బ్రహ్మకపాలం - ఓలేటి శ్రీనివాస భాను

  

 తల పైకెత్తి చూస్తే, తలపాగా జారి పోవాల్సిందే ! అంత ఎత్తుగా వున్నాయి నర –నారాయణ పర్వతాలు. వాటి భుజాల మీద వెండి మబ్బులు జరీ కండువాల్లాగా వేలాడుతున్నాయి. పర్వతాల బారుల మధ్య పరవళ్ళు తొక్కుతోంది అలక్ నంద.  చల్లని గాలి ... గోరు వెచ్చని ఎండా ... నెమలిపింఛంతో చెక్కిలి మీద రాసినట్టుంది బదరీనాథ్ వాతావరణం.

   అక్కడ బ్రహ్మకపాలాన్ని ఆనుకుని ఏటవాలు చప్టా, మీద బాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు అవధాని. అతని ముందు విస్తరి ... దాన్నిండా అన్నం పిడుచలు ... వాటి లోకి పితృ దేవతల్ని ఆవాహన చేస్తూ ఓ ఉత్తరాది పండట్ జీ మంత్రాలు.

   మాతృపిండాన్ని మునివేళ్ళతో పైకి తీస్తుంటే, అవధాని కళ్ళల్లో అలక్ నందా ఉప్పొంగింది. నాన్న సృష్టించిన రాద్ధాంతం ... అమ్మలో కట్టలు తెంచుకున్న దు:ఖం, ‘‘రైలు కింద తల పెడతాను’’ అంటూ ఇంట్లోంచి తను పారిపోయిన వైనం, ఒకదాని తరువాత ఒకటి పిండాన్ని అద్దుకున్న నల్ల నువ్వుల్లాగా అవధాని మనసును హత్తుకుని వున్నాయి.

* * *

    ఎన్నో ఏళ్ళనాటి ఆ సాయంత్రం ఊరి చివరున్న రైల్వే ష్టేషన్లోకి అవధాని  బతుకు  మీద విసుగెత్తి నడిచాడు. బలమైన గాలి తోసుకు పోతున్నట్టుగా నడిచాడు. ప్లాట్ ఫారమ్మీద ఎర్ర కంకర పాదాల కింద గరగరలాడుతోంది.

     ‘‘రైలు కింద తల పెడతాను’’ అని మళ్లీ అనుకున్నాడు అవధాని.

     ‘‘ అవును. ఆలస్యం చెయ్యొద్దు’’ మంటని ఎగదోసింది మనసు.

      మార్కులే కొలబద్ద అనుకుంటే, అవధాని మొద్దబ్బాయే... చదువు రాని చవట ... ఎస్ ఎస్ ఎల్ సీ వరకూ పడుతూ లేస్తూ వచ్చాడు. ... అత్తెసరు మార్కులతో గట్టెక్కాడు.  కానీ ఎస్ఎస్ఎల్ సీ లో మాత్రం మూడు సార్లు డింకీలు కొట్టాడు.  మరో రెండు సార్లుపరీక్ష హాల్ లో  ఖాళీ పేపర్ ఇచ్చి, ఇంటికి రావడానికి భయపడ్డాడు. చదవరా ... చదువు ... అని చెప్పేవాళ్ళే కానీ, ఎలా చదివితే పాసు మార్కులు వస్తాయో చెప్పే వాళ్ళు లేదు. ట్యూషన్ చెప్పించే స్తోమత తండ్రికి లేదు. మనిషి ముక్కోపి.  ఇంట్లో ఎప్పుడూ అరుపులు. అదిలింపులు. అవమానాలు ! కష్టపడి చదివినదంతా గాలి కెగిరి పోయేది !

     పరీక్ష హాల్లోకి అడుగు పెట్టగానే అవధాని బుర్ర ఆనప డొల్లలాగా ఖాళీ అయిపోయేది.

     ‘‘ వెధవకి తిండి పెట్టకు.’’ అవధాని తండ్రి అరిచే వాడు. భార్య తలూపేది. కానీ , తలుపు చాటుగా కొడుక్కి తినిపించేది. ఆ రోజు అలా తినిపిస్తూ పెనిమిటి కంట పడింది. ఆయన కోపం పట్టలేక వంటింట్లో బోర్లించిన ఇనుప కుంపటిని కాలితో తన్నాడు. అన్నం విస్తరిని గొట్టంలాగా చుట్టి, పశువుల పాకలోకి విసిరేసాడు.  జుట్టు పట్టుకుని పెళ్ళాన్నీ, చొక్కా పట్టుకుని కొడుకునీ గోడకేసి కొట్టాడు.తనకి అన్నం పెట్టి దెబ్బలు తిన్న అమ్మని చూస్తే దు:ఖం...  తానింకా బతికే వున్నందుకు ఉక్రోషం అవధానిలో పొడుచుకొచ్చాయి.

