్రామ పంచాయతీ ఆవరణలో గుట్ట పూజారిని గూర్చి తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. కలెక్టర్ ఆదేశం గూర్చి తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

    ఎంకులు తానే పూజలు నిర్వహిస్తానని పట్టుబట్టాడు. ఒక్కప్పుడు పట్టు పంచ, పట్టు ఉత్తరీయంతో ఉండే ఎంకులు ఇప్పుడు మామూలు గుడ్డలతో ఉన్నాడు. ముంపటి కళ అతనిలో లేదు. కలెక్టర్ ఆర్డరొచ్చి ముఖాన కొంత కళను తెచ్చిపెట్టింది.

    ప్రభుత్వ ఆదేశాలు ఆచరణ సాధ్యమైనవి కావు అని పక్కకు నెట్టారు. అంతే కాదు, ఎంకులు గుడికంటె ముందు నీవు బడికి పో అని ఎద్దేవా చేశారు.

    ఆలయ కమిటీ వారు తమ పూర్వపు నిర్ణయంలో మార్పులేదన్నారు. కావాలంటే ఎంకులు మొదటినుండి అక్కడనే పడివున్న మాట వాస్తవం. అతను చేయగల్గిన పారిశుద్యపు పనుల్లో ఏదో ఒకటి ఆయనకు, ఆయన భార్యకోటిచ్చి వాళ్ళ పూట గడిచేటట్లు చూడాలని ఈసారి చేసిన తీర్మానాన్ని మరోసారి చదివి వినిపించారు.
    ఎంకులు ఎదలో భాదాపూరిత శ్వాస బయటకు తన్నుకొచ్చి కళ్ళలో నీరై నిలిచింది. అంతేకదా అని ఆ కులస్థులూ అన్నారు.

    దళితవాడంతా ఎంకులుకు వ్యతిరేకంగా ధ్వజమెత్తారు. ఎవరైనా తీర్మానానికి ఒప్పుకోక తప్పదు. అయినా ఎంకులులో ఎంతో మార్పు వచ్చింది. అతను ఎవరినీ లెక్కచేయటం లేదు. అతనిలో ధనాశ పెరిగింది అని అతని కులస్థులే అన్నారు. కమిటీ తీర్మానానికి ఖంగుతిన్న ఎంకులును తన కులస్థుల మాటలు చాలా కుంగదీశాయి.

    వీళ్ళు ఇట్లా అనడానికి కారణం కేవలం ఈర్ష్యయే తప్ప తాను చేసిన నేరం ఏమీ లేదని, ఈర్ష్య భారతం నాటి కాలంలో వుంది, ఇప్పుడూ వుంది. నాడు లక్క మేడకు నిప్పు, నేడు నా బతుక్కె నిప్పు అనుకుంటూ ఓసారి కళ్ళు మూసి తెరిచాడు.     నేల మీద కూర్చుని తన రెండు మోకాళ్ళమీద తల వంచుకుని చేత కట్టెపుల్లతో నేలమీద దేవుని బొమ్మ గీస్తూ గతంలోకి వెళ్ళిపోయడు. కోస్తాలో తుఫాన్ కారణంగా అంతటా వరుసగా ముసురు కురుస్తూ వుంది. ఏ పనుల సాగడం లేదు. ఎంకులు అతని భార్య దుర్గమ్మ గుట్టమీదనే కమ్మల గుడిసెలో ఉండిపోయారు. గుట్టకున్న పెద్ద పెద్ద గుండ్లను తీసుకెళ్ళడానికి గ్రానైట్ కమెపిన వాళ్ళ లారీలు, క్రేబ్‌లు అక్కడికి వచ్చిపోతూ వున్నాయి.     ముసురు కారణంగా ఆ నాలుగు రోజులు వాటిని అక్కడే వుంచి డ్రైవర్లు, క్లీనర్లు కొంత దూరంలో వున్న బావి దగ్గరి కొట్టంలో ఉంటున్నారు. తన గుడిసె ముందు పక్కమ్మటె ఉన్న మూడు పెద్ద గుండ్లమీద ఎంకులు చూపు పడింది.     అక్కడ దేవాలయం వెలిసింది. తనను మాత్రం పాము మింగింది. మళ్ళి తోకదగ్గరకు రావాల్సి వచ్చింది అంకుంటూ ఓ బరువైన శ్వాశ వదిలాడు.     అంతలోనే పెద్ద పేలుడూ శబ్దం!     ఊరంత ఉలిక్కి పడింది!!     కమిటీ సభ్యులందరు భయంతో వణుకుతూ లేచి నిల్చున్నారు.     కొంతసేపటకి ఆలయపు పనివాళ్ళు పరిగెత్తుకొచ్చి-     "గుడిని పేల్చేశారు" అని బిక్కుబిక్కు మంటూ నిలుచున్నారు. చావు తప్పి బయటపడ్డాం అన్నట్లు చూస్తున్నారు.

