బోర్డు తిప్పేసారు - యెన్నం ఉపేందర్

    
అది చీకటి వెలుగుల సంధ్యాసమయం. వీధి బల్బు వెలుగును తరుముతూ చీకట్లను ఆహ్వానిస్తున్నది. బల్లొకటి మిణుగురు పురుగుల్ని భోంచేస్తూ చిక్కటి చీకట్లో గుర్తు పట్టకుండా ఉంది. అది పొద్దు తల్లి కడుపులో పడే సమయమా లేక బ్రహ్మ ముహూర్త సమయమా - నాకక్కరలేదంటున్న మనసు యమ్.సి.హెచ్.అన్న అక్షరాలు పచ్చబొట్టులా కనిపిస్తూ చెత్త కుండి పిచ్చోడి శరీరంలా ఉంది. కాగితపు అర్జీలోని జీవితాక్షరాలను కుక్కొక్కటి తన కడుపున దోపుకుంటున్నది. మధ్య మధ్యన పేషెంటులా మూలుగుతున్నది కుక్క. అప్పుడప్పుడు అక్షరాలను కళ్లతో తడి చేస్తున్నది. అర్జీలోని అక్షరాల్ని కూడబలుక్కొని చదువుతున్న కుక్క బాధ మూలుగుగా ధ్వనించింది.

    ఆ ధ్వనికి జంగయ్య మనసు పులకరించింది. అది మేఘ ఘర్జన. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ అనంతరం వినిపించిన ప్రకృతి డమరుక నాదం. ఉన్నట్టుండి భూమ్యాకాశాలు నల్లటి చీర కొంగును కప్పుకున్నాయి.
    'ఇంతకాలం మీరెటు వలసలెల్లారమ్మా? మా రైతుల గుండెలు బీటలు వారి, మా చర్మం పై ఉప్పూరి, కళ్లు నిలబడిపోయాయి. ఎన్ని గుండెలు ఆగిపోయయో! ఎన్ని వెన్నెముకలు నాగటి చాలులో పూడ్చబడ్డాయో!' జంగయ్య మనసు లోతున కవితా జల ఉబికింది. అన్నమ్మను కేకేసాడు. 'చూసావటే! మెరుపు మెరిసింది. ఎక్కడొ పిడుగు పడింది. ఆ ఆ వానకూడా వస్తుంది. తెలుస్తుందా?' ఆనందంతో గంతులేసాడు జంగయ్య.     'అవునయ్యా! వర్షం పడేట్టుంది. మన కష్టాలన్నీ తీర్తాయి. మన చెరువెనుక ఇక అన్నీ పంటపొలాలే' సంతోషం వర్షంగా కురిసింది. పెకుటిళ్లు కురిసాయి. ఉప్పూరిన గోడలు కూలాయి, చెరువులు అలుగులు పోసాయి. పిల్లలు బురద పూసుకున్నారు.     ఆ యేడు పశువులు కడుపు నిండా పచ్చ గడ్డి తిన్నాయి. గొర్లు, మేకలు కొవ్వు పట్టాయి. నాగయ్య బట్టల కొట్టు, రాజం కిరాణా కొట్టు సందడిగా మారాయి. గుమ్ముల నిండా వడ్లు. జంగయ్య ఒంటి మీద బీస్ నెంబరు ధోవతి, నడుం చుట్టూ ఆకు పొగాకు, దూది జకుముకిరాయి. అన్నమ్మ కళ్లల్లో పచ్చటి స్వప్నాలు.     భూమ్యాకాశాల సంబంధం మనిషి మనుగడకి మూలాధారం. కుక్క కళ్లల్లో కన్నీటి పొర. పక్కన గేలి చేస్తున్న కార్పొరేట్ చెత్త. అద్దాల మేడ నీడన నేర్పుగా మిణుగురుల్ని భోంచేస్తున్న బల్లి.     ఎందరి శ్రమజీవుల ప్రాణాల విలువో ఈ అద్దాల మేడ. ఎన్ని వందల వేల శ్రమ శక్తి మిగులు విలువ మొత్తంతో కట్టిన కట్టడమో ఇది. అనాదిగా ఫ్యూడల్ శక్తుల పరిణామం. దోపిడి కొత్త కొత్త రూపాల ప్రదర్శన ఎంత సులువుగా జనాన్ని మోసం చేసాడు? అమాయకత్వం పల్లె ముఖంలా ఉంటుంది. ఏ పట్నపు రూపమైనా పాంటు, షర్టు, టై వేసుకుని ఇండికా కార్లో వచ్చి నాలుగు మాయ మాటలు చెబితే ఇక పల్లె జనం, ముంత గురిగెలోని, పోపుల పెట్టెలోని సంపాదన ఆ ఆకారం జేబులోకి గౌరవప్రదంగా జారవిడుస్తారు. అంతే కదా జరిగింది!