    ‘‘రైలు కింద తల పెడతాను’’ జీవితంలో మొదటిసారిగా తండ్రికి ఎదురు తిరిగాడు అవధాని.

    ‘‘అయ్యో ! వద్దని చెప్పండి’’ అంటూ తల్లి ఏడ్చింది. అప్పటికే అవధాని గాల్లో ఎగిరిపోయిన పండుటాకులాగా రైల్వే ప్లాట్ ఫారమ్మీదకి వచ్చి పడ్డాడు. కాలికి అడ్డంగా వచ్చిన ఖాళీ సిగరెట్ పెట్టెల్ని తన్నుకుంటూ, దారి పక్క ఏపుగా ఎదిగిన పిచ్చి మొక్కల్ని పీకి పారేస్తూ, ప్లాట్ ఫారం చివరికొచ్చాడు అవధాని.  అక్కడ ఇనప కంచెకి అవతల రావి చెట్టు కింద సూదులు, సవరాలూ అమ్ముకునే వాళ్ళు, కోతులు ఆడించుకునే వాళ్ళూ అరుచుకుంటున్నారు. అవధాని తలెత్తి రైలు పట్టాలు మలుపు తిరిగిన చోట చూశాడు. ఎక్కడో దూరంగా అన్నం ఉడుకుతున్న చప్పుడులాంటిది వినిపిప్తోంది. శూన్యంలో పలచని పొగ తెరలు తెరలుగా జారుతోంది.

    ప్లాట్ ఫారమ్ దిగాడు అవధాని. పట్టాల పక్క దిగుడు తోవలో నడిచాడు. మరో పది అడుగుల్లో పాత స్లీపర్లు గోడలాగా పేర్చి వున్నాయి. అక్కడ నిలబడి ...

    ‘‘రైలు కింద తలపెడతాను. పెట్టాల్సిందే తప్పదు’’ అనుకున్నాడు.

    పొగబండి సైట్ అయింది. పట్టాల మీద వంగాడు అవధాని. రెండు చేతులూ వెనక్కి వంచి మెడని పట్టాల మీద ఆన్చాడు. పొగబండి ఇనుప చక్రాల ప్రకంపనలు అతనికి కంఠంలోని నరాల్ని తాకుతున్నాయి. కళ్ళు మూసుకున్నాడు. గిన్నె అట్టడుగున అన్నం కరడుని పైకి తీసిన అమ్మ చెయ్యి, ఆవిడ వేళ్లనిండా మెతుకులు, అవధాని కను రెప్పల్లో గూడుకట్టాయి. సెకన్ల కాలం. అతనికీ, ఇంజన్ కీ మధ్య బ్రేక్ వేసేంత దూరం ... స్టీమ్ ఇంజన్ డ్రైవర్ ఆ కాలాన్నీ, దూరాలూ  అందిపుచ్చుకున్నాడు., ఇనుప చక్రాలూ, పట్టాలూ పరస్పరం ఒరుసుకున్నాయి. నిప్పు రవ్వలూ, పెద్ద  చప్పుడూ ఒకేసారి పుట్టుకొచ్చాయి. రైలు ఆగింది.

    ఇద్దరు ఫైర్ మేన్లు ఇంజన్ లోంచి గెంతారు. కరకుగా ఉన్న చేతులతో అవధాని చెరో జబ్బా పట్టుకుని ఎత్తి అవతల పడేసారు. కింద పడ్డ అవధానిని ఎడాపెడా వాయించబోయారు.

    ‘‘స్టాప్ ... స్టాప్ ఐసే ...’’  డ్రైవర్ ఫ్రెడరిక్స్ వారించాడు. ఫైర్ మేన్లు  అవధాని వైపు కొరకొరా చూస్తూ, గట్టిగా తిడుతూ ఇంజన్ లోకి వచ్చారు. ఇంజన్ ఈల వేసింది. మెల్లగా కదిలింది. అంతలోనే ‘‘ సార్ ... డ్రైవర్ సార్  అంటూ కేక వినిపించింది. స్పీడ్ అందుకున్న ఇంజన్ లోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న అవధాని ఫుట్ ప్లేట్  రాడ్ ని పట్టుకొని వేలాడుతున్నాడు.