    "ఎవరు?" ఆలయ కమిటీ పెద్ద అడిగాడు. ఆయన గొంతులోనూ కంపరముంది.     "తెలియదు" అన్నారు. వాళ్ళలో ఇంకా భయం తగ్గలేదు.     "మీరంతా ఉండి ఏం చేశారు?" అన్నాడు ఏదో చంపుకోలేని బింకంతో ఆలయ కమిటీ అధ్యక్షుడు.     "మేము హనుమాన్ పందిరి కింద హరికథ వింటూ కూర్చున్నాం" అన్నారు.     ఇంకా వాళ్ళకు వణుకు తగ్గలేదు. బిత్తర పాటు పోలేదు.     "ఎవరు చేశారీ పని?" అన్నప్పుడు పెదాలు వణుకుతున్నాయి.     అదే తెలియదు అన్నట్టు చూశారు.     అప్పుడు వాళ్ళ గుండె అదురుతున్నట్టు వాళ్ళ చూపులు చెపుతున్నాయి. అందరి చూపులు ఎంకులు మీద ఆగినాయి.     ఎంకులు చెంపలేసుకుంటూ, కంటనీరు పెడుతున్నాడు.     "పదండి చూద్దాం" ఆలయ కమిటీ అధ్యక్షుడు అన్నారు.     "ఇంత రాత్రి వద్దు ఇంకేమి జరగనున్నదో" అని సర్పంచ్ అనగానే అందరూ ఆగిపోయారు.     ఒక్క ఎంకులు మాత్రం నెత్తీ,నోరు కొట్టుకుంటు గుడివైపు పరిగెత్తాడు.

    ఎప్పటిలాగానే ఆ రాత్రి తెల్లవారింది. ఊరుఊరంతా గుట్టదగ్గరికి చేరింది. అక్కడ రాళ్ళు రప్పల కుప్ప మిగిలింది.     జరిగిన విషయాన్ని గ్రామాధికారి పోలీసులకు తెలియ పర్చగా, పోలిసులొచ్చి ఆరా తీస్తున్నారు.     ఎవరూ, ఎవరు పేలిచింది చెప్పలేక పోతున్నారు.     అది జరిగినప్పుడు ఎంకులు తమ ముందే ఉన్నాడని ఆలయ కమిటీ తమ ప్రాథమిక సాక్ష్యంలో తెలిపింది. అయినా పోలీసులు ఎంకులుపై నిఘా ఉంచారు. ఊరంతా ఎవరికి తోచినట్లు వాళ్ళు అనుకున్నారు.     పోలీసులు ఏదీ తేల్చలేక 'అన్నల పనే' అని కేసు నమోదు చేసుకున్నారు. అది విన్న అన్నలు "ఎవరి మత విశ్వాశాలను గాయ పర్చటం మా విధానం కాదు" అని ప్రకటించారు.     "ఏపచెట్టు ఎల్లమ్మ కాదు. బండరాయి భగవంతుడు కాడు. రెక్కాడితే డొక్కాడే మాకు నీవే దిక్కు" అనుకుంటూ సుత్తెనే చూస్తూ, రాయి చెక్క మీద దెబ్బ మీద దెబ్బ వేస్తూ ఉంది దుర్గమ్మ.     ఆమె పక్కమ్మటే ఎంకులు.
Comments