    నల్ల బల్లి చాలా వరకు మిణుగురు పురుగుల్ని భోంచేసింది. అయినా ఎక్కడెక్కడి నుంచో లైటు పురుగులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నల్ల బల్లికి తోడు ఇంకో బల్లి వచ్చి చేరింది.
    మనిషిలోని అత్యాశ మైనా చేయిస్తుంది. ఎన్ని జీవితాలనైనా బలి తీసుకునేందుకు వెనుకాడదు. అడ్డ దారిన కోటీశ్వరుడు కావాలి. ఏ.సి.కార్లలో తిరగాలి. అద్దాల భవంతి కావాలి. అంతటితో ఆగుతుందా? 

    బుద్ధ భగవానుడా! ఇది గ్లోబల్ దోపిడి కాలం. అగ్రరాజ్యాలు దొడ్డిదారిన దోచుకుంటున్న కాలం. మనిషి మనిషిని పీక్కు తినే కాలం. కోరికలు కోట్లకు పడగలెత్తిన కాలం. మానవ సంబంధాలు మట్టిలో కలుస్తున్న కాలం. లేకపొతే సూటు బూటులేసుకున్న అతను రుషి చిట్ ఫండు కంపెనీ పేరు మీద గ్రామంలోకి రానేల. మాయ మాటలు చెప్పి సంపాదన దోచుకొని పోనేల.
    జంగయ్య గుమ్మిలోని వడ్లు ఉన్నపళంగా అమ్మి ఒక్క రూపాయి పది రూపాయలు అవుతాయని అతనంటే తన కష్టార్జితం ధారపోసాడు. మొదట బాగానే కొన్ని నెలలు పెద్ద మొత్తంలో వడ్డీ చేతికొచ్చింది. ఆ ఆనందంలో ఉన్న తాను పొలం అమ్మి, ఆ డబ్బులన్నీ అతనికిచ్చాడు జంగయ్య. తాను పట్నంలో మడిగలు కట్టుకుని వచ్చిన కిరాయి డబ్బుల్తో కాలు మీద కాలేసుకుని బతకొచ్చు అనుకున్నాడు.     ఇకపొతే అన్నమ్మేమో భర్తకు తెలియకుండా నగల్న్నీ అమ్మి, ఆ డబ్బుల్ని అతని చేతిలో పోసింది. ఒకరికి తెలియకుండా ఇంకొకరు తమ తమ కష్టార్జితాన్ని ధారపోసారు. అతడు పరారైనాడు. అన్నమ్మ జంగయ్యలు వీధిన పడ్డారు. అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు.     కుక్క మూలుగు పెద్దదైంది. జంగయ్య బతికున్నప్పుడు పెట్టుకున్న అర్జీలు ఇలా ఎం.సి.హెచ్.బిన్‌లో కార్పొరేట్ చెత్త మధ్య నలిగిపోతున్నాయి. అప్పుడప్పుడు ఫోర్తు ఎస్టేట్ రాసిన రాతలు రెప రెప మంటున్న్నాయి. వార్త పైన వార్త. వార్తల దొంతర్లు. జనానికి ఉదయపు కాలక్షేపం ఫ్రంట్ పేజి వార్తలు. మధ్యాహ్నానికి ఓ మూలన ముక్కుతూ న్యూస్ పేపర్. ఎవరికీ ఓపిక లేదు. ఓ పుట్ట గొడుగు సంస్థ బదులు ఇంకొకటి. చెరువు గట్టు పక్కన అన్నమ్మ, జంగయ్యల సమాధులు. ఇపుడు సర్కార్ తుమ్మల మధ్య ఉనికిని కోల్పోయాయి.     కుక్క అన్నమ్మ, జంగయ్యల అర్జీల్ని కడుపులో దాచుకోలేక పోతోంది. ఒక్క ఉదుటున చెత్త కుండీ నుంచి దుమికింది. అద్దాల మేడ ఎంట్రన్సు దగ్గర కాచుకుని ఉంది. రుషి అపార్టుమెంట్స్! 'పోరా! పిచ్చోడా! ఎవడి సొమ్మని గేటు దగ్గర కూర్చున్నావ్? ఎక్కడ చూసినా బిచ్చగాండ్లే. రాత్రి లేదు పగలు లేదు' విసుక్కుంటున్నాడు గేటు కీపరు.
    'అవును పిచ్చోడినే. ఈ దేశపు జి.డి.పి.లో వాటా అడగకనే పిచ్చోడినయ్యాను. భూముల్ని పిండి ధాన్యం పండిస్తే మమ్మల్ని పిండి మీరు రాజ్యం ఏలుతారు. గొర్రె కసాయోన్ని నమ్మ్నినట్లు మరల మరల మేము మిమ్మల్నే నమ్ముతున్నాం. ఎప్పటికో ఒకప్పటికి తిరగబడే రోజొస్తుంది... మా అమ్మ నాన్నలు పునాది రాళ్లయితే అయ్యారు. ఒక్కో ఇటుక ఒక్కో ప్రాణం. నేను పిచ్చి కుక్కనై కరుస్తా. ఆ కరుస్తా' కుక్క గర్జించింది. చీకట్లు విచ్చుకోసాగాయి. నల్ల బల్లి పారిపోయింది.  
Comments