     ‘‘మై గుడ్ నెస్ ...’’ ఫ్రెడరిక్స్ గట్టిగా అరిచాడు. ఓ చేత్తో ఇంజన్ వేగాన్ని నియంత్రిస్తూ, మరో చేత్తో అవధానిని – కొక్కేనికి తగిలిన చేపలాగా గబుక్కున పైకి లాగేశాడు. అలా ఇంజన్ లోకి వెళ్ళిన అవధాని డ్రైవర్ ఫ్రెడరిక్స్  సాయంతో రైల్వే లో చేరాడు. లోకోషెడ్ లో కళాసీగా ఇంజన్లు తోమాడు.  గ్రీజు ముద్దలు పులిమాడు. బొగ్గులు కొట్టాడు. ఫైర్ బాక్స్ వెలిగించడం నేర్చుకున్నాడు. ఫైర్ మేన్ గా పని చేసి,  డ్రైవర్ స్థాయికి చేరుకున్నాడు.

      ఆ రోజుల్లోనే ఫ్రెడరిక్స్ చొరవతీసుకున్నాడు. అవధానినీ, అతని కుటుంబాన్నీ కలిపాడు. అప్పటికే అవధాని  తండ్రి చనిపోయాడు. తల్లి పక్షవాతంతో మంచాన పడింది. ఆవిడ మతికూడా భ్రమించింది.  అమ్మని తనతో తీసుకొచ్చాడు అవధాని. ఇద్దరు చెల్లెళ్ళకీ పెళ్ళిళ్ళు చేశాడు. నలభయ్యవయేట తను పెళ్ళి చేసుకున్నాడు.

     ఆ రోజుల్లో అవధాని తల్లి ప్రతిరోజూ కలవరించేది.

     ‘‘ మా అబ్బి రైలు కింద తల పెడతానని వెళ్ళేడు ... వెళ్ళండి ... వెంటనే తీసుకురండి ’’ అంటూ మంచానికి బల్లిలా అంటుకుని ఏడ్చేది.  ‘‘ మా అబ్బిని తీసుకురా బాబూ !’’ అంటూ అవధానిని పట్టుకుని గట్టిగా కుదిపేసేది. అలా కలవరిస్తూనే ఓ రాత్రి కన్నుమూసింది.

   అవధాని పొగబండిని నడుపుతున్నప్పుడు రైలు దారిలో ప్రాణాలు పోయిన దృశ్యాల్ని ఎన్నో చూశాడు. లైన్ క్రాస్ చేస్తూ ఆవులూ, గేదెలు చక్రాల కింద పడ్డప్పుడు   అవధాని తెగ బాధపడేవాడు. చీకట్లో ట్రాక్ పక్క కాలకృత్యాలు తీర్చుకుంటున్నట్టు నటించి, హఠాత్తుగా రైలు కింద తలపెట్టిన వృద్ధుల్ని, యువకుల్నీ శవాలుగా చూసినప్పుడు ఫ్రెడరిక్స్  తనని కాపాడిన దృశ్యమే గుర్తుకొచ్చేది. అలా గుర్తుకు రాగానే ఫ్రెడరిక్స్ కి  తను మనసులోనే కృతఙ్ఞతలు  చెప్పుకునేవాడు.  ఆత్మహత్య అంచుల వరకూ వెళ్ళి, ఎంతో కొంత పాపాన్ని మూటకట్టుకున్నందుకు తనను తానే నిందించుకునేవాడు.


* * *

 

    ‘‘ శ్రీమాన్ జీ ...’’   బ్రహ్మకపాలంలో పిండప్రదానం చేయిస్తున్న ఉత్తరాది పండిట్ జీ చదువుతున్నమంత్రాన్ని ఆపి ...

     ‘‘ మీ పితృదేవతలందరికీ పిండ ప్రదానం జరిగింది. ఇంకా మూడు పిండాలు మిగిలి వున్నాయి. మీ జీవితంలో అత్యంత ఆప్తులైన వారికి జాతి, కులం, మతం అని చూడకుండా వాటిని సమర్చించ వచ్చు. ’’ అంటూ హిందీలో చెప్పాడు.

    అవధాని ఆకులోమొదటిపిండాన్ని – డ్రైవర్ ఫ్రెడరిక్స్ కీ, ... రెండో పిండాన్ని  తన ఇంజన్ కింద పడి ఖండ ఖండాలై సోయిన మూగ జీవాలకీ ... మూడో పిండాన్ని రైలు కింద తలపెట్టి కష్టాలు గట్టెక్కాయని భ్రమపడి ఆకలిదప్పులతో అలమటిస్తున్న ఆత్మలకీ సమర్పించాడు.

     వాటిని అలక్ నందాలో విడిచి అవధాని నమస్కరిస్తూ వుంటే, నరనారాయణ పర్వతాలు సాక్షుల్లాగా నిలబడ్డాయి. వాటి భుజాల మీద జరీ కండువాల్లాగా వేలాడిన మబ్బులు కరిగి వర్షించాయి. అవధాని చెక్కిళ్ళ మీద కన్నీళ్ళతోపాటు కలిసిపోయాయి.


( నవ్య వార పత్రిక    15-10-2008  సంచికలో ప్రచురితం )      

Comments